April 19, 2024

విజయగీతాలు – 1

అంకితం

 vreddy1

ఆయన చాలా నిరాడంబరులు, నిగర్వి. వైద్యరంగంలో అధునాతనమైన, మహత్తరమైన ఆరోగ్య పరిరక్షణ ఉత్పాదనలను శాంతా బయోటెక్నిక్స్ ద్వారా సామాన్యులకు సైతం అందించడం. ప్రభుత్వపరంగా ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని పొందడం.

‘హాసం’ పత్రిక నిర్వహణలో అటుపోట్లను యెదుర్కొన్నా, ఉత్సాహాన్ని చంపుకోకుండా, ‘హాసం ప్రచురణలు’ పేర అనేక పుస్తకాలు ప్రచురించి, పలువురు రచయితల్ని ప్రోత్సహించడం.

జంటనగరాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు చేయూత నందించడం – యివన్నీ గమనించి యెవరైనా యే కొద్దిగా ప్రశంసించినా, ‘బాపు-రమణ’ల స్టాయిల్లో ‘పోదురూ మీ పొగడ్తలూ మీరున్నూ’ అన్నట్టు బదులుగా చిన్న చిరునవ్వు చిందించి ఓ నమస్కారం పెట్టి యింక ఆపేయమనే సహృదయులు కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి.

వారికి సంగీత సాహిత్యాలంటే యిష్టం. తనకు నచ్చిన మంచి పాటల్ని యెంచి, తీరుగా అమర్చి, సి.డి.ల రూపంలో మిత్రులకు బహుకరించి ‘వీనుల విందు’ చేయడం ఓ ఖరీదైన హాబీ!

మిత్రులు శ్రీ ఎం.బి.ఎస్.ప్రసాద్ పుణ్యమా అని శాంతా బయోటిక్నిక్స్ వేడుకల్లో నేను సంగీత కార్యక్రమాలు నిర్వహించటంతో మొదలైంది మా పరిచయం. నా పట్ల నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా వున్న ‘హాసం క్లబ్’ ల నిర్వహణ బాధ్యతను “స్టేట్ కన్వీనర్’గా నా మీద వుంచారు. శక్తి మేరకు ఆ బాధ్యతను ఆనందంతో నిర్వహిస్తున్నాను.

ఎందుకో విశ్లేషించి చెప్పలేను, వారంటే నా కెంతో గౌరవం-చనువు,  అభిమానం-అత్మీయతా! సమయాభావం వల్ల అపుడప్పుడు ఫోన్లోనే పలకరించుకొంటున్నా యెంతో సన్నిహితంగా వున్న ఫీలింగు! అందుకే ఆ భావగాఢతకు తీపిగుర్తుగా వారికి యీ “విజయగీతాలు” అంకితమిస్తున్నాను.

 

ఎస్.వి.రామారావు

ఊహించని అవకాశం

తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘విజయా’ సంస్థకు, వారు నిర్మించిన చిత్రాలకు, ఆ చిత్రాల్లోని గీతాలకు యెనలేని ఆదరణ వుంది. అది “పాతాళభైరవి” గావచ్చు. “మాయాబజార్” గావచ్చు, “గుండమ్మ కథ” గావచ్చు (ఆ మూడింటికీ సంగీత కర్త ఘంటసాల మాస్టారే!)

నేను హైదరాబాద్‌లోనూ యితర పట్టణాల్లోనూ జరిగిన పలు సినీ సంగీత కార్యక్రమాలకు వాఖ్యాతగా వ్యవహరించినప్పుడు ఆ పాటల పూర్వాపరాలను, సంగీత సాహిత్య వైభావాన్ని అభినయ, చిత్రీకరణ వైశిష్ట్యాన్ని విశ్లేషించేవాణ్ణి. దాంతో  ఆ గీతాలను ప్రేక్షకులు మరింత రసవత్తరంగా ఆస్వాదించేవారు.

‘హాసం’ (పత్రిక, ప్రచురణలు, క్లబ్) కు నేతృత్వం డా!! వరప్రసాద్‌రెడ్డిగారిది కాగా, సారథ్యం ఎం.బి.ఎస్.ప్రసాద్ గారిది. ఇద్దరికీ హాస్యమన్నా, సంగీతం అన్నా వల్లమాలిన అభిమానం. నా కార్యక్రమాల్ని వీక్షించిన ప్రసాద్‌గారికి ఓ ఆలోచన వచ్చింది-విజయావారి చిత్రగీతాలను నా సంక్షిప్త వ్యాఖ్యానంతో ఓ పుస్తకంగా వేస్తే బాగుంటుందని. ఇది ‘ప్రసాదద్వయం’ నాకు ప్రసాదించిన సువర్ణావకాశం. అందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విజయా వారి సినిమాలను లక్షలాదిమంది అభిమానుల వల్లే నేనూ యెన్నోసార్లు చూసాను. అయినా మరోసారి చూసి యీ పుస్తకానికి రూపకల్పన చేసి మీ ముందుంచాను. పాటలతో బాటు విజయరథ సారథుల సంక్షిప్త చరిత్రను పొందుపరిచాను.

అప్పుడప్పుడు సినీ చరిత్రకు సంబంధించి నా సందేహాలను నివృత్తి చేసే ఆత్మీయులు సర్వశ్రీ అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, సి.నారాయణరెడ్డి, వి.ఎ.కె.రంగారావ్. రావికొండలరావు గార్లకు నా కృతజ్ఞతలు. ఈ ప్రయత్నంలో నాకు సహకరించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు, డా!!రహంతుల్లా, డా!!కె.వి.రావు గార్లకు నా కృతజ్ఞతలు. పుస్తకాన్ని తీర్చిదిద్దడంలో శ్రీ ఎమ్బీయస్ ప్రసాద్‌గారి సహకారం యింతింతని చెప్పలేను.

ఈ పుస్తకం ‘విజయగీతాల’ సిసలైన హీరో పింగళి నాగేంద్రరావు గారి 106వ జయంతి రోజున (29.12.2006) ఆవిష్కరించబడటం నాతోబాటు, విజయాభిమానులందరికీ ఆనందదాయకం. ఆ నాటి సభలో పుస్తకాన్ని ఆవిష్కరించిన విద్యాశాఖామాత్యులు శ్రీమతి నేదురుమల్ల్లి రాజ్యలక్ష్మి గారితో బాటు సభలో పాల్గొన్న శ్రీయుతులు అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, పసుమర్తి ఉదయభాస్కర్, కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి, ఎమ్.బి.యస్. ప్రసాద్, విజయదుర్గ – వీరందరికీ నా కృతజ్ఞతలు.

                                     విజయాభివందనలతో,

                                             ఎస్.వి.రామారావు     


 

వరప్రసాద్ హృదయలేఖిని నుండి…

 

హాసం, హాస్య-సంగీత పత్రిక’ ద్వారా మూడేళ్ళకు పైగా హాస్య, సంగీత ప్రియులను అలరించిన అనుభవం ఆలంబనగా ఈ ప్రచురణల రూపంతో పాఠకుల ముందుకు తిరిగి వచ్చాం. హాస్యం, సంగీతం అనే అంశాలతో కూడిన పుస్తకాలను సాధ్యమైనంత తక్కువ ధరకు పాఠకులకు అందించాలన్న సదుద్దేశ్యంతో ప్రారంభించబడిన మా సంస్థ వెలువరిస్తున్న 17వ ప్రచురణ ఇది. శాంతా బయోటెక్నిక్స్ ద్వారా మేలైన ఔషధాలను, టీకాలను అందుబాటులో అందించి పలువురి ప్రశంసలందిన అనుభవానికి యిది పొడిగింపు వంటిది.

2005 ఉగాది నుండి హాసం  ఇప్పటికి 16 పుస్తకాలు వెలువరించింది. సంగీతకారులపై తనికెళ్ళ భరణి గారు వ్రాసిన ‘ఎందరో మహానుభావులు’, పద్యసంపద గురించి ఆచార్య తిరుమల వ్రాసిన ‘నవ్వుటద్దాలు’ సాహితీప్రియులకోసమైతే రావికొండలరావుగారి ‘హ్యూమరథం 1, 2 భాగాలు’,  తెలుగు సినిమా హాస్య కళాకారుల విశేషాలు, ఉదంతాలు తెలుసుకోదలచిన సినీప్రియులకోసం. సినిమారంగంలో తెర వెనుక నడిచే గందరగోళానికి అద్దం పట్టిన రచన స్వామి చిత్రానంద గారి ‘మాయాబజార్’, మృణాళిని గారి ‘కోమలి గాందరం’ నేటి పురుషసమాజపు పోకడలపై సన్నాయినొక్కులు నొక్కిన హాస్య రచనకాగా ఎమ్బీయస్ ప్రసాద్ గారి ‘అచలపతి కథలు’ ఉడ్‌హౌస్ తరహా హాస్యాన్ని మన సమాజానికి అన్వయిస్తూ సాగించిన హాస్యకథలు.

పులగం చిన్నారాయణగారు ‘జంధ్యామారుతం’ 1, 2 భాగాల ద్వారా జంధ్యాల డైరెక్టు చేసిన 39 సినిమాల తెరమీది, తెరవెనుక విశేషాలను గ్రంథస్తం చేయగా ఎమ్బీయస్ ప్రసాద్‌గారు హిందీ నటగాయకుడు కిశోర్‌కుమార్ జీవితానికి, కెరియర్‌కు ‘కిశోర్ జీవనఝరి’లో అద్దం పట్టారు. అమర గాయకుని జీవనయాత్రను వారి అర్థాంగి గ్రంథస్తం చేసిన రచన ‘మా మామయ్య ఘంటసాల’! ఆ కోవకు చెందినవే హాస్యనటుడు ‘పద్మనాభం ఆత్మకథ’ అనుపమ బ్యానర్‌ద్వారా రూపొందించిన సినీగీతాల ద్వారా సుప్రసిద్ధుడైన కె.బి.తిలక్ జ్ఞాపకాల ‘అనుపమ గీతాల తిలక్! హిందీపాటల అర్థాన్ని అస్వాదించేందుకు వీలుగా రఫీ పాడిన 16 పాటల అర్థాలను, సందర్భాలను వివరించిన పి.వి.సత్యనారాయణ రాజు గారి రచన – ‘హిందీ గేయ వైభవం – 1. దీనిలో ముందుమాటగా గ్రామఫోన్ రికార్డుల కథ చెప్పారు డా!!కె.వి.రావుగారు. ‘టామ్‌సాయర్ ప్రపంచయాత్ర’,  ‘డాక్టర్ డూలిటిల్’ బాలసాహిత్యంలో మా ప్రయత్నాలు.

ప్రస్తుత పుస్తకానికి వస్తే – ‘విజయా’ వారి సినిమాలు ఆరోగ్యకరమైన హాస్యానికి, ఆహ్లాదకరమైన సంగీతానికి చిరునామాలు. కుటుంబచిత్రాలన్న నిర్వచనానికి అప్పటికీ, ఇప్పటికీ సాటిలేని ఉదాహరణలు. పాటలే కాదు, పాటల చిత్రీకరణ సైతం ఎన్నదగిన రీతిలో, అనుకరించదగిన తరహలో రూపొందిన చిత్రాలవి. ఆ గీతాల రచనకు కథోచిత, పాత్రోచిత నేపథ్యం వుంది. సన్నివేశంలో యిమిడిపోయే సందర్భం వుంది. వీటినెవరైనా వివరించాలి. ఈ వివరాలన్నీ గ్రంథస్తం కావాలి.

విజయావారి చిత్రపస్థానం ప్రారంభమై అర్త్ధశతాబ్ది దాటిపోయింది. ఇప్పటికైనా వాటిని గురించి చెప్పకపోతే భావితరాలవారు ఈ పరిజ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం వుంది. విజయావారి పాటల్లో కొన్ని పాటలు గాయనీగాయకుల పరంగా ప్రచురిస్తున్న పుస్తకాల ద్వారా అందుబాటులో వున్నాయి. కానీ అన్నీ లభ్యం కావటం లేదు. ఒక్కచోట లభ్యం కావటం లేదు. పూర్వాపరాలు లేకుండా కేవలం పాటలను మాత్రం ప్రచురించి వూరుకోవడం మా లక్షణం కాదు. దేనికైనా ‘వాల్యూ యాడ్’ చేయడమే ‘హాసం’ బ్రాండ్.

‘హాసం’ కోరుకున్న రీతిలో ఈ పాటల గురించి చెప్పగలిగిన సమర్థులు మిత్రులు శ్రీ ఎస్.వి.రామారావు గారు మాత్రమే. వారు ‘సినీ విజ్ఞాన విశారద’ బిరుదాంకితులే కాదు, ‘హాసం క్లబ్స్’ స్టేట్ కన్వీనర్‌గా ‘హాసం’ ఉద్యమంతో మమేకమైనవారు. మేము కోరుకున్న తీరులో వారు ‘విజయగీతాలు’ వ్రాసి పెట్టారు. రామారావుగారి స్క్రిప్టుకు మిత్రుడు శ్రీ ఎమ్బీయస్ ప్రసాద్ అనువైన ఫోటోలు చేర్చి, మెరుగులు దిద్ది మరింత శోభాయమానంగా చేశాడు.

ఈ పుస్తకాన్ని అంకిత మందడం నాకెంతో ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే విజయావారి సినిమాలన్నా, వాటిలో పాటలన్న చెవికోసుకునేవారిలో నేనొకణ్ని. తక్కిన పుస్తకాలలాగానే ఈ పుస్తకం కూడా పాఠకాదరణ పొందుతుందని ఆశిస్తున్నాను.

ఇప్పటివరకూ వెలుపడిన మా పుస్తకాలన్నీ ప్రజాదరణ పొందాయని తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. మొదటి ప్రచురణ వెలువడిన కొన్ని నెలల్లోనే మలి ప్రచురణకు సిద్ధమవుతున్నాయి. ‘కొనడం మీ వంతు – ఆకట్టుకొనడం మా వంతు’ అని ‘హాసం’ నినాదం. మీరీ పుస్తకాలు ఆదరించి, కొని, కొనిపించి మరిన్ని పుస్తకాలను అందించడనికి మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు. ధన్యవాదాలు.

భవదీయుడు,

కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి

ప్రచురణకర్త

 

 

జెండాపై కపిరాజు అను విజయపతాక చరిత్ర

 Vijaya Productions

సినీపరిభాషలో వ్యాపర పరంగా ‘బేనర్‌వాల్యూ’ అనే ఓ పదం వుంది. అంటే ఆ సంస్థ నిర్మించిన చిత్రాల స్థాయిని బట్టి, ఆర్థికంగా అవి సాధించిన విజయాలని బట్టి ఆ విలువ లభిస్తుంది. ఆ కోణంలో అలోచిస్తే ముందుగా మున్ముందుగా నిలిచేది విజయా ప్రొడక్షన్స్ లిమిటెడ్.

ప్రతీ సంస్థ తమ అభిరుచి తగ్గట్టుగా సంస్థ చిహ్నాన్ని (లోగోను) తయారు చేసుకొంటుంది. దానిని చిత్ర ప్రారంభంలో చూపిస్తారు. దానిని సింబలైజ్ చేస్తూ ఓ మ్యూజిక్ బిట్‌ని కూడా సెట్ చేసుకొంటారు. ఆ పతాకాన్ని లేదా గుర్తును చిత్రం చివరన కూడా ప్రదర్శించే సంప్రదాయాన్ని కొన్ని సంస్థలు పాటించాయి. వాటిల్లో విజయా ఒకటి. విజయా పతాకాన్ని పరిశీలిస్తే దానిపై రెపరెపలాడుతున్న జెండాపై గదాయుధుడై గాలిలో ఎగిరిపోతున్న పవనసుతుడు కనిపిస్తాడు. వెనుక ఘంటసాల సమకూర్చిన సమరభేరిని గుర్తుచేసే సంగీతం వినిపిస్తుంది. దీనిని బట్టి నాకు తోచిన సంకేతమేమంటే…

కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథంపై జండాపై “కపిరాజు” వుంటాడు. (ఈ మేరకు అంతకుముందు ఆంజనేయుడు పాండవ మధ్యమునికి మాట యిచ్చాడు). మనం కూడా తరచుగా “శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం” అంటూ వాయునందనుని తల్చుకొంటుంటాం. రాయబార సన్నివేశంలో శ్రీకృష్ణుడు “జెండాపై కపిరాజు” వుండగా జరిగే ఫలితమేమిటో తెల్పుతూ సుయోధనుని పరోక్షంగా హెచ్చరిస్తాడు. విజయుడు అంటే అర్జునుడు, అతని జయకేతనం ఆంజనేయుడే. అందుకని ‘విజయ’ సంస్థకు విజయాన్ని అందించే భారం ఆయనదే! ఈ భావం విజయా నిర్మాతలకు స్పూర్తినిచ్చి వుండొచ్చు. ఏమయితేనేం ‘విజయా’కు పతాకం ఎంపికతోనే విజయం ప్రారంభమైంది.

మరింత పరిశీలనగా చూస్తే రెపరెపలాడే ఆ పతాకం పై భాగాన ‘క్రియాసిద్ధిః సత్త్వే భవతి, మహతాం నోపకరణే’ అనే సూక్తినుండి తీసుకున్న “క్రియాసిద్ధిః సత్త్వే భవతి” అన్న సంస్కృత అక్షరాలు కనిపిస్తాయి. దాని భావం మనిషిలో జన్మతః అంతలీనంగా సత్తువ వుంటుంది. దాని వల్ల యెన్నో సాధించవచ్చు. ఉపకరణాలతో అంతగా పనిలేదు. ఈ భావం వారి చిత్రాలకు అన్వయించుకొంటే సినిమాకు సహజసిద్ధమైన కథకే ప్రాధాన్యం తప్ప యితర హంగులకు కాదు. ఈ సూక్తి నిజమని నిరూపించిన విజయా వారి చిత్రాల ప్రస్థానం “షావుకారు”తో ప్రారంభమైంది.

 

 2.shavukaru Release

షావుకారు

(విడుదల తేదీ – 7.4.1950)

 

ఈ చిత్రం తాలుకు పబ్లిసిటిలో “షావుకారు” అని వ్రాసి క్రింద ‘ఇరుగుపొరుగుల కథ’ అని వుదహరించారు. అంటే యీ రోజుల్లో మనకి సర్వసాధారణంగా కనిపించే టైటిల్‌ టాగ్‌కు ఆనాడే నాంది పలికారు విజయావారు. దర్శకునిగా యల్.వి.ప్రసాద్‌కు యిది అయిదవ చిత్రం, హీరోగా యన్.టి.రామారావుకు, నాయికగా జానకికి యిది తొలిచిత్రం.

చిత్రప్రారంభంలో ఓ హరిదాసు త్యాగపూరితమైన శిబిచక్రవర్తి హరికథ చెబుతాడు. ఈ హరికథ వింటున్నప్పుడు కథలోని పాత్రలు రామయ్య (శ్రీవాత్సవ) శాంతమ్మ (శాంతకుమారి). నారాయణ (వి.శివరాం), సుబ్బులు (జానకి), పంతులు (వంగర), రామి (కనకం) పరిచయమౌతాయి. ఒకవైపు కథ జరుగుతూంటే మరోవైపు కథను నడిపించే నెగటివ్ పాత్రలు చంగయ్య (గోవిందరాజుల సుబ్బారావు) సున్నంరంగడు (ఎస్.వి.రంగారావు) కూడా పరిచయమౌతారు. హరికథలో పిట్టకథగా నవకోటి నారాయణ అనే లోభికథ ప్రస్తావనకు వస్తుంది. సున్నం రంగడు గ్రామంలో ఓకరికి అప్పు యిప్పించటం ద్వారా ఆ లోభి, చంగయ్య అని ఎస్టాబ్లిష్ చేస్తారు. హరిదాసులకు మధ్యలో పాలు తాగటం సహజ లక్షణం. దాన్ని కూడ చూపిస్తారు దర్శకులు ప్రసాద్.

సీనియర్ సముద్రాల వ్రాయగా స్వీయ సంగీత సారధ్యంలో ఘంటసాల ఆలపించిన ఆ హరికథ –

శ్రీలు చెలంగే భారతభూమిని పాలించిన భూపాలురలో,

సునీరంబను దేశము నేలే శిబిరాజేంద్రుడు ఘనుడూ,

అడిగిన లేదనలేని వుదారుడు శరణార్దుల,

విడనాడని ధీరుడు శిబికీసాటి దొరా, లేదు ధరా శిబికీసాటి దొరా!

కీర్తన :   మావటీ, ఓహో మావటీ

నాపాలిటి దైవమీవే, నా ఆపద తీర్పరావే                                        !!మా!!

మొయలేక నాదుబరువు, ప్రాణమ్ములు కడబట్టెను

నా సిరిలో సగమిచ్చెద, నన్నుగావు మమ్మతోడు                           !!మా!!

సాహిణీ, ఓహో సాహిణీ

మాకీవే దిక్కుసుమ్ము, మా మొక్కుల నందుకొమ్ము

నేలదింపి పొమ్ముమమ్ము, యేసుగిదిగో ప్రతిఫలంబు                      !!సా!!

శ్రీలు చెలంగే భారతభూమిని పాలించిన భూపాలురలో,

సునీరంబను దేశము నేలే శిబిరాజేంద్రుడు ఘనుడూ,

అడిగిన లేదనలేని వుదారుడు శరణార్దుల,

విడనాడని ధీరుడు శిబికీసాటి దొరా, లేదు ధరా శిబికీసాటి దొరా!

కీర్తన : మావటీ, ఓహో మావటీ

నాపాలిటి దైవమీవే, నా ఆపద తీర్పరావే !!మా!!

మొయలేక నాదుబరువు, ప్రాణమ్ములు కడబట్టెను

నా సిరిలో సగమిచ్చెద, నన్నుగావు మమ్మతోడు !!మా!!

సాహిణీ, ఓహో సాహిణీ

మాకీవే దిక్కుసుమ్ము, మా మొక్కుల నందుకొమ్ము

నేలదింపి పొమ్ముమమ్ము, యేసుగిదిగో ప్రతిఫలంబు                      !!సా!!

 

            ఆ గ్రామంలో యిరుగుపొరుగులు చంగయ్య, రామయ్య.  చంగయ్య కొడుకు సత్యం (రామారావు), పట్నం నుంచి వస్తూనే రామయ్య యింటికి వెళ్ళి. తరువాత తన యింటికి వెళతాడు. రామయ్య కూతురు సుబ్బులుకు చంగయ్య వద్ద మాలిమి. సత్యం, సుబ్బులు ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. సుబ్బులు మేడ మీద వున్న సత్యంకు కాఫీ తీసుకెళుతుంది. అక్కడ నౌకరు పోలయ్య (పద్మనాభం) వుంటాడు. వాణ్ణి మధ్యవర్తిగా చేసుకొని చలోక్తులు విసురుకొంటారు. అప్పుడు చిలకను సంబోధిస్తూ (అంటే నాయికను) సత్య పాత్ర ద్వారా సుమధుర లలితగీతాన్ని వినిపిస్తారు ఘంటసాల. పంచెకట్టు లాల్చీ, పైన టవల్, మధ్యలో మెట్లు దిగి వచ్చి టవల్ తీసేసి శాలువా కప్పుకొని గ్రామంలో యువకుడికి ప్రతిరూపంగా ‘సముఖంలో రాయభారమేల’ అనే సామెతను అనువుగా ఉపయోగించుకుంటూ ప్రణయగీతం ఆలపిస్తాడు. పలికిన నేరమటే? పలుకాడగ నేరవటే? అని ఉడికిస్తూ ‘ఇరుగుపొరుగులు ‘అరమరికలు’ (అర అంటే పార్టిషన్ అని అర్థం) తగునా అనడంలో చమత్కారం గమనించండి. పాడినది ఘంటసాల.

                        పలుకరాదటే చిలుకా పలుకరాదటే!!

సముఖములో రాయబార మెందులకే                   !!పలుకరాదటే!!

యెరుగని వారమటే, మొగ మెరుగని వారమటే

పలికిన నేరమటేఅ, పలుకడగ నేరవటే,

ఇరుగుపొరుగు వారలకీ

అరమరికలు తగునటనే                                      !!పలుకరాదటే!!

మనసున తొణికె మమకారాలు

కనులను మెరిసే నయగారాలు

తెలుపరాదటే సూటిగా,

తెరలు తీసి పరిపాటిగా!!                                                  !!పలు!!

 

అందుకు బదులుగా తను మనసిచ్చిన సత్యం మనసు తెలుసుకొన్న సుబ్బులు అదే చిలకను సంబోధిస్తూ, సత్యం టౌనునుంచి వచ్చినా, తను వున్నది పల్లెటూళ్ళో అని, ఆ బస్తీ వేషాలు యిక్కడవేస్తే నలుగురు నవ్విపోతారని బదులు చెబుతూనే మౌనమే అంగీకారంగా గ్రహించాలని సూచిస్తుంది. గాయని బాలసరస్వతి గొంతులో పల్లవించి జానకి ముగ్దమొహన అభినయంతో అలరించిన ఆ గీతం.

చిలుకా తెలుపవేలనే,

బదులు పలుకవేలనే చిలుక, తెలుపవేలనే!!

వలపుతలపులున్నా కనుమాటు చాటులేదా,

పల్లెపడుచులీ పగలు కనీవినీ యెరుగరనీ               !!తెలు!!

తళుకులూ, బెళుకులూ, బస్తీల చమకులూ,

పల్లెటూర చూస్తే పకాపకా నగదురనీ                     !!తెలు!!

మనసులొకటియైతే, మరిమాటతో పనేలా,

కన్నె బాసలింతేనని యెదుట నిలచి పలుకరనీ        !!తెలు!!

షావుకారు కథలో కీలకమయినది సత్రం ఘట్టం. అది చంగయ్య పూర్వీకులది. దానిని బంగారయ్యకు అద్దెకు యిస్తాడు చంగయ్య. ఆ సత్రం అనాధశరణాలయం. అక్కడ వుండే అంధుడు పిచ్చయ్య తత్వాలు పాడుకొంటుంటాడు. ఆ పాట సారాంశం కూడా చంగయ్య లోభితనాన్ని ఎత్తి చూపుతుంది. పుట్టు లోభికి పుట్టగతే లేదంటాడు కవి. గాయకునిగా గంభీరస్వరంతో మన హృదయాలు దోచుకొన్న మాధవపెద్ది సత్యం ఆ పిచ్చయ్య పాత్ర ధరించి వినిపించిన తత్త్వం.

యింతే నన్నా, నిజమింతే నన్నా

గుట్టెరిగిన గురురాయలు మనవెను తట్టితెలుపు నిజమింతే నన్నా

పెట్టువారికే పుట్టేదన్నా, పెట్టిందే నీ పెట్టుబడన్నా

పెట్టిపోయనీ పుటులోభికి, పుట్టగతే లేదన్నా                      !!యిం!!

కోటిజేర్చి పడగెత్తినకూడా, ఆశ కంతమే లేదన్నా

పేదసాదకూ పెట్టిపోసినా, ధనమే తనతో వచ్చేదన్నా           !!యిం!!

 

ఊరంతా దీపావళి పండుగలు జరుపుకొంటుండగా ఇరుగు పొరుగుల యింటి ముంగిట శాంతమ్మ (సహజగాయని శాంతకుమారి) సుబ్బులు (బాలసరస్వతి) మతాబాల వెలుగులు, చిచ్చుబుడ్లు, జిలుగులు గూర్చి పాడుకొంటూ గీతం చివరిలో సుబ్బులు తన అంతర్యాన్ని ఆవిష్కరిస్తూ.. తొలకరి స్నేహాలు ‘వలపుల వానగా కురిసే సెలయేరుగా పొందే ప్రమోదతరంగాళి’ అనటం ఓ పల్లెపడుచు మమతల మాలికకు ఫినిషింగ్ టచ్! రవ్వలు, ముత్యాలు విడిగా ‘ప్రెషస్ స్టోన్స్’ కావచ్చు, కానీ మతాబాల్లో, కాకరపువ్వొత్తుల్లో రాలేవాటిని అలాగే పిలుస్తారు.

                       కోరస్:

దీపావళీ, దీపావళీ

యింటింట ఆనంద దీపావళీ

మా యింట మాణిక్య కళికావళీ !!దీపావళీ!!

శాంతః జిలుగుల వలువల

అల్లుళ్ల తళుకు, కూతుళ్ల కులుకు,

సుబ్బులు :పలుకుల వయ్యారి పదినెల వన్నెలు,

మురిసీడు చిన్నెలు రంగూ మతాబుల శోభావళీ                 !!దీపావళీ!!

శాంత: చిటపట రవ్వల ముత్యాలు కురియ, రత్నాలు మెరయ

సుబ్బులు : తొలకరి స్నేహాలు వలపుల వానగ,

కురిసి సెలయేరుగా పొంగే ప్రమోదతరంగావళీ                     !!దీపావళీ!!

 

ఆ మర్నాడు మేడమీద నుంచి క్రిందకు వస్తున్న సుబ్బులు సిగనుంచి ఒక పూవును తన చేతిలోకి తీసుకొంటాడు సత్యం. ఆమె బిడియంతో వెళ్ళిపోతుంది. సత్యం ఆ పూవును తీసుకొని మేడమీదకు వెళ్ళి ఓ పడకకుర్చీలో చాలా రిలాక్స్‌డ్‌గా ఫీలవుతూ హాయిగొలిపే ఆ పూవును సంబోధిస్తూ తన ప్రేయసి అంతర్యాన్ని తెలుపమంటాడు. ఆ గీతాన్ని కేవలం 5,6 షాట్స్‌లో అద్భుతంగా చిత్రికరించారు కెమెరమాన్ మార్కస్ బార్‌ట్లీ. ముఖ్యంగ “ఆమనికోయిల” అన్న చరణం మొత్తం ఒకే షాట్‌లో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత ఫ్రెష్‌గా, ప్లజంట్‌గా, రొమాంటిక్‌గా అభినయించరు యన్.టి.ఆర్.ఘంటసాల గొంతులో లేతదనం పరిమళించింది. కిన్నెర అంటే ఒకరకమైన వీణ, వనరు అంటే ఒప్పు, నెనరు అంటే ప్రేమ, స్నేహము.

యేమనెనే చిన్నారి యేమనెనే

వన్నెల సిగపువా కనుసన్నలలో భావమేమి?                     !!యేమనెనే!!

ఆమని కోయిల పాటల,

గోముల చిలికించు వలపు కిన్నెర,

తానేమని రవళించెనే                                                      !!యేమనెనే!!

వనరుగా చనువైన నెనరుగా,

పలుకె బంగారమై, కులుకె సింగారమై,

మావాడ, రాచిలుక మౌనమౌనముగా                               !!యేమనెనే!!

 

ఇక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. సత్రం అద్దెకు యివ్వటానికి చంగయ్యకు హక్కులేదని రామయ్య పోలీసుల ఎదుట సాక్ష్యం చెప్పటంతో చంగయ్య భంగపడతాడు. ఆ కోపంతో రెండు కుటుంబాల మధ్య గల తలుపులు మూయుస్తాడు. వికలమైన మనసుతో టౌనుకు వెళతాడు సత్యం. టౌనులో అతని గదిలో వున్న మిత్రుడు సాంబు (జోగరావు) వేశ్య మాణిక్యం (సీత)తో సరసాల్లో మునిగితేలతాడు. మాణిక్యం ఓ నృత్యగీతంలో ఆకర్షిస్తుంది. జిక్కి ఆలపించిన ఆ గీతం. తామసం అంటే ఆలస్యము, వలరాజా మాయ చేసే రాజా అని అర్థం, సయ్యాట అంటే సహక్రీడ.

                        సరసులకిదిమేరా తామసమిక చాలురా

విరిశరముల కిక ఓపగలేనురా నే నోపంగలేనురా,

వలపులరాజా వయ్యారిరాజా యేలరా                               !!స!!

చనువుగ నీ బిగి కౌగిలినీయరా, సయ్యాటలాడరా

సరి సయ్యాటలాడరా, వలపులవలరాజా వయ్యారి

రాజా, ఓ పూల రాజా, నా బాలరాజా, యేలరా!

 

సత్యం వారిద్దరినీ అసహ్యించుకొని తన గదినుంచి వెళ్ళగొడతాడు. సాంబు, మాణిక్యం వేరేగా వుంటూ, అంతకు ముందు వచ్చిన హిట్ సాంగ్స్ స్ఠాయిల్లో ఓ పాట పాడుకొంటారు. గతంలో హిట్ అయిన వాటిని వేరే రూపంలో వాడుకోవటంలో తప్పులేదని ప్రసాద్‌గారి అభిప్రాయం. ఆ తరువాత పలు హిట్‌సాంగ్స్ భిట్స్‌ను కూర్చి ఒక పాటగా రూపొందించిన సంఘటనలు కోకొల్లల్లు. వాటికి నాంది పలికింది యీ గీతం. ఈ గీతంలో “లైలామజ్ఞూ”లో  ‘ప్రియుని తెలిపి నీజమిదని’ “దిల్లగీ” (హిందీ)చిత్రంలోని ‘దిల్‌కా లగానా కోయీ దిల్లగీ’, “బాలరాజు”లోని ‘తీయని వెన్నెల’ – ఈ మూడింటిని తమాషాగా మిక్స్‌ చేసారు ఆ గీతంలో! పాడినవారు జిక్కి, పిఠాపురం.

విరహవ్యథ, మరచుకథ, పలుకుని ఓ జాబిల్లీ

తెలుపవె ఓ జాబిల్లీ

తగునా నిరాశా, మగువమనసు తెలుసుగాదా

దరియరావె ఓ జాబిల్లీ

ప్రేమమిఠాయీ తింటుంటే హాయీ, రావే మిఠాయి

రాజాకఠారీ, ప్రేమమిఠాయి

పోయెదవా కదలీ సరాసరి

పోదునె చెలీ చేరవే సఖీ

తీయని వెన్నెల రేయూ, యింకేలనో లడాయీ

పసందుగ తిందాము ప్రేమమిఠాయి, మిఠాయ్, మిఠాయ్

 

రంగడు, చంగయ్య పన్నాగం వల్ల రామ్మయ కొడుకు నారాయణ జైలుకెడతాడు. సాంబు, మాణిక్యం కుట్రపన్ని సత్యంపై దొంగతనం ఆరోపణ చేయగా సత్యం జైలుకెడతాడు. జైల్లో నారాయణ, సత్యం నిజానిజాలు తెలుసుకొంటారు. కొడుకుని విడిపించాలని విఫలయత్నం చేసి కుంగిపోయి యింటికి చేరతాడు చంగయ్య. ఇక్కడ కథకు కీలకమైన నీతిని గ్రామ ప్రజల నోట చెప్పిస్తారు రచయిత చక్రపాణి. “ఒకరి బిడ్డను తను కొడితే, తన బిడ్డను దేవుడు కొట్టాడని”! ఆ పరాభవంతో దిగులుపడుతున్న చంగయ్యకు పిచ్చయ్య తాత తత్త్వం వినిపిస్తుంది. పాడినది మాధవపెద్ది.

 

                        యేలా వగతువుర జీవ,

తెలుసుకోరా వెర్రిజీవా, తెలివికలిగీ మెలగరా

పరుల కొంపలు తీయునాడీ బాధ తెలియక పోయెరా.

చేసుకొనా పాపఫలము, అనుభవించక పొదురా                 !!తెలుసుకోరా!!

వొళ్లు తెలియని తామసానా యిల్లుచీకటులాయెరా,

నీయిల్లు చీకటులాయెరా, కళ్లు తెరచి, కల్ల తెలిసీ

యిల్లు చల్లగ దిద్దుకోరా                                        !!తెలుసుకోరా!!

 

మారిపోవురా కాలము, మారుటెడానికి సహజమురా

వుదయాస్తములూ, పగలూ రేయి, వెలుగు చీకటి

యెండావానా, నెలలు రుతువులూ, వత్సరములుగా

చక్రములోని ఆకులతీరున దొరలిపోవురా కాలము,             !!దొర!!

దొరలుటె దానికి సహజమురా

మ్రోదులు చివురించునరా, పూవులు, పిందెలు నించునురా,

బోసిచన్నభువి పులకరించురా,

బంగరుపంటల తాండవించురా                                         !!మారిపోవురా!!

            ఒక ఆనందకరమైన సన్నివేశంలో ఒక పాట వుంటే, అదే సందర్భం ఆ తరువాత బాధ కలిగిస్తే అదే పాట విషాదపరంగావస్తే ఇమ్‌పాక్ట్ బాగుంటుంది. అది పుట్టిన రోజుగావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, దసరా కావచ్చు.(ఉదా: “పల్లెటూరు”లో ఆ సంక్రాంతి విషాదగీతం, “దసరా బుల్లోడు”లో ‘నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే’)

వాటికి స్పూర్తి నిచ్చింది యీ చిత్రంలో బాలసరస్వతిదేవి పాడిన దీపావళి విషాదగీతం. ఊరంతా దీపావళి అయితే మా యింట మాత్రం తిమిరావళి (చీకటి ఆవరించిందని) అని ఆ పాట భావం. ఆపదలు యింట తిష్టవేసి యిలవేలుపులు అయిపోయాయట. అంధకారం, తిమిరం అనే సమానార్థకమైన రెండు పదాలు ఉపయోగించి “డార్కెస్ట్ డార్క్’ అని సూచించారు గేయరచయిత. ‘యేమెనెనే’ పాటలో ‘మౌనమౌనముగా’ అన్నట్టుగానే!

దీపావళీ, దీపావళీ యింటింట ఆనంద దీపావళీ

మాయింట శోకాంధ తిమిరావళీ                                        !!దీపావళీ!!

ఆ మతాబాల తళతళా, కళా మరల మావాడలో

మెరసేనా, ఆనందము విరిసేనా మురిసేనా                        !!దీపావళీ!!

ఆశపడే హృదయాలకు ఆపదలే యిలవేలుపులా

జీవితమే నిట్టూరువులా విధికి యివే వేడుకలా                   !!దీపావళీ!!

 

షావుకారు కథకు కీలకమయిన పాత్ర చాకలి రామి. సున్నం రంగడిని ఆటపట్టించటం దాని సరదా. చంగయ్య రంగడిని పనిలోంచి తీసేసాక, రంగడు చంగయ్యకు ద్రోహం తలపెడతాడు. ఆ రహస్యం తెలుసుకోవాలని రంగడిని మురిపిస్తుంది రామి. చాలా సినిమాల్లో పతాక సన్నివేశానికి ముందుగా విలన్ రహస్యాన్ని తెల్సుకోవటానికి హీరోయిన్ అతన్ని కవ్విస్తూ, మురిపిస్తూ లబ్జుగా పాడుతుంది. వాటికి యీ గీతం స్పూర్తిగావచ్చు.

అంతకుముందు కీలుగుర్రం, గుణసుందరికథ చిత్రాలలో ప్రేక్షకుల్ని కవ్వించిన టి.కనకం చాకలి రామి పాత్రలో యీ పాటను స్వయంగా పాడి అభినయించింది. తను చాలా ఫ్రెష్ అనే భావం ధ్వనించేలా ‘మెరుగు చెడని సరికొత్తది’ అని రామి నోట అనిపించారు సముద్రాల. ఆ గీతం వింటే సున్నం రంగడేకాదు ఎవడైనా కుదేలవ్వాల్సిందే! ‘సరికి సరిగా’ అనడంలో జాణతనం వుంది. ఇదంతా ఉత్తిదే అని ప్రేక్షకులకు సూచనా వుంది.

 

భలే దొరలకు దొరకని సొగసు, అనువుగ దొరకును

రంగయ్యా, సరుకనువుగ దొరకును రంగయ్యా

మనసు మనసు, కలిసిందిరా, మనమిద్దారమిక

జతకందరా, సరికి సరిగా, దొరకురా                                    !!భలే!!

మెరుగు చెడని సరికొత్తది, యింకెయ్యాల ఆదిగిన

వుత్తదీ, యిదిర, అదును, కడలిరా                                    !!భలే!!

 

ఈ పాటకాగానే రంగడు రామితో తన పథకాన్ని వివరించటం – అది రామి సుబ్బులుకు చెప్పటం – ఆమె చంగయ్య మావను హెచ్చరించటం – చంగయ్యపై దౌర్జన్యం చేయబోయిన రంగడికి గ్రామస్తులు బుద్ది చెప్పటం- చంగయ్య పశ్చాతాపం – సత్యం, నారాయణ జైలునుంచి విడుదల అవ్వటం, రెండు కుటుంబాలు ఏకం కావటంతో దూరంగా ఓ బుర్రకథ వినిపిస్తూంటుంది. సహజ గ్రామీణ వాతావరణంలో జరిగే యీ సినిమా హరికథతో ప్రారంభమై బుర్రకథతో ముగించటం పొయెటిక్ జస్టిస్ అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *