April 19, 2024

అతడే ఆమె సైన్యం – 6

రచన: యండమూరి వీరేంద్రనాధ్

yandamoori

జీపుల తాలూకు ముందు వుండే రేకులు (బోయినెట్లు) విప్పి, కత్తియుద్ధంలో ఉపయోగించే “డాలు” లాగా తమని తాము రక్షించుకుంటూ వస్తున్నారు సైనికులు.
ఆ దృశ్యాన్ని చూస్తున్న అజ్మరాలీ, వాళ్ళ మూర్ఖత్వానికి నవ్వుకున్నాడు. మరోవైపు కోపమూ, విసుగూ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే “డాళ్ళు” రైఫిల్ బుల్లెట్లకి అడ్డు నిలబడవు. వంతెనకి కాస్త ఇటువైపుకి దగ్గరకి రాగానే చైతన్య ఇస్మాయిల్ పేల్చే కాల్పులకి అందరూ నల్లులా మాడిపోతారు.
అయితే అతని అంచనాని తప్పుచేస్తూ సైనికులు మరో నాలుగు గజాలు వంతేన మీద ముందుకు వచ్చి ఆగిపోయారు. చేతిలో వున్న రేకులు వంతెనకి జల్లెడలా అడ్డుపెట్టి, వెనక్కి వెళ్ళి విరిగిపోయిన చెక్కలు రిపేరు చేయసాగారు. ఇటువైపు వున్నవాళ్ళకి రేకులు తప్ప సైనికులు కనపడటంలేదు.
ఇస్మాయిల్ కసిగా పళ్ళు కొరికాడు.
చైతన్య మాత్రం బాధపడ్డాడు. అతడి బాధకి కారణం వుంది.
వాళ్ళు అడ్డుగా పెట్టిన రేకులు, బుల్లెట్ ఫ్రూవ్‌లు కావు. తను రైఫిల్ పేలిస్తే ఆ బుల్లెట్ రంధ్రం చేసుకుంటూ వెళ్ళి అవతలి వాళ్ళని చంపక తప్పదు. కానీ ఇందులో ఒక చిన్న చిక్కు మాత్రం వుంది. ఆ రేకుల అవతల ఏ మనిషి ఎక్కడున్నాడో సరిగ్గా తెలియదు. అది ఇరవై బుల్లెట్లు పేలిస్తే ఒకటి సరీగ్గా తగులుతుంది.
తమ దగ్గిరవున్న బుల్లెట్స్‌ని వృధాచేయటం అవతలి కమాండర్ ఉద్ధేశ్యమని చైతన్యకి అర్థమైంది. కానీ దానికోసం అతను వేస్తున్న “ఎర” అని చూసి బాధ కలిగింది. అవతలి సైన్యాన్ని చిన్నాభిన్నం చేయటానికి, సర్వనాశనం చేయటనికీ ఒక సైనికుడు ఆత్మత్యాగం చేసినా తప్పులేదు. కానీ తమలాంటి “నిస్సాయుల్ని” చంపటానికి సైనికుల్ని ఎందుకు బలిపెట్టాలనుకున్నాడో అర్థంకాలేదు. కామండర్ దీన్ని తన గౌరవానికి సంబంధించిన విషయంగా తీసుకున్నాడని మాత్రం అర్థం అయింది.
“ఏం చేద్ధాం” అన్నట్టు చూశాడు ఇస్మాయిల్.
చైతన్య రైఫిల్ చేతిలోకి తీసుకున్నాడు.
ఇస్మాయిల్ తన దగ్గిరవున్న బుల్లెట్స్ అన్నీ అతనికివ్వబోయాడు.
అవసరం లేదన్నట్టు తల అడ్డంగా వూపి, వెనగ్గా వెళ్ళి గుట్టపైకి ఎక్కసాగాడు చైతన్య.
అతడు చేయదల్చుకున్నది ఏమిటో అర్థంకాక అజ్మరాలీ కూడా అశ్చర్యంగా చూడసగాడు.
గుట్టపైకి వెళ్ళాక బోర్లా పడుకుని, రైఫిల్ గురి చూసుకున్నాడు. శత్రువులు అడ్డుగా పెట్టిన బోయ్‌నెట్స్ పైనుంచి సైనికులు కనపడుతున్నారు. అతడు ఏకాగ్రతనంతా కంటిచూపులోకి తెచ్చుకున్నాడు. అంత దూరంనుంచి కాల్చటం దాదాపు అసాధ్యం. కానీ మనిషికి అసాధ్యం కానిదేదీ లేదని నమ్మినవాళ్ళల్లో అతనొకడు.
ఒక పాకిస్తానీ సైనికుడు వంతెనమీద చెక్క బిగిస్తున్నాడు. దాదపు పాతికేళ్ళు వుంటాయి. ఇంకా లేతగానే వున్నాడు. చైతన్య ఒక్కక్షణం తటపటాయించాడు. కానీ యుద్ధంలో తప్పదు. ట్రిగ్గర్ మీద వేలు బిగించి మరొకసారి గురి సరిగ్గా చూసుకుని నొక్కాడు.
రైఫిల్ పేలింది. ఒకటే ఒక బుల్లెట్…
అడ్డుగా పెట్టిన బోయినెట్స్ అసలు కదల్లేదు. చైతన్య పేల్చిన గుండు ఆ రేకుల పైనుంచి వెళ్ళి సైనికుడి భుజాల్ని తాకింది. అతను గట్టిగా ఆర్తనాదం చేశాడు. వంతేన మీద పని చేస్తున్న సైనికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతులయ్యారు. క్షణంలో అక్కణ్ణుంచి వెనక్కి పరుగెత్తి చెట్లలో మాయమయ్యారు. చైతన్య సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.
అవతలివైపు ఆర్మీ కమాండర్‌కి కళ్ళముందు ఏదో మెరిసినట్టయింది. శత్రువు అంత వెనక్కి వెళ్ళి గుట్టమీద నుంచి కాలుస్తాడనీ, ఒకవేళ కాల్చినా అది సూటిగా తగులుతుందనీ అతడు ఊహించలేకపోవటంతో తబ్బిబ్బు అయ్యాడు.
చైతన్య అనుకున్నట్లు ఆ కమాండర్ కేవలం ఒక్క “రేకే” అడ్దు పెట్టలేదు. మొత్తం తమ దగ్గిర వున వాహనాల తాలూకు స్టీల్ అంతా రెండేసి పొరలు అమర్చాడు. దానివల్ల బుల్లెట్ దగ్గిరకొచ్చేసరికి వేగం తగ్గిపోతుంది. నిజంగానే ఇది చాలా మంచి ప్లాను. అయితే చైతన్య అసలు ఈ అడ్డంకిని పట్టించుకోకుండా పైకి వెళ్ళి కాల్చటముతో మరో సైనికుడు గాయపడ్డాడు.
జగదీష్ కొడుకుని అభినందిస్తున్నాట్లు చూశాడు. అయితే చైతన్య గుట్టదిగి వస్తూండగా ఊహించని సంఘటన జరిగింది.
అవతలి పక్షంలో సైనికుడు గాయపడటం, అందరూ వెనక్కి పరుగెత్తటం చూస్తూ ప్రనూష ఒక్కక్షణం ఏమరుపాటుగా వుంది. అది గమనించి అజ్మరాలీ తిరగబడ్డాడు. ఆమె కళ్ళు తిప్పుకునేలోపులో, చేతిమీద బలంగా కొట్టి ఆమె దగ్గిర ఆయుధాన్ని క్రింద పడతోసాడు. ఆమె దాన్ని వంగి అందుకోబోయింది. దానికన్నా ముందే అతడు దాన్ని తీసుకుని పరుగెత్తాడు.
అక్కడున్న వాళ్లందరూ నిశ్చేష్టులయ్యారు.
అందరికన్న ముందు తేరుకున్నది ఇస్మాయిల్.
ఇస్మాయిల్ అజ్మరాలీ వెంటబడ్డాడు.
చైతన్య “వద్దు-వద్దు” అని అరుస్తున్నాడు. కానీ ఇస్మాయిల్ ఆగలేదు. అజ్మరాలీ అలా ఆయుధంతో వదిలేస్తే అతడు తమ వెనుక వైపు వుంటాడు. ముందొక శత్రువునీ, వెనుకొక శత్రువునీ పెట్టుకొని పోరాడటం కష్టం. అందుకే ఇస్మాయిల్ చేతిలో ఆయుధం వుందని తెలిసికూడా వెనుక పరుగెత్తటం ప్రారంభించాడు.
ఆ చుట్టుప్రక్కల చెట్లు లేవు. అన్నీ రాళ్ళూ గుట్టలు.
అజ్మరాలీ సైన్యంలో వున్నవాడు. ఇస్మాయిల్ సైన్యం నుంచి రిటైరయినవాడు. అయినా ఇస్మాయిలే చురుగ్గా వున్నాడు. సైన్యంలో ఉన్నతాధికారులకి రోజువారీ ప్రాక్టీస్ వుండదు.
…ఇద్దరి మధ్యా వేగం తక్కువైంది.
ఇస్మాయిల్ అజ్మారాలీని అందుకోబోయాడు. అజ్మరాలీ వెనకి తిరిగి పిస్టల్ కాల్చాడు. దగ్గిర రేంజిలో కాల్చటం వల్ల బుల్లెట్ ఇస్మాయిల్ చేతిగుండా దూసుకుపోయింది. రక్తంతో అతడి బట్టలు తడిచిపోయాయి. బాధగా మోకాళ్ళమీద కూలిపోయాడు.
బహుశా అప్పుడర్థమై వుంటుంది అజ్మరాలీకి. తన చేతిలో వున్న ఆయుధంతో మిగతావాళ్ళని బెదిరించవచ్చని…
ఇస్మాయిల్ భుజం పట్టుకుని పైకిలేపి, ముందుకు నడిపిస్తూ అరిచాడు. “…మీ ఆయుధాలు వదిలేసి లొంగిపోండి. లేకపోతే ఇస్మాయిల్‌ని కాల్చేస్తాను.”
చైతన్య, ప్రనూష, లక్ష్మి, జగదీష్, రంగనాయకి.. అందరూ శిలాప్రతిమల్లా నిలబడి వున్నారు. చైతన్య తన చేతిలోని రైఫిల్‌ని వదిలేసాడు.
అవతలి వాళ్ళకి ఈ దృశ్యం బహుశా లీలగా కనిపిస్తూ వుంటుంది. అటువైపు కూడా అలికిడి లేదు.
అజ్మరాలీ మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తూంది. ఇలా అందర్నీ ప్రాణాల్తో (ముఖ్యంగా జగదీష్‌ప్రసాద్‌ని) పట్టుకోవడం ద్వారా పై అధికారుల ప్రాపకం సంపాదించుకోవచ్చని అనుకుంటున్నాడు.
విజయోత్సాహంతో ఇస్మాయిల్ వెనుకే పిస్తోలు పట్టుకుని వస్తూన్న అజ్మరాలీని నిస్సహాయంగా చూస్తున్నారు మిగతావాళ్ళు. అందరూ తమ తమ ఆయుధాలను క్రింద పడేసారు.
అజ్మరాలీకీ ఇస్మాయిల్‌కీ మధ్య అయిదారడుగుల దూరం వుండి వుంటుంది.
రాళ్ళని దాటుకుంటూ ముందుకొస్తూన్న అజ్మరాలీ, ఒక చోట అడుగు వేయగానే, చెవులు మార్మోగేలా బ్రహ్మాండమైన విస్పోటనం జరిగింది. పెద్ద పేలుడుతో భూమిలోంచి ధూళి పైకిలేచింది. దాంతోపాటే అజ్మరాలీ శరీరం కూడా పైకి లేచింది. అతని కాలు నిలువుగా చీలిపోయింది. అతని ముందు నడుస్తూన్న ఇస్మాయిల్ తూలిపడాడు. ఆ ప్రదేశమంతా దుమ్ముతో నిండింది. అక్కడేం జరిగిందో, కొద్దిక్షణాలపాటు అయోమయంతో ఎవరికీ అర్థంకాలేదు.
“లాండ్‌మైన్” అరిచాడు చైతన్య. “…ఇస్మాయిల్ – జాగ్రత్తగా రా”
ఇస్మాయిల్ కూడా సైన్యంలో పనిచేశాడు కాబట్టి ‘లాండ్‌మైన్స్’ గురించి అతడికి తెలుసు. సైన్యం ఒక ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళి పోయేటప్పుడు శత్రు సైనికుల్లో నష్టం కలుగచేయటానికి లాండ్‌మైన్స్ (భూమి అడుగున బాంబులు) ఏర్పాటు చేస్తారు. ఏ మాత్రం వత్తిడి తగిలినా ఇవి పేలిపోతాయి.
ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోవటానికి వెళ్ళిన వారి అడుగు గానీ, వాహనల బరువుగానీ పడగానే, ఇది పేలి, విపరీతమైన నష్టం కలుగచేస్తాయి.
భారత సైన్యం ఆ ప్రదేశాన్ని ఖాళీచేస్తూ వెళ్లిపోతున్న సమయంలో ఏర్పాటు చేసిన మైన్లు అయి వుంటాయని అనుకున్నాడు చైతన్య.
ఇస్మాయిల్ జాగ్రత్తగా తన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రనూష అతడి గాయం పరిశీలించింది. అదృష్టవశత్తు బుల్లెట్ అతని శరీరంలో చిక్కుకుపోలేదు. రక్తం మాత్రం ధారగా కారుతూంది. గుడ్డతో గట్టిగా దాన్ని బిగించి, ప్రధమ చికిత్స ప్రారంభించింది.
ఈ లోపులో చైతన్య కర్ర సాయంతో అజ్మరాలీ దగ్గిరికి వెళ్ళాడు.
భూమిలో పాతి పెట్టబడి వున్న లాండ్‌మైన్స్ మీద పొడవాటి కర్ర సాయంతో వత్తిడి కలిగిస్తూ ముందుకు సాగాలి. ఒకవేళ అవి పేలినా, వెనుక నడుస్తున్న మనిషికి అపాయం వుండదు.
అజ్మరాలీ రక్తపు మడుగులో పడి వున్నాడు. కాలు దాదాపు పనికిరాదు. ఒక రాతిముక్క ఎముకని చీలుస్తూ లోపలికి గుచ్చుకుని పోయి వుంది. దానితోపాటు కాలు కూడా తీసెయ్యవచ్చు. ఆ రాయి అడ్డువుండటంవల్ల రక్తం రావటం లేదు.
దగ్గరికి వస్తూన్న చైతన్యని చూసి ఆ స్థితిలో పిస్టల్ కోసం వెతికాడు అజ్మరాలీ. కానీ ఆ ప్రేలుడులో అది ఎక్కడ పడిందో కనపడలేదు. చైతన్య అతడిని లేపి, వచ్చిన దారివెంటే జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చాడు.
అప్పటికి ఇస్మాయిల్ గాయానికి కట్టు కట్టడం పూర్తిచేసింది ప్రనూష.
వాళ్ళ ముందుకొచ్చి అజ్మరాలీ పడిపోయాడు.
“కాల్చు” అన్నాడు చైతన్య.
అంత హాఠాత్తుగా అతడు అలా అనేసరికి, అతడేం చెయ్యమంటున్నాడో అర్థంకాక ప్రనూష అయోమయంగా చూసింది. చైతన్య తన చేతిలోని పిస్టల్ ఆమె చేతికిచ్చి అజ్మరాలీని చూపిస్తూ “కాల్చు” అన్నాడు మళ్ళీ, అక్కడున్న వారంతా ఈ హాఠాత్ నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. చైతన్య వాళ్ళని పట్టించుకోలేదు. “ఇతన్ని చంపటం కోసమేగా నన్ను నీతో తీసుకొచ్చావ్. ఇతని మీద పగ తీర్చుకోవడం కోసమేగా ఇంత ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు ఇంత శ్రమపడి.. ప్రాణాలకు తెగించి వచ్చావ్” అన్నాడు.
ఆమె ఇంకా సందిగ్ధంలో వుంది.
“నేను నిజంగానే చెపుతున్నాను. ఇతన్ని చంపేస్తే ఒక పని అయిపోతుంది. ఇంతసేపూ ఇతను మనకి బందీగా వుంటే పాకిస్తాన్ సైన్యం మనమీద దాడి చెయ్యదని అనుకున్నాను. అది ఎలాగూ తప్పని తెలిసిపోయింది. ఇప్పుడు యితన్ని మనతో వుంచుకోవటం పాముని పక్కలో పెట్టుకోవడమే అనిపిస్తోంది. ఇతడి అవసరం మనకి లేదు. నువ్వు చంపెయ్యవచ్చు.”
ప్రనూష చైతన్య వైపు బ్లాంక్‌గా చూసింది. తను చెప్పవలసింది అయిపోయినట్టు చైతన్య దూరంగా, లాండ్‌మైన్స్ వైపు వెళ్ళాడు.
చుట్టూ వున్నవాళ్ళు నిశ్శబ్దంగా ఆమెవైపే చూస్తున్నారు ఆమె ఇబ్బందిగా పిస్టలు పట్టుకుని వుంది. పది నిముషాల తర్వాత చైతన్య తిరిగి అక్కడికి వచ్చేసరికి ఇంకా ఆమె అలాగే వుంది.
“ఏమిటి ఆలస్యం?”
ఆమె నిస్సహాయంగా అతనివైపు చూస్తూ “అలా పడివున్న వాడిని ఎలా చంపను? అంది.
“కానీ అతన్ని చంపటం కోసమేగా నన్ను నీ సైన్యంగా నియమించుకున్నావు”.
“యుద్ధంలోనో, మామూలుగా తిరగబడితేనో చంపటంవేరు… ఇలా నిస్సహాయంగా పడివున్న వాడిని చంపడం వేరు.”
“కానీ అతను నీ తల్లినీ-తండ్రినీ…”
“నిజమే…” అతడి మాటలు మధ్యలో ఆపుచేస్తూ అంది. “అతడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన మాట నిజమే. నా జీవితమంతా అతడిని ఎలా కడతేర్చాలా అని ఆలోచిస్తూ గడిపిన మాట కూడా నిజమే కానీ నేను ఇప్పుడు మాత్రం ఆ పని చేయలేను” ఆమే అక్కణ్ణుంచి దూరంగా వెళ్ళిపోయింది.
చైతన్య తండ్రివైపు జరిగాడు. “మిమ్మల్ని ఇతడు పాతిక సంవత్సరాలు జైల్లో వుంచాడు. మీతో రహస్యం చెప్పించటం కోసం నరకం చూపించాడు. దానికి ప్రతీకారంగా మీరు అతన్ని చంపదల్చుకుంటే… ఇదిగో పిస్తోలు.”
జగదీష్ కొడుకువైపు ఓ క్షణం చూసి “నాకలాంటి ఉత్సాహమేమీ లేదు” అన్నాడు ఇంగ్లీషులో.
చైతన్య ఇస్మాయిల్‌తో “నువ్వు ఆర్మీలో పనిచేశావుగా. ఇలాంటి పనులు సులభంగా చేయగలవు. ఇతడు మనతోపాటూ వుంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఇతని గురించి ఒకరు ఎప్పుడూ పని మానుకుని కూర్చోవాలి” అన్నాడు.
“నాకు అతనిపట్ల ఎటువంటి శత్రుత్వమూ లేదు.”
“కానీ నువ్వు సైన్యంలో పనిచేసి వచ్చావు.”
‘సైన్యంలో కూడా శత్రువులు ఇలా నిస్సహాయంగా వుంటే ఎవరూ చంపరు.”
“అతడు నీ మతస్థుడని చంపటానికి సంశయిస్తున్నావు కదూ…”
ఇస్మాయిల్ చివుక్కున తలెత్తి, అంతలోనే ఏదో అర్థమైనట్టు అన్నాడు. “ఇదంతా నన్ను రెచ్చగొట్డటానికి నువ్వు అంటున్నావని నాకు తెలుసు. అతడు నా మతస్థుడే. కానీ మతం మనిషి నిర్మించుకున్నది. మతంకన్నా మానవత్వం గొప్పదని మా అల్లాయే చెప్పాడు.”
అజ్మరాలీ వారిద్దరి సంభాషణనూ వింటున్నాడు.
చైతన్య అన్నాడు. “సరిహద్దు కూడా మనిషి నిర్మించుకున్నదే! కేవలం ఒక గీతకి అటూ ఇటూ వుండటంవల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులు అవుతారు…. చిత్రంగా లేదూ.”
“మమ్మల్నందర్నీ అడుగుతున్నావు. అతని నువ్వే చంపవచ్చుగా?”
“అతనితో నాకు పని వుంది” అన్నాడు చైతన్య. ”
… ఆ పని కోసం అతన్ని వాడుకోబోయేముందు మీ అందరినీ అడగాలి కదా! ముఖ్యంగా ప్రనూషని… ఆమే కదా ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి ఇతన్ని చంపటం కోసం వచ్చింది…” అని ప్రనూష వైపు తిరిగి- “నాకిచ్చిన పని పూర్తి అయింది. అతన్ని నీకు ఒప్పచెప్పాను. అతన్ని నువ్వు చంపకుండా వదిలేస్తున్నావు అంతేనా?” అని అడిగాడు.
“అంతే” అన్నట్లు ఆమె మౌనంగా వుండిపోయింది.
సాయంత్రమవుతోంది.
అజ్మరాలీ కాలికి స్వయంగా కట్టుకట్టాడు చైతన్య. తరువాత గుట్టల వెనుక వున్న టెంట్స్ అన్నీ వెతికి ఒక పెద్ద చెక్క పలక తీసుకొచ్చాడు. దాని అవసరం ఏముందో అక్కడి వారికి అర్థంకాలేదు.
అంతలో వంతెనకి అవతలి పక్కనుంచి శబ్దం వినిపించి అందరూ అటు చూశారు.
కొండపైన మెలికలు తిరిగి వున్న రోడ్డుమీద నుంచి వరుసగా దిగి వస్తూ కనిపించాయి.
టాంకులు… ఒకదాని వెనుకే ఒకటి…
శత్రువుని కబళించటానికి వస్తూన్న మృత్యువు కోరల్లా వున్నాయవి.
వరుసగా నాలుగయిదుసార్లు అవి పేలితే చాలు. ఇటు పక్క అంతా శ్మశానంలా మారుతుంది.
వాటికి భయపడి వెనక్కి తగ్గితే, వాళ్ళు వంతెనదాటి వచ్చేస్తారు.
ఎటూ దారి లేదు.
వస్తూన్న టాంకుల శబ్దం ఎక్కువైంది. సైనికులందరూ చెట్లచాటునుంచి వచ్చి, టాంకులు పొజిషన్‌లో నిలబడడం కోసం జీపులు పక్కగా తీసి పెడుతున్నారు. అంతా కోలాహలంగా వుంది. మరికొద్ది నిమిషాల్లో లభ్యమయ్యే విజయోత్సాహం వాళ్ళల్లో ఇప్పుడే కనిపిస్తోంది.
ప్రనూష, లక్ష్మి అందరూ నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డారు.
ఇస్మాయిల్ చైతన్య దగ్గరగా వచ్చి “ఏం చేద్దాం” అని అడిగాడు.
అతను సమాధానం చెప్పకుండా అవతలి ఒడ్డుకేసి చూస్తున్నాడు.
టాంకులు వచ్చి ఆగాయి. నెమ్మదిగా వాటి గురి యివతలి తీరం మీదకు చేరుతోంది.
“మనం ఇక్కడ్నించి ఆ కొండల్లోకి పారిపోతే కొంచెం సేపయినా ప్రాణాలు రక్షించుకోగలమనుకుంటాను” అన్నాడు ఇస్మాయిల్.
“ఎంతసేపు? అయిదు నిమిషాలో.. పది నిమిషాలో…”
“ఇక్కడుంటే అదీ దక్కదుగా” ప్రనూష అంది. “ఇస్మాయిల్ చాలా వీక్‌గా వున్నాడు. మిగతా ఇద్దరూ వృద్ధులు. వాళ్ళందర్నీ వదిలేసి విడివిడిగా వెళ్ళి పోలేంగా.”
ఆమె మాటల్లో లాజిక్‌కి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు.
టాంక్‌నుంచి మొదటి కాల్పు వినిపించింది. వీళ్ళున్న ప్రదేశానికి వంద గజాల దూరంలో వచ్చిపడింది గుండు. రాళ్ళు, దుమ్ము పైకి లేచాయి. ఒకవైపు నంచి వరుసగా “క్లియర్” చేసుకుంటూ రావటం వాళ్ళ ఉద్దేశ్యమని స్పష్టంగా తెలుస్తూంది.
మరోసారి టాంక్ పేలింది. ఈసారి మరింత దగ్గరగా..
చైతన్య లేచి. “ఇస్మాయిల్… మిగతావాళ్ళని నువ్వు దూరంగా తీసుకువెళ్ళు” అని అజ్మరాలీ దగ్గరకి వెళ్ళి “లే…” అన్నాడు.
అజ్మరాలీ అర్థంకానట్టు చూశాడు.
“నిన్ను మీ వాళ్ళ దగ్గరకు పంపించేస్తున్నాను.”
వింటూన్న ప్రనూష అదిరిపడింది. ఏదో అనబోయి మళ్ళీ వూరుకుంది.
అజ్మరాలీ ఇంకా దిగ్బ్రాంతి నుంచి తేరుకోలేదు.
చైతన్య అన్నాడు, “నిన్ను చంపటం ప్రనూషకి ఇష్టం లేదు. నువ్వు ఆమె తల్లిదండ్రుల్ని చంపినా, ఆమెని బలవంతం చేయబోయినా, ఆమెకి ఇప్పుడు నీమీద కోపం లేదు. మాతోవుంటే మాతోపాటూ మరణించాలి. అందుకే పంపించేస్తున్నాను” అంటూ అతన్ని లేపి నిలబెట్టాడు.
అజ్మరాలీ బాధగా మూలిగాడు.
అతన్ని ప్రనూష భుజాలమీదకి ఆసరాగా చేర్చాడు చైతన్య. “జాగ్రత్తగా వంతెన దగ్గరికి తీసుకురా ఇతన్ని” అని ప్రనూషతో చెప్పి తను రైఫిల్ తీసుకుని వంతెన దగ్గరగా వెళ్ళి ఒక రాతిపక్కన నిలబడ్డాడు.
ఇస్మాయిల్ మిగతా వాళ్ళని తీసుకుని కొండలవైపు వెళ్ళిపొయాడు.
అవతలిపక్క టాంకు మరోసారి పొజిషన్ చూసుకుంటూంది.
ప్రనూష భుజాలమీద చేయివేసి భారంగా నడుచుకుంటూ దగ్గరకి వచ్చాడు అజ్మరాలీ.
అవతలివైపున్న కమాండర్ బైనాక్యూలర్స్‌లో అజ్మరాలీని, ప్రనూషనీ చూశాడు.
ప్రనూష మీద రైఫిల్ పేల్చమని తన సైనికులకి ఆజ్ఞ ఇవ్వబోయాడు.
అంతలో రాతిపక్కనున్న చైతన్య స్వరం గట్టిగా వినపడింది.
“మీ చీఫ్‌ని వదిలి పెడుతున్నాం. అతను మీ వైపుకి వస్తున్నాడు. మీరు ఆమెకి అపాయం తలపెడితే, మీ చీఫ్‌నీ ఇక్కణ్ణుంచి నేను గురిచూసి చంపేయవలసి వుంటుంది.”
ఆజ్ఞ ఇవ్వబోయిన కమాండర్ ఆగిపోయాడు. అతడికి చైతన్య చర్య అర్థంకాలేదు.
కావాలనుకుంటే ఆ కమాండర్ అజ్మరాలీని ప్రనూషనీ కూడా కాల్చవచ్చు. కానీ ఎంత కాదనుకున్నా అజ్మరాలీ తన చీఫ్. అందుకని ఆగిపోయాడు. అదీగాక అజ్మరాలీ వంతెన దాటి వచ్చేవరకూ ఆగటంలో ప్రమాదం ఏమీ కనబడలేదు. ఆ తర్వాత ఎలాగూ వాళ్ళు తమ చేతికి దొరక్క తప్పదు.
టాంకుని పేల్చటం కూడా ఆపమని తన సైనికులకు సైగచేశాడు.
ప్రనూష అజ్మరాలీని వంతెన వరకూ తీసుకెళ్ళి వదిలి, పక్కనే రాతి వెనుకగా నిలబడివున్న చైతన్య దగ్గరకి వచ్చింది.
వంతెనకున్న తాళ్ళు పట్టుకుని ఒంటికాలితో నెమ్మదిగా డేకసాగాడు అజ్మరాలీ. రెండు అడుగులు వేసి కూలిపోయాడు. అవతల్నుంచి సైనికులు ఎవరూ అతనికి సాయం చేయటానికి రాలేదు.
తన చేతిలో రైఫిల్ ప్రనూషకిచ్చి చైతన్య అతనివద్దకు పరుగెత్తుకు వెళ్ళాడు. అతన్ని సరిగ్గా నిలబెట్టి, మరో మూడు అడుగులు వేసేవరకూ వుండి వెనక్కి రాబోయాడు.
అజ్మరాలీ వెనక్కి తిరిగి చూశాడు..
ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయ్!
అజ్మరాలీ మొహంలో ఏదో చెప్పలేని భావం. తలతిప్పి, తిరిగి నడక కొనసాగించాడు.
చైతన్య వెనక్కి పరుగెత్తుకు వచ్చేశాడు. అంతవరకూ అతని మీద కాల్పులు లేకుండా ప్రనూష కాపలా కాసింది.
“ఎందుకు అతని గురించి అంత జాగ్రత్త తీసుకుంటున్నారు? అవసరమైన దానికంటే ఎక్కువ?” అడిగింది అతను తనని చేరుకోగానే.
“టైం లేదు. చెప్తా పద….” అంటూ వేగంగా ఆమెతో కలిసి దాదాపు అరకిలోమీటరు పరుగెత్తాడు. అతడు ఏం చేయబోతున్నాడో ఆమె ఊహించలేదు.
“అతని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళానంటే…” గుట్ట వెనక్కి చేరుకుంటూ అన్నాడు చైతన్య. “… వంతెనమీద ‘లాండ్‌మైన్’ ఒకటి వదిలి వచ్చాను” ఇద్దరూ ఆయాసంతో రొప్పుతున్నారు.
అంత ఉద్వేగభరితమైన స్థితిలో కూడా ఆశ్చర్యంతో విస్తుబోయింది. ఆమెకి మొత్తం విషయమంతా ఒక్కొక్కటే వరుసగా అర్థమయింది. అజ్మరాలీకి తాము ప్రధమ చికిత్స చేస్తున్నప్పుడు అతడు తిరిగి ఆ “ప్రమాదకరమైన” స్థలానికి ఎందుకు వెళ్ళాడో ఇప్పుడు తెలిసింది. తనతోపాటు రహస్యంగా ఒక లాండ్‌మైన్‌ని తవ్వి తీసుకొచ్చాడన్నమాట!
దాన్ని వంతెన మధ్యలో వదిలి రావటం కోసం అజ్మరాలీకి సాయం చేసే నెపం మీద వెళ్ళాడు! ఎంత అద్భుతమైన ఆలోచన!
ఆమె అతనివైపు అభినందిస్తున్నట్టు చూసింది.
“అజ్మరాలీని వదిలి పెట్టడానికి కారణం యిదా?’ అడిగింది.
“ఇదొక్కటే కాదు. అతన్ని చంపటం నీకిష్టం లేదన్నావు. ఇక అతను మనతో వుండి లాభం ఏమిటనిపించింది. రెండూ కలిసొస్తాయి కదా అని అతన్ని వదలిపెట్టి వచ్చాను. అతను మనతో వుంటే, ఆ ఒంటికాలుతో అతడిని మనతో ఎలాగూ తీసుకువెళ్ళలేం. అతడిని వదిలేసి మనం వెళ్ళిపోతే, ఈ టాంకుల తాకిడికి అజ్మరాలీ మరణించక తప్పదు” అతడి మాటలు పూర్తికాకుండానే టాంకుల నుంచి పేలుడు వినిపించింది.
తమ మనిషైన అజ్మరాలీ వంతెనకి అటువైపుకి చేరుకోగానే వాళ్ళు టాంకుల దాడి ప్రారంభించారు. అయితే చైతన్య, ప్రనూష సురక్షితమైన ప్రాంతంలో దూరంగా వుండబట్టి దాని ప్రభావం వాళ్ళమీద పడలేదు.
పది నిమిషాలపాటు టాంకులు ఆ ప్రదేశాన్నంతా విధ్వంసంతో నింపేశాయి. గడ్డిపోచని కూడా వదల్లేదు. పశ్చిమాన సూర్యుడు కృంగిపోతున్నాడు. నెమ్మదిగా చీకట్లు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నాయి. అజ్మరాలీకి అంబులెన్స్‌లో చికిత్స జరుగుతోంది.
అవతలి పక్కటాంకుల శబ్దం ఆగిపోయింది. చీఫ్ సూచనలు యిచ్చినట్టున్నాడు. సైనికులు వంతెన మీదకు వచ్చారు. చైతన్య దూరంనుంచి ప్రేక్షకుడిలా వారిని గమనిస్తున్నాడు. ప్రనూష గుండె వేగంగా కొట్టుకుంటూంది. సైనికుల్లో ఎవరన్నా వంతెనని పరీక్షించుకుంటూ నడిచివస్తే ప్రమాదం. అయితే అటువంటిదేమీ అవలేదు.
సైనికులు వంతెనని బాగుచేయటం లీలగా కనిపిస్తూంది.
“లే, మళ్ళీ మనం వంతెన దగ్గరికి వెళ్ళాలి” ఆయత్తమౌతూ అన్నాడు. ఆమె విస్మయంగా “ఎందుకు?” అని అడిగింది.
“వంతెన మీద వదిలేసిన “లాండ్‌మైన్”ని జీపులో వస్తూ డ్రైవర్ తప్పక చూస్తాడు” అన్నాడు చైతన్య.
‘అందుకని?”
“వస్తూన్న జీప్ లైట్లు పేల్చేయాలి” అన్నాడు.
ఆమె అప్రతిభురాలై- “కానీ వాళ్ళు వూరుకోరు. టాంకులు మళ్ళీ వుపయోగిస్తారు. మనం తునాతునకలు అయిపోతాం” అంది.
ఆమె అన్న మాటలో అబద్ధం లేదు. జీపు తాలూకు హెడ్‌లైట్స్ పేల్చేయాలంటే వంతెన దగ్గరగా వెళ్ళాలి. తాము రైఫిల్స్ పేల్చగానే, తామెక్కడ వున్నారో అవతలి వాళ్ళకి కరెక్టుగా తెలుస్తుంది. “టాంక్” తాలుకు రేంజ్ చాలా ఎక్కువ. ఆ రేంజ్ నుంచి బయటపడటం దాదాపు అసంభవం. ఆ మాటే అన్నది ఆమె.
“అవును. మనం తునాతునకలు అయిపోతాం. కానీ ఆ రిస్క్ తీసుకునే మనం ఈ పని ప్రారంభించాం” క్లుప్తంగా అన్నాడు.
ఇద్దరూ తిరిగి వంతెన దగ్గరికి చేరుకున్నారు. సైనికులు బ్రిడ్జి రిపేరు చేయటం కనిపిస్తోంది. దాదాపు అరగంటలో పని పూర్తయింది. అందరూ జీపులు ఎక్కారు.
ప్రనూష అరచేతులు చెమట్లు పడుతున్నాయి. ఆపరేషన్‌లో అతి క్లిష్టమైన దశ దగ్గరకొచ్చింది. నదికి అవతలి ఒడ్డున వరుసగా వున్న టాంకులు ఆకలిగొన్న పులుల్లా వున్నాయి. వాటి కోరల దగ్గరే కూర్చుని వున్న ఫీలింగ్ కలిగింది ఆమెకి.
మొదటి జీప్ బ్రిడ్జిమీదకు వచ్చింది. వెనుకనే వరుసగా జీపులు. ఒక్కో జీపునిండా పదిమంది దాకా వున్నారు సైనికులు. మొదటి జీపు వంతెన మధ్యభాగంలోకి వచ్చింది.
రైఫిల్ చేతుల్లోకి తీసుకున్నాడు చైతన్య.
ప్రనూష వూపిరి బిగపట్టింది.
మొదటి జీపు తాలూకు హెడ్‌లైట్‌కి గురిచూసి పేల్చాడు చైతన్య.
చిన్న చప్పుడుతో అద్దం పేలిపోయింది. ఏం జరిగిందో అర్థంకాక డ్రైవర్ జీపు ఆపుచెయ్యగానే రెండో లైటు కూడా పేల్చేశాడు.
ఈ ఆకస్మిక పరిణామానికి చీఫ్ నిర్విణ్ణుడయ్యాడు. అతనికి తను చేసిన తప్పు తెలిసింది. చాలా చిన్న తప్పు. కానీ పెద్ద అవమానం.. పక్క సైనికులు ఎవరన్నా నవ్వుకుంటారేమోనని ఓరగా చూశాడు. అందరూ మిలటరీ క్రమశిక్షణతో మొహంలో ఏ ఫీలింగూ లేకుండా వున్నారు. ఎవరూ జీపు దిగలేదు.
టాంకులు పేల్చి, వంతెనకి అవతలిపక్క భాగాన్నంతా చెల్లా చెదురు చేయించాడు నిజమే! కానీ ఆ తరువాత వంతెన బాగుచేయించే టైములో శత్రువు తిరిగి దగ్గిరకి వస్తాడని అనుకోలేదు. జీపులు ప్రయాణం ప్రారంభించబోయేముందు మరొకసారి టాంకుల కాల్పులు సాగించివుంటే, అది ముందు జాగ్రత్త చర్య అయి వుండేది.
శతృవు ముందుకొచ్చి, కోరి మృత్యువును ఎందుకు ఆహ్వానిస్తున్నాడో చీఫ్‌కి అర్థంకాలేదు. జీపు దిగి, టాంకులవైపు తిరిగి- “ఫైర్ ఎగైన్” అని అరిచాడు.
అప్పటికే చైతన్య, ప్రనూష వెనక్కి పరుగెత్తటం ప్రారంభించారు. చుట్టూ చీకటి క్రింద రాళ్ళు… గుట్టలు… ఏవీ చూసుకోలేదు. పరుగెడుతూనే వున్నరు.
వెనుక కాల్పులు ప్రారంభమయ్యాయి. టాంకునుంచి బయల్దేరిన గుండు, గాలిలో నదిని దాటి వచ్చి పడగానే వంద గజాల ప్రదేశంలో దూళి ఉవ్వెత్తున ఎగిరి, ఆ ప్రాంతాన్నంతా స్మశానంగా మారుస్తోంది.
నిలబడి గట్టిగా వూపిరి పీలిస్తే, ఆ ఒక్కక్షణమే చావుకీ బ్రతుక్కీ మధ్య రేఖని చెరిపేస్తుందన్నంత వేగంగా… ఆనకట్ట తెగి వెనకనుంచి నీటి వెల్లువ తరుముకు వస్తున్నట్టు ఆ ఇద్దరూ పరిగెత్తుతూనే వున్నారు. ఎటు వెళుతున్నదీ, ఆ దారి ఎక్కడికి దారి తీస్తున్నది కూడా పట్తించుకోలేదు. టాంకుల రేంజ్ ఎంత ఎక్కువగా వుంటుందో చైతన్యకి తెలుసు. తను చేసిన “చిలిపి” పని అతని చీఫ్‌ని ఎంత ఇరిటేట్ చేసి వుంటుందో కూడా తెలుసు. అతడికి కావల్సింది కూడా అదే. సహనం కోల్పోయినప్పుడే మనిషి తప్పులు చేస్తాడు. అంగుళం కూడా వదలకుండా ఆ ప్రదేశాన్నంతా విధ్వంసం చేశాక టాంకులు శాంతించాయి.
పది నిమిషాల తరువాత… కాల్పులు ఆగిపోయాక… చీఫ్ జీపు ఎక్కి పోనిమ్మన్నాడు.
“ఒకసారి ముందుకెళ్ళి చూసొస్తే మంచిదేమో” అని ఎవరూ అడగలేదు. కమాండర్- ఇన్ -చీఫ్‌ని సైన్యంలో ఎవరూ అడగరు. అదీగాక- అంత విస్ఫోటనం జరిగాక అవతలిపక్క ప్రాణి కూడా వుంటుందని ఏ మూర్ఖుడూ కూడా అనుకోడు.
చైతన్య కూడా అనుకోలేదు.
చంద్రుడు పైకి రావటంతో ఆ ప్రదేశం అంతా వెన్నెల నిండిపోయింది.
ఇస్మాయిల్ వాళ్ళు అక్కడే వుండి ఎదురు చూస్తున్నారు. వంతెన దగ్గర జరుగుతున్న భయంకరమైన కాల్పుల శబ్దాలకి  రంగనాయకి బెదిరిపోయింది.
కొడుకు క్షేమం కోసం కోటి దేవతలకి మొక్కుకుంది. వస్తున్న ఇద్దర్నీ చూసి జగదీష్ కూడా తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. జరిగినదంతా క్లుప్తంగా ఇస్మాయిల్‌కి వివరించాడు  చైతన్య.
అందరూ వంతెనవైపు చూడసాగారు. బాగా దూరంగా వుండటం వల్ల సరిగ్గా కనపడటంలేదు. హెడ్‌లైట్ల వెలుతురుబట్టి వంతెనమీద జీపులు వరుసగా రావటం ప్రారంభించాయని తెలుసుకున్నాడు. ముందు జీపుకి హెడ్‌లైట్లు లేవని కూడా తెలుసు.
చూస్తున్న వారిలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది.
మొదటి జీపు వంతెనకి ఇవతలి పక్కకి వచ్చేసింది.
రెండో జీపు దాటుతూండగా…
అప్పుడు కనిపించింది పెద్దమంట! చెవులు బ్రద్ధలయ్యే చప్పుడు!
పదిమంది సైనికులతో వున్న జీపు- ఒక్కసారిగా గాలిలోకి ఎగిరింది. ఆ తరువాత అక్కడ పల్టీకొట్టింది. ఒక తలదిండు గాలిలో విచ్చుకుంటే అందులోంచి దూది ఎలా బయటకు వస్తుందో అలా ఆ వాహనంలోంచి సైనికుల శరీరాలు బయటికి వచ్చాయి.
వంతెన నదిలోకి కూలిపోయింది.
వంతెనతోపాటే దానిమీద వున్న నాలుగు జీపులు కూడా నీళ్ళలోకి జారిపోయాయి. ఆ నీటి వేగానికి వంతెన కొద్దిదూరం కొట్టుకెళ్ళి, అక్కడ రాళ్ళకి తగిలి మరిన్ని ముక్కలుగా మారి ప్రవాహంలో కలిసిపోయిది. సైనికుల శరీరాలు ఎప్పుడో మాయమయ్యాయి.
ప్రనూష గుండెల్నిండా గాలి పీల్చుకుంది. అప్పటివరకూ వున్న ప్రమాదం తొలగిపోవటంతో మనసు తేలికగా అనిపించింది. అయితే ఆమె అబిప్రాయాన్ని తప్పుచేస్తూ అటువైపు వాహనాల లైట్లన్నీ వెలిగాయి. ఆ ప్రదేశమంతా దేదీప్యమానంగా మారిపోయింది.
విస్ఫోటనానికి ముందే జీపులో వంతెనకి ఇటుపక్కకి వచ్చేసిన చీఫ్, వెనుక జరిగిన ప్రేలుడికి నిర్విణ్ణుడయ్యాడు. ముప్ఫైమంది సైనికులు క్షణాల్లో నీళ్ళపాలవటం అతడిని కలచివేసింది.
చాలా చిన్న ఆపరేషన్ అనుకున్నది చూస్తుండగానే ఇంత వినాశనానికి దారితీయడంతో, తన అజాగ్రత్తకి ఎదుర్కొనబోయే శిక్ష గురించి ఆలోచించటంలేదు అతడు. అతదిలో మరింత పట్టుదల పెరిగింది. అప్పటికీ వాయు వాహనాలకోసం కబురు చేయలేదు.
“మోర్స్‌కోడ్”లో వెనుక వైపు అవతలి ఒడ్డుకి ఆజ్ఞలు జారిచేయటం మొదలుపెట్టాడు.
అతని సూచన్లు అనుసరించి, మిగిలివున్న వాహనాలన్నీ నదివైపు తిప్పారు. ఆ లైట్ల వెలుగులో ఏంకర్ల ద్వారా తాళ్ళు అవతల్లి ఒడ్డుకి “షూట్” చేయబడ్డాయి. నదిలో పడిన సైనికుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. అది అనవసరం అని అక్కడ అందరికీ తెలుసు. ఆ ఒడ్డుకీ, ఇవతలి ఒడ్డుకీ తాళ్ళు బిగించారు. అది పూర్తవగానే ఆ తాళ్ళు పట్టుకుని సైనికులు ఇవతలి ఒడ్డుకు చేరుకునే సన్నాహలు చేయసాగారు.
మిషన్ గన్‌లతో, రైఫిల్స్‌తో చీమలు పాకినట్టు ఇవతలి వైపుకి రాబోతున్న శత్రుసైనికుల్ని నిస్సహాయంగా చూస్తూ వుండిపోయాడు చైతన్య. దగ్గిర వరకూ వచ్చిన విజయం చేతుల్లోంచి జారిపోయినట్టు అనిపించింది.
లైట్ల సాయంతో వాళ్ళ్లు వెతకటం మొదలుపెడితే రెండు మూడు గంటల్లో తాము దొరికిపోవటం ఖాయం. దానికన్నా తనే వెళ్ళి వాళ్ళని ఎదుర్కొంటే సులభం.
ఆ విషయమే ప్రనూషతో చెప్పి రైఫిల్ తీసుకు బయలుదేరాడు. ఒక్క రైఫిల్‌తో అంతమందిని ఎలా ఎదుర్కొంటాడో ఆమెకి అర్థంకాలేదు. కానీ ఆమె వద్దనలేదు. ఆలోచించే శక్తి కూడా కోల్పోయినట్లు అనిపించిందామెకు.
దాదాపు పది నిముషాలు వేగంగా ప్రయాణించి అతడు తిరిగి వంతెన దగ్గరికి చేరుకున్నాడు. తనేం చేయదల్చుకున్నాడో, అతడి మనసులో ప్లాను సిద్ధంగా వుంది.
వంతెనకి బదులుగా రెండు వైపులా తాళ్ళు బిగించటం పూర్తయింది.
జీపు దగ్గిర చీఫ్ నిలబడి వున్నాడు.
అతడితోపాటు వచ్చిన ఆరుగురు సైనికులు తాళ్ళు బిగించి జీపు దగ్గరకి వచ్చి నిలబడి చూస్తున్నారు. అట్నుంచి తాళ్ళు పట్టుకుని సైనికులు ఇటు వస్తున్నారు.
చైతన్య వెళ్లేసరికి ఇదీ అక్కడి దృశ్యం.
చీకట్లో పాములాగా చైతన్య లాండ్‌మైన్స్ దగ్గిరకి వెళ్ళాడు. అజ్మరాలీని గాయపర్చిన లాండ్‌మైన్ దగ్గరే వెతకటం ప్రారంభించాడు.
చాలా అపాయకరమయిన చర్య అది. మోకాళ్ళమీద కూర్చుని చేతుల్తో తడిమి “మైన్”ని పట్టుకోవటం, ఏమాత్రం అటూ ఇటూ జరిగినా శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపోతుంది.
దాదపు అయిదు నిమిషల తరువాత అతడి చేతికి మైన్ దొరికింది. దాన్ని తీసుకుని గుట్టవెనక్కి వచ్చాడు.
జీపుచుట్టూ సైనికులు ఆరుగురు వృత్తాకారంలో నిలబడి చీఫ్‌కి గార్డుగా కాపలా కాస్తున్నారు. ప్రత్యర్థి జీపు తాలూకు హెడ్‌లైట్లు బ్రద్ధలు కొట్టిన దృష్ట్యా వాళ్ళు చాలా అప్రయత్నంగా వున్నారు. శత్రువు మళ్ళీ దగ్గరగా వచ్చి దెబ్బ తీస్తాడేమో అని వాళ్ళ అనుమానం.
చీఫ్ అంటున్నాడు.
“వాళ్ళు మొత్తం ఆరుగురు. అందులో ముగ్గురు ఆడాళ్ళు. ఇద్దరు ముసలాళ్ళు. సరిహద్దువైపు ఒకటే దారి వుంది. జీపులో వెళితే దొరికిపోతారు… ఎంతోదూరం వెళ్ళి వుండరు.”
సైనిక శిబిరం నుంచి తీసుకొచ్చిన చెక్కపలకని రాతిమీద పెట్తాడు చైతన్య.
పార్కులో చిన్నపిల్లలు చేరోవైపున కూర్చుని ఆడే బల్లాలా ఊగుతోంది అది. దాని ఒక చివర పక్కగా జరిపాడు. చిన్న ఫిజిక్సు కాలిక్యులేషన్!
ఒకవైపు, రెండోవేపుకన్నా మూడురెట్లు ఎక్కువ పొడవుంటే, అక్కడినుంచి బయల్దేరిన వస్తువుయొక్క “వెలాసిటీ” ప్రపోర్షనేట్‌గా ఎక్కువ వుంటుందనేది!!
చెక్కకి ఒక చివరి “మైన్”ని పెట్టాడు.
ఇప్పుడు అదృష్టం రెండు రకాలుగా కలిసిరావాలి!
లాండ్‌మైన్ వెళ్ళి జీపు సమీపంలో పడటంతో మొదటిది.. పడేటప్పుడే తల క్రిందులుగా పడటం అనేది రెండోది!
అతడు గుట్ట మీద నుంచి ఎగిరి, చెక్కపలక మీదకి దూకాడు అతడి బరువుకి చెక్క పక్కకి పడిపోయింది. కానీ దాని కన్నా ముందే… లాండ్‌మైన్ గాలిలోకి ఎగిరింది.
పలక పడిన శబ్దానికి అటువేపు ఎలర్ట్‌గా చూసిన సైనికులకి, గాలిలో దూసుకువస్తూన్న వస్తువేదో కనబడింది. అదేమిటో గురించే లోపులోనే ఆ వస్తువు జీపుమీద పడటం, పేలిపోవటం ఒకేసారి జరిగాయి. దానితోపాటే  చైతన్య రైఫిల్ నిప్పులు కక్కింది.
తాడు పట్టుకుని వస్తున్న సైనికులు చేష్టలుడిగినట్టు మధ్యలో ఆగిపోయారు.
చైతన్య వంతెన దగ్గరకి పరుగెట్టాడు. సైనికులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. జీపు దగ్గర చలనం ఏదీ లేదు. తాళ్లను విప్పి “లింకు” తెగ్గొట్టేసాడు.
ఒక పెద్ద యుద్ధం ముగిసిన తరువాత నిశ్శబ్దం!
మధ్యలో నది చేసే చప్పుడు మాత్రం వినిపిస్తోంది. అక్కడ్నుంచి కొండ దగ్గరకి బయల్దేరబోతున్న చైతన్య- మరేదో శబ్దం వినిపించి ఉలిక్కిపడ్డాడు.
హెలికాప్టరు శబ్దం!!
ఒక ప్లడ్‌లైట్ నేలమీద పడుతోంది. ఆకాశంలో అది వెతుకుతోంది.
చైతన్యకి భరించలేనంత నిస్పృహ కలిగింది. అలాగే మోకాళ్లమీద కూలిపోయాడు.
హెలికాప్టర్ ఒకచోట ఆగి, నెమ్మదిగా క్రిందికి దిగుతోంది.
అది ఇస్మాయిల్, ప్రనూష ఉన్న స్థలం! అతడు వున్న స్థలానికి దాదాపు అరకిలోమీటరు దూరం వుంటుంది అది. అతడు అక్కడికి పరుగెత్తటం మొదలుపెట్టాడు. గుళ్ళులేని రైఫిల్‌ని వదిలేసాడు. ఇస్మాయిల్‌గానీ, ప్రనూషగానీ క్రిందినుంచి పేలిస్తే, పైనుంచి హెలికాప్టర్ ద్వారా బాంబులు విసురుతారు. దానికన్నా ఆ ప్లడ్‌లైటు కాంతికి దొరక్కుండా దాక్కోవటమే ఉత్తమమైన మార్గం. కానీ వృద్ధులైన తన తల్లిదండ్రులు అంత వేగంగా పరుగెత్తలేకపోయి వుంటారు. అందుకే ఇస్మాయిల్ ప్రతిఘటన లేకుండా లొంగిపోవటమే ఉత్తమమైన మార్గం అనుకుని వుంటాడు.
ఈ విధమయిన ఆలోచనలతో వేగంగా పరుగెత్తుతూన్న చైతన్య హెలికాప్టర్ దగ్గరయ్యేసరికి చటుక్కున ఆగిపోయాడు.
అందరూ దానిలో ఎక్కుతున్నారు. అదికాదు అతడు చూస్తున్నది-
హెలికాప్టర్ మీద వున్న మూడు రంగుల్ని- అది భారతదేశపు వాహనం అని సూచించే సింబల్‌ని!

*            *            *

“మేము ఇక్కడ చిక్కుపడిపోయి వున్నామని మీకలా తెలిసింది?” హెలికప్టర్ గాలిలోకి లేవగానే చైతన్య అడిగిన మొదటి ప్రశ్న అది.
అంతకుముందే కెప్టెన్ సక్సేనా తనని తాను పరిచయం చేసుకున్నాడు.
“మాకు వైర్‌లెస్ మెసేజ్ వచ్చింది. సైంటిస్ట్ జగదీష్ ప్రసాద్ సరిహద్దు దగ్గర నో-మేన్స్-లాండ్‌లో వున్నారని వార్త వచ్చింది. మేము ఢిల్లీ కాంటాక్ట్ చేశాం. జగదీష్‌ప్రసాద్ అనగానే, మన ప్రభుత్వం ఆఘమేఘాలమీద పాకిస్తాన్‌లో వున్న మన రాయబారిని సంప్రదించింది. మీరందరూ ఆర్మీ క్యాంప్ నుంచి తప్పించుకున్నారని మన రాయబారి ధృవీకరించారు. వెంటనే హెలికాప్టర్ ద్వారా రక్షించమని మాకు ఆదేశాలు వచ్చాయి.”
“కానీ ఇంత సరిగ్గా మేమున్న ప్రదేశాన్ని ఎలా కనుక్కోగలిగారు?”
“చెప్పానుగా, వైర్‌లెస్‌లో వార్త వచ్చింది.”
“ఎవరు పంపారు?”
“మేమూ అదే అడిగాం. ఎవరు పంపేరన్న దానికి అంత ప్రాముఖ్యత లేదన్నాడు అవతలి వ్యక్తి. ఆ మెసేజిని సరిహద్దు దగ్గర నేనే రిసివ్ చేసుకున్నాను. ‘మీరెవరో తెలియకపోతే నేను నమ్మేదేలా?’ అని అడిగాను. చిన్న వాక్యం చెప్పి ‘దీన్ని చైతన్యకి చెప్పండి నేనెవరో అతను మీకు చెపుతాడు’ అన్నాడు. దాన్ని వ్రాసుకున్నాను” అంటూ కాగితం అందించాడు.

ఉపసంహారం

“ఈ పని పూర్తి చేయటానికి మీకు రోజుకి యాభై వేలిస్తానన్నాను” అంది ప్రనూష.
“లక్ష అన్నట్టు గుర్తు” చైతన్య కవ్విస్తున్నట్టు అన్నాడు.
ప్రనూష నవ్వింది. “రోజు అంటే ఎప్పట్నుంచి? మనం పాకిస్తాన్ బయల్దేరిన రోజునుంచా? మీరు ట్రయినింగ్ ప్రారంభించిన రోజు నుంచా?’
“నీ ఇష్టం. నేను బేరాలాడను.”
“మీరు ట్రయినింగ్ ప్రారంభించిన రోజునుంచి అయితే, దాదాపు రెండు కోట్లు ఇవ్వవలసి వుంటుంది. మీకా డబ్బు ఇచ్చి, నేను వీధిన పడాలి.”
“అంత వద్దులే! పది లక్షలు ఇవ్వు. నాకు కాదు….లక్ష్మికి.”
ప్రనూష ముందు విస్మయం చెందినా, వెంటనే సర్దుకుని- “తను చేసిన సాయానికి అది చాల తక్కువ” అంది.
“దాన్ని నేను ఎక్కువ చేస్తాను. నిర్మాతగా తనతో ఆ డబ్బు పెట్టుబడి పెట్టించి, సినిమా తీయిస్తాను.”
“గుడ్‌గాడ్! నిజంగానా.. ఎందుకు?”
“నా కాబోయే భార్య జూనియర్ ఆర్టిస్ట్‌గా కన్నా ఒక నిర్మాతగా నన్ను వివాహమాడాలని నా కోర్కె.”
ప్రనూష కళ్ళల్లో చిన్న నిరాశ- హఠాత్తుగా వచ్చి, అంత తొందరగానే మాయమైంది. ఎవరూ అక్కడ గుర్తించలేదు. చైతన్య ఆమె మౌనం వహించటం చూసి. నవ్వుతూ “పది లక్షలు ఇవ్వవలసి వస్తుందని దిగులు పడుతున్నట్టున్నావు. ఊరికే అన్నానులే” అన్నాడు.
“ఆడపిల్ల తరపు కట్నంగానే ఇస్తాన్లెండి! దానికేం దిగులు లేదు గానీ, ఒక సస్పెన్సు మాత్రం విప్పండి. మన సైన్యానికి వైర్‌లెస్ వార్త పంపి మనల్ని రక్షించిందెవరు?’
“తెలిస్తే ఆశ్చర్యపోతావు.”
“ఎవరో చెప్పరా?”
“హెలికాప్టర్‌లో ఆ కాగితం నాకు చూపించకపోతే నేనూ నమ్మేవాడిని కాను. చాలా ఇన్‌డైరెక్టుగా తనెవరో చెప్పాడు.”
ఆమె మరింత ఉత్సుకతతో “ఎవరో చెప్పండి ప్లీజ్” అంది. చైతన్య సమాధానంగా అతని చేతిలోని కాగితం ఆమెకిచ్చాడు. ఉర్దూలో వుంది అది.
“సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒక గీతకి కేవలం అటూ ఇటూ వుండటంవల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం . మతం కన్నా మానవత్వం గొప్పదని తెలుసుకున్నాను….  అజ్మరాలీ.”

 

***********************

సమాప్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *