February 23, 2024

సరిగమల గలగలలు – 2

రచన: మాధవపెద్ది సురేష్ చంద్ర   suresh

 

వెన్నెలకంటి

 

నాకు వెన్నెలకంటి రాజేశ్వరరావుగారితో 1990 నుండి పరిచయం. మొదటి కలయికలోనే మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. నాకసలు విరోధులు లేరు, ఉండరు. నా మనస్తత్వం అటువంటిది. ఎప్పుడైనా ఎవరితోనైనా ఏదైనా మాటా మాటా అనుకున్నా, కోపం ఉన్నా కొద్దిసేపే. మళ్ళీ అసలు ఆ విషయం గుర్తుండదు.

‘సంగీతానికి ఇంటిపేరు సాహిత్యం’ అని నేను చాలా సార్లు నా మాటల్లో, పాటల్లో చెబుతూనే ఉంటాను. శ్రీ బాలు గారికి  చాల ఇష్టమైన కొటేషన్స్‌లో ఇది ఒకటి.

ఓసారి నా ఇష్టదైవమైన షిరిడి సాయిబాబా మీద ఒక ప్రయివేటు క్యాసేట్ రూపొందించటం జరిగింది. ‘సాగర్ మాగ్నటిక్స్’ సమర్పణలో ‘లియో ఆనంద్’ ఆధ్వర్యంలో ఈ క్యాసెట్ రూపొందింది. నాకు అదే మొట్టమొదటి ప్రయివేట్ క్యాసెట్,  9 పాటలు నలుగురు ప్రసిద్ద కవులు రాశారు. వారు శ్రీ సిరివెన్నెల, శ్రీ జొన్నవితుల, శ్రీ వెన్నెలకంటి, శ్రీ డి.నారాయణవర్మ. ఇక్కడ నేను కానీ, ఆ కవులు గానీ ఒక్క నయాపైసా తీసుకోకుండా నిజమైన భక్తితో వర్క్ చేసాము. శ్రీ జంధ్యాల వ్యాఖ్యాత, ఆయన కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేశారు. సుప్రసిద్ద గాయకులు, గాయనీమణులు ఆ పాటలు వారి వారి గొంతుకలతో ఆర్ధ్రత, స్పందన, భక్తి భావం మేళవించి పాడారు. నాకు చాలా పేరు తీసుకువచ్చిన క్యాసెట్ అది. కొన్ని లక్షల క్యాసెట్స్ అమ్ముడు పోయాయి, పోతున్నాయి. శ్రీ బాలసుబ్రహ్మణ్యం, రమేష్, మనో, వి.రామకృష్ణ,  శ్రీమతి జిక్కి, సుశీల, శైలజ, వాణీజయరాం అద్భుతంగా పాడారు.

vennelakanti1

ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే నాకు ‘బృందావనం’ సినిమా కన్ఫర్మ్ అవటానికి ఈ క్యాసెట్ కూడా ఒక కారణం. సింగితం శ్రీనివాసరావు గారికి చాలా బాగా నచ్చింది. ఆయన ఒక మంచి మాటన్నాడు ‘ఇందులో ఆత్మ ఉంది’ అని, వెన్నెలకంటి గారు ఆ క్యాసెట్‌లో 4 పాటలు రాసారు.

1. బాబా రావా మొరవినవా (శ్రీ బాలు),

2. బాబా శరణం (శ్రీ బాలు).

3. శ్రీ గురునాధా (శ్రీమతి పి.సుశీల),

4. చేరుకోనీయి నీ ద్వారకామయి (శ్రీమతి శైలజ).

వెన్నెలకంటిగారికి అందరి కవులతో, సంగీత దర్శకులతో, గాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయనంటే అందరికీ ఇష్టం. ఆయన రచనల్లో క్లారిటీ ఉంటుంది. భావం చెడిపోకుండా తననాలకి సరిగ్గా రాస్తారు. నాకు రాసిన పాటల్లో 99 శాతం కరెక్షన్స్ లేకుండా రాశారు.

ముఖ్యంగా నా జీవితంలో ‘బృందావనం’ పాటలు గొప్ప వరం. 1992 లో విజయావారు సుమారుగా 17 ఏళ్ళ విరామం అనంతరం రావికొండలరావు గారు, సింగీతం శ్రీనివాసరావు గారు, డి.వి.నరసరాజు లాంటి సీనియర్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో నాకు అవకాశం ఇవ్వటం దైవలీల. అదే విజయావారికీ, మాధవపెద్ది వారికీ ఉన్న అనుబంధం.

తరువాత అందరికీ విపరీతంగా నచ్చి అన్ని పాటలూ ఆయన చేతనే రాయించారు. నేనూ, వెన్నెలకంటిగారూ అన్ని పాటలకీ కలసి పనిచేశాం. సుమారు 3 వారాలపాటు కంపోజింగ్ జరిగింది. జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలు! ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా, మధురమే సుధాగానం, ఆ రోజు నా రాణి, అబ్బోఏమి వింత, మా మామయ్యా ఐదు పాటలూ ఆయనే రాశారు. అంతేకాకుండా విజయావారి సంస్థలో అన్ని పాటలూ ‘ఎస్.పి.బాలు గారు, ఎస్.జానకి గారు’ పాడటం విశేషం! పాటలు కూడా వీలున్నంతవరకూ విజయా వారి రాగాల్లోనే కంపోజ్ చేయటం జరిగింది. ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా (భీంపలాస్), మధురమే సుధాగానం (మోహన) ఆరోజు నారాణి (దుర్గ) అబ్బో ఏమివింత (దేశ్).

తరువాత నాకు సుమారు 30 పాటలకు పైగా రాశారాయన. పుట్టింటి గౌరవం, బదిలీ, శ్రీకృష్ణార్జున విజయం, మాతో పెట్టుకోకు, సహనం, ప్రెసిడెంట్‌గారి అల్లుడు ఇత్యాది సినిమాల్లో అన్నిరకాల భావాల్లో, నవరసాల్లో అద్భుతంగా రచన చేశారు.

నాకు బాగా నచ్చిన పాటల్లో కొన్ని ఉదహరిస్తాను. బృందావనంలో మధురమే, ఆరోజు నారాణి, ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా, శ్రీకృష్ణార్జున విజయంలో భళీ భళీ ఏమి భాగ్యము.(ఈ సినిమాకు 1996 నంది అవార్డు వచ్చింది), పుట్టింటి గౌరవంలో డ్రింకింగ్ సాంగ్, మాతో పెట్టుకోకులో అన్నీ మాస్ సాంగ్స్ (నాకు కమర్షియల్‌గా మంచి పేరు తెచ్చిన చిత్రం), మదనుడు చేసే విరహాల పూలగాయం (ప్రెసిడెంట్ గారు అల్లుడు) ఇలా చాలా పాటలు ఏ మాత్రం బేషజం లేకుండా ‘భేషుగ్గా’ రాశారు.

వందకు పైగా డబ్బింగ్ సినిమాలకి మాటలు, పాటలు రాయటం చాల కష్టమైన పని ‘హాట్స్ ఆఫ్ టు హిమ్’. ‘వేదిక’ అనే సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేశారు. ఆయన తలపెట్టిన చాలా కార్యక్రమల్లో నేను పాల్గొనటం నా అదృష్టం. ‘లహరి’  పేరుతో ఒక కొత్త ప్రక్రియతో రచన చేస్తున్నారు. రచనలు, కొన్ని నేను వినటం జరిగింది అద్భుతంగా ఉన్నాయి.

నవంబర్ 30 వ తేదిన నెల్లూరులో జన్మించిన వెన్నెలకంటి ఎస్.బి.ఐ. లో పని చేశారు. ఆయన రచనలో నాకు ఆత్రేయ గారి, వేటూరి గారి ముద్ర కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి వాళ్ళిద్దరూ ఎంతో ఇష్టమైన కవులు.

ఈ సినీ జీవితంలో అయన ఎన్ని రచనలు చేసినా అతి ముఖ్యమైనవి, ఎంతో కాలం అందరూ మరచిపోలేని రచనలు కొన్ని ఉన్నాయి. చిరునవ్వుల వరమిస్తావా – చితి నుంచి బ్రతికొస్తాను, మరుజన్మకీ కరుణిస్తావా – ఈ క్షణమే మరణిస్తాను ఎక్స్‌ట్రార్డినరీ! బుద్దభూమి రుద్రభూమి అయింది. వేదభూమిలో వేదన మిగిలింది. సింప్లీ సూపర్స్! (ఈ పాటకి 2000 సంవత్సరానికి వెన్నెలకంటిగారికీ, ఆ పాట పాడిన బాలసుబ్రహ్మణ్యంగారికీ నంది అవార్డు లబించింది) ఇలా ఆయన ఎన్నో మంచి పాటలూ రాయాలనీ, అందుకు ఆయనకు చాలా మంచి అవకాశాలు రావాలనీ సర్వేశ్వరుణ్ని ప్రార్ధిస్తున్నా!

* * * * *

 

పూర్వం రోజుల్లో ఆత్రేయ-సినారె చలోక్తులు వేసుకునేవారని,  శ్రీశ్రీ-ఆరుద్ర ఒకరిమీదొకరు పద్యాల ద్వారా తమ వ్యంగ్యవైభవాన్ని చూపించుకున్నారని పాఠకులలో కొందరికి తెలిసే ఉంటుంది. అటువంటి తమాషాలు, చమత్కారాలు ఈతరం సినీకవుల మధ్య కనిపించవేం అని అనుకునేవారికి ఈ సంఘటనే ఓ ఋజువు.

ఓసారి వెన్నెలకంటి, చంద్రబోస్ ఓ కార్యక్రమంలో కలిశారు. అప్పటికి చిరంజీవి నటించిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో చంద్రబోస్ రాసిన ‘మనసావాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా‘ అనే పాట బాగా పాపులర్‌గా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోని, ‘ఏవయ్య చంద్రబోసూ.. అలా ప్యాలెస్‌లూ, బిల్డింగ్‌లు రాసిచ్చీడఁవేనా.. ఎంత నీవి కాకపోతే మాత్రం?’ అని అన్నారు వెన్నెలకంటి సరదాగా.

“నేను సరేలెండి సార్!  ప్రక్క రాష్ట్రంలోని అదీ బిల్డింగులు మాత్రమే రాసిస్తున్నాను, మరి మీరు ఏరియాలకు ఏరియాలు.. అదీ స్వంత రాష్ట్రంలోని… ‘రావయ్య ముద్దులమావా నీకు రాసిస్తా రాయలసీమ‘ అంటూ రాసిచ్చేస్తున్నారు” అన్నాడు చంద్రబోస్ ‘సమరసింహారెడ్డి’ సినిమాలోని వెన్నెలకంటి రాసిన పాటని కోట్ చేస్తూ.

అక్కడ ఉన్న అందరితోపాటు ఈ ఇద్దరూ కూడా మనస్పూర్తిగా నవ్వుకుని షేక్‌హ్యాండ్ ఇచ్చేసుకున్నారు.

 

— రాజా

 

 

2 thoughts on “సరిగమల గలగలలు – 2

  1. మాధవపెద్ది సురేష్ గారు పాత కొత్తల సినీగీతాలకి bgm లాంటివారని నేను అనుకుంటూ వుంటాను

  2. మాధవపెద్ది సురేష్ గారు పాత కొత్తల సినీగీతాలకి bgm లాంటివారని నేను అనుకుంటూ వుంటాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *