May 25, 2024

“కొంచెం ఇష్టం కొంచెం కష్టం”

komcem ishtam komcem kashtam srilalitha                              

సమీక్ష: జి.ఎస్.లక్ష్మి..

తెరచిన ఈ పుస్తకము నెప్పుడు

మూయవదేమని మా అమ్మ కసరగా

ఇదిగో చదవమని ఆ చేతుల పెట్టిన పొత్తము

వదలదు మాయమ్మ ముదము మొగమున మెరయన్..

నిజంగానే ఈ పుస్తకం ఒకసారి చేతిలో పట్టుకున్నామంటే మరింక వదలకుండా చదివేస్తాం. అంత శక్తి వుంది పొత్తూరి విజయలక్ష్మిగారు  రాసిన ఈ “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” పుస్తకానికి. హాస్యరసం రాయడం చాలా కష్టం. అంతటి కష్టాన్నీ యెంతో ఇష్టంగా మన ముందుకు తెచ్చేసారు ఆవిడ ఈ పుస్తకంలో.

పొత్తూరి విజయలక్ష్మిగారి గురించి చెప్పడమంటే సూర్యునికి దివిటీ చూపించినట్టే అవుతుంది. ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో హాస్యకథలు రాయగలిగినవారు యెవరంటే మొదట చెప్పుకొనేది ఆవిడ పేరే. అలా కథలే కాదు నేను కాలమ్స్ కూడా రాయగలను అని ఢంకా బజాయించి చెప్పినంత గట్టిగా ఆవిడ ఈ కాలమ్స్ రాసి పడేసారు.

ఆంధ్రభూమి పేపర్ తియ్యగానే నేనెంతో అభిమానించే రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మిగారి “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” కాలమ్ కోసం నాకళ్ళు చురుగ్గా వెదికేవి. చదువుతున్నంత సేపూ ఆవిడ వ్రాసినదంతా నాకే జరుగుతున్నట్టు అనిపించేది. నాకే కాదు ఆ కాలమ్ చదివిన ప్రతివారికీ అలాగే అనిపిస్తుంది. అసలు కాలమ్ వ్రాయడమే కత్తి మీద సాములాంటిది. రోజురోజుకూ మారిపోతున్న సమాజ నేపధ్యంలో అప్పటికి తాజాగా వుండే సబ్జెక్ట్ తీసుకోవడంలోనే రచయిత్రి గొప్పతనం తెలిసిపోతుంది. అసలు విజయలక్ష్మిగారు స్పృశించని సబ్జెక్ట్ ఈ కాలమ్స్ లో లేవనే చెప్పాలి.

సంఘటనలను సంఘటనలనుగానే చెపితే మరింక విజయలక్ష్మిగారి గొప్పేముంది? ఆవిడకున్న సహజ చమత్కార, వ్యంగ్య, హాస్య ధోరణిలో చదువుతున్నంతసేపూ పరిసరాలు మర్చిపోయేట్టు ఆవిడతోపాటు చెయ్యి పట్టుకుని మనల్నీ నవ్వుతూ నడిపించేస్తారు.

ఎవరిమీద వాళ్ళే జోకులేసుకోడానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పాటు విశాలహృదయం కూడా వుండాలి. ఇందులో ఆవిడ మీద ఆవిడే చెణుకులు విసురుకున్న విధానం చాలా ప్రత్యేకమైంది.

అడుగడుక్కీ మన నాయకులు నిలబెట్టే శిలావిగ్రహాలపై ఆవిడ వేసిన బాణం రామబాణమే. వాటికోసమై ఆవిడ యిచ్చిన పరిష్కారానికి పేటెంట్ రైట్స్ కూడా వదులుకున్న గొప్ప వ్యక్తి ఆవిడ.

స్వేఛ్ఛగా ఆడుతూ, పాడుతూ తిరిగే పిల్లలని టీవీల్లో పాడించడానికి పెద్దవాళ్ళు చేసే విఫల ప్రయత్నం తెలుసుకోవాలంటే విజయలక్ష్మిగారి వంశం గురించి తెలుసుకోవాల్సిందే.

ఇప్పటి సినిమాల పేర్లూ, కథాకమామీషూ మీకు కావాలంటే మీరు దేభ్యం మొహం వేసుకుని “దేభ్యం” కథ చదవాల్సిందే.

దేవుడు ప్రత్యక్షమవాలని అందరూ కోరుకుంటారు. అచ్చంగా దేవుడు ప్రత్యక్షమయ్యేడనుకోండి.. అప్పుడేమౌతుందో ఆవిడ మాటల్లో చదవాల్సిందే..

పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధించాలని అందరికీ తెలిసిందే. కాని ఆచరణలో అది ఎలా సాధ్యమో ఎంత గమ్మత్తుగా చెప్పారో చూడండి.

అవునూ.. మీలో ఎక్కాలు ఎంతమందికి గుర్తున్నాయీ? ఏదైనా సభలో వేదిక ఎక్కవలసిరావచ్చు. మర్చిపోతే గుర్తుచేసుకోమని ఎంత వ్యంగ్యంగా చెప్పారో…

చెత్తనుంచి కళాకృతులు చాలామందే చెయ్యొచ్చు కాని స్టోర్ రూం లోని పనికిరాని వస్తువులనుంచి డబ్బు రాబట్టడం ఎలాగో ఆవిడ చెప్పిన తీరు అద్భుతం.

ఇప్పటివరకూ అందరం స్థలాలూ, ఇళ్ళూ, తోటలూ కొనుక్కున్నాం. కాని ఎవరైనా నది కొనుక్కున్నారా.? కాని మన విజయలక్ష్మిగారు నది కొనుక్కుంటార్ట.  ఎలాగో, ఎందుకో మరి మీరు చదివి తీరాల్సిందే.

అన్నట్టు మన సంస్కృతి నిలబడ్డానికి చింతపండు పండుగ చేసుకోవాలని మీకు తెల్సా.. తెలీదు కదా.. మన విజయలక్ష్మిగారు చెప్పేస్తారు దాని మాట.

బహుమతులొస్తే సంతోషించాలి కానీ అదేవిటో విజయలక్ష్మిగారికి బహుమతులతో అన్నీ కష్టాలే. ఇది విడ్డూరం కాదూ..

సి ఎమ్ అయ్యేక మొట్టమొదటి సంతకం ఏ ఫైలు మీద పెట్టాలో మనం ఎప్పుడైనా ఆలోచించేమా.. మన విజయలక్ష్మిగారు ఆలోచించేసేరు. అదే ఆవిడ లో గొప్పతనం.

అన్నీమనకి తెలిసిన విషయాలే, రోజూ చూస్తున్న విషయాలే. కాని ఆలోచిస్తామా..

ఐదేళ్ళకోసారికాదు అస్తస్తమానం వచ్చే ఎన్నికలవల్ల బాధపడేదెవరూ..లాభపడేదెవరూ..

వడియాలు పెట్టడానికి ఎండ కూడా కావాలని తెలీని పరిస్థితి,

మారిపోతున్న పెళ్లిళ్లలో పధ్ధతులూ, కొత్తకొత్త వంటలూ, భద్రతాచర్యలూ, పిచ్చబొట్టులూ.. అయ్యబాబోయ్ నేనింక చెప్పలేను.

అంతదాకా యెందుకూ.. పండగపూట పుట్టింటికెళ్ళినప్పుడు అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ సాయంత్రం వీధిగుమ్మాల మీద కూర్చుని తమ మనసులోని మాటలని పంచుకుంటున్నంత ఆహ్లాదంగా వుంటుంది ఈ కాలమ్స్ చదువుతుంటే.

ఇలా అన్నీ నేను చెప్పేస్తే మీరు విజయలక్ష్మిగారి సహజమైన రచనాసౌందర్యం లోని ఆనందాన్ని కోల్పోతారు. అందుకే ఈ పుస్తకం చదవండి.. మరింక దీనిని వదలనే వదలరు.

శ్రీ రిషిక పబ్లికేషన్స్ ద్వారా వెలువడిన ఈ పుస్తకం ఖరీదు కేవలం నూట యిరవై రూపాయిలు మాత్రమే. కాని దానివల్ల పొందే ఆనందం మాత్రం అనంతమే..

 

 

5 thoughts on ““కొంచెం ఇష్టం కొంచెం కష్టం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *