March 28, 2024

సంభవం – 8

రచన: సూర్యదేవర రామ్మోహనరావు

suryadevaranovelist@gmail.comsuryadevara

http://www.suryadevararammohanrao.com/

– See more at: http://magazine.maalika.org/2013/12/04/%e0%b0%b8%e0%b0%82%e0%b0%ad%e0%b0%b5%e0%b0%82-7/#sthash.Fdr0xOmb.dpuf

suryadevaranovelist@gmail.com suryadevara

http://www.suryadevararammohanrao.com/

ఆ తర్వాత భారతి క్రయోనిక్స్ గురించి ప్రశ్నించడం మొదలెట్టింది. మరో పదినిమిషాల తర్వాత దూరంగా వెండి వెలుగుల తోరణంలాంటి దీపాల మధ్య వేంకటేశ్వరస్వామి దేవాలయం కనిపించింది.

“తిరుపతి వచ్చేశాం… ఎటు వెళ్ళాలో చెప్పింది దిశ.

“మనం వస్తున్నట్టు సవ్యసాచికి తెలుసా?” ప్రశ్నించాడు నవనీత్.

“నేను ఫోను చేసి చెప్పాను…” చెప్పింది దిశ. మరో పదిహేను నిమిషాల తర్వాత నెరబైలు గ్రామం పైభాగంలో గింగిర్లు కొట్టసాగింది హెలికాప్టర్.

కింద పొలాలల్లో అప్పటికే ఎన్నో గంటలనుంచి వున్న సవ్యసాచి తన జీపు లైట్స్‌ని డిప్ అండ్ డీమ్ చేస్తూ సిగ్నల్స్ యివ్వసాగాడు.

ఆ సిగ్నల్స్‌ను అందుకున్న జనరల్ నెమ్మదిగా హెలికాప్టర్‌ను కిందకు దించసాగాడు.

హెలికాప్టర్ కిందకు దిగిన వెంటనే-

అందరికీ సవ్యసాచిని పరిచయం చేసింది దిశ.

మరుక్షణంలో హెలికాప్టర్లో వున్న విశ్వంభరరావు శవాన్ని జీపులో పెట్టారు దిశ, భారతి, నవనీత్.

తను ఢిల్లీ తిరిగి ప్రయాణమవడానికి సిద్ధమయ్యాడు జనరల్ మెహతా.

“భారతీ! ఈ యంగ్ సైంటిస్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అని సవ్యసాచి చేతిని తన చేతిలోకి తీసుకుని…

“మానవ విజ్ఞాన శాస్త్రాన్ని మరో మలుపు తిప్పగలరని నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ దేశాన్ని అవినీతిపరులు, స్వార్థపరులు, రాక్షసులు పరిపాలించగూడదు. విశ్వంభరరావులాంటి నీతిమంతులే పరిపాలించాలి. లేదంటే మన దేశప్రజలు అన్యాయమైపోతారు. అర్థాకలితో అలమటించి పోతారు. అలాంటి మహనీయుడ్ని చంపిన దుర్మార్గులెవరన్నది ఒక విశ్వంభరరావుగారికే తెలుసు. వారు తిరిగి బ్రతికి, వాళ్ళెవరనేది దేశ ప్రజలకు వివరించాలి. అప్పుడు ప్రజలే ఆ కిరాతకుల అంతు చూస్తారు. అందుకోసమైన మీరు విశ్వంభరరావుగార్ని బ్రతికించాలి. చీకట్లో దాగిన ఆ కుట్ర బట్ట బయలు కావాలి. ఎవరి స్వరూపాలేమిటో ప్రజలకు తెలియాలి. అందుకే నేనీ సాహసం చేశాను. అంతేకాదు, అర్హత వుండి, సామర్ధ్యం వుండి కూడా సర్వీస్‌లో వెనకబడి వున్న నన్ను గుర్తించి మిలటరీ జనరల్‌ని చేసింది వారే – వారి రుణాన్ని యిలా తీర్చుకున్నాను. మీకెప్పుడు ఏ సహాయం కావాలన్న ఒక్క ఫోన్‌కాల్ చెయ్యండి చాలు… బైదిబై మిస్టర్ సవ్యసాచీ! ఇప్పుడే. ఈ క్షణంలోనే, నేనొక నిర్ణయానికొచ్చాను. నన్ను మీ సంస్థలో సభ్యునిగా చేర్చుకోండి… ‘నా మరణానంతరం నా శవాన్ని మీరు క్రయోనిక్‌గా మార్చడానికి అంగీకరిస్తున్నాను” అన్నాడు మెహతా సీరియస్‌గా.

ఆ మాటకు సవ్యసాచి తపస్సు ఫలించిన మహర్షిలా ఆనందంగా నవ్వాడు.

“థాంక్యూ జనరల్….!” మరో రెండు నిమిషాల తర్వాత, హెలికాప్టర్ పైకి లేచింది. చీకట్లో హెలికాప్టర్ కనుమరుగయ్యేంత వరకు చూసి అందరూ జీపువైపు నడిచారు.

మరో పదినిమిషాల తర్వాత జీపు దట్టమయిన అడవిదారిలో చీకట్లను చీల్చుకుంటూ మృతసంజీవని కేసి దూసుకుపోసాగింది.

 

*      *     *      *     *

 

రాత్రి 2.30 నిమిషాలు దాటింది.

ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌కి చెందిన వీడియో ఫొటోగ్రాఫరు మధుచక్రవర్తి స్టూడియోలో వున్నాడు రుషికుమార్.

ఇండియన్ న్యూస్ రీల్ కోసం తను మధ్యాహ్నాం చిత్రీకరించిన ప్రసంగాన్నీ, మీటింగ్ దృశ్యాలను చూస్తున్నాడతను.

“మొట్టమొదటి బుల్లెట్ సౌండు వినగానే యూనిట్ చెదిరిపోయింది సార్… స్టాండ్‌ని అక్కడే వదిలేసి కెమెరాను పట్టుకుని పరుగెత్తాను…” చెప్పాడు మధుచక్రవర్తి.

“మీటింగుకొచ్చిన ప్రజల్ని చిత్రీకరించారా?” అడిగాడతను.

“కొన్ని పార్టులు మాత్రమే చిత్రీకరించాం సార్” ఆ పార్టుల్ని చూపిస్తున్నాడు మధుచక్రవర్తి.

కన్నార్పకుండా చూస్తున్నాడతను.

సడన్‌గా ఫౌంటెన్ కనబడడంతో ముందుకు వంగి రాజస్థాన్ గ్రామీణుల్ని చూడసాగాడు.

ఫౌంటెన్ గట్టుమీద వరసగా కూర్చున్న జనం… ఆ వెనుక అస్పష్టంగా కనిపిస్తున్న ఒక వ్యక్తి… తెరమీద ఆ దృశ్యం రెండు సెకనుల కాలం మాత్రమే వుంది.

మళ్ళీ రివైండ్ చేయించి చూశాడు.

ఆ ఫౌంటెన్ మధ్యనుంచే మర్డర్ పిస్టల్‌ని ఎయిమ్ చేశాడని నిర్ధారణ కొచ్చాడుగానీ….

ఆ వ్యక్తిని పోల్చుకోడానికి ఎక్కడా ఆధారం లభ్యం కాకపోవడంతో నిరుత్సాహానికి లోనయ్యాడతను.

మూడున్నర ప్రాంతానికి తన క్వార్టర్సు కొచ్చిన అతనికి మరి నిద్ర పట్టలేదు.

సరిగ్గా తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకి రుషి క్వార్టర్సులోని పర్సనల్ ఫోను రింగయ్యింది.

కలతనిద్రలో వున్న అతను వెంటనే ఫోనందుకున్నాడు.

ఫోను చేసింది మిలటరీ జనరల్ మెహతా అని వెంటనే అర్థమయిందతనికి.

“ఎవ్విరిథింగ్ ఒకేనా సార్?” ఆందోళనగా అడిగాడతను.

“యా.. నువ్వోసారి వెంటనే బయలుదేరివస్తే బావుంటుంది” అన్నాడు మెహతా టెన్షన్ ఫీలవుతూ.

క్షణాల్లో బయలుదేరాడతను.. తననెవరూ ఫాలో అవ్వటం లేదని నిర్ధారించుకుని.

*     *    *   *    *

రుషి, మెహతా ఇద్దరూ కలిసి వెంటనే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంటికి వెళ్ళారు.

“పి.యమ్.గారి డెడ్‌బాడీ సురక్షితంగా మృతసంజీవనీకి చేర్చబడినట్లేనా?” అడిగాడు డాక్టర్ ఆందోళనగా.”

ఈపాటికి ఆయన్ని తిరిగి బ్రతికించే ఏర్పాట్లు ప్రారంభమయ్యే వుంటాయి డాక్టర్” మెహతా చెప్పగానే మిగతా ఇద్దరూ వూపిరి తీసుకున్నారు.

“అయితే ఇప్పుడిక… వేరే డెడ్‌బాడీని సిద్ధంచేసి అదే పి.యమ్. మరణం గురించి బుల్లెటిన్ రిలీజ్ చేయాలి.”

“ఎస్…యు ఆర్ కరెక్ట్ డాక్టర్… బట్ ఇదే క్రూషియల్ టైమ్ – ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా డిక్లేర్ అవ్వాలి. ఆ వెంటనే రాజ్‌ఘాట్‌లో దహన సంస్కారాలు జరిగిపోవాలి” అన్నాడు రుషి.

“లక్ష్మిగా పి.ఎమ్. మీద హత్యా ప్రయత్నం జరిగిన టైమ్‌లో బాంబ్ బ్లాస్టింగ్స్ కూడా జరిగాయి కనుక.. పి.ఎమ్. డెడ్‌బాడీ గుర్తుపట్టలేనంతగా పాడయిపోయిందని, హాస్పిటల్ న్యూస్ బులెటిన్ ద్వారా చెప్పగలగాలి.. కమాన్ మూవ్… టు ది హస్పిటల్” అంటూ వేగంగా లేచాడు డాక్టర్.

*   *      *     *    *

సరిగ్గా ఉదయం 5.30కి పి.ఎమ్. విశ్వంభరరావుగారు చనిపోయినట్లు ధృవీకరిస్తూ, శవం గుర్తుపట్టలేనంతగా చిన్నాభిన్నం అయినందున విడిపోయిన అంగాల్ని ఒకటి చేసి స్టిచ్ చేయటం జరిగిందనే న్యూస్ బులెటిన్ రిలీజయ్యింది.

క్షణాల్లో ఆ వార్త దేశంలోనే కాక విదేశాలకు కూడా పాకిపోయింది.

దేశవ్యాప్తంగా ప్రజల గుండెల్లో విషాదం అలుముకుంది.

అంతటా, అన్నిటా విషాద చాయలు.. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగిరితే… పి.ఎమ్ అభిమానుల గుండెలపై నల్ల బ్యాడ్జీలు ప్రత్యక్షమయ్యాయి.

దేశమంతటా తీవ్రమైన సంచలనం…

ఆందోళన, రాస్తారోకోలు, సంతాప సభలు.. దేశం యావత్తు స్తబ్ధతలో కూరుకుపోయింది.

అజనీష్ ఆశ్రమంలో ఆనందతరంగాలు వెల్లివిరిశాయి.

అజనీష్, ప్రతాప్‌సింగ్, అర్జున్‌చౌహాన్ శోభరాజ్‌ని మనసారా అభినందించారు.

అయినా శోభరాజ్ గుండెల్లో ఏదో అనుమానం… పి.ఎమ్ హౌస్ గార్డెనర్ రాజవేలు యిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పి.ఎమ్.ని తను హత్య చేసిన రోజే పి.ఎమ్ రెసిడెన్స్‌లోని బ్లడ్ బాటిల్స్ అదృశ్యం అయ్యాయి.

చిన్నాభిన్నమైన పి.ఎమ్. శరీరం కోసం బ్లడ్ బ్యాంక్‌లోని రక్తాన్ని వాడాల్సిన అవసరం ఎందుకొస్తుంది?

పి.ఎమ్ మరణ వార్తను ధృవీకరించటానికి ఇంత టైమెందుకు తీసుకోవాల్సి వచ్చింది?

అసలా శవం పి.ఎమ్.దేనా?

కాదని రుజువుచేసే శక్తి తనకు లేదు. అలా చేస్తే.. పి.ఎమ్. బ్రతికే వున్నారని రుజువు చేస్తే.. వేరే ఏర్పాట్లు చోటు చేసుకోగలవు. దాంతో ప్రతాప్‌సింగ్, అర్జున్‌చౌహాన్‌లు ఆశిస్తున్న పదవులు దక్కవు. దాంతో మరింత గందరగోళం చోటుచేసుకుంటుంది.

అంత ఆలోచన చేసినా శోభరాజ్ మౌనంగానే వుండిపోయాడు.

పి.ఎమ్. మరణవార్త ధృవీకరింపబడిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చి తదుపరి కార్యక్రమాలు వూపందుకున్నాయి.

*     *     *     *    *

విశ్వంభరరావు చివరి కోరిక ప్రకారం తన శవానికి రుషి తలకొరివి పెట్టాలని.. ఆయన బ్రతికుండగా ఆశించినట్లు… చాలామందికి తెలుసు.

అందుకే ప్రభుత్వ యంత్రాంగం అ విషయమై అతన్ని అర్థించగా అతనందుకు అంగీకరించలేదు. విధిలేక ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడో దూరమైపోయిన విశ్వంభరరావు పెద్ద కొడుకుని ఆ కర్మకాండలు నిర్వర్తించమని అడగ్గా.. తన తండ్రికి దేశ విదేశాల్లో ఆయన గౌరవార్ధం యిచ్చిన బహుమతుల్ని తనకివ్వాలనే షరతు విధించాడు.

ఆ బహుమతులతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనే దివంగత ప్రధాని ఆకాంక్షను విస్మరించి, ఆయన పెద్దకొడుకు కోరుకున్నట్లుగానే చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధపడింది.

ఆ శవం నిజానికి విశ్వంభరావుది కాదు గనుకే రుషి అందుకు అంగీకరించలేదు.

ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని తన అనుమానానికి బలం చేకూర్చుకున్నాడు శోభరాజ్. అదే రుషి చేసిన పెద్ద తప్పు..

రాజ్‌ఘాట్‌కు వెళ్లే రహదారికి ఇరువైపులా వేలాదిమంది జనం అశ్రునయనాలతో నించున్నారు.

అధికారిక లాంచనాలతో ప్రధాని విశ్వంభరరావు శవాన్ని స్మశాన వాటికకు తీసుకెళుతున్నారు. శవపేటికలో వున్నది విశ్వంభరావు శవం కాదని తెల్సిన వ్యక్తులు అక్కడ ముగ్గురే ముగ్గురున్నారు.

ఒకరు రుషి… రెండు ఆర్మీ జనరల్ మెహతా.. మూడు హాస్పిటల్ సూపరింటెండెంట్.

శవ యాత్రకు అర్జున్ చౌహాన్, ప్రతాప్‌సింగ్, ప్రాతినిధ్యం వహించారు.

ఆ కార్యక్రమం పూర్తికావడానికి అయిదు గంటల సమయం పట్టింది.

ఆ శవయాత్రలో శోభరాజ్ కూడా వున్నాడు. అతడు యాత్ర పొడవునా రుషికుమార్ కదలికల్నే గమనిస్తున్నాడు! ఆ విషయం రుషికి తెలియదు.

 

*     *    *    *    *

 

మరో రెండు గంటల తర్వాత…

అర్జున్ చౌహాన్ పార్టీ ప్రెసిడెంట్‌గా, అపద్ధర్మ ప్రధానిగా ప్రతాప్‌సింగ్ పదవీస్వీకారం చేశారు.

ఆ సందర్భంగా పార్టీ! నాయకులకు, పార్లమెంట్ సభ్యులకు విందు జరిగింది.

అందరూ వెళ్ళిపోయాక…

రాత్రి ఒంటిగంట సమయంలో…

ప్రతాప్‌సింగ్, అర్జున్‌చౌహాన్, శోభరాజ్ ముగ్గురే వున్నారు.

“ఒక అధ్యాయం పరిసమాప్తమైంది. ఎట్టకేలకు మన అధ్యాయం ప్రారంభమైంది” ఫారిన్ స్కాచ్‌ని సిప్ చేస్తూ అన్నాడు ప్రతాప్‌సింగ్ మహదానందంతో.

అంతవరకూ వాళ్లిద్దరితో మాట్లాడడం అస్సలు కుదరలేదు శోభరాజ్‌కి.

“నో మై ఫ్రేండ్స్… ఇంకా అధ్యాయం ప్రారంభం కాలేదు.. ఎందుకంటే – మీ ఆధ్వర్యంలో శవ దహనకాండ జరిగినా, విశ్వంభరరావు శవానికి మాత్రం దహనకాండ జరగలేదు.”

చిరాగ్గా చూశాడు అర్జున్ చౌహాన్.

“నువ్వెవడివిరా బాబూ! అంతా అయిపోయాక, శవం కాలి బూడిద అయ్యాక ఏమీ జరగలేదంటావు…. ముందు నువ్వు హాస్పిటల్లో చేరు” అసహనంగా అన్నాడు ప్రతాప్‌సింగ్.

“అందుకే ఈ దేశంలో రాజాకీయానికి కళ్ళ్లు, రాజకీయ నాయకుడికి బ్రెయినూ లేదని నేనంటాను. మీరిద్దరూ, మీ ఇద్దరితోపాటు వీరేంద్ర అజనీష్ అతి త్వరలో తీహార్ జైలుకెళ్ళబోతున్నారు.”

ఆ మాటకు ప్రతాప్‌సింగ్‌కు కోపం వచ్చింది.

“ఒరేయ్ శోభరాజ్…! ఇంతవరకూ నిన్ను బ్రతికించడం మాది తప్పు… నిన్ను ఆ వీరేంద్ర అజనీష్ మా మీద బ్లాక్‌మెయిల్‌కి వుపయోగించుకుంటున్నాడని అనుమానంగా వుంది.. కాదంటావా?”

శోభరాజ్ వాళ్ళ తెలివితేటలకు వికట్టహాసం చేశాడు.

“నో మై ఫ్రెండ్స్….! చెప్పింది వినండి. మీరు నన్ను నమ్మితే మిమ్మల్ని నేను ప్రమాదాన్నుంచి రక్షిస్తాను.”

“ఏంటో నీ డౌట్ చెప్పు.”

చెప్పడం ప్రారంభించాడు శోభరాజ్.

“నిజంగా విశ్వంభరావు చచ్చిపోయుంటే ఆయనకు బాగా సన్నిహితురాలైన న్యూట్రిషనిస్ట్ భారతి ఎందుకు శవయాత్రలో లేదు.. ప్రస్తుతం ఆమె ఎక్కడుంది? సడన్‌గా భారతి ఎక్కడకు మాయమయి పోయింది?”

ఆ డౌట్‌కి నషాలానికెక్కిన నిషా సర్రుమని క్రిందకు దిగిపోయినట్టయింది ఆ నేతలిద్దరికీ.

“రెండు  శవయాత్రలో రుషికుమార్ అంటీ ముట్టనట్టుగానే వున్నాడు తప్పించి పెద్దగా చొరవ చూపించలేదు. తలకొరివి పెట్టాల్సిన రుషి దానికెందుకు అంగీకరించలేదు! అతనికి విశ్వంభరరావంటే దేవుడితో కన్నా తండ్రితో సమానం. అయినా తలకొరివి ఎందుకు పెట్టలేదు? పైగా విశ్వంభరరావు కొడుకులూ, కూతుళ్ళకు ఎవరూ ఈ విషయాన్ని తెలియజేయలేదు.. వాళ్ల గురించి అతను కూడా పెద్దగా పట్టించుకోలేదు. రుషి కాదనటంతో ప్రభుత్వ యంత్రాంగమే హాడావిడిగా అయన పెద్దకొడుకుని రప్పించి.. అతని షరతులకు ఒప్పుకుని.. ఆ కార్యక్రమం జరిగేలా చూసింది.

నెంబరు త్రీ… రెడ్‌ఫోర్ట్‌లో జరిగిన బాంబింగ్స్‌లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ప్రామినెంట్ ఫ్రీడమ్ ఫైటర్సుని కూడా అదే రోజు విశ్వంభరరావుతో సహా ఆలిండియా మెడికల్ సైన్సెస్ యూనిట్‌లో చేర్చారు. అందులో ఒక ఫ్రీడమ్ ఫైటర్ శవం మాత్రమే బయటకు వెళ్ళింది… రెండో ఫ్రీడమ్ ఫైటర్కి ఎవరూ లేరు. కానీ ఆ శవం కనిపించలేదు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ రికార్డ్స్‌లో విశ్వంభరరావుతోపాటు ఆ ఇద్దరి పేర్లూ వున్నాయి. మార్చురీ రికార్డ్స్‌లో రెండు శవాల రికార్డ్శ్ మాత్రమే వున్నాయి. మూడో శవం ఏమైంది?”

అంతవరకూ కుదురుగా కూర్చున్న అర్జున్‌చౌహాన్ పక్కలో బాంబుపడ్డట్టు వులిక్కిపడి ప్రతాప్‌సింగ్ వైపు భయంగా చూశాడు.

“నెంబరు ఫోర్. నిన్నరాత్రి పదిగంటల ప్రాతంలో ఆలిండియా మెడికల్ సైన్సెస్ నుంచి ఒక అంబాసిడర్ కారు బయటికి వెళ్లింది. ఆ కారు ఆ హాస్పిటల్ సూపరింటెండెంటుది.. కానీ ఆ కార్ ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి రుషి కుమార్, ఆ పక్కన భారతి కూర్చుంది. ఆ కారులోనే విశ్వంభరరవుని బయటకు తీసుకెళ్లుంటారని నా అనుమానం.”

“విశ్వంభరరావుని బయటకు తీసికెళ్ళారా? అంటే.. రావు చని పోలేదా?” త్రుళ్ళిపడుతూ అన్నాడు ప్రతప్‌సింగ్.

“నో… నో… ఒపీనియన్ ప్రకారం రావు చనిపోలేదు. … చనిపోయినట్టు డ్రామా ఆడారు. రావు వర్గం జరిపిన కుట్ర అది. అతన్ని రహస్యంగా ఎక్కడికో తరలించి, బ్రతికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని నా అనుమానం.”

“నువ్వే అన్నావుకదయ్యా…. నీ బుల్లెట్ గురి తప్పదని, రావు చచ్చాడని” కోపంగా అన్నాడు చౌహాన్.

“అదే నాకూ అర్థం కాకుండా వుంది. అదే కాకుండా నిన్న రాత్రి సరీగ్గా అదే సమయంలో అర్మీకి చెందిన ఓ స్పెషల్ హెలికాప్టర్ జింఖానా గ్రౌండ్స్ నుంచి బయటకు వెళ్ళింది. ఆ హెలికాప్టరును స్వయంగా ఆర్మీ జనరల్ మెహతా నడిపారు.”

“”అంటే”

“హెలికాప్టర్లోనే విశ్వంభరరావుని తరలించారేమో?”

“నో… నేననుకోను.. ఆర్మీ జనరల్ హెలికాప్టర్ని నడపటమేమిటి నీబొంద.. ఐనా మెహతా ఆపద్ధర్మ ప్రధానిగా పదవి స్వీకరించిన మరుక్షణం నన్ను అభినందించిన వ్యక్తుల్లో అతనొకడు” ప్రతాప్‌సింగ్ అన్నాడు.

సరిగ్గా అదే సమయంలో లోనికి ప్రవేశించిన రమానాయర్ – భారతి పి.ఎ.

విశ్వంభరావు మర్డరు విషయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఫోను గురించి రమానాయర్ని ప్రశ్నించాడు అర్జున్‌చౌహాన్.

తనకు తెలిసిన అన్ని విషయాలు చెప్పిందామె.

“దిశ అనే అమ్మాయి తిరుపతి నుంచి ఫోను చేసి, హెచ్చరించిందా? ఎవరా దిశ?”

అందరి పరిస్థితీ వేడినీళ్ళల్లో చేపలా వుంది.

“నిన్న ప్రైమ్‌మినిస్టర్ రెసిడెన్స్‌కి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి భారతి గురించి, రుషికుమార్ గురించి అడిగి, రెడ్‌ఫోర్ట్ కెళ్ళారట సార్… వాళ్ళిదర్లో ఒక వ్యక్తి మగ, రెండో వ్యక్తి ఒక యువతి” చెప్పింది రమానాయర్.

పదిహేను నిమిషాలు గడిచాయి.

“ఆ అమ్మాయి దిశ అయితే.. తిరుపతి నుంచి వచ్చిందంటావ్? ఆ అమ్మాయి ఢిల్లీకి వచ్చాక చాలా పరిణామాలు జరిగాయి.. ఎవరా అమ్మాయి?”

మరో నలభై నిమిషాలు గడిచాయి.

రాత్రికి రాత్రి రంగస్థలం హర్యాన రోడ్‌లోని వీరేంద్ర అజనీష్ ఆశ్రమానికి మారింది.

అంతా విన్నాక వీరేంద్ర అజనీష్ చిరునవ్వుతో శోభరాజ్ వైపు చూశాడు.

“శోభరాజ్…! నువ్వు మరోసారి మర్డర్ ఎటెమ్ట్ చేయాల్సీ వుంటుంది.”

“మరోసారా.. ఎవర్నీ?” అడిగాడతను.

“విశ్వంభరరావుని” ఆ మాటకు భూకంపానికి ఎగిరిన వాళ్ళలా అయిపోయారు ఆ నేతలిద్దరూ.

“విశ్వంభరరావు బ్రతికే వున్నాడా?” ఇద్దరి నోటి వెంబడి ఒకే ప్రశ్న.

“కాదు.. నేను వూహించనదే నిజమైతే విశ్వంభరరావుని బ్రతికించడానికి ఎక్కడో ప్రయత్నాలు జరుగుతున్నాయి రహస్యంగా.”

“బ్రతికించే ప్రయత్నమా…?” నోరు వెళ్లబెట్టారిద్దరూ అప్పుడెప్పుడో అజనీష్ చెపిన క్రయోనిక్స్ విషయాన్ని వాళ్లప్పుడే మరిచిపోయారు.

“చచ్చినవాడు బ్రతకడం ఏమిటి.. ఇదేదో స్పీల్‌బర్గ్ సినిమాల వుంది” పిచ్చిగా బుర్ర గోకుంటూ అన్నాడు చౌహాన్.

“మరి మా పదవులు” ప్రశ్నించాడు ప్రతాప్‌సింగ్.

వీరేంద్ర అజనీష్ భుజమ్మీద పట్టుకండువాను సర్దుకుని శోభరాజ్ వైపు చూసి-

“రహస్యంగా ప్రాణాలు పోసుకునే విశ్వంభరరావు రహస్యంగానే చనిపోతాడు. ఇప్పుడే నాకర్థమైంది. ఔషధులకు నెలవైన తిరుపతి పరిసర ప్రాంతాల్లో మనిషిని బ్రతికించడనికి కృషి జరుగుతోందన్న మాట.

ఒక దెబ్బకు రెండు పిట్టలు.. శోభరాజ్! నీకు వుల్ పవర్స్ ఇస్తున్నాను వెళ్ళు. ఎన్ని ఆయుధాలు కావాలో తీసికెళ్ళు.. ఎంతమంది మనుషులు కావాలో తీసికెళ్ళు.

విశ్వంభరరావు బ్రతుకుతాడా అనేది చాలా చిన్న ఇన్సిడెంట్. మృత్యువుని జయించడం అన్నది చాల పెద్ద ఇన్సిడెంట్. అక్కడ జరుగుతున్న ప్రయోగాలు, మతానికి విరుద్ధమైనవి. ఆ ప్రయోగాలు జరగడానికి వీల్లేదు. ఆ ప్రయోగాల్లో వున్న సైంటిస్టులు.. వారికి సహాయం చేస్తున్న వ్యక్తులు, విదేశీ సంస్థలూ అన్నింటినీ భస్మం చేసెయ్. నీ వెనక నేనున్నాను. విలయాన్ని సృష్టించు. మతానికి అతీతంగా ఈ దేశంలో ఎవడూ మనుగడ సాగించలేదు” చివరి మాట అంటున్నప్పుడు వీరెంద్ర అజనీష్ గొంతు ఉద్రేకంతో ఊగిపోయింది.

“నీ ఆపరేషన్ ఈ క్షణం నుంచే స్టార్ట్ కావాలి” శాసించాడు అజనీష్.

శోభరాజ్ వెళ్ళిపోయాక నేతలిద్దరికీ అభయం ఇచ్చాడు అజనీష్.

“నిర్భయంగా మీ పనులు మీరు చేసుకోండి. ప్రధానిగా నువ్వు పదిలంగానే వుంటావు – భయపడకు” ఆశీస్సులందించాడు అజనీష్.

 

*   *    *    *   *

 

సరిగ్గా అదే సమయంలో న్యూఢిల్లీ నుంచి మద్రాసు వెళ్లే ఫ్లయిట్లో వున్నాడు రుషి.

అజనీష్ దగ్గర్నించి ఢీల్లికి రాగానే రుషికుమార్ గురించి ఎంక్వయిరీ చేసిన శోభరాజ్ రుషికుమార్ ఎయిర్‌పోర్టుకి వెళ్లాడని తెలియడంతో ఆలోచనలో పడ్డాడు.

వెంటనే ఎయిర్‌పోర్టుకి వెళ్ళి ఎంక్వయిరీ చేశాడు. ఆ పేరుగల వ్యక్తులెవరూ మద్రాసు వెళ్లిన ప్లయిట్లో లేరని డ్యూటీ అఫీసరు చెప్పాడు.

అతను మద్రాసుకి మారుపేరుతో వెళ్ళుంటాడని వూహించడానికి ఇంటర్నేషనల్ క్రిమినల్ శోభరాజ్‌కి కొన్ని సెకన్లు మాత్రమే పట్టింది.

తలకోన ఫారెస్ట్….

మృతసంజీవని క్రయోనిక్స్ సంస్థలోని ప్రతి లేబరేటరీని భారతికి చూపిస్తోంది డా!!విజేత.

డా!!వంశీ ఒకచోట సీతాకోక చిలుకల మీద ఎక్స్‌పరిమెంట్స్ చేస్తున్నాడు. అక్కడక్కడ పెద్ద పెద్ద గ్లాస్ బాక్సుల్లో చిన్న సైజు గాలిపటాల్లా వేలాడుతూ రకరకాల సీతాకోక చిలుకలు కనిపించాయి.

“చనిపోయిన సీతాకోక చిలుకల్ని బ్రతికిస్తారా?” అడిగింది భారతి డా!!వంశీని ఆశ్చర్యంగా చూస్తూ.

“ఆ ప్రయత్నంలో భాగమే.. ప్రస్తుతం బట్టర్ ఫ్లైస్ రెక్కల్లోని వెరైటీ కలర్స్‌కి జీన్సే కారణమని మా ప్రయోగాలు రుజువు చేశాయి. ఇప్పట్తికీ ఈ విషయంలో అమెరికా, మాడిస్న్‌లోని విస్కాన్‌సిన్ యూనివర్శిటీ సైంటిస్ట్స్ కృషి చేస్తున్నారు. వారికంటే మనం ఒకడుగు ముందుకు వేశాం”

“రెక్కలమీద రంగులెలా వస్తాయో చెప్తారా?” ఆసక్తిగా అడిగింది భారతి. ఆమెకదంతా అయోమయంగా వుంది. నమ్మాలో లేదో తెలీటం లేదు.

“రెక్కల పైభాగంలో ఆప్టెరస్ జన్యువు, కింది భాగంలో ఇన్స్‌వెక్టెట్ జన్యువు పనిచేస్తాయి. రెక్కల ఆకారాన్ని తీర్చిదిద్దడంలో వింగ్‌లెస్ జన్యువు తోడ్పడుతుంది. అనవసరమైన భాగాల్లోని కణాలు మరణించేలా ఈ జన్యువు ఆదేశమిస్తుంది. రెక్కల మూలం నుంచి అంచుల వరకూ నిలువుగా, అడ్డంగా ఆకుల్లోలా ఈనెలుంటాయి. ఆ ఈనె అందమైన గ్రాఫ్ పేపరులా కనిపిస్తుంది. ఒక ఆర్టిస్టు ఎలా స్కెచ్ గీసుకుంటాడో, అలా జన్యువులు రంగులతో డిజైన్లు వేస్తాయి. రెక్కలమీద ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘ఐ స్పాట్స్’ను డిస్టల్ వెల్ అనే జన్యువు రూపొందిస్తుంది. రంగులకు సంబంధించిన రసాయనాలన్నీ అది తినే మొక్కల భాగాలనుంచి అందుతాయి. ప్రస్తుతం రంగుల అభివృద్ధికి, వాటి కలయికలకు సంబంధించిన జన్యువులను గురించే ఎక్స్‌పరిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ జెనెటిక్స్ ప్రోగ్రాం గురించి పూర్తిగా తెలుసుకున్నాక చలనదశమీద ప్రయోగాలు నిర్వహిస్తాం” చెప్పాడు వంశీ.

“వెరీ ఇంట్రెస్టింగ్” విజేతతో పాటు ముందుకడుగేసింది భారతి. ఇంకో గ్లాస్ క్యూబిక్‌లోని తీసికెళ్లి అక్కడా డా!!సమీర్‌ను పరిచయం చేసింది విజేత.

వరసగా పెద్ద పెద్ద సైజు గాజుకుప్పెల్లో రకరకాల ఎముకలున్నాయి.

అక్కడ జరిగే పరిశోధనల గురించి వివరించాడు సమీర్.

“తరతరాలుగా మనుష్యుల శరీరంలో రోగకారక సూక్ష్మజీవులు, వైరస్‌లు కొనసాగుతున్నాయి. పరిస్తితుల ప్రాబల్యం వల్ల ఇది అప్పుడప్పుడు వికృతంగా మారడం సహజం. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు పురాతన రక్తనమూనాల కోసం అన్వేషణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా స్కాట్‌లాండ్ సైంటిస్ట్ ఎడ్.లూయూస్ మానవ డి.ఎన్.ఎను కనుకున్నారు. ఆ డి.ఎన్.ఏ.లో 300 ప్రోటీన్ బేస్‌లున్నట్లు గుర్తించడం జరిగింది. వాటిలో జీవ రసాయన చర్యలని నిర్దేశించే సమాచారం కేవలం మూడు నుంచి అయిదు శాతం ‘బేస్’ల వద్ద మాత్రమే లభించింది. మిగతా శాతం బేస్‌ల గురించి ఇక్కడ మేం పరిశోధిస్తున్నాం.

శరీరంలో చాలా జన్యువులు, వ్యర్థ జన్యువులుగా వున్నప్పుడు ఆవెందుకు అంతరించిపోలేదు? ఆ జన్యువులు వ్యర్థ జన్యువులు కావని, రిక్త జన్యువులని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్ట్ డా!!రాయ్, జె బ్రిట్టన్ వెల్లడించాడు. మానవ శరీరంలో క్రియాశీల జన్యువులతో పాటు రిక్త జన్యువులు కూడా తమ రసాయన నిర్మాణాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాయి. ఈ రిక్త జన్యువులు జీవ పరిణామానికి ఆధారంగా రిజర్వాయరుగా నిలవడమే కాకుందా జన్యువులకు నెలవైన క్రోమోజోములకు కవచంలా పనిచేస్తాయి. జీవ రసాయనిక చర్యలన్ని నిర్దేశించే ప్రోటీన్లను నియంత్రించేది జన్యువులే. ఈ విషయంలో కొన్ని సందేహాలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం వుంది. ఈ ఎక్స్‌పరిమెంట్స్ అన్నీ ఒక్క కొలిక్కి వస్తే హైపటైటిస్, సిఫిలిస్, ట్యుబర్కులోసిన్, లెప్రసీలతో పాటు ఎయిడ్స్‌ను నయం చేయడం కూడా చాలా సులభం.”

“నేను సైన్స్ స్టూడెంట్‌ని కాను” అంది భారతి

“అంటే… నువ్వు చెప్పింది ఆవిడకేమీ అర్థం కాలేదని అర్థం” సమీర్‌తో నవుతూ అనేసి ముందుకు కదిలింది డా!!విజేత.

“ప్రస్తుతం ఎయిడ్స్‌మీద మేం పరిశోధనలు చేస్తున్నాం. అందుకు కారణం…. ఇటీవల మేం ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించాం. ఆ వ్యక్తి బ్రతికాడు. కానీ అతనికి ఎయిడ్స్ వ్యాధి వుంది. ఈ కారణంగా అతన్ని మేం చంపేశాం.”

“చచ్చిపోయిన వ్యక్తి బ్రతికాడా?” విప్పారిన నేత్రాలతో అడిగింది భారతి. ఆ విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది.

“ఎస్! మిమ్మల్ని నమ్మించాలంటే మీకు ఆ కేసెట్ చూపించడం చాలా అవసరం” కాన్ఫరెన్స్ హాల్లోకి తీసుకెళ్లింది భారతిని విజేత.

కేసెట్ లైబ్రరీలోంచి ఓ వీడియో కేసెట్‌ను తీసి వి.సి.ఆర్.లో ఇన్సర్ట్ చేసి స్విచాన్ చేసింది.

పావుగంట గడిచింది.

చనిపోయిన పిల్లి బ్రతకడం, మళ్ళీ చనిపోవడం, చనిపోయిన వ్యక్తి బ్రతకడం, చనిపోవడం చూసి దిగ్బ్రాంతి చెందింది.

ఒక కొత్త లోకంలోకి వచ్చినట్టుగా వుంది భారతికి.

“ఈ విషయాలు న్యూస్‌పేపర్సులో ఎందుకు రాలేదు?” ఆశ్చర్యంగా పశ్నించిందామె.

“ఇవ్వన్నీ మా కోసం చేసుకున్న ఎక్స్‌పరిమెంట్స్… ప్రజల కోసం చేసే ఎక్స్‌పరిమెంట్స్… ఇప్పుడు చేపడుతున్నాం” చెప్పింది విజేత.

“మానవజాతి కోసం మృత్యువును జయించడం కోసం కృషి చేస్తున్న మీరు అడవి దొంగల్లా బ్రతకడం ఏం బాగాలేదు. మీరు ప్రభుత్వానుమతితోనే ఈ ఎక్స్‌పరిమెంట్స్ చేయొచ్చు గదా?” ప్రశ్నిచింది భారతి.

అక్కడ స్ట్రెచర్‌మీద దివ్యానందస్వామి శవం చిల్లర్‌గా మారి వుంది. మరో గ్లాస్ క్యూబిక్ దగ్గరకొచ్చింది.

ఇన్సులేటెడ్ బాక్స్ నుంచి విశ్వంభరరావు శవాన్ని పైకి తీస్తున్నాడు డా!!నవనీత్. పక్కనే వున్న సవ్యసాచి హెల్ప్ చేస్తున్నాడు. ఆ శవాన్ని చూస్తూనే బావురుమంది భారతి.

ఆమెని కన్సోల్ చేయడానికి విజేతకి చాలా కష్టమైపోయింది.

“ఆపరేషన్ ఎన్నిగంటలకు ప్రారంభమౌతుంది?” ప్రశ్నించింది భారతి తేరుకుంటూ.

“మరో రెండు గంటలకు” చెప్పింది విజేత.

అప్పుడు ఉదయం సరిగ్గా పదిగంటలైంది.

*    *    *   *    *

నెల్లూరులోని ఒక పల్లెటూరు..

ఆ పల్లెటూరుకి రోజుకి రెండుసార్లు మాత్రమే బస్సు సౌకర్యం వుంది. ఉదయం తొమ్మిదిగంటలు దాటింది. ఆ పల్లెటూరు నుంచి నెల్లూరొస్తున్న బస్సులో జనం తక్కువగా వున్నారు. సన్నని చలిగాలి.

పైటచెంగును భుజాల చుట్టూ కప్పుకుంటూ అంది వసంత గిరీష్ కుమార్‌తో.

“మనల్ని చూడగానే దిశ షాక్ తింటుంది కదూ?”

“సర్‌ప్రైజ్ చేయడానికే వెళుతున్నాం కదా” ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు గిరీష్.

“తిరుపతి నుంచి డైరెక్టుగా ఢిల్లీలో వుంటున్న మీ బ్రదర్ దగ్గరకు వెళదామంటున్నావ్ కదా.. తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైనుందా?” గాలికి నుదుట మీద పడుతున్న ముంగురులను పక్కకు తోసుకుంటూ అంది వసంత.

“అమ్మాయిగారిని సాదాసీదాగా ట్రైన్లో తీసికెళితే బావుంటుందా? అందులోనూ వెళ్ళేది ప్రైంమినిస్టర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటికి. అందుకే ఫ్లయిట్లో వెళ్తాం.”

“ఫ్లయిట్!?” వసంత అంతకు పూర్వం ఎప్పుడూ ఫ్లయిట్ ఎక్కలేదు. ఆనందోద్వేగంతో అతనివైపు చూసింది. అప్పుడే ఆ బస్సు విలేజ్ రోడ్డుని వదిలి సిటీ రోడ్డుమీద కొచ్చింది.

అదే సమయంలో సిటీ రోడ్డుమీద నుంచి ఇంకో బస్సు విలేజ్ రోడ్డు మలుపు తిరుగుతోంది.

ఆ బస్సులో కేవలం అరడజనుమంది వ్యక్తులు మాత్రమే వున్నారు. ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి శోభరాజ్! ఆ బస్సు మరో పావుగంట తర్వాత గ్రామంలో చెట్టుకింద ఆగింది. శోభరాజ్ భుజానికున్న హేండ్ బ్యాగ్‌తో దిగి వూళ్ళోకి అడుగుపెట్టాడు.

నెల్లూరు రైల్వేస్టేషన్ కోలాహలంగా వుంది. అప్పుడే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వచ్చి ఆగింది. ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంటులోకి ఎక్కి కూర్చున్నారు వసంత, గిరీష్.

ట్రైను బయలుదేరడానికి ఇంకా మూడు నిమిషాల టైం మాత్రమే వుంది. ఫ్లాట్‌ఫారం మీదకు పరుగు పరుగున వచ్చాడు శోభరాజ్.

ఒక్కొక్క కంపార్టుమెంటునీ గబగబా చూసుకుంటూ ముందుకు పరుగెడుతున్నాడు.

అతని జేబులో అంతకుముందే ఆ పల్లెటూళ్ళో గిరీష్ ఇంట్లో సంపాదించిన గిరీష్ – వసంతల ఫోటో వుంది.

*     *     *     *     *

విశ్వంభరావు దారుణ హత్యను ఖండిస్తూ దేశవిదేశాల ప్రముఖులు సంతాపాలు…. సందేశాలు..

మరోపక్క చిరునవ్వులు చిందిస్తున్న క్రొత్త ప్రధాని ప్రతాప్‌సింగ్.

“పూర్తిస్థాయి ప్రధానిగా ప్రతాప్‌సింగ్” ఎడం పక్కన త్రిబుల్ కాలమ్ ఇటమ్.

గబగబా ఆ వార్తను చదివాడు రుషి.

అతని వళ్ళు కుతకుతలాడిపోయింది.

ప్రతాప్‌సింగ్‌కి మరో పదిమంది పార్ల్లమెంటు సభ్యుల మద్దతు దొరికితే పూర్తిస్తాయి ప్రధానిగా ఎన్నిక కావడానికి మెజారిటీ లభిస్తుంది. అందుకు దేశ రాజధానిలో జరుగుతున్న తతంగం గురించి విపులంగా వుంది. ఆ వార్త చివరి వాక్యం అతన్ని ఆకర్షించింది.

తన మెజారిటి నిరూపించుకోడానికి ప్రతాప్‌సింగ్ మరో నలభై ఎనిమిది గంటల గడువు కోరగా అందుకు రాష్ట్రపతి తమ ఆమోదాన్ని తెలిపారు. గడువు లోపల పూర్తి సభ్యుల మద్దతుతో ప్రతాప్‌సింగ్ ప్రధానిగా అధికారం చెపట్టే అవకాశం వుంది.

నలభై ఎనిమిది గంటలు!

హత్య జరిగి పూర్తిగా రెండ్రోజులు కాలేదు. అందరూ విశ్వంభరరావుని మర్చిపోయారు.

కుతకుతలాడిపోతోంది అతని వళ్ళు.

ఈ అధికార దాహానికి, ఈ కుట్రల ప్రజాస్వామ్యానికి తను అంతిమ గీతం పాడలేడా?

ఈ దేశంలోని రాజకీయనాయకుల నగ్న స్వరూపాన్ని తను ప్రపంచము ముందుంచలేడా?

జరిగిన సంఘటనలన్నీ అతని కళ్లముందు తిరుగుతున్నాయి.

ఎయిర్‌పోర్టులోంచి బయటికొచ్చి టాక్సీ ఎక్కాడతను. టాక్సీ తిరుపతి రోడ్లో వెళుతోంది.

అతని మదిలో విశ్వంభరరావు… శవంగా మారిపోయిన విశ్వంభరరావు మెదిలారు.

విశ్వంభరరావు బ్రతుకుతారా? ఇప్పటికే అతను మనిషి మృత్యువును జయించడాన్ని విశ్వసించలేక పోతున్నాడు.

కనీ ఎక్కడో… ఏ మూలో… చిన్న అలలా కదులుతున్న నమ్మకము.

అందుకే అతను తలకోన ఫారెస్టుకు వెళుతున్నాడు.

విశ్వంభరరావు బ్రతకడని తెల్సిన మరుక్షణం తనేం చేయాలో అప్పటికే నిర్ణయానికొచ్చాడు రుషికుమార్.

ఫస్ట్‌క్లాస్ కంపార్టుమెంటు నిశ్శబ్దంగా వుంది. సీజన్ కాకపోవడం వల్ల ఎక్కువ జనం లేరు.

వసంత ఏదో మేగజైన్‌ని తిరగేస్తోంది. డైలీ పేపర్ని చూస్తున్నాడు గిరీష్.

“మనం ఢిల్లీ ప్రోగ్రామ్‌ని పోస్టుపోన్ చేసుకుంటే బావుంటుందేమో” అన్నాడతను.

“ఏం?”

“చూడు… ప్రధాని విశ్వంభరరావుగారు హత్యతో దేశమంతా ఎలాగుందో… బంద్‌లూ.. హర్తాళ్ళూ… కర్ఫ్యూలూ… రెండోపక్క కొత్త ప్రధాని పదవీ స్వీకరణ… ఈ గొడవల్లో అన్నయ్య బిజీగా వుంటాడు.”

“మీ అన్నయ్య వెనక తిరగడానికి వెళుతున్నామా మనం.. మీ అన్నయ్యను చూసి.. తర్వాత ఆగ్రా, కాశ్మీర్…” ఏదో చెప్పబోయింది వసంత.

“హనీమూన్ అయిపోయింది కదమ్మడూ! మళ్ళీ ఎక్కడికి?” పేపర్ని పక్కన పడేసి ఆమె జడను లాగుతూ అన్నాడతను.

“రెండో హనీమూన్‌కి నాధా” ఆమె అతడి వళ్ళో తలపెట్టుకుంటూ అంది నవ్వుతూ.

నెమ్మదిగా అతని చేయి ఆమె భుజాల మీద పడింది.

“ఏమిటీ చొరవ తీసుకుంటున్నారా? ఇది ట్రైనండీ బాబూ! ఇల్లూ కాదు, మన తోటలూ కాదు.”

“తోటల్లో ఎంతో హాయిగా వుంది కదూ?” అన్నాడతను.

ఏదో జవాబు చెప్పబోతూ యధాలాపంగా డోరువైపు చూసి అక్కడదే పనిగా నుంచొని తమ వైపే చూస్తున్న వ్యక్తిని చూడగానే బిత్తరపోయి అతని వడిలోంచి లేచిపోయింది వసంత.

జేబులోంచి టికెట్ తీయబోయాడు గిరీష్.

మిస్టర్ గిరీష్! మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి… బయట కొస్తారా?”

ఆ అపరిచిత వ్యక్తి అలా పిలవడం ఆశ్చర్యంగా వుంది. అయినా వసంత వైపు చూస్తూనే క్యూబిక్‌లోంచి బయటికొచ్చాడతను.

ప్యాకెట్లోంచి మార్ల్‌బోరో సిగరెట్ తీసి గిరీష్‌కి ఆఫర్ చేశాడు. అతని తీసుకోకపోవడంతో తనొకటి తీసుకుని వెలిగించి అడిగాడు శోభరాజ్.

“మీ బ్రదర్ రుషికుమార్ ఎక్కడున్నాడు?”

“ఢీల్లీలో.”

“ఢిల్లీలో లేడు… అందుకే ఇంతదూరం వెతుక్కుంటూ రావల్సి వచ్చింది.”

“మా అన్నయ్య ఢిల్లీలో లేడా? ఎక్కడికెళ్ళాడు? ఆశ్చర్యంగా ప్రశ్నించాడతను.

“ఎక్కడికెళ్ళాడో… ఎందుకెళ్ళాడో నీకు తెలుసు. చెప్పేస్తే నువ్వు బ్రతికి పోతావ్” శోభరాజ్ గొంతులో కాఠిన్యం చోటు చేసుకుంది.

“నాకెలా తెలుస్తుంది?” అతనికి అంతా అయోమయంగా వుంది.

“నెల రోజులక్రితం మీ అన్నయ్య నీకో ఉత్తరం రాశాడు… అవునా? అతి త్వరలో ఓ ఇంపార్టెంట్ వర్క్ మీద వస్తున్నానని రాసాడు జ్ఞాపకం వుందా?”

అవును.. తను అన్నయ్యకు పెళ్ళి విషయం తెలియజేస్తే రిప్లయ్ రాస్తూ ఏదో విషయం రాశాడు. ఆ లెటర్ సంగతి వీడికెలా తెల్సింది? ఇంతకీ వీడెవడు?

“ఏంటాలోచిస్తున్నావు… నాకా లెటర్ గురించే కాదు చాలా విషయాలు తెలుసు.”

అంతవరకూ నెమ్మదిగా మాట్లాడిన శోభరాజ్ చాలా దగ్గరగా వచ్చాడు… వికృతంగా నవ్వాడు.

“కరెక్టు ఇన్ఫర్మేషన్ చెప్పావో బ్రతికిపోతావ్. ఎందుకో తెల్సా – నాకు మనుషుల్ని చంపడం హాబీ.”

“ఐ డొంట్ నో ఎనిథింగ్… గెటౌట్” కోపంగా చెప్పి ముందు కెళ్ళబోయాడు గిరీష్.

సరిగ్గా అదే సమయంలో లోనికొస్తున్న టికెట్ కలెక్టర్ ఆ దృశ్యాన్ని చూశాడు.

గిరీష్‌ని పట్టుకోడానికి ముందుకొస్తూ ప్యాంటు జేబులోంచి నైఫ్‌ని తీసి బటన్ ప్రెస్ చేశాడు శోభరాజ్.

అతని చేతిలోని కత్తిని చూడగానే సీట్లోంచి లేచి భయంగా, పెద్దగా కేకలేయసాగింది వసంత.

“సేవ్ మీ… సేవ్ మీ….” అరుస్తూ పరుగెడుతున్నాడు గిరీష్.

ఏదో జరగబోతోందన్న ఉద్దేశ్యంతో టిక్కెట్ కలెక్టర్ ట్రైన్‌ని ఆపడానికి చైన్ మీద చెయ్యి వేశాడు.

సరిగ్గా అదే సమయంలో అతన్ని దాటుకుంటూ బాత్‌రూమ్ దగ్గరకు పరిగెత్తాడు గిరీష్. వెంటనే చెయిన్ లాగాడు టిక్కెట్ కలెక్టర్…. ట్రైన్ వేగం క్రమంగా తగ్గిపోసాగింది. గిరీష్ వెంబడిస్తున్న శోభరాజ్‌కి అడ్డంగా వచ్చాడు టిక్కెట్ కలెక్టర్. తన మీద పడుతూ తనని ప్రశ్నిస్తున్న టిక్కెట్ కలెక్టర్ వైపు ఒక్క క్షణం చూశాడు. ఎక్కడా ఏ మాత్రం టైమ్ వేస్ట్ చెయ్యడం, తన షెడ్యూల్‌కి విరుద్ధంగా జరగడానికి యిష్టపడని శోభరాజ్… కుడిచేతిలోని కత్తి కసుక్కున టిక్కెట్ కలెక్టర్ పొత్తికడుపులో దిగబడింది. టిక్కెట్ కలెక్టరు విహ్వలంగా కేకవేస్తూ కిందపడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో గిరీష్ ట్రైన్‌లోంచి కిందకు దూకడం, ఆ వెనకే పరుగెత్తుకొస్తున్న వసంత కూడా కిందకు దూకి పక్కనున్న పంట చేలగట్ల మీంచి పరుగెత్తడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఫస్ట్‌క్లాస్‌లోని కొంతమంది వ్యక్తులు శోభరాజ్ వెనకపడ్డారు. అతని రెండో వైపుకి పరుగెత్తాడు.

కానీ ఎవరికీ దొరకలేదు.

టిక్కెట్ కలెక్టరుని హాస్పిటల్‌ను తీసుకెళుతున్న సమయంలో అతను ప్రాణాలు విడిచేశాడు. అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళుతున్న వ్యక్తుల్లో నందిగామకు చెందిన నిరుద్యోగ యువకులు కామేశ్వర్, రమేష్ వున్నారు.

వాళ్ళిద్దరూ శోభరాజ్‌ను చాలా దగ్గరగా చూసిన వ్యక్తులు.

 

*    *   *     *   *

 

ఢిల్లీలో ప్రతాప్‌సింగ్ ఆపద్ధర్మ ప్రధాని పదవి నుంచి ప్రధాని పదవిని చేపట్టడనికి సరిగ్గా నలభై ఆరు గంటల టైముంది.

సరిగ్గా అదే సమయంలో-

తలకోనలోని మృతసంజీవని క్రయోనిక్స్ సంస్థలో చిల్లర్‌గా మార్చిన విశ్వంభరరావు శవాన్ని లిక్విడ్ నైటోజన్‌లోంచి బయటకు తీసి స్ట్రెచర్‌మీద పడుకోబెట్టి ఆపరేషన్‌కోసం లేబరేటరీలోకి తరలిస్తున్నారు?

డా!!విజేత సారధ్యంలో జరగబోయే ఆపరేషన్‌కి డా!!నవనీత్, వంశీ, సమీర్ సహకరిస్తున్నారు

సరిగ్గా అదే సమయంలో డా!!సవ్యసాచి చాంబరులో ఆయనకెదురుగా కూర్చుంది భారతి.

ఆమె సందేహాలకు సమాధానం చెపుతున్నాడు సవ్యసాచి.

“మృత్యువు జయించడమే పునర్జన్మ అంటారా? అడిగింది ఆమె.

‘మృత్యువు వేరు. పునర్జన్మ వేరు. ఒక వ్యక్తి చనిపోవడంతో మృత్యు ప్రక్రియ ముగుస్తుంది. ఆ వ్యక్తి చనిపోయాక కొత్త ఆత్మను వెతుక్కుని మళ్ళీ జీవించడమే పునర్జన్మ.

“మీరు ఆపరేసన్ చేసి బ్రతికించాలని చూస్తున్న వ్యక్తులు పునర్జన్మ పొందినట్టా?” చాలా కీలకమయిన ప్రశ్న వేసింది ఆమె.

“కాదు! ఒకే మనిషిని చనిపోయాక బ్రతికించడం పునర్జన్మ కాదు- ఈ విషయంలో మాక్కూడా కొన్ని నిర్దుష్టమయిన సందేహాలున్నాయి. పునర్జన్మ దేహానికి సంబంధించిన విషయం కాదని, మన ప్రాచీనులు చెపుతున్నారు. ఒకప్పుడు ఆత్మ వేరు, దేహం వేరుగా భావించేవారు. ఈ క్రయోనిక్స్ ప్రయోగాల ద్వారా, ఆ రెంటి మధ్యనున్న అంతరం తొలగిపోతుందని నా విశ్వాసం.

ప్రస్తుతం విశ్వంభరరావు శవానికి భౌతికంగా చైతన్యం కలిగించే ప్రక్రియ జరుగుతోంది. దీనినే పోయిన ప్రాణాన్ని తీసుకురావడం అనుకుంటే, విశ్వంభరరవు చనిపోయినప్పుడు ఆ చైతన్య శక్తి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఎలా వస్తుంది? దానినే మన పూర్వులు ఆత్మ అని అన్నారా?

మా క్రయోనిక్ సంస్థ మృత్యువుకిచ్చే నిర్వచనం అదే… అందుకే విశ్వంభరరావుకి జరుగుతున్న ఆపరేషన్ మొత్తం మానవాళి చరిత్రలో అధ్బుతమైన సంచలనమైన మలుపుకి కారణమౌతుంది” ఆ మాటల్లో విశ్వాసం వుంది.

మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు సవ్యసాచి.

“పునర్జన్మ వేరు, ఫాస్ట్‌లైవ్ రిగ్రెషన్స్ వేరు-పాత జన్మకు సంబంధించిన జ్ఞాపకాలను ఫాస్ట్‌లైవ్ రిగ్రెషన్స్ అంటారు. ఇందుకు సంబంధించి మహాత్మా గాంధీ అనుభవం ఒకటుంది. మాహాత్మాగాంధీకి శాంతిదేవి అని ఓ మహిళ పరిచయమయ్యారు. ఆమెకు గతజన్మ జ్ఞాపకాలు ఎక్కువగా వుండేవి. గతజన్మ సంతానం ఆమె వద్దకు వస్తుండేవాళ్ళు – తన సంతాన మంచి చెడ్డలు, స్థితిగతులు తెల్సుకోవడం వారికి సలహాలివ్వడం ఆమె చేస్తుండేది. శాంతిదేవి కేసుని, స్టడీ చెయ్యమని మహాత్మాగాంధీ దేశబంధు గుప్తా కమిటీని నియమించారు. ఆమె జీవితానికి సంభంధించిన అన్ని వివరాలు తెలియజేయమని ఆయన ఆదేశించారు. అయితే అ రిపోర్టు వచ్చిందో లేదో తెలీదు. మృత్యువుకు, పునర్జమకు సంబంధించి మొట్ట మొదటి భారతీయ పరిశోధన అది…” చెప్పాడు సవ్యసాచి.

“ఇండియాలో ఇప్పటివరకూ సైంటిఫిగ్గా పరిశోధనలు జరగలేదా?” అడిగింది భారతి.

“ఎందుకు జరగలేదు.. ఢిల్లీకి చెందిన సీనియర్ సైకాలజీ డా!!ఎస్ దత్తారే. కొన్ని కేసుల్ని పరిష్కరించాడు. పునర్జమలున్నాయని ఆయన నమ్ముతాడు.

ఒకసారి ఒక కాలేజీ యువకుడు దత్తార్ దగ్గరకొచ్చాడు. నా మనసు నిలకడగా వుండడంలేదు. కళ్ళముందు ఎప్పుడూ ఏవో ఇమేజ్‌లు ఏర్పడతాయి. వాటిని నేను ఆపలేకపోతున్నాను. అందువల్ల చదువు సాగడం లేదని చెప్పాడు.

అతన్ని పూర్తిగా పరీక్షించాడు. కొన్ని నెలలపాటు అతనితోపాటు అతిరిగాడు దత్తార్.

పూర్వజన్మలో అతడొక పూజారి – అతడు తన గ్రామం పేరు, అడ్రస్ అన్నీ చెప్పాడు. అక్కడకు వెళ్ళి దర్యాప్తు జరిపితే, అతడు చెప్పిన వివరాలన్నీ కరెక్ట్ అని తేలింది.

అలాగే అమెరికాలొ ఎడిగర్‌కేసి అనే వ్యక్తి వుండేవాడు. ఆయన అనేక సిద్ధులు పొందాడు. సమాధి అవస్థకు వెళ్ళి, రోగాలకు కారణం నివారణోపాయం కనుక్కునేవాడు. గతజన్మ కర్మఫలాన్ని ప్రస్తుత జీవితంలో సమన్వయ పరిచేవాడు. 1945లో ఆయన చనిపోయాడు. ప్రస్తుతం ఫాస్ట్‌లైఫ్ రిగ్రేషన్స్ మీద అమెరికాలో ప్రయోగాలు జరుగుతున్నాయి.

డా!! దత్తారే ఇంకో కేసుని కూడా పరిష్కరించాడు…

ఎవరో భార్యాభర్తలిద్దరూ ఆయన దగ్గరకెళ్ళారు. తనకు ఇంతకు ముందే పెళ్ళయిందని, పెద్ద పెద్ద పిల్లలున్నారని, తనకు అనవసరంగా రెండో పెళ్ళి చేశారని భార్య అంది. ఆ యువతికి దాదాపు ఇరవై ఆరేళ్లుంటాయి. కేసు స్టడీ చేశాక డా!!రేకి అర్థమంది ఏమిటంటే, పూర్వజన్మలో అమె ఒక జమీందారు భార్య అని. పేరు, ప్రాంతం అంతా చెప్పింది ఆమె.

అక్కడకు వెళ్లి అన్ని వివరాలు తెలుసుకుంటే ఆమె చెప్పిందదంతా నిజమని తేలింది. గతజన్మలోని ఆమె పిల్లలు పెద్దవాళ్లయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎట్టకేలకు ఆమెలోని పాత జ్ఞాపకాలని తరిమెయ్యడానికి డా!రే చాలా కృషి చేశాడు. మనిషి సంఘటన గుర్తుండడంవల్ల లాభం పోవచ్చు కానీ గత జన్మలో సాధించిన జ్ఞానం, విజ్ఞానం గుర్తుండడం ఎంతో వుపయోగకరం.. కాదంటారా?”

“స్వప్నంలో గతజన్మ జ్ఞాపకాలను కొంతమంది చూడగలుగుతారని విన్నాను. నిజమేనా?” అడిగింది ఆమె.

“అలాంటి సంఘటనలు చాలా వున్నాయి. కానీ వేటికైనా శాస్త్రీయ ఆధారాలు చాలా ముఖ్యం. ఉదాహరణకు టిబెట్ ధర్మగురువు దలైలామాను తీసుకోండి…

దలైలామాకు పునర్జన్మ వుందని, బౌద్ధ ధర్మ మహాయానంలో చెపుతారు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ జన్మించే శక్తి ఆయనకుందట.

ప్రస్తుతం అధికారంలో వున్న దలైలామా – తేనేజింగ్ గియాస్తో… 600 సంవత్సరాల ప్రాచీన బౌద్ధ సంస్కృతికి 14వ గురువు.. 1935 జూలై 6న రైతు కుటుంబంలో ఆయన జన్మించాడు. నాలుగున్నర సంవత్సరాల వయస్సులో తక్తసేర్ గ్రామంలో ఆయనకు కనుగొన్నారు. 13వ దలైలామా 1933లో మరణించారు. ఆ తర్వాత రాజ జ్యోతిష్యులు, సీనియర్ లామాలా ఆధ్వర్యంలో 14వ దలైలామా అన్వేషణ జరిగింది.

ఒక గ్రామంలో రెండున్నర ఏండ్ల బాలుడ్ని లామాగా గుర్తించారు. ఆ బాలుడు కూడా 13వ దలైలామాకు చెందిన వస్తువుల్ని గుర్తుపట్టాడు. అది నమ్మకమా? నిజమా? పూర్వజన్మకు సంబందించిన విశేషమా? చెప్పండి” ప్రశ్నించాడు సవ్యసాచి.

“ప్రస్తుతం మీరొక వ్యక్తిని బ్రతికించడానికి పూనుకున్నారు… ఆ వ్యక్తి బ్రతికాక అతనికి పూర్వజన్మ స్పృహ మాత్రమే వుంటే.. పాత ఆత్మను మీరు బ్రతికించినట్టా? లేక కొత్త మనిషికి జీవం పోసినట్టా?”

ఇంతవరకూ అలాంటి విచిత్రమైన ప్రశ్నను ఎవరూ వేయలేదు – దానికి చిరునవ్వు నవ్వాడు సవ్యసాచి.

“అలాంటి సంఘటన ఎదురుకాగల అవకాశాలుంటే, మా అన్వేషణకు ఒక కొత్త దారి ఏర్పడుతుంది.

ఆ మధ్య మనదేశంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. శ్రీమతి సరయు అనే మహిళ తన గతజన్మలో ఝాన్సీరాణిగా పేర్కొన్నది… కొన్ని వివరాలను ఆమె చెప్పింది. డాక్టర్లు ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. కానీ చాలా విషయాలకు ఆమె జవాబు చెప్పలేకపోయింది.

అలాగే…

ఢిల్లీలో గోపాల్ అనే వ్యక్తి వుండేవాడు. తనకు గతజన్మలో మధురలో ఇళ్లు వున్నాయని, కుటుంబ కలహాల వలన తుపాకీ గుండు తగిలి మరణించానని చెప్పాడతను. అది విని అతని తండ్రి షాక్ తిన్నాడు. గోపాల్ చెప్పింది నిజమని, మధురలో కొన్నాళ్లక్రితం ఒక వ్యాపార కుటుంబంలో కలతలు రేగాయని, తమ్ముడు అన్నయ్యను తుపాకీతో కాల్చి చంపాడని రుజువయ్యింది. అయినా గోపాల్ తండ్రి మధురకు వెళ్ళి దర్యాప్తు చేశాడు…. అంతా నిజమని తేలింది.

కాగా కొన్నాళ్ల తర్వాత ఒక యువకునితోపాటు ఇద్దరు మహిళలు గోపాల్ ఇంటికి వచ్చారు. ఆ మహిళల్లో ఒక మహిళను చూసి, గత జన్మలో ఆమె తన సోదరిగా గోపాల్ గుర్తుపట్టాడు. ఆ తర్వాత గోపాల్ని మధురకు తీసుకెళ్లారు. అక్కడ తన ఇంటిని, వ్యక్తుల్ని గుర్తుపట్టాడు. తన ఇంటిలోని పియానోను వాయించాడు. అమెరికన్ సైంటిస్ట్‌లు కూడా గొపాల్‌ని అన్ని పరీక్షలు చేసి, పూర్వజన్మ జ్ఞాపకాలను రికార్డ్ చేసి పునర్జమ కేసుల్లో అది చాలా అత్యద్భుతమైన కేసుగా పేర్కొన్నారు… సైన్సుపరంగా నిర్ధారించిన అ కేసును మనం తేలికగా తీసివేయలేం కదా?”

భారతి రెండు నిమిషాల సేపు ఏమీ మాట్లాడలేకపోయంది.

అకస్మాత్తుగా ఆమె మెదడులోకి విచిత్రమైన ఆలోచన వచ్చింది.

“ఉదాహరణకు విశ్వంభరరావుకు చలనం వస్తుంది.. కానీ తనొక ప్రధానినన్న విషయం ఆయనకు గుర్తురాకపోతే?”

‘బ్రెయిన్‌కి ఆపరేషన్ చేసి, మెమొరీ పవర్ కుదుటపడడానికి ప్రయత్నిస్తాం.”

“అప్పటిక్కూడా వీలుకాకపోతే?”

ఒక్క నిమిషం ఆలోచించి చెప్పాడు డాక్టర్ సవ్యసాచి…

“ప్రస్తుతం మా పరిశోధనలను కేవలం మృత్యువు మీదే కేంద్రీకరించాం. మృత్యువు తర్వాత జీవి, లేదా మనిషి అనేది మా పరిశోధనాంశంలో రెండో భాగం.. అయినా ఇంతకీ ఈ ప్రశ్న మీరెందుకు వేశారు?”

ఆ ప్రశ్న ఎందుకు వేసిందో చెపలేకపోయంది భారతి.

విశ్వంభరరావు బ్రతికితే ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఏం జరగనున్నదో ఆమెకు తెలీదు. ఆ విషయం పూర్తిగా తెల్సిన వ్యక్తి రుషి కుమార్ ఒక్కడే.

సరిగ్గా ఆ సమయంలో రుషికుమార్ తిరుపతి రైల్వేస్టేషన్ రోడ్లో వున్న భీమాస్ హోటల్ మెట్లెక్కుతున్నాడు.

*  *   *  *    *

తిరుపతి రైల్వేస్టేషన్లోంచి బయటికొచ్చారు కామేశ్వర్, రమేష్.

“అసలు మనం తిరుపతి ఎందుకొచ్చామో నాకు అర్థంకావడం లేదు. తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్నాయి తప్ప… ఫలితం మాత్రం కనిపించడం లేదు” నిరాశగా అనాడు రమేష్.

“ఒరేయ్! నీలా ఓపిక లేకపోతే టెన్సింగ్‌నార్కే ఎవరెస్ట్‌ని ఎక్కలేక పోయేవాడు. యూరీగగారిన్ ఆకాశంలోకి వెళ్లేవాడే కాదు.. ఆఖరికి లైకా అనే కుక్కపిల్ల ఆకాశంలో కెళ్ళొచ్చిందిరా.. ఆ మాత్రం పట్టుదల లేకపొతే మనం మనుషులమా… చెప్పు” కోపంగా అన్నాడు కామేశ్వర్.

“పట్టుదల లేకకాదు.. ఫండ్స్ లేక… నా దగ్గర నలభై రూపాయలే వున్నాయి. హైద్రాబాద్‌లో అన్ని ఖర్చులూ నాచేతే పెట్టించావు – నేను చూస్తున్నాన్లే.. నీ జేబులోంచి పైసా తీయలేదు… ” ఉక్రోషంగా అన్నాడు రమేష్.

“ఒరేయ్ పిచ్చికన్నా! డబ్బులు గురించి మాట్లాడితే నాకు చికాకు వేస్తుంది. హైద్రాబాద్‌లోని ఆబిడ్స్ సెంటర్లో ఆ సాధువు ఏం చెప్పాడ్రా? తిరుపతి కొండలలొ అత్యద్భుతమయిన వనమూలికలున్నాయని మహేష్ యోగిలాంటి పరిశోధకులు, అక్కడ కొండల్లో తిరిగే మహాశక్తులు సంపాదించారని చెప్పారా? లేదా? అందుచేత ఆ కొండల్లోనే మన ప్రయాణం… ఆ వనమూలికల్ని సంపాదించడం.. చచ్చిపోయిన మనుషుల్ని బ్రతికించడం. ముఖ్యంగా రేలంగి రమణారెడ్డిల్ని నేను బ్రతికిస్తాన్రా…” ఆవేశంగా అన్నాడు కామేశ్వర్. అప్పటికి అతనికి కడుపులో ఎలుకలు, ఏనుగులూ కలిసి రన్నింగ్ రేస్ చేస్తున్నాయి. తన జేబులో ఒక్క పైసా లేదనే విషయం తెలిస్తే మిత్రుడు నిలువునా చంపేస్తాడని ఆ విషయం చెప్పడం లేదు అతను.

“రేలంగి, రమణారెడ్డి బ్రతకాలంటే ఎలారా? వాళ్ల శవాలయినా దొరకాలి. అదేప్పుడో బూడిదయి పోయుంటాయి? కదరా?” నిస్సహయంగా అన్నాడు రమేష్.

“పిచ్చినాన్నా! మట్టిలోంచే మనుషులు పుడతారా లేదా… అలాగే బూడిదలోంచి శవాలు లేస్తాయి… చాలా గొప్ప విషయం నీకు చెప్తున్నాను విను… మనకు మూలికలు, వాటి రహస్యాలూ తెల్సిన వెంటనే ఝూమ్మని మద్రాస్ చెక్కేస్తాం… రేలంగి, రమణారెడ్డిల్ని ఎక్కడ దహనం చేశారో అక్కడికి వెళతాం.”

“వెళ్లి…”

“ఆ సమాధుల దగ్గర తవ్వుతాం.”

“అప్పడక్కడ వున్నవాళ్ళు మనల్ని పిచ్చకొట్టుడు కొడతారు.”

“ఒరేయ్! బి.డి.దాయ్ అంటే బడుద్దాయన్న మాట. తవ్వడమంటే-పట్టపగలు మొక్కలు పాతడానికి మట్తిని తవ్వినట్టు తవ్వుతామట్రా? అర్థరాత్రి…భయంకరమయిన పక్షులు అరుస్తుంటాయి. నువ్వూ. నేనూ నల్లటి రగ్గులు కప్పుకుని మద్రాసులోని ఆ స్మశానంలో అడుగుపెడతాం…”

“పెట్టి…”

“మన కాళ్లకింద నుంచి పాములు వెళ్ళ్లిపోతుంటాయ్. చెట్లకు వేలాడుతూ పెద్ద పెద్ద బూజులూ… మన చేతిలోని కత్తితో ఆ బూజును ఖండిస్తాం”

“బూజుని ఖండించడమేమిట్రా? అయినా కత్తులేలా దొరుకుతాయి? నలభయ్ రూపాయలకు కత్తులొస్తాయా?” పిచ్చి పిచ్చిగా తల పీక్కుంటూ అన్నాడు రమేష్.

“ప్రశ్నలు వేయకు… టెంపో పోతుంది. చెప్పింది విను. మనం అలా ఠంగ్ ఠంగ్‌మని అడుగులేసుకుంటూ ముందుకెళతాం… అక్కడ…. అంతెత్తుగా పెరిగిన చెట్ల మధ్యన రెండు సమాధులు.. ఆ సమాధుల్ని తవ్వుతాం.. అందులోంచి రెండు ఎముకలు, కీచుమంటూ అదే సమయములో రెండు గుడ్ల గూబలు… అయినా మనం భయపడం. ఆంజనేయుడిని స్మరించుకుంటూ మన జేబులో వున్న మూలికల్ని తీసి ఆ ఎముకలకు రాస్తాం. పెద్ద పొగ… దట్టమయిన పొగ… ఆ పొగలో… రెండు మానవాకారాలు.. రెండు…” ఏదో దట్టమయిన పొగ నోట్లో దూరడంతో మరి చెప్పలేకపోయాదు కామేశ్వర్.

రోడ్డు పక్కన దోమల మందు జల్లుతున్న మిషన్‌లోంచి తప్పించుకోడానికి ముందుకు పరిగెత్తాడు రమేష్.

సరిగ్గా…

అప్పుడు…

ఆ పొగల మధ్య నుంచి వస్తున్న వ్యక్తిని సడన్‌గా చూసి కెవ్వుమని అరిచాడు రమేష్.

అతని వెనుకే వచ్చిన కామేశ్వర్ తొట్రుపాటు పడుతూ కొంచెం దూరంలో పొగల్లో నుంచి నడిచి వస్తున్న వ్యక్తిని చూసి ప్రాణభయంతో వెనక్కి పరుగెత్తాడు. అతన్ని రమేష్ అనుసరించాడు.

పొగల మధ్య నుంచి వస్తున్న ఆ వ్యక్తి శోభరాజ్.

చెమటతో తడిసిపోయిన శరీరం. కందగడ్డలా ఎర్రగా మెరుస్తున్న ముఖం, భుజాన వేలాడుతున్న జర్నీ బ్యాగ్.

పెద్ద పెద్ద అంగలతో ముందుకు వస్తూ ఎడం వైపు తిరిగి ఒక హోటల్ ముందు ఆగి, బోర్డు చూసి రిసెప్షన్ వైపు నడిచాడు.

అతని వైపు చూసింది రిసెప్షనిస్ట్ ప్రశ్నార్థకంగా.

“ఏ.సి.స్పెషల్‌రూమ్” చెప్పాడు శోభరాజ్. రిసెప్షనిస్ట్ పక్కన వున్న రిజిష్టర్ని తన ముందుకు లాక్కుంది.

సరిగ్గా అదే సమయంలో…

ఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లడానికి మెట్లెక్కుతున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి వెనక్కి తిరిగి కౌంటర్ వైపు చూసింది. ఆ వ్యక్తి దిశ.

దిశకు కొంచెం దూరంలో గబగబా మెట్లెక్కుతున్నాడు రుషి కుమార్.

*    *    *   *    *

ఎత్తయిన కొండ… ఆ కొండ పైన నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. అంతా చిమ్మచీకటి.

నెమ్మది నెమ్మదిగా మేఘాలన్నీ కలిసిపోతున్నాయి. కలిసిపోతున మేఘాలు, ఒకదానిలో ఒకటి ఇమిడిపోతున్న మేఘాలు… నల్లటి పెద్ద పక్షి రెక్కల్లా వున్నాయి. తెరచాపల్లా కదులుతున్న పెద్ద రెక్కలు.

కొండ అంచు నుంచి ఆ రెక్కలు ఒక్కసారిగా పైకిలేచాయి…. అప్పుడు తెలిసింది అదొక పెద్ద పక్షని. ఆకాశంలో సగభాగం నిండిపోయినట్టుగా వుందా పక్షి. ఆ పక్షి కళ్ళ స్థానంలో రెండు మణులు కాంతివంతముగా మెరుస్తున్నాయి.

ఆ పక్షి గాల్లో ఎగురుతున్నప్పుడు.. అంతెత్తు పొడవుగా వున్న చెట్లన్నీ రువ్వల్లా వూగిపోతున్నాయి.

మహోదృతమైన ప్రళయ ఝుంఝారావం… ఉప్పెన ముందు లేచే కడలి తరంగాల కల్లోల నాట్యం. కొండ గుహల్లోంచి వినిపిస్తున్న క్రీంకారాల హుంకారావాలు.

ఆ రాక్షస పక్షి కాళ్ళు రాతి స్తంభాల్లా వున్నాయి. ముక్కు వాడియైన ఇనుప గొట్టంలా వుంది. ఆ కాళ్ళ చివర వేళ్ళు పొడవాటి బాణాల్లా వున్నాయి.

యోజనాలు, యొజనాలను అవలీలగా అధిగమిస్తున్న ఆ రాక్షస పక్షిని చూసి-

కెవ్వున కేక వేసిందామె.

విశాలమైన నిర్జనమైన ఎడారి… చీకటి ఎడారి… ఒంటరి ఎడారి…

పరిగెడుతోందామె. శక్తినంతా కూడదీసుకుని మెరుపులా పరిగెడుతోంది.

ఆమె వెనక ఆమెను వెంటాడుతూ మృత్యువిహంగం.

ఆమెను సమీపిస్తోంది సుడులు తిరుగుతున్న గాలి… భూమినెవరో కుదిపేస్తున్నట్టుగా కదిలిపోతున్న చెట్లు.. తమ గమనన్ని మార్చుకుంటున్న నదులు…

కొండలు బంతుల్లా పైకి లేచిపోతున్నాయి. అదొక బీభత్సం.

ఆ మృత్యువిహంగం రివ్వుమని క్రిందకు వాలి, కాలిగోళ్లతో ఆమెను అందుకుంది.

ఒక్క వూపుతో పైకి లేచింది.

కెవ్వు కెవ్వుమని అరుస్తోందామె… అగాధ నిశీథి తిమిరంలో అవిశ్రాంత హాహాకారం.

చావు పుట్టుకల పొలిమేరలలో ఆవులిస్తున్న చితాగ్ని గుండెలు…

రక్తగానాల, మానవ కంకాళాల యజ్ఞం…

ఆ మృత్యువిహంగం పైపైకి ఎగురుతోంది..

ఆకాశం అంచులు దాటి, రోదసి గర్భంలోకి ప్రవేశించింది.

ఆ వాడి గోళ్ళకు చిక్కుకుని, తప్పించుచుకోవడానికి విఫలయత్నం చేస్తూ, పోరాడుతూ ఆమె..

కళ్ళముందే మాయమైపోయిన మానవ ప్రపంచం… కళ్ళముందే ఆవిరై పోయి పొగలా ఎగిరిపోతున్న మహాసముద్రలు…”నిలువునా ఎండిపోయిన చెట్లు…. సమస్త సృష్టిలో చలనం ఆగిపోయి, స్తభింపపోయిన వింత దృశ్యం….

ఒకపక్క ఆశ్చర్యపోతూనే, మరొక పక్క మృత్యుకరాళ దంష్ట్రల్నించి తప్పించుకోడానికి విఫలయత్నం చేస్తోందామె.

సరిగ్గా అదే సమయంలో ఆ పెనురాక్షస విహంగం ఒక గోళానికి ఢీకొంది.

ఘోర విస్పోటనం… భూనభోంతరాళాలు క్షణకాలం కంపించిన అగ్ని గానం…

ఆ రాక్షస విహంగం కాళ్ళల్లోంచి ఆమె జారిపోయింది.

ఆకాశానికీ, భూమికీ అకాశానికీ, భూమికీ మధ్య గాల్లో తేలుతూ ఆమె.. మేఘాల్లోంచి, కొండలమీద నుంచి చెట్లమీద నుంచి అమె…

గిరగిరమని భూమిలా తిరుగుతూ ఆమె..

విహ్వాలంగా అరుస్తూ, తోకచుక్కలా… ఒక ఎడారిలో పడిపోయి సొమ్మసిల్లి పోయింది.

ఎప్పుడో కళ్లు తెరిచింది… పక్కన చిన్న మొక్క అప్పుడే పుట్టిన లేత మొక్క చుటూ చూసింది… ఎక్కడా ఒక్క నీటిబింధువుగానీ, పచ్చని మొక్కగాని కనిపించలేదు.

ఆ మొక్క వైపు ఆశ్చర్యంగా చూసిందామె. అది భవిష్యత్తుకు వెలుగు చుక్కలా కనిపించిందామెకు…

 

*         *         *       *        *

 

ఇంకా ఉంది…

1 thought on “సంభవం – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *