April 24, 2024

మాణిక్యవీణాముపలాలయంతీం – పారసీక ఛందస్సు – 7

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు     j.k.mohanrao

 

సంస్కృత కావ్యములలో ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర అనే వృత్తములు విరివిగా వాడబడ్డాయి. ఇంద్రవజ్రకు గురు-లఘువులు – UUI UU – IIUI UU (త/త/జ/గగ ).  ఇందులో మొదటి గురువుకు బదులు లఘువును ఉంచితే లభించిన అమరికకు ఉపేంద్రవజ్ర అని పేరు, అనగా ఉపేంద్రవజ్రకు గురు-లఘువులు – IUI UU – IIUI UU (జ/త/జ/గగ ).  ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్రలను వేరువేరు పాదములలో ఉంచి వ్రాసిన పద్యమును ఉపజాతి అంటారు.  క్రింది ఉపజాతి శ్లోకమును తీసికొందామా?

 

ఇం. మాణిక్యవీణా ముపలాలయంతీం

ఉ. మదాలసాం మంజులవాగ్విలాసాం |

ఉ. మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం

ఇం. మాతంగకన్యాం మనసా స్మరామి ||

ఇందులో, మొదటి, నాలుగవ పాదములు ఇంద్రవజ్రకు సరిపోతాయి, రెండవ, మూడవ పాదములు ఉపేంద్రవజ్రకు సరిపోతాయి.  ఇంద్రవజ్ర ఒక చక్కని తాళవృత్తము.  ఇందులో 5, 4, 5, 4 మాత్రలు గలవు –

మాణిక్య | వీణా | ముపలాల | యంతీం

ఇంద్రవజ్రకు తెలుగులో ఎనిమిదవ అక్షరముపైన అక్షరసామ్య యతిని లాక్షణికులు ఉంచినారు.  శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన శ్రీ రామాయణ కల్పవృక్షమునుండి ఇంద్రవజ్రకు ఒక ఉదాహరణ క్రింద ఇస్తున్నాను –

శ్యామారుణంబుల్ సిత – శారకాంతుల్

వ్యోమప్రదేశంబున – బూర్ణమౌచున్

భీమంబుగా లోచన-విద్ధమయ్యెన్

తా మంతనంతన్ శమ-తన్ వహించెన్

ఇలా వ్రాసినప్పుడు ఇందులోని సంగీతము బాగుగా అవగతము కాదు.  ఇంద్రవజ్రపు అమరిక ఖండజాతి త్రిపుట తాళమునకు సరిపోవును.  అప్పుడు యతిని ఆఱవ అక్షరముపైన నుంచి అలాగే పదములను విఱిచి వ్రాసినయెడల కర్ణానందముగా నుంటుంది. క్రింద అట్టి ఉదాహరణలను చదవండి –

 

ఇంద్రవజ్ర – త/త/జ/గగ, యతి (1, 6)

11 త్రిష్టుప్ 357

భావాన నీవే – భవ నాడి నీవే

రావాన నీవే – రస సృష్టి నీవే

జీవాన నీవే – చెలువమ్ము నీవే

నా వేల్పు నీవే – నవదీప్తి నీవే

మాణిక్యవీణా – మదిలోన నీకై

యానందమై య-త్యనురాగ మొందన్

తానమ్ము బాడన్ – దలపోయుచుంటిన్

సానందమై రా – సరసానుభూతిన్

ఈ యింద్రవజ్ర – మ్మెనలేని యంద-

మ్మై యిప్డు వెల్గెన్ – హరివిల్లు లొండై

యీ యాకసానన్ – హృదయమ్ము నింపెన్

నా యాశ పండెన్ – నగుమోము నిండెన్

ఇంద్రవజ్ర అను పదమునకు సంపూర్ణమైన వర్తులాకారములో ఉండే ఇంద్రధనుస్సు అని ఒక అర్థము కూడ ఉన్నది.  ఇట్టి ఇంద్రధనుస్సును మనము పర్వతాగ్రమునుండి కొండలోయలో, లేనియెడల జలపాతములు పడే చోటులలో చూడగలము.  ఆ అర్థముతో వ్రాయబడిన పద్యమే చివరి పద్యము.

ఈ ఇంద్రవజ్ర వృత్తములోని రెండు అర్ధ భాగములను తారుమారు చేసి వ్రాసినప్పుడు వచ్చిన వృత్తమునకు నేను శివరంజని అని పేరు పెట్టినాను.  శివరంజనికి ఒక రెండు ఉదాహరణలు –

శివరంజని – స/య/త/గగ, యతి (1, 7)

11 త్రిష్టుభ్ 268

శివరంజనీ రా – శ్రీరాగిణీ రా

భవమోచనీ రా – భావాంబుధీ రా

అవినాశినీ రా – ఆనందినీ రా

నవపుష్పిణీ రా – నాట్యోల్లసా రా

మధుచంద్రికా రా – మాధుర్యమా రా

సుధ బిందువా రా – శుభ్రాభ్రమా రా

మృదునాదమా రా – మేఘాలయా రా

మదనాంబికా రా – మందారమా రా

ఇలాటి మాత్రాగణముల అమరిక పారసీక ఛందస్సులో కూడ ఉన్నది.  దానిని ముతఖారిబ్ ముసమ్మన్ అస్రం అంటారు.  ఈ ముతఖారిబ్ ముసమ్మన్ అస్రం అమరిక ఇలాగుంటుంది: == / -== // == / -== . మన గురు లఘువుల పద్ధతిలో ఇది UUIUU / UUIUU అవుతుంది.  ఈ అమరికతో ఏ వృత్తము పేర్కొనబడలేదు. కాని ఇందులో సగమైన UUIUU అమరికతో పాదమునకు ఐదు అక్షరములు గల సుప్రతిష్ఠ ఛందములో లోలం అనే వృత్తమున్నది. లోలమునకు  ఉదాహరణలు –

లోలం – త/గగ, యతి లేదు

5 సుప్రతిష్ఠ 5

ఆ లక్ష్మి గాచున్

లోలా యనంగన్

లోలమ్ముపై భా-

షాలక్ష్మి యాడున్

లోలంబ పంక్తుల్

బూలందు జూడన్

లోలాకు లాడన్

లోలాక్షి రావా

UUIUU / UUIUU అమరికతోగల వృత్తపు లయ ఇంద్రవజ్ర వంటిదే.  కావున దీనికి దేవేంద్రవజ్ర అని పేరునుంచినాను.  దేవేంద్రవజ్రకు కొన్ని ఉదాహరణలు –

దేవేంద్రవజ్ర – త/మ/ర/గ, యతి, విరామయతి (1, 6)

10 పంక్తి 133

దేవేంద్రవజ్రాఽ-దిత్యాగ్నినేత్రా

శ్రీవాసుదేవా – శ్రీశా మహీశా

జీవాబ్జభృంగా – చిత్తప్రకాశా

కావంగ రావా – కాయమ్ము నీదే

అందాల తారా – ఆనందతీరా

మందారమాలా – మాణిక్యశైలా

కెందమ్మి పువ్వా – క్రీగంటి నవ్వా

ముందిందు రావా – మోహంపు నావా

నీ రాకకై నే – నిత్యమ్ము జూతున్

గారాలతోడన్ – గాళింది నీడన్

శ్రీరాగమాలన్ – జెల్వమ్ము బాడన్

చేరంగ రావా – చిత్రప్రభావా

ఇంద్రవజ్ర వృత్తపు లయతో మాత్రాగణములతో మీ ఆనందమునకై నేను మూడు చిత్ర గీతములను క్రింద అందిస్తున్నాను, విని ఆనందించండి –

1) చెంచులక్ష్మి చిత్రములో ఘంటసాల, జిక్కి పాడిన ఆనందమాయె అలినీలవేణి, అరుదెంచినావా అందాల దేవీ అనే పాట లయ ఇంద్రవజ్ర వృత్తమునకు చెందినదే.

2) బాటసారి చిత్రములో భానుమతి పాడిన ఓ బాటసారి నను మఱువకోయీ మజిలీ యెటైనా మనుమా సుఖాన ఛాయ కూడ ఇంద్రవజ్రవృత్తమునకు చెందినదే.

3) బయలుదారి కన్నడ చిత్రములో జానకి పాడిన బానల్లు నీనే భువియల్లు నీనే (గగనాన నీవే – భువిపైన నీవే) కూడ ఇంద్రవజ్రపు లయ కలిగినదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *