March 29, 2024

మౌనరాగం… 1

 

anjanidevi

రచన : అంగులూరి అంజనాదేవి

 

 

 

 

 

 

 

 

జీవితం గాఢమైంది.  నిగూఢమైంది.

స్వల్ప విషయాలకే ఆనందపడేలా చేస్తుంది.

కారణం లేకుండానే బాధపెడ్తుంది. కష్టపడకుండా, కొనకుండా, సంపాయించకుండా దొరికిన ప్రేమకోసం తాపత్రయపడేలా చేస్తుంది.హృదయంలోని ప్రేమనంతా బయటపెట్టి ఎన్నో అడగాలనుకునేలా చేస్తుంది.

రాత్రింబవళ్లు వువ్విళ్లూరుతూ నిద్రను చెదరగొట్టి, స్వప్నాలను దాచుకొని, సమస్యల్ని సృష్టించి ఒకరికోసం ఒకరు బాధపడేలా చేస్తుంది

భూమి మాత్రం గుండ్రంగా తిరుగుతూ నిమిషాలను, గంటలను  లాక్కెళ్తోంది.

కాలమేమో నిమిత్త మాత్రంగా తనపనిలో తను లీనమై వుంది.

దేదీప్య మొబైల్‌ తీసి నెంబర్‌ నొక్కి కాల్‌ బటన్‌ ప్రెస్‌ చేసింది. అవతల మొబైల్‌కి సిగ్నల్స్‌ వెళ్తున్నాయి…

మనసు లోతుల్ని తాకుతూ ‘కాలర్‌ టోన్‌’ గోదారి ప్రవహిస్తున్నట్లు, పక్షులు పాడుతున్నట్లు, చిరుగాలి చుట్టూ చేరి ‘నీ కళ్లు నేను తుడవనా’ అన్నట్లు అన్పిస్తోంది దేదీప్యకి.

అవతల వైపు నుండి …

‘‘హలో…చెప్పు దేదీప్యా!’’ అంటూ అతని గొంతు గట్టిగా విన్పించింది.  ఎన్నిసార్లు ఫోన్‌ చెయ్యమన్నా చెయ్యని దేదీప్య యిప్పుడెందుకు చేసిందో అర్థం కాక…

అతని గొంతు వినగానే ఏం మాట్లాడాలో తెలియక…

‘‘ హాయ్‌!’’ అని పలకరించిందే కాని ఆమె గొంతు పెగల్లేదు.

‘‘మాట్లాడు దేదీప్యా ! ఎందుకు ఆగిపోయావ్‌?’’ అంటూ అవతల వ్యక్తి  గొంతు ఆత్రంగా ద్వనించింది.

ఆమె మాట్లాడకుండా గట్టిగా ఏడ్చేసింది.

‘‘ఎక్కడున్నావు దేదీప్యా ? ఎందుకేడుస్తున్నావ్‌? ఏం జరిగింది?’’ అని అంటున్న అతని హృదయతంత్రులు ఆమెకేం జరిగిందోనన్న భయంతో తెగిపోయేలా వున్నాయి.

అతని గొంతులోని మార్థవానికి ఆమె మనసు కరిగిపోయింది

పంచుకునే వాళ్లుంటేనే  ఫలితానికైనా, ఫలానికైనా రుచి.భోగ భాగ్యాలు ఎన్నున్నా ఒంటరితనం కటిక చీకటి.

కాలం కడలిని దాటుకుంటూ, మరుగునపడ్డ జ్ఞాపకాలను ఆమె మనసు స్పృశిస్తుంటే చెవి దగ్గర మొబైల్‌ పెట్టుకొని ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఏడుస్తోంది…

అర్థం చేసుకున్నాడతను.

‘‘ ఏడవకు దేదీప్యా ! నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. నీ మనసు పూర్తిగా నీలోకి వచ్చినతర్వాతనే… నాతో సరిగ్గా మాట్లాడగలనన్న నమ్మకం నీలో ఏర్పడిన తర్వాతనే నా మొబైల్‌కి కాల్‌ చెయ్యి’’ అన్నాడతను.

 

* * * * *

???????????????????????????????

వెంటనే ఆమె మనస్సు గతంలోకి వెళ్లిపోయింది.

సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం……

దేదీప్య ఎం.బి.ఎ. సీటు కోసం కాకతీయ యూనివర్శిటి  క్యాంపస్‌లో వున్న కౌన్సిలింగ్‌ బ్రాంచి దగ్గరకి వాళ్ళ అన్నయ్య దేవేందర్‌ తో వెళ్లి…. అక్కడ చెట్ల నీడలో నిలబడిరది.

ఆమె చూపులు చెట్లను, ఇళ్ళను దాటుకుంటూ ఎక్కడికో వెళ్ళి నిలిచాయి.

ఆకాశం, భూమి కలిసే చోటును చూడాలంటే ఆమెకు చాలా ఇష్టం. ఆకాశం ఒక చిత్రకారుని కాన్వాస్‌లా మారి మబ్బుల డిజైన్‌ కోసం ఎదురు చూస్తుంటే మబ్బులొచ్చి సూర్యునికి అడ్డుపడ్డాయి. నేలకళ్లు మసక బారినట్లయ్యాయి. సూర్యుడు మబ్బుల చాటు నుండి బయటకు రాకముందే దేదీప్య కళ్లకి అభిరాం కన్పించాడు.

‘‘ఎవరీ హ్యాండ్‌సమ్‌ గాయ్‌,’’ అని మనస్సులో అనుకోకుండా వుండలేకపోయింది. కొన్ని క్షణాలు అతనివైపు అలాగే చూసింది.

స్టూడెంట్స్‌తో, పేరేంట్స్‌తో ఆ ప్రదేశం కిటకిటలాడుతోంది.

మైక్‌లో ‘ర్యాంక్స్‌’ అనౌన్స్‌ చేస్తున్నారు.

‘స్క్రీన్‌ డిస్‌ప్లే’ చేస్తున్నారు.

దేదీప్య అక్కడే నిలబడి అందులో వస్తున్న ర్యాంక్‌ కేటగిరిని,  సీట్స్‌ని గమనిస్తోంది. వాళ్ల అన్నయ్య కూడా  అదే పనిలో వున్నాడు.

మధ్యమధ్యలో అభిరాంని చూస్తోంది దేదీప్య.

ఎం.బి.ఎ. సెకండియర్‌ చదువుతున్న అభిరాం వాళ్ళ కజిన్‌ కోసం అక్కడికి వచ్చాడు.

వాళ్ళంతా తమకి సీటు ఏ కాలేజిలో వస్తుందో, ఏ కాలేజిని ‘చూజ్‌’ చేసుకోవాలో అర్థం కాని అయోమయస్థితిలో వున్నారు.

అక్కడున్న అబ్బాయిలు కాని, అమ్మాయిలు కాని ఒకరినొకరు పట్టించుకునేలా లేరు. వాళ్ళలో కొంతమంది పేరెంట్స్‌ కోసం, కొంతమంది కాలక్షేపం కోసం, మరికొంతమంది బాగా చదవి ఉన్నతమైన స్థాయిలోకి రావటం కోసం వచ్చిన వాళ్ళే వున్నారు.   ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాక నలుగురికి ఎంతోకొంత ఉపయోగపడాలనుకునే వాళ్ళు కూడా వున్నారు.  ఆ కోవకు చెందిన వ్యక్తి దేదీప్య.  కొండంత ఆత్మవిశ్వాసంతో స్థిర నిశ్చయంతో ఆమె ఆలోచనలెప్పుడు ఆమె ముఖంలో ప్రతిఫలిస్తుంటాయి.

మళ్లీ ర్యాంక్‌ అనౌన్స్‌మెంట్‌ జరిగింది

ఆ అనౌన్స్‌మెంట్‌లో దేదీప్య పేరు విన్పించింది.

అంతవరకు అలర్ట్‌గా వున్న దేదీప్య  వెంటనే తన ర్యాంక్‌ కార్డుని పట్టుకెళ్లి కౌన్సిలింగ్‌ హాల్లో ‘సిస్టమ్‌’ ముందు కూర్చుని వున్న ఒక వ్యక్తి చేతికి యిచ్చింది.  కొద్దిసేపు అక్కడే నిలబడి తర్వాత బయటకొచ్చింది.

దేదీప్య అన్నయ్య కాస్త పక్కకి వెళ్లి అక్కడున్న పేరెంట్స్‌తో ఏ కాలేజి అయితే ఎం.బి.ఎ.కి బావుంటుందో అడిగి తెలుసుకుంటున్నాడు. తనకి తెలిసిన ‘ఇన్‌ఫర్‌మేషన్‌’ కూడా వాళ్లకి చెబుతున్నాడు.

దేదీప్య నిలబడలేక అక్కడే ఓ చెట్టుక్రింద వున్న చెయిర్లో కూర్చుంది.  దేదీప్యను చూడగానే కావ్య అనే అమ్మాయి వచ్చి ‘హాయ్‌!’’ అంది.  ఒకరిపేర్లు ఒకరు చెప్పుకొని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.

తోడుగా వచ్చిన తన తల్లి సరళమ్మను దేదీప్యకు పరిచయం చేసింది కావ్య.

‘‘మాది నల్గొండ దేదీప్యా! ఇక్కడ మాకు తెలిసిన వాళ్లెవరు లేరు.  కావ్యకి ఏ కాలేజీలో సీటు వస్తుందో అని కంగారుగా వుంది. ఏ కాలేజీలో సీటు తీసుకోవాలో అర్థం కాకుండా వుంది!’’ అంది సరళమ్మ.

‘‘ అంత కంగారు పడొద్దు ఆంటీ! మిారు ప్రశాంతంగా వుండండి! కావ్యకి మంచి కాలేజీలోనే సీటొస్తుంది.’’ అంటున్న దేదీప్యను చూస్తుంటే తమకెంతో దగ్గరి మనిషిలా అన్పించింది, సరళమ్మకి.

‘‘దేదీప్యా ! నీకు తోడుగా ఎవరొచ్చారమ్మా?’’ ప్రేమగా అడిగింది సరళమ్మ.

‘అన్నయ్య వచ్చాడు ఆంటీ! అదిగో అక్కడ మాట్లాడుతున్నాడే ఆయనే మా అన్నయ్య.’’ ‘‘అంది దేవేందర్‌ని చూపిస్తూ దేదీప్య .

‘‘అన్నయ్య ఏంచేస్తున్నారమ్మా?’’ అంటూ ఆసక్తిగా వివరాలు అడిగింది సరళమ్మ.

‘‘హైదరాబాదులో ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీరు ఆంటీ! వదిన వరంగల్‌లోనే జాబ్‌ చేస్తోంది.  అన్నయ్య వారానికి ఒకసారి వదిన దగ్గరికి వచ్చివెళ్తుంటాడు.  నా స్టడీ డిస్టర్బ్‌ కాకుండా నన్ను హాస్టల్లో వుంచి చదివించారు.  డిగ్రీ వరకు ఖమ్మంలో చదివాను.  ఈ వరంగల్‌  నాకు కొత్త’’ అంది దేదీప్య.

తెలిసిన వాళ్లెవరో కన్పించడంతో వాళ్లవైపు వెళ్లింది సరళమ్మ.

అనౌన్స్‌మెంట్‌లో దేదీప్య పేరు విన్పించగానే సడన్‌గా కుర్చీలోంచి లేచింది. అభిరాం దృష్టి యాదృశ్చికంగానే దేదీప్య పై పడిరది.  కౌన్సిలింగ్‌ హాల్‌వైపు వెళ్తున్న దేదీప్య కదులుతున్న గులాబి గుంపులా అన్పించింది అభిరాంకి.  ‘వావ్‌’ అనుకున్నాడు.

తీరైన ఆమె స్ట్రక్చర్‌, కుదురైన ఆ నడక, నడుస్తున్నప్పుడు కదులుతున్న ఆ హెయిర్‌స్టైల్‌ని అలాగే చూశాడు.

అందాన్ని అస్వాదించటంలో అతని ముందు ఏ ఆర్టిస్ట్‌ పనికిరాడు.

దేదీప్య పేరు ర్యాంక్‌ తో సహా అనౌన్స్‌ చేశారు. లోపలే వున్న దేదీప్య తనకి వచ్చిన ఆష్షన్‌లో వరంగల్‌ అల్లూరి కాలేజిని చూజ్‌ చేసుకుంది.

కావ్యకి కూడా దేదీప్యకి వచ్చిన కాలేజీలోనే సీటొచ్చింది.

‘‘మిా ఇద్దరికి ఒకే కాలేజిలో సీటురావడం నాకు ధైర్యంగా వుంది దేదీప్యా!’’ అంది సంతోషపడ్తూ సరళమ్మ అదే విషయం దేవేందర్‌ తో కూడా చెప్పింది. దేవేందర్‌ సంతోషించాడు.

‘‘ఆంటీ! వీలైతే ఇప్పుడు మా యింటికి రండి! తర్వాత వెళ్దురుగాని’’ అంటూ ఆహ్వానించింది దేదీప్య.

‘‘ ఇప్పుడు వీలుకాదు దేదీప్యా! ఇంటి దగ్గర అంకుల్‌ ఎదురు చూస్తుంటారు.  మిా కాలేజీలు మొదలయ్యాక ఒక రోజు వచ్చి కావ్యను మంచి హాస్టల్లో జాయిన్‌ చేసి వెళ్తాను. అప్పుడు మిా  ఇంటికి తప్పకుండా వస్తాను’’. అంది సరళమ్మ దేదీప్య ఆహ్వానానికి ఆనందిస్తూ.

‘‘ ఓ.కె. ఆంటీ! కావ్యా బై ’’. అంటూ అన్నయ్య బైక్‌ మిాద ఎక్కి ఇంటికెళ్లింది దేదీప్య

వెళ్తూ, వెళ్తూ, మళ్లీ అభిరాం కన్పిస్తే చూడాలన్న కుతూహలంతో కౌన్సిలింగ్‌ హాల్‌ కన్పించినంతవరకు చూస్తూనే వెళ్లింది.

ఆ టైంలో ఆభిరాం అక్కడ లేడు.  వాళ్ల కజిన్‌తో కలసి కౌన్సిలింగ్‌ హాల్లోకి వెళ్లాడు.

వాళ్ల కజిన్‌కి హైదరాబాద్‌లో టాప్‌ టెన్‌ కాలేజీలో సీటొచ్చింది.

 

* * * * *

 

తెల్లవారుజామునే నిద్రలేచి రెడీ అయ్యి, పుష్ఫుల్‌ ట్రైనెక్కి హైదరాబాద్‌ వెళ్లాడు దేవేందర్‌. ప్రాజెక్టు వర్క్‌ కోసం అదే ట్రైనెక్కి అభిరాం కూడా హైదరాబాద్‌ వెళ్లాడు.

ఉదయం తొమ్మిది గంటలు దాటటంతో దేవేందర్‌ భార్య అపురూప తనకి ఆఫీసు టైమవుతుందని త్వరత్వరగా రెడీ అవుతోంది.

దేదీప్య టీ.వి. చూద్దామని కూర్చుంటే కరెంట్‌ పోయింది.  గాలి రాకపోవడంతో ఊపిరాడనట్లై ‘ఉఫ్‌’ అంటూ అక్కడేవున్న పేపరు అందుకొని తలమీద పెట్టుకొంది. దేదీప్యనలా చూడగానే నవ్వొచ్చింది అపురూపకి.

దేదీప్యకి బోర్‌గా వుంది. బయట కెళ్దామంటే తోడు  ఎవరూ లేరు. చదువుదామంటే బుక్స్‌ లేవు.  మూలుగుతున్న నక్క మిాద తాటికాయపడ్డట్లు కరెంట్‌ కూడా ఇప్పుడేపోయింది.

అప్పటికే సర్దిపెట్టుకొని వున్న లంచ్‌బాక్స్‌ని బ్యాగులో పెట్టుకుంటూ

‘‘దేదీప్యా! నేను ఆఫీసుకి వెళ్లివస్తాను. నేను వచ్చేవరకు క్రిందకెళ్లి మామ్మ దగ్గర కూర్చో టైంపాస్‌ అవుతుంది. అలానే తాతగారి దగ్గర మంచి బుక్స్‌ వుంటాయి.  తెచ్చుకొని చదువుకో’’ అంది అపురూప.

ఏ మాత్రం కదలకుండా అలాగే కూర్చుని వున్న దేదీప్య వైపు చూస్తూ

‘‘ఓ… నీకు మామ్మతో పరిచయం లేదు కదూ!  నాతోరా! పరిచయం చేస్తాను.  నిన్ను మామ్మకి పరిచయం చేసి, అటునుండి అటే ఆఫీసుకి వెళ్తాను’’. అంది అపురూప.

‘‘సరే! వదినా!’’ అంటూ క్రిందకు దిగుతున్న అపురూపతో తను కూడా క్రిందకి దిగింది దేదీప్య.

త్వరత్వరగా దేదీప్యను ఇందుమతికి పరిచయం చేసి వురుకులు, పరుగులు అన్నట్లుగా ఆఫీసుకెళ్లింది అపురూప.

మెరూన్‌ కలర్‌ అంచున్న ఆకుపచ్చని గద్వాల్‌ చీర కట్టుకొని పెద్దబొట్టు పెట్టుకొని, సోఫాలో కూర్చుని వున్న ఇందుమతిని చూడగానే గౌరవ భావం కల్గింది దేదీప్యకి. దేదీప్య వైపు చూస్తూ…..

‘‘నీపేరు నాకు బాగా నచ్చింది దేదీప్యా ! నువ్వు కూడా బాగున్నావ్‌!’’ అంటూ దేదీప్య చేయిపట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొంది ఇందుమతి.

క్యాలండర్‌లో వుండే ‘అమ్మవారికి’ ఈ ఇందుమతికి రూపురేఖల్లో పెద్ద తేడా లేదు అని మనస్సులో అనుకొంది దేదీప్య.

‘‘ఏం చదువుతున్నావు దేదీప్యా?’’ అడిగింది ఇందుమతి.

‘‘డిగ్రీ అయిపోయింది బామ్మా! ఎం.బి.ఎ. లో సీటొచ్చింది.’’ చెప్పింది దేదీప్య.

‘‘ఎం.బి.ఎ. సీటు ఏ కాలేజీలో వచ్చింది?’’ ఆసక్తిగా అడిగింది ఇందుమతి ఆమె ఆ రోజుల్లో బాగా చదువుకున్న మహిళ.ఇంగ్లీష్‌ చదవటం,రాయటం బాగావచ్చు.

‘‘అల్లూరి కాలేజిలో వచ్చింది బామ్మా!’’ అంది దేదీప్య.

‘‘ నా మనవడు అభిరాం కూడా ఎం.బి.ఎ. సెంకడియర్‌ చదువుతున్నాడు.  అల్లూరి కాలేజిలోనే. అదిగో ఆ ఫోటోలో వున్నాడే. వాడే నా మనవడు. ప్రాజెక్టు వర్క్‌ కోసం ఈ రోజు హైదరాబాద్‌ వెళ్లాడు’’. అంటూ గోడకి వున్న అభిరాం ఫోటోని చూపించింది,  ఇందుమతి.

ఫోటో వైపు చూడలేదు దేదీప్య. వాళ్ళ మనవడితో తనకేంపని అన్నట్లుగా మౌనంగా కూర్చుంది.

ఇందుమతి ఆ ఫోటోనే దీక్షగా చూస్తూ….

‘‘ఈ ఫోటో మా తోటలో తీసిందే.  పూలను చూసి ఎలా పరవశించి పోతున్నాడో చూడు.

పువ్వులన్నా, ఆకులన్నా, చెట్లన్నా చాలా యిష్టం వాడికి. చిన్నవయసులో వున్నప్పుడు పచ్చటి పూలమొక్కలున్న తోటల్లో, చేలల్లో ఎక్కువగా తిరుగుతుండేవాడు.  వేళకి వాడ్ని పట్టుకోవాలంటే నావల్ల అయ్యేది కాదు. ఎండలో తిరగటం అంత మంచిది కాదని పనిపిల్లాడితో గొడుగు యిచ్చి పంపేదాన్ని.  కాలేజి స్టడీస్‌కి వచ్చాక ఎండలో

తిరగటం కాస్త తగ్గించాడు.  మొదటి నుండి వాడి బాధ్యతంతా నాదే.  వాళ్లమ్మది కాదు’’ అంటూ కాస్త గర్వంగా, అంతపెద్ద మనవడు తనకు వున్నందుకు మరికాస్త మురిపెంగా చూసింది ఇందుమతి.

వింటూ కూర్చుంది దేదీప్య. పెద్దవాళ్ల మాటల్ని ఎంత శ్రద్ధగా వింటుందో, నచ్చకపోతే అంతే శ్రద్ధగా ‘నో’ అని కూడా చెబుతుంది.

‘‘ఎవరితో మాట్లాడుతున్నావు ఇందూ?’’ అంటూ అప్పుడే హాల్లోకి వచ్చాడు నారాయణరావు.

ఇందుమతికి ఎదురుగా కూర్చుంటూ, ‘ఎవరీ కొత్తవ్యక్తి’ అన్నట్లుగా దేదీప్యను చూశాడు.

‘‘మన పై పోర్షన్‌లో అద్దెకుండే దేవేందర్‌ చెల్లెలండి! పేరు దేదీప్య. మన అభిరాం చదివే కాలేజీలోనే సీటొచ్చిందట. వీళ్లకి యింకా క్లాసులు మొదలవలేదు.  అందుకే ఇంట్లో వుంది’’ అంది ఇందుమతి.

‘‘అలాగా! చూడమ్మా! దేదీప్యా! నా పేరు నారాయణరావు. కాకతీయ యూనివర్శిటీలో లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యాను. ఇందుమతి నాభార్య’’ అంటున్న ఆయన మాటల్లో బోలెడు తృప్తి.

వాళ్ల మాటలు వింటూనే చుట్టూ పరిసరాలను గమనిస్తోంది దేదీప్య.

ఆ హాల్లో ఓ మూలగా ఇత్తడి కుండీల్లో గుబురుగా పెరిగి, తీగలు సాగిన ‘మనీప్లాంట్‌’ దేదీప్య ను బాగా ఆకర్షించింది.

హాల్లోకి అడుగుపెట్టగానే అందరికి కన్పించే విధంగా మెటల్‌తో తయారు చేసిన కవుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా వున్నాయి.

వాటిలో బమ్మెర పోతన, శ్రీ. శ్రీ. చలం, కాళోజి నారాయణరావు, ఇంకా తను గుర్తుపట్టలేని కొంతమంది పురాతన కవుల విగ్రహాలు వున్నాయి.

‘‘ఈ విగ్రహాలు బావున్నాయి బామ్మా! ఎక్కడ తెప్పించారు? హాల్లోకి రాగానే యివే షోగా అన్పిస్తున్నాయి’’. అంటూ ఆసక్తిగా వాటినే చూస్తున్న  దేదీప్య భుజంపై ఆప్యాయంగా చేయి వేసింది ఇందుమతి.

‘‘వీటినిక్కడ షో కోసం పెట్టలేదు  దేదీప్యా! మీ తాతగారికి కవులన్నా, కవిత్వమన్నా చాలా ఇష్టం. సొంతంగా కవితలు కూడా రాస్తారు. ఆయన రాసిన ఒక కవితాసంపుటికి అవార్డు వచ్చింది’’ అంది ఇందుమతి.

‘‘అవునా తాతగారు! మిారు కవితలు రాస్తారా? కథలు, కవితలు, నవలలు చదవాలన్నా, అవి రాసేవాళ్లతో మాట్లాడాలన్నా నాకు చాలా ఇష్టం.’’ అంది  దేదీప్య.

‘‘వరంగల్‌లో రాసేవాళ్లు బాగానే వున్నారు  దేదీప్యా ! వాళ్లలో కవితలు రాసేవాళ్లు, నవలలు రాసేవాళ్లు,స్వీయ చరిత్రలు రాసేవాళ్లు వున్నారు. వాళ్ళంతా అప్పుడప్పుడు వచ్చి తాతగారిని కలసివెళ్తుంటారు.  వాళ్ళందరితో మంచి సత్‌ సంబంధాలు వున్నాయి.’’ అంది ఇందుమతి.

‘‘సాధ్యమైతే వాళ్ళందరిని చూడాలని వుంది.  వాళ్లు రాసినవి చదవాలని వుంది.’’ అంటూ తన మనసులోని మాట చెప్పింది  దేదీప్య.  దేదీప్యకి సాహిత్యం పట్ల గొప్ప అభిమానం.

చదివేవాళ్లు తక్కువగా వున్న ఈ రోజుల్లో  దేదీప్య అలా అనటం నారాయణ రావుకి నచ్చింది.

‘‘ఇంత కాలానికి మీ తాతగారికి మంచి శ్రోతవు, పాఠకురాలువు దొరికావు దేదీప్యా! శ్రీ. శ్రీ గురించి చలం గురించి నాలుగు మాటలు వినమన్నా, చదవమన్నా, ఆమడ దూరం పోతాడు అభిరాం!’’ అంటూ నవ్వింది ఇందుమతి.

‘‘అభిరామే కాదు ఇందూ! ఈ రోజుల్లో చాలా వరకు సాహిత్యం పట్ల అలాగే వున్నారు.

ఒకప్పుడు కవితలు చదివేవాళ్ల కన్నా నవలలు చదివే వాళ్లే ఎక్కువగా వుండేవాళ్లు. ఇప్పుడు అంతో, ఇంతో నవలలు కన్నా కవితలు చదివేవాళ్లే అక్కడక్కడ కన్పిస్తున్నారు.  అది కూడా మినీ కవితలు, నానీలు అయితేనే చదువుతున్నారు’’ అన్నాడు నారాయణ రావు.

‘‘ఎందుకని తాతగారు?’’ అంది  దేదీప్య.

‘‘నవలలు  చదవాలంటే తీరిక, ఓపిక చాలా అవసరం. ఇప్పటి అలవాట్లు, ఆలోచనలు, మనిషికి టైం లేకుండా చేస్తున్నాయి.  ఒక దశాబ్దకాలం నుండి నవల అంతరించిపోతున్నట్టే అందరం అనుకుంటున్నాం.  పాఠకులు లేరని రచయితలు,  రచయితలు లేరని పాఠకులు నవలా సాహిత్యానికి దూరమవుతున్నారు. పాఠకుల్లో పఠనాశక్తి కొరవడటం, రచయితలు రచనలు చెయ్యకపోవడం రెండూ తప్పే. అక్షరాన్ని అభినందించలేకపోవటం ఆరాదించకపోవటం ఇంకా తప్పు’’ అన్నాడు నారాయణరావు.

‘‘అక్షరం పట్ల మీకున్న అభిరుచి అందరికి వుండొద్దూ! అందులో ఇది కంప్యూటర్‌ యుగం’’ అంది ఇందుమతి.

‘‘ఎంత కంప్యూటర్‌ యుగమైనా వేళ్ల సందుల్లోంచి పాయసంలా జారిపోతున్న కాలాన్ని నవల చదవటానికి ఉపయోగిస్తే తప్పేంటి? మన తెలుగులో కాని, ఇంగ్లీష్‌లో కాని ఎంతోమంచి నవలలు వున్నాయి’’. అన్నాడు నారాయణ రావు.

నవల దొరికితే వదిలిపెట్టని  దేదీప్య నారాయణ రావు నోటివెంట నవలల గురించి విన్పించటంతో ఎంతో ప్రియంగా చూసింది.

‘‘ఆ నవలలు మీ దగ్గర వున్నాయా తాతగారు?’’ ఆశగా అడిగింది దేదీప్య.

‘‘కొన్ని నవలలు వున్నాయి దేదీప్యా! రా. నా గదిలోకి వెళ్లి కూర్చుందాం. నేనీ మధ్యన రాసిన వ్యాసాలు కొన్ని చూపిస్తాను’’. అంటూ  దేదీప్యను ఆయన గదిలోకి ఆహ్వానించాడు.  వెంటనే లేచి ఆయన వెంట వెళ్లింది  దేదీప్య

ఆ గదిలోకి వెళ్లగానే… ‘‘దేదీప్యా ! పుస్తకాలు అనేవి  కవి అనంతమైన కాల సముద్రం ఒడ్డున నిర్మించిన లైట్‌ హౌస్‌లు. వాటి వెలుతురు మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది. తల్లి శరీరాన్ని పోషించి పెంచితే పుస్తకాలు హృదయాన్ని పోషించి పెంచుతాయి. పాత బట్టలు ధరించినా పర్వాలేదు కాని, కొత్త పుస్తకాలను మాత్రం కొనకుండా వుండలేను. పుస్తకాలను మించిన అందమైన ఫర్నిచర్‌ మరొకటి లేదు నా దృష్టిలో. ఇదీ నా ప్రపంచం. ‘‘అంటూ తన గదిలో వున్న పుస్తకాల వైపు చూపించాడు నారాయణరావు.

ఆజాను భాహువులా వున్న నారాయణరావు ధోవతీ లాల్చీలో చూడగానే ‘నమస్కారం’ పెట్టేలా అన్పిస్తారు. పోషక విలువలు కలిగిన తిండివల్ల వయసు ప్రభావం ఆయన మిాద అంతగా పడలేదు.  ఆరోగ్యంగా, ఆనందంగా వున్నారు.

ఆ గదిలో పుస్తకాలన్నీ క్రమపద్ధతిగా అమర్చి వున్నాయి.  గది గోడల్లో పొందికగా వున్న అరల నిండా సాహిత్యానికి, విజ్ఞానానికి,వేదాంతానికి సంబంధించిన పుస్తకాలే కాక మంచి, మంచి నవలలు కూడా వున్నాయి.

నారాయణరావు కూర్చోమనగానే కూర్చుంది  దేదీప్య.

అక్కడే కూర్చుని నారాయణ రావు  రాసిన కొన్ని వ్యాసాలను చదివి అప్పటికప్పుడే ఆ వ్యాసాలపై తన అభిప్రాయాన్ని చెప్పింది.

చిన్నపిల్లాడిలా పొంగిపోయాడు నారాయణరావు. ఆయన్నలా చూస్తూంటే సంతోషమనిపించింది దేదీప్యకి.

ఎప్పుడైనా కళాకారులు చిన్నపిల్లల్లాంటివారు. రవ్వంత ఉత్సాహం వారిపట్ల చూపిస్తే పొంగిపోతారు. మీ విజయాన్ని మేము గమనిస్తున్నాం అని అభిమానం కురిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో మరింత కృషి చేస్తారు.

దేదీప్య సమక్షంలో తన భర్త ముఖం అంతగా వెలిగిపోతుంటే ఇందుమతికి ఆనందంగా అన్పించింది.

‘‘చాలా కాలం తర్వాత మిా తాతగారిలో నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను  దేదీప్యా! అప్పుడప్పుడు వచ్చివెళ్తుండు.’’ అంది ఇందుమతి.

‘‘సరే !బామ్మా !’’ అంటూ నారాయణ రావు తనని చదవమని ఇచ్చిన ‘అసమర్థుని జీవన యాత్ర’’ నవలను పేజీలు తిప్పుతూ కూర్చుంది.

ఆ దంపతుల సమక్షంలో ఎంతసేపు కూర్చున్నా యింకా కూర్చోవాలనిపిస్తోంది  దేదీప్యకి.

 

* * * * *

 

ప్రాజెక్టు వర్క్‌ కోసం హైదరాబాదు వెళ్లిన అభిరాం రెండు రోజుల తర్వాత ఇంటికొచ్చాడు.

వంటగదిలోంచి వాళ్ల మామ్మ అడిగే కొశ్చన్స్‌కి ఆన్సర్స్‌ చెబుతూ రిలాక్స్‌గా సోఫాలో కూర్చున్నాడు. గాలి సరిపోనట్లు అన్పించి ఫ్యాన్‌ స్పీడ్‌ పెంచుకున్నాడు.

ఇందుమతి ఎప్పుడైనా అంతే! మనవడి చదువు గురించి శ్రద్దగా అడిగి తెలుసుకుంటుంది.

అభిరాం ఎం.బి.ఎ. థర్డ్‌ సెమ్‌కి రాగానే`మార్కెటింగ్‌ బాగుంటుందా? ఫైనాన్స్‌ బాగుంటుందా? హెచ్‌.ఆర్‌. అయితే ఎలా వుంటుంది? అని వాటి గురించి తెలిసిన వాళ్ల దగ్గరకి వెళ్లి తెలుసుకొని, వాళ్లు చెప్పే దాన్ని బట్టి అబ్బాయిలకి మార్కెటింగ్‌ అయితే మంచి ఫ్యూచర్‌ వుంటుందని అర్థం చేసుకొని ‘మార్కెటింగ్‌’ తీసుకున్నాడు.

‘‘ నీ ప్రాజెక్టు విషయం ఏమైందిరా అభిరాం! ఇక్కడ ‘ప్రాజెక్టు’ చెయ్యనని హైదరాబాద్‌ వెళ్ళావు కదా! ఇప్పటికైనా నీ ప్రాజెక్టు ‘కన్‌ఫాం’ అయిందా?’’ అంది స్టౌ మిాదున్న కర్రీని మెల్లగా కలుపుతూ

‘‘అయింది మామ్మా! ఇక్కడ ఏ ఆర్గనైజేషన్‌ వాళ్లు కూడా ప్రాజెక్టు ఇవ్వమన్నారు. కానీ అక్కడ మా కాలేజీవాళ్లు యిచ్చిన లెటర్ని చూడగానే ‘ప్రాజెక్టు’ కన్‌ఫాం చేశారు. కొంత ‘డాటా’ కూడా యిచ్చారు. మళ్లీ వారం రోజుల తర్వాత రమ్మన్నారు’’ అన్నాడు అభిరాం.

తాతగారిచ్చిన బుక్స్‌ని తిరిగి యివ్వాలని మేడమీద నుండి క్రిందికి దిగిన  దేదీప్య హాల్లో సోఫాలో ఎవరో కూర్చుని వున్నట్లు అన్పించి బయటే ఆగిపోయింది.

అలికిడి విని  దేదీప్య వైపు తిరిగిన అభిరాం షాక్‌ తిన్నవాడిలా లేచి నిలబడ్డాడు. నక్షత్రం దిగి వచ్చి గుమ్మం ముందు తళుక్కుమన్నట్లు అన్పించి అతని గుండె వేగంగా కొట్టుకొంది.

‘‘బామ్మా!’’ అంది లోపలికి చూస్తూ  దేదీప్య

‘‘ పిలుస్తానుండండి!’’ అంటూ షర్టు వేసుకోవాలని గబగబ లోపలకెళ్లాడు.

ఈ లోపల పుస్తకాలను టీపాయ్‌ మీద పెట్టి తిరిగి పైకెళ్లింది  దేదీప్య.

ఎప్పుడూ వేసుకోనంత స్పీడ్‌గా షర్ట్‌ వేసుకొని, బటన్స్‌ పెట్టుకుంటూ హాల్లోకి వచ్చిన అభిరాంకి అక్కడెవరూ కన్పించలేదు.

ఆశ్చర్యపోయాడు.

ఆశ్చర్యం కాకపోతే నిజమెలా అవుతుంది.

‘కౌన్సిలింగ్‌ దగ్గర కన్పించిన ఆ అమ్మాయి ఇక్కడికి ఎలా వస్తుంది? ఇదంతా తన భ్రమే’ అనుకుంటూ…

మామ్మా వచ్చి పలకరించేవరకు అలాగే సోఫాలో కూర్చున్నాడు.

సాయంత్రం నాలుగు గంటలయింది.

ఒక లెక్చరర్‌ని, అర్జంట్‌గా కలిసే పనివుండి, స్నానం చేసి వెళ్లాలని బాత్‌రూంలోకి వెళ్ళాడు అభిరాం.

బాత్‌రూంలో నీళ్లు రాలేదు. విసుగ్గా ముఖం పెట్టి బాత్‌రూంలో నుండి బయటకొచ్చాడు.

పైన వాటర్‌ ట్యాంక్‌లో పైపులకేమైనా అడ్డుపడిరదేమోనని, చెక్‌ చెయ్యాలని చక,చక మెట్లెక్కి పైకెళ్లాడు.  పైకెళ్లగానే…

దేవేందర్‌ వాళ్ల బాల్కనీలో ఒక్క క్షణం  దేదీప్యను చూసి మళ్లీ షాకయ్యాడు.

అప్పటికే నాలుగుమెట్లు పైకెక్కిన అభిరాం దేదీప్య ను చూడటం కోసం మళ్లీ నాలుగుమెట్లు క్రిందికి దిగాడు.  దేదీప్య కన్పించిన వైపు చూశాడు.

చక్కని డిజైన్‌ చేసిన పింగాణి కుండీల్లో రకరకాల గులాబి మొక్కలు పూలు పూసి వున్నాయి. ఆ పూలు పసుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో వున్నాయి.  ఆ పూల బరువుకి కొన్ని కాడలు వంగి వున్నాయి.  ఆ మొక్కల మధ్యన నిలబడి పెద్దగా విరబూచిన ఎర్రరోజాని సుతారంగా పట్టుకొని ముద్దుపెట్టుకుంటూ కన్పించిన దేదీప్య ఇప్పుడక్కడ లేదు. కళ్లు మూసి కళ్లు తెరిచే లోపలే మాయమయింది.

దేదీప్య యింట్లోకి వెళ్లిన విషయం అతనికి తెలియక ఇది కూడా భ్రమే అనుకున్నాడు. పెదవి విరిచి, తమాషాగా భుజాలను కదిలించి, పైకెళ్లి వాటర్‌ ట్యాంకు దగ్గర నిలబడ్డాడు.

ఆఫీసుకెళ్లేముందు వదిన పెట్టిన వడియాలు ఎండి వుంటాయని, అవి తీసుకురావటానికి పైకెళ్లింది దేదీప్య.

అక్కడ వాటర్‌ ట్యాంక్‌ లోపలకి సగం వంగివున్న అభిరాంని చూసింది.  ముఖం కన్పించకపోవడంతో ఎవరో అబ్బాయి ఒంటరిగా వున్నట్లు అన్పించి కంగారుపడ్తూ మెట్లు దిగి యింట్లోకి వెళ్లింది.  స్వతహాగా కొంతమంది అమ్మాయిల్లో వుండే ఆ భయానికి దేదీప్య కూడా అతీతురాలు కాదని చెప్పటానికి నిదర్శనంగా దేదీప్య గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి.

లోపలకెళ్లగానే తలుపు బోల్టు గట్టిగా పెట్టుకొని, వూపిరిపీల్చుకొంది.

అలికిడివిని, ట్యాంక్‌లోంచి లేచి, వెనక్కి తిరిగిచూసిన అభిరాంకి దేదీప్య కన్పించి మెరుపులా మాయమవటం, విచిత్రంగా అనిపించింది.

పైపులన్నీ చెక్‌ చేసి, ప్రాబ్లమ్‌ని సాల్వ్‌ చేసి, చక,చక మెట్లు దిగి యింట్లోకి వెళ్లాడు.

బాత్‌రూంలోకి వెళ్లి టాప్‌ తిప్పాడు.

నీళ్లు వస్తున్నాయి. షాంపూ పెట్టుకొని హెడ్‌బాత్‌ చేశాడు. ఫ్యాన్‌ క్రింద కూర్చుని హెయిర్‌ డ్రై చేసుకున్నాడు.

బీరువాలోంచి డ్రస్‌ తీసుకొని వేసుకుంటుంటే ఒంటికి రుద్దుకున్న సోప్‌వాసన, తలకి రుద్దుకున్న షాంపూ వాసనతో మిక్సై గమ్మత్తుగా వుంది.

‘‘బామ్మా!’’ అంటూ త్వరత్వరగా మెట్లుదిగి భయపడ్తున్న దానిలా ఇందుమతి దగ్గరికి వచ్చింది దేదీప్య.

దేదీప్యను చూడగానే కొన్ని సందర్భాలలో ఆడపిల్లల ముఖంలో కన్పించే అతిసహజమైన భయం దేదీప్య ముఖంలో కన్పించి ఆశ్చర్యపోయింది ఇందుమతి.

‘‘ఎంటమ్మా దేదీప్యా! ఎందుకలా భయపడ్తున్నావ్‌?’’ అంటూ దేదీప్య తలపై చేయివేసి దగ్గరకు తీసుకొంది ఇందుమతి.

‘‘ నేను వడియాలు తెద్దామని పైకెళ్తే, వాటర్‌ ట్యాంక్‌ దగ్గర ఎవరో అబ్బాయి వున్నాడు బామ్మా! చూడగానే భయం వేసింది.  ఇంట్లో వదిన లేదు. పనిపిల్ల మీ దగ్గర నుండి ఇంకా పైకి రాలేదు.  ఒంటిరిగా వుండాలంటే…’’ అంది దేదీప్య. ఈమధ్యన పేపర్‌లో చదివిన న్యూస్‌ గుర్తొస్తుంటే దడగా వుంది దేదీప్యకి.

నవ్వింది ఇందుమతి. ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాక అమె ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడింది దేదీప్య.

‘‘నువ్వు చూసిన ఆ అబ్బాయి నా మనవడు అభిరాం అయి వుంటాడు. అభి ఎప్పుడూ అమ్మాయిల జోలికి పోడు.  నిన్ను గాని ఏమైనా అన్నాడా?’ అంది ఇందుమతి. ఏదో అనే వుంటాడన్న అనుమానం వచ్చిందామెకు.

గేటు తీస్తున్న చప్పుడు విని అటు తిరగ్గానే,ఆఫీసు నుండి వస్తున్న వదిన కన్పించి ప్రాణం లేచి వచ్చినట్లైంది దేదీప్యకి.

‘‘వదిన వచ్చింది. నేను వెళ్తాను బామ్మా! మళ్లీ కలుస్తా!’’ అంటూ చిన్న పిల్లలా సంతోషపడ్తూ అపురూపకి ఎదురెళ్లింది.

రెడీ అయి మెల్లగా తన గదిలోంచి బయటకొచ్చాడు అభిరాం. అతన్ని చూడగానే దేదీప్య వచ్చి వెళ్లిన విషయం గుర్తొచ్చింది ఇందుమతికి.

‘‘ ఏరా! అభిరాం! దేవేందర్‌ చెల్లెల్ని నువ్వేమైనా అన్నావా? అంతలా భయపడ్తోంది’’. అంటూ అనుమానంగా అభిరాం కళ్లలోకి చూసింది.

‘‘ దేవేందర్‌ చెల్లెలెవరు మామ్మా!’’ వెంటనే అడిగాడు

‘‘దేదీప్యరా!’’ చెప్పింది ఇందుమతి.

‘‘దేదీప్యా!’’ షాకింగ్‌గా అడిగాడు అభిరాం.

‘‘అంత షాకయ్యావేంది అభీ?’’ అంటూ ఆశ్చర్యపోయింది.

‘‘షాకెందుకు? అడిగానంతే!’’ అన్నాడు అభిరాం.

అభిరాం ని చూస్తుంటే ఎప్పుడూ రానంత కోపం వచ్చింది ఇందుమతికి.

‘‘అమ్మాయిల్ని యిలా భయపెట్టటం ఎప్పటి నుండి నేర్చుకున్నావురా?’’ అంటూ నిలదీసింది.

ఆలోచనగా తలదించాడు అభిరాం.

ఇంతవరకు తను భ్రమ అనుకున్నది వాస్తవమేనా? కౌన్సిలింగ్‌ దగ్గర చూసిన దేదీప్య దేవేందర్‌ చెల్లెలా?

‘‘చెప్పరా అభీ! అడుగుతుంటే స్థంభంలా నిలబడ్డావ్‌! అసలేంటిరా నీ ఉద్దేశ్యం?’’

‘‘ఉండు మామ్మ! నా కన్‌ప్యూజన్‌లో నేనున్నాను.’’ అన్నాడు అభిరాం.

‘‘ఎప్పటినుండి నేర్చుకున్నావురా ఈ పాడు అలవాటు. ఇందుమతి మనవడు రోగ్‌ అని ఎవరైనా అంటే నేను సహించలేనని నీకు తెలుసుకదా! దేవేందర్‌ అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? నువ్విలా బిహేవ్‌ చేశావని తెలిస్తే వాళ్లు మన యింట్లో వుండరు. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోతారు’’. అంది ఇందుమతి.

‘‘ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు?’’ అంటూ అప్పుడే తన గదిలోంచి బయటకొచ్చాడు నారాయణరావు.

‘‘దేదీప్య గురించండి!’’ అంది ఇందుమతి అంతకన్నా ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదామెకి.

‘‘దేదీప్య  గురించా? దేదీప్యకేం బాపు బొమ్మ . ఈ రోజంతా దేదీప్య కన్పించనేలేదు ఇందూ! ఒకసారి పిలువు. ‘అంపశయ్య’ నవల కావాలని అడిగింది’’. అన్నాడు నారాయణరావు.

‘‘ఇంక దేదీప్య మన యింటికి రాదులెండి!’’ అంది అభిరాం వైపు కోపంగా చూస్తూ., ఆ చూపులు అభిరాంని గుచ్చుకున్నాయి. వాళ్లకి దేదీప్య ముందే తెలుసని అర్థమైంది.

‘‘నువ్వు హైదరాబాద్‌ వెళ్లినప్పుడు దేదీప్య ను తీసుకొచ్చి అపురూప పరిచయం చేసింది. మంచిపిల్ల. బాగా కలసిపోతుంది. ‘‘ అంటూ మళ్లీ తన రూంలోకి వెళ్లిపోయాడు నారాయణరావు.

‘మామ్మా! నువ్వు అనుకున్నట్లు ఆ అమ్మాయిని నేనేమీ అనలేదు. బాత్‌రూంలో నీళ్లు రాకుంటే పైపులు చెక్‌ చేద్దామని, పైన ట్యాంక్‌ దగ్గరికి వెళ్లాను. బహుశా నన్నక్కడ చూసి భయపడివుండవచ్చు. అంతే!’’ అన్నాడు సిన్సియర్‌గా.

‘‘అంతేనా! నమ్మమంటావా?’’ అంది.

‘‘అంతే మామ్మా! నువ్వేంకంగారు పడకు.  నేను మా లెక్చరర్‌ని కలవాలి.  వెళ్లొస్తా’’ అని అనగానే బైక్‌ కీ తెచ్చి యిచ్చింది ఇందుమతి.

అభిరాంకి మామ్మ అంటే భయంకన్నా గౌరవమే ఎక్కువ.  ఆమె మనసు కష్టపడే పనులేవీ చెయ్యడు.

మనవడలా వెళ్లగానే నారాయణరావు, ఇందుమతి ఇంటిముందున్న గార్డెన్‌లోకి వచ్చారు. వాళ్లెక్కువగా సాయంత్రాలు ఆ గార్డెన్‌లోనే గడుపుతారు.  చల్లగాలి పీల్చుకుంటూ, పూలమొక్కల మధ్యన కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్లను చూసి దేదీప్య మేడదిగి వచ్చింది. వాళ్లతో పాటు దేదీప్య కూడా ఆ చల్లని సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ పువ్వులలోని మకరందాన్ని వెతుకుతూ పూలలోకి చొచ్చుకుపోతున్న తుమ్మెదల్ని ఆసక్తిగా గమనిస్తోంది.

 

* * * * *

 

తూర్పు కనుమల్లోంచి ఎగసివస్తున్న ఉదయభానుని లేతకిరణాలు సోకి ఆ కాలేజి ఆవరణం పులకించింది.

అది అల్లూరి కాలేజి.

ఎం.బి.ఎ. ఫస్టియర్‌ వాళ్లకి అడ్మిషన్స్‌ జరుగుతున్నాయి.

దేదీప్యను తీసుకొని తన బైక్‌ మిాద కాలేజీకి వచ్చాడు దేవేందర్‌ అర్జంట్‌గా రమ్మని కంపెనీ నుండి దేవేందర్‌్‌కి అప్పుడే కాల్‌ వచ్చింది. అతనామిాటింగ్‌కి తప్పనిసరిగా అటెండ్‌ కావాలి. ఏం చేయాలో అర్థం కాక దేదీప్య పక్కన నిలబడ్డాడు.

కొంతమంది సీనియర్స్‌ నిన్న జాయిన్‌ అయిన జోత్స్న ను రాగింగ్‌ చేస్తుంటే, ఒంటరిగా

వున్న జోత్స్న వాళ్ళకి సమాధానం చెప్పలేక బిక్కుబిక్కుమంటూ చూస్తోంది.  వస్తున్న ఏడుపును  ఆపుకుంటోంది.

అసలే ర్యాగింగ్‌ అంటే భయపడే దేదీప్య ఆ దృశ్యాన్ని చూసి సన్నగా వణికింది. అమ్మాయిలు కూడా అమ్మాయిల్ని యిలా ఏడిపిస్తారా? అని విస్తుపోయి చూస్తోంది.

కాలేజీలో ఒకచోట బైక్‌ని పార్క్‌ చేసి ‘కీ’ని పాకెట్‌లో వేసుకొని, తన క్లాస్‌ రూంవైపు వెళ్తూ, అక్కడ కొంతమంది ర్యాగింగ్‌ చెయ్యటం గమనించి వాళ్ల దగ్గరికి వెళ్లాడు అభిరాం. ఆ అమ్మాయిలు అతని క్లాస్‌మేట్స్‌ అయినందువల్ల అతను సర్ది చెప్పగానే వెళ్లిపోయారు.

దేదీప్య దృష్టి అభిరాంపై అప్పుడు పడిరది. అతన్ని చూడగానే ఒక్కక్షణం అప్రతిభురాలైంది.

ఇతన్నేకదా తను కౌన్సిలింగ్‌ హాల్‌ దగ్గర చూసి హేండ్‌సమ్‌గా వున్నాడునుకొంది.  తనంత సీరియస్‌గా తీసుకోలేదు కాని ఆ రోజు రాత్రి తన కలలోకి కూడా ఇతనే వచ్చాడు. కలలోకి వచ్చింది కొద్దిసేపే అయినా కొన్ని క్షణాలు కలవరపెట్టాడు.  రాత్రంతా నిద్రలేకుండా చేశాడు.  ఆ క్షణం నుండి అతన్ని మరచిపోవాలని ఓ నిర్ణయానికి వచ్చి, తెల్లవారగానే ఏం మరచిపోవాలో గుర్తుతెచ్చుకొని అలా కొద్ది రోజులు గంగవెర్రిలెత్తిన దానిలా అయింది.  ఇతనేనా అతను?

సీనియర్స్‌కి నచ్చచెప్పి ఆ అమ్మాయిని ఎంతబాగా సేవ్‌ చేశాడు.  ఫస్ట్‌ ఇంప్రెషన్‌ బెస్ట్‌ అన్నట్లుగా దేదీప్య హృదయంలో హుందాగా నిలబడ్డాడు అభిరాం.  ఇతన్ని ఎలాగైనా పరిచయం చేసుకోవాలి.అ ని మనసులో అనుకొంది.

అభిరాంని చూడగానే టెన్షన్‌ తగ్గింది దేవేందర్‌కి వెంటనే వెళ్లి అభిరాంని కలిశాడు.

ముందుగా దేదీప్యను, అభిరాంను ఒకరికి ఒకర్ని పరిచయం చేశాడు దేవేందర్‌ ఎదురెదురుగా

నిలబడివున్న వాళ్లిద్దరు ఒకరికి ఒకరు ‘హాయ్‌’ చెప్పుకున్నారు.

‘‘దేదీప్యకు ఈ కాలేజీలోనే ఎం.బి.ఎ.సీటొచ్చింది. జాయిన్‌ చేసి వెళ్దామని వచ్చాను. కానీ మా కంపెనీ నుండి అర్జంట్‌గా రమ్మని నాకు కాల్‌ వచ్చింది. నేను వెంటనే హైదరాబాద్‌ వెళ్లాలి. నువ్వీ అలాట్‌మెంట్‌ లెటర్‌ కాలేజీలో యిచ్చి దేదీప్యను జాయిన్‌ చెయ్యగలవ అభిరాం?’’అడిగాడు దేవేందర్‌.

‘‘చెయ్యగలను దేవేందర్‌ గారు! మిారా లెటరివ్వండి?’’ అంటూ దేవేందర్‌ చేతిలో వున్న లెటర్ని తీసుకున్నాడు అభిరాం.

‘‘కాలేజిలో ర్యాగింగ్‌ వుంటుందని భయపడ్తుంది దేదీప్య. కొంచెం చూసుకో అభిరాం!’’ అంటూ తెలిసిన అబ్బాయి అన్న చొరవతో చెప్పాడు దేవేందర్‌.

‘‘ఓ.కె. దేవేందర్‌గారు! ర్యాగింగ్‌ విషయములో మిారేం వర్రీకాకండి!’’ అంటూ భరోసా ఇచ్చాడు.

‘‘ఏదైనా డౌటొస్తే అభిరాంని అడుగు దేదీప్యా! ఓ.కె. అభిరాం! బై.’’ అంటూ బైక్‌ స్టార్ట్‌ చేసుకొని వెళ్లిపోయాడు దేవేందర్‌.

స్టూడెంట్స్‌ అంతా ఎవరి అవసరాన్ని బట్టి వాళ్లు హడావుడిగా తిరుగుతూ ఎవరి ద్యాసలో             వాళ్లున్నారు.

నేరుగా ఆఫీసురూంకెళ్లి అలాట్‌మెంట్‌ లెటర్‌ యిచ్చే క్యాబిన్‌ దగ్గర నిలబడ్డాడు అభిరాం చేస్తున్నపని తనదే అయినందువల్ల అతని పక్కన నిలబడిరది దేదీప్య.

దేదీప్య అలాట్‌మెంట్‌ లెటర్ని ప్రిన్సిపాల్‌కి ఇచ్చారు. దేదీప్య గురించిన వివరాలు అభిరాం చెప్తుంటే వింటూ అలాట్‌మెంట్‌ లెటర్ని చూశారు ప్రిన్సిపాల్‌.

‘‘మీరు వెళ్లి సెమినార్‌ హాల్లో కూర్చోండి!’’ అంటూ దేదీప్య వైపుచూస్తు చెప్పారు ప్రిన్సిపాల్‌.

అక్కడనుండి దేదీప్య, అభిరాం సెమినార్‌ హాల్‌కి వెళ్లారు. అభిరాం తన పక్కన వున్నందువల్ల ఆ కాలేజి తనకి కొత్త అన్న ఫీలింగ్‌ కలగలేదు.

‘‘మీరిక్కడ కూర్చోండి! వీళ్లంతా మిాతోపాటు జాయిన్‌ అయినవాళ్లు. నాకు క్లాసుకు టైమయింది. నేను వెళ్తాను.’’ అన్నాడు అభిరాం.

అతను పక్కన వున్నంత సేపు ఏదో తెలియని ఆనందానికి లోనైన దేదీప్య అతను వెళ్తాను అనగానే వెలితిగా ఫీలయింది.

‘‘భయపడకండి! ప్రొఫెసర్స్‌, లెక్చరర్స్‌ వచ్చి ఇప్పుడు మిాకు ఇంట్రడక్షన్‌ ఇచ్చివెళ్తారు. అంతే!’’ అన్నాడు తన గత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.

‘‘సరే! నేనిక్కడ కూర్చుంటాను. మీరు వెళ్లండి’’ అంది దేదీప్య.

అభిరాం క్లాసుకెళ్లాడు.

‘‘హాయ్‌!దేదీప్యా!’’ అంటూ దేదీప్య పక్కన కూర్చుంది కావ్య, దేదీప్య కూడా ‘హాయ్‌’! చెప్పింది.

‘‘ఎవరే అతను?’’ అంది వెంటనే అభిరాంని ఉద్దేశించి కావ్య.  మేముండేది వాళ ్ల యింట్లోనే’’ అంది దేదీప్య.

‘‘ వెరీగుడ్‌! వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పుష్కలంగా తినొచ్చని, మన సీనియరే మనకి తెలిసిన వాడైతే యింక ర్యాగింగ్‌ బాధ ఎక్కుడుంటుంది? దన్యురాలివి దేదీప్యా!’’ అంది కావ్య.

కావ్య మాటలు జోవియల్‌గా అన్పించి నవ్వింది దేదీప్య.

దేదీప్య నవ్వు రత్నాలహారంలా అన్పించి రెప్పవాల్చటం మరచిపోయాడు. ఆరోజే జాయిన్‌ అయిన లక్ష్యాన్వేష్‌. అతని కళ్లకి దేదీప్య రూపం ప్రాణం పోసుకున్న మోడరన్‌ ఆర్టులా వుంది. వైట్‌ డ్రస్‌ వేసుకొని, షాంపూ చేసిన జుట్టుని క్లిప్‌పెట్టి వదిలెయ్యటంతో ఏంజిల్‌లా వుంది.  అంతమంది అమ్మాయిల మధ్యన కూర్చుని రారెవరునాకుసాటి అన్నట్లుగా అప్పుడే విరబూస్తున్న ముద్దబంతిలా ఫోకస్‌ అవుతోంది.

ఇంత అందంగా కన్పిస్తున్న ఈ అమ్మాయి ఎవరు? పేరేంటో త్వరగా తెలిస్తే బావుండు! అని మనసులో ఎదురుచూస్తున్న లక్ష్యాన్వేష్‌ మడిచిన పెదవుల చాటున సన్నటి భావకెరటాన్ని దాచుకున్నాడు.

ఎం.బి.ఎలో జాయిన్‌ అయ్యానన్న హేపీ ఫీలింగ్‌ కావ్యలో స్పష్టంగా కన్పిస్తుంది. చామన చాయలో వుండే కావ్య కాస్త బొద్దుగా, కర్లింగ్‌ హెయిర్స్‌తో, వయసు తెచ్చిన అందంతో చూడగానే పర్వాలేదు అన్పించేలా వుంటుంది. నవ్వుతూ మాట్లాడడం వల్ల ఆ ముఖంలో వుండే చిన్న, చిన్న లోపాలు కవరైపోతుంటాయి.

‘‘మమ్మీ నిన్ను అడిగినట్లు చెప్పమంది దేదీప్యా ! నిన్న నన్ను హాస్టల్లో జాయిన్‌ చేసి వెళ్లింది. ఈసారి వచ్చినప్పుడు నిన్ను కలుస్తానని చెప్పింది’’. అంది కావ్య.

‘‘మీ హాస్టల్‌ ఎలా వుంది కావ్యా? నీకు కంపర్‌టబుల్‌గా వుందా?’’ అడిగింది దేదీప్య.

‘‘నార్మల్‌గా వుంది. అడ్జస్ట్‌ అవుతాను’’. అంది ముఖం అదోలాపెట్టి.

‘‘ఫేసేంటి అలాపెట్టావ్‌? ఎప్పుడూ హాస్టల్లో వుండలేదా?’’ అడిగింది దేదీప్య.

‘‘ ఇదే పస్ట్‌టైం. హాస్టల్లో వుండటం, అడ్జస్ట్‌ కాలేకపోతున్నాను. ఎవరితో చెప్పుకోను నా బాధ? మార్నింగ్‌ అయితే నాకు బాత్‌రూం దొరకలేదు తెలుసా?’’ అంది బాధగా.

నవ్వింది దేదీప్య. దేదీప్య ఇంటర్‌మిాడియట్‌ నుండి డిగ్రీ వరకు హాస్టల్లో వుండే చదివింది. దేనికీ ఇబ్బందిగా ఫీలయ్యేది కాదు.

‘‘మార్నింగ్‌ నాకు టిఫిన్‌ కూడా దొరకలేదు.  ముందు వెళ్లిన వాళ్లకే దొరికింది. వెయిట్‌ చెయ్యాలంటే కాలేజీకి టైమయింది తినకుండా వచ్చేశాను.’’. అంది కావ్య.

కావ్యను చూస్తుంటే జాలిగా వుంది దేదీప్యకి.

‘‘ఇంట్లో లేచినట్లు హాస్టల్లో ఆలస్యంగా నిద్ర లేవకూడదు కావ్యా! ఆలస్యమనేది అన్ని పనులమీద పడ్తుంది. ముఖ్యంగా బాత్‌రూం దొరకదు, టిఫిన్‌ దొరకదు. కాలేజీలో క్లాసులు మిస్‌. రేపటి నుండి నువ్వు ఒక గంట ముందుగా నిద్రలేచి చూడు. రిజల్ట్‌ కన్పిస్తుంది.’’ అంది దేదీప్య

‘‘ట్రై చేస్తా దేదీప్యా!’’ అంది కావ్య.

సెమినార్‌ హాల్లో కూర్చుని వున్న జూనియర్స్‌ అంతా ప్యాకల్టీ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత టైం గడిచాక ఫ్యాకల్టీ వచ్చి జూనియర్స్‌కి ఎదురుగా వున్న డయాస్‌ పై కూర్చున్నారు.

ఫ్యాకల్టీని జూనియర్స్‌ విష్‌ చేశారు.  జూనియర్స్‌ని కూడా ఫ్యాకల్టీ విష్‌ చేశారు.

ఫ్యాకల్టీలో ఒకతను లేచి ఫ్యాకల్టీ గురించి ఇంటర్‌డ్యూస్‌ చేస్తూ ముందుగా ప్రిన్సిపాల్‌ గురించి ఇంటర్‌డ్యూస్‌ చేశారు. తర్వాత కాలేజికి వున్న పేరు, కాలేజి ఫ్యాకల్టీ, కాలేజీలోని పెసిలిటీస్‌,   ఫ్లేస్‌మెంట్స్‌, ర్యాగింగ్‌ ప్రొహిబిషన్‌ గురించి చెప్పారు.

తర్వాత ఎం.బి.ఎ. ఆపర్‌చ్యూనిటీస్‌ గురించి చెప్పారు. లక్ష్యాన్ని ఎలా రీచ్‌ అవ్వాలో చెప్పారు.

ప్రస్తుతం ఎం.బి.ఎ. ఎలా వుంది అన్న దాని గురించి తమ విలువైన అభిప్రాయాలను చెప్పారు.

చివరగా జూనియర్స్‌కి స్నాక్స్‌, టీ ఇచ్చి ఆల్‌దబెస్ట్‌ చెప్పి ప్యాకల్టీ వెళ్లిపోయారు.

జూనియర్స్‌ అంతా సెమినార్‌ హాల్లోంచి బయటికి వచ్చారు.

ఆటో ఎక్కాలంటే ఆ కాలేజి లోపల నుండి రోడ్డు వరకు ఐదు నిమిషాలు నడవాలి. దేదీప్య, కావ్య మాట్లాడుకుంటూ కాలేజి నుండి రోడ్డు వరకు నడిచారు. అల్లూరి కాలేజీకి దారిచూపుతూ రోడ్డు పక్కనే వున్న కాలేజి నేమ్‌ బోర్డు దగ్గరికి వచ్చి ఆటో కోసం నిలబడ్డారు.

ఆటోలు వస్తున్నాయి, పోతున్నాయి. ఒక్కటి కూడా ఖాళీగా రావటం లేదు.

వాళ్ల పక్కన ఇన్నోవా కారొచ్చి ఆగింది.

మెల్లగా ఆ కారు గ్లాస్‌ డోర్‌ క్రిందికి దిగుతుంటే కారులో వున్నలక్ష్యాన్వేష్‌ ముఖం

కన్పించడంతో కావ్య గుర్తుపట్టింది. సెమినార్‌ హాల్లో అప్పుడప్పుడు కావ్య దృష్టి అతని మీదపడి, అతన్నే ఆసక్తిగా చూసింది.  ఎందుకంటే అతని చూపులు దేదీప్య మీదనుండి ఎందుకు కదలడం లేదో అర్థం కాక.

కారులోంచి దిగాడు అతను. మొబైల్‌కి కాల్‌ రావటంతో  ‘ఆ..హా.. అలాగా’ అంటూ అవతల వ్యక్తితో ఫర్‌ఫెక్ట్‌గా మాట్లాడుతున్నాడు. జేబులో చేయి పెట్టుకొని నేలమిాద కరక్ట్‌ యాంగిల్‌ లో స్థిరంగా నిలబడివున్న లక్ష్యాన్వేష్‌ ‘మోడల్‌’ లా అన్పిస్తుంటే అక్కడున్న కొంతమంది అమ్మాయిలు ఆరడుగుల ఐస్‌క్రీంను చూసినట్లు చూస్తున్నారు.

లక్ష్యాన్వేష్‌ని,  ఆ అమ్మాయిల్ని మార్చి, మార్చి చూసింది కావ్య. అతను ఆ అమ్మాయిల్ని చూడడం లేదు.  అతని దృష్టంతా దేదీప్య మీదనే వుంది.

దేదీప్య మాత్రం జీవితంలో ఆటోయే ముఖ్యం అన్నట్లుగా స్థితప్రజ్ఞలా రోడ్డు వైపు చూస్తోంది. ఆరడుగుల ఆజాను బాహువు అయిన లక్ష్యాన్వేష్‌ని కాని, అతని కారుని గాని గమనించని దేదీప్యను చూస్తుంటే దీనికసలు టేస్టే లేదా అనుకొంది.

‘‘ఎక్స్‌క్యూజ్‌ మీ! హాయ్‌! ఐయాం లక్ష్యాన్వేష్‌! ఐయాం ఆల్‌సో ఎం.బి.ఎ. పస్టియర్‌

‘‘నన్ను ఎక్కువగా అన్వేష్‌ అని పిలుస్తుంటారు’’. అని తనను తను పరిచయం, చేసుకుంటూ షేక్‌ హేండ్‌ యిస్తున్న వాడిలా చేయి చాపాడు అన్వేష్‌.

యదాలాపంగా ఓచూపు చూసి ‘‘హాయ్‌’’ అంది దేదీప్య. అతను కావ్యను పట్టించుకోకపోవడంతో  కావ్య మనసు చివుక్కుమంది.

‘‘మీ పేరు  తెలుసుకోవచ్చా?’’ దేదీప్యనే దీక్షగా, కూల్‌గా చూస్తూ అడిగాడు.

‘‘నా పేరు దేదీప్య ఓ.కె. బై’’. అంటూ వస్తున్న ఆటోని ఆపి ఎక్కింది దేదీప్య. కావ్యకూడా దేదీప్యతో ఆటో ఎక్కింది.

వాళ్లు ఒప్పుకుంటే తన కార్లో లిప్ట్‌ ఇద్దామని అడిగే లోపలే సరిగ్గా ఆటోవాడు అక్కడికి రావటం దేదీప్య ఆటో ఎక్కటం అతనికి డిజపాయింట్‌ అన్పించింది.

కావ్య ద్యాస అంతా అతని మిాద వున్నందువల్ల అతని ఫీలింగ్స్‌ని ఈజీగా క్యాచ్‌ చేస్తోంది.

‘‘నీకు తెలియని విషయం ఒకటుంది  దేదీప్యా!’’ అంది మెల్లగా కావ్య.

‘‘ఏమిటో చెప్పు కావ్యా?’’ అంది.  దేదీప్య గాలికి ఎగురుతున్న తన జుట్టుని నెమ్మదిగా వెనక్కి నెట్టుకుంటూ.

‘‘ మనం సెమినార్‌ హాల్లో కూర్చుని వున్నంతసేపు అతను నిన్నే చూస్తు కూర్చున్నాడు’’. అంది తనని చూడలేదన్న బాధ కావ్యను లోలోన తినేస్తోంది.

‘‘ అవునా! చూస్తే తప్పేంటి? ఎందరో చూస్తుంటారు. ఆ అందరిలో అతనొకడు.  ఇందులో విశేషమేముంది?’’ అంది క్యాజువల్‌గా

‘‘నాకెందుకో డౌట్‌గా వుంది. అందరిలో నిన్నే చూస్తున్నాడంటే అతను నిన్ను బాగా ఇష్టపడ్తున్నాడనిపిస్తోంది. ఇష్టపటానికి కారణాలుండవు. దానికి పెద్ద టైం కూడా అవసరం లేదు’’. అంది కొద్దిగా  తలవంచుకుని కావ్య… కనీసం ఒక్క సెకన్‌ అయినా అతను కావ్య వైపు  చూస్తుంటే కావ్యకి యింత బాధ వుండేది కాదు.

ఏదైనా ఒక ఫీలింగ్‌ కలగటానికి ఒక్క క్షణం చాలని అభిరాం పట్ల తన మనసు పడే తపన, కుతూహలం చూస్తుంటే అర్థమైంది దేదీప్యకి.

‘‘అంతా నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా కావ్యా! మనవైపు చూసేవాళ్లంతా మనల్ని యిష్టపడ్తున్నట్లేనా? ఇష్టపడేవాళ్లే చూస్తారని, చూడనివాళ్లు ఇష్టపడరని ఎక్కడైనా వుందా?’’ అంది దేదీప్య.

దేదీప్యకి తన వైపు ఎవరు చూసినా నచ్చదు.  తను యిష్టపడే వాళ్లు చూస్తేనే నచ్చుతుంది.

పొగరంటే ఇదే.  అబ్బాయిలు కూడా అంతే!  పొగరుగా వుండే అమ్మాయిల్నే చూస్తారు. తనలాంటి వాళ్లను పట్టించుకోరు. తనకి మాత్రం ఏం తక్కువ? అంతో, ఇంతో తనలో కూడా ఏదో కొంతవుందిగా.   తను కూడా ఎం.బి.ఎ.నే కదా!  మరి ఆ లక్ష్యాన్వేష్‌కి ఏమొచ్చింది. తనను కాదని దేదీప్యను చూస్తాడు? అనుకొంది మనసులో కావ్య.  కొంతమంది అమ్మాయిల్లో అతిసహజంగా కలిగే ఫీలింగే కావ్యలో కూడా కల్గింది.

‘‘దేదీప్యా! ఈ రోజు మా హాస్టల్‌కి రావే. ఇంటికి తర్వాత వెళ్దువు.’’ అంది కావ్య.

‘‘నేను వెళ్లాలి కావ్యా! వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్‌.  ఆఫీసులో వర్క్‌ చేసి ఇంటికి వచ్చే సరికి అలసిపోతోంది.  నేను వెళ్తే వదినకి కాస్త హెల్స్‌గా వుంటుంది.’’ అంది దేదీప్య.

‘‘మరెప్పుడొస్తావ్‌ మా హాస్టల్‌కి?’’ అడిగింది కావ్య.

‘‘త్వరలోనే వస్తాను.’’ అంది దేదీప్య.

హాస్టల్‌ రాగానే ఆటోని ఆపి దేదీప్యకి ‘బె’ౖ చెప్పి, ఆటో దిగింది కావ్య .

ఇంటికెళ్లాక బాల్కనీలో రిలాక్స్‌గా కూర్చుని కాఫీ త్రాగుతున్న దేదీప్యకి అభిరాంను చూడాలని బలంగా అన్పిస్తోంది.

అప్పుడే కాలేజి నుండి ఇంటికొచ్చిన అభిరాం బైక్‌ చప్పుడు విని… నేలను ఆశగా చూస్తున్న ఆకాశంలా క్రిందికి వంగి అభిరాంని చూసింది దేదీప్య.  కొద్దిక్షణాలు అలాగే ప్రపంచాన్ని మరచిపోయినట్లు చూసింది.

సముద్రంలోని అలల్లాగ కొన్ని స్పందనలు మనసులోంచి పుడతాయి.  అలలపై వీచే గాలిలాగ కొన్ని స్పందనలు పెదవులపై పుడతాయి. పెదవులపై పుట్టే స్పందన గాలికెగిరిపోతుంది.  మనసులోంచి పుట్టే స్పందన మనిషినే అంటిపెట్టుకొని వుంటుంది.  దేదీప్యది పెదవులపై పుట్టే స్పందన కాదు.  మనసులోంచి పుట్టే స్పందన.

అభిరాం మాత్రం పైకి చూడలేదు.  బైక్‌ కీస్‌ మామ్మ చేతిలో పెడుతూ లోపలకెళ్లాడు.

అమ్మాయిల వైపు చూసినా, మాట్లాడినా, ఏడిపించినా ‘తప్పు’ అని చిన్నప్పటి నుండి అతనికి కొన్ని షరతులు విధించింది ఇందుమతి. అప్పటి నుండి అతని జీవన క్రమంలో అవి నిషేదింపబడ్డాయి.

 

* * * * *

 

ఇంకా ఉంది….

4 thoughts on “మౌనరాగం… 1

  1. chala baagundi serial mounam ani manasulo unnadi unnattu varnincharu…jeevitham ghadamainadi antu prarambinchi a jeevana majili lo enni malupulo unnayo chala chakkaga kannulaku kattinatlu varnicharu anjana madam garu…. chala baagundi …serial loni paatala పేర్లు కూడా
    baagunnai

Leave a Reply to raghavendarjoshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *