June 24, 2024

Gausips – రక్తప్రసరణ వ్యవస్థ: రక్తపళ్ళెరాల (Blood Platelets) జన్యుసంబందిత లేదా ఇతరలోపాలు

రచన:  డా. జె. గౌతమి సత్యశ్రీ …  Ph.D  gauthami

 

 

 

 

 

 

రక్తము లేదా నెత్తురు ద్రవరూపంలో ఉన్న శరీరనిర్మాణ థాతువు లేదా ఒక కణజాలము. ఇది జీవి మనుగడకి ఎంతో అవసరం. రక్తానికి సంబంధించిన ఈ అధ్యయనాన్ని ‘హిమటాలజీ (hematology)’  అంటారు. రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎరుపు రంగు. రక్తానికి ఈ రంగునిచ్చేది ఒక ప్రోటీను. దానిని  హీమోగ్లోబిన్  (hemoglobin) అంటారు.  రక్తానికి మూలాధారం నీరు. రక్తంలో దాదాపుగా 80% నీరే. ద్రవ పదార్థాలన్నిటిలో నీటియొక్క విశిష్టతాపం (specific heat) ఎక్కువ. అందువల్ల నీరు నిలకడ మీద వేడెక్కుతుంది, నిలకడ మీద చల్లారుతుంది. అలాగే శరీరప్రక్రియల వల్ల పుట్టిన వేడిని రక్తంలోని నీరు పీల్చుకున్నపుడు, నీరు సలసలా మరగదు, చెమటపట్టి శరీరం చల్లబడినప్పుడు మంచుముక్కలా చల్లబడిపోదు. అందువల్ల రక్తం నిదానపు గుణం కలిగి ఉన్నది.

రక్తప్రసరణ వ్యవస్థ

రక్తాన్ని ఒక పరీక్షనాళంలో పోసి కాసేపు అలాఉంచితే మూడు భాగాలు (లేయర్స్) గా విడుతుంది. ఫై భాగం  ఎండుగడ్డిరంగులో, పారదర్శకంగా పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని ‘ప్లాస్మా (plasma)’ అంటారు. దీని దిగువున కొద్దిపాటి మందంలో తెల్లటి లేయరు ఒకటి కనిపిస్తుంది. దీనిని ‘తెల్ల రక్తకణాలు ‘ లేదా తెల్లకణాలు (white blood cells or white cell or leukocytes) అంటారు. ఇక నాళికలో అట్టడుగునఉన్న ఎర్రటి లేయరును ‘ఎర్ర రక్తకణాలు ‘ లేదా ఎర్రకణాలు (red blood cells or red cells or erythrocytes)అంటారు.

 

ఎర్ర రక్తకణాలు (erythrocytes): హీమోగ్లోబిన్ అనే ప్రోటీనును కలిగి ఉండడంవల్ల ఈ కణాలు ఎర్రగా ఉంటాయి. ఇవి గుండ్రంగా, ద్విపుటాకారంలో ఉంటాయి. ఇవి బోన్ మేరో (bone marrow) లో ఉత్పత్తి అవుతాయి. ఈ విధ మైన ఉత్పత్తిని ఎరిత్రోపొయిసిస్ (erythropoesis) అని అంటారు. ఇలా ఉత్పత్తి అయిన కణాలు సుమారు 120 రోజులు జీవిస్తాయి. ఒక మి.ల్లీ. రక్తం లో 450 నుండి 500 కోట్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఇవి ప్రాణ వాయువు (oxygen) ని శరీరమంతా రవాణా చేస్తాయి.

 

తెల్ల రక్తకణాలు (leukocytes): వీటిలో హీమోగ్లోబిన్ ఉండదు. అమీబా వంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఒక మి.ల్లీ. రక్తం లో 50 నుండి 90 లక్షల తెల్లరక్త కణాలు ఉంటాయి. లింఫ్ (Lymph)   కణాలలోను, ప్లీహం (Spleen) లోను ఉత్పత్తి అవుతాయి. వ్యాధులబారినుండి రక్షించడం వీటి విధి.

 

రక్తపళ్ళెరాలు (blood platelets): ఇవి రక్తకణాలతోనే కలసి ఉన్నా, బోన్ మేరోలోని మెగాకార్యోసైట్స్ కణాల నుండి ఉత్పన్నమవుతాయి. ఇవి ఒక మి.ల్లీ. రక్తం లో 150 నుండి 400 మిలియన్ల వరకు ఉంటాయి. వీటి జీవితకాలం 10 రోజులు మాత్రమే. ఇవి అవసరమైనప్పుడు అంటే మనకి దెబ్బ తగిలి ధమని (artery)  గాని, సిర (vein) గాని చిట్లి రక్తం స్రవించినప్పుడు ఆ భాగంపై, ఒక గడ్డ (clump) లా, ఒకదానితో ఒకటి అల్లుకుని (aggregation) రక్తస్రావాన్ని ఆపుతుంది. ఈ ప్రక్రియను రుధిరప్రతిబంధము మరియు రక్తంగడ్డకట్టుట (normal haemostasis and thrombosis) అని అంటారు. దీంట్లో మరికొన్ని రసాయన చర్యలు కూడా అదే సమయంలో జరుగుతాయి.  అయితే కొన్ని జన్యు (genes) లోపాల వల్ల మనుష్యులలో ఈ ప్రక్రియ లోపించి రక్తస్రావం లేదా ఆలశ్యంగా  రక్తం గడ్డకట్టటం జరుగుతుంది. ఈ జన్యులోపాలు ఉన్నవారు పైన దెబ్బతగిలితేనే కాదు, శరీరం లోపల కూడా అసాధారణమైన రక్తస్రావానికి (internal bruising or bleeding) గురి అవుతారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి.

 

ఈ రక్తపళ్ళెరాల జన్యుసంబంధిత వ్యాధులలో ముఖ్యమైనవి పళ్ళెరాల సంఖ్యాలోపం (low platelet count), అధిక సంఖ్యలో తయారీ కావడం (thrombocytosis) లేదా సంఖ్య కరెక్ట్ గా ఉన్నా, విధి నిర్వహణ లోపించడం (platelet dysfunction). సాధారణంగా కనబడే జన్యులోపం సంఖ్యాలోపం, తద్వారా వాటి విధినిర్వహణలో లోపం. దీనిని ‘థ్రాంబోసైటోపీనియా (thrombocytopenia)’ అని అంటారు.  ఈ సంఖ్యాలోపం జన్యు లోపాలవల్ల పళ్ళెరాల ఉత్పత్తి (platelet production) లో వఛ్చే తేడా. మరొక రకమైన లోపం, అసలు బోన్ మేరో లేదా బోన్ మేరో లో ఉన్న స్టెం సెల్ల్స్ (stem cells) కు హాని కలగడం. దీనివల్ల పైన వివరించబడిన రక్తవ్యవస్థలో మూడురకాల కణాల తయారీ కూడా దెబ్బతింటుంది. దీనిని  ‘ఏప్లాస్టిక్ ఎనీమియా (aplastic anemia)’ అని అంటారు. దీనివల్ల కూడా సంఖ్యా లోపం సంభవిస్తుంది. దీనికి తీసుకునే మందులుగాని, రేడియెషన్స్, ఇనఫెక్షన్స్ లేదా జన్యులోపాలు కారణం కావఛ్చు.

 

ఇతర లోపాల (జన్యుసంబంధంకానివి) వల్ల కూడా పళ్ళెరాల సంఖ్యాలోపం సంభవిస్తుంది. రక్తప్రవాహంలో స్వేచ్చగా తిరుగుతున్న పళ్ళెరాలకు, శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థే (immune system) ప్రతిరక్షకాలను (antibodies) తయారు చేస్తుంది. ఇవి పళ్ళెరాల పైన ఉన్న వ్యధీకరణాలు (antigens) కు bind అయి పళ్ళెరాలని నాశనం చేస్తాయి. దీనివల్ల ప్రవాహంలో పళ్ళెరాల సంఖ్య తగ్గిపొతుంది. ఈ వ్యాధిని ఇడియోపతిక్ థ్రోంబోసైటోపీనిక్ పర్ప్యూరా (ideopathic thrombocytopenic purpura, ITP) అంటారు. అలానే రక్తం గడ్డ కట్టునప్పుడు జరిగే మిగతా రసాయన చర్యలు (coagulation) అధికంగా జరుగడంవల్ల కూడా ఎక్కువ మోతాదులో పళ్ళెరాలు వినియోగింపబడి, ప్రవహంలో వాటి సంఖ్య తగ్గిపోతుంది. ప్లీహము (spleen) వ్యాధిగ్రస్తమైనప్పుడు లేదా పెరుగుదలకు లోనైప్పుడు, పళ్ళెరాలను ట్రాప్ (trap) చేస్తుంది. దీనివల్ల కూడా ప్రవాహంలో పళ్ళెరాల సంఖ్యతగ్గుతుంది.

రక్తం గడ్డకట్టటం

ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలను వెంటనే కనిపెట్టి,  ట్రీట్మెంటు జరుపవలెను. జన్యుసంబంధమైన మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన వ్యాధికి ‘రక్తమార్పిడి (blood transfusion)’ ద్వారా మార్పును తేవచ్చు. ITP కి కార్టికో స్టీరైడ్స్ ని ఇస్తూ ట్రీట్ చేయవచ్చు.  ప్లీహవ్యాధులకు ప్లీహాన్ని తీసివేయడం తప్ప మరొక దారి లేదు. ఈ వ్యాధితో బాధపడువారు బలమైన ఎక్సర్ సైజ్ లు, ఫుట్ బాల్, బాక్సింగ్ లాంటివాటికి దూరంగా ఉండాలి. అది internal bruising కు దారి తీయవచ్చు. ఆల్కహాలుకు స్వస్తి చెప్పాలి, అది పళ్ళెరాల తయారీ పై ప్రభావం చూపవచ్చు. యాస్పిరిన్, ఇబూప్రొఫెను లాంటి మందులను డాక్టర్ల సలహాపై మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే అవి పళ్ళెరాల function పై ప్రభావం చూపుతాయి. ఇవి తీసుకోవలసిన జాగ్రత్తలు.

 

 

4 thoughts on “Gausips – రక్తప్రసరణ వ్యవస్థ: రక్తపళ్ళెరాల (Blood Platelets) జన్యుసంబందిత లేదా ఇతరలోపాలు

  1. డా. గౌతమి గారికి ,
    రక్త ప్రసరణ మీదా రక్త కణాల మీదా రాసిన మీ వ్యాసం , ఇన్ఫర్మేటివ్ గానూ , ఉపయోగ పడే విధం గానూ ఉంది ! అభినందనలు !
    మీరు, మీ టపా కు Gausips అని పేరు ఎందుకు పెట్టారు ? కావాలనే స్పెల్లింగ్, మీ పేరు తో కలిసేట్టు పెట్టారా?
    గాసిప్స్ అనే అర్ధం స్ఫురించేట్టు గా పెట్టినా , gossips , అంటే , సీరియస్ గా కాక క్యాజువల్ గా , అంటే యదాలాపం గా
    చెప్పే మాటలు అనీ , ఆ మాటలు నిజం కానవసరం లేదనీ ! మరి మీరు రాసే టపాలు శాస్త్రీయమైనవే కదా ?
    డా. సుధాకర్.

    1. మీ అభినందనలకి థాంక్సండి. Coffee sips లాంటివి Gausips. అంటే coffee sips లాగ Gausips కూడా ‘a li’l at a time’. మరిన్ని ఉపయోగపడే వ్యాసాలతో ఈ Gausips column ప్రతి నెలా మీ ముందుకు వస్తుంది. ఇక మీ అందరి ఆదరాభిమానాలు అవసరం.

    2. మీ అభినందనలకి థాంక్సండి. Coffee sips లాంటివి Gausips. అంటే coffee sips లాగ Gausips కూడా ‘a li’l at a time’. మరిన్ని ఉపయోగపడే వ్యాసాలతో ఈ Gausips column ప్రతి నెలా మీ ముందుకు వస్తుంది. ఇక మీ అందరి ఆదరాభిమానాలు అవసరం.

  2. డా. గౌతమి గారికి ,
    రక్త ప్రసరణ మీదా రక్త కణాల మీదా రాసిన మీ వ్యాసం , ఇన్ఫర్మేటివ్ గానూ , ఉపయోగ పడే విధం గానూ ఉంది ! అభినందనలు !
    మీరు, మీ టపా కు Gausips అని పేరు ఎందుకు పెట్టారు ? కావాలనే స్పెల్లింగ్, మీ పేరు తో కలిసేట్టు పెట్టారా?
    గాసిప్స్ అనే అర్ధం స్ఫురించేట్టు గా పెట్టినా , gossips , అంటే , సీరియస్ గా కాక క్యాజువల్ గా , అంటే యదాలాపం గా
    చెప్పే మాటలు అనీ , ఆ మాటలు నిజం కానవసరం లేదనీ ! మరి మీరు రాసే టపాలు శాస్త్రీయమైనవే కదా ?
    డా. సుధాకర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *