April 20, 2024

విద్యా వినీతో రాజా హి ప్రజానాం వినయేరత :

రచన: కొత్తపల్లి రాములు

నీతి శాస్త్రంబుల పటియించి నీతులెల్ల

బుద్ధివశ్యంబులుగ జేసి బుధ జనేష్ట

మార్గమున బోవు చుండెడు మానవుండు

పొందు నిహపర సౌఖ్యము లు పుడమిలోన

( పేజి_5 ప్రథమ శ్వాసము,విదుర నీతి, పద్యం_30  )

ప్రతి వ్యక్తిలో నైతికతను పెంపొందించేది నైతిక శాస్త్ర పఠనం మాత్రమే. దీనిని అనుసరించి విజ్ఞాన నీతిపరులుగా పండితశ్రేష్టులు చూపిన మార్గంలోమానవులంతా ధర్మానుసారంగా నడిస్తే సుఖసంతోషాలను అనుభవిస్తారని  విదురుడు మనకు వివరంగా వివరిస్తాడు.  ఈ మానవ సమాజం  నీతి వాక్యాలను వింటుంది  కానీ ఆచరించటంలో అనేక రకాలుగా  విపలమౌతుంటుంది. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు నైతిక వర్తనుడిగా ఉండాలని కోరుకుంటారు.  అది సాధ్యమా అంటే సాధ్యమే!  ఎలా అంటే ఒక కుటుంబం మొత్తం నీతిగా ఉండాలంటే ఆ కుటుంబ పెద్ద మొదట నీతిగా ఉండి  దిశానిర్దేశ చేస్తూ ఉండాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది. రాజు ధర్మానికి బద్దుడై పాలించాలి. ప్రజలు నైతికంగా బ్రతకాలి అనేది ఆనాటి వేదకాలం నుండి మొదలుకొని ఈనాటి సాంకేతిక యుగం దాకా ప్రతి ఒక్కరూ కోరుకునేది. ప్రపంచంలో ఎన్నో ఉధ్యమాలు వచ్చాయి పారిశ్రామిక, స్వేచ్చా స్వాతంత్ర్య, భూస్వామ్య రైతాంగ విప్లవాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో విప్లవంతో  చిందించిన రక్తం తడి ఆరని ప్రదేశాలు ఎన్నోచెప్పలేము. వీటన్నింటికీ కారణం, కనపడని మూలరూపం, అవినీతి అని  మనం గుర్తించాల్సిన సమయం ఆసన్నమయ్యింది అని చెప్పక తప్పదు. దీనికి ఉదాహరణ  మనదేశంలో అన్నాహజారే తలపెట్టిన ఉద్యమం మనకు తెలిసిందే. కాబట్టి దేశంలోని ప్రజలలో  నీతి  నియమాలు  ఉండాలంటే  ప్రధానంగా  దేశాన్ని పాలించే రాజు నైతికంగా  ధర్మస్వరూపుడై ఉండాలి. ఇక్కడ మన ఒక సామెతను గుర్తుకు చేసుకోవాలి కోడలికి బుద్ది చెప్పి అత్త తెడ్డు నాకినాట్లుగా ఉండకూడదు మన రాజనీతి అని చెప్పే ప్రయత్నమే ఈ వ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం.

పుట్టుకతో మానవుడు చెడ్డవాడుకాదు, చెడు లక్షణాలు కల్గిన వాడు అంతకన్నా కాదు. ప్రతిమనిషిలోనూ మంచి చెడు రెండు రెండు పార్శ్వాలుగా ఉంటున్నాయి. అందులో చెడు అనే పార్శ్వమే తన ఉనికిని చాటుకుంటుంది, ఆ పోటీలో మంచి మసక బారిపోతుంది. కాలప్రవాహంలో పరుగెడుతున్న మానవ లోకంలో నిలకడలేని వ్యక్తిత్వాలు మానవీయ విలువల్ని కోల్పోతున్నాయి, లోకంలో అధర్మం వెర్రితలలు వేస్తూ  వేయి నాలుకలతో మాట్లాడుతుంది, అక్రమాలు ఉసిళ్ళ పుట్టలా విజృంభిస్తున్నాయి. ఇటువంటి దారుణ జగత్తులో మనిషి మనిషి గా మరణించి రాక్షసుడిగా మనుగడ కొనసాగిస్తున్నాడు. అసలు మనిషి అనగా మానవత్వం, నీతి, శీలం అనే మూడు లక్షణాలతో మిళితమైన మహోన్నత రూపం, అలాంటి మనిషి తన నర నరాన జీర్ణించుకొనిపోయిన స్వార్ధపూరిత ద్వేషభావన, ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తుందో మన మానవ సమాజాన్ని పరికిస్తే అవగతమవుతుంది ఇటువంటి దుస్థిలో  ధర్మం, నాయం, సత్యం  ఇసుకలో వేసిన ముత్యాలై పోతున్నాయి.

పట్టాబిషిక్తుడై రాజ్యాన్ని ఏ లాల్సిన రాముడు అడవులకు పయనమై పోతుంటే అది చూసి భరించలేని దశరధుడు మరణించినప్పుడు. ఆ అయోద్యను ఆపద్ధర్మంగానైనా పాలించటానికి రాజకుమారులేవ్వరూ లేని సందర్భంలో మంత్రి పురోహితులు ఈ విధంగా సెలవిస్తారు.

“రాజా సత్యం చ ధర్మశ్చ రాజ కులవతంకులమ్

రాజా మాతా హితైచావ రాజా హితకరో నృనామ్”

(వాల్మీకి రామాయణం అరణ్య కాండ -33.21, పేజీ-)

ఏ రాజ్యంలోనైనా సత్యం ధర్మం నిలిచి ఉండాలంటే అది కేవలం సరైన రాజు ఉండడం వలననే సాధ్యమవుతుంది. ప్రజలకు రాజే రక్షకుడు. రాజే తల్లి, తండ్రి. రాజు లేకుండా ఒక్కరోజు కూడా రాజ్యం క్షేమంగా మనుగడ సాగించలేదు. “విద్యా వినీతో రాజా హి ప్రజనాం వినయేరత : అనన్యాం పృధివీం భుంక్తే సర్వ భూత హితే రత:” (పంచమాద్యాయం, ప్రథమ ప్రకరణం, -చాణిక్య అర్థ శాస్త్రం, పేజి_13) రాజు విద్యలలో శిక్షితుడై, సకల భూతములకు హితాన్ని చేయడంలో ఆసక్తి కల్గి ఉండాలి, ప్రజలకు శిక్షణ ఇవ్వడంలో శ్రద్ధ ఉన్న రాజు మరొక రాజు లేని రాజ్యాన్ని పరిపాలిస్తాడు. నైతిక బలము కల్గిన రాజు యొక్కసామ్రాజ్యం అచంచలమైన సిరి సంపదలతో అలరారుతుంది . కాబట్టి తనకు తాను ప్రేరణ పొందుతూ సర్వ భూతాలు తనకు హితాన్ని చేకూర్చేటట్లు ఆత్మ హితాన్ని కోరే సామ్రాట్ట్ నీతి శాస్త్ర అభ్యాసం చేయాలి. తద్వారా బలమైన రాజ్యాన్ని, జ్ఞానులైన అమాత్యులను పొందడం వలన  ప్రజాపాలనలో రంజిల్లుతాడు. అలాంటి రాజు బుద్ధి బలంచే తేజోరూపుడై పూర్వ జన్మ సుకృత తపోవిశేషాలతో కూడిన మహీమండలాన్ని అధిరోహించగలడు.

దర్శనీయంబైన దైవంబు భూపాలున్

డిహము వెలిగించు నినుడు విభుడు

చనవున బోషించు జనకుండు నృపమౌళి

తమిమీరనలరించు తల్లి ప్రభువు

గుణదోషముల దెల్పు గురుడు మహీంద్రుడ్ండు

హితముదెల్పెడి పురోహితుడు రాజు

మేలొనగూర్చు స న్మిత్రుడుర్వీశుండు

తలపులనీడేర్చు దాతనృపతి

మహిత మహిమాయుతుండు ప్రేమప్రపూర్ణు

డనుపమజ్ఞానసంపన్ను డత్త సుస్వ

భావకలితుండునగు నర పాలు డెగద

యవనిజనులకు నన్నియు నైనవాడ

(పేజి 4, నీతి ముక్తా వళి)

రాజు అనేవాడు రాజ్య ప్రజల చేత దర్శింపబడుతూ ప్రజలజీవితాలలో దీపాలు వెలిగించే విధంగా పాలనను కొనసాగించాలి. ప్రజలను తన కన్నబిడ్డల మాదిరిగా చూస్తూ సుఖ సంతోషాలను కల్గించాలి . ప్రజలలోని గుణదోషాలను రూపుమాపే గురువుగా మంచి చెడులను చూస్తూ ప్రజలలో మంచిని పెంపొందించాలి. ఆపదలు వచ్చినపుడు మిత్రునిగా ఆదరించాలి. ఈ విధంగా ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి అన్ని విధాల ప్రజలకు మంచి చేస్తూ సత్యపాలన అందించే వాడే రాజు అని నీతిశాస్త్ర ముక్తావళిలో మనకు కనిపిస్తుంది.

“సర్వేషామహింసా సత్యం శౌచమాన్సూయా అనృశంస్యం క్షమా చ /స్వధర్మం స్వర్గాయ అనన్తాయ చ. తస్యాతిక్రమే లోక: సంకరాదుచ్చిద్యేత  (తృతీయ అద్యాయ ,ప్రథమాధికరణం, చాణక్య అర్థ శాస్త్రం, పేజి_10) అహింస, సత్యం, మనోవాక్కాయాల శుచిత్వం, అసూయ లేకపోవడం, క్రూరత్వం లేకపోవడం, ఓర్పు అనేవి అందరికీ ధర్మాలే. స్వధర్మాన్ని ఆచరించడంవల్ల సర్వం అనంతమైన ఆనందానుభూతులతో శోభిల్లుతుంది. స్వధర్మాన్ని అతిక్రమిస్తే  సర్వలోకాలు నశిస్తాయి. అందువల్ల రాజు కానీ ప్రజల కానీ ఎవరూ స్వధర్మాన్నివిడవకుండా ఉండాలి. స్వధర్మం ఆచరించేవారు, ఇహలోకంలోనూ, పరలోకంలో (మరణానంతరం) కుడా సంతోషంతో ఉంటా రు.

తే: ధరణి ధేనువు బిదుకంగం దలచితేని

జనులం బోషింప మధిప వత్సముల మాడ్కి

జనులు పోషింపబడుచుండ జగతి కల్ప

లత తెఱుంగున సకల పలంబులొసగు

( పేజి- 56, శ్రీ ఏనుగు లక్ష్మణ కవి ,నీతి శతకం)

భూమి  అనెడి గోవు నుండి ధనమును పితుక తలచినట్లైతే ఆవుదూడను పోషించే విధంగా ప్రజలను రాజు పోషించాలి.  రాజు ప్రజలనుండి పన్నులు వసూలు చేసేటప్పుడు వారి ఆర్థిక పరిస్థితులు అంచనా వేసి తెల్సుకోవాలి. ఆవిధంగా వారికి ఆర్థిక పుష్టిని కల్గించి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తే   ఆ ప్రజలు కల్పవృక్షంలా సక్రమంగా కోరిన వాటిన్ననింటిని ఫలాలుగ ప్రసాదిస్తారు. “ఇంద్రియంబుల యోగి జయింప కాత్మ /కర్మములబద్ధుడై మోక్షగతిని జెంద /నటుల నింద్రియ వశ్య్డౌ యవనిపతియు /నాధిపత్యమువలనని రసుడగును” (పేజి . 18, ద్వితీయ అశ్వాసము,విదుర నీతి, పద్యం . 41) యోగులైన వారు ఇంద్రియాలన్నింటిని తమ నిష్టాగరిష్టలతో నిగ్రహించుకొని సర్వకర్మల యందు బద్దులై మోక్షాన్ని సాధించగలరు. అట్లుగాక ఇంద్రియాలకు దాసుడైన రాజు, వాని ఆధిపత్యమునుండి బయట పడక, నీరసుడై ప్రజలందరిచేత నిరసించ బడుతూ నశించిపోతాడు అది ఎలా అంటే “తద్విరుద్ధ వృత్తి రవశ్యేన్ద్రియ శ్చ తురన్తోవపి రాజా సద్యో వినశ్యతి/యధాదాణ్డక్యో నామ భోజ : కామాద్ బ్రాహ్మణ కన్యా మభి మన్య మాన్ :/ మానాద్రావణ : పరదారాన ప్రయచ్చన్,దుర్యోధనో రాజ్యాత్ అంశం చ” (తృతీయ ప్రకరణం, షష్టమాద్యాయం, చాణిక్య అర్థ శాస్త్రం, పేజి_14) శాస్త్రానికి  విరుద్దమైన ప్రవృత్తి కలవాడై ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేని రాజు నాలుగు దిక్కుల చివరి వరకు వ్యాపించిన రాజ్యం ఉన్న వాడైనా వెంటనే రాజ్యంతో పాటుగా నశిస్తాడు. దీనికి మన చరిత్రను ఒకసారి తరచి చూస్తే ఎందరో రాజుల జీవితాలు వారి పాలనా దృష్టాంతాలు మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి. ఏ విధంగా అంటే భోజ వంశానికి చెందిన దాంపక్యుడు కామం వల్ల బ్రాహ్మణ కన్యను అభిలషించి ఆమెను అపహరించి ఆమె తండ్రి శాపం చేత బంధువులతోను రాష్ట్రాన్ని నశింప చేసుకుంటాడు. అలాగే రావణుడు కామంతో కళ్ళు మూసుక పోయి సీతమ్మవారిని అపహరించి  రాముడిచే రాజ్యంతో సహా కాలగర్భంలో కలిసిపోతాడు. దుర్యోధనుడు అధికార దాహంతో, అహంకారంతో వ్యవహరించి నిండు సభలో ద్రౌపదిని అవమానించి పాండవుల వలన కురు వంశాన్నికురుక్షేత్ర సంగ్రామంలో  కూకటి వేళ్లతో కూల్చి వేసుకున్నాడు. రాజ్యం నడిబొడ్డున కన్యకను చెరపట్టబోయి అబాసుపాలై న రాజు చరిత్ర మనకు తెలుసు.

 

“సక్తం గ్రామ్యేషు భోగేషు  కామవృత్తం మహీపతిమ్ /లుబ్ధం న బాహుమన్యన్తే శ్మశానాగ్నిమివా ప్రజా:” (వాల్మీకి రామాయణం అరణ్య కాండ -33.3 పేజీ 112) హోమాగ్నిని అందరు పూజిస్తారు కానీ శ్మశానంలో ఉండే అగ్నిని ఎవరూ గౌరవించరు అలాగే రాజును అందరూ పూజిస్తారు కానీ దురాశా దుర్నీతితో కూడి నీచమైన భోగాలతో మునిగి తేలే రాజుని ఎవరు గౌరవించరని రామలక్ష్మణలచేత అవమానించబడ్డ ఆ శూర్పనఖ  తనవాళ్లను పట్టించుకోకుండా ఏమరు పాటు వహించి సుఖభోగాలలో లీనమైన  తన సోదరుడు  రావణుడిని ఉద్ధేశించి అంటుంది. “ఏతే చాన్యే చ బహవ : శత్రుషడ్వర్గమాశ్రితా :” (తృతీయ ప్రకరణం, షష్టమాద్యాయం, చాణిక్య అర్థ శాస్త్రం, పేజి_15) ఈ విధంగా ఎంతోమంది రాజులు ఇంద్రియాలను జయించక కామ ,క్రోధాలను వదలక,  అరిషడ్వర్గాన్ని ఆశ్రయించి బందు మిత్ర వర్గ సమేతంగ రాజ్యంతో సహా చరిత్రలో తుడిచి పెట్టుకొనిపోయారు. కనుక రాజు అనేవాడు ఆదర్శపురుషుడిగా  స్థితప్రజ్ఞుడిగా సమస్తలోకం చేత ఆరాధించబడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *