April 23, 2024

ఇంకా నేను బతికే వున్నాను..

రచన: కృష్ణ అశోక్

 

ashok painting

 

అవును ఇంకా నేను బతికే వున్నాను..

మనసు అగాధమంత

ఘాడంగా పూడుకుపోయింది

గుండె గొంతు మధ్య శూన్యం

చిక్కగా పేరుకుపోయింది…

అయినా ఇంకా నేను బతికే వున్నాను…

 

అందంగా రంగులద్దుకున్న తెల్లని కాన్వాస్

మసి పట్టి నిశి వర్ణం పులుముకుంది..

స్టాండ్ లోని కుంచెలన్నీ

వానపాముల్లా పొర్లుతున్నాయి..

అయినా ఇంకా నేను బతికే వున్నాను..

 

కమ్మని కల(ళ)ల ఆశలన్నీ

కాలిపోయి కాంతిహీనమైనాయి…

రెక్కలు తెగి పడివున్న ప్రాణం

దిక్కుతోచక నిశ్శబ్దంగా కుములుతుంది…

అయినా ఇంకా నేను బతికే వున్నాను…

 

శిశిర మాసపు ప్రేమ వెల్లువంతా

గ్రీష్మ తాపపు ఆవిరిలా మారింది..

కనుల చుట్టిన చల్లని వెన్నెలంతా

చీకటి సూదులై గుచ్చివేస్తుంది ..

అయినా ఇంకా నేను బతికే వున్నాను…

 

తుళ్ళింతలతో తడిచిన దేహం

నిర్జీవంతో ఘనీభవిస్తుంది…

మృత్యుగంటికల శబ్దం

పంచేంద్రియాలకీ వినిపిస్తోంది….

అయినా ఇంకా నేను బతికే వున్నాను…

 

బతుకు బండి గాడితప్పి

స్మశానం దిశగా దారి మళ్ళింది…

కాని.. జీవన నిశీధిలో ఎక్కడో దూరంగా

మిణుగురు పురుగులాంటి కాంతి పుంజం…

అందుకే.. అందుకే  ఇంకా నేను బతికి వున్నాను..!!

 

7 thoughts on “ఇంకా నేను బతికే వున్నాను..

  1. మీ కుంచె మట్టుగే అద్భుతాలను సృష్టిస్తుందని అనుకున్నాను….కాని మీ కలం కూడా గొప్ప అద్భుతాలను సృష్టించగలదని ఇప్పుడే తెలుసుకున్నాను……నాట్యం తప్ప అన్ని కలలలోను ప్రావీణ్యం సంపాదించారన్న మాట…

  2. గీతలు బాగున్నాయి……. రాతలు బాగున్నాయి……… అందుకే నువ్వింకా బతికే ఉన్నావు……. 🙂

    Jiyo L!FE Bindaaas……….<3

  3. చాలా కాలం తరువాత కలం నీ గీతలు నుండి మళ్లీ నీ రాతల వైపు మరల్చావు.నీ రాత బాగుంది అశోక్.

  4. “బతుకు బండి గాడితప్పి/ స్మశానం దిశగా దారి మళ్ళింది…/ కాని.. జీవన నిశీధి లో ఎక్కడో దూరంగా/ మిణుగురు పురుగు లాంటి కాంతి పుంజం…/ అందుకే.. అందుకే ఇంకా నేను బతికి వున్నాను..!!” అనే చివరి పంక్తులలో నైరాశ్యపు జీవన నిశీథిలో ఆశాకిరణానికి ప్రతీకయిన మిణుగురుని చోప్పించడంలో కవి ఒక చక్కటి సందేశాన్నిచ్చారు. భావ చిత్రాలను సరళమైన భాష శైలిలో ఆవిష్కరించారు. గుండే లోపలి పొరల్ని సున్నితంగా స్పృశించే కవిత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *