March 29, 2024

హ్యూమరధం – 1

రచన: రావి కొండలరావు

 

వరప్రసాద్ హృదయలేఖిని నుండి…

“హాసం, హాస్య-సంగీత పత్రిక’ ద్వారా మూడేళ్లపాటు హాస్య, సంగీత ప్రియులను అలరించిన అనుభవం ఆలంబనగా ఈ ప్రచురణల రూపంతో పాఠకుల ముందు తిరిగి వస్తున్నాం. హాస్యం, సంగీతం అనే అంశాలతో కూడిన పుస్తకాలను సాధ్యమైనంత తక్కువ ధరకు పాఠకులకు అందించాలన్న సద్దుద్దేశ్యంతో ప్రారంభించబడిన మా సంస్థ వెలువరించిన ఐదవ ప్రచురణ తృతీయ ముద్రణ ఇది.

‘హ్యూమరథం’ రచించిన శ్రీ రావి కొండలరావు పరిచయాలు అక్కర్లేని సుప్రసిద్ధ రచయిత, వ్యాసకర్త, పాత్రికేయుడు, నటుడు, దర్శకుడు. 350కు పైగా సినిమాలలో, వేలాది నాటక ప్రదర్శనలలో నటన, 3 నాటకాల, 20 నాటికల రచన, సినీదర్శక శాఖలో కమలాకర, బిఎన్ రెడ్డి వంటి దిగ్గజాల వద్ద అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేసిన అనుభం, ‘పెళ్లిపుస్తకం’ సినిమా కథ ద్వారా నంది అవార్డు నందడం, మలితరం విజయా ప్రొడక్షన్స్ సినిమాలకు (బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం) నిర్మాణ సంచాలనం-యివన్నీ సినిమారంగం గురించి అధ్యయనం చేయడానికి ఉపకరిస్తే – 35 కథలు, 3 హాస్య సీరియల్స్, 2 పిల్లల సీరియల్స్, ‘వనిత’ పత్రికకు 5 యేళ్లు, ‘విజయచిత్ర’ వంటి మేటి సినిమాపత్రికకు 26 యేళ్లు సహసంపాదకత్వం నెరపడం అనుభవాలను అక్షరబద్ధం చేసే నేర్పు ప్రసాదించింది. వారు రచించిన ‘బ్లాక్ అండ్ వైట్’ అనే సినీచరిత్ర గ్రంధం నంది అవార్డు గెలుచుకుంది.         సినీరంగంలో అయిదు దశాబ్దాలుగా పెనవేసుకున్న అనుబంధాన్ని వివిధ పత్రికలలో శీర్షికల ద్వారా పాఠకులతో పంచుకున్న శ్రీ కొండలరావు ‘హాసం’ హాస్య-సంగీత పత్రికలో నడిపిన ‘హ్యూమరథం’ శీర్షికలోని విషయాలోను రెండు భాగాలుగా వెలువరిస్తున్నాను. సినిమారంగంలోని చమత్కార ఉదంతాలను మొదటిభాగంగా, వివిధ హాస్యనటుల జీవిత చిత్రణలను రెండవ భాగంగా వేస్తున్నాను. ఇది మొదటిభాగం. దీనిలో సందర్బోచితంగా అక్కడక్కడ శ్రీ బాపు, శ్రీ ఈశ్వర్ బొమ్మలను వాడుకోవడం జరిగింది. వారికి కృతజ్ఞులం.

ఈ పుస్తకం తర్వాత వేసిన హ్యూమరథం-2 కూడా యిప్పటికే రెండు ప్రచురణలు పొందింది. బహుమతిగా ఇవ్వదగినది. మా పుస్తకాలన్నీ ప్రజాదరణ పొందాయని తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. మొదటి ప్రచురణ వెలుపడిన కొన్ని నెలల్లోనే మలి ప్రచురణకు సిద్ధమవుతున్నాయి. 2005 ఉగాదినుండి ఇప్పటి వరకు 18 పుస్తకాలు ప్రచురించామంటే దానికి కారణం పాఠకుల ఆదరణే! ఈ పుస్తకాల వివరాలు పుస్తకం ఆఖరి పేజీలో చూడవచ్చు.

‘కొనడం మీ వంతు – ఆకట్టుకొనడం ఆ వంతు’ అని మా ‘హాసం’ నినాదం. మీరీ పుస్తకాలు ఆదరించి, కొని, కొనిపించి మమ్మల్ని ఉత్సాపరుస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. ఈ ఉత్సాహం ఇలాగే సాగితే ‘హాసం’ ఉద్యమం నిరంతరంగా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను. ఈ ప్రచురణలపై, మీ అభిప్రాయాలని ‘హాసం ప్రచురణలు’ అడ్రసుకు తెలుపగోర్తాము. తెలుగునాట ప్రచురణారంగానికి ఆదరణ యింకా నశించలేదని నిరూపిస్తారని ఆశిస్తూ.

భవదీయుడు,

వరప్రసాద్…

కె.ఐ.వరప్రసాద్ రెడ్డి, ప్రచురణకర్త

 

 

రచయిత మాట… ravikondala

“మీకు సినిమా వాతావరణంతో చిరకాల అనుభవం వుంది. చాలామందితో పరిచయం వుంది. నటుడిగా షూటింగుల్లో పాల్గొన్నప్పుడు అక్కడ జరిగిన తమాషా విశేషాలు, చమత్కారాలూ లాంటివి ప్రతి పక్షం రాసి పంపగలరా?’ అని ‘హాసం’ పత్రిక అడిగినప్పుడు “అలాగే” అని వెంటనే అనేయలేదు గాని, ఆలోచించుకుని ‘గుర్తున్నాయి’ అనుకున్న తర్వాత  “అలాగే” అన్నాను.

ఎంతోమంది ప్రముఖులు చెప్పినవీ, చేసినవీ చమత్కారాలు గుర్తున్నాయి – ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వుంటాం గనక. తక్కినవేవీ ఎక్కడా రాసుకోలేదు. అలాగే ఆ షూటింగుల విశేషాలు ఒకటీ ఒకటీ గుర్తుకు తెచ్చుకుంటూ, ‘హ్యూమరథం” తోసుకుంటూ వెళ్లాను. “హాసం’లో మీ హ్యూమరథం చదువుతున్నామండీ, బాగుంది.” అని చదివినవాళ్లు చెబుతూ వుంటే, ఎంతో అనందం కలిగేది. జీవితంలో హాస్యం వుంది. ప్రతివారి జీవితంలోనూ హాస్య సంఘటనలు జరుగుతూనే వుంటాయి. అలాగే సినిమా జీవితంలోనూ జరుగుతాయి. అయితే, అవన్నీ గుర్తు పెట్తుకుని ఇంకొకరికి చెప్పడం వల్ల గుర్తుండి పోతాయి.  చెప్పినప్పుడు కంటే, రాసినప్పుడు కాస్త చమక్ చేసి రాస్తాం గనక, సరదాగా వుండి, మందహాసం అయినా తెప్పిస్తుంది. అయితే, అన్నీ వారి వారి పేర్లతోనే వచ్చాయి గనక, కల్పించి రాసినవో, ఊహించి రాసినవో కావు. ‘ఇవన్నీ ఎలా జ్ఞాపకం పెట్టుకున్నారండీ?” అని కొందరు అడిగినప్పుడు, హాస్యమూ, విషాదమూ గుర్తున్నట్టు తక్కినవి గుర్తుండకపోవచ్చునేమో అనిపిస్తుంది.

నా కిష్టమైన ‘హాసం’ పత్రిక నా జ్ఞాపకాల్ని నాకు జ్ఞాపకం చేసి, రాయించింది. ప్రత్యక్షంగా నాకు జరిగినవే కాకుండా, విన్నవి కూడ రాశాను. ‘హాసం’ ఆగినా, ఆ పత్రికలో వచ్చిన అనేక శీర్షికలను పుస్తక రూపంలో తీసుకొచ్చి అందజేయడం అన్నది అపూర్వమైన విషయం. ఇలా, ఇంతకుముందు ఎవరూ చెయ్యలేదు. చెయ్యడానికి సాహాసించనూ లేదు. తక్కువ ధరకి అందజెయ్యడం కూడా మంచి ఆకర్షణ.

‘హాసం ప్రచురణలు’, హ్యూమరథం’ రెండు భాగాలుగా తీసుకురావడం – వ్యక్తిగతంగా నాకెంతో ఆనందంగా వుంది. చదివేవారికీ వినోదంగానే వుంటుందని భావిస్తాను. ఇప్పటికే వచ్చిన పుస్తకాలన్నీ ఎంతో పాఠకాదరణ పొందుతున్నాయి. అలాగే ‘హ్యూమరథం-1’ కూడా ఆరునెలల్లోనే ద్వితీయముద్రణకు సిద్ధం కావడం, ఇప్పుడు తృతీయముద్రణ వెలువడడం, హ్యూమరథం-2 కూడా ద్వితీయముద్రణ పొందడం సంతోషదాయకం. పాఠకులకు, ‘హాసం ప్రచురణలు’కు ధన్యవాదాలు.

 -రావి కొండలరావు

 

హ్యూమరధం

 

తొలినాటి సినిమా వింతలు, విశేషాలు

సీరియస్‌నెస్ నుంచి హ్యూమరొస్తుందనీ, హ్యూమరు నుంచి సీరియస్‌నెస్ పుట్టాలని – చాప్లిన్ మహాశయుడు చెప్పాడు. అలా, తొలివాళ్ళలో సినిమాలు తీసినప్పుడు వాళ్ళు ‘సీరియస్’గానే ఆలోచిస్తూ తీసినా, ఇవాళ అవి తలుచుకుంటే నవ్వు వస్తుంది.  స్తబ్దుగా వుండవలసిన బొమ్మ తెరమీద కదుల్తున్నప్పుడు నాటి ప్రేక్షకుడు సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. గొప్ప వింత! మూకీ చిత్రాలు కధా చిత్రాలై జనాకర్షణ పొందుతున్నప్పుడు కూడా స్త్రీలు, స్త్రీ పాత్రలు ధరించడానికి ముందుకు రాలేదు. కెమెరా ముందు, దీపాల వెలుగులో నిలుచుంటే తమ ‘అందం’ అంతరిస్తుందని మూఢ విశ్వాసంలో వుండే వారుట!  అంచేతనే మన దేశంలో తయారైన మొదటి శబ్దరహిత చిత్రం ‘రాజాహరిశ్చంద్ర’ (విడుదల 1913) లో కూడా స్త్రీ పాత్రల్ని పురుషులే ధరించారు. శబ్దం లేదు గనుక, గొంతులు మగ గొంతులే అయి వుండాలి!

అంతకు ముందు, విదేశాల నుంచి మూకీ చిత్రాలు వచ్చేవి. నవ్వు కాదు గాని, ఓ గొప్ప విశేషం గమనించాలి. ‘హరిశ్చంద్ర’ తీసిన దాదాఫాల్కే అటు తర్వాత కూడా చాలా చిత్రాలు తీశాడు. అప్పట్లో దిగుమతయిన ముడి ఫిల్ముకి పక్కన స్ప్రాకెట్స్ (ప్రొజెక్టర్లో తిరగడానికి ఫిల్మ్ పక్కన చిల్లులు)వుండేవి కాదు. ఫాల్కే, డార్క్‌రూమ్‌లో కూచుని, వేలాది అడుగుల ఫిల్ముకి సమానదూరంలో చేత్తో చిల్లులు పొడిచే వాడు! ఇలా విజృంభించిన సినిమాకి ఆదిలో అలా విశేష శ్రమకీ, కష్టానికీ లోనయ్యారు పెద్దలు.

ప్రసిద్ధ కమెడియన్ కస్తూరి శివరావు మొదట్లో సినిమా ఆపరేటరు. ఆయన కొన్ని జోక్స్ చెబుతూ వుండే వారు. తాను పని చేస్తున్న పెండాలు (అప్పట్లో సినిమా థియేటరుని అలా అనేవారు) ప్రొప్రయిటరు ఓరోజు తనని చెడామడా తిట్టి ఉద్యోగం పీకేశాట్ట. “దానికి కారణం – ఆ మూకీ సినిమా అమెరికన్ సినిమా, అందులో ఒక అమ్మాయి దుస్తులు మార్చుకుంటూ ఉంటుంది. మనకి మొత్తం బాక్‌షాట్‌లోనే కనిపిస్తుంది. ఆ దృశ్యం రాగానే మా ప్రొప్రయిటరుగారు తెరవెనక్కి వెళ్ళి నించునేవాడు. అక్కడా అలాగే కనిపిస్తుందని ఆయనకి తెలీదు! దాంతో ఉగ్రుడై ‘నేను ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా, నువ్వు బొమ్మ మార్చేస్తున్నావు. నాకు వీపు మాత్రమే కనిపిస్తోంది. నీ పొగరు భరించలేను – డిస్మిస్’ అని నేనెంత చెబుతున్నా వినిపించుకోకుండా ఉధ్యోగం ఊడగొట్టాడు” అని చెప్పారు శివరావు.

“అలాగే, ఒకాయన రోజూ వచ్చి ఒక సినిమా చూసేవాడు. ఎందుకు రోజు వస్తున్నాడు? ఆ సినిమాలో రైలు వచ్చి ఆగే దృశ్యం వుంది. “”రోజూ అది కరెక్ట్ టైముకే వస్తోంది. ఏ రోజైనా ఆలస్యంగా రాదా అని అతని ఉద్దేశంట!” అని ఇంకో జోక్ చెప్పేవాడు శివరావు.

మూకీ సినిమాలు వచ్చిన తొలిరోజుల్లో సినిమా ప్రారంభానికి ముందు హాల్లో దీపాలు ఆర్పితే, జనం “దీపాలు ఆర్పకండి బాబోయ్, మాకు భయం” అని అరిచేవారట. కొన్నాళ్ళకి గాను అది సర్ధుకోలేదు. అమెరికాలో మొదటిసరి సినిమా చూసిన వాళ్ళు, హీరోయిన్ క్లోజప్ రాగానే “దగా! మోసం! ఆవిడ నడుమూ కాళ్ళు ఏవీ?” అని గట్టిగా అరిచారట. అలాగే మన తెలుగు సినిమా మాట నేర్చుకున్న కొత్తలో, ఒక పాత్ర పద్యం చదువుతూ వుంటే ఇంకో పాత్ర ‘రియాక్షన్’ షాటు వేస్తే ఒప్పుకునే వారు కాదుట. పద్యమో, పాటో పాడుతున్న పాత్రే కనిపించాలి!

ఆంద్రదేశంలో మొదట సినిమా థియేటరు కట్టించిన పోతిన శ్రీనివాసరావు గారు చెప్పేవారు – ఆయన చాల మూకీలు తెప్పించి, ఆంధ్రలో ఆడించారు. “ఒక పౌరాణిక మూకీ చిత్రంలొ భీముడికి మధ్యలో మీసం ఊడిపోతుంది. అది ఆ సినిమా తీసిన వాళ్ళు గమనించలేదు కానీ,, ప్రేక్షకులు గమనించారు. “మీసం ఊడిన భీముడు, మీసం జారిపోయిన భీముడు” అని గోల చేశారు ఊరంతా ప్రచారం కూడా చేశారు. “ఆ ప్రచారాన్ని ఖండిస్తూ, నేను ఇంకొక ప్రకటన చేయించాను. “ఇవాళ భీముడికి మీసం ఊడదు. దయచేసి రండి” అని మేళతాళాలతో చెప్పించాను. నేను ఆపరేటరుతో చెప్పి మీసం ఊడిన భాగాన్ని కత్తిరించేసి అతికేయమన్నాను. అంతే! అది ఎవరికీ తెలియలేదు. గనుక, అందరూ సంతోషించారు” అని చెప్పారు శ్రీనివాసరావు.

ఐతే, ‘కదిలే బొమ్మ’ జనానికి వింత కలిగించినా, జనం ఎక్కువగా వచ్చేవారు కాదుట. ఎదురుగా పాత్రలు కనిపిస్తూ పాటలూ పద్యాలూ పాడుతున్న నాటకాలకే ఎగబడే వారుట. “అంచేత మేము సినిమా మధ్యలో ఉచితంగా సోడాలు, కిళ్ళీలూ ఇస్తామని ప్రకటనలు వేసేవాళ్లం. వాటికోసమైనా జనం వస్తారేమోనని. ఊళ్ళో నాటక ప్రదర్శనలు లేకపోతే వచ్చేవారు. మొత్తానికి మూకీ చిత్రాల ప్రదర్శన నష్టాలతోనే నడిచింది” అని శ్రీనివాసరావు చెబుతూ వుండేవారు.

దాదాఫాల్కే కూడా ఇలాంటి అవస్థలే ఎదుర్కోన్నాడు. ‘లంకా దహనం’ తీసినప్పుడు “నిజంగానే లంకా దహనం కనిపిస్తుంది – రండి” అన్నట్టుగా ప్రకటనలు చేయించాడు. హనుమంతుడు లంకను దహనం చేస్తున్న దృశ్యం రాగానే, ప్రొజెక్టర్ ముందు ఎర్రని అద్దం ముక్క పెట్టి చూపించగానే, బొమ్మ ఎర్రబారింది. నిజంగానే మండుతున్న బ్రాంతి కలిగింది. మొదటి రోజున ప్రేక్షకుల్లో కొందరు “నీళ్ళు! నీళ్ళు” అని కేకలు కూడా పెట్టారట. ఇలాంటి ట్రిక్కే తెలుగులో వచ్చిన ‘సతీసావిత్రి’కీ చేశారు. యమలోకం దృశ్యం రాగానే ఎర్రరంగు అద్దం ముక్క ప్రొజెక్టర్ ముందు పెట్టి – ఆ దృశ్యం అంతా ఎర్రగా చూపించేవారు.

1936లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ రాజమండ్రిలో తీశారు. రావణుడు సీతను ఎత్తుకుపోయిన తర్వాత, రామలక్షణులిద్దరూ గోదావరి ఒడ్డున సీత కోసం గాలిస్తూ వుంటే – వెనకాల బ్రిడ్జిమీద రైలు వెళిపోతూ వుంటుంది! ఎవరూ చూసుకోలేదు. తీసిన చిత్రాన్ని వెంటవెంటనే, డెవలప్ చేసి చూసుకోడానికి సౌకర్యాలు లేని రోజులు! అలాగే, తర్వాత వచ్చిన ఎన్నో పౌరాణిక చిత్రాల్లో ఎలక్ట్రిక్ స్తంభాలు, వైర్లు, తారు రోడ్లు కనిపిస్తాయి.

పూర్వం రోజుల్లో పాటలు, పద్యాలూ అక్కడికక్కడే రికార్డయ్యేవి. నటీనటులు పాడుతూ నడుస్తూ వుంటే ఆర్కెస్‌ట్రా వారిని ట్రాలీమీద కూచోపెట్టి, నటీనటులతో పాటే నడిపించేవారు. 1935లో వచ్చిన ‘అనసూయ’ (అరోరా ఫిలింస్) లోనో, ‘కుచేల’లోనో – ఒక చోట వాద్యాలు వాయిస్తున్న వారు, ఒక షాటులో కనిపించారని, ఆ సినిమా ఏదో సరిగా తనకి జ్ఞాపకం లేదని – సాలూరు రాజేశ్వరరావు చెప్పారొకసారి.

మన దేశంలోని తొలిటాకీ ‘ఆలంఆరా’ 1931లో విడుదలైంది. సినిమాకి మాటొచ్చిన సంవత్సరం అది. మాట్లాడని బొమ్మ మూకీ – మాట్లాడుతుంది గనుక టాకీ. అప్పట్లో అందరూ టాకీ అనే వారు. ఇప్పుడు “సినిమాకి వెళదామా? సినిమా చూద్దామా?” అన్నట్టు అప్పుడు “టాకీకి వెళదామా?” అనే వారు. కొందరు ‘బైస్కోప్’ అనే వారు. ఇప్పటికీ గ్రామాల్లోని పెద్ద వయసు వాళ్ళు “బయస్కోపు” అనే అంటూ వుంటారు. “ఆలంఆరా”ని తొలిసారిగా మద్రాసు తీసుకొచ్చినప్పుడు – రైల్వేస్టేషన్ జనంతో కిటకిట లాడిందట! “టాకీకి స్వాగతం!” పలికారట. ఆ ప్రింటు తెచ్చిన వారిని పూల మాలలతో స్వాగతించారట.

అయితే వాళ్లూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనారు. వాళ్ళు ఊరూరూ తిరుగుతూ, కాంజీవరం వెళ్తే జనం రాలేదట. ఎంచేత? అంతకుముందు ఒకాయన టాకీ అని చెప్పి మూకీ సినిమాయే వేసి,   వెనకాల మనుషుల్ని నిలబెట్టి పాటలు పాడించాట్ట. అది తెలుసుకొన్న ప్రేక్షకులు మక్కెలు విరగొట్టారు. “ఇది అలాంటి మోసం కాదు – నిజం టాకీ! రండి, చూడండి” అని విశేషంగా పబ్లిసిటీ ఇస్తేగాని, జనం రాలేదు!

సింహళ దేశం వెళ్లి జాఫ్నాలో ‘ఆలంఆరా’ వేస్తే “హిందీ మాకొద్దు – సింహళ భాషలో వెయ్యండి” అని గోల చేశారు ప్రేక్షకులు, అలా కుదరదని, శబ్దం బొమ్మతో పాటే వుంటుందని ఎంత చెప్పినా వాళ్లకి అర్థం కాలేదు. ‘అంతకు ముందు స్పీకర్లో సింహళం పాటలు వేశారు గదా, అదే స్పీకర్లో సింహళభాష రావడానికి ఏం రోగం?” అన్నది వాళ్ల పాయింటు.

నెల్లూరులో ‘ఆలంఆరా’ వేసినప్పుడు ఇంటర్వెల్‌లో ఒక లాయరుగారి టాకీ మనుషుల్ని కలిసి “టెక్నిక్ బాగా పెరిగింది. బొమ్మ కదలడం, మాట్లాడ్డం బాగుంది. మీరు ఉత్తర హిందూ దేశంలో హిందీ మాట్లాడించండి. ఇక్కడ మాత్రం తెలుగులో మాట్లాడించండి. ఇంత టెక్నిక్ తెలిసిన వాళ్లు – మీకు అదేమంత కష్టం కాదు. కనీసం మా నెల్లూరులో నయినా, మీ సినిమా చేత తెలుగు మాట్లాడించండి” అన్నది ఆ లాయరుగారు రిక్వెస్టు.

ఇలాంటివే ఇంకా ఎన్నో తొలినాళ్ల విశేషాలు, వింతలూ!

ఇంకా ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *