April 20, 2024

గజల్స్ – షకీల్ బదాయూనీ -2

రచన: అబ్దుల్ వాహెద్abdul wahed

 

 

 

 

షకీల్ బదాయూనీ రాసిన మరి కొన్ని గజల్స్ ఈ సంచికలో చూద్దాం

ఈ గజల్ బేగం అక్తర్ స్వరంలో:

1. ఆయ్ ముహబ్బత్ తెరే అంజామ్ పే రోనా ఆయా

జానె క్యోం ఆజ్ తెరే నామ్ పే రోనా ఆయా

యుంతో హర్ షామ్ ఉమ్మీదోం పే గుజర్ జాతీ హై

ఆజ్ కుఛ్ బాత్ హై జో షామ్ పే రోనా ఆయా

కభీ తఖ్దీర్ కా మాతమ్ కభీ దునియా కా గిలా

మంజిలె ఇష్క్ మెం హర్ గామ్ పే రోనా ఆయా

ముఝ్ పే హీ ఖతమ్ హువా సిల్ సిలా నూహా గిరి

ఇస్ ఖదర్ గర్దిషె అయ్యామ్ పే రోనా ఆయా

జబ్ హువా జిక్ర్ జమానే మేం మసర్రత్ కా షకీల్

ముఝ్ కో అప్నే దిలె నా కామ్ పే రోనా ఆయా

ఈ గజల్ వింటున్నప్పుడు భావం తెలియకపోయినా కూడా గజల్లో లీనం అయిపోతాం. భావం తెలిస్తే మరింత ఆస్వాదించవచ్చు.

ప్రేమా నీ ముగింపుపై నేను రోదిస్తున్నాను

ఎందుకో నీ పేరు విని నేడు రోదిస్తున్నాను

ప్రతిరాత్రి మామూలుగా ఆశలతో గడచిపోతుంది

ఈ రోజేమయ్యిందో రాత్రి పేరుతో రోదిస్తున్నాను

ఒకసారి విధిపై దు:ఖించడం, మరోసారి ప్రపంచాన్ని నిందించడం

ప్రేమ దారిలో ప్రతి అడుగూ రోదిస్తున్నాను

నా పైనే శవరోదన పరంపర ముగిసింది

ఇలా గడుస్తున్న రోజులపై రోదిస్తున్నాను

సంతోషాల ప్రస్తావన జరిగినప్పుడు షకీల్

నా విఫల ప్రేమపై రోదిస్తున్నాను.

ఈ గజల్ భగ్నప్రేమికుడి మనోవ్యధను తెలియజేస్తుంది. ఇందులో మొదటి ద్విపదలో ప్రేమ ఇలా ముగుస్తుందని అనుకోలేదు, అందుకు దు:ఖిస్తున్నాడు, ఆ దు:ఖం ఏ స్థాయికి చేరుకుందంటే ఇక ప్రేమ దు:ఖానికి మారుపేరుగా మారిపోయింది. ఒకప్పుడు ప్రేమ అనే అక్షరాలు సంతోషాన్నిచ్చేవి. కాని ఎందుకో ఇప్పుడు ఆ అక్షరాలే దు:ఖానికి కారణమవుతున్నాయని కాస్త ఆశ్చర్యపోతూ విషాదాన్ని దాచుకోవడం కూడా కనబడుతుంది. మొదటి ద్విపదలో ఈ భావం ఆకట్టుకుంటుంది. అలాగే ముఝ్ పే హీ ఖతమ్ హువా సిల్ సిలా నుహగరీ కా…అనే వాక్యంలో నూహ అంటే అర్ధం దు:ఖం. నూహగరీ అంటే ఎవరైనా మరణించినప్పుడు విషాద సంతాపాలు, రోదనలను సూచించడానికి ఉపయోగిస్తారు. ఈ సంతాపాలు, విషాదాలన్నీ తనతోనే ముగిశాయనడంలో, తాను ఇక జీవించిలేనని చెప్పడమే కాదు, బతికి ఉన్నట్లు కనబడుతున్న తాను నిజానికి ప్రపంచంలో మరణించిన చివరివాడినన్నభావం ఇస్తున్నాడు. ఆ తర్వాతి లైన్ లో ఇలా జీవచ్ఛవంలా గడుస్తున్న రోజులపై రోదిస్తున్నానని చెబుతాడు. భగ్నప్రేమను అత్యంత లోతుగా వ్యక్తం చేసిన గజళ్ళలో ఇది ముఖ్యమైనది.

 

2.  బహార్ ఆయీ కిసీ కా సామ్నా కర్నేకా వఖ్త్ ఆయా

సంభల్ అయ్ దిల్ ఇజ్హార్ వఫా కర్నేకా వఖ్త్ ఆయా

ఉన్హే ఆమాదా మహ్రూ వఫా కర్నేకా వఖ్త్ ఆయా

బడీ ముద్దత్ మేం అర్ఝ్ మద్దుఆ కర్నేకా వఖ్త్ ఆయా

రవాం హై అప్నీ మరకజ్ కి తరఫ్ ఆసూదా ఉమ్మీదేం

హుజూమె యాస్ కో దిల్ సే జుదా కర్నేకా వఖ్త్ ఆయా

ఫిర్ ఏక్ గమ్ కర్దా రాహ్ జిందగీ కో మిల్ గయీ మంజిల్

సజూద్ షుకుర్ బే పాయాం అదా కర్నేకా వఖ్త్ ఆయా

కభీ దూరీ థీ లేకిన్ అబ్ ఖయాల్ ఖౌఫ్ దూరీ హై

ఫగాం కీ సాఅతేం గుజరేం దుఆ కర్నేకా వఖ్త్ ఆయా

కహాం తక్ ఖతమ్ రహతా దర్మియాం పర్ దిల్ కా అఫ్సానా

బిల్ ఆఖిర్ దర్మియాం సే ఇబ్తిదా కర్నేకా వఖ్త్ ఆయా

హర్ ఏక్ జుర్మ్ ముహబ్బత్ ఇస్ నిగాహ్ లుత్ఫ్ కే సదఖే

నవైద్ ఆఫియత్ లేకర్ ఖతా కర్నేకా వఖ్త్ ఆయా

నిగాహ్  ఓ దిల్ సే అబ్ తఫ్సీర్ వ షరాహ్ ఆర్జూ హోగీ

జబాన్ వ లబ్ సే తర్క్ ఇత్తిజా కర్నేకా వఖ్త్ ఆయా

వో ఆతే హై షకీల్ అబ్ అప్నే దిల్ సే హాథ్ ధో బైఠో

నిగాహ్ నాజ్ కీ ఖీమత్ అదా కర్నేకా వఖ్త్ ఆయా

చక్కని భావుకత ఉన్న ఈ గజల్ అర్ధమేమిటో చూద్దాం :

వసంతం వచ్చింది కలవాల్సిన వారికి ఎదురెళ్ళే సమయం వచ్చింది

మనసా, కాస్త జాగ్రత్త ప్రేమ ప్రకటించే సమయం వచ్చింది

తనను  ప్రేమకు ఒప్పించే సమయం వచ్చింది

చాలా కాలం తర్వాత నీ మాట చెప్పుకునే సమయం వచ్చింది

ఆశలు సంతృప్తిగా తమ గమ్యం వైపు నడుస్తున్నాయి

నిరాశల గుంపును మనసు నుంచి తొలగించే సమయం వచ్చింది

విషాదాల జీవితమార్గంలో మరోసారి గమ్యం దొరికింది

కృతజ్ఙతగా సాష్టాంగపడే సమయం వచ్చింది

ఒకప్పుడు దూరం ఉండేది కాని ఇప్పుడు సందేహాల దూరం ఉంది

విషాదబాధలు తొలిగాయి ఇక ప్రార్ధించే సమయం వచ్చింది

ఎప్పటి వరకు మధ్యలోనే ఆగిపోతుంది మనసు గాధ

చివరికి మధ్య నుంచే ప్రారంభించే సమయం వచ్చింది

ప్రతి ప్రేమ నేరం ఈ ప్రసన్న దృష్టి పుణ్యమే

మన్నింపు శుభవార్తతో నేరం చేసే సమయం వచ్చింది

చూపులతో, మనసుతో ఇప్పుడు ఆకాంక్షల వివరణ ఉంది

నోటితో ఇక విజ్ఙప్తులను వదిలేసే సమయం వచ్చింది

తాను వస్తోంది షకీల్, ఇక నీ మనసును మరిచిపో

ఓరచూపులకు వెల చెల్లించే సమయం వచ్చింది

 

ఇది కూడా భగ్నప్రేమే. కాని మరలా ప్రేమించడానికి సిద్ధపడుతున్నాడు. ప్రేమ ఎప్పటి వరకు మధ్యలోనే ఆగిపోయి అసంపూర్ణంగా ఉండాలి, మధ్య నుంచే మరలా మొదలు పెట్టే సమయం వచ్చింటూ ప్రేయసి కోసం వేచి ఉన్న సందర్భాన్ని షకీల్ ఎన్నుకున్నాడు. కహాం తక్ ఖతమ్ రహతా దర్మియాం పర్ దిల్ కా అఫ్సానా

బిల్ ఆఖిర్ దర్మియాం సే ఇబ్తిదా కర్నేకా వఖ్త్ ఆయా.. అనడమే కాదు, హర్ ఏక్ జుర్మ్ ముహబ్బత్ ఇస్ నిగాహ్ లుత్ఫ్ కే సదఖే, నవైద్ ఆఫియత్ లేకర్ ఖతా కర్నేకా వఖ్త్ ఆయా అంటున్నాడు. అంటే ప్రేమ నేరమైతే దానికి కారణం ప్రేయసి చూపుల్లోని ఆకర్షణే. ఒక ప్రేమ భగ్న ప్రేమగా మారినా, తర్వాత ఆ నేరానికి మన్నింపుగా మళ్లీ ప్రారంభించే శాంతియుతమైన శుభవార్త అందింది, కాబట్టి మళ్లీ నేరం చేసే సమయం వచ్చేసిందనడంలో చక్కని చమత్కారం ఉంది. ప్రేయసి వస్తుంది కాబట్టి ఇక మనసును మరిచిపో అనుకుంటున్నాడు. ఎందుకంటే మనసు, హృదయం అన్నీ ఆమెకు ఇచ్చేయక తప్పదు. ఎందుకివ్వాలంటే, మంత్రముగ్థుల్ని చేసే ఆ అందమైన చూపులకు వెల చెల్లించాలి కదా అని చెప్పుకోవడంలో కూడా చక్కని చమత్కారం ఉంది.

వచ్చే సంచికలో మరిన్ని గజల్స్ తో మళ్ళీ కలుసుకుందాం.

3 thoughts on “గజల్స్ – షకీల్ బదాయూనీ -2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238