April 25, 2024

మౌనరాగం -4

రచన: అంగులూరి అంజనీదేవిanjanidevi

http://www.angulurianjanidevi.com/

anguluri.anjanidevi.novelist@gmail.com

కాలాన్ని ఎవరూ ఆపలేరు. మంచీ` చెడూ లేకుండా మట్టిని ప్రోగు చేసే పిచ్చివాడిలా తనపని తను చేసుకుపోతుంది.  స్థిరమని భావించే ప్రతి వస్తువును హరించి వేస్తుంది.  వెంటనే వైద్యుడిలా మారి మంచిమందును అందిస్తుంది.

అన్వేష్‌ థర్డ్‌ సెమ్‌కి వచ్చాడు.

ఎం.బి.ఎ. లో అత్యంత ఆదరణ పొందుతున్న స్పెషలైజేషన్‌ ‘హూమన్‌ రిసోర్సెర్స్‌ మేనేజ్‌మెంట్‌’.  మానవ వనరులకి కంపెనీలలో ప్రాధాన్యం పెరిగేకొద్ది ఈ స్పెషలైజేషన్‌కి డిమాండ్‌ పెరిగింది.

అన్వేష్‌లో మంచి పోటీతత్వం, ఎదుటివారిని ఆకట్టుకునే నేర్పు, అద్భుతమైన కమ్యూనికేషన్‌ సామర్థ్యాలు వున్నందువల్ల అతన్ని హెచ్‌.ఆర్‌. మేనేజ్‌మెంట్‌ తీసుకొమ్మని అతని తండ్రి అమృతరావు సలహా యిచ్చాడు.

అన్వేష్‌కి కూడా మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, సిస్టమ్స్‌ స్పెషలైజేషన్‌ల కన్నా హెచ్‌.ఆర్‌. మేనేజ్‌మెంట్‌ మీదనే ఇంట్రస్ట్‌ వున్నందువల్ల తండ్రి చెప్పినట్లు హెచ్‌.ఆర్‌. తీసుకున్నాడు.

* * * * *

వీసా త్వరగా రావటంతో దేవేందర్‌, అపురూపలకి వైజాగ్‌ వచ్చి దేదీప్య ను కలిసేంత టైంలేక వాళ్లనే ఎయిర్‌పోర్ట్‌కి రమ్మన్నారు. పెళ్లయిన తర్వాత వాళ్లు వైజాగ్‌ రాలేదని దేదీప్య అప్పుడప్పుడు బాధపడేది. యశోదర కూడా మీవాళ్లను నేను చూడనేలేదు దేదీప్యా! అనేది. అన్నయ్య,వదినతో అదే చెప్పి, ఫోన్లో యశోదరతో మాట్లాడిపించేది.  వాళ్లతో మాట్లాడిన రోజంతా దేదీప్యకి ఉత్సాహంగా వుంటుంది.

అపురూప, దేవేందర్‌, బాబు స్టేట్స్‌ వెళ్తుంటే సెండాప్‌ ఇవ్వటానికి దేదీప్య, దీపక్‌ హైదరాబాద్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లారు. ఫ్లైట్‌కి రెండుగంటలు టైం వుందనగా చెకింగ్‌ కోసం వాళ్లు లోపలికి వెళ్లాక చాలాసేపు లోపలకి చూస్తూ బయటే నిలబడిరది దేదీప్య. కళ్లనీళ్లు పెట్టుకుంటుంటే దీపక్‌ విసుక్కున్నాడు. ఎవరైనా చూస్తారని ఎంత ఆపుకుందామన్నా ఆ కన్నీళ్లు ఆగటం లేదు. తనే కాదు అక్కడ తమ వాళ్లను ఫైట్‌ ఎక్కించటానికి వచ్చిన వాళ్లలో చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పెదవుల బిగువున దు:ఖాన్ని ఆపుకుంటూ కర్చీఫ్‌తో కళ్లను అద్దుకొంది.

‘‘దేదీప్యా! ఇక వెళ్దామా! వాళ్లు లండన్‌ వెళ్లేంతవరకు ఇక్కడే నిలబడదామా?’’ అన్నాడు చిరాగ్గా చూస్తూ.

భర్త కళ్లలోని చిరాకును తట్టుకోలేకపోయింది.

ఏదో భయం, తన వాళ్లు దూరమవుతున్నారన్న బాధ, ఎవరూ పూరించలేని ఆ వెలితిని ఆమె గుండె భరించలేక గట్టిగా ఏడ్వాలని వున్నా, అతని చిరాకును చూసి వెంటనే ఆ ఏడుపును ఆపుకునే శక్తిని కూడదీసుకొంది.

ఇంక తనకెవరూ లేరన్న భావం ఆమె కళ్లలో కన్పిస్తుంటే ఎవరూ లేని అనాదవు నువ్వు, పూర్తిగా నా మీద ఆధారపడి బ్రతికే పరాన్నజీవివి అన్నట్లుగా అతని కళ్లలో నిర్లక్ష్యం ఆమె గమనించకపోలేదు. భర్తంటే ఎలా వుండాలి? భార్యను ప్రేమతో లాలించాలి,భరించాలి. బాధపడ్తున్నప్పుడు అక్కున చేర్చుకోవాలి.‘నీకు నేనున్నా’నని భరోసా యివ్వాలి. కానీ దీపక్‌లో అలాంటిదేం కన్పించలేదామెకు.

ఇంటికెళ్లాక కూడా అతను అలాగే వున్నాడు.

ఇల్లు చిన్నదయినా, ఇంటి చుట్టూ వున్న ముళ్ల చెట్లను తీసేసి దేదీప్య పూల మొక్కల్ని పెంచడంతో ఇప్పుడా ఇల్లు పర్ణశాలలా వుంది.

మొక్కలకి నీళ్లు పోసి కడుపులో నొప్పిగా అన్పించటంతో లోపలకి వచ్చి పడుకొంది దేదీప్య.

‘‘ఏం పడుకున్నావ్‌?’’ దూరాన్నుండి చూసి దగ్గరకి రాకుండానే అడిగాడు దీపక్‌.

ఏం చెప్పాలో అర్థం కాక ‘‘ఒంట్లో బాగుండలేదండి! అందుకే పడుకున్నా’’. అంది ఆమె మాట ఆమెకే విన్పించేంత తగ్గు స్వరంతో…

అతని ముఖంలో మార్పొచ్చింది. కోపంగా చూశాడు.

ఇంతసేపు ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఏడ్వకపోతే నాకు లంచ్‌ బాక్స్‌ రెడీ చేసి చావొచ్చుగా.’’ అన్నాడు వురిమి చూస్తూ.

ఈ మధ్యన అంటే అన్నయ్య వాళ్లు స్టేట్స్‌కి వెళ్లిన క్షణం నుండి అతని నోటి వెంట తరచుగా ఏడ్వడం, చావటం విన్పిస్తున్నాయి. ఆ మాటలంటేనే దేదీప్య కి నచ్చదు.

‘‘వంట చేశానండి,కాకపోతే బాక్స్‌లో పెట్టలేదు.ఈ ఒక్కరోజుకి మీరు పెట్టుకెళ్లండి.’’ అంది.

‘‘సరేలే! ఏంచేస్తాం! నీ  ఏడుపు ముఖం చూస్తూంటే నువ్విప్పుడిక లేచేట్లుగా లేవు. ఏం నొప్పో ఏమో నెలకి మూడు రోజులు ఏడ్వలేక నవ్వినట్లుగా వుంది నా పరిస్థితి. మెల్లగా లేచి రాత్రికి వంట చెయ్యి. నేను బయట తిని రాను.’’ అంటూ గొణుగుతూనే రెడీ అయి ఆఫీసుకెళ్లాడు దీపక్‌.  పైకి కన్పించడు కాని ఈ టైంలో అతనికి బాగా కోపం వస్తుంది.

దేదీప్య ఏం మాట్లాడలేదు. నొప్పితో మెలికలు తిరుగుతోంది. ఒళ్లంతా చెమట పట్టింది. టాబ్లెట్‌ వేసుకుంటే తగ్గుతుంది కాని అసలే కోపంతో వున్న అతను టాబ్లెట్‌ తెస్తాడన్న నమ్మకం లేదు. నొప్పి ఎక్కువగా వున్నా మౌనంగా భరిస్తూ, నడవాలన్నా వంగినడుస్తూ ఎంత బాధపడ్తున్నా అతనేం పట్టించుకోడు. పనిముట్టుకోడు. తనకెంత బాగాకపోయినా అతనికి బాక్స్‌ రెడీ చేస్తుంది. ఆ టైంలో టాబ్‌లెట్‌ తెచ్చివ్వాలని కాని, ఏదైనా తినటానికి బయట నుండి తెచ్చిపెట్టాలని కాని అనుకోడు. అసలామెవైపు కన్నెత్తి కూడా చూడడు. మూడు రోజులు గడిస్తే తనే లేస్తుంది లే అదెప్పుడూ వుండే నొప్పేగా దాని కోసం నేనెందుకు టెన్షన్‌ పడాలి అనుకుంటాడు. పైగా తప్పు చేసిన మనిషిని బెదిరించినట్లు కళ్లతోనే బెదిరిస్తుంటాడు.  భర్తంటే భయం తప్ప యింకే భావం కలగడం లేదు దేదీప్యకి.

దీపక్‌ ఆఫీసుకి వెళ్లాక ఆ రెండు గదులే విశాలంగా, మౌనంగా మారి పిన్‌డ్రాప్ట్‌ సైలెంట్‌గా అన్పిస్తున్నాయి.

ఒకటి రెండుసార్లు కిటికీలోనుండి పిలిచినా దేదీప్య మాట్లాడకపోవటంతో దేదీప్య దగ్గరికి వచ్చింది యశోదర.

దేదీప్య ను చూడగానే పరిస్థితి అర్థమైంది యశోదరకు.

వెంటనే పని మనిషిని పిలిచి దేదీప్య వేసుకునే టాబ్‌లెట్‌ తెప్పించింది. టీ పెట్టి దేదీప్య చేత తాగించింది. వేడినీళ్లు పెట్టి సాన్నం చేయ్యమని చెప్పింది. టాబ్‌లెట్‌ వేసుకొని స్నానం చెయ్యగానే నొప్పి తగ్గింది దేదీప్యకి.

యశోదరను చూస్తుంటే తన అత్తగారయిన భ్రమరాంబిక గుర్తొచ్చింది దేదీప్యకి.

ఒకసారి ఆఫీసుకు సెలవు పెట్టి వైజాక్‌కి దూరంగా వున్న పల్లెటూర్‌కి దేదీప్యను తీసికెళ్లాడు దీపక్‌. అది దీపక్‌ వాళ్ల సొంత ఊరు. అక్కడ దీపక్‌ అమ్మా, నాన్న, తమ్ముడు, అన్నయ్య, వదిన వాళ్లకో చిన్న బాబు వుంటారు.

దేదీప్య వచ్చిందని తెలియగానే ఆ ఊరిలోని కొంతమంది ఆడవాళ్లు…

‘‘భ్రమరాంబికా! నీ చిన్న కోడలు వచ్చిందటగా అప్పుడెప్పుడో పెళ్ళిలో చూసిందే మళ్లీ చూడలేదు. ఏమైనా విశేషమా! ఒళ్లేమైనా చేసిందా? చూసిపోదామని వచ్చాము.’’ అంటూ వచ్చారు.

‘‘రేపు రండి! చూద్దురు., అప్పుడే వెళ్లదులే వుంటుంది. స్నానానికి వెళ్లింది.’’ అంటూ వీధి గుమ్మంలోనే చెప్పి పంపటం లోపల బూజులు దులుపుతున్న దేదీప్యకి విన్పించి షాక్‌ తిన్నది.

షాక్‌ లోంచి తేరుకున్న దేదీప్యకి… వాళ్లు లోపలికి వస్తే పని డిస్టర్బ్‌ అవుతుందన్న అత్తగారి బాధ అర్థమైంది.

ఎప్పుడు దులిపారో ఏమో ఇల్లంతా బూజులమయం. దేదీప్యను చూడగానే బూజుకర్ర చేతికిచ్చి.

‘‘ఇల్లంతా కాస్త శుభ్రం చెయ్యి.  ఏ పని చేద్దామన్నా నాకేమో చేతులు నొప్పులు, మీ అక్కకేమో మెడనొప్పి.’’ అంది భ్రమరాంబిక.

దేదీప్యను చూడగానే తలకో గుడ్డ కట్టుకొని….

‘‘తలనొప్పిగా వుంది అత్తయ్యా! కాస్త నడుం వాలుస్తాను’’. అంది పెద్దకోడలు రుక్మిణి. ఎంతో కాలంగా పనిచేసి అలసిపోయి రెస్ట్‌ కోసం ఎదురుచూస్తున్న మనిషిలా… అంత రెస్ట్‌ లేకుండా పనిచేసివుంటే ఇంత బూజు ఎక్కడ నుండి వస్తుంది? అని మనసులో అనుకొంది దేదీప్య.

‘‘ సరే! రుక్మిణీ! నువ్వు పడుకో, దేదీప్య వుందిగా చేస్తుందిలే.’’ అంది భ్రమరాంబిక.

దేదీప్యను ఇంట్లో వదిలి వెళ్లిన దీపక్‌ యింకా ఇంటికి రాలేదు.

‘‘వంట చెయ్యి దేదీప్యా!’’అంటూ ఆర్డర్‌ వేసి, వీధి గుమ్మం దగ్గర అరుగు మీద కూర్చుంది భ్రమరాంబిక.

కొత్త కాబట్టి ఆ ఇంట్లో ఏ సరుకులు ఎక్కడున్నాయో అర్థం కాక బయట కూర్చుని వున్న అత్తగారి దగ్గరికి వెళ్లి అడిగి కనుక్కోవాలంటే కాళ్లు నొప్పులు పుడ్తున్నాయి దేదీప్యకి.

‘‘అదిగో అక్కడే వున్నాయి కదా! దాని ప్రక్కనే వున్నాయి చూడు.  కళ్లు సరిగా కన్పించవా నీకు?’’ అంటూ ఆవిడ దబాయింపుకి బిత్తరపోయింది.

‘‘మీ మామగారికి అల్సరుంది.  వేళకి తిండిపడాలి. నువ్వు నత్త నడక నడవకు.  కాస్త హుషారు నేర్చుకో’’ అంది తరుముతున్నట్లే భ్రమరాంబిక.

‘‘సరే అత్తయ్యా! నాక్కాస్త స్టౌ చూపించండి! ఇక్కెడెక్కడా కన్పించటం లేదు’’. అంది దేదీప్యకి పెద్దవాళ్లను గౌరవించడమే కాని, విసుక్కోవటం, వ్యంగ్యంగా మాట్లాడటం రాదు.

‘‘వుంటేగా కన్పించటానికి? ఇదేమైనా పెద్ద సిటీనా స్టౌలపై వండటానికి? వెనక పెరట్లో ఓ మూలకి పొయ్యి వుంది. పక్కన కట్టెలు వున్నాయి వెళ్లి చూడు’’. అంది ఆమె కూర్చున్న చోటు నుండి లేవకుండానే.

తనిప్పుడు కట్టెలపోయ్యిపై వంట చెయ్యాలా?’’ అనుకుంటూ కొయ్యబారిపోయింది దేదీప్య.

‘‘దాన్ని వెలిగించటం నాకు రాదు అత్తయ్యా!’’ అంది దేదీప్య చెప్పకపోతే అత్తయ్యకి అర్థం కాదని.

‘‘నేర్చుకో’’. అంది భ్రమరాంబిక తప్పించుకోవాలని చూస్తే ఇక్కడ కుదరదు అన్నట్లుగా.

స్టాచ్యూలా నిలబడిపోయింది దేదీప్య.

‘‘ఎలా నేర్చుకుంటుంది.  సిటీలో పెరిగినపిల్ల.  నువ్వు కాస్త వెళ్లి చూడు భ్రమరా!’’ అన్నాడు బలరామయ్య దేదీప్య వైపు జాలిగా చూస్తూ.

‘‘కోడల్ని వెనుకేసుకు రావటమంటే ఇదే’’. అంటూ వెళ్లి పొయ్యి వెలిగించింది భ్రమరాంబిక.

వంటలో హెల్ప్‌ తీసుకుందామని ఆ చుట్టు ప్రక్కల ఎక్కడ చూసినా రుక్మిణి కన్పించటంలేదు. కబుర్లు చెప్పుకుంటూ ఏ ఇంటికెళ్లి కూర్చుందో ఏమో.  అత్తగారికి వీథి అరుగు కధా కాలక్షేపమైతే, రుక్మిణి వెయ్యిళ్ల పూజారి. వాళ్ల మనస్తత్వాలు విచిత్రంగా తోచాయి దేదీప్యకి.  కష్టపడి ఒక్కతే వంట చేసింది. పొయ్యి సెగ అలవాటు లేక ఒళ్లంతా ఉడికినట్లైంది.

‘‘పొలంలో యూరియా చల్లాలి. పొలం వెళ్దాంరా దేదీప్యా!’’ అంది భ్రమరాంబిక దేదీప్యవైపు ప్రసన్నంగా చూస్తూ. ఆ చూపులు హాయిగా అన్పించాయి దేదీప్యకి. ఎప్పుడూ ఇలాగే వుండొచ్చు కదా అనుకొంది మనసులో దేదీప్య.

‘‘నేనెందుకుఅత్తయ్యా! మీరు వెళ్లండి! ఆయనొస్తే అన్నం పెట్టాలిగా. అంది బయటకెళ్లిన దీపక్‌ కోసం ఎదురుచూస్తూ.

‘ఎవరో ఒకరు పెడతారులే దేదీప్యా! రుక్మిణి కూడా లేదు. పొలంలో ఎక్కడ పని అక్కడే వుంది.’’ అంది బ్రమరాంబిక.

ఇక వెళ్లక తప్పలేదు దేదీప్యకి.

భ్రమరాంబిక పెద్దకొడుకు ఒకసారి కన్పించి, తర్వాత కన్పించలేదు. పొలంలో కూడా లేడు.

పొలంలోకి వెళ్లగానే కలుపు మొక్కల్ని పీకటం మొదలుపెట్టింది భ్రమరాంబిక.  దేదీప్యను కూడా పొలంలోకి దిగి తనలాగే చెయ్యమంది.  ఎండ చుర్రుమంటుంటే అత్తయ్య తోటి వంగి కలుపుమొక్కల్ని పీకింది దేదీప్య.

అక్కడ వుండేది అర ఎకరం పొలం.  ఆ పొలం కూడా సరిగా పండటం లేదని వాపోతూ దీపక్‌ దగ్గరకి వచ్చి నెలనెలా ఇంటి ఖర్చులని, పొలం ఖర్చులని చెప్పి డబ్బులు పట్టుకుపోతుంది భ్రమరాంబిక. పెద్దకొడుకు రాజకీయాలు మాట్లాడుకుంటూ కాలం గడుపుతుంటాడు.  బలరామయ్యకి వయసు మళ్లిందని ఫీలవుతుంటాడు.  వాళ్లలో ఒక్కరికి కూడా పనిపట్ల బాధ్యత లేదు.  అందుకే ఆరు ఎకరాల పొలం అర ఎకరం అయింది.

బావగారిని, తోడికోడల్ని చూస్తుంటే ఏ పనీ చేయకుండా అసలు ప్రయత్నమే చేయకుండా, నడవకుండా, అసలు నడవటమే రాకుండా గమ్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తుల్లా అన్పించారు దేదీప్యకి.  వాళ్లకి కష్టం తెలియటం లేదు.  కన్నీటి విలువ తెలియటం లేదు.  దీపక్‌ దగ్గర డబ్బు పట్టుకెళ్లి ఖర్చుపెట్టుకోవడం తప్ప దాన్ని సంపాయించడం అంత తేలిక కాదన్న విషయం వాళ్లకి తెలియటం లేదు.

పగలంతా కష్టపడి ఒళ్లునొప్పులుగా వుండటంతో రాత్రికి తిండి తినాలనిపించక మజ్జిగ తాగింది దేదీప్య.

‘‘నువ్వు వండింది నువ్వే తినలేకపోతే మేమెలా తింటామనుకున్నావ్‌! రుక్మిణి వంట బాగా చేస్తుంది. ఇవాళ తలనొప్పివల్ల వండలేకపోయింది. రుక్మిణి చేస్తే మా దీపక్‌ కూడా కడుపునిండా తింటాడు.’’ అంటూ అంతసేపు కష్టపడి చేసిన తన వంటకి వంకబెట్టి, తనని తీసివేస్తూ, పెద్ద కోడల్ని పొగుడుతుంటే దిగ్భ్రాంతికి లోనైంది దేదీప్య.

పొలంలో ముళ్లులు గుచ్చుకొని అరికాలు నొప్పిగా వుంది. గడ్డి కోసే అలవాటు లేక చేతులు బొబ్బలొచ్చాయి. ముక్కుల్లోకి బూజులు పోయి దగ్గు వస్తోంది.

బస్సెక్కగానే ‘‘ఎందుకలా దగ్గుతున్నావ్‌?’’ అన్నాడు దీపక్‌

‘‘నిన్న బూజులు దులిపాను కదా! అందుకే కావొచ్చు. నాకు డస్ట్‌ ఎలర్జీ వుందండి!’’ అంది.

‘‘నీకీ రోగం కూడా వుందా?’’ అన్నాడు ఆమె ముఖంలోకి సరిగ్గా చూడకుండానే.  బాధనిపించింది దేదీప్యకి.

మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది.

భర్త నుండి ఎప్పుడూ ఏమీ ఆశించకపోయినా ఇలాంటి టైంలో మాత్రం కాసింత ప్రేమని, లాలింపుని ఆశిస్తుంది.

ఈ రోజు యశోదర ఆంటీ రాకపోయివుంటే! టాబ్‌లెట్‌ లేక, నొప్పి తగ్గక, గవర్నమెంట్‌ హాస్పిటల్లో డాక్టర్లు  పట్టించుకోని అనాధరోగిలా పడివుండేది. పరాయి యశోదర అమ్మ అయింది.  అత్తేమో పరాయి దానిలా చూస్తోంది. యశోదర వైపు కృతజ్ఞతగా చూస్తూ….

‘‘ఆంటీ’’ అంది ఆర్థ్రత నిండిన స్వరంతో

వెంటనే దేదీప్య భుజంపై చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది యశోదర.

‘‘ఎక్కువగా ఆలోచించకు దేదీప్యా! ఇవాళ మహిళా మండలి వాళ్లు మీటింగ్‌ వుందని పిలిచారు. వెళ్లొస్తాను’’. అంటూ లేచింది యశోదర. అలాంటి మీటింగ్‌లకి అప్పుడప్పుడు దేదీప్యను తీసికెళ్తుంది.  అలా వెళ్ళినప్పుడు దీపక్‌ ఆఫీసు నుండి వచ్చేలోపలే దేదీప్య ఇంట్లో వుండేలా చూస్తుంది యశోదర.

యశోదర వెళ్లగానే ఆ వాతావరణం నిశ్శబ్ద్దంగా మారింది. ఆ నిశబ్దాన్ని భరించలేక, నొప్పి తగ్గగానే ఎప్పటిలా తిరుగుతూ భర్త ఆఫీసు నుండి రాగానే అతని అవసరాలు తీర్చింది.

ప్రేమగా వెళ్లి భార్య పక్క కూర్చున్నాడు దీపక్‌. అతనలా కూర్చోవటం వల్ల నెల మొత్తం అతన్ని శ్రద్దగా చూసుకోగలిగే మానసిక శక్తి వస్తుంది ఆమెకి. ఆ రహస్యం అతనెప్పుడో తెలుసుకున్నాడు.

* * * * *

ప్రపంచాన్ని నిద్రలేపిన సూర్యుడు బారెడు  పైకి ఎక్కినా దీపక్‌ నిద్రలేవలేదు.   రాత్రిళ్లు సరిగా నిద్రపోయినా, పోకపోయినా అతను ఆఫీసు టైం వరకు నిద్రపోతూనే వుంటాడు.  ఏ మాత్రం డిస్టర్బ్‌ చేసినా దేదీప్యను కేక లేస్తాడు.  అందుకే  దేదీప్య అతను ఇంట్లో వున్నా లేనట్లే మూగ యాక్టర్‌లా తిరుగుతుంటుంది.

భర్త అలా నిద్రపోవటం దేదీప్యకి నచ్చదు. త్వరగా నిద్రలేచి జిమ్‌కో, జాగింగ్‌కో వెళ్లొస్తే బావుంటుంది కదా అనుకుంటుంది. ఒకసారి దీపక్‌తో చెప్పటం కూడా జరిగింది. ఆమె వైపు వింతగా ఓ చూపు చూసి, చిన్న పిల్లను చూసి నవ్వినట్లు నవ్వి వదిలేశాడు.

అతను బాగా డ్రింక్‌ చేసినప్పుడు, విపరీతంగా స్మోకింగ్‌ చేసినప్పుడు భరించలేక ‘ఇది అలవాటుగా, మారకముందే మానుకోండి ! ప్లీజ్‌!’ అని బ్రతిమాలినా’ ఈ సమస్యకి పరిష్కారం ఇది. అని చెప్పినా అతను వినడు.

అతనేం చేస్తున్నా, అతనెలా వున్నా తనకి సంబంధం లేనట్లు వుండలేక వాధించటమో, నచ్చచెప్పటమో చేస్తే అసహనంగా అరుస్తాడు.  పైగా ‘‘నీ కన్నా పెద్దవాడిని నేను. నాకు చెప్పేంతటి దానివా నువ్వు?’’ అంటూ కోపంగా చూస్తాడు. అదీ కాక చేస్తున్న పనిమీద మనసు నిలపకుండా ‘‘నాకెన్ని పనులు ఎన్ని ఆలోచనలు?’’ అని విసుక్కుంటాడు.

ఇతనే ఇలా వున్నాడే ఇక రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు యింకెలా వుంటారో? వాళ్ల భార్యలకన్నా తనే బెటర్‌ కదా! అని మనసుకి సర్థి చెప్పుకుంటూ వంటగదిలో ఉల్లిగడ్డలు కోస్తున్న దేదీప్యకి కళ్లనీళ్లు వచ్చాయి.

“ఈ ఉల్లిగడ్డలేంటి రోజు నన్నిలా ఏడ్పిస్తాయి? దీపక్‌ కొట్టి, తిట్టి నన్ను ఏడ్పించటం లేదనా?’’ అని మనసులో అనుకుంటూ ఏం కూర వండాలో అర్థం కాక అయోమయంగా చూస్తోంది.

వంటకు సరిపోయ్యే సరుకులన్నీ దీపక్‌ ఒక్కసారిగా తేకపోవటంతో ఒకటి వుండి ఒకటి లేక వంట చేయ్యాలంటే చిరాగ్గా అన్పిస్తోంది.  అదేం అంటే ‘ఏదో ఒకటి చెయ్యి’ అంటాడు. ఏదో ఒకటి చెయ్యటానికి తన చేతిలో ఏమైనా అక్షయ పాత్ర వుందా? నాలుగువేళ్లు కలిస్తేనే పిడికిలి అన్నట్లు  అన్నీ వుంటేనే కదా వంట చేసేది. తను వెళ్లి తెస్తానంటే తన చేతికి డబ్బులివ్వటం మానేశాడు. అదేం అంటే ‘ఇప్పుడు నీకేం తక్కువైంది. మహారాణిలా ఇంట్లో కాలు బయటపెట్టకుండా బ్రతుకుతున్నావ్‌.’’ అంటాడు. ఎలాగోలా బ్రతకటమంటే ఇదే కాబోలు.  ఏది తెమ్మని చెప్పినా ఆఫీసు నుండి వచ్చేటప్పుడు మరచిపోయి వచ్చాను అంటాడు.  మళ్లీ వెళ్లి తెమ్మంటే బద్దకంగా ఫీలవుతాడు. అవసరమైనవి గుర్తు చేస్తే గొడవ పెట్టుకుంటాడు.  అతని  లాగా గొంతు పెంచి మాట్లాడడం ఆమెకి రాదు. అతను పెద్దగా మాట్లాడితేనే చుట్టు పక్కలవాళ్లు వింటారని వున్న ఒక్క కిటికీని గట్టిగా మూసుకుంటుంది.

నిన్న రాత్రి సరిగ్గా నిద్రలేక ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని ఆమె కళ్లు ఆశపడ్తున్నాయి. కాని భర్తకి లంచ్‌బాక్స్‌ సిద్ధం చెయ్యకుంటే నిప్పులు కురిపిస్తాడు. పక్కనే వున్న సింక్‌ దగ్గరకి వెళ్లి ముఖం మీద చల్లటి నీళ్లు చల్లుకొంది. నిద్రమత్తు వదిలింది.

నిన్న కరెంట్‌ పోవటంతో కాండిల్‌ వెలుగులో భోజనం చేసి పడుకుందామని డాబామీదకి వెళ్లారు. తిన్నాక పడుకున్న వెంటనే ఆ వెన్నెల్లో పిల్లతెమ్మరకి హాయిగా నిద్రపట్టింది దేదీప్యకి.

ఒక గంట గడవగానే….

‘‘దేదీప్యా! లే లోపలకెళ్దాం! ’’ అన్నాడు గాఢ నిద్రలో వున్న దేదీప్యను తట్టి లేపుతూ. . ఎంత నిద్రలో వున్నా నిర్దాక్షిణ్యంగా లేపుతాడు.  నిద్రలో వున్న మనిషిని సడన్‌గా లేపితే మళ్లీ నిద్రపట్టక అవస్థ పడ్తుందని ఆలోచించడు.

ఉలిక్కిపడి నిద్రలేచింది దేదీప్య.

‘‘ఇంకా కరెంట్‌ రాలేదు.  లోపలకెళ్లి ఎలా పడుకుంటామండీ?’’ అంది.

‘‘ఏంకాదులే పడుకోవచ్చు ఇలాగే మరచిపోయి నిద్రపోయామంటే మన మీద మంచు కురుస్తుంది. నీకు జలుబు చేస్తే, దానితో దగ్గొస్తే, ఆ తర్వాత జ్వరమొస్తే, అనవసరంగా హాస్పిటల్‌ ఖర్చులు నేను బేర్‌ చెయ్యలేను.’’  అంటూ ఆమెకన్నా ముందు దిండుపట్టుకొని క్రిందకెళ్లాడు.  దేదీప్యకిక తప్పలేదు.

లోపలకెళ్లి పడుకున్నారు. చీకటిగా వుంది గాలి లేదు. దోమలు జుమ్మంటున్నాయి. కొద్దిసేపు గాలి కోసం పేపర్‌పట్టుకొని విసురుకొంది.  దోమలు కుడుతుంటే దుప్పటి కప్పుకొంది. ఈ మధ్యనే తక్కువ రేటుకి ఇచ్చాడని దీపక్‌ రెండు దుప్పట్లు తెచ్చాడు.  చాలీ చాలని ఆ దుప్పట్లు కప్పుకుంటే కాళ్లుకప్పుకుంటే చేతులు, చేతులకి కప్పుకుంటే కాళ్లు బయటకొస్తున్నాయి. దోమలు ఎక్కడ కుడితే అక్కడ కొట్టుకుంటూ పడుకొంది.

‘ఏంటా చప్పుడు? నాకు నిద్రొద్దా?’’ అంటాడని భయంతో మెల్లగా సౌండ్‌ రాకుండా కొట్టుకుంటూ లేచి కూర్చుంది.

‘‘దోమలు ఎక్కువగా వున్నాయండి!’’ అని ఎప్పుడైనా అంటే చాలు వెంటనే ‘‘ఎందుకుండవు? అది నీ మహిమేగా. ఇంటి చుట్టూ పూలమొక్కల్ని పెంచావు. అదేదో కూరగాయల మొక్కల్ని పెంచినా ఖర్చుతగ్గేది. ఇప్పుడు చూడు దోమలెలా పెరిగాయో. కుట్టి, కుట్టి చంపుతున్నాయి.’’ అంటాడు. అప్పటి నుండి దోమలున్నాయని అనటం మానేసింది.

నిజానికి ఇంటి చుట్టు పక్కల మురికి కాలువలున్నాయి. చెత్తాచెదారం వుంది. మున్సిపాలిటీవాళ్లు పట్టించుకోరు.  ఇది దీపక్‌కి కూడా తెలుసు.

‘‘ఇంకెక్కడైనా మంచి ఇల్లు చూడండి!’’ అని దేదీప్య అంటే ….

‘‘పాష్‌ ఏరియాలో చూడాలంటే పర్స్‌ నిండా డబ్బుండాలి. అంతెక్కడుంది నా దగ్గర? నేనివ్వగలిగే ఈ అద్దెకి ఈ ఇల్లే ఎక్కువ. దీనికోసం కాళ్లు అరిగేలా తిరిగాను. నీకేం తెలుసు నా బాధ? ఏదో నోరుంది   కదాని అంటావు గాని అర్థం చేసుకొని మాట్లాడవు.’’ అంటాడు అప్పటి నుండి ఇంటి ప్రసక్తి తేవటం మానేసింది.

ఇంటి గురించే కాదు అతని దగ్గర ఏది మాట్లాడాలన్నా ఎలా వుండాలన్నా భయమే దేదీప్యకి. ఒకరోజు యశోదరతో మీటింగ్‌కి వెళ్లాలని తన డ్రస్‌ ఐరన్‌ చేయించుకొని దీపక్‌ని డబ్బులడిగితే ‘‘ఇంట్లోంచి బయటకి పోని నీకు ఐరన్‌ చేసిన బట్టలెందుకు? ఎలా కట్టుకున్నా గడిచిపోతుంది కదా! డబ్బులెందుకలా ఖర్చు చేస్తావ్‌?’’ అంటూ ముఖం అదోలా పెట్టుకున్నాడు.

దీపక్‌ లాంటి భర్త నీడలో` కొన్ని అభిరుచుల్ని చంపుకుంటేనే నల్లేరు మీద నడకలా హాయిగా సాగుతుంది జీవితం అని అర్థం చేసుకొంది దేదీప్య.

ఆఫీసుకి టైమయిందనుకుంటూ కప్పుకున్న దుప్పటిని విసురుగా తన్నేసి నిద్రలేచాడు దీపక్‌. లేవగానే టి.వి. పై వున్న  చలం స్త్రీ బుక్‌ని విసిరి నేలకేసి కొట్టాడు.

ఆ శబ్దానికి ఆలోచనలోంచి బయటకొచ్చిన దేదీప్య వంటగదిలోంచి తొంగిచూసింది.

క్రింద పడ్డ బుక్‌వైపు, అక్కడే నిలబడివ్ను దీపక్‌ వైపు చూస్తూ శిలాప్రతిమలా అయింది.

కావాలనే అతనా బుక్‌ని అలా విసిరికొట్టాడు. అతని పనులకి ఆ బుక్కేమి అడ్డురాదు. పుస్తకాలు చదవటం అతనికి ఇష్టం వుండదని తెలిసే అతను వున్నప్పుడు ఏ పుస్తకం ముట్టకోదు. రోజంతా గంటల తరబడి అతని సేవలోనే, అతని అవసరాలు తీరుస్తూనే గడుపుతుంది. బుక్స్‌ చదవటమంటే తనకిష్టమని తెలిసి కూడా తన ఇష్టాన్ని ఓర్వలేకపోతున్నాడు. గౌరవించలేక పోతున్నాడు.  ఆర్థికపరిస్థితిని అర్థం చేసుకొని అడ్జస్ట్‌ కావటం కష్టం కాదుగాని ఓర్వలేని తనాన్ని, సంకుచిత తత్వాన్ని భరించాలంటే బాధగా వుంటుంది.

 

వెంటనే వెళ్లి క్రిందపడ్డ పుస్తకాన్ని తెచ్చి వంటగదిలో పెట్టుకొంది. ఆ పుస్తకాన్ని నిన్ననే యశోదర దగ్గర నుండి తెచ్చుకొంది.

‘‘స్కూల్‌ కెళ్లే పిల్లలా పుస్తకాలు ముందేసుకుని కూర్చోటానికా నిన్ను పెళ్లి చేసుకొంది? ఇప్పటికే మొగుళ్ల మీద తిరగబడి పనులు చెయ్యకుండా మొండి కేస్తున్నారు. ఇంక ఈ పుస్తకాలు కూడా చదివితే మిమ్మల్ని మేమేదో కట్టేసి చితకబాదుతున్నట్లు ‘స్వేచ్ఛ’ కావాలంటారు. ఇంకెప్పుడూ ఇలాంటి పుస్తకాలు నా కంట పడటానికి వీల్లేదు.’’ అంటూ గట్టిగా ఆవేశంగా అరిచాడు.

అతని ఆవేశం చూసి అలాగే నిలబడిపోయింది.

అయినా పుస్తకాలు చదివేంత టైం తనకెక్కడుంది?  నిద్రలేచి నీళ్లు చల్లి ముగ్గేసిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒకపని చేస్తూనే వుంటుంది. ఈ రోజు పనేకాదు రేపటి పని గురించి కూడా ఆలోచిస్తూ ఈ రోజు సరిగ్గా చేశానో లేదోనని,  చేసిన పనికి ఎన్ని వంకలు పెడ్తాడోనని కంగారు పడ్తూ బ్రతుకుతోంది.

అతనికి ఇష్టం లేదు కదాని పుస్తకాలు చదవటం మానేద్దామని ఎప్పటికప్పుడు అనుకుంటూనే వుంటుంది. అదేం ఆకర్షణో పుస్తకాలు కన్పిస్తే చేతులు వదలటం లేదు. ఏదైనా పొట్లంకు వచ్చిన పేపర్ని అయినా సరే త్వరత్వరగా కట్లు విప్పినట్లు విప్పి చదువుతుంది. అందులో తనకి దొరికే తృప్తిని చూస్తుంటే ఒక్కోసారి దేదీప్యకే దిగ్భ్రమ కలుగుతుంది. జీవితంలో అప్పటి వరకు తెలియందేదో తెలుసుకున్నానన్న ఆనందం ఆమెను చుట్టేస్తుంది.

‘‘దేదీప్యా! ఏమిటా పరద్యానం ? చెయ్యి కోసుకోగలవు.’’ అన్నాడు ఆమెనే చూస్తూ దీపక్‌.

ఉలిక్కి పడింది దేదీప్య.

‘‘నువ్వు వంట పూర్తి చేసి బయటకొచ్చేవరకు నాకు భయంగా వుంటుంది. నీ ద్యాసలో నువ్వుండి ఎక్కడ కాల్చుకుంటావో, ఎక్కడ కోసుకుంటావో అని. నీకేదైనా జరిగి హస్పిటల్‌కి వెళ్లాలంటే మాటలు కాదు. మందులు కాని, డాక్టర్ల ఫీజులు కాని తక్కువ వున్నాయా చెప్పు. ఏ రేట్లు  చూసిన అదిరిపోతున్నాయ్‌!’’

అనుకుంటూ అక్కడి నుండి కదలి బాత్‌రూంలోకి వెళ్లాడు.

ఎటుతిరిగినా దీపక్‌ మాటలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. ఆప్యాయత,మమకారం, ఆ డబ్బును డామినేట్‌  చెయ్యలేక ఉసూరుమంటూ ఓ మూలన కూర్చున్నాయి.

ఒకప్పుడు`గోరింటపండిన ఆమె ఆరచేతులు మంకెనపువ్వుల్లా మెరుస్తుంటే మంచి మొగుడు వస్తాడని వదిన ఆటపట్టించేది. అది విని అన్నయ్య మురిసిపోయేవాడు. అన్నయ్య, వదిన చూపిన గారాబం, ప్రేమ, అడగకముందే అన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ల ఔదార్యం కళ్లముందు మెదిలింది. దాని పక్కనే నేనున్నానంటూ బాగా ముదిరిన గందపు మాను పరిమళంలా, అభిరాం గుర్తొచ్చాడు. అతని జ్ఞాపకం మల్బరీ కొమ్మల్లోంచి వేలాడుతున్న తేనెపట్టును అప్పటికప్పుడు తననోటిలో పిండినట్లు అన్పించింది. తన మనసులో ఓ మూలగా అతన్ని ప్రతిష్టించుకొని ప్రేమించానని చెబితే అతను  తనను కాదన్న రోజున ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లటం గుర్తొచ్చింది. ఒక్కక్షణం ఆ జ్ఞాపకాలన్నీ ఓ ప్రళయంగా మారి గతం గత: అన్నట్లు వెంటనే మాయమయ్యాయి.

కానీ ఇప్పుడామె మనసు దీపక్‌ చుట్టే పరిభ్రమిస్తోంది. అతను తనను ప్రేమగా చూసుకోవాలని అనుకుంటోంది. ప్రతి మనిషీ ప్రేమకావాలని ఎలా కోరుకుంటారో ఆమె కూడా దీపక్‌ నుండి ప్రేమను ఆశిస్తోంది. ఒక ఇంట్లో వుంటున్నప్పుడు ఈ ఆపేక్ష తప్పనిసరి. ఇద్దరి అవసరాలు ఒకరివి మరొకరు తెలుసుకోవటం ఎంతో అవసరం. అతను బయటకి చెప్పకపోయినా అతని మనసెరిగి ఆమె ప్రవర్తించేది కూడా ఆ  ప్రేమకోసమే.

ప్రేమంటే ఒక ఆర్థ్రత. గుండెను సున్నితంగా తాకే బావావేశం. ప్రేమంటే అవగాహన. ప్రతిక్షణాన్ని ఎదుటివైపు నుండి చూడగలిగే విశ్వసనీయత. మనకే తెలీని మన ఆలోచనల అయోమయంలో వెంటాడే ఏకాకితనంలో ‘నీకు నేనున్నా’నని అక్కున చేర్చుకునే ఆలంబన కానీ దీపక్‌ నుండి తనకి అలాంటి ప్రేమ దొరకటంలేదు.  ప్రేమలేని అనుబంధాన్ని కొనసాగించడమంటే ఇదేనా! సమాజం కోసం నటించడమన్నా ఇదే కావొచ్చు

భర్తలు ఎలా చూసినా కొంతమంది భార్యలు అన్నిటికి తమ దగ్గర జవాబులు వున్నట్లుగా భావించి సర్దుకుపోతుంటారు.

దేదీప్య కూడా ఇప్పుడు అదే పనిలో వుంది. ఎలా అంటే ఇలాంటివి పట్టించుకుంటే కుదరదని తెలసిన జ్ఞానిలా, స్థితప్రజ్ఞలా. నిస్తేజమైన చూపులతో, ఏ మాత్రం స్పందన లేని హృదయంతో వంటింట్లో తాళింపు మోతతో తన భవిష్యత్తును ఆవిష్కరిస్తున్నట్లు అలాగే నిలబడింది.

దీపక్‌ ఆఫీసుకి వెళ్లగానే అన్నయ్య, వదిన, బాబు గుర్తొచ్చారు.  ఫోన్‌ చేసి మాట్లాడదామంటే ఆమె దగ్గర డబ్బుల్లేవు. వాళ్లు ఫోన్‌ చేసినప్పుడు ‘పనిలేని వాళ్లలా ఏముంటాయి మాట్లాడటానికి? ’’ అంటూ ఏదో మొక్కుబడిగా మాట్లాడి కట్‌ చేస్తుంటాడు దీపక్‌’ ఒక్కోసారి వాళ్లు కాల్‌ చేసినా తనకి చెప్పడు.

ఈ రోజెందుకో తను చేస్తున్న పని తప్పనిసరై చేస్తున్నట్లు ఏ మాత్రం ఉత్సాహం లేకుండా బలవంతంగా చేసి అలసిపోయిన దానిలా కూర్చుంది. ఎంత అలసిపోయినా సరే ఏ పనీ తప్పటం లేదు దేదీప్యకు.

అతను ఇంట్లో వున్నంతసేపు దేదీప్య కూర్చున్నా, పడుకున్నా ఓర్వలేడు. ‘ఎప్పుడూ పడుకోవటమే గా నీ పని!’ అంటూ పొడిచినట్లు మాట్లాడతాడు. ఎవరైనా చూస్తే ‘ దీపక్‌కి  పనిపట్ల ఎంత అంకిత భావమో’ అనుకుంటారు కాని ‘అయ్యో పాపం! దేదీప్య అలసిపోతుందే’ అని మాత్రం అనుకోరు.‘ఈ ఇంటికి ఇల్లాలివి నువ్వే కాబట్టి ఇంటిని చక్కదిద్దాలి. ఇంటిపనంతా చచ్చినట్టు నువ్వే చెయ్యాలి’ అన్నట్లుగా చూస్తారు.

సంపాయించేది అతనే కాబట్టి డబ్బు మీద అధికారం కూడా అతనిదే. ఖర్చు పెట్టినా, అనుభవించినా అతనికే అర్హత వున్నట్లు ప్రవర్తిస్తుంటాడు.  ఇది మరీ ఇబ్బందిగా వుంది దేదీప్యకి.

ఇల్లంటే సుఖం, ఆనందం, ఆహ్లాదం, అని నమ్మిన దేదీప్యకి బట్టలుతకడం, ఇల్లు తుడవటం, వంటా`వార్పూ వచ్చిన వాళ్లకి మర్యాదలు చేసి పంపటం ఎక్కడ  ఏ లోపం కన్పించినా వాళ్లు దెప్పటం, వాళ్లు వెళ్లాక దీపక్‌ దేనిమీదో ఒకదానిమీద దెబ్బలాడటం. ఇదీ నిత్యకృత్యం.

ఆదమరచి నిద్రపోతున్న దేదీప్య ఫ్యాన్‌ ఆగిపోవటంతో గాలి రాక లేచి కూర్చుంది.

ఇదో దౌర్భాగ్యం! ప్రతి వ్యక్తిలో ఎంతటి దౌర్భాగ్యాన్నైనా భరించే శక్తి వుంటుందంటారు ఇదేనేమో. ఎంతగాఢ నిద్రలోవున్నా ఫ్యాన్‌ ఆపేసి బయటకెళ్లి కూర్చుంటాడు దీపక్‌.

బాధ, కోపం మిళితం కాగా, వాటిని అణచుకుంటూ బయట కుర్చీలో కూర్చునివున్న దీపక్‌ దగ్గరికి వెళ్లింది దేదీప్య.

‘‘మీరు నన్ను నిద్ర లేపాలనుకుంటే తట్టి లేపండి! అంతేకాని యిలా ఫ్యాన్‌ ఆపి లేపటం నాకు ఇబ్బందిగా వుంటుంది.’’ అంది.‘ ఇది నాకు ఇబ్బంది’ అని యింతవరకెప్పుడు ఇంత కచ్ఛితంగా చెప్పలేదు.

‘‘నిద్రపోయేవాళ్లను తట్టిలేపితే కంగారుపడ్తారని మా అమ్మ కూడా మమ్మల్ని ఇలాగే లేపుతుంది. లేకుంటే ఇరవైనాలుగు గంటలు ఫ్యాన్‌ తిరిగితే మా బాబేమైనా కోటిశ్వరుడా? మేం చాలా పద్దతుల్లో పెరిగాం’’అన్నాడు.

‘‘నేనేనా పద్దతుల్లో పెరగనిది?’’ అంది దేదీప్య ఆవేశంగా అంత ఆవేశంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రోజెందుకో ఆమె మార్పు ఆమెకే వింతగా వుంది.

‘‘డిస్కషన్‌ ఎందుకులే. లోపలకెళ్లి కాఫీ కలిపివ్వు.’’ అన్నాడు ప్రశాంతంగా. ఆమెను రెచ్చగొట్టుకోవడం ప్రస్తుతం తగని పనిగా భావించాడు.

లోపలకెళ్లి స్టౌమీద పాలు పెట్టి ఆలోచిస్తూ నిలబడింది దేదీప్య.

భార్య స్థానంలో వుండే ఏ అమ్మాయి అయినా తనలాగే వుంటుందా? రక్తం వుడుకుతున్నా నోరుమూసుకొని గుట్టుగా వుంటారా? లేక ఇంకొకలాగా వుంటారా?

‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్‌! కాఫీ తెమ్మని అర్థగంట అయింది.’’ అంటూ లోపలకొచ్చాడు దీపక్‌.

నాకిప్పుడేం తక్కువైందని ఆలోచించాలి? పూచికపుల్ల పక్కన పెట్టని భర్తలు అక్కడక్కడ కన్పిస్తూనే వున్నారు. బార్యలకి ఇంట్లో పెత్తనం యివ్వకుండా పనిమనుషుల్లా చూసే భర్తల్నే చాలా ఇళ్లలో పూజిస్తున్నారు. బాత్‌ రూంలో లైటు ఆపటం మరచిపోయిందని దెబ్బలు తినే భార్యలు కొన్నిచోట్ల, నిశ్బబ్ధంగా ఏడుస్తూనే వున్నారు.  అని మనసులో అనుకుంటూ మౌనంగా వుంది.

‘‘పలకవేం?చెవుడు కూడా వచ్చిందా?’’ అంటూ గట్టిగా అరిచాడు దీపక్‌.

“చెవుడు కూడా వచ్చిందా? అంటున్నాడు. అంతకుముందు యింకేమైనా వచ్చిందా తనకు? అసలే ఆలోచనలో వున్న దేదీప్యకి ఇదో కొత్త డౌట్‌ తోడైంది.

‘‘సరే! సరే! నీకీ ఏడుపు కొత్తదేం కాదుగా పెళ్లైనప్పటి నుండి యిలా ఆలోచిస్తూనే గడుపుతున్నావ్‌! ఆ బుర్రలో ఏముందో ఏమో కనుక్కోలేక చచ్చిపోతున్నా. త్వరగా కానియ్‌! నాకవతల చాలా పనుంది.’’ అంటూ ఎప్పటిలా వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు.

దీపక్‌ తన మీద ఎందుకింత డామినేషన్‌ చూపిస్తున్నాడు?  భర్తనన్న ఈగో వల్లనా? భర్తలంతా ఇలాగే వుంటారా? ఎప్పుడైన మాటకి మాట సమాధానం చెప్పందే నిద్రపోని తను దీపక్‌ ఎంత నొప్పించినా తనను కానట్లే నటిస్తుందేం?’’

‘‘దేదీప్యా!’’కేకేశాడు దీపక్‌. అయినా అతను కోప్పడటం తను బాధపడటం మామూలేగా అనుకుంటూ…

‘‘ఆ… వస్తున్నా!’’ అంటూ కాపీ తీసికెళ్లి దీపక్‌కి యిచ్చి, అతనేదో ఆ నెల బడ్జెట్‌ రాస్తుంటే చూస్తూ ఏదో గుర్తొచ్చిన దానిలా ….

‘‘నిన్న సినిమాకెళ్దామన్నారుగా! రెడీ అవుతాను. ఇవాళ వెళ్దామా?’’ అంది మెల్లగా దేదీప్య.  ఆమెకు ఇంట్లో వుండి బోర్‌గా వుంది. పెళ్లైన తర్వాత ఓ సరదా లేదు. భర్తతో బయటకెళ్లింది లేదు.

ఆమె మాటలకి చిరాకుపడ్తూ….

‘‘ఇప్పటికే ఈ జీతంతో అమ్మవాళ్లకెంత పంపాలి. ఇంట్లో ఎంత సర్దాలి. అన్నది అర్థంకాక చస్తుంటే ఇప్పుడ నీకు సినిమాలు, షికార్లు కావలసివచ్చాయా?’’ అన్నాడు.

చిన్నబుచ్చుకొంది దేదీప్య.

‘‘మనిషన్నాక బుద్దుండాలి కష్టం,సుఖం ఆలోచించే జ్ఞానం వుండాలి. నీకిప్పుడు కావలసింది సినిమాకెళ్ళాలన్న సరదా కాదు. సినిమా అంత అవసరం కూడా కాదు.’’ అన్నాడు దేదీప్యనే చూస్తూ కటువుగా.

దేదీప్య నేల వైపే చూస్తూ నిలబడింది.

‘‘నెలాఖరు కాబట్టి నా దగ్గర డబ్బుల్లేకపోయినా మొన్ననేగా ఇంట్లోకి ఏదో లేదని చెబితే తెచ్చిపెట్టాను. మళ్లీ సినిమా అంటే డబ్బులు సరిపోవద్దా?’’ అన్నాడు.

మససులో ముళ్లు దిగినట్లైంది. ఎందుకడిగానా అనుకొంది.

‘‘నీక్కూడా ఉద్యోగం వుంటే ఇవన్నీ లెక్కలోకి వచ్చేవి కావు. సినిమాకు వెళ్లాలన్నా, హోటల్‌కి వెళ్లి తినాలన్నా? ఎక్కడికైనా వెళ్లి సరదాగా తిరగాలన్నా ఆలోచించాల్సిన అవసరం రాదు.’’ అన్నాడు దీపక్‌.

‘‘ఆడవాళ్లు ఉద్యోగాలు చెయ్యటం మీ కుటుంబంలోనే లేదన్నారు పెళ్లప్పుడు.  మళ్లీ ఈ మాటలేంటి?’’ అంది దేదీప్య ఆశ్చర్యపోతూ.

ఆమె అలా అనగానే అతని ముఖంలో నెత్తుటి చుక్కలేనట్లు పాలిపోయింది.

‘‘చూడు దేదీప్యా! ఇన్ని రోజులు నీకు అర్థమైందో లేదో మళ్లీ చెబుతున్నా విను. నేను నా తమ్ముడ్ని చదివించుకోవాలి.  ఏ పనీ చేతకాని అమాయకుడైన మా అన్నయ్య ఫ్యామిలీని పోషించుకోవాలి. మా అమ్మానాన్నల బాద్యత కూడా నాదే.  ఇవన్నీ ముఖ్యంగా నేను చూసుకోవలసిన అవసరాలు. నీకు ఇంతకన్నా మెరుగ్గా బ్రతకాలని వుంటే ఏదైనా జాబ్‌ చెయ్యి.’’ అన్నాడు.

‘‘నా జాబ్‌ విషయం పక్కన పెట్టండి. అన్ని బాధ్యతలు మీవే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మీ అన్నయ్యకేం బాధ్యత లేదా? వాళ్లంతా రిటైరైన ముసలివాళ్లలా తిని కూర్చుంటే మీరేమో ఇక్కడ నన్ను…… అసలు నన్ను పెళ్లెందుకు చేసుకున్నారండీ! గాలిని భోంజేస్తూ బ్రహ్మచారిలా ఓ రూంలో వుండి మీ లక్ష్యాలను మీరు సాధించుకొని వుంటే సరిపోయేదిగా?’’ అంది.

‘‘వ్యంగ్యంగా మాట్లాడేవాళ్లంటే నాకు ఒళ్లుమంట. ఆడదానివి ఆడదానిలా నోరుమూసుకో.  మా ఫ్యామిలీ మ్యాటర్‌లో తలదూర్చకు ఇప్పుడే కాదు. ఇంకెప్పుడు కూడా….’’అన్నాడు సీరియస్‌గా.

‘‘మీతో కలిసి ఏడు అడుగులు నడచినప్పటి నుండి మీతోనే జీవితాన్ని పంచుకుంటున్నాను కదా! మీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అంటూ విడివిడిగా రెండు ఫ్యామిలీలు వున్నాయా? తల్లిదండ్రులకి తిండిపెట్టొదని, ఫ్యామిలీ మెంబర్స్‌ని పట్టించుకోవద్దని నేను అనటం లేదు. నన్ను కూడా మీ మనిషిలా భావించి నా అవసరాలను కూడా గుర్తించాలి కదా?’’ అంది దేదీప్య.

‘‘నీ అవసరాలు తీరకపోతే….మీ అన్నయ్య దగ్గర నుండి వచ్చినప్పటి నుండి ఎలా బ్రతికావ్‌? అయినా నీతో వాదించే ఓపిక నాకు లేదు చేతనైతే జాబ్‌ చేసి చూపించు. లేదంటే నోరుమూసుకొని పనిచూడు.’’ అన్నాడు.

‘‘నాచేత జాబ్‌ చేయించాలన్న పట్టుదల యింత తీవ్రంగా వున్నప్పుడు మధ్యలోనా ఎం.బి.ఎ.ను డిస్టర్బ్‌ చేయకుండా వుండాల్సింది. ఇప్పుడు ప్రాజెక్టు వర్క్‌ చేస్తుండేదానిని. అది పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో జాబ్‌ రావటానికి చాన్స్‌ వుండేది’’. అంది దేదీప్య ఏ మాత్రం కదలకుండా అక్కడే నిలబడి.

‘‘జాబ్స్‌ చేసేవాళ్లంతా ప్రొఫెషనల్సే అయినట్లు మాట్లాడకు. డిగ్రీలు చదివిన వాళ్లు కూడా జాబ్స్‌ చేస్తున్నారు.’’ అన్నాడు.

అతని మాటలు వింటుంటే ఆమోమయంగా వుంది దేదీప్యకి.  ఇప్పుడు తనేం చేయాలి? తనని తను పోషించుకోవటం కోసం ఉద్యోగం వెతుక్కోవాలా? వెతుక్కుంటే తప్పులేదు కాని అన్నయ్య తనకీ పెళ్లెందుకు చేసినట్లు! ఉద్యోగం చేసుకుంటూ తనని తను పోషించుకోటానికా? చాలమంది అమ్మాయిలు  పెళ్లి అవగానే తనకేదో పెద్ద ఉద్యోగం దొరికినట్లు భావిస్తుంటారు కదా! అదంతా నిజం కాదా! పెళ్లయితే చాలు అన్ని కష్టాలు తీరుతాయన్నట్లు అన్నయ్య, వదిన ఎంతగానో మురిసిపోయారు.  దీపక్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయి అని కూడా అందరితో గొప్పగా చెప్పుకున్నారు.ఆ ధైర్యంతోనే వాళ్లు తనని దీపక్‌ చేతిలో పెట్టారు.

‘‘లోపలకెళ్లి తలుపేసుకొని ఆలోచించుకో. నేను బయటకి వెళ్తున్నా’’. అంటూ అతను బయటకెళ్లాడు. దేదీప్య లోపలకెళ్లింది.

* * * * *

యశోదర వాళ్ల అబ్బాయికి పెళ్లి బట్టలు కొనటం కోసం షాపింగ్‌కి వెళ్దామని చెప్పగానే దీపక్‌ని ఆఫీసుకి పంపి రెడీ అయి వెళ్లింది దేదీప్య.

కారు డ్రైవింగ్‌ దేదీప్య  చేస్తుంటే దేదీప్య  పక్కన కూర్చుంది యశోదర.

గొప్పపేరున్న క్లాత్‌షోరూం దగ్గరికి వెళ్లగానే కారాపింది దేదీప్య.

కారుదిగి వాళ్లిద్దరు షాపులోకి వెళ్లారు.

అక్కడ నిలబడి వున్న ఒక అబ్బాయిని చూపిస్తూ తన కొడుకు అలా వుంటాడని తగిన డ్రస్‌లు సెలక్ట్‌ చేద్దామని దేదీప్యతో చెప్పింది యశోదర.

ఇద్దరు కలసి యశోదర కొడుక్కి పెళ్లి బట్టలు సెలక్ట్‌ చేసి కొన్నారు. అలాగే కాబోయే కోడలికి కూడా కొన్ని నగలు, చీరలు కొన్నారు. కోడలిపట్ల యశోదరకి వున్న ప్రేమాభిమానాలు ఆమెకు సెలక్టు చేసిన నగలు, చీరల్లో కన్పించాయి. ఆ అమ్మాయి ఎవరో కాని బంగారు పూలతో పూజ చేసుకొనివుంటుంది అనుకొంది దేదీప్య.

షాపింగ్‌ చెయ్యటం పూర్తయ్యాక రెస్టారెంట్‌కెళ్లి కూర్చున్నారు. వాళ్ళెప్పుడు షాపింగ్‌కి వచ్చినా అదే రెస్టారెంట్‌కి వెళ్తారు.

వెయిటర్‌ రాగానే యశోదర ఆర్డర్‌ చేస్తూ దేదీప్య  కి ఏది ఇష్టమో చూడమని మెనూ కార్డుని ముందుకి జరిపింది.

పరధ్యానంగా వున్న దేదీప్య మెనూ కార్డుని చూడలేదు.  దేదీప్యకి ఇష్టమెనౖ ఐటమ్స్‌ ఏమిటో తనకి తెలుసు కాబట్టి వెయిటర్‌తో చెప్పి పంపింది యశోదర.

‘‘ఏంటి దేదీప్యా! అలా వున్నావు? ఏం జరిగింది? దీపక్‌ ఏమైనా అన్నాడా?’’ అంది యశోదర దేదీప్య చేయిపై తన చేయివేసి. ఆప్యాయంగా తడుముతూ.

యశోదర చేతి స్పర్శకి దేదీప్య మనసు కళ్లు చెమర్చాయి.

చిన్న, చిన్న ఆనందాలకి కూడా తనని దూరం చేస్తూ, ఎప్పుడు చూసినా తన మీద కోపంగా, విసుగ్గా వున్న దీపక్‌ తో తనకెంత అసంతృప్తిగా వుందో తల్లిలాంటి యశోదరకి అప్పుడప్పుడు చెప్పుకుంటుంది దేదీప్య .  భార్యా,భర్త అన్నాక ఆ మాత్రం అసంతృప్తి వుంటుందని అందమైన అబద్దం చెప్పి దేదీప్యను మభ్యపెట్టి ‘కొన్ని జీవితాలు ఇంతే’ అని మనసులో బాధపడ్తుంది యశోదర.

‘‘దీపక్‌ నన్ను జాబ్‌ చెయ్యమంటున్నాడు ఆంటీ’’ అంది దేదీప్య  .

‘‘అంత అవసరం ఏమొచ్చింది? అతనికి జాబ్‌ వుందిగా. నువ్వేమైనా కార్లు, బంగళాలు, నగలు, నాణ్యాలు అడుగుతున్నావా!’’ అంది యశోదర.

‘‘అదేం లేదాంటీ! తనవాళ్ల అవసరాలన్నీ ఆయనే చూసుకోవాలట.  అది ఆయన ఫ్యామిలీ అట. బాధ్యతట, నాకోసం నేను జాబ్‌ చూసుకోవాలట.’’ అంది క్లుప్తంగా.

దీపక్‌ అభిప్రాయం యశోదరకు నచ్చలేదు. అతని మాటలు దేదీప్యనెంత గాయపరిచాయో చూస్తేనే తెలుస్తోంది. దేదీప్యనే కాదు ఆత్మాభిమానం గల ఏ అమ్మాయినయినా ఆ మాటలు బాధపెడ్తాయి.

ఏ అమ్మాయి అయినా తనని ప్రేమిస్తూ, తనని భరించే భర్తను కోరుకుంటుంది. తనని తను అర్పించుకోవడం కూడా దాని కోసమే అంత బాధ్యత లేకుండా మాట్లాడిన దీపక్‌లో ఇకపై ప్రేమను, ఆప్యాయతను కోరుకోవడం వృధాప్రయాస.  ముఖ్యంగా భర్త దగ్గర ఏ భార్య అయినా తృప్తితో పాటు ఆర్థిక భద్రతను ఆశిస్తూ ఇష్టపూర్వకమైన ప్రశంస కోసం ఇంటెడు చాకిరీ చేస్తూ, ఆ ఇంటిని తన ప్రపంచంగా మార్చుకుంటుంది. అటువంటప్పుడు భార్యకు తెలియకుండా ఆర్థిక విషయాల్లో దీపక్‌ తన సొంత  నిర్ణయాలు తీసుకుంటూ అవి తన అవసరాలుగా, బాధ్యతలుగా మాట్లాడటం కూడా సమంజసం కాదు.

‘ఆంటీ! నాకు జాబ్‌ చెయ్యాలని వుంది. కానీ జాబ్‌ చేసుకుంటూ నా హడావుడిలో నేనుంటే ` ప్రతిరోజు చిన్న పిల్లాడిలా నా మీద ఆధారపడే దీపక్‌కి ఇబ్బంది అవుతుందేమోననిపిస్తుంది’’. అంటున్న దేదీప్య మాటలకి ఆశ్చర్యపోయింది యశోదర.

అతనెంత దూరం చేసి మాట్లాడినా, దగ్గరగా భావిస్తున్న దేదీప్యతో తనిప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా మాట్లాడినా అపురూపమైన వాళ్లు కుటుంబ జీవనానికి అవసరమైన పునాదులు బీటలు వారిపోతాయి. పెద్దదానిగా తను చెప్పాల్సిన మాటలు తను చెప్పాలి అనుకొంది.

‘‘నీలాంటి వాళ్లు ఎంతమంది ఉద్యోగాలు చెయ్యటం లేదు చెప్పు. ఈ రోజుల్లో ఇద్దరు కలసి పనులు చేసుకుంటేనే కుటుంబం సవ్యంగా నడుస్తుంది.  మరి అలాంటి భద్రమైన భవితకోసం బాట వేసుకోవాలనుకున్నప్పుడు కాస్త సర్దుబాటు, కొన్ని ఇబ్బందులు తప్పవు. కాలక్రమేణ అన్నీ అవే సర్దుకుంటాయి.’’ అంటూ ఆత్మవిశ్వాసం నూరిపోసింది.

హోటల్‌ బిల్‌ పే చేసి ఇద్దరు వెళ్లి కారులో కూర్చున్నారు.

దేదీప్య కారు దిగుతుంటే ` భ్రమరాంబిక ఎప్పుడొచ్చిందో ఏమో దేదీప్య కోసం ఎదురు చూస్తోంది.

అత్తగారిని చూడగానే గబగబ వెళ్లి తాళం తీస్తూ.

‘‘బావున్నారా అత్తయ్యా! ప్రయాణం బాగా జరిగిందా?’’ అంది దేదీప్య

‘‘మా ప్రయాణాలు నీలాగా కారులో కాదుగా బావుండటానికి. ఎర్రబస్కెక్కి ఆగుతూ, ఆగుతూ వచ్చాను. ప్రాణం బేజారెత్తింది.’’ అంది కాస్త వ్యంగ్యంగా మరికాస్త విసుగ్గా.

దేదీప్య అదేం గమనించనట్లు ఆమె చేతిలో బ్యాగు అందుకొని…

‘‘లోపలికి రండి అత్తయ్యా! కూర్చోండి! ’’ అంటూ లోపలకి వెళ్లాక కుర్చీని కాస్త ముందుకు జరిపింది కూర్చోమన్నట్లు…

ఆమె కూర్చోలేదు.  మాటల్ని వెతుక్కుంటోంది. ఎలా మాట్లాడితే దేదీప్య ఎక్కువగా బాధపడ్తుందా అని.

‘‘మంచినీళ్లు త్రాగండత్తయ్యా!’’ అంటూ గ్లాసు పట్టుకొని దగ్గరకొచ్చిన దేదీప్య వైపు చూసి,

కసినంతా కళ్లలోకి తెచ్చుకుంటూ.

‘‘మొగుడ్ని ఆఫీసుకి పంపి, ఇల్లు`వాకిలి వదిలేసి కార్లలో తిరగమని మీ అన్నయ్య అమెరికా పోతూ చెప్పి వెళ్లాడా? ఇవేనా చదువుకున్న  లక్షణాలు?’’ అంటూ వీలైనంత కఠినంగా

భ్రమరాంబిక మాట్లాడుతుంటే కిటికీ అవతలవున్న యశోదరకు స్పష్టంగా విన్పిస్తూ స్థాణువై నిలబడిరది.

దేవుడు దేదీప్యకి అత్త విషయంలో కూడా అన్యాయం చేశాడనుకొని, తనవల్ల అనవసరంగా దేదీప్య మాటలు పడ్తుందన్న బాధతో వెంటనే వెళ్లి ఏ పని మీద దేదీప్యను బయటకు తీసికెళ్లిందో చెబుదామనుకొంది యశోదర.

‘‘ఆంటీ పిలిస్తే వెళ్లానత్తయ్యా!’’ అని చెప్పాలని నోటి వరకు వచ్చినా చెప్పకుండా ఆగిపోయింది దేదీప్య.  చెబితే యశోదరను కూడా ఏమైనా అంటుందేమోనన్న భయంతో. యశోదర అంటే దేదీప్యకి గౌరవం. గౌరవానికి అర్థం తెలియని భ్రమరాంబికకి యశోదరను దూరంగా వుంచాలన్నదే ఆమె అభిప్రాయం.

‘‘మామయ్యగారు బాగున్నారా అత్తయ్యా?’’ మెల్లగా ప్రశ్నించింది.

దేదీప్యను చుర చుర  చూస్తూ…

‘‘ఒక్క మామయ్యగారినే అడుగుతున్నావ్‌! నీ తోడికోడలిని, బావగార్ని, వాళ్ల పిల్లాడిని  అడగాలని తెలియదా? తెలియక కాదులే. వాళ్లంటే నీకు అసూయ.  నీ మొగుడి సంపాదన తింటున్నారని నీకు కక్ష. అయినా అంత కుళ్లెందుకు నీకు? ఇదేమైనా నీ బాబు సొమ్మా!  నా కొడుకు సొమ్ము! నిన్నగాక మొన్నొచ్చావ్‌! అంతా నీదేనన్నొన్నట్లు కులుకుతున్నావ్‌! అంత కుళ్లు వద్దు తగ్గించుకో.’’ అంది రాయి వెంట రాయి విసిరినట్లు మాటలతో కొడుతున్న భ్రమరాంబికను చూస్తుంటే ఆమెను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కళ్ల నీళ్లు దూకుతున్నాయి  దేదీప్యకి.  బలవంతంగా ఆపుకుంటోంది.

‘‘నాకు నీ ఏడుపు చూసే ఓపికి లేదు.  ఆ యశోదరను పిలువు.  ఈ పద్దతి ఏమైనా బాగుందేమో అడుగుతాను.’’ అంది  భ్రమరాంబిక కోడలి మీద కోపాన్ని యశోదర పైకి మళ్లిసూ.

ఆ మాటను విన్నా విననట్లే వెంటనే కన్నీళ్లను కంట్రోల్‌ చేసుకుంటూ….

‘‘మీకు స్నానానికి నీళ్లు పెట్టమంటారా?’’ అంది దేదీప్య.

‘‘అట్టే దూరం లేకపోయినా ముదనష్టపు బస్సు ఎత్తెత్తి వేసింది. సప్తసముద్రాలు దాటివచ్చి ఇంటి ముందు మురిక్కాలవలో పడి చచ్చినట్లు ఇంటికొచ్చి కూడా ఈ మొక్కల మధ్య దోమల్తో కుట్టించుకుంటూ ఇప్పటిదాకా చచ్చాను. ఆ నీళ్లేదో త్వరగా పెట్టు.’’ అంది బ్రమరాంబిక.

‘‘సరే!’’ అంటూ అక్కడనుండి కదలబోతున్న దేదీప్య వైపు ఏదో గుర్తొచ్చినదానిలా చూస్తూ.

‘‘ఇదిగో…. మావాడేమైనా క్యాంపు కెళ్లాడా? టౌన్‌లోనే వున్నాడా?’’ అంది.

‘‘టౌన్‌ లోనే వున్నారు. ఇంటికొచ్చే టైమయింది.’’ అంటూ వంటగదిలోకి వెళ్లింది దేదీప్య. ఈ లోపల ఇల్లంతా కలియదిరిగి వచ్చింది భ్రమరాంబిక. ‘‘ఇంట్లో చాలా సామాన్లు వున్నాయి.  మావాడే                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 కొన్నాడా?  వున్న డబ్బంతా ఇలా తగలేస్తే సంసారమేం గడుపుతాడు? మాకేం పంపిస్తాడు?  పెళ్లికి ముందంటే సరే, ఇప్పుడు  నిన్ను కూడా మేపాల్సిన బాధ్యత వాడిమీద వుందిగా.  మేస్తే మేశావులే. వాడు ఆఫీసుకి వెళ్లాక కాస్త ఇంటి పట్టున పడివుండు. అటు, ఇటు పెత్తనాలకి పోతే ఇంటినెవరు కనిపెట్టుకుంటారు? ఈ సామాన్లకి కాపలా ఎవరుంటారు?’’ అంది భ్రమరాంబిక.

మాటకి మాట సమాధానం ఇవ్వాలంటే మనస్కరించని దేదీప్య మనసంతా ఛిద్రమైపోయింది.

విధివైపరీత్యంలా దురదృష్టం తోడై తన బ్రతుకును వాచ్‌మెన్‌ కన్నా హీనంగా మార్చటమంటే ఇదే కాబోలు. ఇంటెడు చాకిరీ చేస్తూ ఓ ముద్ద తిన్నందుకే వీళ్లిలా దెప్పిపొడుస్తున్నారే. వీళ్లసలు మనుషులేనా? పెళ్లయ్యాక ప్రతి పనిని డ్యూటీ లాగ చేస్తూ, సుఖ పడింది లేకపోయినా ఈ ఇల్లు తనది, ఈ ఇంటికి తను అధికారిణి అనుకొంది. అలా అనుకొని తను సాధించింది ఇదేనా? వూరికే తననేదో పోషిస్తున్నట్లు  ఇలా వీళ్ల మాటల్ని పడుతూ కుమిలి పోయేకన్నా తనకోసం తను ఉద్యోగం చేసుకుంటే తప్పులేదు.

పనంతా అయ్యాక రాస్తూ కూర్చుంది దేదీప్య.

‘‘ఏమిటి వదినా రాస్తున్నావు?’’ అంటూ అప్పుడే ఊరి నుండి వచ్చిన ఆమె మరిది పవన్‌ ప్రశ్నించాడు.

‘‘రా పవన్‌ కూర్చో బాగున్నావా? బాగా చదువుతున్నావా?’’ అంది పవన్‌ని చూడగానే ఆత్మీయంగా పలకరిస్తూ దేదీప్య.

‘‘బాగున్నాను వదినా!  మీరు ఎం.బి.ఎ. కంటిన్యూ చేస్తున్నారా?’’ అన్నాడు ఆమె రాస్తున్న వాటివైపు చూస్తూ.

‘‘లేదు పవన్‌! ఇవి మీ అన్నయ్య ఆఫీసు ఫైల్స్‌ ఆఫీసులో తన పెండిరగ్‌ వర్క్‌ తెచ్చి నన్ను రాయమన్నారు.  ఎలాగూ నేను ఖాళీగానే వున్నాను కదా! ‘‘అంది భర్తను సమర్థించుకుంటూ.

‘‘ఖాళీగా వుండటం దేనికి వదినా? మీరు కూడా ఏదైనా జాబ్‌ చెయ్యొచ్చుకదా?’’ అన్నాడు పవన్‌.

ఒక్క క్షణం పవన్‌వైపు చూస్తూ…

‘‘రేపటి నుండి నా ఉద్యోగం వేట ప్రారంభం అవుతుంది పవన్‌’’.  అంటూ నవ్వుతూ పవన్‌ తినటానికి ఏదైనా పెట్టాలని వంటగదిలోకి వెళ్లింది.

పవన్‌ వెళ్లి టీ.వి. చూస్తున్న తల్లి దగ్గర కూర్చున్నాడు.

* * * * *

యశోదర కొడుకు అభిరాం పెళ్లి లాలిత్యతో అతి ఘనంగా జరిగింది.  పెళ్లిలో అన్ని పనులు తనవే అయినట్లు యశోదర పక్కన తిరిగింది దేదీప్య. ఆమె తిరిగే విధానం చూసి చాలమంది దృష్టి దేదీప్య మీద పడకపోలేదు.

అభిరాంని యశోదర కొడుగ్గా చూసి ఎప్పుడూ చెందనంత దిగ్భ్రాంతి చెందింది దేదీప్య.  ప్రపంచం ఇంత చిన్నదా అని నివ్వెరపోతూ నిర్భావమైన స్థితిలో శిలలా వుండిపోయింది. అదంతా ఒక్క క్షణమే మరుక్షణమే మామూలుగా అయింది.

లాలిత్య మెడలో తాళి కట్టి, తలంబ్రాలు పోసిన క్షణం నుండి ఆమె కొంగు గాలి కొబ్బరాకు గాలిలా అతని మదిని పులకింపచేస్తోంది. ఆమె తన మనిషి అన్న భావన పెరిగి థ్రిల్లింగ్‌  గా వుంది. ఆమెను తనలో సగభాగంగా వూహించుకొని అపారమైన ప్రేమను పెంచుకున్నాడు. ఆమె మాట్లాడితే చెరువు గట్టు దగ్గర తామర పూలతో మాట్లాడుతున్నట్లు… నవ్వితే చిన్న,  చిన్న అలల సంగీతాన్ని విన్నట్లు ఫీలవుతున్నాడు.

రాత్రికి…….

‘‘తలనొప్పిగా వుందండి!’’ అని లాలిత్య చెప్పటంతో ఆ గదిలో వుండాలనిపించక వెళ్లి బాల్కనీలో కూర్చున్నాడు అభిరాం.

పాలార బోసినట్లున్న ఆ వెన్నెల్లో అతని మనసు వింతగా స్పందిస్తోంది. మీటితే పలికే వీణలా మారిన అతని గుండె పిలవగానే పలికే ప్రియునిలా మారి లాలిత్యనే చూస్తోంది. డోర్‌ తీసివుండటంతో లాలిత్య స్పష్టంగా అతను కూర్చున్న దగ్గరకి కన్పిస్తోంది. కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. చూస్తున్నకొద్ది ఆమెతో కలసి సాగించబోయే జీవితం తేనె నింపిన డొప్పలా అన్పిస్తోంది. చీర కుచ్చిళ్ల దగ్గర నుండి ఆమె ముఖం వరకు అతని   కళ్లు ప్రేమతో అది పనిగా తడుముతూ కదులుతున్నాయి.  ఎక్కడ  ఏ నిధి దాగివుందోనన్నట్లు శోదిస్తున్నాయి.  ఏడు రంగుల ఇంద్రదనస్సు ఆరేసినట్లు కాన్వాసు మంచంపై నిద్దరోతున్న చిత్రంలా, పాలరాతి శిల్పంలా వున్న ఆమె ఒంటిపై ప్రకృతి పెట్టిన గొబ్బెమ్మల్లా కొండలు, కోనలు, కన్పిస్తుంటే అతని శరీరంలోని ప్రతి అణువు ఆమెను చేరుకోమని తొందరపెత్తున్నాయి.  ప్రపంచంలోని ప్రతి అందం తనముందు బలాదూర్‌ అన్నట్లుగా సవాల్‌   చేస్తూ ఆమె పెదవులు విల్లులా వంగి చంద్రకిరణాన్ని తలపిస్తూ మరింత రెచ్చగొడ్తున్నాయి.

అతను పుట్టాక ఎన్నో క్షణాలు గడచిపోయినా ఈ క్షణాలకున్న ప్రత్యేకత వాటికి లేదనిపిస్తోంది. తనలో ఇన్నాళ్లు కలిగిన మధుర భావాలకి ఈ క్షణాలు భాష్యం చెబుతున్నట్లున్నాయి. ప్రొద్దుటి నుండి ఆమెను చూస్తుంటే ఆ జడ, ఆ నవ్వు, ఆ నడక కోరిక కన్నా  ఆపుకోలేని అనురాగం కలిగి త్వరగా రాత్రి అయితే బాగుండని ఎదురుచూశాడు.

ఇక ఆగలేక అలాగే లేపి ఆమెను గుండెలకు హత్తుకోవాలని లేచి ఆమె వైపు వెళ్లాడు.  ఎన్నో యుగాలుగా తను అన్వేషిస్తున్న మనిషి ఆమేనన్న భావంతో అతని చెయ్యి ఆమెను తాకాలని తొందరపడ్తూ నిస్సంకోచంగా ఆమె నుదుటి మీదుగా ప్రయాణం చేసి, విరబూసిన అందాన్ని ప్రోది చేసుకున్నట్లున్న నడుము నుండి క్రిందకి దిగి నాజూగ్గా, ఒద్దికగా, బుద్దిగా వున్న ఆమె పాదాలను తాకుతూ వెంటనే ఆమె ముఖానికి దగ్గరగా వచ్చి ఆర్తిగా, ఆత్రంగా, అనురాగపూరితంగా ఆపుకోలేని తన్మయంతో ‘ఐలవ్‌యు లాలిత్యా!’’ అని లోపల అనుకుంటూనే పైకి అన్నాడు.

అమ్ముల పొదిని పోలిన ఆమె కనురెప్పలు విచ్చుకున్నాయి.  తన పర్మిషన్‌ లేకుండా, దొంగలా తనపైకి వంగినట్లు కన్పిస్తున్న అభిరాంని చూడగానే ఒకవిధమైన చులకన భావం,ఏవగింపు కలిగాయి లాలిత్యకి.

‘‘తలనొప్పిగా వుందని చెప్పానుగా. ఇలా వచ్చారేం? అర్థం చేసుకుంటారనుకున్నాను’’ అంటూ ఆమె చిరాగ్గా లేచి కూర్చోవటంతో అభిరాం నిరుత్తరుడయ్యాడు. ఆమె గొంతు ఎంత నెమ్మదిగా మాట్లాడినా కంచులా మోగింది.

వెంటనే సర్దుకొని ఆమె ముఖంలోకి చూడలేక చ.. చ.. సంస్కారం లేని వాడిలా తనేంటి ఇలా చేశాడు? అయినా తను తాకాలనుకున్నది తన బార్యనేగా.  అందులో ఇది తొలిరాత్రి. అని తనకు తను సర్ధిచెప్పుకొని, మళ్లీ బాల్కనీలోకి వెళ్లి కూర్చున్నాడు.

అభిరాం వైపు  ఏదోగా చూస్తూ `సేఫ్టిలేని ప్లేస్‌లో తనని తను దాచుకుంటున్నట్లు కాళ్ల దగ్గరున్న బ్లాంకెట్‌ను తల వరకు లాక్కుంది.

బ్లాంకెట్‌లో అందంగా ముడుచుకున్న లాలిత్య మౌన శిల్పంలా అన్పించి సన్నగా నవ్వుకున్నాడు.

ఒక మనిషి మీద భరించరాని ఇష్టం కలగటమంటే ఇదే కావొచ్చు. దీన్నే ప్రేమంటారా? అని మనసులో అనుకుంటూ టైం చూశాడు. అప్పటికే రెండు దాటింది. తెల్లవారే లోపల ఏ క్షణంలోనైనా నిద్రలేచి లాలిత్య తనవైపు చూసినప్పుడు ఆమెను మిస్సవుతానేమోనని కంటిమీద కునుకు లేకుండా చూస్తూ అలాగే కూర్చున్నాడు అభిరాం.

నాలుగు గంటలకి నిద్రలేచిన లాలిత్య బాల్కనీలో కూర్చుని తనవైపే చూస్తున్న అభిరాంని చూసి నెమ్మదిగా బెడ్‌ దిగి నడుచుకుంటూ అతని ముందుకెళ్లి నిలబడింది. ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు.

ఆమెనలా చూడగానే అమాంతం తన కుడి చేత్తో ఆమె నడుముని చుట్టేయబోయాడు అభిరాం.

‘‘అలా తాకితే నాకు చక్కలిగిలి.’’ అంటూ అక్కడోక్షణం కూడా ఆగకుండా గదిలోకి వెళ్లి నీళ్లు తాగి పడుకొంది. అతను ఆమె వెంట నడిచి.

‘‘మరి నీకు ఎలా తాకితే చక్కలిగిలి కాదో చెప్పు? ‘‘ అంటూ ఆమె పక్కన పడుకొని ఎదురుగా ఆమె ముఖంలోకి ముఖం పెట్టి చూశాడు. అతని మస్తిష్కంలోని ఊహలు, మదిలోని ఊసులు ఒకచోట చేరి హృదయాంతరాల్లో దాగివున్న సంతోషాన్ని ఉప్పెనలా ఎగజిమ్ముతున్నాయి. ఆమెకు చిరాగ్గా అన్పించి తన ముఖం పక్కకి తిప్పుకొంది.

‘‘నేన్నీకోసం రాత్రంతా నిద్రపోకుండా వెయిట్‌ చేస్తున్నా… ముఖమలా తిప్పుకుంటావేం.?’’ అన్నాడు.

ఆశ్చర్యంతో ఆమె కళ్లు ఆవులించాయి.

‘‘నాకోసమేనా? బాల్కనీలో అలా దెయ్యంలా కూర్చోకపోతే వచ్చి పడుకోవచ్చుగా.’’ అంది కొత్తపెళ్లి కూతురునన్న సిగ్గుగాని, భయం గాని ఏ మాత్రం లేకుండా.

షాకయ్యాడు అభిరాం.

* * * * *

అభిరాం ట్రైనింగ్‌ పూర్తికాగానే కొద్ది రోజులు హైదరాబాదులోనే ఒక కంపెనీలో పనిచేసి, పెళ్లయిన వెంటనే వైజాగ్‌లో మంచి కంపెనీలో జాబ్‌ వెతుక్కున్నాడు.

కొడుకు, కోడలు ఇకముందు తన దగ్గర వుండబోతున్నందుకు ఆనందంగా వుంది యశోదర, రాజశేఖరంలకు.

ఆ ఇంట్లో అభిరాం గది, పైన వుంటుంది. అతని గది, గదిచుట్టూ వాతావరణం, అతని అభిరుచికి తగినట్లుగా వుంటుంది. గదిలోంచి బయటకి రాగానే పువ్వులతో విరబూసిన గులాబి మొక్కలున్న కుండీలు వుంటాయి. దాని పక్కనే అతను రోజు జిమ్‌ చేసే గది వుంటుంది.  అందులో అతను యూజ్‌ చేసే డంబెల్స్‌ వుంటాయి.

ఉదయాన్నే గదిలోంచి బయటకు రాగానే పూలకి ‘హాయ్‌’ చెప్పి వాకింగ్‌కి వెళ్తూ… ఆ మొక్కలు వాడిపోటం చూసి బాగా ఫీలయ్యి లాలిత్యను కేకేశాడు అభిరాం.

మృదువుగా పిలిస్తేనే అంతంత మాత్రంగా పలికే లాలిత్య అతను గట్గిగా కేక వెయ్యటంతో తల కూడా తిప్పలేదు.  ఇక లాభం లేదనుకొని అతనే ఆమె దగ్గరకి వెళ్లాడు.

‘‘ఆ మొక్కలు చూడు నీళ్లు లేక ఎలా ఎండిపోతున్నాయో వాటికి నీళ్లు పోస్తే నీ తాత సొమ్ము ఏమైనా పోతుందా?’’ అన్నాడు గట్టిగా.

లాలిత్య మాట్లాడలేదు. నీళ్లు పోస్తాననలేదు, పొయ్యననలేదు.

‘‘చూడూ! ఆ మొక్కలు ఎప్పటిలా కళకళలాడాలి. నేను వాకింగ్‌కి వెళ్లి వచ్చేలోపల వాటికి నీళ్లు పొయ్యి.’’ అన్నాడు.

‘ఏం మీరు పొసుకోవచ్చుగా నాకు చెప్పకపోతే. ప్రొద్దున్నే చిన్న పిల్లాడిలా రోడ్డు మీద పరుగు తియ్యకపోతే వాటికి నీళ్లు పోస్తే తప్పేంటి? మళ్లీ దానికో ముద్దు పేరు ‘వాకింగ్‌’ అని పనులు మానేసి బయట తిరగటమంటే ఇదే.’’ అంది. బార్యంటే ఏమనుకుంటున్నారో వీళ్లు… మొక్కలకి నీళ్లు పోస్తూ, కుక్కలకి మాటలు నేర్పుకుంటూ వుండే హోంగార్డు అనుకుంటున్నారేమో అని మనసులో అనుకుంటూ.

‘‘నీకు మతి వుండే మాట్లాడుతున్నావా?’’ అన్నాడు ఎప్పుడూ చూడనంత వింతగా ఆమెను చూస్తూ…

లాలిత్య తనను ఏమన్నా భరిస్తుంది కాని ‘మతిలేదు’ అంటే మాత్రం సహించలేదు.మతిలేని పనులు తనేం చేసిందని అలా అన్నాడు? మాట్లాడకుండా మౌనంగా నేలవైపు చూస్తూ ఎడమ చేతిని నోటి దగ్గర పెట్టుకొని గోళ్లు కొరుకుతూ కూర్చుంది.

అభిరాం అక్కడ నుండి కదిలి వాకింగ్‌కి వెళ్లాడు.

అతనలా వెళ్లగానే… ‘రోజూ వీటికి నీళ్లెవరు పోస్తారు?’’ అని కసిగా అనుకుంటూ ఒక్క వుదుటన వెళ్లి ఆ గులాబి మొక్కల్ని పీకి… క్రింద నిలబడి తీగలపై వాళ్ల అత్తగారివి, మరిదివి, భర్తవి బట్టలు ఆరేస్తున్న దేదీప్య నెత్తిన పడేసింది. మట్టితో నిండిన వేళ్లతో వచ్చి టక్కున తన నెత్తినపడ్డ మొక్కల్ని చూసి ముందు దడుసుకొని తర్వాత పైకి చూసి….

‘‘మనుష్యులు కన్పించరా నీకు? పైన వున్నానన్న పొగరా?’’ అన్నట్లుగా చూసింది దేదీప్య. దేదీప్య చూపుల్ని చూసి, అందులో భావం అర్థమై తిక్కరేగింది లాలిత్యకి.

‘‘ఏంటలా చూస్తావ్‌? నిన్నేమైనా నేను చూశానా? మొక్కలేగా నెత్తిన పడింది. అదేదో కుండీ పడ్డట్లు చూస్తావెందకు?’’ అంది లాలిత్య.

‘‘ఏమిటి? కుండీ నా నెత్తిన వేస్తావా?’’ అంది దేదీప్య ఆశ్చర్యపోతూ

‘‘నేనేశానా? వేసినట్లే మాట్లాడతావేం.’’ అంది లాలిత్య.

‘‘వెయ్యి నీ పని చెబుతా.’’ అంది దేదీప్య.

‘‘ఏం చెబుతావ్‌, చచ్చివూరుకుంటావు’’ అంది లాలిత్య.

‘‘నీకేమైనా పిచ్చా?’’ అంది దేదీప్య.

‘‘నాకు పిచ్చి అంటావా? వుండు నీ పని చెబుతా’’ అంది లాలిత్య కోపంగా.

అసలే అంతకుముందు ఏదో అవసరమై పక్క గదిలోకి వెళ్తే అభిరాం జిమ్‌ చేసే డంబల్స్‌ కాలుకి తాకి గాయమై రక్తం కన్పించింది. అప్పటి నుండి తన ఒంట్లోంచి లీటర్‌ బ్లెడ్‌ పోయినంత బాధగా వుంది. ముందా డంబెల్స్‌ తెచ్చి దీని నెత్తిన పడెయ్యాలి. పీడా పోతుంది అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్లింది.

పెద్ద పెద్ద డంబెల్స్‌ని ఎత్తలేక స్మాల్‌ డంబెల్‌ని తెచ్చి సరిగ్గా దేదీప్య నెత్తిన వేయబోతున్న సమయంలో అప్పుడే అక్కడకి వచ్చిన అభిరాం చూసి పట్టుకున్నాడు. క్రింద నిలబడివున్న దేదీప్యను  కూడా అతను చూశాడు. అతని గుండె ఆగినంత పనైంది.

దేదీప్య అతన్ని గమనించకుండా తడి బట్టల్ని పిండి ఆరవేస్తోంది.

‘‘నువ్వెందుకిలా చేస్తున్నావ్‌? ఆ కుండీల్లో మొక్కలేమైనాయి?’’ అన్నాడు బోసిగా వున్న కుండీలవైపు చూస్తూ.

‘‘ఈ డంబెల్స్‌ని నా కాలు తాకి రక్తం వచ్చింది తెలుసా?’’ అంది  ప్రపంచంలోని బాధనంత ముఖంలోకి తెచ్చుకుంటూ.  కుండీల్లో మొక్కల సంగతి మాత్రం చెప్పకుండా…

‘‘వాటి దగ్గరకెళ్లి నిన్నెవరు పొడుచుకోమన్నారు?’’ అంటూ ఆమె చేతిలో డంబల్‌ని తీసి పక్కనపెట్టి.

‘‘ఏది చూడనియ్‌!’’ అంటూ ఆమె కాలు పట్టుకోబోయాడు.

శరాఘాతం తగిలిన దానిలా కాలు వెనక్కు లాక్కుంది. కాలు తాకితే యింకేమైనా వుందా? ముందు కాలు తాకి, తర్వాత ఇంకేమైనా తాకొచ్చు.

ఆమెనలా చూడగానే అచేతనుడయ్యాడు అభిరాం.

* * * * *

రోజులు శరవేగంతో కదులుతున్నాయి.

ఇందుమతికి ఒంట్లో బాగాలేదని తెలియటంతో రాజశేఖరంని తీసుకొని యశోదర వరంగల్‌ వెళ్లింది.

‘‘లాలిత్యా! రేపు నాకు! ఉప్నా, పెసరట్టు చేసిపెట్టు అమ్మగాని మామ్మ గాని ఎక్కువగా అవే చేస్తుంటారు.’’ అంటూ కళ్లు మూసుకొని పడుకున్నాడు అభిరాం.

లాలిత్య తన గోళ్లకున్న నెయిల్‌ పాలిష్‌ని రిమూవ్‌ చేస్తూ కూర్చుంది కాని చేస్తాననలేదు చెయ్యననలేదు.

ఉదయాన్నే అతను డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకి రాగానే

బ్రెడ్‌ స్లయిసెస్‌కి జామ్‌ పూసి అభిరాం ముందుపెట్టింది.

‘‘ఇది నువ్వు తిను. నాకు ఉప్మా, పెసరట్టు తీసుకురా?’’ అన్నాడు.

‘ఉప్మా, పెసరట్టు వుంటే నేను కూడా తినేదాన్ని కదా! ఇది వుండబట్టే మీకు పెట్టాను.’’ అంది.

‘‘ఏం! చెయ్యలేదా?’’

‘‘అదెవరు చేస్తారండి! రుబ్బాలి చెయ్యాలి అదంతా పెద్ద పని. నావల్ల కాదు.’’ అంది.

‘సరే లే కనీసం కాస్త స్ట్రాంగ్‌గా ఫిల్టర్‌ కాఫీ అయినా చేసి యివ్వు తాగివెళ్తాను.’’అన్నాడు.

‘‘నా కసలే ఓపిక తక్కువ. ఈయన చెప్పేవన్నీ పెద్ద, పెద్ద పనులు.’’ అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్లింది. స్మూత్‌గా వున్న ఆ ఫోరింగ్‌పై చెప్పుల కాళ్లతో టకటక నడుస్తుంటే ఒక్కోసారి జారిపడ్తుందేమోనన్న అనుమానం వస్తుంది అభిరాంకి.

గబ, గబ పాలల్లో బ్రూకలిపి తెచ్చి అతనికి యిచ్చింది. ఎప్పుడైనా అభిరాం బ్రూకాఫీ తాగడు. దాన్ని సిప్‌ చెయ్యగానే….

‘‘చీ… బ్రూ కలిపావా?’’ అన్నాడు.

మాట్లాడలేదు లాలిత్య.

‘‘నువ్వు నా కడుపు మాడ్చటానికే నా దగ్గరకొచ్చావు.’’ అంటూ  కప్పును గట్టిగా టీపాయ్‌ మీద పెట్టి మరోమాటకి అవకాశం యివ్వకుండా ఆఫీస్‌కి వెళ్లాడు.

ఆఫీసులో ఈ రోజు వర్క్‌లోడ్‌ ఎక్కువై తలనొప్పి వచ్చింది అభిరాంకి సాయంత్రం ఇంటికి రాగానే….

‘‘తలనొప్పిగా వుంది లాలిత్యా! కొంచెం టీపెట్టి యివ్వు.’’ అన్నాడు.

కొద్దిసేపు అయ్యాక ఫ్రిజ్‌ లోంచి కూల్‌డ్రింక్‌ తీసి గ్లాసులో పోసుకొచ్చి యిచ్చింది లాలిత్య.

దాన్ని చూడగానే అరికాలి మంట నెత్తిక్కినట్లు తిక్కరేగింది అభికి. కానీ ఆ టైంలో లాలిత్య తో మాటలు పెంచితే గెలవలేనని….

‘‘టీ చేసే ఓపిక లేకపోతే చెయ్యనని చెప్పొచ్చుగా కూల్‌డ్రింక్‌ ఎవరు తెమ్మన్నారు?’’ అన్నాడు కోపంగా అతని మాటలేమీ పట్టించుకోకుండా….

‘‘ఈ రాత్రికి వంట ఏం చెయ్యమంటారు?’’ అంది.

‘‘నేను చెప్పింది నువ్వు ఎప్పుడు చేశావని నన్ను అడుగుతున్నావ్‌! నీ ఇష్టమొచ్చింది చెయ్యి’’ అన్నాడు.

ఆ మాటలకి కనురెప్పల్ని అదోలా ముడిచి, మూతి సున్నాలా చుట్టి…

‘‘ఎందుకండీ అలా అంటారు? మీ కడుపు మాడుస్తున్నానని అందరు అనుకోవాలనా? మీరు బక్కగా  అయితే మీ మమ్మీ వచ్చి నా కొడుక్కి నా కోడలు అన్నం పెట్టలేదని నలుగురికి చెప్పుకోవాలనా? మీరిలా చేసేది?’’ అంటూ ఎప్పటిలా తన గొంతుని కంచుల మ్రోగించకుండా కాస్త మెత్తగా పలికింది.

‘‘ఇదీ మరీ బావుంది. చేసేదంతా చేసి, నేను చెయ్యమన్నవి చెయ్యకుండా  నన్నే అంటున్నావే. ఇంతకీ నీ బాధ నలుగురి కోసం, మమ్మీ కోసమే కాని నాకు వండి పెట్టలేదని కాదా?’’ అన్నాడు ఆశ్చర్యపోతూ.

‘‘మనం నలుగురి కోసం బ్రతకాలి కదా!’’ అంటూ అక్కడే నిలబడింది.

అసలే టైరయిపోయిన అభికి లాలిత్యతో మాటలు పెంచే ఓపికలేక ‘‘రా! కూర్చుని మాట్లాడుకుందాం!’’ అంటూ హాల్‌ వరకు తీసుకొని వచ్చి, ఆమెనక్కడ వదిలేసి తన గదిలోకి వెళ్లి డోర్‌పెట్టుకున్నాడు.

తనని అలా ఒంటరిగా వదిలి అతను గదిలోకి వెళ్లటంతో చిర్రెత్తుకొచ్చింది లాలిత్యకు.

గబ గబ డోర్‌ దగ్గరకెళ్లి బాదింది.

‘‘ఎందుకు డోర్‌ పగలగొడ్తావ్‌!’’ నువ్వు లోపలకి వస్తానంటే నేను కాదంటానా? రా . కూర్చో.’’ అంటూ డోర్‌ తీసి ఆమె చెయ్యి పట్టుకొని బెడ్‌ దగ్గరకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.

జీవితం చాలా చిన్నది ఉన్న సమయంలోనే సంతోషంగా బ్రతకాలన్నదే అతని ఫిలాసఫి. అందుకే ఇన్నాళ్లూ ప్రకృతిని ఆరాదిస్తూ పరవశించాడు.  ఇప్పుడు భార్యను ఆరాదిస్తున్నాడు. కానీ లాలిత్య అతని పక్కనైతే పడుకుంటుంది కాని, దగ్గరకి తీసుకోవాలంటేనే ఒప్పుకోవటం లేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటుందేమో అనుకొని.

‘‘నా తలనొప్పి ఎలాగూ టీతో తీరే యోగం లేదు. కనీసం ఇలా అయినా తీరుతుందేమో’’ అంటూ ప్రేమగా, మృదువుగా ఆమెను దగ్గరకి తీసుకోబోయాడు.

ఒక్కసారిగా లేచి నిలబడి దూరంగా జరిగింది.

‘‘ఎందుకే నీ జన్మ! నువ్వు దీనికి కూడా పనికిరావా?’’ అన్నాడు.

‘‘ అంటే నన్ను మీ అవసరాలకు వాడుకునే మిషన్‌లా చూస్తున్నారన్నమాట’’ అంది ముఖం కొశ్చన్‌ మార్క్‌లా పెట్టి….

‘‘వంట చెయ్యటం, చెట్లకి నీళ్లు పొయ్యటం, భర్తను సుఖపెట్టడం, యివన్నీ మిషన్లు చేస్తాయా?’’ అన్నాడు అభిరాం.

‘‘కానీ మీరు నన్ను అలాగే ఉపయోగించుకోవాలనుకుంటున్నారు.’’ అంటూ అక్కడే నిలబడితే అభి తనను బలవంతం చేసినా చెయ్యొచ్చన్న భయంతో…. వెంటనే.

‘‘సరే! తలనొప్పిగా వుందన్నారుగా మీరు పడుకోండి!’’ అంటూ నైస్‌గా ఆ గదిలోంచి జారుకుంది.

అభిరాం నుదుటి మీద చేత్తో రుద్దుకుంటూ బాధగా పడుకున్నాడు.

అభిరాంకి తన భార్య చక్కగా చీరకట్టుకొని, గాజులు వేసుకొని, తలలో మల్లెపూలు పెట్టుకొని, కళ, కళలాడుతూ వుండాలని ఆశ. ఒక్కరోజు కూడా అలా వుండదు.

‘‘ఇదేం పద్దతి లాలిత్యా?’’ అంటే

‘‘నా పద్దతి ఇంతే, అయినా నా పద్దతికేం?’’ అంటుంది.

ఏ విషయం మాట్లాడబోయినా ఆసక్తిగా వినదు. గోళ్లు కొరుక్కుంటూ కూర్చుంటుంది.

తను ఆఫీసు నుండి లేటుగా వస్తానని, తనకోసం ఎదురు చూడొద్దని, తన అవసరాలు లాలిత్య చూస్తుందని అభిరాం చెప్పటంతో యశోదర అతన్ని పట్టించుకోవటం మానేసింది.

లాలిత్య డైనింగ్‌ టేబుల్‌ మీద అన్నీ సర్దిపెట్టి ‘తినండి’ అంటుందే కాని ఒక్కరోజు కూడా దగ్గరవుండి వడ్డించదు. అతనికేమో కొసరి కొసరి వడ్డిస్తూ  భార్య తన ప్రక్కనే కూర్చోవాలని కోరిక. ఆమె కూడా తన పక్కన కూర్చుని తినాలని అభిలాష. కాని అతను ఇంటికి రాకముందే ఆమె తినేస్తుంది.  లేదంటే అతను తిన్నాక ఎప్పుడో తీరిగ్గా తింటుంది.

‘‘నా మనసు నువ్వెప్పుడు తెలుసుకుంటావు లాలిత్యా?’’ అన్నాడు ఆ రాత్రికి అభిరాం.

‘‘అంతగా తెలుసుకోవటానికి ఏముంటుందండి?’’ అంది అతని మాటల్ని తేలిగ్గా తీసిపారేస్తూ..

‘‘ఏమెందుకు లేదు? ఆఫీసుకెళ్లే ముందు టిఫిన్‌ పెట్టమంటే బ్రెడ్‌ తినమన్నావు. టీ ఇమ్మంటే కూల్‌డ్రింక్‌ ఇచ్చావు. కాస్త పక్కన కూర్చుని కబుర్లు చెబుతావా అంటే అదీ లేదు. మనసు తెలుసుకోకుండా ప్రవర్తించడమంటే ఇదే. నువ్విలా వుంటే నాకెంత బాధగా వుంటుందో తెలుసా?’’ అన్నాడు.

‘‘ఇంకోలా వుండటం నాకు రాదు.’’ అంది.

‘‘నేర్చుకోలేవా?’’ అన్నాడు.

‘‘నేర్చుకోవటానికి నేనేమైనా చిన్నపిల్లనా? అయినా నా ప్రవర్తన నాకు బాగానే వుంది. ఇక మార్చుకోటానికి, నేర్చుకోటానికి ఏం లేదు.’’ అంది .

‘‘సరే! మరి ఈ రోజైనా….’’అంటూ ఆమె కళ్లలోకి చూశాడు.  అతని చూపుల్లోని భాష అర్థమైన దానిలా….

‘‘ఆ ఒక్కటి అడక్కుండా పడుకోండి!’’ అంది పెదవులపై వేలు పెట్టుకొని ముద్దుగుమ్మలా ముడుచుక్కూర్చుంటూ అలా కూర్చోవటం ఎప్పటి నుండి ప్రాక్టీస్‌ చేసిందో ఏమో…

ఆమెనలా చూస్తుంటే నండూరి ఎంకి అనాలో… అడవి బాపిరాజు శశికళ అనాలో… విశ్వనాథ వారి కిన్నెరసాని అనాలో… దేవులపల్లి ఊర్వశి అనాలో.. తెలియటం లేదు.  అందరూ కలిస్తే ఆమె అన్నట్లుగా వుంది. అలాంటి ఆమెను చేయిచాస్తే అందేంత దూరంలో పెట్టుకొని పెళ్లైన బ్రహ్మచారిలా వుండాలంటే సాధ్యం కావటం లేదు. అలాగే చూస్తూ నిద్రపోయాడు.

నిద్ర మధ్యలో లేచాడు అభిరాం.  పక్కన లాలిత్య లేక పోవటంతో కంగారు పడ్డాడు. ఒక్కక్షణం లాలిత్య తన పక్కన లేకపోయినా తట్టుకోలేకపోతున్నాడు. తనకి ఇష్టమైనవన్నీ తననే అంటిపెట్టుకొని వుండాలని  ఏ మనిషికైనా వుంటుంది. ప్రేమించే కొద్ది దూరంగా వుండాలనిపించదు. వాళ్లు కాసింత శ్రద్ద చూపకపోయినా, మాట వినకపోయినా బాధగా, కోపంగా వుంటుంది. ఇన్నాళ్లు అతను ప్రకృతి పట్ల అభిరుచి పెంచుకొని తనకు తనే వాటితో రమించాడు. తన కోర్కెల్ని తీర్చమని, దగ్గర కమ్మని వాటిని అడుగలేదు.  అలగలేదు, తన కోసం మరింత సమయాన్ని కేటాయించమని కూడా వాటిని కోరలేదు. కానీ లాలిత్యతో అలా వుండలేకపోతున్నాడు.  ఆమె ప్రవర్తన తననెంత కష్టపెట్టినా చీకటిని చూసి కళ్లు మూసుకుంటే నక్షత్రాలు కనపడవన్నట్లు ఆమెపై కోపం తెచ్చుకోలేక పోతున్నాడు.  కానీ ఎంత ప్రయత్నించినా మూసి వున్న పుస్తకంలా ముడుచుక్కూర్చుంటుంది.  ఆ పుస్తకాన్ని ఎలాగైనా ఈ రోజు విప్పి చదవాలన్న కసి ఎక్కువైనవాడిలా బెడ్‌పై నుండి లేచి బాల్కనీలోకి వచ్చాడు. మసక వెలుగులో ` వైట్‌ నైటీ లో ముఖానికి తెల్లగా ముల్తానీ మట్టి పూసుకొని, నెత్తికి హెన్నా పెట్టుకొని చెవులకి హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని బాల్కనీలో నిశ్శబ్దంగా తిరుగుతున్న లాలిత్యను చూడగానే ఎప్పుడూ లేని విధంగా ఆశ్చర్యపోతూ ఆపుకోలేని ఆవేశంతో…

‘ఏంటీ వేషాలు వేళకాని వేళ లాలిత్యా!’’ అంటూ గద్దించాడు అభిరాం

అతని మాటలు ఆమెకు విన్పించకపోయినా, అతను ఆవేశపడ్తున్నాడని మాత్రం అర్థమైంది. వెంటనే తన చెవులకున్న హెడ్‌ఫోన్స్‌ తీసి చేతిలో పట్టుకొని ఏమిటి అన్నట్లుగా చూసింది.

‘‘ ఈ టైంలో ఈ మేకప్‌ లేంటి?’’ అన్నాడు కోపంగా

విషయం చిన్నదైనా తన నోటితో వరల్డ్‌వార్‌ చెయ్యగల లాలిత్య ఎదుటి మనిషి ఆవేశాన్ని అసలు సహించదు. అవతలి వాళ్లు ఎవరూ అన్నది ఆలోచించదు.

‘‘ఇంకే టైంలో చేసుకోవాలి? పగలంతా నిద్రతోనే సరిపోతుంది. మీరు చెప్పే పనులక్కూడా నాకు టైముండట్లేదు.  అందుకే ఇప్పుడు చేసుకున్నాను తప్పేంటి.’’ అంది.

‘‘తప్పా తప్పున్నరా!’’ అన్నాడు గట్టిగా .కనీసం పక్కన పడుకునే సౌలభ్యం కూడా లేకుండా ఇలా అడవికాచిన  వెన్నెల్లా తన భార్య అర్థరాత్రి బాల్కనీలో తిరగటం భరించలేకపోతున్నాడు.  ‘‘మీకన్నీ తప్పులే.  మీ అమ్మగారైతే మరీను…. చేతులకి గాజులు వేసుకోకపోయినా, తలలో పూలు పెట్టుకోకపోయినా, చీర కట్టుకోకపోయినా దేదీప్యతో పోల్చి చంపుతోంది. అసలెవరండీ ఆ దేదీప్య? ఎప్పుడు చూసినా, ఎక్కడికెళ్లినా మీ మమ్మీ తన వెంట తీసికెళ్తుంది. మీ మమ్మీకి బాడీగార్డా?’’ అంది ఆరా తీస్తున్నట్లు కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ.  అత్తగారు తనని దేదీప్యతో పోల్చి ‘‘దేదీప్యను చూసి నేర్చుకో’’. అన్నప్పటి నుండి మనసు రగలిపోతోంది లాలిత్యకి.

‘‘బాడీ గార్డో, ఆత్మీయురాలో నాకు అనవసరం. నేను అడిగిందానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేం?’’ అన్నాడు అసహనంగా.

‘‘నాకేది మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడతాను. భర్తతో ఆ మాత్రం మాట్లాడుకునే అదృష్టం కూడా లేదా?’’ అంది.

ఈ మాటకి కదిలిపోయి, కోపం తగ్గి మౌనంగా చూశాడు.

‘‘ఒకసారి మీ మమ్మీ ఏమన్నారో తెలుసా? నాకు బెడ్‌రూం ఎలా సర్దుకోవాలో తెలియడం లేదట. నాబెడ్‌ రూం నా ఇష్టం అందులో వుండేది నేనా? ఆవిడా? బట్టలు మడతలు వెయ్యకపోయినా, తినగా మిగిలింది బయట పడెయ్యకపోయినా చిర్గాగా చూస్తుంది.  ఒక్కోసారి విసుగ్గా చూస్తుంది. నాకు అలాంటి చూపులంటే నచ్చదు. అత్తగారినన్న డామినేషన్‌ ఆవిడ అణువణువులో కన్పిస్తోంది. దాన్ని నేను భరించలేను.  నాక్కూడా  స్వేఛ్చ కావాలి. స్వాతంత్య్రం కావాలి.’’ అంది.

‘‘మమ్మీ బిహేవియర్‌ చాలా స్మూత్‌గా వుంటుంది.  ఏది చెప్పినా నీ మంచికే చెబుతుంది. దాన్ని నువ్వు డామినేషన్‌ అనుకోవద్దు.’’ అన్నాడు

‘‘ఎవరి మమ్మీ వాళ్లకి అలాగే అన్పిస్తుంది లెండి! అవునూ! లోకంలో పనులు చెయ్యకుండా ఎంతమంది కోడళ్లు ఎ.సి. రూముల్లో పడుకొని నిద్రపోవటం లేదు? నేనొక్కదాన్నే నిద్రపోతున్నట్లు ‘ఇంటికి అరిష్టం’ అంటూ క్లాసు తీసుకుందో రోజు. అసలు మీ మమ్మీని చూస్తుంటే ఎటైనా పారిపోవాలనిపిస్తోంది.’’ అంది.

ఒక్కక్షణం ఆమె ముఖం లోకి లోతుగా చూసి ఆ తర్వాత ఆలోచనగా ఆమె తలమీద నుండి దూరంగా చూశాడు.

‘‘ఎప్పుడు చూసినా కిచెన్‌లోకి రమ్మని పిలుస్తుంది. తను చేస్తుంటే చూసి నేర్చుకోమంటుంది. నాకు కిచెన్‌లోకి వెళ్లాలంటేనే ఇరిటేషన్‌గా వుంటుంది. ఎవరు కోస్తారు ఆ కూరగాయలు? ఆ ఉల్లిగడ్డలు? చేతులు తెగితే! అందుకే నాకీ పెళ్లొద్దని మా వాళ్లతో చెప్పాను. అయినా చేశారు.’’ అంది.

‘‘సరేలే! ఇక్కడ నిలబెట్టి ఇవన్నీ మాట్లాడటానికి ఈ సమయమే దొరికిందా? లోపలకెళ్లి మాట్లాడుకుందాం రా!’’ అన్నాడు.

‘‘లోపలకెళ్లాక నేనిలా ఈ టైంలో బాల్కనీలో తిరుగుతున్నానని కొడతారా?’’ అంది ముఖం అదోలా పెట్టి. అప్పటివరకు రంకెలేసినట్లు మాట్లాడి ఇంతలోనే మెత్తగా మారిపోవటం వింతగా అన్పించింది.

‘‘నన్ను చూస్తుంటే కొట్టేవాడిలా అన్పిస్తున్నానా? కాకపోతే ఈటైంలో నా భార్య ఇలా విచిత్రంగా మేకప్‌ ప్యాక్‌లు చేసుకొని, హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని… తన లోకంలో తను వుంటుందని వూహించలేదు.’’ అన్నాడు.

‘‘మీరు వూహించుకున్న విధంగా నేను వుండాలంటే పుట్టుకతోనే నేను ముసలిదానిలా పుట్టాలి.  లేకుంటే ఏంటండీ మీరనేది? నెత్తికి హెన్నా పెట్టుకొని, ముఖానికి ముల్తానీ మట్టి పూసుకుంటే విచిత్రమవుతుందా? ఏదో వయసులో వున్నాం కాబట్టి మా అందాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకోవాలని వుంటుంది. అది కూడా తప్పేనా? మా యింట్లో అయితే  హెడ్‌ఫోన్స్‌పెట్టుకొని, ఒకరి జోలికి ఒకరం పోకుండా ఎవరి లోకంలో వాళ్లం ఇలాగే వుంటాం’’అంది.

నవ్వాడు అభిరాం.

‘‘నీ అందాలకి మెరుగులు దిద్దుకునేది నా కోసమేగా… నేను గుర్తించాలనేగా… ఓ.కె. రా. మరి అది కడిగేసుకుని పడుకుందాం.’’ అంటూ ఎంతో లలితంగా, మృదువుగా ఆమె చేయి అందుకున్నాడు.

అతనలా చేయిపట్టుకోగానే  భీతహరిణిలా చూసింది.

‘‘వద్దు నేను రాను లోపలకెళ్లాక మీరునన్ను బలవంతం చేస్తారు’’ అంది భయపడ్తూ.

‘‘చెయ్యను. నీ పర్మిషన్‌ లేకుండా, నీ ఇష్టం లేకుండా నిన్ను నేనేం చెయ్యను. ఇదేనా ఇన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకుంది?’’ అంటూ యింకా లాలనగా ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.

‘‘నో… నేను నమ్మను.’’  అంటూ గట్టిగా అరుస్తూ క్రింద కూర్చుని ఏడ్వటం మొదలుపెట్టింది.  ఆ ఏడుపు హృదయవిదారకంగా, దిక్కులు పిక్కటిల్లేలా వుంది.

ఆశ్చర్యచకితుడై, నిర్వీర్యుడై ….

‘‘నా కిలాంటి భార్యనిచ్చావేం దేవుడా?’’ అంటూ అలాగే చూస్తూ నిలబడ్డాడు అభిరాం.

ఆ ఏడుపు విని ‘‘లాలిత్య ఈ టైంలో ఏడుస్తుందేం?’’ అని ఆశ్చర్యపోతూ తన మీదవున్న భర్త చేతిని మెల్లగా తీసి పక్కనపెట్టి నెమ్మదిగా లేచి బయటకొచ్చింది దేదీప్య.

‘‘లాలిత్యా! ప్లీజ్‌! అందరు వింటారు లే. లోపలకెళ్దాం.’’ అన్నాడు.

‘‘లోపలకెళ్లాక నన్ను మీరేం చెయ్యరుగా?’’ అంది తడి నిండిన కళ్లతో చూస్తూ, ఎక్కిళ్లతో కూడిన ఏడుపును ఆపుకుంటూ.

‘‘చెయ్యనని చెప్పానుగా’’ అన్నాడు.

ఆమె లోపలికి నడిచింది.

భార్య బయటకి ఎందుకెళ్లిందో అర్థం కాక…. ‘‘దీని మొక్కల పిచ్చి చల్లంగుండ యిప్పుడు గాని నీళ్లు పోస్తుందా?’’ అని మనసులో అనుకుంటూ బయటకొచ్చిన దీపక్‌ మసక వెలుగులో లోపలకెళ్తున్న  అభిరాంని చూశాడు. వెంటనే దేదీప్యను చూశాడు.

‘‘లాలిత్య ఏడుస్తుందండి! అందుకే బయటకొచ్చాను.’’ అంది దేదీప్య.

‘‘ఏడవక అందరు నీలాగ సంతోషంగా వుంటారా? అదృష్టం వుండొద్దూ.  రా. లోపలకి. ఏంటో ఖర్మ. ఎవరేడ్చినా మనం రావాలి బయటకి.  బంగారం లాంటి నిద్ర పాడు చేశావ్‌?’’ అనుకుంటూ లోపలకెళ్లి పడుకున్నాడు.

దేదీప్య వెళ్లి మెల్లగా అతని పక్కన పడుకొంది.

దేదీప్యకి ఎన్ని ఆఫీసులు తిరిగినా, ఎన్ని షాపులు తిరిగినా ఉద్యొగం దొరకలేదు.

తిరిగి తిరిగి ఇంటికొచ్చిన దేదీప్యను చూడగానే.

‘‘ఏమైంది నీ ఉద్యోగ వేట? ’’ అన్నాడు దీపక్‌. అతని మాటల్లోని వ్యంగ్య బాణం సూటిగా గుచ్చుకొంది.

‘దొరకలేదండి!’ అని చెప్పటం దేదీప్యకే విసుగ్గా వుంది.

ఆమె సమాధానం అతనిలో నిరాశను, బాధను పెంచి ఒక్కోసారి కోపం కూడా వస్తోంది. ఆ కోపాన్ని దేనిమీదనో ఒక దాని మీద చూపిస్తూనే వున్నాడు. దీపక్‌ కోపాన్ని తట్టుకోలేక, అన్నయ్య గుర్తుకొస్తూ ఆలోచనగా కూర్చుంది దేదీప్య.

‘‘ఏ పనీ లేకుండా ఆలోచిస్తూ గడిపేవాళ్లంటే నాకు ఒళ్లు మంట. పైసా సంపాదన లేకుండా నీలాంటి వాళ్లు ఎలా గడిపేస్తారో?’’ అన్నాడు దీపక్‌.

ఆ మాటలకి సంజలో ఎరుపు రంగులోకి మారిన సూర్యబింబంలా దేదీప్య ముఖం జేవురించింది.

‘‘అసలు నేనెందుకు ఉద్యోగం చెయ్యాలి?  ఈ సంసారంలో మీతో పాటు సమానంగా ఆనందించి అనుభవించే హక్కు నాకుంది. మీ సంపాదనలో నా అవసరాలకి తగినంత ఖర్చుపెట్టుకునే అధికారం కూడా వుంది.’’ అని కోపంగా ఆగిపోయింది. ఆవేశం, కోపం గొంతులోనే సుడులు తిరిగింది. కోరుకున్న దానికి, జరుగుతున్న దానికి మధ్యన ఘర్షణ మొదలైంది.

ఎంత అరిచినా అణువైనా కదలని దీపక్‌ దగ్గర హక్కులని, అధికారమని విప్లవం లేపితే ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు. తన గొంతు పదిమందికి విన్పిస్తుందే తప్ప` ఎంతో నైస్‌గా, సైలెంట్‌ క్రీచర్‌లా వుండే అతన్నెవరూ పట్టించుకోరు. అయినా బలవంతంగా లాక్కునే అధికారం ఎన్ని  రోజులు వుంటుంది? శిలలాంటి దీపక్‌ను శిల్పంలా మార్చటానికి తన దగ్గర వుండే ఉలి సరిపోతుందా? అనుకుంది మనసులో…, దీపక్‌ బయటకెళ్లాడు.

నారాయణరావు, ఇందుమతి సింహాచలం వెళ్లి సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకొని కూతురు దగ్గర ఓ నెల రోజులు వుండిపోవాలని వచ్చారు.

వచ్చినప్పటి నుండి దేదీప్య కన్పించకపోవటంతో యశోదరను అడిగారు.

‘‘ఉద్యోగ ప్రయత్నంలో దేదీప్య బిజీగా వుంది నాన్నగారు.” అంది యశోదర.

‘‘ఏదీ ఒకసారి పిలువు.  చూసి చాలరోజులైంది.’’ అన్నారు. ఇందుమతి, నారాయణరావు ఇద్దరు ఒకేసారి…

కిటికీలోంచి యశోదర పిలవగానే దేదీప్య తన సర్టిఫికేట్స్‌ వున్న పైల్స్‌ని పట్టుకొని బయటకు వెళ్తూ, ఇంటికి తాళం వేసి నేరుగా యశోదర దగ్గరకి వెళ్లింది.

తాతయ్యను, బామ్మను ప్రేమగా పలకరించింది.

‘‘అభిరాం పెళ్లిలో హడావుడిగా వుండి సరిగ్గా చూడలేదు కాని చాలా మారావు దేదీప్యా! మార్పు రూపంలో లేదు కాని మొత్తానికి నీలో ఏదో మార్పు కన్పిస్తోంది. తాతయ్య దగ్గరకి వచ్చి నవలలు పట్టుకెళ్లే  ఆ దేదీప్యకి ఇప్పుడు నాకళ్లముందున్న నీకు చాలా తేడా కన్పిస్తుంది.’’ అంటూ ప్రేమగా దగ్గరకి తీసుకొని, ఆప్యాయంగా తల నిమిరింది ఇందుమతి.

దేదీప్యను ఇందుమతి అలా దగ్గరకు తీసుకోవటం, ప్రేమగా తల నిమరటం, లాలిత్యకి నచ్చక కళ్లు మండాయి. అత్తగారే కాక వీళ్లు కూడా తెలుసా దేదీప్యకి?  వీళ్ల అనుబంధం ఇంత గాఢమైందా? అని మనసులో అనుకుంటూ మెట్లెక్కి పైకెళ్లింది.

ఇందుమతి పక్కన కూర్చుని వున్న దేదీప్యను చూస్తూ…

‘‘ఉద్యోగం చేసేంత తీరుబడి నీకు వున్నప్పుడు  ఆ ఎం.బి.ఎ. కాస్త పూర్తి చేయలేకపోయావా?’’ అన్నారు నారాయణరావు.

‘‘ఎం.బి.ఎ. చెయ్యటం ఖర్చుతో కూడిన పని తాతయ్యా! ప్రస్తుతం సంపాదన కోసం ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను.’’ అంది దేదీప్య.

‘‘మీ అన్నయ్యకి నీ ప్రాబ్లమ్స్‌ చెబితే నీకీ ఉద్యోగం చెయ్యవలసిన అవసరం రాకుండా నీ పేరుతో కొంత డబ్బు పంపేవాడు కదా! నీకెందుకింత రిస్క్‌?’’ అంది ఇందుమతి.

‘‘రిస్క్‌ లేని లైఫంటే డబ్బులివ్వకపోయినా, కొంతమంది భర్తల దగ్గర పనిచేసే భార్యల్లా వుంటమేనా బామ్మా?’’ అంది నవ్వుతూ.

దేదీప్య నవ్వి చాలా రోజులైంది. కనీసం బామ్మ దగ్గరైనా నవ్వుతూ మాట్లాడి మనసు తేలిక చేసుకోవాలనిపించింది దేదీప్యకి.

‘‘అదేంటి దేదీప్యా! అలా అంటున్నావ్‌?’’ ఆశ్చర్యంగా అంది బామ్మ.

‘‘రిస్క్‌ లేని లైఫంటే నాకు ఎలర్జీ బామ్మా! కేవలం రిస్క్‌ లేకుండా బ్రతకటం కోసం మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మార్చుకోవటం నాకిష్టం లేదు. సపోజ్‌ మా బావగారే చూడండి! ఏ పనీ పాటా లేకుండా దీపక్‌ ఇచ్చే డబ్బు కోసం ఒకటో తారీఖు రాగానే తల్లిని పంపటం సెంటిమెంట్స్‌ని వాడు కోవటమే కదా! అలా నేను కూడా సెంటిమెంట్స్‌ని ఆయుధంగా వాడుకొని మా అన్నయ్య, వదినల మీద డిపెండ్‌ అయితే వాళ్లకీ నాకు తేడా ఏముంది?’’ అంది దేదీప్య. దేదీప్యలో వ్యక్తిత్వం బాగా పెరిగినట్లు గమనించాడు నారాయణరావు.

‘‘బాగా చెప్పావు దేదీప్యా.!’’ అంటూ అక్కడకి వచ్చిన రాజేశఖరంని చూడగానే.

‘‘నమస్తే అంకుల్‌! ’’ అంటూ వినయంగా లేచి నిలబడింది దేదీప్య. తన కోడలికి ఈ దేదీప్యకి ఎంత  తేడా వుంది అని మనసులో అనుకుంటూ.

‘‘కూర్చోమ్మా!’’ అన్నాడు రాజశేఖరం.

కూర్చుంది దేదీప్య.

‘‘దేదీప్యా! నాకు తెలిసిన ఒక చోట జాబ్‌ వుంది చేస్తావా?’’ అక్కడే సోఫాలో కూర్చుంటూ అడిగాడు రాజశేఖరం.

‘‘ చేస్తాను అంకుల్‌!’’ అంది దేదీప్య.

‘‘ముఖ్యంగా ఆ జాబ్‌కి కంప్యూటర్‌ వచ్చి వుండాలి. నీకు కంప్యూటర్‌  వచ్చా?’’.

‘‘వచ్చు అంకుల్‌!’’

‘సరే ఇప్పుడే కాల్‌ చేసి సుబాష్‌చంద్రతో మాట్లాడతాను. సుభాష్‌ చంద్ర నా బెస్ట్‌ ఫ్రెండ్‌.  ఆయన నీకా జాబ్‌ తప్పకుండా ఇస్తారు.’’ అన్నాడు రాజశేఖరం.

ఆయన మాటలు శ్రేష్టతో పాటు అక్కడున్న వాళ్లందరికి సంతోషాన్ని కల్గించాయి.

* * * * *

అనంతకోటి జీవరాసులకి వెలుగునిచ్చేందుకు సూర్యుడు దేదీప్య మానుడై ఎగసివస్తున్నాడు.

‘‘నేత్రా పత్రిక’’ అన్న నేమ్‌బోర్డు వున్న బిల్డింగ్‌ ముందు ఆటో దిగి లోపలికి నడిచింది దేదీప్య.

ఎదురుగా వున్న రిసెష్షనిస్ట్‌ దగ్గరికి వెళ్లి సుబాష్‌చంద్ర గారిని కలవాలని చెప్పింది.

‘‘స్ట్రైట్‌గా వెళ్లి లెఫ్ట్‌కి తిరిగితే ఛైర్‌మెన్‌గారి ఛాంబర్‌ వుంటుంది వెళ్లండి’’ అంది రెస్పెక్ట్‌ నిండిన స్వరంతో రిసెప్షనిస్ట్‌.

ఛైర్‌మెన్‌ సీట్లో కూర్చుని వున్న సుభాష్‌చంద్ర దూరం నుండే దేదీప్యను గ్లాస్‌ డోర్‌ లోంచి గమనించాడు.

ఆమె నడిచే విధానం, శరీర భంగిమ, కదలికలు, ఆత్మ విశ్వాసంతో తొనికిసలాడుతూ  ‘‘నేను చాలా ముఖ్యమైన మనిషిని’’ అన్న సూచన అంతర్లీనంగా ఆమె నడకలో కన్పించి తలపంకించాడు.

డోర్‌ నాక్‌ చేసి లోపలకి వచ్చిన దేదీప్యను చూడగానే

‘‘ప్లీజ్‌ బి సీటెడ్‌.’’ అన్నాడు సుభాష్‌చంద్ర.

ఆయనకి ఎదురుగా వున్న చెయిర్‌లో కూర్చుంది దేదీప్య.

ఆమె కూర్చున్న విధానంలో వున్న  ప్రత్యేకతను కూడా వెంటనే గమనించాడు సుభాష్‌ చంద్ర.

సుబాష్‌చంద్రకి ఫిఫ్టీ ఇయర్స్‌ వుంటాయి. పుల్‌ సూట్‌లో అనుభవం పండిన మనిషిలా గంభీరంగా కన్పిస్తున్నాడు.

సుభాష్‌చంద్ర ముందుగా దేదీప్య సర్టిఫికేట్స్‌ని పరిశీలనగా చూశాడు. తర్వాత ఆమె ముఖంలోకి చూస్తూ….

‘‘మీకీ ఆఫీసులో మంచి కీలకమైన పోస్టు ఇచ్చాననుకోండి! మీరెలా ఫీలవుతారు? మీ రియాక్షన్‌ ఎలా వుంటుంది?’’ అన్నాడు.

ఆమె ఏ మాత్రం తడబడలేదు.  నేరుగా ఆయన ముఖంలోకి చూస్తూ…

‘‘ఈ పనికి నేను అర్హురాలినా? కాదా? అని ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటాను సార్‌! తర్వాత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు నేను ఏం చేయాలి. అని ఆలోచిస్తాను.  నా వృత్తి, నా కెరీర్‌, పనిపట్ల పాజిటివ్‌గా వుంటాను. నా సబార్డినేట్స్‌ని కూడా నన్ను అనుసరించేలా చేసుకుంటాను. నా మూడ్స్‌, స్పిరిట్‌ను ఎప్పటికప్పుడు ఎలివేట్‌ చేసుకుంటూ ఉత్సాహంగా పని చేసుకునేందుకు కృషి చేస్తాను.’’ అంది దేదీప్య.

‘హేపీగా ఫీలవుతాను’ అని ఒక్క మాటలో చెప్పకుండా ఇంత వివరణ ఇచ్చిన దేదీప్య వైపు ఆశ్చర్యపోతూ రెప్పవాల్చకుండా చూశాడు సుభాష్‌చంద్ర.

‘‘చూడమ్మా దేదీప్యా!  పాఠకుల ఇష్టా, ఇష్టాలను అభిరుచులను దృష్టిలో వుంచుకొని లోకంలో జరిగే వింతలు, విశేషాలను గేదర్‌ చేసుకుంటూ వ్యాపారం నిర్వహిస్తున్న పత్రిక ఇది. అటువంటప్పుడు గతంలో మీకీ ఫీల్డ్‌తో ఏ మాత్రం టచ్‌ లేకుండా మిమ్మల్ని తీసుకున్న దానివల్ల నాకంత పోగ్రెస్‌ రాకపోవచ్చు.’’ అంటూ సందేహంగా చూశాడు.

ఏమాత్రం సంకోసించలేదు దేదీప్య.

‘‘మీకా డౌట్‌ అక్కర్లేదు సార్‌! నాకు సాహిత్యం పట్ల అభిరుచి, పుస్తకాలు చదవటం పట్ల ఆసక్తి వుంది. వేయి అడుగుల దూరానైన్నా ఒక్క అడుగుతోనే ప్రారంభించినట్లు ఇప్పుడు మీరిచ్చే అవకాశమే నా అనుభానికి పునాది. ఇకముందు నాలో కొత్త ఆలోచనలు రావాలన్నా వాటిని ఎనలైజ్‌ చేసుకోవాలన్నా నాకంటూ ఓ పని వుండాలి.  ఆ పని మీరిస్తేనే వస్తుంది.’’    అంటూ ఆత్మ విశ్వాసంతో నిర్భయంగా మాట్లాడింది.

ఆసక్తిగా, విస్మయంగా ఆమెనే చూశాడు సుభాష్‌చంద్ర.

తన ఎక్స్‌పీరియన్స్‌లో ఇటువంటి ఆన్స్‌ర్స్‌ ఇచ్చిన మొదటి వ్యక్తి ఈ అమ్మాయే అనుకున్నాడు.  ఇలాంటి వాళ్లలో ఆత్మ పరిశీలన ఎక్కువగా వుంటుంది. వాళ్ల టాలెంట్‌ను వాళ్లు అర్థం చేసుకొని ఏది అనుకుంటే అది సాధించగలగుతారు. ఇతరులకంటే డిఫరెంట్‌గా జీవించాలనుకుంటారు.

దేదీప్యలో నిగూఢంగా దాగివున్న శక్తిని అన్ని కోణాల నుండి తన అనుభవంతో తడిమి చూసి ఆమెను తన పి.ఎ.గా నియమించుకున్నాడు. సుభాష్‌చంద్ర.

 

 

 

 

 

1 thought on “మౌనరాగం -4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *