March 28, 2024

అండమాన్ డైరీ – 1

(నీలాల ద్వీపాలూ-పగడాల సంద్రాలూ!)

రచన: దాసరి అమరేంద్ర        amarendra

      అండమాన్-నికోబార్ ద్వీపాల గురించి మొదటిసారిగా విన్నదెపుడూ!!

సుమారు ఏభై ఏళ్ల క్రితం. విజయవాడ సివీయార్ లో ఎనిమిదో క్లాసు – థర్డ్ ఫారం -చదువుతున్నప్పుడు. అది పాఠాలలో భాగం కాకపోయినా మా సోషలు మాష్టారు వెంకారెడ్డిగారు (ఆయన ఆ రోజుల్లోనే, ఆ విజయవాడలోనే, శశికపూర్ అంత సుందరంగా ఉండేవారు !) మాటల మధ్య చెప్పారు! “మన దేశం కాశ్మీరునుంచి కన్యాకుమారి వరకూ విస్తరించి ఉన్న బృహత్ ద్వీపకల్పం అని చెప్పుకుంటాం. కానీ బంగాళాఖాతం మధ్యలో తీరరేఖకు వెయ్యి కిలోమీటర్ల దూరాన అండమాన్ నికోబార్ ద్వీపాలున్నాయి. అంతా అడవులు, కొండలు. నాలుగయిదు అటవిక జాతులు. అందులో ఒకటి నరమాంస భక్షకుల జాతి. బయట ప్రపంచం వాళ్లు వెళ్లి ఉండటం ఈ మధ్యనే మొదలయింది. ద్వీపాంతరవాస శిక్ష వేసిన జాతియోద్యమ ఖైదీలకోసం కట్టిన సెల్యూలార్ జైలు ఉందక్కడా….”

అప్పుడే తాతయ్య చెపిన జానపదకధల్లోంచి బయటపడి – ‘చందమామను వదలకుండానే – ఆంధ ప్రభ వీక్లీలో మాలతీచెందూర్‌నూ, రంగనాయకమ్మనూ తెలుసుకుంటున్న వయసు.  అయినా ఆ ద్వీపాలు కధల్లో విన్న’ ఏడేడు సముద్రాల అవతల, కాకులు దూరని కారడవులూ చీమలు దూరని చిట్టడవుల అలవాలం.. మఱ్ఱిచెట్లూ, తొఱ్ఱలూ, చిలకలూ, మాంత్రికుని పాణాలూ ఉన్న ప్రదేశమది” అన్న ఊహచిత్రం మనసులో ముద్ర పడిపోయింది. ఎప్పటికైనా, ఒక్కసారైనా వెళ్లిరావాలి అన్న కోరిక.. బీజం…

గత ఏభై ఏళ్లలో అండమాన్ల గురించి మన ‘మెయిన్ లేండర్ల’ అవగాహనలో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. అండమాన్ అంటే జైలేకాదు, ఆటవికులేగాదు, అడవులేగాదు – అపురూప సాగర ద్వీప సౌందర్యం కూడా అన్న విషయం మెల్లగా, మెల్లమెల్లగా తెలియరాసాగింది. మాకు దగ్గర స్నేహితులూ, దూరపుచుట్టాలూ అక్కడికి ఊరికే వెళ్లిరావడం గాకుండా  ఆ పోలీసు విభాగాల్లోనూ,  పి.డబ్ల్యూ.డీ లోను రెండు మూడేళ్లు ఉద్యోగాలు చేసి వచ్చి తమ తమ అనుభవాలనూ, అభిప్రాయలనూ చెబుతోంటే – అసలే ప్రయాణాల పక్షిని గదా – మనసు తహతహ.. దానికి తోడు పదిహేను ఇరవై ఏళ్లుగా ‘అండమాన్లు టూరిస్టుల స్వర్గధామాలు’ అంటూ పర్యాటక శాఖ వాళ్లు  చేస్తొన్న హడావుడి – ‘వెళ్లాలి, వెళ్లాలి’ అన్న బలమైన కోరిక… అయినా ఇన్నేళ్లూ చెయ్యలేకపొయాను. రెండు కారణాలు; వెళ్లిరావడం అంటే కనీసం పదిహేను రోజులు ఆ ఉద్యోగంలో ఉంటూ అంత శెలవు పెట్టడం ఇష్టంలేదు. పైగా కనీసం మనిషికి ఇరవై, పాతికవేలు ఖర్చు. ఆరో పే కమిషన్‌కు ముందు ఉన్న గవర్నమెంటు జీతాలతో అంత ఖర్చు నిభాయించుకోవడమన్న ప్రసక్తేలేదు. అంచేత కోరిక కోరికగానే ఉండిపోయింది – నివురుగప్పిన నిప్పులా.

సమయమూ, సంధర్భమూ 2012 లో అనుకూలమనిపించాయి రిటైరయ్యాను గాబట్టి శెలవు సమస్యలేదు. కంపెనీ వాళ్లూ భారీగానే చేతిలోపెట్టి ఇంటికి పంపించారు గాబట్టి ‘ఇద్దరికి కలసి ఏభై అరవైవేలు ఖర్చు పెట్టగలను’ అన్న మేక్ బిలీవ్ ధీమా!! ఈలోగా ఢిల్లీలో మాకు బహుదగ్గరి స్నేహితులూ, లక్ష్మి కోలీగ్సూ అయిన ఓ మధ్యవయసు జంట ఆ అండమాన్ ద్వీపాల్లో విహరించి వచ్చి ఆ ముచ్చట్లనీ సచిత్రంగా మాతో పంచుకొన్నారు. మరిహనేం: ది డైఈజ్ కాష్ట్…

పోర్ట్ బ్లెయిర్‌లో మాకు బాగా తెలిసిన ఓ నావీ కమాండరు కుటుంబం ఉంది. దూరపు చుట్టం, దగ్గరి స్నేహం. వాళ్లకూ దేశాలూ, ప్రదేశాలూ తిరగడం అంటే మహ ఇష్టం. మేము బెంగళూరులో ఉన్నప్పుడూ, పూనాలో ఉన్నప్పుడూ వచ్చి, మాతోగడపి, ఆయా ప్రదేశాలను తీరికగా చూసి వెళ్లారు. 2010లో వాళ్లకు అండమాన్ పోస్టింగు వచ్చినప్పట్నించీ ‘రండి..రండి..’ అని ఆహ్వానిస్తున్నారు.

ఆ కమాండర్ ప్రకాష్‌ను సంప్రదించాను, 2012 జనవరిలో. 2012 మార్చి 4 నుంచి 18 వరకూ అన్న ముహూర్తం కుదిరింది. విమానమా, ఓడా అన్న మీమాంసలో పడ్డాం గానీ ‘ఓడ’ అంటే అనేకానేక అనిశ్చతతలు ఉంటాయని వెంటనే బోధపడింది. ముందు కలకత్తాకో, మద్రాసుకో వెళ్లాలి. మకాం వెయ్యాలి. సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఓడ చెప్పిన రోజున వెళ్లకపోవచ్చు… ‘ఇవన్ని విని ఆలోచనలో పడ్డాం’. అక్కడికి వెళ్లాక మీరు ఎలానో పోర్ట్ బ్లయిర్ నుంచి హేవలాక్ ఐలాండ్ దాకా అటూ ఇటూ ఏడు ఎనిమిది గంటలు సముద్ర ప్రయాణం చేస్తారు. మళ్లా ఈ రెండు మూడు రోజులు ఎందుకూ అని సలహ ఇచ్చారు. అప్పుడే వెళ్లి వచ్చిన లక్ష్మి సహొద్యోగులు – శ్రీమతి కృష్ణ, శ్రీ బల్బీర్‌సింగ్. పైగా ఖర్చులోనూ ఏమీ తేడా ఉండదన్నారు. నిజమే.. ఒక రకంగా ఓడ ఖరీదని వివరాల్లోకి వెళితే తెలిసింది.

నెట్‌లో వెదికాం. చక్కని ఆప్షన్లు కనిపించాయి. మేవున్న ఢిల్లీలో ఆరుగంటలకు విమానం పట్టుకుంటే అది కలకత్తా మీదుగా మొత్తం అయిదుగంటలు ప్రయాణించి సుమారు పదకొండుగంటల ప్రాంతంలో పోర్ట్‌బ్లెయిర్ లో దింపుతుంది. తిరుగు ప్రయాణానికి అలాంటి అప్షనే ఉంది. రానూపోనూ మనిషికి పధ్నాలుగు వేలు. వెంటనే నాకూ లక్ష్మికీ టికెట్లు కొనేసాను. మార్చి నాలుగున బయల్దేరి మళ్లీ పద్దెనిమిదిన తిరిగి రావాలన్నది నా ప్రణాళిక. ఓ వారం ముందుగా పదకొండుకే తిరిగి రావడం లక్ష్మి ప్లాను. లక్ష్మి ఉన్న వారం రోజులూ టూరిస్టులు తిరిగినట్టు  ప్రణాళికా బద్ధంగా అన్ని తిరిగి చూడాలనీ, తను వచ్చేసాక మిగిలిన ఏడురోజులూ అసలు సిసలు యాత్రికులలా ఏది నచ్చితే అది నేను చెడదిరగాలనీ  – స్థూలంగా అదీ ఆలోచన.

SAM_3589

              రేఖను దాటి సముద్రంలోకి దృష్టి సారిస్తే నీలమా ఆకుపచ్చా అన్నట్టు అనేకానేక పాళ్లలో కలగలసి సృష్టించిన అద్భుత వర్ణవిన్యాసం… కంటికి కనిపించని కోరల్సూ, సముద్రగర్భపు చెట్టూ చేమా, నాచూ ఏక సూత్రపు లయతో నాట్యం చేస్తూ మమ్మల్ని ఆహ్వనిస్తున్నాయా? – అన్న ఆ ఊహ  వివరణకూ, వర్ణణకూ అందని సౌందర్యమది. రాబోయే పధ్నాలుగు రోజులకు,  అతి ఉత్తమ నాంది!!

కలసి వచ్చేకాలంలో… అన్నట్టు ఎంచేతనో విమానం ఆ ద్వీపాల చుట్టూ రెండు మూడు ప్రదక్షిణాలు చెసింది. మరోసారి   ఆ ఏరియల్ వ్యూను ఆస్వాదించే   అవకాశం.. మెల్లగా పోర్ట్‌బ్లెయిర్ పట్టణం కళ్లముందు రెక్కలు విప్పుకొంది. అప్పటికే రోజుల తరబడి గూగూల్ మ్యాపుల్ని అద్యయనం చేసి ఉండటం వల్ల అదిగో రాస్ ద్వీపం… సెల్యులర్ జైలు..  లైట్ హౌస్-అని గుర్తుపట్టగలిగాను.

భానుప్రకాషూ, ప్రశాంతిగారూ ఎయిర్ పోర్టులో అహ్వానం పలికారు. ఎయిర్ పోర్టు కడు చిన్నది. మన గన్నవరంలాగా. వాళ్లు ఉండే ‘మిన్నీబే’ నావీ కాలనీ ఎయిర్ పోర్టును ఆనుకోనే వుంది. పది నిమిషాల్లో అక్కడికి చేరుకొన్నాం. వాళ్ల గెస్టు హౌసులో మా వసతి –  ఆ పదిహేను రోజులూ!

పెద్ద నావీ కాలనీ అది. గుట్టలూ, మిట్టల మధ్య కట్టారు. విశాలమైన సమతల ప్రదేశంలో మేమున్న గెస్టుహౌసు. పక్కనే నావీ ఆఫీసర్ల మెస్సనబడే క్లబ్సు.. వరసగ్గా రైలు పెట్టెల్లా కట్టిన పన్నెండు అతిధి గదులు… కొంచెం పక్కకు వెళ్లి చూస్తే కనిపించే మిన్నీబేకు చెందిన సముద్ర జలాలు. ఓ హాలీడేకు అతి చక్కని వేదిక ఆ గెస్టు హౌసు.

గబగబా ఫ్రెషప్ అయీ ప్రకాష్ వాళ్ల ఇంటికి చేరాం. అతను – ఆమె – బాబు – ఆమె తల్లి దండ్రులు:  అంతా కలసి అయిదుగురు. అందరిలోనూ అంతకు ముందే పరిచయమూ చనువూ ఉన్నాయి. అంచేత ఆ ఆదివారపు మధ్యాన్న భోజన సమయం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది.

“పోర్ట్ బ్లెయిర్ బాగా చిన్న ఊరు. సుమారు లక్ష జనాభా. కానీ గొప్ప అందమయిన ఊరు. మీకున్న ప్రకృతి ఆసక్తికి అసలు ఈ ఊళ్లోనే నాలుగయిదురోజులు గడపొచ్చు.  ఈ రోజు సాయంతం మనమంతా కలసి సెల్యులర్ జైలు, ఫీనిక్స్‌బె, అబెర్డీన్ జెట్టీ, అది ఉన్న రాజీవ్‌గాంధీ వాటర్‌స్పోర్ట్స్ కాంప్లెక్స్, అక్కడ్నించి ‘కార్చిన్స్ కోవ్’ అన్నచోట ఉన్న బీచి – ఇవి చూద్దాం. రేపు రోజంతా ఈ చుట్టుపక్కల ఉన్న ద్వీపాలలోని వింతలూ విశేషాలు చూపించే ఓ బోటు ట్రిప్పు బుక్ చేసాను. ఎల్లుండి నుంచి మూడు రోజులపాటు మీరన్నట్టుగానే హేవ్‌లాక్, నీల్ ఐలెండ్లలో ఉండేలా ఏర్పాట్లు చేసాను. ఇంకా లక్ష్మిగారికి ఆవిడ తిరిగి వెళ్లే రోజు గాకుండా రెండు రోజులు ఉంటాయి. ఒక రోజు ఇక్కడికి 100కిలో మీటర్లు ఉత్తరాన ఉన్న బారాటాంగ్ సున్నపురాయి గుహలు చూసి వద్దురుగాని. చివరి రోజు ఈ ఊళ్లోనే మిగిలిన విశేషాలు చూస్తూనూ,  షాపింగు చేస్తూనూ గడపొచ్చు… టూకీగా పొగ్రాం వివరించాడు ప్రకాష్.

“మరి నా మిగిలిన రెండోవారం సంగతేమిటో?” అడిగాను.

“అక్కడికి వస్తాను.. మీది టూరిస్టు బాణీ కాదు గదా.. రెండు మూడు రోజులు ఇక్కడ గడిపితే మీకో అయిడియా వస్తుంది.. ఈ ద్వీపాల గురించి, వీటిల్లోని ప్రదేశాలు గురించీ, విశేషాల గురించీ.. అప్పుడు మీరూ నేనూ కలసి మీ రెండో వారం ప్లాను చేద్దాం”

బావుందనిపించింది “మరి రెండో వారంలో నికోబార్ వెళ్లే అవకాశం ఉందా!” అడిగాను.

“ఉందనవచ్చు. కానీ దానికి నానా హైరానా పడాలి. అలా ఫ్రీగా వెళ్లి వచ్చేయడం కుదరదు. పర్మిట్లవీ తీసుకోవాలి. పైగా ఓ రోజంతా నౌకా ప్రయాణం. ఆ పడవలు కూడా రోజూ ఉండవు. ఈసారి ట్రిప్పులో మీరు నికోబర్ పెట్టుకోకుండా అండమాన్ల మీదే దృష్టి నిలపండి. మరోసారి వచ్చినప్పుడు నికోబార్లే కేంద్రంగా పోగ్రాం చేసుకోండి” హితవు పలికాడు ప్రకాష్. నాకది నచ్చింది.

 SAM_3598

కాసేపు రిలాక్సయి అందరమూ బయటపడ్డాం.. మేమిద్దరం, ప్రకాష్, ప్రశాంతి, శాంతి వాళ్ల అమ్మగారు. మొట్ట మొదటి మజలీ సెల్యులర్ జైలు. 1906 లో కట్టారట. జైలునిండా ‘ఏకాంతవాసా’నికి అనుకూలంగా కట్టిన బొరియల్లాంటి ‘సెల్’లు – అంచేత దాని పేరు ‘సెల్యులర్ జైల్’ అయింది! స్వాతంత్ర సంగ్రామ యోధులెందరో ఎళ్ల తరబడి గడిపిన ‘తీర్థయాత్రా’ స్థలమిది. అ యోధులల్లో అగ్రగణ్యుడు వీరసావర్కార్… దుర్భర ఎకాంతమూ, అంతకన్నా దుర్భరమైన చిత్ర హింసలూ – అనాడు ఈ స్థలం భయంకర ప్రదేశమే గావచ్చు. కానీ ఇపుడది ఓ జాతీయ స్మారక చిహ్నం. చక్కని  మెయింటనెన్సు, ఆహ్లాదకరమైన వృక్షాలు… అసలు సిసలు తీర్థయాత్రా స్థలం!!

కట్టినపుడు అంతా కలసి గొడుగు చువ్వల్లా ఏడు పొడవాటి ‘వింగ్’లు ఉండేవట.. మధ్యలో గొడుగు మొనలా ఓ సెంట్రల్ టవరు – అన్ని వింగుల్నీ పర్యవేక్షించడనికి అనుకూలంగా కట్టిన టవరు.. ఎంచేతో ఏడింటిలోనూ నాలుగు వింగ్‌లు కాలగర్భంలో కలసిపోయాయట – ఇప్పుడు మిగిలింది మూడు.. ఓ వింగ్ లో రెండో అంతస్థులో, ఓ మూలలో వీరసావర్కార్ ‘నివసించిన’ సెల్.. ఇపుడది ‘అర్థ మందిరం’గా రూపుదిద్దుకొంది.. పూజలు.. నమస్కారాలు.. ఆయన ఉన్న వివరాలు తెలిపే ఫలకాలు.. ఫోటోలు – వాటిలో మేమంతా ఫోటోలు దిగడం…

సెంట్రల్ టవర్‌లో పైకి ఎక్కే అవకాశం ఉంది. అంటే జైలు పైకప్పుకు చేరతామన్నమాట. “అదిగో అక్కడ ఓ కిలో మీటరు దూరాన కనిపిస్తోన్న చిన్న ద్వీపమే రాస్ ఐలెండ్. రేపు మీ ద్వీపాలయాత్ర దానితోనే మొదలవుతుంది” పరిచయం చేసాడు ప్రకాష్.. మనోహర దృశ్యమది. భయంకరమైన జైలు ప్రాంగణంలో ఈ మనోహరాలేవిటయ్యా అని బుద్ధి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది గాని మరి మనసు మాటవినదే!!

ఆ జైలు ఆవరణలోనే ‘జైలు మ్యూజియం’ ఉంది. స్వతంత్ర సంగ్రామపు జ్ఞాపకాలు, డాక్యుమెంట్లు, వార్తా పత్రికలు, ఫోటోలు – సెల్యులర్ జైలు ఏడు వింగుల మోడళ్లు బయట వెలుగులోన్న అఖండ అమరజ్యోతి… మనకు తెలియకుండా మనం జ్ఞాపకాల విచార ధారల్లో మునిగితేలడం అతిసహజం!!

జైలు నుంచి బయట పడేసరికి నాలుగుదాటింది. అన్నట్టు జైలు ఆవరణలో ఓ సౌండ్ అండ్ లైట్ షో ఉంది. అది ఆరున్నరకు. ఈ రెండుగంటల సమయంలో ఊళ్లోని అతి చక్కని రహదారి గూండా ప్రయాణంచేసి ఊరి పొలిమేరల్లో ఆరుకిలో మీటర్ల దూరాన ఉన్న ‘కార్భ్రెన్స్ కోవ్’ అనే బీచికి వెళ్లి వద్దామన్నది ప్రకాష్ చేసిన చక్కని ఏర్పాటు..

SAM_3626

జైలు ఉన్న ప్రాంగణం నుంచి ఓ రెండు మూడు వందల మీటర్లు దాటితే ఆ బెర్జన్ జెట్టీ – పడవరేవు – వస్తుంది. అక్కడ మొదలైన సముద్ర తీర కారు ప్రయాణం ఐదారు కిలోమీటర్లు సాగి సాగి కార్బైన్ కోవ్ బీచ్ దగ్గర ముగిసింది. అతి చక్కని ప్రయాణం. వంపుసొంపుల దారి.. చిన్న చిన్న గుట్టలమీదుగా… దిగువున సాగరం.. పచ్చదనం… మన విశాఖ బీచ్ రోడ్డు గుర్తొచ్చింది.. బొంబాయి మెరీనా డ్రైవ్‌ను మించినదనిపించింది. అందులోనూ అంత అందానికి మేము సిద్ధపడి వెళ్లలేదేమో- అంధుకే ఆ అందం ద్విగుణీకృతం అయ్యింది!! మనసు శృతి అవ్వాలేగానీ మరి అలాంటి చోట్ల ఎటు చూసినా అందమే…

ఆ బీచి ఒక బీచి ఎలా ఉండాలో అలా ఉంది… కొబ్బరి చెట్లు.. కాస్తంత దూరాన ఓ యాత్రికుల విలాస వసతిగృహం.. రెండో ప్రపంచ యుద్ధం నాటి ‘జపనీస్ బంకర్లు’, కాస్తంత దూరాన సముద్రంలో ‘స్నేక్ ఐలెండ్’ అన్న చిన్న ద్వీపం – అది స్క్యూబా డైవింగ్‌కు ప్రసిద్ధి అట… ఇంకా ఉత్సాహం ఉన్నవాళ్లు ఆ నాలుగైదువందల గజాలు ఈది వెళతారట… పోర్ట్ బ్లెయిర్‌లో ‘తప్పక చూడవలసిన’ ఒక ప్రదేశాన్ని చూసేసామన్న తృప్తి… అనుకోకుండా కలసిన మరో తెలుగు కుటుంబం.. చురుగ్గా కబుర్లు… 2004 లోని సునామీ వల్ల ఈ బీచ్ దెబ్బతిన్న వైనం – అంతా కలసి ఓ గంట అక్కడ…

తిరిగి లైట్ అండ్ సౌండ్ షో కోసం సెల్యులర్ జైలు చేరేసరికి – టికెట్టు దొరికినా – సీట్లన్నీ నిండి కనిపించాయి. ‘ఇదీ ఒక రకంగా మేలే’ అన్నట్టు ఆ పక్కనే ఉన్న ఓ విశాల వృక్షపు మొదలు చుట్టూ కట్టిన చప్టా మీదకు చేరాం.. ఓ గంటపాటు సాగిన ప్రదర్శన అది. ఆ జైలు నిర్మాణ విశేషాలు, అప్పటి స్వాతంత్ర సంగ్రామపు వీరోచిత గాధలు.. జైల్లో ‘నివసించిన’ ప్రముఖ దేశభక్తుల కధలు…సమయోచితంగా సాగే దేశభక్తి గీతాలు – అదో ప్రపంచం.. నిన్నటి నిజం.. నేటి స్పూర్తి!!

SAM_3642

 

 

 

 

4 thoughts on “అండమాన్ డైరీ – 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *