May 25, 2024

సరిగమలు గలగలలు – 3 పెండ్యాల నాగేశ్వరరావు

రచన: మాధవపెద్ది సురేష్  suresh

పెండ్యాల నాగేశ్వరరావుగారు అద్భుతమైన సంగీత దర్శకుడు. మొట్టమొదటిసారి ఆయన్ని విజయవాడలో దుర్గా కళామందిరంలొ ‘జగదేకవీరుని కథ’ శత దినోత్సవ సభలో చూశాను. నా జీవితంలో ఎంతో అనుభూతి పొందిన క్షణాలు అవి. అమ్మ, నాన్న, అన్నయ్యలతో వెళ్లాను. మా చిన్నాన్నగారు గోఖలే (కళాదర్శకుడు) గారితో అందరం వెళ్లాం. ఆ సినిమాలో అన్ని పాటలూ బావున్నా ‘శివశంకరీ‘ పాట నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. పింగళిగారు, పెండ్యాల గారు, ఘంటసాల గారు ఎంత గొప్ప కాంబినేషన్! అలాగే రామారావుగారి అభినయం!!

ఆ సభలో పాల్గొన్న మహామహుల్ని చూస్తే దేవుళ్లు, దేవతలని చూసిన అనుభూతి పొందాను. అందరూ ఘంటసాలగారిని ‘శివశంకరీ’ పాట పాడమని అడిగారు. ‘ఎంతో శ్రమించి ఈ పాట పాడాను, మొత్తం పాటంతా పాడాలంటే ఇప్పుడు నా వల్ల కాదు, పల్లవి వరకు పాడుతా’నని చెప్పి, ‘అసలు ఇంత గొప్ప పాటని కంపోజ్ చేసిన పెండ్యాలగారికే ఈ అభినందనలన్నీ దక్కుతాయి ’ అని ఎంతో వినమ్రంగా చెప్పారు. ఆ పల్లవి పాడితే ఎంత రెస్పాన్స్ వచ్చిందో చెప్పలేము. పెండ్యాలగారయితే ఆనంద భాష్పాలు తుడుచుకుంటూనే ఉన్నారు.

1293520760Pendyala

అసలు పెండ్యాలగారిలో ఎంత అణకువ! మాటలో, దుస్తులు ధరించటంలో అంతా తెలుగుతనం. చాలా సౌమ్యుడాయన. ఆయన స్వరపరచిన ఎన్నో పాటలు మేము కచేరీలలో పాడుతుండేవాళ్లం. ‘శివశంకరీ’ పాట కచేరీలలో నేను వాయిస్తున్నప్పుడు ఎంతో అనుభూతి పొందేవాణ్ని.

మద్రాసు వెళ్లిన తరువాత 1975 ప్రాంతంలో మొట్టమొదటిసారి ఆయనవద్ద కీబోర్డ్ వాయించే అవకాశం వచ్చింది. నేను, నా భార్య ‘దేవి’ థియేటర్‌లో ఏదో సినిమా చూడటానికి వెళ్లాం. కమాల్‌దాస్ (ఆర్కెస్ట్రా ఇన్‌చార్జ్) గారు నన్ను వెతుక్కుంటు థియేటర్‌కి వచ్చి ఇంటర్‌వెల్‌లో నన్ను పట్టుకున్నారు. ‘ఎంత ఇబ్బంది పెట్టావయ్యా బాబూ’ అన్నారు. ‘రేపటి నుండి పేండ్యాల గారి సినిమాకి రీ రికార్డింగ్ వుంది. నువ్వు కీబోర్డు వాయించాల’న్నారు. మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని మధురానుభూతిని పొందాను.

మర్నాడు వాహిని ‘ఎ’ థియేటర్‌లో రీరికార్డింగ్. ఆ సినిమా పేరు ‘సతీసావిత్రి’.  సౌండ్ ఇంజనీర్ వల్లభజోస్యుల శివరాంగారు నాకు తాతయ్య వరుసవుతారు. వెళ్లగానే ఆయనకి నమస్కారం చేశాను. ఆయన నన్ను పెండ్యాల గారికి పరిచయం చేశారు. పక్కనే రామారావుగారి సోదరులు త్రివిక్రమరావుగారున్నారు. అందరికి పాదాభివందనం చేశాను. పెండ్యాల గారు ‘నాయనా, నువ్వు రాజేశ్వరరావు గారు, చలపతిరావుగారు ఇలా అందరి దగ్గరా వర్క్ చేస్తున్నావని తెలిసింది.  మీ బాబాయిలు నాకు చాలా కావలసిన వాళ్లయ్యా. మీ ఇంటి పేరు నిలబెట్టు’ అని ఆశీర్వదించారు. దైవఘటన ఏంటంటే ‘సతీసావిత్రి’కి ఆర్ట్ డైరెక్టర్ గోఖలేగారు. సత్యంగారు పాడారు. అన్నయ్య పాడాడు, నేను వర్క్ చేస్తున్నాను. మేమందరం కలిసి వర్క్ చేసిన ఒకే ఒక సినిమా అది.

అక్కడ తబలా లక్ష్మణరావుగారు, పెండ్యాల గారి అసిస్టెంట్ బాబూరావు గారు, తబలా లక్ష్మినారాయణ, వయొలిన్ వాయించే అచ్యుతశాస్త్రిగారు, నంజప్ప (ఫ్లూట్) గారు లాంటి మహానుభావులు పరిచయం అయ్యారు. అచ్యుతశాస్త్రిగారు ఒకసారి విజయవాడలో పెళ్లికి వచ్చారు. వాళ్ల బంధువులది, అక్కడ ఆయన ఒక ప్రోగ్రామ్ చెయ్యాలంటే నేనూ, ఒక రిథం ప్లేయర్ పాల్గొన్నాం. ఆయన నన్నెంతో మెచ్చుకున్నారు. ఆ విషయమే పెండ్యాలగారితో చెప్పారాయన.

నాకు పెండ్యాలగారిలో నచ్చిన విషయం ఏమిటంటే ఆయన ఎవర్నీ నొప్పించకుండా ఆయనకి కావలసిన పెర్‌ఫక్షన్ కోసం ఎంతో తపన పడేవారు. టాక్‌బ్యాక్ బటన్‌లో మాట్లాడకుండా, ప్లేయర్స్ వద్దకు వచ్చి మంచి సూచనలిచ్చి వెళ్ళేవారు. ఒక మాదిరిగా వాయించే ప్లేయర్స్ కూడా ఆయన దగ్గర ఎంతో ధైర్యంగా, ఎంతో బాగా వాయించేవారు. అలాగే ఏనాడూ ఎవర్నీ విసుక్కొనేవారు కాదు. ‘మంచి సంగీతం అందించటం కోసం ఎంతో తపనపడే గొప్ప సంగీత దర్శకుణ్ని ఆయనలోనే చూశాను. పెర్‌ఫక్షన్ కోసం పరితపించే పెండ్యాలవారంటే నాకు వల్లమాలిన అభిమానం.

అందరికీ తెలిసిన విషయమే! సుశీలగారినీ, జానకిగారినీ తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఆయనకి ఘంటసాలగారంటే ప్రాణం. ఎటువంటి గొప్ప పాటల్ని స్వరపరిచారు ఆయన! ముఖ్యంగా ‘రసికరాజు తగు వారం కాదా‘, ‘శివశంకరీ‘ – శివానంద లహరీ’, ‘కొండగాలి తిరిగిందీ‘, ‘అనురాగము విరిసేనా‘, రాముడు భీముడు పాటలు. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నని చెప్పగలం? తిలక్ కామోద్, మొహన్, అభేరి, కల్యాణి, హిందోళ, కాపీ, భాగేశ్వరి ఇలా ఎన్నో రాగాలలో ఎన్నో మంచి పాటల్ని మలచారు.

పద్యాలు స్వరపరచటంలో మహామేధావి ఆయన. ‘తగునా ఇది మామ’, ‘సరదా సరద సిగిరెట్టూ’ లాంటి హాస్య గీతాలూ ‘మాణిక్యవీణ‘ లాంటి భక్తి గీతాలూ, ‘అనురాగము విరిసేనా’ లాంటి మృదుమధుర గీతాలూ, ‘శివశంకరీ’ లాంటి సంగీత ప్రధానమైన గీతాలూ, ఇలా ఏ రసాన్నయినా ఆయన పాటల్లో పద్యాల్లో చూపించేవారు.

‘పెండ్యాల – ఘంటసాల’ కాంబినేషన్ నాకు తెలిసి తెలుగు సినీవైభవానికి మణిదీపం. మకుటాయమానం. గుప్తుల కాలం అంటామే అలా పెండ్యాల, రాజేశ్వరరావు, ఘంటసాలల కాలం అని చెప్పటం ఎంతో సమంజసం, కర్నాటక సంగీతానికి త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్ల వలే సినీ సంగీతానికి ఈ ముగ్గురూ అని నా అభిప్రాయం.

అలాగే తరువాతి తరంలో భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన గాయకచక్రవర్తి బాలసుబ్రహ్మణ్యంగారితో ఎంతో కాలం గుర్తుపెట్టుకొనే మంచి పాటలు పాడించారు. (ఉదా: ‘నా పేరు బికారీ’, ‘చిత్రం భళారే విచిత్రం’ లాంటి పాటలు)

అలాగే ఘంటసాల, సుశీల, పెండ్యాల కాంబినేషన్‌లో వచ్చినవన్నీ గొప్ప పాటలే! మహాగాయని జానకిగారు తక్కువ పాటలు పాడినా అన్ని సూపర్‌హిట్స్.

మా అన్నయ్య రమేష్, సుశీల గారు పాడిన ‘కలగంటినో స్వామి‘ (దానవీరశూరకర్ణ) పాటంటే నాకెంతో  ఇష్టం. వేములవాడ భీమకవిలో అన్నయ్య చేత మంచిపాటలు, పద్యాలు పాడించారు.

ఒక సంఘటనని నేను మరిచిపోలేను. పెండ్యాల గారి వద్ద ‘కళారంజని’ (అది ఆయన ఆఖరి సినిమా అనుకుంటా), రీ రికార్డింగ్ ‘భరణి’లో జరుగుతోంది. నా దగ్గర ఒక Samsonite bag ఉండేది. మర్నాడు హైదరాబాద్‌లో బాలుగారి కచేరికి నేను వెళ్లాలి. మార్నింగ్ ప్లయిట్ టిక్కెట్, 450/- రూ.!! ల క్యాష్ ఆ బ్యాగ్‌లో ఉన్నాయి. అనుకోకుండా ఎవరో ఆ బ్యాగ్‌ని దొంగిలించారు. దానికి ఆయన ఎంత బాధపడ్డారో! ఎంత సున్నితమైన హృదయమో ఆయనది! ఎక్కువగా నడక ఇష్టపడేవారు. పెదపెద్ద అంగలేసుకుంటూ హుందాగా నడిచేవారు.

గుంటూరులో ఆయన సంగీత విభావరి జరిగింది. దానికి నేను కీ బోర్డు ప్లేయర్‌ని. ‘నా పేరు బికారీ’ పాటకి హార్మోనియం వాయించాను. ఆ పాటను వాయించింది ప్రఖ్యాత సంగీత దర్శకులు వేణుగారు. ఆ పాటలో BGMS వాయిస్తున్నప్పుడు హార్మోనియం బిట్స్ అన్నీ ఇలా ఉండాలి అని దగ్గరుండి చెప్పేవారు రిహార్సల్స్‌లో.

ఒకసారి పి.బి.శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ ఘంటసాలగారంటే పెండ్యాలగారికి ఎంత అభిమానమో వివరిస్తూ ఒక సంఘటన చెప్పారు. ‘మంటలు రేపే నేలరాజా‘ (రాము) ఒరిజినల్ వెర్షన్ తమిళంలో పి.బి.ఎస్.గారు పాడారు.  ఆ పాటను పి.బి.ఎస్.గారు ఎంతో అద్భుతంగా పాడాను, నేను ఎంతవరకు న్యాయం చేయగలనో చూడాలి’ అని ఘంటసాలగారు పెండ్యాలగారితో అన్నారట. ఆ విషయం పెండ్యాలగారు ఒక సందర్భంలో పి.బి.ఎస్. గారితో చెబుతూ ‘ఘంటసాలగారు మిమ్మల్ని ఆ పాట ఎంతో బాగా పాడారని మెచ్చుకున్నారండీ’ అన్నారుట. ఘంటసాలగారు చెప్తే పెండ్యాలగారికి తిరుగులేదు’ అన్నారు పి.బి.ఎస్.గారు.

ముఖ్యంగా నేను ‘బైరవద్వీపం’లో ‘శ్రీ తుంబురనారద నాదామృతం’ పాటని కంపోజ్ చేయటానికి ముఖ్యమైన ఇన్‌స్పిరేషన్ ‘శివశంకరీ’ పాట. విజయా సంస్థలో రామారావు గారికి ‘శివశంకరీ’ పాట ఎంత గొప్ప పేరు సంపాదించి పెట్టింది. అలానే అదే సంస్థలో తరువాతి తరం వాళ్లమైన నాగిరెడ్డిగారి కుమారులు వెంకటరామిరెడ్డిగారు, నేను, వేటూరి గారు, బాలకృష్ణ గారు, సింగీతం శ్రీనివాసరావుగార్ల కాంభినేషన్‌లో ఎంతో కసిగా ఈ పాటకు  ప్రాణప్రతిష్ట చేశాము. ‘దర్బార్ కానడ’ రాగంలో పెండ్యాల గారు ‘శివశంకరీ’ పాటని కంపోజ్ చేస్తే, ‘పల్లవి, మొదటి చరణం వరకు ‘అభేరి’, రెఃడవ చరణంలో షడ్జమానికి హంసధ్వని, రిషభానికి కేదారిగౌళ, గాంధారానికి సరస్వతి, ధైవతానికి చక్రవాకం, నిషాదానికి కల్యాణి రాగాలలో ‘శ్రీతుంబర నారద నాదామృతం‘ పాటని కంపోజ్ చేశాను. వీటూరి గారు అధ్బుతంగా రచించగా, బాలసుబ్రహ్మణ్యంగారు అమోమంగా ఆలపించగా, బాలకృష్ణగారు ఇచ్చిన ‘లిప్ మూవ్‌మెంట్’ ఎక్‌స్ట్రార్డినరీగా వుండటం దైవఘటన. ఈ పాటకి సార్థకత ఉండేది. కానీ నాకా భాగ్యం లేదు.

‘విశ్వనాధ నాయకుడు’ చిత్రానికి మొదటి పాట రికార్డ్ చేస్తున్నారు. జె.వి.రాఘవులు గారి సంగీత పర్యవేక్షణ. ప్రసాద్‌లాబ్ 70 ఎం.ఎం. రికార్డింగ్ థియేటర్‌లో ముహుర్తం. వడ్డే రమేష్‌గారు నిర్మాత. నేను కీ బోర్డ్ ప్లేయర్‌ని ఆ పాటకి. మధ్యాహ్నం  12 గంటల ప్రాంతంలో పిడుగులాంటి వార్త ‘పెండ్యాల గారు పరమపదించారని’. ఎస్‌పిబి గారి కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. బాలుగారే రాగానే ఈ వార్త చెప్పారు. మా రికార్డింగ్ అయ్యేటప్పటికి ఆయన భౌతిక కాయాన్నిఖననం చేశారు. గురువుగారిభౌతిక కాయాన్ని చూడలేక పోయానని ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే ఎరుక.

మళ్లీ ఒక పెండ్యాలగారు పుడతారని నేననుకోను. ఆయన ఆశీర్వాదం సినీ సంగీతాభిమానులందరికీ లభించాలని మనసావాచా కర్మణా కోరుకుంటున్నాను.

పెండ్యాల నాగేశ్వరరావుగారు అందించిన ఆణిముత్యాలు కొన్ని:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *