April 22, 2024

సంభవం – 7

రచన: సూర్యదేవర రామ్మోహనరావు

suryadevaranovelist@gmail.comsuryadevara

http://www.suryadevararammohanrao.com/

 

ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన టాక్సీకి దారిలో ఎన్నో అవాంతరాలు.

దానిక్కారణం ర్యాలీ… జన సందోహం…

టాక్సీలో కూర్చున్న దిశకు నిజంగా గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నట్టుగా వుంది.

వెళ్ళాల్సింది ప్రైంమినిస్టర్ రెసిడెన్స్‌కి కాబట్టి అప్పటికీ టాక్సీ డ్రయివరు మెయిన్‌రోడ్లో కాకుండా సందుల్లోంచి టాక్సీని పోనిస్తున్నాడు.

వంటిమీద పడుతున్న చెమటను తుడుచుకుంటూ “ప్లీజ్… క్విక్క్… అర్జంట్…” హెచ్చరిస్తూనే వుంది టాక్సీ డ్రయివరుని దిశ.

ఆమె గొంతు తడారిపోయింది- అకస్మాత్తుగా కమ్మేస్తోన్న నీరసం.

వీటన్నిటికీ కారణం భరించలేని టెన్షన్… టెన్షన్….

ప్రధాని రెసిడెన్స్ యింకా మూడు కిలోమీటర్ల దూరంలో వుంది. ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రెడ్ సిగ్నల్ పడటంతో టాక్సీ సడన్‌గ ఆగిపోయింది.

 

*                            *                                  *                                  *

 

సరిగ్గా పన్నెండు నిమిషాలు గడిచాయి..

మీటింగ్ కోసం కంగారు కంగారుగా తయారవుతోంది భారతి. సడన్‌గా ఒక విషయం జ్ఞాపకం వచ్చిన ఆమె చిగురుటాకులా వణికిపోయింది.

ఆమెకు జ్ఞాపకమొచ్చిన విషయం రుషికుమార్ పదే పదే హెచ్చరించిన విషయాన్ని తను పూర్తిగా మరచిపోవడం.

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ని ప్రధానికివ్వడం తను మర్చిపోయింది.

వెంటనే తన రెసిడెన్స్‌లోంచి బయటికొచ్చి ప్రధాని రెసిడెన్స్ వైపు పరుగులు తీసింది.

ప్రధాని విశ్వంభరరావు పర్సనల్ రూంలో కుర్చీకి తగిలించి వున్న జాకెట్‌ను తీసుకుంది.

ఆ పక్కనే టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద దిశ రాసిన లెటరు రెపరెప లాడుతూ కన్పిస్తోంది.

దానివైపు చూడలేదు. ఉరుకులతో, పరుగులతో బయటికొచ్చింది. అప్పటికే కారు డ్రయివరు ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు.

గబగబా తనవైపు భారతి పరుగెత్తుకుని రావడంతో అతను కారు బ్యాక్ డోరుతీసి పట్టుకున్నాడు వెంటనే.

“క్విక్.. అర్జంటుగా మనం రెడ్‌పోర్టుకి వెళ్ళాలి” ఎక్కి కూర్చుని చెప్పిందామె.

మరో రెండు క్షణాల్లో మెయిన్ గేట్లోంచి బయటికి దూసుకుపోయిందా కారు.

 

*                            *                                  *                                  *

 

సరిగ్గా పన్నెండు గంటలయ్యింది…

ప్రధాని రెసిడెన్స్ మెయిన్ గేటు ముందు టాక్సీ ఆగింది. అందులో నుంచి దిగిన దిశ సెక్యూరిటీ గార్డు వైపు పరుగెత్తింది.

“అందర్ ప్రైంమినిస్టర్ హై?”

“నహీ… బడా సాబ్ రెడ్‌పోర్ట్‌కో చలేగయా.”

“భారతీ మేడం?”

“అభీ చలేగయా”

“ఎంతసేపైంది వెళ్ళి?”

“ఇప్పుడే… అయిదు నిమిషాలవుతుంది.”

గబుక్కున వెనక్కొచ్చి టాక్సీ ఎక్కింది దిశ. అప్పటికే అమె గుండె జారిపోయినట్లయ్యింది.

“రెడ్‌పోర్టుకి పోనీ.. అర్జంట్…క్విక్…”

టాక్సీ రెడ్‌పోర్టుకేసి దూసుకుపోయింది.

తను ప్రైమినిస్టర్‌ని పట్టుకోవడం అసాధ్యమేమో… కనీసం భారతి… లేదా రుషికుమార్…

అసలు వాళ్ళిద్దరూ ఎలా వుంటారో కూడా తనకు తెలీదు. దిశ మనసులో ఏదో భయం.

 

*                            *                                  *                                  *

 

సరిగ్గా 12.05 నిమిషాలు…

రెడ్‌ఫోర్ట్ ఏరియాకు ప్రధాని విశ్వంభరరావు కాన్వాయ్ చేరింది. కారులోంచి చిరునవ్వుతో దిగారాయన.

ఎడంపక్కన మహాసముద్రంలా జనసందోహం… కుడిపక్కన వరుసగా నుంచున్న కేబినెట్ మంత్రులు, పార్టీ ఆఫీసు బేరర్లు, రాష్ట్రనాయకులు, చీఫ్ మినిష్టరు, విదేశీ అతిధులు…

ఒక్కొక్కర్నీ విష్ చేస్తూ, వారు వేస్తున్న దండలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారాయన.

పార్టీ ప్రముఖులను దాటి విదేశీ గెస్టుల దగ్గరకొచ్చారు.

ఒక్కొక్కర్నీ విష్ చేస్తూ ముందుకు నడుస్తున్న ఆయన దగ్గరకు గబగబా వచ్చాడు రుషికుమార్.

“సార్! మీరు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడం మర్చిపోయారు” నెమ్మదిగా అన్నాడు.

చాల సీరియస్‌గా ప్రధాని తలతిప్పి రుషివైపు చూసి “ఐ నో దట్ మనం ఫారిన్ కంట్రీలో లేం… మన దేశంలోనే వున్నాం” తటాలున వచ్చిన కోపాన్ని నిగ్రహించుకుంటూ అన్నారాయన.

“సారీ సర్!” వెనక్కి తగ్గాడు రుషి. కానీ మనసులో ఏదో తెలీని ఆందోళన. మరోసారి తన స్టాఫ్‌ను ఎలర్ట్ చేయడానికి వైర్‌లెస్ సెట్‌ను అందుకున్నాడు.

12-25 నిమిషాలైంది…

ప్రధాని వేదిక వైపు అడుగులేస్తున్నారు. వేదిక అయిదు అడుగుల దూరంలో వుంది.

మిన్నంటుతున్న నినాదాలు.. లక్షలాది దేశ ప్రజ… మెట్లెక్కుతూ జయ జయ ధ్వానాలు చేస్తున్న జనం వైపు చూడగానే ఆయనలో కొత్త ఉత్సాహం ప్రవేశించింది.

గబగబా రెండేసి మెట్లను ఎక్కుతూ ఏదో విషయం జ్ఞాపకం రావడంతో ఒక్కసారి ఆగిపోయి దూరంగా డయాస్ క్రింద నుంచున్న తన మంత్రివర్య సహచరుల వైపు చూశారు.

వాళ్ళల్లో ప్రతాప్‌సింగ్, అర్జ్‌చౌహాన్ ఇద్దరూ లేరు. ఆ పాయింటు వెంటనే ఆయన మెదడులో రిజిస్టరై పోయింది.

వేదిక ఎక్కి కుడిచేతిని పైకెత్తిన డయాస్ అంతా కలయతిరుగుతూ ప్రజల్ని పలకరించారాయన.

విశ్వంభరరావు జిందాబాద్…

లాంగ్ లివ్ విశ్వంభరరావు.. లాంగ్ లివ్… పార్టీ… లాంగ్ లివ్ పార్టీ..

మరో రెండు నిమిషాల తర్వాత చిరునవ్వుతో మైక్ ముందుకొచ్చారు విశ్వంభరరావు.

 

*                            *                                  *                                  *

 

సరిగ్గా 12-30 నిమిషాలు…

వేదికకు యాభై అడుగుల దూరంలో వున్న ఫౌంటెన్ గోడలమీద జనం ఎక్కి కూర్చున్నారు. వాళ్ళందరూ రాజస్థాన్ గ్రామీణుల్లా రంగు రంగుల తలపాగాలతో ముచ్చటగా వున్నారు.

ఆ గోడ లోపల పిచ్చిమొక్కల మధ్య అయుదారుగురు వ్యక్తులు నుంచున్నారు.

ఆ వ్యక్తుల మధ్యలో రాజస్తాన్ గ్రామీణుడి వేషంలో వున శోభరాజ్ జేబులోంచి మారోబొరో సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్ తీసి, వెలిగించుకుని అగ్గిపుల్లను వూదేసి కిందపడేశాడు. ఆ ఆరిపోయిన అగ్గిపుల్ల పొడవుగా వుంది.

ఆ ఫౌంటెన్ గోడలమీద రాజస్తాన్ గ్రామీణుల వేషంలో కూర్చున్న వ్యక్తులందరూ శోభరాజ్ తెచ్చిన కిరాయి మనుషులే.

 

*                            *                                  *                                  *

 

“దేశవాసీయోం! నమస్తే!” ప్రధాని విశ్వంభరరావు కంఠంలోంచి మొట్టమొదటి మాట వినిపించింది.

సరిగ్గా అదే సమయానికి రెడ్‌ఫోర్ట్స్ ఎంట్రన్స్‌లో భారతి కారు ప్రవేశించడం, గబగబా కారుదిగి చేతిలోని ప్యాకెట్‌తో భారతి ముందుకు పరిగెత్తడం జరిగింది.

పరిగెడుతున్న భారతిని చూసి డి.ఐ.జి. ర్యాంక్ పోలిస్ అధికారి ముందుకొచ్చి…

“వాట్ మేడం! వాట్ హేపెండ్?’ అడిగాడు.

“వెరీజ్ రుషికుమార్?” వెంటనే దూరంగా డయాస్ వెనుక భాగములో హడావుడిగా తిరుగుతున్న రుషికుమార్ వైపు చేత్తో చూపించాడు. ముందుకు పరిగెతింది భారతి.

తన వేపు పరిగెత్తుకుని వస్తున్న భారతిని చూసి ముందుకడుగేశాడు. రుషి.

“రుషి! బుల్లెట్ ప్రూఫ్ జాకెట్…”

ఒక్కక్షణం భారతి ముఖంలోకి చూసి.. “కీప్ విత్ యూ… దీనవసరం ఇప్పుడు లేదనుకుంటా” చెప్పి ముందుకెళ్ళిపోయాడు రుషి అసహనంగా.

అతని ధోరణికి భారతి షాక్ తిన్నది.. అతనివైపు ఒక్కక్షణం ఆశ్చర్యంగా చూసి… వి.ఐ.పి. గ్యాలరీ వైపు పరిగెత్తింది భారతి.

 

*                            *                                  *                                  *

 

12-31 నిమిషాలు.

సరిగ్గా అదే సమయంలో టాక్సీలోంచి దిగి, రివ్వుమని ముందుకు పరిగెత్తి, తనను అడ్డుకోడానికి ముందుకొస్తున్న ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని అడిగింది దిశ.

“వేరిజ్ మిస్ భారతి.. అండ్ రుషికుమార్… చీఫ్ సెక్యూరిటి ఆఫీసర్?”

అప్పుడే వి.ఐ.పి. గ్యాలరీలోకెళుతున్న భారతిని, వేదిక మెట్ల దగ్గర నుంచున్న రుషికుమార్ని ఆ అఫీసరు చూపించగానే శరవేగంతో భారతివైపు పరుగుదీసింది దిశ.

పరుగు పరుగున వస్తున్న దిశను ఆపడానికి ఇద్దరు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నం చేసి, వాళ్ళను ఆమె పట్టించుకోకపోవడంతో ఆమె వెనుక వాళ్ళు పరిగెత్తడం ప్రారంభించారు.

“పకడో… పకడో…” ఒక బి.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ హిందీలో అరిచాడు.

ఆ అరుపుకి భారతి తలతిప్పి చూసింది.

అదే సమయంలో ఆమె ఎదుట నిలబడింది దిశ.

“మేడం… మీరేనా భారతి?”

“ఎస్!”

“మేడం! సరిగ్గా కొన్ని నిమిషాల్లో ఘోరమయిన హత్య జరగబోతోంది… ప్రైంమినిస్టర్ విశ్వంభరరావుని శతృవులు చంపడానికి సిద్ధంగా వున్నారు. ప్లీజ్… సేవ్… హిం… ఇమ్మీడియట్లీ.. ఆస్క్ హిమ్ టు గెట్ డవున్ ఫ్రం డయాస్…. ప్లీజ్… ప్లీజ్…” కళ్ళలో నీరు ఉబుకుతుండగా అంది దిశ.

వళ్ళంతా చెమట.. చెదిరిపోయిన జుట్టు… కంగారు, గాభరా.. అసలు ఎదురుగా వున్న వ్యక్తి ఏం చెప్తోందో అర్థం కాలేదు భారతికి.

“ఎవరు మీరు? మీకెలా తెలిసిందీ విషయం?” అంతవరకూ కూల్‌గా వున్న భారతిలో ఏదో తడబాటు.

“మేడం! దిసీజ్ నాట్ టైమ్ ఫర్ మి టూ టెల్ యూ…   ప్లీజ్ సేవ్ హిమ్… నన్ను నమ్మండి ప్లీజ్.”

భారతి రెండు చేతుల్నీ పట్టుకుని అభ్యర్ధించింది దిశ.

“ఎలా జరుగుతుంది ఆ మర్డర్?” నాలుగు వైపులా చూస్తూ, వేదిక దగ్గరున్న రుషి వైపు చూస్తూ అంది భారతి దిగ్భ్రాంతిగా.

“బుల్‌షిట్! మీలాంటి వాళ్ళు ఇలా ప్రశ్నల్తో టైం వేస్ట్ చేస్తారు కాబట్టే… రెడ్ టేపిజానికి మీరు స్లేవ్స్ అయిపోయారు కాబట్టే.. గొప్ప లీడర్స్‌ని మనం కోల్పోయాం… పోనీ మీకు చేతకాకపోతే.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు రుషికుమార్‌కి చెప్పండి.. ఇప్పుడు మీరు ఆలస్యం చేస్తే తర్వాత మీరే బాధపడతారు.”

ఆ చివరి వాక్యం భారతి బ్రెయిన్లో నాటుకుపోయింది.

“కమాన్… రండి… మీకొచ్చిన ఇన్ఫర్మేషన్‌ని రుషికుమార్‌కి చెప్పండి” అంటూ భారతి గబగబా ముందుకు పరెగెత్తింది… ఆ వెనుక ఆమెను దిశ అనుసరించింది.

 

*                            *                                  *                                  *

 

12-33 నిమిషాలు.

ప్రధాని విశ్వంభరరావు ఉపన్యాసంలో వేగం పెరిగింది.

“భారత ప్రభుత్వం ప్రారంభించిన అర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ఆర్ధిక వ్యవస్థ విజృంభిస్తోంది. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా రాజకీయమనేది సామాన్యుని మనుగడకు చేయూతనివ్వాలి… అదే నా ఆశయం… ఆ ఆశయం కోసం నేను చిత్తశుద్ధితో పనిచేస్తానని, నా గమ్యం నేను చేరడం కోసం అవసరమైతే నా రక్తం చిందించడానికయినా సిద్ధంగా వున్నానని నా దేశ ప్రజలకు మనవి చేస్తున్నాను.”

ప్రధాని ఆవేశ స్పూర్తికి ప్రజల జయజయ ధ్వానాలు తోడయ్యాయి.

సరిగ్గా అదే సమయంలో…

వేదికకు రెండొందల అడుగుల దూరంలో ఫౌంటెన్ మధ్యన నాలుగు వైపులా నిశితంగా చూస్తూ మారువేషంలో వున్న శోభరాజ్ చేతిలోని సిగరెట్‌ను కింద పడేశాడు.

నెమ్మదిగా కిందకు వంగాడు…

దిశ గబగబా చెప్పుకుపోతోంది… ఆమెవైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఆమె చెప్పింది వింటున్నాడు రుషికుమార్.

“తిరుపతి నుంచి మీకు, భారతిగారికీ ఫోన్ చేశాను. భారతిగారికి ఇవాళ జరగనున్న ఘోరప్రమాదం గురించి ముందుగా హెచ్చరించాను- అయినా అవిడ పట్తించుకోలేదు.. మీకు ఫోను చేస్తే మీరు నాకు దొరకలేదు… ఈ ప్రమాదం గురించి ప్రధానిగారికి కూడ లెటరు రాసి హెచ్చరించాను.. అయినా ఫలితం లేకపోయింది… అందుకే.. తిరుపతి నుంచి వచ్చాను… బిలీవ్ మి సార్… అండ్ ప్లీజ్ సేవ్ హిమ్… అండ్ నెససరీ రియక్షన్…. ఇమ్మీడియట్లీ…”

దిశ గొంతు ఎందుకో పూడుకుపోయింది. మరి ఆమె మాట్లాడలేక పోయింది.

“ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది?” రుషికుమార్ సిక్స్త్‌సెన్స్ ఒకపక్క హెచ్చరిస్తోంది.. అతను చదివిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మిగతా కీలకమైన సమాచారం ఒక్కసారి గుర్తుకొచ్చింది.

“డోంట్ ఎక్సయిట్… మేడమ్… ఐవిల్ టెక్ మోర్ కేర్” అని వేగంగా వేదికకేసి దూసుకుపోయాడు రుషి.

అదే సమయంలో ఆకాశంలోంచి హెలికాప్టర్లలో పార్టీ వ్యక్తులు కురిపిస్తున్న గులాబీరేకుల వర్షం ప్రారంభమైంది.

రుషికుమార్ వేదిక మీదకు వెళ్ళాలంటే ఇంకో అయిదు మెట్లెక్కితే చాలు.

12.35 నిమిషాలు…

ఫౌంటెన్లో కిందకు వంగిన శోభరాజ్ పిచ్చి మొక్కల అడుగు నుంచి రివాల్వర్ని తీశాడు.

దాని రేంజ్ మూడోందల అడుగులు… ప్రధాని వున్నది రెండొందల అడుగుల దూరంలో మాత్రమే.

నెమ్మదిగా లేచి నిలబడ్దాడు…

నాలుగువైపులా చూశాడు… ఎవరూ తనవైపు చూడడం లేదు.. చూసినా తన చుట్టూ తన మనషులే.

ఫ్రెండ్స్! ఇటు నేను రివాల్వరు పేల్చడం, అటు మీరు బాంబులు విసురుతూ పరిగెత్తడం ఒకేసారి జరగాలి.

దాని తాలూకూ సడన్ షాక్‌లోంచి అధికారులు మేల్కోనేసరికి పదినిమిషాలు పడుతుంది… ఈ లోపల మనం ఎక్కడుండాలో అక్కడుంటాం” నెమ్మదిగా చెప్పాడు శోభరాజ్.

అతని కుడిచేయి చూపుడువేలు ట్రిగ్గర్ మీద కెళ్ళింది.

మరొక సెకనులో…

ఆ పవర్‌వుల్ వెపన్‌లోంచి బుల్లెట్లు డైరెక్టుగా వేదికవైపు దూసుకెళ్ళడం ప్రారంభించాయి.

అదే సమయంలో లక్షలాది జనం మధ్య బాంబులు… బాంబులు…

ధన్… ధన్… ధన్… ధన్…

దిక్కులు పిక్కటిలేల్లా శబ్దం. ఎక్కడ ఏం జరుగుతోందో తెలీని జనం…

లక్షలాది జనం…

ఒక్కసారిగా లేచిపోయి పరుగెత్తడం ప్రారంబించారు.

తొక్కిసలాట…

సరిగా అదే సమయంలో..

ప్రధాని విశ్వంభరరావు గుండెకు ఎడం పక్కనుంచి బుల్లెట్లు దూసుకు పోవడం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

అకస్మాత్తుగా భూకంపం వచ్చినట్టుగా అయిపోయింది పరిస్థితి

బుల్లెట్లు విశ్వంభరరావువైపు దూసుకొస్తున్న సమయంలో అక్కడే అయనకు కొంచెం దూరంలో నుంచున్నాడు రుషికుమార్…

మొదట్లో బుల్లెట్ దూసుకు రాగానే పెద్దకేక వేసి విశ్వంభరరావు పక్కకు ఒరగడంతో ముందుకు పరిగెత్తాడు రుషి..

సరిగా అప్పుడే రెండో బుల్లెట్ తగిలింది. మూడో బుల్లెట్ ఆయన్ని రక్షించడానికి ముందుకెళ్ళిన రుషికుమార్‌కి తగిలింది..

నాలుగోది బుల్లెట్ కాదు, బాంబు…వేదిక మెట్లమీద పడిన బాంబు, కొద్ది సెకన్లలో విస్పోటనం చెందడంతో వేదికమీదున్న బ్యాక్ కాట్ కమెండోలతో సహా తుళ్ళిపోయారు..

ప్రధాని విశ్వంభరరావు, రుషికుమార్ ఎగిరిపోయి విశాలమైన వేదిక కుడి పక్కన చివరి భాగంలో పడిపోయారు.

కిందపడిన రుషికుమార్ స్ప్రింగ్‌లా లేచి నిలబడాడు.

అప్పటికే రక్తపు ముద్దలా కొనవూపిరితో వున్నారు ప్రధాని విశ్వంభరరావు.

 

*                            *                                  *                                  *

 

భారతి పెనుకేక వేసి ముందుకు పరిగెత్తింది.

అప్పటికే బ్యాక్ కాట్ కమెండోలు వేదికను రౌండప్ చేసేశారు.

సిద్ధంగా వున్న అంబులెన్స్‌లు వరుసగా వచ్చాయి.

తీవ్రంగా గాయపడిన ప్రధాని విశ్వంభారావుని తీసుకుని క్షణకాలంలో అవి అక్కడినుంచి మాయమైపోయాయి.

అంతా.. అంతా.. లక్షలాదిమంది చూస్తుండగానే కొద్దిక్షణాల్లో జరిగి పోయింది.

అది చూస్తూనే దిశ కుప్పలా కూలిపోయింది.

దిశ పక్కనే వున్న క్రయోనిక్స్ ఎక్స్‌పర్ట్ డా!!నవనీత్ వెంటనే ఎలర్టయి పోయాడు.

 

*                            *                                  *                                  *

 

సరిగ్గా యిరవై నిమిషాల తర్వాత…

రెడ్‌ఫోర్ట్ ఏరియా మైదానం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఎటు చూస్తే అటు పోలీసు.. కొంతమంది పార్టీ నాయకులు..

రుషికుమార్‌కి అంతా అనూహ్యంగా వుంది.

ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ హాస్పిటల్‌కి ప్రధానితో పాటు అంబులెన్స్‌లో వెళ్ళి, ఇంటెన్సివ్‌కేర్ యూనిట్లోకి ఆయనను తీసికెళ్ళాక…

తనకి ఫస్ట్ ఎయిడ్ జరిగాక, మళ్ళీ వెనక్కి వచ్చాడు రుషికుమారు.

ఢిల్లీ అంతా రెండ్ ఎలర్ట్ ప్రకటించారు.

పార్టీ నాయకుడయిన ప్రధాని మీద మర్డర్ ఎటెంప్ట్ జరగడంతో, క్షణాల్లో ఢిల్లీ రణరంగంలా మారిపోయింది.

అల్లర్లు, లూటీలు, బస్సుల్ని తగలేట్టెయ్యడం, ప్రతిపక్ష నాయకుల ఆస్తులమీద అధికార పార్టీ యువజన సభ్యుల దాడులు..

అదొక విలయకాండ.. విధ్వాంసకాండ…

క్షణక్షణం పెరుగుతున్న బీభత్సకాండ…

కర్ఫ్యూ.. కర్ఫ్యూ… కర్ఫ్యూ… ఒక్క ఢిల్లీలోనే కాకుండా, వివిధ రాష్త్రాల రాజధానుల్లో, ముఖ్య నగరాల్లో పరిస్థితి కూడా అలాగే వుంది.

దేశం అట్టుడికిపోతోంది.

“ప్రధానినెవరో చంపేశారు…”

పుకార్లో, నిజమో ఎవరికీ తెలీదు. న్యూస్ పేపర్స్ ఆఫీసులకు, టి.వి. కేంద్రాలకు న్యూస్ ఏజెన్సీలకు ఫోన్లమీద ఫోన్లు…

“ప్రధాని చనిపోయారట నిజమేనా?” ప్రశ్నలు… ప్రశ్నలు… ప్రశ్నలు…

“తెలీదు… తెలీదు… తెలీదు…”

సరిగ్గా అదే సమయంలో…

ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఇన్సిట్యూట్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రధాని…

కోమాలో వున్నారు.

బి.ఎస్.ఎఫ్ అప్పటికే ఆ హాస్పిటల్‌లో పోలీసుల అష్ట దిగ్బంధనంలో వుంది.

 

*                            *                                  *                                  *

 

సరిగ్గా రెండు గంటల తర్వాత…

ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు ఆనుకుని వున్న స్పెషల్ రూమ్‌లో భారతి కన్నీళ్ళతో కూర్చుని వుంది.

ఆమెకు కొంచెం దూరంలో దిశ, ఆ పక్కన నవనీత్.

ప్రతి పదినిమిషాలకు, ప్రధాని పరిస్థితిని డాక్టర్లు భారతికి ఇన్‌ఫామ్ చేస్తున్నారు.

పొంగుకొస్తున్న దుఃఖాన్ని శతవిధాలా కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నిస్తోందామె.

నెమ్మదిగా దిశవైపు నడిచిందామె.

“మీరు తిరుపతి నుంచి నాతో ఫోన్లో మాట్లాడారా?” అంత దుఃఖంలోనూ.. ఆమె ప్రశ్నకు విస్తుపోయి చూసింది దిశ.

“ఎస్ మేడమ్…!” జరిగిందంతా చెప్పింది దిశ.

ఆ సమయంలో భారతికి గుర్తుకొచ్చిన వ్యక్తి రమానాయరు.  ఆమె గత రెండు రోజులుగా లీవ్‌లో వుంది.

మొట్టమొదటిసారి భారతి బ్రెయిన్‌లో విశ్వంభరరావు మర్డర్ ఎటెంప్ట్ వెనక ఏదో కుట్ర వుండొచ్చునన్న అనుమాన బీజం పడింది.

దానికి కారణాలు విశ్లేషించగలిగే పరిస్థితిలో మాత్రం ఆమె లేదు.

“మీరెక్కడ వర్క్ చేస్తున్నారు?” అడిగింది భారతి.

“క్రయోనిక్స్ సంస్థలో…”

“అంటే?!”

చెప్పింది దిశ అలాంటి సంస్థ ఇండియాలో ఉందంటే ఆశ్చర్య పోయిందామె.

ఆ సంస్థ తలకోన కొండల్లో వున్న విషయం బహుశా ప్రధానికి తెలిసే వుండొచ్చు.”

“మీకెలా తెల్సు?”

ఒకసారి దిశకు ఏదో సందర్బంలో సవ్యసాచి ఆ విషయాన్ని చెప్పాడు.

ప్రధాని కాబట్టి…” అంతకంటే ఎక్కువ చెప్పలేకపోయింది దిశ రూల్స్ ప్రకారం చెప్పకూడదు కనుక.

 

*                            *                                  *                                  *

 

సరిగ్గా ఆ సమయంలో లోనికొచ్చాడు రుషికుమార్. అతని చాలా అసహనంగా వున్నాడు. రుషిని చూస్తూనే భారతి ఒక్కసారి బావురుమంది.

భారతిని సముదాయించటానికి రుషికి చాలా కష్టమైంది.

ఒకపక్క దేశప్రధాని చావు బ్రతుకుల్లో ఉండగా, ఇంకోపక్క ఆయన చనిపోయారని పుకార్లు లేవదీశారు. వేరొకపక్క ప్రతాప్‌సింగ్, అర్జున్ చౌహాన్ ఆధ్వర్యంలో పార్టీ పాలిట్‌బ్యూర్ సభ్యుల సభ జరగబోతోందట.. అంటే.. కొత్త నాయకుని ఎన్నికకు రంగం సిద్ధమైపోతోంది.. సో…

“నేనారోజే అంకుల్‌ని ఎలర్ట్ చేశాను. వాళ్ళిద్దర్నీ తక్కువగా అంచనా వేయొద్దని.. చూడు.. ఇప్పుడేమైందో.. అంటే.. దిసీజ్ ఎ పర్‌ఫెక్ట్ ప్లాన్ ఫర్ మర్డర్… ” అతనిలోని ఆవేశాన్ని ఎప్పుడూ చూడలేదు భారతి.

నిస్తేజంగా వున్న అతని ముఖం వైపు చూసింది భారతి.

“అంకుల్‌కి ఎలా వుంది?” నెమ్మదిగా అడిగిందామె. కన్నీళ్ళు తుడుచుకుంటూ.

జవాబు చెప్పలేదు రుషికుమార్.

అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నారు రుషి.

“అప్పటికీ ఈ అంతర్గత శత్రువుల గురించి ఎన్నోసార్లు హెచ్చరించాను. ఈ సోకాల్డ్ జాకాల్స్ అందర్నీ.. జైల్లో పడేయమని… వినలేదు. చూడు… ఆయన మంచితనం ఎంతవరకు తెచ్చిందో” అతని పిడికిలి బిగుసుకుంది. అతని నుదుట కండరాల్లో వేడిగా రక్తం ప్రవహిస్తోంది. దిశ వైపు నడిచి, ఆమె కళ్ళల్లోకి చూస్తూ…

“ఎక్కడో తిరుపతిలో వున్న ఈమెకు ప్రధాని మర్డర్ ఎటెంప్ట్ గురించి తెలిసింది. ఆ ఇన్‌ఫర్మేషన్ని మనకు అందజేయడం కోసం ఆమె నీకు ఫోను చేసింది… నాకు ఫోను చేసింది. ఆమెకున్న సిన్సియార్టీ మనకు లేదు. ఉయార్ వేస్ట్… విశ్వంభరరావుగారు ఈ దేశానికి ప్రధాని కావచ్చు… నీకు నాకు కాదు. పక్కనే వున్నా మనం ఆయన్ని చుట్టుముడుతున్న ప్రమాదాన్ని పసికట్టలేకపోయాం. షీర్ ఇనోసెన్స్.. డామిట్” తనలో తనే విసుక్కుంటున్నాడు రుషికుమార్.

అతనా సమయంలో ఫటిల్లుమని పేలిపోడానికి సిద్దంగా ఉన్న లావాలా వున్నాడు.

“ఆయన ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరగాలి. అప్పుడు.. అప్పుడు… ఈ రుషికుమార్ అసలు స్వరూపం ఆ జాకాల్స్‌కి రుచి చూపిస్తాను. ఏ పవర్ కోసం వాళ్లు ఈ దుర్మార్గం తలపెట్టారో, ఆ పవర్ వాళ్లకు దక్కకుండా చేస్తాను. పార్లమెంటు ఎదుట వాళ్ళని సజీవంగా తగలెట్టేస్తాను” అతను పట్టలేని ఉద్రేకంతో వూగిపోతున్నాడు.

సరిగ్గా అదే సమయంలో…

ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోంచి ఓ స్పెషలిస్ట్ బయటికొచ్చాడు. ఆయనకు ఎదురుగా వెళ్లాడు రుషికుమారు.

భయంగా ముందుకు అడుగేసింది భారతి.

“మిస్టర్ రుషీ! ఐయామ్ సారీ.. జస్ట్ నౌ హీ ఎజ్ డెడ్.”

ఆ వార్త వినగానే అచేతనంగా వుండిపోయాడు రుషికుమార్.

భారతి కళ్ళంట ధారావాహంగా కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి.

తనొక రెస్పాన్స్‌బుల్ ఆఫీసర్ననే విషయం రుషికుమర్ మరిచిపోయాడు. అతని కుడిచేయి విసురుగా, బలంగా పైకి లేచింది. అది ఆ పక్కనే వున్న గ్లాస్ విండోను ఢీకొంది.

ఆ ధాటికి గ్లాస్ విండో భళ్ళున ముక్కలు ముక్కలైపోయాయి, గాజు పెంకులు నేలమీద పడ్డాయి. అతని కుడిచెయ్యి చిట్లి అందులోంచి రక్తం సర్రుమని పైకి పొంగింది.

“డోంట్… మేడ్ మై బోయ్… కంట్రోల్ యువర్ సెల్ఫ్” ఆ సీనియర్ డాక్టర్ రుషికుమార్ భుజమ్మీద చెయ్యి వేసి అనునయంగా అన్నాడు.

డాక్టరు మాట వినగానే భారతి రోధిస్తూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి పరిగెత్తింది.

ఆ వెనకే దిశ కూడా ఏడుస్తూ పరిగెత్తింది.

రుషికుమార్‌కి ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు.

“విశ్వంభరరావు ఈజ్ నో మోర్…” ఆ మాటను, ఆ ఆలోచనను అతను భరించలేకపోతున్నాడు.

ఆ సీనియర్ డాక్టర్ ముందుకెళ్లిపోతున్నాడు.. ఒక్కసారి ముందుకు పరిగెత్తి ఆ డాక్టరు భుజమ్మీద చెయ్యివేశాడు రుషికుమార్.

ప్రైమ్‌మినిస్టర్ డెత్‌ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయడనికి వెళుతున్నారా?” సీరియస్‌గా అడిగాడు రుషి.

“ఎస్!”

“నో.. మిస్టర్ డాక్టర్.. దేశ ప్రజల భద్రత దృష్ట్యా ఈ న్యూస్ కొన్ని గంటలసేపు పోస్ట్‌పోన్ చేయడానికి వీలవుతుందా?” రుషి నోటి వెంట అప్రయత్నంగా వచ్చిందా మాట.

ఒక్కక్షణం గ్లాస్ డోర్సులోంచి బయట హాస్పిటల్ ముందు కనిపిస్తున్న వేలాది జనాన్ని చూశాడు డాక్టరు.

“యాజ్ యు లైక్… మిస్టర్ రుషికుమార్” గబగబా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైపు నడిచాడాయన.

ఆయన ఆ యూనిట్‌లోకి వెళ్ళడం, లోన్నించి భారతి, దిశ బయటకు రావడం ఒకేసారి జరిగింది.

 

*                            *                                  *                                  *

 

నో.. విశ్వంభరరావుగారు చనిపోవడానికి వీల్లేదు.. చనిపోవడానికి వీల్లేదు.. రుషి మనసు ఆక్రోశిస్తోంది. ప్రేమతో, పగతో, కసితో ఆక్రోశిస్తోంది. అతికష్టం మీద గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు. ఈ పవర్ డ్రామాలో నిర్దిష్టమైన ఆశయాలతో ఈ దేశానికి వెలుగు చూపునిస్తున్న మరోనాయకుడు చనిపోవడానికి వీల్లేదు.

భారతి మనసులో కూడా అదే ఆవేదన.

ఏ.సీ.రూమ్ నిశ్శబ్దంగా వుంది.

అచేతనంగా నిలబడిన భారతి దగ్గరకు నడిచింది దిశ. ఆ టైమ్ కోసమే ఆమె ఎదురు చూస్తోంది.

“మిస్ భారతీ! ఈ టైమ్‌లో మీకో ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పలనుకుంటున్నాను” అంది నెమ్మదిగా దిశ.

“చెప్పండి” కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అంది భారతి.

“మీరు క్రయోనిక్స్ సంస్థకు ఒక చాన్స్ యివ్వగలరా?’

దిశ వేసిన ప్రశ్న వెంటనే అర్థం కాలేదు భారతికి.

“అంటే?”

గబగబా చెప్పింది దిశ. ఆమె చెపుతున్నది తల తిప్పి సీరియస్‌గా వింటున్న రుషి-

ఒకడుగు ముందుకేశాడు.

“ఈజిట్ పాజిబుల్… చనిపోయిన మనిషి బ్రతుకుతాడా? అయ్ డోంట్ బిలీవ్ ఇట్.”

అతని మనసులో అంతవరకూ ఉన్న దుఃఖం స్థానంలొ విస్మయం చోటు చేసుకుంది.

“ఈరోజు సరిగ్గా పన్నెండు గంటలకు జరగబోయే దారుణ సంఘటన గురించి మూడురోజుల క్రితం నేను హెచ్చరించాను. ఈ దేశంలో బ్రతుకుతున్న బాధ్యతగల ఒక పౌరురాలిగా దేశ ప్రధానిని రక్షించుకోవడం కోసం నా టైమ్‌నీ, నా శక్తినీ వుపయోగించాను. నా మీద మీకు నమ్మకం వుంటే నాకు కోపరేట్ చేయండి…” చాలా సీరియస్‌గా అంది దిశ.

సడన్‌గా రుషికి కొన్ని నెలల క్రితం ప్రధాని విశ్వంభరరావు అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

“సీ.. మిస్టర్ రుషీ.. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ దేశంలో డెవలప్ కావలసినంతగా డెవలప్ కాలేదు. అందుకే కొన్ని నిర్ణయాలని పర్సనల్‌గా తీసుకోదలిచాను. నా దృష్టిలో ఫిలాసఫీ, సైన్సు రెండూ ఒక్కటే.. ఈ రెండూ ఎప్పుడో ఒకపుడు యుద్ధానికి తలపడే పరిస్థితి వస్తుంది.”

ఆ మాటల్ని మరోసారి మననం చేసుకున్నాడు రుషి.

అప్పటికప్పుడు క్రయోనిక్ సంస్థ చెపట్టిన కార్యక్రమాలు, ప్రయోగాల గురించి క్లుప్తంగా వివరించింది దిశ.

రుషి కుమార్ లాంటి ఇంటెలిజెంటుకే ప్రస్తుత పరిస్థితి అయోమయంగా వుంది.

భారతి వైపు చూశాడు రుషి.

“మనిషి ఆప్టిమిస్ట్‌గా వుండడంలో తప్పులేదు” నెమ్మదిగా అంది భారతి.

“మిస్ దిశ… నాకు మీ సిన్సియార్టీ మీద ఎంతటి నమ్మకం వుందో సైన్స్ మీద కూడా అంతే నమ్మకం వుంది. సో.. ఐ ఎగ్రీ విత్ యూ బట్.”

రుషి సందేహాల్ని అయిదు నిమిషాల్లో తీర్చేసింది దిశ.

ఆ రూమ్‌లో అప్పుడు.

ఆ నలుగురు.. రుషి, భారతి, దిశ, నవనీత్ మాత్రమే వున్నారు.

నవనీత్ సైంటిఫిగ్గా జరగాల్సిన ప్రోగ్రామ్ గురించి చెప్పాడు.

“మిస్టర్ రుషికుమార్! విశ్వంభరరావుగారి బాడీని చిల్లర్‌గా మార్చిన నలభై నిమిషాల్లోపల ఆ చిల్లర్ లాబరేటరీకి చేరాలి. ఇది చాలా రహస్యంగా జరగాలి. అందుకు…”

ఏదో చెప్పబోతున్న నవనీత్‌కి అడ్డొచ్చింది భారతి.

“మనం శవాన్ని మాయం చేస్తే గందరగోళం అవుతుందేమో?’

“యూ ఆర్ రైట్” ఆలోచనలో పడ్డాడు రుషి.

“మిస్టర్ రుషి! ఒక రకంగా చేస్తే బాగుంటుంది… విశ్వంభరరావు శవాన్ని ఇక్కడ నుంచి మాయం చేయడానికి ముందు, అదే స్థానంలో మనం ఇంకొక శవాన్ని వుంచుతాం.. ఈ లోపల విశ్వంభరరావు శవాన్ని చిల్లర్‌గా మార్చే ప్రయత్నాన్ని నవనీత్ చేస్తాడు.”

“ఆస్పత్రి నుంచి విశ్వంభరరావు శవాన్ని బయటికెలా తీసికెళతాము?” ప్రశ్నించింది భారతి.

“ఏ ఒక్కరికీ అనుమానం కలక్కుండా తీసికెళ్లగలగాలి?” ఇరవై నిమిషాలు గడిచాయి.

రకరకాలుగా తర్జన, భర్జనలు జరిగాయి.

“బయటకు తీసికెళ్లిన శవాన్ని తలకోన అడవుల్లోకి తీసికెళ్ళాలంటే…”

“మనకు స్పెషల్ హెలికాప్టర్ అవసరం వుంటుంది” చెప్పింది భారతి.

మరో అయిదు నిమిషాలు గడిచాయి. ఒక స్థిరమైన అభిప్రాయానికొచ్చి, చెప్పడం ప్రారంభించాడు రుషి.

“మన ప్రోగ్రామ్ మొత్తం ఫోర్‌పేజస్ గా వుంటుంది. నెంబరు వన్… హాస్పిటల్లో విశ్వంభరరావుగారి శవాన్ని తప్పించి ఆ స్థానంలో ఇంకొక శవాన్ని పెట్టాలి. ఆ శవం విశ్వంభరరావు శవం కాదనే విషయం ఎవరికీ తెలియకూడదు. ఇందుకు హాస్పిటల్ సూపరింటెండెంట్ హెల్ప్ మనం తీసుకోవాలి. రెండోది.. డా!!నవనీత్ విశ్వంభరరావుగారి శవాన్ని చిల్లర్‌గా మార్చడం.. దానిని బయటకు తీసికెళ్ళడం. థర్డ్.. స్పెషల్ హెలికాప్టర్‌లో ఆ చిల్లర్ని తలకోన పంపడం. ఇట్ విల్ బీ డన్. ఆ చిల్లర్తోపాటు మీరు ముగ్గురూ ఎకంపెనీ అవుతారు. ఫోర్త్.. దేశ ప్రధానికి జరిగే లాంచనాలు, గౌరవాల్తో విశ్వంభరరావు శవం స్థానంలో మనం వుంచిన శవం దహనకాండ జరిగిన అనంతరం ఇక్కడి పరిస్థితిని నేను ఎనలైజ్ చేసుకుని నేను మిమ్మల్ని తలకోనలో కలుస్తాను” తన ప్రోగ్రాం చెప్పాడు రుషికుమార్.

“షెడ్యూల్ ఓ.కె. మిస్టర్ రుషికుమార్! ఇదంతా మొత్తం.. నలభై నిమిషాల్లో జరగాలి. ఓన్లీ ఫార్టీ మినిట్స్” చెప్పాడు నవనీత్ ఎంతో ఆతృతని కనబరుస్తూ.

ఆ మాటకు లేచి నిలబడ్డాడు రుషి. గబగబా హాస్పిటల్ సూపరింటెండెంట్ చాంబర్ వైపు నడిచాడు.

 

*                            *                                  *                                  *

 

అప్పుడు రాత్రి సరిగ్గా 7.20 నిమిషాలైంది.

రుషికుమార్ చెప్పింది విని హాస్పిటల్ సూపరింటెండెంట్ అంతెత్తున ఎగిరి పడ్డాడు.

“హాస్పిటల్ నుంచి విశ్వంభరరావు శవాన్ని బయటికెందుకు తీసికెళ్లడం. ఆ స్థానంలో ఇంకో శవాన్ని ఎందుకుంచడం?” కోపంగా ప్రశ్నించాడాయన.

అప్పటికే ఆయన్ని చాలా విషయాల్లో కన్విన్స్ చేయడానికి తల ప్రాణం తోకకు వచ్చిందతనికి

చివరి బాణాన్ని వుపయోగించాడతను.

“ఎక్కడో వున్న మిమ్మల్ని తీసుకొచ్చి, మీకీ హోదాని కల్పించిన వ్యక్తి విశ్వంభరరావు కాదంటారా?”

“ఎస్!”

“ఈ దేశ భవిష్యత్తుకు కారణం కాగల అధ్బుతమైన ఇన్సిడెంట్ అతి త్వరలో జరగబోతోంది.. ప్లీజ్ కోపరేట్ విత్ మీ… ఇంతకంటే నేనెక్కువ…”

అతని మాట ఇంకా పూర్తికాలేదు…

“ఇంటెలిజెన్స్ వర్గాలకుగాని, హెల్త్ మినిస్ట్రీకి గానీ విషయం తెలీకుండా మీరు రెస్పాన్స్‌బిలిటీ టేకవ్ చేస్తే.”

“ఆ విషయాలు నాకొదిలేయండి” లేచి నిలబడ్డాడతను.

సూపరింటెండెంట్ చాంబర్లోంచి రుషి బయటికొస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు

“మిస్టర్ రుషి! మీ పని హండ్రెడ్ పర్సంట్ పూర్తయ్యాక నేనింటి కెళతాను.. డొంట్‌వర్రీ.. ఎబౌట్ ది మార్చురీ… రెడ్‌ఫొర్ట్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో, ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు చనిపోయారు. వాళ్ళ శవాలు రెడీగా వున్నాయి. విశ్వంభరరావుగారి వయసువాళ్ళే.. అందులో ఒక వ్యక్తి ఆజన్మ బ్రహ్మచారి.. ఆయనకెవరూ లేరు.”

“థాంక్యూ డాక్టర్! థాంక్యూ ఫర్ యువర్ కోపరేషన్” చాంబర్లోంచి బయటికొచ్చాడతను.

 

*                            *                                  *                                  *

 

7.45 నిమిషాలు…

ఆర్మీ హెడ్‌క్వార్టర్సులోని ఆర్మీ జనరల్ మెహతా ఎదురుగా కూర్చున్నాడు రుషికుమార్.

“ప్రైంమినిస్టర్ విశ్వంభరరావుగారి ఆప్తుడిగా మీరు చేసే సహాయం నేనెప్పుడూ మరిచిపోలేను.. ఈ దేశమూ మర్చిపోదు” నెమ్మదిగా అన్నాడు రుషి.

“స్పెషల్ హెలికాప్టర్ని అత్యవసర సమయంలో, అందులోనూ రాత్రిపూట నేను తప్ప ఇంకెవరూ వుపయోగించడానికి వీల్లేదు” చెప్పాడు మెహతా.

“అది తెలిసే నేను వచ్చాను.”

“ఇంతకీ విశ్వంభరరావుగారి శవాన్ని ఎందుకు బయటకు తీసుకెళుతున్నారు?’

“ప్రస్తుతానికి అది మాత్రం రహస్యం.”

“విశ్వంబరరావుగారు అందరూ అనుకున్నట్టుగా చనిపోలేదా?” సడన్‌గా ప్రశ్నించాడు మెహతా.

“మీ డౌట్స్ అన్నీ వారం రోజుల్లోపల క్లియర్ అవుతాయి” లేచి నిలబడ్డాడతను.

“మిస్టర్ రుషీ! నువ్వేం చేసినా ఈ దేశం కోసం చేస్తావని నాకు తెలుసు. ఐ విల్ బి విత్ యూ… హెలికాప్టర్ని నేనే స్వయంగా డ్రైవ్ చేస్తాను.”

దేశ ఆర్మీ జనరల్ అలా మాట్లాడేసరికి ఒక్కక్షణం అతని కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి.

“థాంక్యూ… థాంక్యూ… సర్…” అన్నాడతను కృతజ్ఞతగా.

“ఒక గంట ముందుగా నాకు ఇన్‌ఫాం చెయ్యి. నా ప్రిపరేషన్స్‌లో నేనుంటాను” చెప్పాడాయన.

మరో అయిదు నిమిషాల తర్వాత అక్కడ నుంచి బయటపడ్డాడతను.

సరిగ్గా 8.30 నిమిషాలు.

హర్యానా రోడ్దులోని వీరేంద్ర అజనీష్ భవనంలో…

అజనీష్ పర్సనల్ రూమ్‌లో…

వెండి సింహాసనమ్మీద అజనీష్ కూర్చున్నాడు. అటూ.. ఇటూ కార్పెట్ మీద ప్రతాప్‌సింగ్, అర్జున్ చౌహాన్ కూర్చున్నారు.

వాళ్లిద్దరి ముఖాలూ, బెల్జియం గ్లాసుల్లా మెరిసిపోతున్నాయి.

“రాష్ట్రపతి దగ్గర్నించి కొద్ది గంటల్లోనే కబురు రావచ్చు… మీ ఆశీస్సులతో ఆపద్ధర్మ ప్రధానిగా పదవిని చేపట్టబోతున్నాను.”

“శుభమే.”

“ప్రతాప్‌సింగ్ పదవిని చెపట్టిన మరుక్షణం పార్టీ ప్రెసిడెంటుగా.. మీ దయవలన…” తన పక్కనే వున్న సూట్‌కేసును తెరచి చూపిస్తూ అన్నాడు అర్జున్‌చౌహాన్.

“శుభం” అని ఆశీర్వదించి “విశ్వంభరరావు వర్గం ఏమంటోంది?” అని ప్రశ్నించాడు వీరేంద్ర అజనీష్.

“మొదట విడతగా కోటి రూపాయలు” చెప్పాడు చౌహాన్.

“వారి ప్రియతమనేత దారుణంగా చచ్చినా వీళ్ళ బేరసారాలు ఆగలేదన్నమాట. రాజకీయం.. రాజకీయమా.. నీ విశ్వవిరాట్ క్షుద్ర రూపానికి ఇదే నా నమస్కారం” పైకప్పు వైపు చూసి దణ్ణం పెట్టాడు అజనీష్.

“ఎవ్వరికీ ఏమీ తెలీకుండా పిట్టను కొట్టినట్లుగా కొట్టేశాడు విశ్వంభరరావుని… అలాంటివాడు మనకు చాలా అవసరం.. శోభరాజ్‌ని వదలకండి” అన్నాడు ప్రతాప్‌సింగ్.

“శోభరాజా? వాడ్ని నేనెందుకు వదుల్తాను? వాడ్ని నేనొదిలితే నువ్వు పట్టుకుని నామీద ఉసిగొల్పుతావు.. మీరు నా కాళ్ల దగ్గర ఉండాలంటే వాడు నా గుప్పిట్లో వుండాలి” పెద్దగా నవ్వుతూ జోక్ వేసినట్టుగా అన్నాడు అజనీష్.

ఇద్దరూ షాక్ తిని “అమ్మమ్మ ఎంతమాట” అన్నట్టుగా ఎక్స్‌ప్రెషనిచ్చారు.

“శవాన్ని స్వాధీనం చేసుకున్నారా?” అడిగాడు అజనీష్.

“లేదు… ఇంకో గంటలో శవాన్ని అప్పగిస్తారు.. పార్టీ ఆఫీస్‌లో ప్రజల దర్శనార్ధం వుంచి, రేపు మధ్యాహ్నం..” ప్రోగ్రామ్ నంతా చెప్పాడు అర్జున్‌చౌహాన్.

సరిగ్గా అదే సమయంలో లోనికొచ్చాడు శోభరాజ్. అతన్ని ఇద్దరు కాబోయే దేశనేతలు ప్రేమగా కౌగిలించుకున్నారు.

“ఎందుకిదంతా? ఏమిటీ సంతోషం?” చికాగ్గా అడిగాడు శోభరాజ్.

“సూత్రధారుడివి… ఎందుకో నీకిది తెలీదా?”

“తెల్సుకాబట్టే అడుగుతున్నాను మైడియర్ ఫ్రెండ్స్! అఫీషియల్‌గా విశ్వభరరావు డెత్ ఎనౌన్స్‌మెంట్ వచ్చిందా?”

“డెత్ ఎనౌన్స్‌మెంట్… పార్టీ ఆఫీసుకెళ్ళి తీర్మానం చేస్తే వస్తుంది.”

“ఈ లోపల అక్కడకు విశ్వంభరరావు నడిచొస్తే” ధన్‌మని ఇద్దరి మధ్యా బాంబు పడినట్లు ఆ ఇద్దరూ శోభరాజ్ వైపు చూశారు.

“ఇంతకీ ఏవైందయ్యా బాబూ?’

“ఏమీ కాలేదు… చిన్న డౌటు అంతే … విశ్వంభరరావు చచ్చిపాయాడని ఎవరూ మీకు చెప్పలేదు.. కనీసం హాస్పిటల్ సూపరింటెండెంటుకయినా ఫోన్‌చేసి, మీరు ఆ న్యూస్‌ని కన్‌ఫామ్ చేసుకోలేదు.. ఇంకో విషయం… హాస్పిటల్ మొత్తం మరీ ముఖ్యంగా ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వున్న బిల్డింగ్ స్పెషల్ కమెండోస్ చేతిలో వుంది.. కాబినెట్ మినిస్టర్స్‌ను కూడా వాళ్ళు లోనికి ఎలో చేయడంలేదు.”

“అవి రూల్సయ్యా కిల్లరూ” నిన్నూ, నీ ఫ్రెండ్స్‌నీ సినిమాహాలులోకి వదిలేసినట్టు వదిలేస్తారనుకున్నావా?” జోక్ చేశాడు అర్జున్ చౌహాన్.

“కనీసం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల్ని కూడా ఇంటెన్సివ్‌కేర్ యూనిట్లోకి ఎలో చేయలేదు తెలుసా?”

“తెలుసయ్యా బాబూ! ఆపరేషన్ చేస్తున్న సమయంలో వాళ్లు వచ్చారట.. అందుకు”

“నేనమ్మను.. నా గురి, నా దెబ్బ, నా పిస్టల్ పవర్ నాకు తెలుసు. మొదటి బుల్లెట్‌కు ప్రధాని పక్కకు వంగిపోవడం, రెండో బుల్లెట్‌కు గిలగిల కొట్టుకోవడం నేను చూశాను. పైగా మూడోది బాంబు. ఆ బాంబు ధాటికి విశ్వంభరరావు ప్రాణాలతో వుండడం కల్ల…”

“ఇంతకీ నువ్వు అనేదేమిటో నాకర్థం కాలేదయ్యా!”

“ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మనుషులకు ఆపరేషన్ చేస్తారు. శవాలకు ఆపరేషను చెయ్యరు” సీరియస్‌గా చెప్పాడు శోభరాజ్.

“అంటే?”

“సీ మైడియర్ ఫ్రెండ్స్! అయామ్ ఎ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కిల్లర్… నా ఎటెమ్ట్ ఎప్పుడూ మిస్ కాదు. కానీ.. శవంగా మారిన విశ్వంభరరావుని యిప్పటికీ మార్చురీలోకి పంపలేదు. ఎందువల్ల… సెకండ్ పాయింట్… విశ్వంభరరావు బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్.. ప్రైంమినిస్టర్ అఫీషియల్ రెసిడెన్స్‌లోని పర్సనల్ మెడికల్ యూనిట్లో, ఆ ఓ పాజిటివ్ బాటిల్స్‌ని ఎప్పుడూ ఆరు బాటిల్స్‌కు తగ్గకుండా స్టోర్‌లో వుంచుతారు. ఆ మెడికల్ యూనిట్లో నిన్న ఆరు బాటిల్స్ వున్నాయి. నేనా ఇన్ఫర్‌మేషన్‌ని నిన్ననే సంపాదించాను. మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగిన ఏడుగంటల తర్వాత అంటే రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఆ బ్లడ్ బాటిల్స్ మాయమయ్యాయి తెలుసా?” అది వింటూనే-

ప్రతాప్‌సింగ్, అర్జున్ చౌహాన్ మొహాలు నెత్తురుచుక్క లేనంతగా పాలిపోయాయి.

“ఒక వ్యక్తికి రక్తం అవసరం బ్రతికినప్పుడే… చచ్చిపోయాక కాదు. కానీ విశ్వంభరరావు చచ్చిపోయాడని, మీరు అనుకుంటున్న సమయంలో బ్లడ్ బాటిల్స్ మాయం కావటం ఏమిటి?”

ఆ మాటకు వీరేంద్ర అజనీష్ తల గిర్రున తిరిగిపోయింది.

ఆ షాక్ నుంచి తేరుకోటానికి ఆ ముగ్గురికీ చాలాసేపు పట్టింది.

“అందుకే నేను చెప్పాను. ఆ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్.. రుషికుమార్ శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని” అజనీష్ అన్నాడు కోపంగా.

“ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మీద బాంబులు వేయించేస్తే…” ప్రతాప్‌సింగ్ అన్నాడు అసహనంగా. ప్రాక్టికాలిటి గురించి కూడా ఆలోచించకుండా.

“మిస్టర్ సింగ్! బి హేవ్ యువర్ సెల్ఫ్… చిన్న చిన్నపిల్లాడిలా ఆలోచించకు” అర్జున్ చౌహాన్ సీరియస్‌గా అని.. అజనీష్ వైపు తిరిగి…

“గురూజీ! అన్నిటికీ మిమ్మల్నే నమ్మాం. ఈ దేశాన్ని మాకు అప్పగించే పూచీ మీదే” పూర్తిగా కాళ్లమీద పడిపోయాడతడు.

చిద్విలాసంగా నవ్వాడు అజనీష్-శోభరజ్ వైపు చూశాడు.

“శోభరాజ్! నీ పనింకా పూర్తికాలేదు. అక్కడ ఏం జరుగుతోందో నాకు తెలియాలి. నీ రేటు ఇంకో కోటికి పెంచుతున్నాను. విశ్వంభరరావు శవంగా ఎప్పుడో మారిపోయాడని నాకు తెలుసు. నా అనుమానం నిజమే అయితే.. ఆ శవం బహుశా ఇక్కడ వుండకపోవచ్చు.”

“అంటే?” గాభరాగా అడిగాడు అర్జున్ చౌహాన్.

“శవానికి ప్రాణం పోసే ప్రక్రియ జరుగుతోంది” ఒక్కొక్క మాటా గంభీరంగా అజనీష్ నోటివెంట వచ్చింది.

“శవానికి ప్రాణం పొయ్యడం ఏమిటి గురూజీ?” నోరెళ్ళ బెట్టారిద్దరూ.

దీర్ఘంగా నిట్టూర్చాడు వీరేంద్ర అజనీష్.

“ఫ్రెండ్స్! ఎప్పుడో చూచాయగా ఊహించిన ఒక విషయం ఇప్పుడర్థమౌతోంది. అయినా మీ పనుల్లో మీరుండండి. మీరు వెంటనే అధికారాన్ని చేపట్టండి. ప్రధాని హత్యని కాశ్మీరీ మిలిటెంట్ల మీదకో, ఎల్.టి.టి.ఇ మీదకో, పంజాబ్ టెర్రరిస్టుల మీదకో, బోడోల మీదకో నెట్టేయండి. ఎంక్వయిరీ కమీషన్‌లో మనం అనుకున్న వాళ్లను ప్రవేశపెట్టండి. మీడియాని తప్పుదారి పట్టించండి. ఈ దేశంలో రాజకీయాన్ని అరచేతితో నడిపే బాధ్యత మీది. పురాతనమైన హిందూ సమాజంలో సైన్సు పరిశోధనల పేరిట చిచ్చుపెట్టడానికి పూనుకుంటున్న ఆ శత్రువుల్ని నామరూపాలు లేకుండా చేసే ప్రోగ్రాం నాది. ఇక మీరెళ్ళండి” ఇద్దరూ లేచి నిలబడి వినయంగా నమస్కరించి బయటికొచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయాక శోభరాజ్ కళ్ళల్లోకి చూస్తూ-

“శోభరాజ్ భగవంతుడి వునికి లేనిదే అ వునికి ద్వారా నమ్మకాల్నీ, విశ్వాసాల్నీ పోషించే మాలాంటివాళ్ళ ప్రమేయం లేనిదే ఇక్కడి వేద సమాజం లేదు. ఆ సమాజానికి ముప్పు వాటిల్లబోతోంది. అందుకే.. నీకో పనిని అప్పగిస్త్తున్నాను.” శోభరాజ్ ఏం చెయ్యాలో విశదీకరించాడు వీరేంద్ర అజనీష్, అంతా అయిపోయాక శోభరాజ్ ఒక ప్రశ్న వేశాడు.

“గురూజీ! మీ దేశంలో దేవుడు అంత పవర్‌వుల్లా?”

“అవును… ఇక్కడి దేవుడు అనే రూపం పవర్‌వుల్ కాదు. ఆ రూపమ్మీద నమ్మకం పవర్‌వుల్.. కొన్నివేల సంవత్సరాలనుంచీ, వున్న కొన్ని గుడ్డి నమ్మకాలను, మాసిపోకుండా సంరక్షించడమే మాలాంటి గురూజీల కార్యక్రం” లేచి నిలబడ్డడాయన.

అజనీష్ ఆశీస్సులు తీసుకుని శోభరాజ్ బయటికెళ్లాడు.

 

*                            *                                  *                                  *

 

రాత్రి 9.40 నిమిషాలు.

ఆలిండియా మెడికల్ సైన్సెస్‌లోని మార్చురీ ముందు అసహనంగా పచార్లు చేస్తున్నాడు రుషికుమార్.

మార్చురీ లోపల డా!!నవనీత్ ఆధ్వర్యంలో విశ్వంభరరావు శవాన్ని చిల్లర్‌గా మార్చే తతంగం జరుగుతోంది. ఆ పక్కన దిశ అతనికి హెల్ప్ చేస్తోంది.

రుషికుమార్ వున్న ప్రదేశానికి కొంచెం దూరంలో వున్న వరండా చివర నిల్చుని చీకట్లోకి నలువైపులా నిశితంగా చూస్తోంది భారతి.

ఆ మార్చురీవైపు ఎవరైనా వస్తే వెంటనే ఆ విషయాన్ని రుషికుమార్‌కి తెలియజేయడానికి ఆమె అక్కడుంది.

అయిదు నిమిషాల తర్వాత రుషికుమార్ అక్కడకొచ్చాడు. అప్పటికే అతను శరీరాన్ని బయటకు తీసికెళ్ళడానికి ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నాడు. మార్చురీ వెనక భాగం… తుప్పల్తో, డొంకల్తో చిన్న అడవిలా వుంటుంది. దాదాపు వంద అడుగుల దూరంలో గోడ వుంది. ఆ గోడ మీంచి బయటకు శవాన్ని చేరవేయాలి.

“అంబులెన్స్ విషయం నేను చూసుకుంటాను. డోంట్‌వర్రీ” హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పడం గుర్తుకొచ్చింది రుషికి.

“భారతీ! నువ్వు మార్చురీ దగ్గరుండు. ఏ అవసరమొచ్చినా నన్ను పిలు” అని గబగబా చీకట్లో వరండా నుంచి మెట్లు దిగి తుప్పల్లోంచి నడవడం మొదలెట్టాడు.

అసహ్యకరమైన, మురిగిపోయిన మందుల వాసన, కుళ్ళిపోయిన చర్మ వాసన, గుట్టలు గుట్టలుగా ఐ.వి ఫ్ల్లూయిడ్స్ బాటిల్స్…

ఆ మార్చురీ ముందు భాగంలోనూ… దానికి కొంచెం దూరంలోనూ స్పెషల్ కమెండోలు తిరుగుతున్నారు.

ఎక్కడ ఎలాంటి శబ్దం వినిపించినా వాళ్ళు పరిగెత్తుకుని రావడం ఖాయం.

అతికష్టమ్మీద గోడెక్కి చూశాడు. వెనక భాగంలో-

గోడకు కొంచెం దూరంలో తెల్లటి అంబాసిడర్ కారు, రుషి వెనక పెన్‌టార్చీ తీసి ఫోకస్ చేశాడు.

కారు ముందు డ్రవింగ్ సీట్లో కూర్చున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ లైట్స్ డిమ్ అండ్ డిప్ చేస్తూ సిగ్నల్ యిచ్చాడు.

అయిదు నిమిషాల తర్వాత గోడ దిగి వెనక్కొచ్చాడు రుషికుమార్. నేరుగా మార్చురీవైపు నడిచాడు.

సరిగ్గా అదే సమయంలో మార్చురీ తలుపు తెరచుకుని బయటి కొచ్చింది దిశ.

“మిస్టర్ రుషీ.. ఎవ్విరిథింగ్ రెడీ” భారతితో సహా లోనికెళ్ళాడు రుషి.

“దిసీజ్ కాల్డ్, ఇన్సులేటెడ్ ప్యాకేజ్.. ఇందులో శవం వున్నట్టు మనకు తప్ప ఇంకెవరికీ తెలీదు.. బయటవాళ్ళు ఎవరైనా ఓపెన్ చెయ్యాలన్నా దీన్ని ఓపెన్ చెయ్యలేరు” చెప్పాడు నవనీత్ అలసటగా.

“దీనిని భుజంమీద వేసుకోవచ్చు గదా..” అడిగాడు రుషి.

“వై నాట్.. కానీ కొంచెం బరువుగా వుంటుంది”.

“ఈ సమయంలో దీనిని స్ట్రెచర్ మీద్ తీసుకెళ్ళడం మంచిది కాదు. అందుకే…” గబుక్కున ముందుకెళ్ళి విశ్వంభరరావు వున్న ఇన్యులేటెడ్ బ్యాగ్‌ని భుజమ్మీద వేసుకున్నాడు. మార్చురీలోంచి బయటికొచ్చాడు.

నవనీత్ తన ఆపరేషన్ కిట్‌ను భుజానికి తగిలించుకున్నాడు. ఆపరేషను కోసం తెప్పించిన ‘ఒ’ పాజిటివ్ బ్లడ్ బాటిల్స్ బ్యాగ్‌ను దిశ అందుకుంది. చిన్న టార్చితో వాళ్లకు దారి చూపిస్తోంది భారతి.

“మిస్టర్ రుషీ… ఆపరేషనుకు ప్రస్తుతం మీరు తెప్పించిన బ్లడ్ బాటిల్స్ సరిపోకపోవచ్చు” చెప్పాడు నవనీత్.

“డోంట్‌వర్రీ.. నవనీత్… మీరు హెలికాప్టర్లోకి ఎక్కేటప్పటికి ఇంకో పది బాటిల్స్ మీకు అందుతాయి” చెప్పాడు రుషి.

అందరూ గోడ దగ్గరకు చేరారు.

గోడ ఎక్కి రెండో వైపుకి దూకాడు నవనీత్. నెమ్మదిగా శవాన్ని దించారు. మరో మూడు నిమిషాల్లో శవం అంబాసిడర్ కార్లో వుంది.

“అంబులెన్స్ అయితే ఎవరో ఒకరికి అనుమానం వస్తుందని కారు తెచ్చాను. అయినా రుషీ! హాస్పిటల్‌కి వచ్చే ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్‌ని చెక్ చేస్తున్నారు” చెప్పాడు హాస్పిటల్ సూపరింటెండెంట్.

“నన్ను డ్రైవింగ్ సీట్లో చూస్తే ఎవరూ చెక్ చేయకపోవచ్చు.. భారతీ! నువ్వు కూడా ముందు సీట్లోకి రా” అన్నాడు రుషి.

దిశ, నవనీత్, సూపరింటెండెంట్ వెనక సీట్లో కూర్చున్నారు.

వాళ్ళ కాళ్ళ దగ్గర ఇన్యులేటెడ్ బ్యాగ్‌లో విశ్వంభరరావు శవం వుంది. ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రుషి కారు స్టార్ట్ చేశాడు.

రాత్రి 10-15 నిమిషాలైంది.

అంబాసిడర్ కారు డ్రైవింగ్ సీట్లో రుషిని, ఆ పక్కన భారతిని చూడడంతో ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని చెక్ చేయలేదు.

మెయిన్‌రోడ్ మీద కారు అరవై మైళ్ళ వేగంతో పరిగెడుతోంది. సరిగ్గా అదే సమయంలో-

ఆ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళే ట్రాఫిక్ ఐలాండ్ దగ్గరకు మారుతీ కారొచ్చింది.

ఆ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి వేగంగా వెళ్ళిపోతున్న అంబాసిడర్ కారుని, ఆ కారులో కూర్చున్న రుషి, భారతీలను గుర్తుపట్టాడు.

అతనికి వెనక సీట్లో కూర్చున్న వ్యక్తులెవరూ కనిపించలేదు.

ట్రాఫిక్ ఐలాండ్‌కు పక్కన కారు స్లో చేసి తాపీగా సిగరెట్ వెలిగించుకున్నాడు.

రెండు నిమిషాలు ఆలోచించాడు.

“రుషి, భారతి ఎక్కడికి వెళుతున్నారనే దానికన్నా మార్చురీలో విశ్వంభరరావు శవం వుందో లేదో తను కనుక్కోవాలి. అదీ ముఖ్యం” నిర్ణయించుకుని కారుని ముందుకు పోనిచ్చాడు.

ఆ కారుని ట్రాఫిక్ పోలీసులు చూసినప్పటికీ ఎవరూ ఆపడానికి ప్రయత్నం చేయలేదు.

దానిక్కారణం… ఆ కారు వీరేంద్ర అజనీష్‌దని అందరకూ తెల్సు.

మరో పదిహేను నిమిషాల తర్వాత ఆ కారు ఆలిండియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ముందు ఆగింది.

కార్లోంచి గంభీరంగా దిగిన శోభరాజ్ రిసెప్షన్‌వైపు నడిచాడు.

 

*                            *                                  *                                  *

 

10-55 నిమిషాలు…

ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలో వున్న జింఖానా గ్రౌండ్స్ దగ్గర కొచ్చింది అంబాసిడర్ కారు.

అప్పటికే అక్కడ రెడీగా వున్నాడు ఆర్మీ జనరల్ మెహతా.

మెహతా అక్కడ మామూలు వ్యక్తిలా నిలబడటం చూసిన హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు ముచ్చెమటలు పోశాయి క్షణాల్లో.

విశ్వంభరరావు శవం హెలికాప్టరులోకి మారింది. ఆ స్పెషల్ హెలికాప్టర్లోకి భారతి, దిశ, నవనీత్ ఎక్కారు.

ఓ.కె. మై బోయ్… సీయూ” కాక్‌పిట్ వైపు నడుస్తూ అన్నాడు మిలటరీ జనరల్ మెహతా.

దిశ తన విజిటింగ్ కార్డుని రుషికిస్తూ-

“మీరు తిరుపతి రాగానే ఈ హోటల్‌కి రండి… నా పేరు చెప్పండి. ఓ.కె.” చెప్పింది.

“నువ్వు తిరుపతికి ఎప్పుడొస్తున్నావ్?” అడిగింది భారతి క్యాజువల్‌గా.

“ఇరవైనాలుగ్గంటల లోపల” చెప్పాడు రుషి.

సరిగ్గా అదే సమయంలో హెలికాప్టర్ స్టార్ట్ చేశాడు జనరల్ మెహతా.

“సీ యూ మిస్టర్ రుషీ….” అలా తనతో కరచాలనం చేస్తున్న నవనీత్ కళ్లల్లోకి చూశాడతను. నవనీత్‌ను సీరియస్‌గా ఒక పశ్న అడగాలని కొన్ని గంటలుగా అతను అనుకుంటున్నాడు. ఎందుకో అడగలేకపోయాడు.

అతని పెదవులు ఎట్టకేలకు విడిపడ్డాయి.

“మిస్టర్ నవనీత్! విశ్వంభరరావుగారిని బ్రతికించడం నిజంగా సాధ్యమేనంటావా?”

సరిగ్గా అదే సమయంలో హెలికాప్టర్ పైకి లేవడంతో అతను అడిగిన ప్రశ్న నవనీత్‌కు వినిపించలేదు.

హెలికాప్టర్ నెమ్మదిగా… నెమ్మదిగా పైకి లేచి గిర్రుమని తిరిగి ఆకాశంలో కెగిరింది.

సరిగ్గా అదే క్షణంలో –

నవనీత్‌కు ఒక విషయం జ్ఞాపకానికొచ్చింది.

బాటిల్స్… ఓ పాజిటి బ్లడ్ బాటిల్స్.

జింఖానా గౌండ్స్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు రుషితో.

“సిటీలో ఎక్కడా ఓ పాజిటివ్ బ్లడ్ దొరకలేదు.”

రేపటికి ట్రై చేయగలరా?”

“ప్రయత్నిస్తాను.”

అంబాసిడర్ కారు నిశ్శబ్దంగా వున్న రోడ్డుమీద పరుగెడుతోంది.

అప్పటికి దాదాపు 11-25 నిమిషాలైంది.

“నన్ను రెడ్‌పోర్టు దగ్గర డ్రాప్ చేయండి”

మరో ఏడు నిమిషాల తర్వాత రెడ్‌పోర్టు గ్రౌండ్స్ దగ్గర రుషిని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు హాస్పిటల్ సూపరింటెండెంట్.

మొత్తం జరిగిందంతా కళ్ళారా చూసిన సూపరింటెండెంట్ అంతవరకూ గంభీరంగానే వున్నా ఆ తర్వాత ఆయనలో ఏదో భయం ప్రవేశించింది.

ఆ రోజు రాత్రి అతని వంట్లో సడన్‌గా టెంపరేచర్ పెరిగింది.

రెడ్‌పోర్టు గ్రౌండ్సులోకి అడుగుపెట్టిన రుషికుమార్‌కి అక్కడి వాతావరణం చూడగానే అంత దుఃఖంలోనూ నవ్వొచ్చింది.

ఎటు చూసినా పారా మిలటరీ ఫోర్సు ఆ వేదికకు కాపలా కాస్తున్నారు, దొంగలుపడిన ఆర్నెళ్ళకు పోలీసు కుక్కలు వచ్చినట్టు సామెత గుర్తు కొచ్చిందతనికి.

మిలటరీ ఫోర్సు చీఫ్ రుషికుమార్‌ని విష్ చేశాడు.

“రా… చీఫ్… నాలుగుగంటలసేపు ఇక్కడే వుండి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళారు సార్!”

“అనుమానం ఎవరి మీద?” నిరాసక్తంగా ఆ ప్రశ్న వేశాడు రుషికుమార్.

“తెలీదు సార్!”

మౌనంగా ముందుకు నడిచాడు రుషి.

అంత బీభత్సకరమైన పరిస్తితిలోను అతను ఒక ఇంపార్టెంట్ పాయింటును గమనించాడు.

డయాస్ మీదకు కుడివైపు నుంచి బుల్లెట్లు రావడం.. అంటే… శతృవులు కుడివైపున జనం మధ్యనున్నారన్న మాట.

ఫౌంటెన్‌కు అయిదడుగుల దూరంలో ఆగాడు..

రెడ్‌ఫోర్టు గ్రౌండ్స్‌కొచ్చే నాలుగు ఎంట్రన్సుల దగ్గర మెటల్ డిటెక్టర్లు పెట్టారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తినీ పోలీసులు ప్రశ్నించారు. మరి గ్రౌండ్స్‌లోకి అంత పవర్‌వుల్ వెపన్ ఎలా వచ్చింది?

ఫౌంటెన్ గట్టుమీద కూర్చుని సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్టు తీసి వెలిగించి, ఒక పఫ్ లాగి, అగ్గిపుల్లను కిందకు విసిరేస్తూ ఒక్క సెకెన్ అలాగే ఆగిపోయాడతను.

అక్కడక్కడ ఇసక చాటున ఒకే రకం సిగరెట్ బట్స్.. అన్నిటినీ నెమ్మదిగా ఏరాడతను.

మాల్‌బోర్న్ సిగరెట్స్… ఫౌంటెన్‌లోకి చూశాడు… పిచ్చి మొక్కల మధ్య ఖాళీ సిగరెట్ ప్యాకెట్… కొన్ని సిగరెట్ బట్స్…

మట్టి లోంచి పెరికివేయబడిన పిచ్చిమొక్కలు.. అంటే మర్డరర్ ఇక్కడ్నుంచే షూట్ చేశాడన్నమాట. ఖాళీ సిగరెట్ ప్యాకెట్టుని, బట్స్‌ని తీసుకుని పేపర్లో చుట్టి ముందుకొస్తున్నప్పుడు చటుక్కున అతని మెదడులోకి ప్లాష్‌లా ఓ ఐడియా వచ్చింది.

వెంటనే అతను ఆ ప్రాంతం నుంచి బయటపడ్డాడు.

 

*                            *                                  *                                  *

 

గాలిలో మిలటరీ హెలికాప్టర్ తిరుపతికేసి అమిత వేగంతో దూసుకు పోతోంది

విశ్వంభరరావు మర్డర్ తర్వాత జరుగుతున్న పరిణామాలు అందరికీ అనూహ్యంగా వున్నాయి.

మరీ ముఖ్యంగా దిశ! విశ్వంభరరావుకి సంభవించనున్న ఆపద గురించి ఆమెకు కల రావడం. ఆ కలలోలాగే అంత జరగడం…

డ్రీమ్స్‌ని ఎప్పుడూ భారతి సీరియస్‌గా తీసుకోలేదు. కానీ డ్రీమ్స్‌ని మొట్టమొదటిసారి విశ్వసిస్తోందామె. అందుకే దిశను అడిగిందామె-

“జీవితంలోని సంఘటనలకు అంత సన్నిహితంగా వుంటాయా డ్రీమ్స్?”

“అది మన విశ్లేషణ మీద ఆధారపడి వుంటుంది.”

“మీకొచ్చిన మొట్టమొదటి కల నిజమైన సందర్భం వుందా?”

“నాకు వూహ తెలిశాక వచ్చిన కల నిజమైంది…. ఆ విషయం నాకిప్పటికీ జ్ఞాపకం వుంది. నాకప్పుడు పదేళ్ళు… స్కూలు నుంచి యింటికొస్తున్నాను. సాయంత్రం అయిదుగంటల సమయం. రోడ్డు క్రాస్ చేస్తున్న టైమ్‌లో కొంతమంది వ్యక్తులు ఒక శవాన్ని మోసుకొస్తున్నారు. మగ వ్యక్తి శవం…

ఆ శవాన్ని చూడగానే మా నాన్నకు యిలా జరిగితే అన్న ఆలోచన…

చాలా అసహజమైన ఆలోచన వచ్చింది… మరో పదినిమిషాల తర్వాత తెల్సింది. మా నాన్న పొలంలో హార్టెటాక్‌తో చనిపోయాడని.”

“ఇది కలకాదు కదా? మీకెలా అనిపించింది….?’

“నిద్రలో వచ్చిందే కల కాదు. మెలుకువలో అన్పించింది కూడా కలే… ఎందుకంటే, కలకైనా భావనకైనా, దృశ్యమే ప్రధానం….”

“ఆ తర్వాత….” అడిగింది భారతి.

“భువనేశ్వర్‌లో సత్యబ్రహ్మ, ఆస్ట్రేలియన్ కేట్, గిరీష్‌ని ఎవరో చంపుతున్నట్టు, విశ్వంభరరావు మీద హత్యాప్రయత్నం” వరసగా చెప్పింది దిశ.

“అవన్నీ నిజమయ్యాయా?”

“అన్నీ నిజమయ్యాయి. ఒక్క గిరీష్‌ది తప్ప.”

ఎవరా గిరీష్ అని మాత్రం అడగలేదు భారతి.

“కలల గురించి మీరు బాగా స్టడీ చేశారా?” ప్రశ్నించింది భారతి.

“అవసరమైనంత…”

అపుడే ఆ హెలికాప్టర్ మద్రాస్ సిటీని దాటుతోంది.

చెప్పడం ప్రారంబించింది దిశ.

“సాధారణంగా మనిషికి వచ్చే కలలు ఏడు రకాలుగా వుంటాయి.

ఎత్తయిన బిల్డింగ్ లేదా కొండ- చిమ్మ చీకటి- అతి జాగ్రత్తగా నడవాలని ప్రయత్నం చేస్తుంటారు. అయినా నాలుగు అడుగులు వేసేసరికి, బ్యాలెన్స్ తప్పి ఆగాధంలోకి పడిపోతుంటారు. అంతలో మెలుకువ వస్తుంది.

రెండవది- విశాలమైన రోడ్డు లేదా విమానాశ్రయం రన్‌వే, లేదా పచ్చికబయల్లో వంటరిగా నిలబడి వుంటారు. కుక్కలో, పులులో వెంటబడి తరమడం, ప్రారంభిస్తాయి. వాటికి అందకుండా వేగంగా పరిగెడుతుంటారు. చూసుకుంటే వంటిమీద నూలు పోగైనా వుండదు. నగ్నంగా పరిగెత్తి రావడం- చచ్చే సిగ్గుతో కుప్పకూలడం..

మూడు- తుఫాన్ గాలి, ఆ గాలిలో చిక్కుకుని ఎగిరిపోతుంటారు- ఎంతో ఎత్తుకు- ఆకాశంలో పక్షుల్లా.. కొండలు, గుట్టులు, చెట్లు, చేమలు దాటుకుంటూ వెళ్తారు సముద్రమ్మీద కూడా దిగకుండా, ఆ గాలి తీసుకు వెళుతుంది. ప్రకృతి ప్రతాపం నుండి బయటపడాలని చేసే ప్రయత్నం ఫలించదు.

నాలుగోది- ఆరోగ్యం పరీక్ష కోసం డాక్టర్ దగ్గరకు వెళతారు. డాక్టర్ ఏవేవో పరీక్షలు చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితి… ఎంత ప్రయత్నం చేసినా గొంతు పెగలదు.

అయిదు- పర్స్‌నిండా డబ్బు, లేదా హాండ్‌బ్యాగ్ నిండా బంగారు నగలు, వాటితో ఏదో ఒక ముఖ్యమైన పనిమీద బయలుదేరారు. అక్కడికి వెళ్ళ్లి పర్సు లేదా బ్యాగ్ తెరిచేసరికి డబ్బు, నగలు ఏమీ వుండవు. అవి అసలు ఎలా మాయమయ్యాయో కూడ అర్థం కాదు. గొంతు తడారి పోతుంది.

ఆరు- పదిమందితో కలిసి పిక్నిక్‌కి బయలు దేరతారు. అలా అందరూ నడుస్తుండగా మీరు వెనకపడతారు. ఆ సమయంలో కళ్ళముందు ఎదురుగా మెరుస్తూ వజ్రమో, రత్నమో కనిపిస్తుంది. ఎగిరి దాన్ని అందుకుంటారు. ఆ అదృష్టానికి మీరు ఆశ్చర్యపోతారు.

ఏడు- ఒంటరితనం- భయం, నీరసం, ఆకలి ఏం చేయాలో తోచక తిరుగుతుండగా మరో వ్యక్తి తారసపడతాడు. అది స్త్రీలకైతే పురుషుడు, పురుషులకైతే స్త్రీ తారసపడడం జరుగుతుంది. ఇది స్త్రీ పురుషుల స్నేహానికి గుర్తు….

మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన డా!!రాబర్ట్‌స్మిత్ చేసిన ప్రయోగాలలో అనేకమంది తాము మరణిస్తున్నట్టు లేదా సమాధుల దగ్గరకి వెళ్ళినట్టు కలగన్నారు. అదేవిధంగా మరికొందరు ప్రమాదానికి గురై, భయంకరంగా చనిపోయినట్టు కలగన్నారు.

సాధారణంగా కలలు పదిహేను నిమిషాలకు మించి వుండవు. తొంబై అయిదుశాతం కలలు వెంటనే మాయమైపోతాయి. ఆ కలల్లో గుర్తుండేది చలా స్వల్పం.. సృష్టిలో చాలా గొప్ప విషయం దంపతులిద్దరికీ వచ్చే కలలు సబ్జెక్ట్‌లో ఒకే రకంగా వుంటాయి.

మనిషి గాఢనిద్ర తర్వాత వైరుధ్యమైన నిద్రను పొందుతాడు. ఆ నిద్రనే ‘రెమ్ స్లీప్’ అంటారు. ఈ నిద్రలోనే మనిషి కలలు కంటాడు.” చెప్పడం ఆపింది దిశ.

“మీ జీవితానికి సంబంధించిన కలలు రావడం వేరు- ఇతరులకు జరిగే సంఘటనలు మీకు కలగా రావడం వేరు. ఈ డ్రీమ్స్‌కీ, టెలీపతికి సంబంధం వుందా?” ప్రశ్నించింది భారతి.

“ఉంది! నా దృష్టిలో డ్రీమ్‌కు అది యదార్దరూపం” దిశ అంది.

“మీ జీవితానికి సంబంధించి వచ్చిన కలల్ని మీరు ఎనలైజ్ చేసుకుంటారా?” ఆసక్తిగా అడిగింది భారతి.

“ఒక రకంగా మృత్యువు మీద, క్రయోనిక్స్ మీద ఇంట్రెస్ట్ పేరగడానికి కారణం నాకు వచ్చిన పర్సనల్ డ్రీమ్సే” చెప్పింది ఆమె.

 

ఇంకా వుంది……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *