June 19, 2024

సంపాదకీయం : పండగోయ్ పండగ!!!

IMG_3098

 

చీకటి వెలుగుల రంగేళి  జీవితమే ఒక దీపావళి అని ఒక సినీ కవి ఏనాడో చెప్పాడు. అది సినిమాకోసం రాసినదైనా ఎంత  సత్యం కదా. పండగలు అనగానే అందరికీ సంతోషమే. ఉన్నదాంట్లో ఇంటిని శుభ్రం చేసి అలంకరించుకుని , కొత్త బట్టలు, పిండివంటలు, పూజలతో ఆ పండగరోజులను కుటుంబ సభ్యులు, మిత్రులతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అలా  ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ఈసారి కొద్ది నెలలుగా జరుగుతున్న సంఘటనలేమి, పరిస్థితులేమీ పండగలన్నీ నీరసించిపోయాయనిపిస్తుంది. పండగలనే కాదు ఏ విషయమైనా కింది తరగతి వాళ్లకి, పై తరగతి వాళ్లకు ఏ గొడవా ఉండదు. లేనివాడు ఉంటే చేసుకుంటాడు లేకుంటే లేదు. ఉన్నవాడికి సమస్యే లేదు. కాని మధ్యతరగతివాడికి అన్ని విధాల అన్యాయమే జరుగుతుంది. అవునూ అనలేడు. వీలుకాదు వదిలేద్దాం అనలేడు. ఏదో విధంగా సర్దుకుపోయి, కిందా మీదా పడి పండగ జరుపుకోక తప్పదు.  రాకెట్టులా పైపైకి దూసుకుపోతున్న ధరలతో సామాన్యుడి నడ్డి విరుగుతుంది. బంగారం ప్రియమైందంటే తగ్గించుకోవచ్చు లేదా కొనకుండా ఉండవచ్చు కాని ప్రతీరోజు భోజనానికి అవసరమయ్యే ఉల్లిపాయ, టమాటాలు, కూరగాయలు, వంట గ్యాసు కూడా మంటలు పుట్టిస్తున్నాయి. ఏది కొనాలన్నా కొరివిలా మండుతున్నాయి. ఎక్కడ చూసిన దోపిడీ. ఆటోవాళ్లు నూటికి తొంభై శాతం మీటర్ మీద రానంటారు. సీజను, పండగలను, పూజల సమయాన్ని బట్టి పూలు, పండగ సామగ్రి అమ్మేవాళ్లు కూడా అమాంతం రేట్లు పెంచేస్తారు. ఇక బట్టల దుకాణల వాళ్లకు మాత్రం పండగలు వస్తున్నాయంటే  జాతరే జాతర. డిస్కౌంట్లు, ఆఫర్లు, ఉచిత బహుమతులు అంటూ కళ్ళు మెరిసేలాంటి,  హోరెత్తించే ప్రకటనలతో జనాలను రప్పించేసుకుని తమ పంట పండించుకుంటారు. గళ్ళాపెట్టిలు నింపేసుకుంటారు. మాకు బహుమతి రాకపోతుందా? ఎలాగు కొనాలనుకుంటున్నాం. అక్కడే కొంటే పోలా? అని పరిగెత్తుతారు. కాని ఆ షాపువాడికి అంత ఉదారబుద్ధి ఎందుకు కలిగిందో, తమ మీద అంత ప్రేమ ఎందుకో ఒక్కసారి ఆలోచించరు. పండగ ఐపోయాక అంతా మామూలే ..
దీపావళి పండగ సందర్భంగా  మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు చెప్పాలని ఉంది కాని కొద్ది రోజుల క్రింద జరిగిన బస్సు ప్రమాదం, నిన్న జరిగిన రైలు ప్రమాదం తలుచుకుంటే బాధగా ఉంది కాని తప్పదు కదా. ఏదీ మారదు. ఎవరూ మారరు. మనమే మారితే పోలా అనుకుంటూ ఈ దివ్య దీపావళిని కుటుంబసభ్యులతో , మిత్రులతో ఆనందంగా జరుపుకుందాం.
మాలిక పత్రిక తరఫున రచయితలకు, పాఠక మిత్రులకు వెలుగుల, తపాసుల పండగ శుభాకాంక్షలు..

శుభం భూయాత్..

2 thoughts on “సంపాదకీయం : పండగోయ్ పండగ!!!

  1. అలవాటుప్రకారం దీపావళి శుభాకాంక్షలు అన్నా మనస్సు ఎక్కడో ముల్గడం , పండుగకని బయల్దేరినవారు ఒక్క గంటలో చూస్తాం,అనుకున్నవారికి గుర్తుపట్టే అవకాశమేలేని విధంగా చూడనే అవకాశంలేకుండాపోయిన వారి మనోవేదన గుర్తురాకతప్పదు.ఐనా ఎవ్వరి ఆకలీ ఆగదుకదా! కాలమూ ఎవ్వరికోసమూ ఆగదుకదా! తప్పనిసరి పండుగ ఐనా టపాసులశబ్దం బాగానే వినిపొస్తోంది జ్యోతీ!మాబెంగుళూర్లోనూ.వాస్తవానికి అద్దంపట్టెలా ఉందమ్మా నీ సంపాదకీయం. శుభాకాంక్షలు.

    ఆదూరి.హైమవతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238