March 29, 2024

“చీర “ సొగసు చూడ తరమా??

చీర .. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడే భారతీయ సంప్రదాయపు వస్త్రాలంకరణ. వనితను నిలువెల్లా కప్పి ఆమెను దాచిపెట్టి, పెట్టకుండా మరింత అందంగా చూపిస్తుంది. ఈరోజుల్లో అమ్మాయిలు మరీ మాడర్న్ ఐపోవడంతో చీర కట్టడం  చాలా తగ్గించారు/ మానేసారు అని అంటారు కాని పెళ్ళిళ్లకు వెళ్లి చూడండి. రంగు రంగుల, తళుకు బెళుకుల చీర కట్టిన అమ్మాయిలతో కళకళలాడిపోతూ ఉంటుంది. నాడైనా, నేడైనా, భారతీయ వనితలకు మరింత వన్నె తెచ్చేది మేలైన చీర. ఎంత అభివృద్ధి చెందినా , ఎన్ని ఆధునిక వస్త్రధారణలైనా ఈ చీరకున్న గొప్పదనం చెక్కుచెదరనిది. అందుకే ఈ చీర అనే అంశం మీద పద్యాలు రాయమని అడగగానే వైవిధ్యమైన పద్యాలు అందించారు జె.కె.మోహనరావుగారు, ఆచార్య ఫణీంద్రగారు, డా.అనిల్ మాడుగులగారు, రవిగారు, టేకుమళ్ల వెంకట్ గారు. ఇక ఈ  పద్యాలను విశ్లేషించి అందమైన వ్యాఖ్యానంతోపాటు తనవంతు పద్యాలను ఇచ్చారు బ్నింగారు. ఈ అంశం చీర కు తగినట్టుగా చిత్రాన్ని ఇచ్చారు ఉదయ్ కుమార్ గారు,  పద్యాలను రాగయుక్తమైన శ్రవ్యకాలుగా మార్చి ఇచ్చారు పందిళ్ల శేఖర్ బాబుగారు. వీరందరికి మాలిక పత్రిక తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.

బ్నింగారు చివర్లో ఏదో విశేషం చెప్తున్నారు చూడండి. ఈ పద్యమంజరికి పని చేస్తూ చేస్తూ ఒక గొప్ప ఆలోచనకు పునాది వేసారు బ్నింగారు.. అదేంటో ఆయన మాటల్లోనే చదవండి..

అసలే అందమైన అమ్మాయి. మరింత అందమైన చీర కట్టుకుని హిమాలయ శిఖరాలవలె ఉన్నతంగా అలా నడిచివస్తుంటే, చుక్కలన్నీ రాలి ఆమె చీర కొంగులో ఒదిగిపోగా, మలయమారుతంలా ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే గుండె ఝల్లుమనదా మనసున్న మారాజుకి.. ఇక ఆ సొగసు చూడ ఎవరికైనా తరమా?

saree

 

జె.కె.మోహనరావు:

 

మిత్రులు శ్రీమతి రాజమ్మా సీతారామన్ ఒకప్పుడన్నారు  రాజస్థానములో స్త్రీలు రంగురంగుల వస్త్రాలను ధరిస్తారు, కాని అక్కడ ప్రకృతిలో ఒకే రంగు – మట్టి రంగు.  కాని కేరళలో ఎక్కడ చూచినా నిసర్గసుందరి పలు వన్నెలతో సింగారించుకొంటుంది.  కాని అక్కడి స్త్రీలు ఎక్కువగా తెల్లటి వస్త్రాలనే ధరిస్తారు.  ఆ భావాలను ప్రకటించే క్రింది పద్యాలకు స్ఫూర్తియైన రాజమ్మగారికి కృతజ్ఞతలు.

 

తేటగీతి

గగనమున చండ సూర్యుని – కఱకు కాంతి

చూడ గనులకు గనిపించు-చుండు రంగు

ఈ యెడారిలో నొకటియె – పాయకుండ

మట్టి యిసుకల రంగులే – చుట్టు చూడ

 

సీసము

ఆకాశ వర్ణమ్ము – లా కృష్ణు వర్ణమ్ము

కనిపించె చీరలో – గలికి గట్ట

ఆమని పుష్పాల – యందమౌ రంగులే

యొక యింతి వలువలో – నుద్భవించె

చెట్టుపై కొమ్మలో – జిలుకల వన్నెలో

వసనమున్ దొడిగె నా – వనజనయన

సూర్యకాంతి సుమాల – సొబగుల బెడగుతో

శోభించె నొక భామ – సొగసు మీఱ

 

ఆటవెలది

అది యెడారి భూమి – యైనను వనితలు

వివిధ వర్ణ వస్త్ర – నవత జూపి

మోద మలర నెంతొ – ముగ్ధలై పాడుచు

నృత్య మాడి రొక్క – వృత్తమందు

XXX

ఉత్పలమాల

 

దూరమునందు నీలముగ – దోచెను సంద్రము నింగి యొక్కటై

బారులు బారులై వఱలె – బచ్చగ నావనిలోన వృక్షముల్

దారులలో గనంబడె ను-దారముగా సుమవర్ణ మాలికల్

కేరళ రాజ్యమందు గన – కేళిక లాడె ననూహ్య వర్ణముల్

 

తేటగీతి

రంగురంగుల ప్రకృతిలో – రమణు లచట

పుష్ప వృత్తమ్ములన్ గూర్చి – ముదముతోడ

శ్వేతచేలమ్ము ధరియించి – చెలువ మలర

నాడి పాడిరి సుందర – యామమందు

 

మిత్రురాలి భావాన్ని పదబద్ధం చేసానని నిజాయితీగా, నిస్వార్ధంగా మొదటే చెప్పినందుకు తొలిజోత. గ్రంధ చౌర్యాల, భావ చౌర్యాల ప్రసిద్ధ ప్రబుద్ధుల కాలంలో మోహనరావుగారి  మిత్రవాత్సల్యం ఆశ్చర్యానందాలు కలిగించాయి.

ఇక పద్యనేపధ్యం…

రాజస్థాన్‌లో మండిపడుతున్న సూర్యుడి ఎండ పొడి భూమ్మీదకు వంపేస్తే ఎర్రమట్టి నేలలా ఇసుక మండుతుంది. అదంతా ఏకవర్ణమే. మరో రంగు కనిపించడానికి ఆస్కారం లేదు. ఓ వర్ణపుష్పాలా? ఓ వన్నెల రాచిలుకలా – ఓ నీలాశమా – ఓ శరత్ జ్యోత్స్ననా?  ఏమీ  ఉండవు… కానీ అదే.. ఆ నేలే.. బృందావనంలా మారిపోయే మాయ ఉంది. అక్కడ వనితలు వివిధ వర్ణాల వస్త్రాలు ధరించడంతో వసంతం వచ్చేసింది. అందుకే అక్కడే బృందావన ‘వృత్తకేళి’ జరిపించారు కవిగారు.

అదే అద్భుతం.. అందులో వర్ణబేధాలు మననెలా మభ్యపెట్టాయో  పద్యభాగం చెప్తుంది. నీలాకాశం రంగు ఓ కలికి కట్టింది. అంతే నీలమేఘశ్యాముడు వచ్చినట్లే అయింది. వసంత కుసుమాల చిత్రవిచిత్ర వర్ణాల వసనాలు ఓ వనిత కట్టుకుంది. ఆమె ఆమనిని ఆవిష్కరించింది. కొమ్మలో చిలుకల్లా ఒక ముద్దుగుమ్మ ఆకుపచ్చరంగు కోక చుట్టింది. పొద్దుతిరుగుడు పూవుల రంగు సింగారం ఇంకో పొలతి చీరై అమరి పొద్దునాపేసింది. ఇంక అది ఎడారి అవుగాక…        సు’వర్ణ’ వస్త్రసుందరీ బృందం ఆడుతూ పాడుతూ ఆనందకేళిలో అది అక్షరాలా బృందావనమైంది.

ఇంక అలాటి ‘వర్ణ’  వర్ణనే… ఇక్కడ నేపధ్యం అచ్చమైన పచ్చని కేరళ.. దూరంగా ‘నీలి’ సంద్రం ఆకాశంతో చెలిమి చేస్తోంది. వరసదేరిన పొడుగైన పచ్చని వృక్షాలు. అరటి చెట్లా? కొబ్బరి చెట్లా? ఇక పూలతోటలా దారిపొడుగూ ఉదారంగా ఉన్నాయి కేరళంతా/వర్ణకేళికే!!

అలాంటి రంగుల నేపధ్యంలో అద్భుతమైన ప్రకృతిలో స్త్రీ తన ఉనికిని కోల్పోకుండా చీర రంగు మార్చేసింది. కేరళాంగనలు తెల్లటి చీరల్తో (విస్సు, ఓనమ్ పండుగలలో) మల్లెల రాసుల్లా మెరిసిపోతుంటారు. అలా (“కాంట్రాస్ట్ కలర్”) వర్ణవైవిధ్యం చూపటంతో చూడటానికి వేయి కనులు కావాలిగా. అక్కడివారి ఆటపాటల్తో ప్రకృతి కాంత కూడా పులకించిపోతుంది.

 

రవి ENV

 

కం|| కలువల రాయని చందముఁ

వెలుగొందు వదనము నందు వెలితిఁ గొలుపఁగా

యలివేణులుఁ గట్టిరి కరి

వలువపు పేలిక. యమవస పౌర్ణమిఁ జొచ్చెన్!

 

ఉ|| జూచితినొక్క ముగ్ధనటు సొంపుగఁ గట్టినఁ గావి చీరనున్

జూచిన కొద్ది జూఁచితిని సోకగు ప్రౌఢల వెల్లచీరలన్

యోచన జేస్తి మధ్యనిటు ఊహలఁ శ్యామఁపు చీరయందునన్

రోచిలు కేతువై యెగసె రూపములున్మది మూడువన్నెలై.

 

సీ! ఆనాడు గృష్ణుడు అతివ ద్రౌపదివేడ

చీరలొసంగెను చేడె కపుడె

ముత్తైదు యువతికి ముదితలెవ్వరయిన

చీరె సారె లిడుట శ్రేష్ఠ సమము

వధువుకు చీరెలో వడికట్టు బియ్యము

మూటగా గట్టంగ ముద్దు గొలుపు

కొంగులు ముడి వేయ క్రొత్త దంపతులకు

చీర సాటికి వేరు చేర గలదె!

తేగీ! చీరె  యందాన్ని యొనగూర్చు యేరి కయిన.

దేవతలకైన జీరలు దెచ్చి కట్టి

సుందరాకార మొప్పొంగ సొగసు జేసి

పూజ జేయంగ పొందరె పుణ్య ఫలము.

 

ఉ.  కొప్పున మల్లె పూలు జెడ కుప్పెలు బంగరు పట్టు చీరె తో

చప్పుడు చేయుచున్ దిరుగు చాతురి! శోభలు జూడగన్! అహో!

చెప్పగ జాల యా పసిడి చీరె ధరించిన లేమసోయగం

బప్పుడు, చీరె గట్టు తమ భార్యల మెచ్చని భర్తలుందురే!


అవును కదా! చందమామలా వెలిగే సుందరీమణుల వదనాలకి నల్లగుడ్డలు  చుట్టబెడితే పున్నమిని అమావాస్య కప్పెట్టినంత నొప్పెడుతుంది.ఎందుకీ ఆచ్చాదన? రోమియోల “గ్రహణం” జరగకుండా పున్నమి చందమామని నల్లమూటలో దాస్తోందా సుందరీమణి. వీరు చీర అనేదాన్ని క్లాత్ అనే అర్ధంలో రాశారా?  ‘సొగసు చూడ తరమా?’  అంటే సొగసు దాచ నయమే… అనిపించింది కాబోలు.

ఇంకో పద్యంలో

ముగ్గురమ్మల చీరల మువ్వన్నెలు చూసి జాతీయపతాక స్ఫురణకి తెచ్చుకున్నారు.  మానవ కాంతకైనా, దేవతలకైనా కూడా వివిధ సందర్భాలలో చీరను ఇవ్వడం మన భారతీయ సంప్రదాయం.  ఇచ్చే చీరని దర్శింపజేస్తూ.. కవి రాతిబొమ్మకి రంగైన చీరలు కట్టి మొక్కులిడి వరాలు పొందేందుకు ‘ఓ చీర’ వాడారు. ‘చీర అందాన్ని యొనగూర్చుయేరికైన’ అన్నారు. అందం కన్నాముందు చెప్పిన కొంగులు ముడివెయ్యడానికి చీర ముద్దుగొలిపేదనీ, వడికట్టు బియ్యపు ‘సారె’కు చీర శ్రేష్టమైనదనీ చెప్పి,  ఆదిలో శ్రీకృష్ణుడు తన చెల్లెలు ద్రౌపదికి ఇచ్చిన చీర ఆమెను ఎంత కష్టం నుండి ఆదుకుందో జ్ఞాపకం చేశారు. కృష్ణుని వేడుకుంటే చీరలిచ్చాడుగానీ, ఇది వేడక్కర్లేకుండా చేయాల్సిన మానినీ మాన సంరక్షణ. ఏదేమైనా ఈ పద్యం ఈ గుత్తుల్లో వర్ణబాహుళ్యంగావున్న సీసం. ఇంకో పద్యంలో మల్లెలు గుప్పుమని ముక్కుకి, బంగరు చీర చప్పుళ్లతో చెవులకీ, ఇక ఆ చీర సోయగాలలో మెరిసిపోయే భార్యలని భర్తలు (రెండూ బహువచనమే గనక పర్వాలేదు) మెచ్చకుండా ఉందురా అని రసవత్తరంగా వర్ణించారు కవి. కాదని ఏ భర్తా వాదించగలడు మరీ??

 

 

టేకుమళ్ల వెంకటప్పయ్య:

 

తే.గీ! పసిడి రంగుల బూసలు బచ్చమణులు

ఇంపు సొంపుగ పుట్టించి కెంపులీను

వర్కు చీరల ధరియించు వనిత లిపుడు

అంద మొప్పార శోభల నందుకొనరె!

 

తే!గీ! ఎండలోతల వేడికి మండుచున్న

చీరె కొంగును తలపైన జేర్చవచ్చు

పిల్లవాడిని జంకన బిచ్చగాండ్రు

జారి పోకుండ గట్టరే చీరె తోడ.

 

తే!గీ! చీరలుయ్యాలలందున్న చిన్ని శిశువు

తల్లి జోలకు హాయిగ ఉల్లమలర

నిదుర బోయెడి బిడ్డడు నిముష మందె

చీరలుయ్యల సౌఖ్యంబు జెప్ప తరమె!

 

తే!గీ! పల్లెలందున కూలియై పడతి; చీరె

పమిట కొంగును ఉండగా అమర జేసి

శిరసు పైనుండి బరువును జేర్చి యపుడు

యెచటి కైనను ఓర్పుతో యేగు ననఘ!

 

తే!గీ! విడువలేకను బిడ్డల విధికి నొదలి

అత్తమామల భర్తను మొత్తమొదలి

తనువు జాలింప బాధల తాపమొంది

చీరె కురిపోసి యుసురును చేడి వదలు.

 

చీర చక్కదనాలకి వెండి జలతారు బంగారు ఝరీలు కుట్టుట, పట్టుచీరకి బరువు, పరువూ పెంచడం నాటి నవాబులు, నరపతులకాలం నుండి నేటి నటవారసుల వివాహవైభవాలకీ జరుగుతోంది. అది పట్టునుండి నైలాన్ షిఫాన్ దాకా ఎంత పెట్టుకుంటే అంత. ఎంత కుట్టుకుంటే అంతలా ‘వర్క్’ కొద్దీ వైభోగం పెరుగుతోంది. మొన్నో జూనియర్ నటుడికి పెళ్ళైతే ఆ నటుడి అభిమాని తన హీరోకి నిజ హీరోయిన్ అవుతున్న దొరసానికోసం నవరత్నాలు కుట్టించిన పట్టుచీర కానుక ఇచ్చాడట. మరి సామాన్య వనిత స్వార్జితంగా కొనుక్కున్న  చీరకి పూసలు, చెంకీలు,జరీలు (బంగారు రంగుదారాలు) కొండొకచో చిప్స్, అద్దాల బిళ్లలూ పెట్టి కుట్టు కుంటోంది..రంగులతో లతలూ, పువ్వులూ చిత్రించి వెల తక్కువైనా విలువ పెంచేలా కొత్త శోభలదిమి  ఆనందిస్తోంది.. కవిగారి మొదటి పద్యం ఈ శ్రమతో సాధించిన సొంపుల గురించి చెప్పారు. మరో పద్యం బిచ్చగత్తె చాలీచాలని చిరుగుల చీర చెరుగుని చంకలోనున్న పిల్లాడు జారకుండా  కట్టుకోవడాన్ని చిత్రంగా చూపించారు. అసలే మండే ఎండలో కొంతభాగాన్ని నెత్తిమీద వేసుకోవచ్చుగానీ ఆ తల్లి పిల్లవానికి రక్షణ చూపటానికి తన చీరని ఉట్టిలా చుట్టుకుని వాణ్ని దాన్లో కూచోబెట్టుకుంది.

తర్వాత పద్యం ‘ ఉయ్యాలా చీర’ ఇప్పుడు తగ్గాయి గానీ,  ప్రతీ ఇంట్లోనూ అమ్మమ్మ చీర …బుజ్జి మనవల గుడ్డ వుయ్యాలగా ఇంటి మధ్యలో అమరేది. ఓ మెత్తటి.. బుజ్జి బొంత వేసి దాంట్లో బజ్జోపెట్టిన బుజ్జ్జి బాబు ఏపాటి నలుగుడు, నొప్పులు రాకుండా మెత్తగా, వెచ్చగాఉండేది. పైగా ఆ  చీరవాసనకి పెద్దాళ్ళు తన పక్కనే ఉన్నట్టు నిశ్చింతగా నిద్రపోయేవాడు. ఆ దృశ్యాన్ని తల్లి జోలపాటతో ఊపి చూపి , చీర ఉయ్యాల సౌఖ్యం జ్ఞాపకం చేసారు కవిగారు.  ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు’ అన్న శ్రీశ్రీ వాక్యంలా ఓ శ్రామికురాలి చీర సౌందర్యానికి జోహారు చెప్తున్నట్లుగా స్మరిస్తున్నారు కవి. ఆ పల్లెటూరి కూలి మహిళ తన పైట చెరగుని ఉండగా చుట్టుకుని నెత్తిమీద పెట్టుకుంది. దాని మీద ఇటుకల తట్ట పెట్టనీయండి, ఇసుక, సిమెంట్‌ల గమేళా పెట్టమనండి. ఆమె తలకి చీరే శ్రీరామరక్ష, చెమటోడితే తుడుచుకోవడానికి కూడా ఆ చెంగు పురివిప్పి వస్తుంది. వీవెనై వీస్తుంది కదా… చీరా నీ జన్మకిదో చరితార్ధ క్షణం.

ఇంకో చీర: అత్తింట కష్టాల కడలిలో మునిగినా, ఆమె కన్నీరు తుడవలేని చీర, అత్తమామల, భర్త, ఆడపడుచుల బాధల్తో పొంగే కన్నెరుని అదమలేని చీర, ఆమెకి ఉరివేసుకోవడానికి ఉపయోగపడింది. ఆ చీర పొత్తిళ్లలోనే కళ్లు తెరిచిన బిడ్డల్ని కూడా వదిలేసి పొమ్మని ‘ఆమె’ని సాగనంపేసింది. అంత కరకు కాఠిన్యం ఎలా వచ్చిందో ఆ చీరకి… అర్ధంకాదుకానీ.. ఈ పద్యాల్లో తనదయిన తలో చరిత్రనీ చెప్పే ప్రయత్నం చేసిన కవిని అభినందించమంటోంది చీర..!.

 

 

 

డా.ఆచార్య ఫణీంద్ర

 

కం. తన కంటె పొడుగు చీరను

తన మేనికి చుట్టుకొనుచు, తన చేతులకున్

కొన లందక కలతపడెడి

చినతల్లిని జూచినంత – చిందవె నవ్వుల్!

(బాల్యంలో – హాస్య రసం)

 

ఆ.వె. వయసు వచ్చినట్టి పడుచు పిల్లల ‘ఓణి’

కొంగు నిలువదాయె కోర్కె లూర!

వచ్చు వాడెవండొ – వాని స్పర్శ  యదేమొ

కొంగు తడిమి చూపు పొంగులందు!

(యవ్వనంలో – శృంగార రసం)

 

ఉ. బొడ్డును తాకుచున్ నడుము మొత్తము గుండ్రముగాను చుట్టి, పై

గుడ్డను నేటవాలు కుచ కుంభ యుగంబును గప్పి పైటగా,

అడ్డముగా గలట్టి కడ యంచును కుచ్చిళు లట్లు చెక్క – ఆ

దొడ్డ విశేష వస్త్ర మిడదో తరుణీమణి కంద చందముల్!

(ప్రౌఢత్వంలో – శాంత రసం)

 

కం. తడి చీర పిండి, చలిలో

వడివడిగా మేన జుట్టి, వల్లించి ‘హరి’న్

తడబడ నడుగులు నడిచెడి

కడు ముదుసలి బామ్మను గన – కరుగు హృదయమే!

(వృద్ధాప్యంలో – కరుణా రసం)

 

నవరసాల్లో నాలుగు రసాలు మాత్రమే  చీరలో ముడెట్టి చూపారు రచయిత. నవరసాల చీర మరీ పొడుగైపోతుందనుకున్నారేమో? (మిత్రుడు తనికెళ్ళ భరణి ఇలాగే చీరని నవరసాల కవితావిష్కరణ (వచన కవిత) చేశారు). డా. ఆచార్య ఫణీంద్ర రాసిన నాలుగు పద్యాలు హృద్యంగా బొమ్మ కట్టాయి.

చిక్కులదారంలో చిక్కుకున్న చిన్న చీమ ఎలా గిలగిలలాడిపోతుందో కదా.. అలా తనకంటే చాలా రెట్లు పొడుగు(చీర – అమ్మకి కూడా పొడుగే) కట్టుకోవాలన్న బాల్య చేష్ట చదువుతుంటే ఊహల్లో వీడియో తిరుగాడటం ఖాయం. కందపద్యాల పరిధిని దాటి ఆ చలన చిత్రం మైమరపిస్తుంది . అద్భుతం..

ఇక శృంగార రసానికీ, చీరకీ వరస, సరసం జగద్విదితం. కానీ ఈయన ఓణీల పిల్లలతో ఆపేసేరేలనో.. మరి. పెనిమిటి శృంగారంలో కుచ్చిళ్ల మడతల్లో దాగిన కావ్యాలు ఒక్క పద్యానికైనా నోచుకోలేదేమో… మధ్యలో ‘శాంత’రసానికి ప్రౌఢనాయికకి సాదా చీర కట్టారు. నయం మదర్ థెరీసా నీలమంచు తెల్లచీరని చలువ చెయ్యలేదు.   ఇంక తడిపొడి చీరని చూసి మరే రసానికి చుట్టకుండా మడిగట్టిన (తడిబట్ట) వయసుకొడిగట్టిన ‘బామ్మని’ (చీరని కాదు) చూపించి కరుణరసాన్ని కన్పట్టే ప్రయత్నం చేశారు.

ఏతావాతా మొదటిపద్యంలో ముచ్చటగొల్పే బాల్యక్రీడ దగ్గర ఆఫ్ చేసినా బావుండేదేమో. తీసుకున్న నాలుగు రసాలు నీరసించిపోయాయి..

 

 

 

డా.అనిల్ మాడుగుల

 

చీరలు సుందరీమణుల సిగ్గునుదాచెడు మాత్రమౌనె , విం

దారగనిచ్చు కన్నులకు  తామరసాయతనేత్రులెల్లరున్

కోరికదీరజూడ , కులుకుల్ మితిమీర పసందుజేయు , మం

దారమరందమిచ్చిప్రమదమ్మునుగూర్చెడు వల్లభాలికిన్ II

 

కొంగును గప్పి బిడ్డలకు కోమలులాకలి దీర్చుచుందు రా

కొంగు యొకింత చింపుకొని గుప్పున పొంగెడు నెత్తురాపుచున్

సంగతి నొంద్రు , నూతిఁ బడి చచ్చెడు వారికినూతమివ్వగా

రంగమునందునుందురబలల్ , పతి చెమ్మట దుడ్చి  శ్రాంతి  పో

వంగుశలమ్మునందగ త్రపన్ తలపెట్టరు వందనీయలై II

 

రంగుల చీర యంగనల రాజసమొప్పగఁ జేయుచుండు , ను

త్సంగము జేరు తత్ప్రియుని దాహము దీర్పుచు సేదదీర్చు , వీ

రాంగనలైనచో నడుములన్ బిగబట్టి పరాక్రమంబు లె

స్సంగురిపించు , చీరలకు సాటి మరొక్కటున్నదే ?

 

చీర కట్టులోన సింగారమొలకించి

కొంగున ముడివైచికొనును పతిని

భారతీయ మహిళ ప్రజ్ఞాధురీణయై

చీరకట్టులోని సారమిదియె.

 

భారత యంగనామణి   శభాషని మెచ్చెడు సంప్రదాయమొ

ప్పారగ కుంకుమాంకిత శుభావహమౌ వదనారవిందయై

చీరనుగట్టి లక్ష్మి కళ జిల్కుచు కన్పడు నెల్లవారికిన్

గౌరవభావమున్ కరయుగమ్ములుమోడ్చి నమస్కరింపగన్ II

 

ధరించినవారికి ఒద్దికగా నిండుగా శోభిల్లే చీర, చూసేవారికి మాత్రం ముద్దుగా, కన్నులపండుగా కనిపిస్తుంది. చూసే కళ్లకి ఎర్రచీర కట్టిన స్త్రీలు లక్ష్మిదేవిలా కనిపించవచ్చు. ఎరుపూ చూసినా, ఎత్తుమడం చూసినా అంటూ పిచ్చెక్కి రెచ్చిపోయేలా చేయవచ్చు. చూపు పసందు జేయటాన్ని డా.అనిల్ మాడుగులగారు అభివర్ణిస్తున్నారు..  అలాగే పాలిచ్చే తల్లి బిడ్డడికి పైటనడ్డం పెట్టడం తన శరీరాన్ని కప్పుకోవడమే కాదు బిడ్డకి దిష్టి (దృష్టిదోషం) తగలకుండా తనపై ఆ దృష్టి పడదని ప్రతీ మాతృమూర్తికీ తెలుసు.

అలాగే తనకోసమే, తన షోకుల కోసమే చీర  సింగారించదట ఆ స్త్రీమూర్తి! ఈ కవిగారి కళ్లు వెతికి కలంచేత నీరాజనం పట్టించిన కొన్ని జీవన చిత్రాల్ని అక్షరీకరించారు. ఎవరికో, ఎక్కడో, ఎప్పుడో, గాయమై నెత్తురు జిమ్ముతుంటే ఆ గాయానికి కట్టుగుడ్డగా చెంగు చిరిగిన ముక్క సిద్ధమౌతుంది. ప్రమాదాల బావిలో పడ్డవారికి చీరందించి చేయూతనిస్తూ (ఊతమిస్తూ) ధన్యమవుతోంది చీర. అలాగే శ్రమించి వచ్చిన పతి చెమట తుడిచి సేద తీరుస్తుంది చీర చెరగు. రాజసాల రంగుల చీర, భర్తకి అనుకూలంగా, సరస కోమలంగా శోభిల్లుతుంది. అలాగే వీరశూర భర్తకి  అక్షరాలా అర్ధాంగి కనక తనూ సత్యభామలా నడుము బిగిస్తుందా సుందరి.

ఇలా రాస్తున్న కవిగారు సమాజంలో ఉన్న నానుడిని పద్యానికెత్తి చిన్న చమత్కారం చూపెట్టారు. “చీరకట్టులోన సింగారమొలకించి కొంగున ముడివైచికొను”ట “భారతీయ మహిళ ప్రజ్ఞాధురీణత” అన్నారు. వివాహంతో కొంగులు ముడిపడటం  మాత్రమే మన ఆచారం ..కానీ కొంగున ముడివేసుకోడం ..చమత్కారం మాత్రం..

ఏతావాతా నిండుగా చీర కట్టిన స్త్రీలో మాతృమూర్తి, మహాలక్ష్మి కూడా కనిపించి, నమస్కరింపరింపదగిన స్థాయిలో ఉంది. ఆ సంప్రదాయ సంరక్షణిని గౌరవించారు.

మరి చీర మీద ఇంతమంది ఇంతందంగా పద్యాలు రాస్తే నేను మాత్రం ఎలా ఊరకుండగలను. మీరే చెప్పండి. ఇవి నా వంతు..

 

బ్నిం కందాల్లో అందాలు

cartoon

 

శారీ బ్లౌజుల నడుమన

వేరే ఆచ్చాదనమ్మువేయక, మెరిసే

నారీ నడుముల మడతల్

వారెవ్వా చూపుచుండు వరములె చీరల్.

 

నేడీ మోడ్రన్ డ్రస్సులు

లేడీసుల గ్లామరంత ‘లెస్’ చేయుటకే

రౌడీల్లా పైటేయక

చూడే నా సొగసనంగ చూడరు జంట్సే.

 

జారే తీరే సూపరు

శారీ పైపల్లు కదల చక్కని సారే

వేరే టీషర్ట్ జీన్సుల

పోరీలను చూడలేరు పోకిర్లైనన్

 

దాయక దాచే సొగసుకి

సాయముగా సొంపులొలుకు శారీకన్నన్

సోయగము పెంచు కాస్ట్యూమ్

ఈయవనిన జూడగలమె యెచ్చోటైనన్

 

ఈ చీర మీద పద్యాలు రాయమంటే ఆచార్య ఫణీంద్ర, టేకుమల్ల వెంకటప్పయ్య, రవి, అనిల్ మాడుగుల, జె.కె.మోహనరావుగార్లు ఎంతో అందమైన పద్యాలు వివిధ అంశాలతో జోడించి రాసారు. కానీ ఈ పద్యాలను విశ్లేషించిన బ్నింగారు మాత్రం చీరను మరో కొంటెకోణంలో చూపించారు. ఎంతైనా బ్నింగారి స్టైలే వేరు కదా..  అందుకే  చీర అందాలను మరింత అందంగా కంద పద్యాలలో చూపించారు.

ఈ అబ్బాయిలున్నారే …  మరీ  కొంటెవారు.. శారీ, బ్లౌజుల మధ్య మెరిసే ఆ యింతి నడుము మడతలు  మామూలుగా కాక ఒక వరములా కనువిందు కలిగించడానికి తోడ్పడుతాయట చీరలు!  ఈనాడు అమ్మాయిలు ధరించే మాడ్రన్ డ్రెస్సులకన్నా చీరయే మరింత సొగసైనది. ఈ మాడర్న్ డ్రస్సులు ఆడవాళ్ల అందాన్ని తగ్గించడం మాత్రమే కాక, వాళ్లను రౌడీలలా చూపిస్తాయంటారు. అందమైన చీర కట్టుకున్న ఇంతి ముందుండగా కదులుతున్న ఆమె చీరకొంగును చూసి గుండె ఝల్లుమన్న పోకిరీలు టీషర్టు, జీన్సుల అమ్మాయిలను కన్నెత్తైనా చూడనంతగా మైమరచిపోతున్నారట. ఒంటినిండా కప్పే ఆరు గజాల చీర అతివ అందాలను దాచీ దాచకుండా, చూపి చూపకుండా ఆమె ఒంపుసొంపులను మరింత సోయగంగా చూపించే అద్భుతమైన కాస్ట్యూమ్ ఈ చీరకాక మరింకొకటి కలదా అని అంటున్నారు బ్నింగారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన సత్యమే కదా.. అందుకే అందీ అందని జాబిల్లి అంటారు ఇటువంటి వాళ్లని. ఇప్పటికైనా అబ్బాయిలు ఈ మాటలను మరోసారి తప్పక మననం చేసుకొంటారు.

జ్యోతి వలబోజు

ముక్తాయింపు:

 

పాఠక మిత్రులకి .. అందరికీ బ్నిమ్నాభివందనం..

నేను ఫెమినిస్టుని. కాదుగానీ.. ‘ఫెమిన్ ఇష్టున్ని’! అందుకే.. నాకు పెద్ద అపఖ్యాతి ఉంది. ఆడపిల్లల్తోనే స్నేహాలు ఎక్కువని 🙂 పూర్తిగా నిజం కాదు గానీ ఖచ్చితంగా అబద్ధం కూడా కాదు. అయితే నా ఫ్రెండ్సనబడే ఆడపిల్లలు మాత్రం మోడ్రన్ డ్రస్సులు వేస్కుని నా ముందుకు రావడానికి భయపడేలా మాత్రం నిక్కచ్చిగా చెప్పేస్తూ వుంటాను.

నాకు స్త్రీత్వంమ్మీద విపరీతమైన ఇష్టం, గౌరవం. అంతకుమించిన ప్రేమ. నేను అందాన్ని ఇష్టపడతాను. (తప్పేం లేదు. అది ఎస్తటిక్ సెన్స్.. అంతే!!) భయపడకుండా.. మరో దురుద్ధేశ్యం లేకుండా. వాళ్లని మెచ్చుకోవడానికి జంకను! (నొచ్చుకోకుండా) వాళ్లు ఎలాగయితే ఇంకా బాగుంటారో చెప్తాను. “మీరీ చీరలో బావున్నారండీ..” అని మరొకళ్లూ… వేరొకళ్లో అంటే “నీ కళ్లలో కారం కొడతారోయ్” అనే మంచి అమ్మాయిలు కూడా.. “ఈ చీర నాకు బావుంటుందా?” అని నన్నే అడిగేటంత చనువు ఇచ్చిన ‘మంచి ఫ్రెండ్’ లాగే మసలుకుంటాను. దటీజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఫ్రెండ్‌షిప్. ఎప్పుడయినా నేనే కోపపడతాను కానీ… ఆడఫ్రెండ్స్‌కి నా మీద ఎప్పుడూ కోపం రాకపోవడానికి నా జెంటిల్‌మెన్‌షిప్‌కి లేదా ‘గుడ్‌బాయ్’త్వానికి నిదర్శనం!!  అలాగని నేను సిస్టర్ లవ్వో, గురుపత్ని రెస్పెక్టో పెట్టుకుని, అలా అమ్మాయిల్ని క్యూలో రమ్మని దణ్నాలెట్టి పంపించెయ్యను. ఒక రాతి బొమ్మనో, అమ్మవార్నో, అమ్మగానో, చెల్లీ.. అక్కగానో చూసిన ఫీలింగ్‌తోనే ప్రతీ ఆడపిల్లని చూసినవాడే ‘గ్రేటా’ అని వాదిస్తాను.

పోతన తన భాగవతంలో ‘ప్రహ్లాదు’ని గురించి “కన్ను దోయికి అన్య కాంత లడ్డం బైన మాతృ భావము చేసి మరలువాడు” అని చెప్తాడు. 🙂 ఇంకెలా చూస్తాడుట ‘పంచశరద్వయస్కుడూ.. బాలుడు…!! (5 ఏళ్ల కుర్రకుంక) (సరే సరే… సందర్భం చీర నుంచి పారిపోయినట్లుంది. చీర కట్టిన చినదాన్ల గురించి పోతోంది. వదిలేసి చీరల దుకాణంలోకి వద్దాం. ఏతావాతా నాకు చీరలంటే ఇష్టం అని ‘జ్యోతి వలబోజు’ గారికి ఎలా తెలిసిందో గానీ.. పద్యాలు చదివి విశ్లేషించగలరా? అన్నారు. “గలనో.. లేనో.. చెప్తాను . పంపండి” అన్నాను. చూస్తే “చీర సొగసు చూడ తరమా?” శీర్షికతో కొన్ని పద్యాలు.

“ఆహా.. చీరల్.. చీరల్…చీరల్.. రాస్తానోకే” అనేశాను.

చీరల సెలక్షన్‌లాగే ఉంది. అంచు బావుంటే రంగు నచ్చదు. రెండూ బావుంటే బూటా లాంటి భావవైరుధ్యాలు!! కాంప్రమైజవ్వాలా అని భయం.. మళ్లీ చదివితే… మళ్లీ చూస్తే ‘మన బ్రైన్‌కి సింక్ అయినవే… గొప్పవి’ అనే సైకాలజీ పాయింట్లో చూడ్డం మానేస్తే… కొత్త అందాలు. కొత్త కోణాలూ కన్పించాయి. అంటే ‘ప్రిజుడీస్’ వదిలేస్తే మరింత సౌందర్యం ఆస్వాదించవచ్చని తెల్సొచ్చింది. పద్యాలు ఎంజాయ్ చేస్తూ వ్యాఖ్య రాశాను.

విశ్లేషణ, విమర్శలాంటివి చదువుకున్నవాళ్లు చేసే పని. నేను అలాటి పెద్ద పనులకు ఫిట్ కాను అని నాకు తెల్సు. సరే నాకు నచ్చిన అన్ని లైన్లూ, అర్ధమైన లైన్లూ, వదలకుండా వ్యాఖ్యానించుకున్నాను. మెచ్చుకోవడానికి ముచ్చటపడ్డాను.

ఒక చోట మొహమాట పడ్డాను. మొహం చాటేశానో.. జ్యోతిగారు మరోసారి మనసుపెట్టి రాయమని అన్నారు గానీ మనసుపడి రాయమని రూల్ పెట్టలేదు. అలా రాసేశాక. అయిపోయిందని  సంతృప్తి పడ్తుంటే.. మీరూ రాయాలన్నారు. అమ్మో ఇదొటా ‘పనిష్మెంట్’ అందును. కానీ.. ‘చీరమోజు’ నాకు మహా జాస్తి కదా!

టపటపా అయిదు పద్యాలు రాశాను. రెండింటీకి కొట్టివేత కూడా లేకుండా.. కుదిరాయి… చాలనుకుని పంపించేశాక కూడా ధారాపాతంగా భావాలు ముప్పిరిగొన్నాయి. భాష తన్నుకు రావట్లేదు కానీ… 20, ముప్ఫై పద్యాలు.. ఈ నా  పుట్టిన్రోజుకి (28 అక్టోబర్) 56 పద్యాలు రాసి అర్ధశతకం డి.టి.పి కాపీ రిలీజ్ చేస్తా.. తర్వాత శతకం చేసేయొచ్చు. ఇదీ ప్రస్తుతం ఆలోచన.

అదీ సంగతి. ఇక వందన సమర్పణ..

 

(ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిగారి గురించి మాత్రమే)

 

ఆవిడ గురించి నేను మొన్న రియలైజయిన నాలుగు వాక్యాలు చివ్వర్లో రాస్తాను గానీ.. నాకు ఏదో మహత్తర సంస్థ ఉంటే.. తానాలాంటి సంస్థ ఉంటే బృహత్తరంగా అభినందించాలని అనిపించింది. ఆవిడ చేస్తున్న బ్లాగులూ, రచనలూ, సేకరణలూ, ఇలా రెచ్చగొట్టి రాయించే ఉద్యమాలూ.. ఇవన్నీ చూస్తుంటే నా మట్టుకు నాకు ఇప్పుడు అర్జెంటుగా ప్రేమగా, గౌరవంగా, ఇష్టంగా ఇస్తున్న చిన్న బిరుదు ” పని రాక్షసి” ఆ బిరుదుకి చిన్న సన్మాన పత్రం ఈ క్రింది నాలుగు లైన్లు పాఠక మిత్రులు అంగీకరించెదరు గాక.

మీ బ్నిం

 Dragon-Frame1

 

18 thoughts on ““చీర “ సొగసు చూడ తరమా??

  1. జ్యోతి గారు ఏమి చేసినా వెరైటీ గానే ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పల్సిన పని లేదు. అయినా ప్రయత్నిస్తాను…

    తే!గీ! జ్యోతి బ్లాగుల వెలుగుల జోరె వేరు!
    విషయ మేదైన వివరించి విశద పరచి
    మనసు కానంద మిచ్చేటి మంచి ప్రఙ్ఞ
    బాట వేసేటి వనితరా! భావి కెపుడు!

    — టేకుమళ్ళ వెంకటప్పయ్య.

  2. బావుంది . ఐయ్తే సొగసు చూసే కళ్ళు నాకు లేనందుకు విచారించా . కుటుంబరావు గారి “పనిచేసే పక్షి ” గుర్తు కొచ్చింది

  3. .పద్యాలూ వ్యాఖ్యలు,జోలుకూ ఒకదానితో ఒకటిపోటీపడేలా ఉన్నాయి.చీరచిత్రం చాలా బావుంది.మంచి ఎంపిక , కొత్తగా దీపావళి తేజాన్ని నింపుకుంది ఈమాసం మాలిక అభినందల మందారమాల జ్యోతీ!

    తన కుమార్తె చీర కట్టగ
    తనరారెడి తండ్రిమనసు తన్మయ మొందన్
    మనసాగక వచ్చెపద్యము
    మన భాగ్యము పండెనేడు ఫణి పద్యముతో!
    ఊరికే సరదాకు ఆచార్యఫణీ!నాకు పద్య గణాలు తెలియవు. [తప్పులు తలచకండి దయచేసి .]

  4. జ్యోతి గారు!
    బ్నిం గారి విశ్లేషణ … వ్యాఖ్యానం … చదివి, నవ్వి ఊరుకొన్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *