March 29, 2024

లేఖాంతరంగం – 2

renuka

రచన: రేణుక అయోల

చాలా రోజులైంది “సరోజ “దగ్గరనుంచి ఉత్తరం వచ్చి. వస్తే మాత్రం బోలెడన్ని విశేషాలు. కొన్నిసార్లు ఘాటుగా, కొన్నిసార్లు మెత్తగా, కొన్నిసార్లు ఆహ్లదంగా…. ఈసారి ఏం రాసిందో అనుకుంటూ…  తీరిగ్గా కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని ఉత్తరం విప్పి చదవడం మొదలు పెట్టాను

renuka1

“సరళా! సారీనే. చాలా రోజులైంది ఉత్తరం రాసి. రాద్దాం.. రాద్దాం అనుకుంటూనే రోజులలా గడిచిపోతున్నాయి.  నీకు మా అమ్మ చిన్ననాటి స్నేహితురాలు సుందరం పిన్ని జ్జాపకం వుందా?  ఆవిడకి సూదంటురాయి అని ఓ పేరు ఉండేది కదా..? ఆవిడకి ఓ ఊతపదం వుండేది …. ప్రతీదానికి ’సూదంటురాయిలా” అనకు అనేది. నాకు ఇప్పటికి ఆ సూదంటురాయికి మాటలకి  లింక్ ఏంటో అర్ధం అవదు.  బహుశా ఎవరికి అర్ధం కాలేదు అనుకుంటాను.  అందుకే ఆవిడకి ముద్దుగా సూదంటురాయి పిన్ని అని పిలచుకుంటారు. సుందరం పిన్ని అంటే ఎవరికి చట్టుక్కున గుర్తుకి రాదు. ఆవిడకి అందరూ ముద్దుగా పెట్టుకున్న పేరు ముందు తగిలిస్తేనే కాని ఓహో ఆవిడ కదూ అంటారు. మరి ఆవిడ పవర్ అలాంటిది.

సుందరం పిన్నికి నేను ఇక్కడ ఉన్నానని తెలిసిందట. వెంటనే నాకు ఫోను చేసి అమ్మాయి నేను మీ అమ్మా నేను గాఢస్నేహితులం. మీ అమ్మ చెప్పిందా? అని కుతూహలంగా అడిగారు. అమ్మ మీ గురించి చెప్పారండి అన్నాను.  సూదంటూరాయి పిన్నిగారు కదూ మీరు అనబోయి అతికష్టం మీద తమాయించుకున్నాను. ఆవిడ నాకు రోజూ  ఫోన్లు చేస్తూ ఉంటారు సరళా!   నాకు మంచి స్నేహితురాలయిపోయారు . ఆమాటే అమ్మతో చెప్తే అమ్మ చాలా సంతోషించింది. పొనీ లేవే నీకో పెద్దతోడు అంది నిజంగానే నాకు అన్నింటిలో సహాయంగా వుంటారావిడ . కాని ఆవిడ చెప్పుకునే గొప్పలు భరించడం చాలా కష్టం అయినా తప్పదు అమ్మకోసం..

నీకు ఉత్తరం రాయక ముందురోజే ఆవిడ ఫోను చేసి అమ్మాయి సరళా! మా అమెరికా స్నేహితుడు గోపినాధం ఇండియాకొచ్చాడు. ఇక్కడ వాళ్ల అబ్బాయికి  పుట్టినరోజు చేస్తున్నాడు. అందరు చుట్టాలు, స్నేహితుల మధ్యలో కాస్త సరదాగా చేసుకోవాలనుకుంటున్నాడు  నువ్వు, మీ ఆయనా రావాలి తప్పదు అన్నారు. నేనా? ఎందుకండి? అన్నాను మొహమాటంగా..  ఎందుకేవిటి! మీ అమ్మకి తెలుస్తే ఎంత బాధ పడుతుంది.

వాడు, నేను, మీ అమ్మ ఒకే స్కూల్లో చదివాము తెలుసా? అన్నారు. తప్పదు వెళ్ళాలి.  రామ్  మాత్రం ఆఫీసులోపని వుందంటూ తప్పించుకున్నాడు. సరిగ్గా బయలుదేరుదాం అనుకుంటున్నాను,  డ్రైవర్ దగ్గర నుంచి ఫోన్. అమ్మా నేను ఈరోజు రాలేనమ్మా అంటూ. నాకు తెలుసు నీకు నామీద కోపం వస్తుందని.  నువ్వు ఎన్నోసార్లు  చెప్పావు కారు నడపడం నేర్చుకోవే అని . కాని  ట్రాఫిక్లో రోడ్డు దాటడం అంటేనే పెద్ద గండం అలాంటిది నువ్వు కారు నడుపు అంటే ఎలాగ? అందుకే ఎన్నిసార్లు చెప్పినా కారు నేర్చుకోవడానికి ధైర్యం చేయలేకపోయాను..అందుకే నీకో సారీ పడేస్తున్నాను అందుకో…

కిందకి దిగి ఆటోవాడికోసం చూస్తున్నాను. ప్రతీ ఆటోవాడు రావడం ఎక్కడికి అని అడగడం, అక్కడికేనా?

సరిగ్గా అక్కడే దిగుతారా? అని అడగడః అంటే అక్కడకన్నా ఒక్క అడుగు ముందు కూడా ఆటో ఆపడన్నమాట. నాకు ఒళ్ళు మండిపోయింది. నేను ఏక్కడ ఎడ్రస్ చెప్తే అక్కడికి అన్నాను నన్ను ఎగాదిగా చూస్తూ ఏమిస్తావూ? అని అడిగాడు నేను ఇవ్వడం ఏమిటి మీటరు వెయ్యి అది ఎంత చూపిస్తే అంత ఇస్తాను అన్నాను. “మీటరు పాడైయింది అందుకని అడిగాను” అన్నాడు. నిజంగాఈ ఆటోవాళ్ళతో పడలేక పోతున్నామనుకో. వాళ్ళు చెప్పేసాకులు ఎంత విచిత్రంగా వుంటాయో తెలుసా? రోడ్డు గుంతలు పడడం. ట్రాఫిక్ విపరీతంగా వుండడం, ఇవన్ని మన తప్పులు కాబట్టి  వాడి మీటరు పనిచేయ్యదు. చూడూ ఇలా వుంది లోకం.  అలా ఓ ఆరు ఆటోలతో కుస్తీ పట్టాక ఆరోవాడు మీటరు వేసాడు.  మారు మాట్లాడకుండా. ఆటో ఎక్కి వాడి నిజాయతికి పొంగిపోయాను. అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు వుండబట్టే కదా నీతి న్యాయం నిలబడుతున్నాయి అనుకున్నాను ఆవేశంగా..

కాని సరళా!  సూదంటురాయి పిన్ని వాళ్ళ ఇంటి గుమ్మం ముందు దిగేసరికి ఆటో మీటరు ఎంత చూపించిందో తెలుసా?  రెండువందలు… ఆశ్చర్యపోయాను రెండువందలా? అక్కడనుంచి ఇక్కడికి రావడానికి మహా అయితే ఓ వంద. ఆ మాటే వాడితో అన్నాను. మీటరు ఎంత చూపిస్తే అంత అన్నాడు నీ మీటరు తప్పు అనగానే ఈ సిటిలో నా ఆటో మీటరు సరిగ్గా పనిచేయటం లేదని నువ్వొక్కదానివే అన్నావు అని నన్నో వింతజంతువుని చూసినట్లు చూసి. రెండువందలు జేబులో పెట్టుకుని రివ్వున వెళ్ళిపోయాడు. చేసేదేమి లేక పిన్ని వాళ్ల ఇంట్లో అడుగుపెట్టాను. నన్ను చూడగానే పిన్ని సాదరంగా ఆహ్వనిస్తూ వచ్చావా రారా.  ఇదిగో రాఘవ నా స్నేహితురాలు కూతురోచ్చింది అని చెప్పగానే అక్కడ హల్లో కూర్చున్న అందరూ నా వేపు చూశారు అక్కడ ఆడవాళ్ల అలంకారం చూస్తే అనిపించిందే సరళా బంగారం ధరలు పెరిగాయని ఎవరన్నారని?

మెడలో పుస్తెల తాడు, ఆ తరువాత కాసులపేరు, దాని మిద ముత్యాలపేరు, చెవులకి ఎత్తుగొలుసులు జుంకాలు ఇంచుమించూ అందరు కొంచెం అటూ ఇటో కాని అందరి అలంకరణ ఇదే.  అలంకరణని తప్పు పట్టటం లేదు కాని ఓదానికి ఒకటి లింకు లేదు అనిపించింది. ఇంక పిన్నిగారైతే నడుముకి వడ్డాణం దగ్గరనుంచి పెట్టుకుని నడుస్తున్న నగల షాపులా కనిపించారు, కాని అందరు నా వైపే చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. ఎందుకలా చూస్తున్నారో తెలుసా? పుట్టినరోజే కదా అని సింపుల్ గా ఒక ముత్యాల గొలుసు, గాజులు మాత్రం వేసుకున్నా కదా.. బోజనాలు, కబుర్లు, పరిచయాలు అయ్యాక అందరూ పుట్టినరోజు చేసుకున్న అబ్బాయికి బహుమతులు ఇచ్చారు. నేను నాకు నచ్చిన పుస్తకం ఒకటి బహుమతిగా ఇచ్చాను. సరళా! నావైపు అందరూ ఎంత వింతగా చూసారంటే చెప్పొద్దు నాకు చాలా సిగ్గుగా అనిపించింది.

సరే ఇంక పిన్నిగారి దగ్గర అమెరికా స్నేహితుడి దగ్గర సెలవుతీసుకుని ఇంటికి బయలు దేరాను. మా ఇంటి వైపే వచ్చే ఇంకో పిన్నిగారి స్నేహితురాలు నన్ను తన కార్లో దింపుతానంటే సరే అని ఎక్కాను.  కారులో కూర్చుంటుంటే కనిపించింది నేను ఆ అబ్బాయి బహుమతిగా ఇచ్చిన పుస్తకం.  ఇంత తొందరగా ఆ పుస్తకానికి అ అబ్బాయి ఇచ్చిన విలువ చూస్తే చాలా బాధ వేసింది.  యువకులకి పుస్తకపఠనం నేర్పించాలి

అంటారు కాని పెద్దవాళ్ళకే పుస్తకం విలువ తేలినప్పుడు ఇంక వీళ్లకేం తెలుస్తుంది?

మెల్లగా నా పుస్తకాన్ని నేనే దొంగలా తీసుకుని నా బ్యాగులో పెట్టుకున్నాను.  నన్ను ఇంటిదగ్గర దింపిన

వాళ్లకి థేంక్స్ చెప్పి దిగిపోయాను.. ఆ రోజు సాయంకాలం వరకు ఎదురు చూసాను పుస్తకం పోయిందని ఎవరైనా ఫోన్ చేస్తారేమోనని. ఎవరూ చేయలేదు కాని అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.  నాకు బాగా చీవాట్లు పెట్టింది. అన్ని నగలు ఉన్నా ఎమీ లేనిదానిలా వెళ్లానుట. వాళ్ళ స్నేహితురాలు సుందరం నామీద జాలి పడి అమ్మని అడిగిందిట. అంతలేని వాళ్లకి పిల్లనెలా ఇచ్చావని..చూసావా సరళా నగలు ఆడంబరాలకి ఉన్నంత విలువ ఈ మనుషులకి లేదని అనిపించింది …

నువ్వేమంటావు???

 

మళ్ళీ నీఉత్తరం కోసం ఎదురుచూస్తూ

 

నీ ప్రియసఖి సరోజ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *