April 20, 2024

వెలుగునీడలు – 1 (వెండితెర నవల)

రచన: ముళ్లపూడి వెంకటరమణ

ప్రచురణ: హాసం

పరిచయాలు అక్కర్లేని సుప్రసిద్ధ రచయిత, సినీనిర్మాత శ్రీ ముళ్లపూడి వెంకటరమణ. ’50లలో ప్రస్థానం ప్రారంభించిన శ్రీయుతులు రమణ, బాపు తమ రాత-గీతల ద్వారా, సినిమాల ద్వారా ఒక తరాన్ని మెస్మరైజ్ చేసేశారని చెప్పవచ్చు. వారిమీదనున్న అపారగౌరవం చేతనే ‘హాసం’ నడిచినంతకాలం మేము ‘బాపురమణీయం’ అనే శీర్షిక నడిపాం. రమణగారి 8 సంపుటాల సాహితీసర్వస్వంలో చోటు చేసుకోని మూడు వెండితెరనవలలను ‘హాసం ప్రచురణలు’ ద్వారా వెలువరిద్దామన్న సంకల్పం మాకుంది. ‘ఇద్దరు మిత్రులు’ (1961) వెండితెర నవలను యిప్పటికే 23 వ ‘హాసం’ ప్రచురణగా వేశాం. ఈ ‘వెలుగు నీడలు’ వెండితెర నవలను మాకు సమకూర్చిన డా!!విజయమోహన్ రెడ్డి (అనంతపురం) గారికి ప్రత్యేక కృతజ్ఞులు.

వెండితెర నవల అంటే సినిమా స్క్రిప్టు కాదు. కెమెరా భాషించే మూగబాసలను, సంభాషణలలో అంతర్లీనంగా వుండే ధ్వనిని, పాత్రల చర్యల వెనుక నున్న తర్కాన్ని, కవిహృదయాన్ని పాఠకుడికి విప్పి చెప్పే, విశదీకరించే ప్రక్రియ. సినిమా అనేక కళల సమాహారం, పండితుడి నుండి పామరుడి వరకు వివిధ స్థాయిల్లో వుండే సినిమా ప్రేక్షకులకు రచయిత, దర్శకుడు ఉద్దేశించినవన్నీ చేరతాయన్న నమ్మకం లేదు. ఇటువంటి వెండితెర నవలలు ఆ ‘గ్యాప్’ను చక్కగా పూరిస్తాయి. రమణ వంటి వెండితెర నవలాకారుడు లభిస్తే ఎన్ని వన్నెచిన్నెలు అమరుతాయో చ(ది)వి చూడండి. ముఖచిత్రం, లోపలి బొమ్మలు శ్రీ బాపుగారివి. ఉపయోగించుకోనిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. శ్రీ అన్నపూర్ణా పిక్చర్స్ వారికి ధన్యవాదాలు.

 

       

కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి

ప్రచురణకర్త

Velugu Needalu (1961)2

వెలుగు నీడలు

 

ఆంగ్ల సామ్రాజ్యం మీద అస్తమించాడనుకున్న రవి, చివరకు మాట దక్కించకుండా అంతపనీ చేసి ఊరుకున్నాడు. ఆయనటు దిగగానే, ఇట్నుంచి తూరుపు ఖండ  పురవాసులమీద కొత్తసూర్యుడు ఉదయించాడు. రెండువందల ఏళ్లుగా నిద్రపోతున్న జాతి మేలుకొంది. జనులు తమ జీవితాలకూ, భావాలకూ పట్టిన బూజు దులిపివేసుకుని, వెల్ల వేసుకుని, కొత్తగాలి పీలుస్తున్నారు. అంతకాలం వాళ్ళని జోకొట్టిన ‘సర్’లు, రావుబహద్దర్‌లు ప్లేటు ఫిరాయించారు. రావు బహద్దర్ ఆర్.వెంకట్రామయ్యగారు మాత్రం ఇంకా, ‘రాజసేవే దేశసేవ’ అన్న జోలికి, పాట వరసగాని, మాటవరసగాని మార్చుకోలేదు. ఆయన పేరుకి పట్టుకు వేళ్లాడుతున్న బిరుదును  పట్టుకు వేళ్ళాడం మానలేదు. ఆ బూజు వదల్చదల్చుకోలేదు. భావాలకు పట్టుకున్న రాజసేవ బూజూ దులుపుకోలేదు. జనం వినడం మానేసినా, ‘రాజసేవే దేశసేవ’ అన్న చాటింపుగాని, జనం కొనడం మానేసినా తన పత్రికకు ‘రాజసేవ’ అన్న పేరూ, దాని తీరూగాని, కనీసం తన ‘జార్జిప్రెన్సు’ పేరుగాని మార్చుకోలేదు. ఆంగ్ల సామ్రాజ్యపు అస్తమయ సమయం సూర్యుడి ఆఖరు కిరణం. తన జీవితంలో దివ్యంగా ప్రకాశిస్తోందని ఆయనకు గట్టి అనుమానం. రావు బహదూర్ బిరుదును శిరసావహించవలసిందే తప్ప  త్రోసిరాజనేందుకు తనకు తాహతులేదని ఆయన తాత్పర్యం.

రావు బహదూర్ వెంకట్రామయ్యగారు చెన్ను తరిగినా, రొమ్ము విరుచుకునే తిరుగుతారు. బిరుదు మగాడిలాగే ఉంటారు. దర్జా అయిన విగ్రహం, ధాటి అయిన మాటాను. కళగల ముఖం. రాజసేవ పత్రిక పల్లకీని రాజసేవకుడు వెంకట్రామయ్యగారూ, ఆయన సేవకుడు వెంగళప్పగారూ జమిలిగా మోస్తున్నారు. ఎడిటర్, పబ్లిషర్ అండ్ ప్రింటర్ వెంకట్రామయ్యగారైతే, రిపోర్టర్, సబ్ఎడిటర్ అండ్ కంపోజిటర్ వెంగళప్ప. బోర్డుమీద చోటు చాలదు గాని, రాసుకోవాలంటే ఇంకా బోలెడు ఘనకార్యాలున్నాయి వెంగళప్ప చేసేవి – ట్రెడిల్‌మన్ (అనగా కాళ్ళు పడిపోయేలా అచ్చుయంత్రం త్రొక్కుట) బైండర్ (అనగా జబ్బలు పడిపోయేలా కాగితాలు మడతపెట్టుట). డిస్పాచ్‌క్లర్క్ (భుజాలు కుంగిపోయేలా అవన్నీ చిత్తుకాయితాల షాపుకీ, కొన్ని పోస్టాఫీసుకి మోసుకు వెళ్లుట) ఫ్రూఫ్ ఎగ్జామినర్ (అద్భుతమైన అచ్చుతప్పులుచేసి మొహం వాచేలా చీవాట్లు తినుట). రావు బహద్దూర్‌వారి పర్సనల్ సెక్రటరీ (ఆయన కంగారు మాటలకు లయబద్ధంగా గెంతులు వేయుట). రావు బహద్దూరుని అర్ధాంగి రావుబహద్దూరిణి కనకదుర్గమ్మగారు తిట్లు వమ్ము కాకుండా ఒళ్ళు తూట్లుపడేలా తినుట… పుస్తకంలో కూడా చోటు చాలదు గాని ఇంకా ఎన్నో ఉద్యోగాలున్నాయి రాసుకుందికి.

అయినా ఇవన్నీ రాసుకుంటూ కూర్చుందికి వెంగళప్పకి టైము చాలదు. శాయశక్తులా రోజుతూ, రొప్పుతూ పనిచేసినా (శక్తి, రోజడానికి అన్వయిస్తుంది), పత్రిక రావల్సిన రోజు దాటిపోయింది. ఈ వారం పత్రికలో చాలా ముఖ్యమైన వార్త వెళ్లవలసిఉంది – రావు బహదూరుగారి దత్తపుత్రిక పుట్టినరోజు.  పత్రికలో ఇలాటి ముఖ్యవార్తలు తాజాగా వెళ్ళక ఆలస్యం అయితే జనం ఏమనుకుంటారు? జన్మదినోత్సవం. ఇలాటి ముఖ్యవార్తలు తాజాగా వెళ్ళక ఆలస్యం అయితే జనం ఏమనుకుంటారు?

అంతకన్న ముఖ్యం ఇంట్లో హాహాకారాల మాటేమిటి? ఇంట్లో భార్య తన ప్రయోజకత్వం మీద నూరిపోసే వెటకారాలూ మిరియాలు భరించలేక, రావుబహదూర్‌గారు ధుమధుమలాడుతూ వచ్చేశారు ప్రెస్సుకి.

వెంగళప్ప గోళ్లు తింటంలేదు సరిగదా కొరుక్కుంటూ కూడా కూర్చోలేదు. కాలుకొద్దీ ట్రెడిల్ తొక్కుతున్నాడు.

అందువల్ల యజమానికేమీ పాలుపోక, ‘ఏమోయి వెంగళప్పా! ఏం చేస్తున్నావు’ అన్నాడు ఓరగా చూస్తూ.

తను ట్రెడిల్ తొక్కడం కళ్ళారా చూస్తూనే వున్నా, యజమాని అది భరతనాట్యం ప్రాక్టిసు అని అపోహపడి, ఇప్పుడు వద్దు అనవచ్చు; అంచేత ఎందుకైనా మంచిదని ఉన్నమాట చెప్పేశాడు వెంగళప్ప.

“శ్రీమతే రామనుజాయనమః కొడుతున్నానండి. కాలికొద్దీ కొడుతున్నాను” అన్నాడు కొట్టడం మానేసి, తలెత్తి చూస్తూ.

“అది సరేనయ్యా, పత్రిక ఈవేళైనా బయటకు వస్తుందా” అని అన్నారు రావుబహదూర్‌గారు, చిరుకోపంమీద చిరునవ్వు పులిమి.

విసుగుని వినయంగా పరిమార్చి మరీ జవాబిచ్చాడు వెంగళప్ప. “అయ్యా, బయట పూళ్ల కెళ్ళవలసిన కాపీలు రైలెక్కి యీ పాటికి సగం దూరం వెళ్ళిపోయింటాయి. మిగతావి, ఇవిగో కొడుతున్నాను. అయ్యా! తమరు ఇంటికి తీసుకువెళ్ళడానికి తాజాగా ఒక కాపీకొట్టి ఇస్తాను” అని శ్రీమతే రామానుజాయనమః అన్న ఊతపదం ఊతతో బలంకొద్దీ మరోకాపీ అచ్చుకొట్టి తీసి అందించాడు

రావుబహదూర్‌గారు పత్రికమీద, చిరంజీవి ఫోటో చూసి ఉప్పొంగిపోయారు. “ఆ! ఆ! భలే భలే! భేషుగ్గా పడిందయ్య అమ్మాయి ఫోటో” అన్నాడు.

“అది పడడం ఏమిటండి మనం అచ్చుకొట్టడంలో ఉందంతాను” అన్నాడు వెంగళప్ప ‘వినయం’ ఉట్టిపడేలా.

పత్రిక చూసి మురిసిపోవడంలో మునిగిపోయి ఉన్నాడు గాని, యజమాని గనుక, ఈ మాట అంటున్నప్పుడు, వెంగళప్ప మొహంలో ఆ వినయం, వందనం చూసి ఉంటే తక్షణం బోనసో, ఇంక్రిమెంటో ఇచ్చేసేవాడే, ఆనందం పట్టలేక, ఫోటో చూసి, దానికింద వార్త చదవసాగాడాయన. వెంగళప్ప వింటున్నాడు.

“దత్తపుత్రిక జన్మదినోత్సవం. రావుబహదూర్ వెంకట్రామయ్యగారూ, వారి సతీమణి శ్రీమతి శునకదుర్గమ్మ…’ తరవాత తను అచ్చుకొట్టని మాట వినబడింది – “ఆ ! వెంగళప్పా !” అని. శ్రీమతే రామానుజాయనమః అనుకుని సిద్దపడ్డాడు చీవాట్లకు.

“నీమతే గోవిందాయనమః ఏమిఁటయ్యా కనకదుర్గమ్మకి బదలు శునకదుర్గమ్మ అని కొట్టేవు?” అన్నాడు రావుబహద్దూర్‌గారు.

“అయ్యా ! అయ్యా ! అదా  ! అమ్మగారి పేరు చెప్పగానే నాకు ఎక్కడ నరాలక్కడ బిగుసుకుపోయి నవనాడులూ కుంగిపోయి, కాళ్ళూ చేతులూ చల్లబడిపోతాయి. ఏం చెయ్యమంటారు?”

రావుబహదూర్‌గారిక్కూడా అచ్చుతప్పు గురించి పట్టింపు ఉన్నట్టులేదు; అమ్మగారి గురించే. “ఏడిసినట్టే ఉంది. ఇది అమ్మగారి కంటబడితే ఇంకేమన్నా ఉందా? వెయ్యవయ్యా వెయ్యి,  సవరణచేసి వేరే ఇంకో కాపీ వెయ్యి” అన్నాడు.

“చిత్తం. ఇదిగో, క్షణంలో” అంటూ వెంగళప్ప సవరణ కార్యక్రమం ఆరంభించాడు.

“ఇది సరేనయ్యా, దేశం మీదకు వెళ్ళిన కాపీల సంగతి ఏం చేస్తావని” అన్నాడు ఎడిటరుగారు.

“దానికేముందండి. వచ్చేవారం సవరణ వేసేస్తే పోలే!”

“అంతేలే, అయ్యవారేం చేస్తున్నారయ్యా అంటే తప్పులు రాసి దిద్దుకుంటున్నారనీ – నీ నిర్వాకం ఎప్పుడూ ఇంతేగా, ఊఁ ఇవ్వు ఇవ్వూ, చూసుకున్నాను కాబట్టి సరిపోయింది” అంటూ పత్రిక పుచ్చుకుని స్వర్గసీమకు (గృహమేకదా) బయల్దేరారు.

ఇల్లు చాలా సందడిగా ఉంది. ఇల్లాలు కనకదుర్గమ్మగారు శాంత సక్కుబాయి కోవలో మనిషని చెప్పుకుందికి ఎంతమాత్రం వీలులేదు. పక్కవాళ్ళకి వినబడదేమో అని భయపడాల్సినంత వెల్లగా, మెత్తగా ఎన్నడూ మాట్లడదు. ఆవిడ మాట వినడానికి ఎవరూ చెవులు రిక్కించుకోరు.

రావుబహద్దూరుగారు ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ చూడ ముచ్చటగా బొమ్మలూ;  ఆటవస్తువులూ చుట్టూ పరుచుకు కూర్చుంది. పనిమనిషి సత్తిని కేకేసి, చూచి మరీ పొమ్మంటోంది. అది పని చేసున్నానమ్మా అనేసరికి కేకలేస్తోంది. “పనీగినీ అన్నావంటే డిస్మిస్ చేసెస్తా. నేను చెప్పిందే పని – నువ్వు చేసేది కాదు. చూడు బొమ్మలన్నీ చూడు” అంది జబర్దస్తిగా.

పనిమనిషి మాటెలా ఉన్నా, రావుబహద్దూరుగారొచ్చి చూచి మురిసిపోయాడు. “అబ్బో అబ్బో… ఏమే, ఆ బొమ్మలన్నీ నీకా? అమ్మాయికా?” అన్నాడు సరసంగా.

“కాదు మీకు” అంది యిల్లాలు సుతారంగా.

“నీకేమో అనుకున్నాలే” అన్నాడు భర్త నీరసంగా.

“ఇంతకీ పత్రికేమైందీ?”

“ఇదిగో వచ్చేసింది.”

కనకదుర్గమ్మగారు పత్రిక అందుకుని చూసి, “అహా! ఎంచక్కా పడిందండి అమ్మాయి బొమ్మ” అంటూ ఉండగా మాటలోనే వచ్చేసింది కుందనబ్బొమ్మలాంటి అమ్మాయి సుగుణ “నాన్నా, నాన్నా” అంటూ.

“ఒచ్చేవా అమ్మా! ఒచ్చావా! నా బంగారు తల్లే. నా అపరంజి ముద్ద” అంటూ కనకదుర్గమ్మగారు లేచి పిల్లని యెత్తుకుని “ఏమమ్మ ఇంత ఆలస్యమయింది?” అంది.

“బడి ఇప్పుడే వదిలారమ్మా” అంది అపరంజిబొమ్మ.

కనకదుర్గమ్మగారికి బళ్ళమీద బళ్ళకొద్దీ కోపం వచ్చేసింది. “ఏం బళ్ళో, ఏం చదువులో, తెల్లారి పదిగంటలైతేగాని తెరవరు. మళ్ళీ అయిదూ అవకముందే మూసేస్తారు. ఎండలో వెళ్ళడం ఎండలో రావడమూను. పిల్లలు మాడి మసిబొగ్గులైపోతున్నారు” అంది. కోపం ఇంతదూరం వచ్చాక బళ్ళమీంచి భర్త మీదికి మళ్ళింది. “ఏమండి ! ఈ స్కూలు వేళలు కాస్త మార్పించలేరూ – పెద్ద రావుబహద్దర్ అంటూ మెడలోహటి తగిలించుకు తిరక్కపోతే -” అంది.

“ఆ! ఆ! ఎంతమాట! ఈ మెడలంటే ఏం సామాన్యమా ? రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్య ప్రభువులు సగౌరవంగా పిలిచి సత్కరించి యిచ్చారు. ఏమనుకున్నావో!” అన్నారు. రావుబహద్దూరుగారు ఈ మాట మటుకు ఆయన మాటిమాటికీ ఇంతధాటిగా చెప్పకోకపోతే ఆవిడ ఎనాడో తిక్కతిరిగి అది కాస్తా తీయించవతల పారేసేదే!

అంతలో సుగుణ బొమ్మలు చూసి, “అమ్మా ఈ బొమ్మలన్నీ ఎవరికే? అంది.

“నీకేనే తల్లీ, నీకే ఇదిగో నీ ఫోటోకూడా వేయించాం పేపర్లో. బాగుందా?” అంటూ పిల్లకి పత్రిక చూపించింది.

సుగుణకి నచ్చలేదు. ఆ మాటే అనేసింది. “ఏం బాగోలా, నాన్న నువ్వు కూడా ఉంటే ఎంత బాగుండును”; అంది.

తల్లి ఉప్పొంగిపోయింది.  “నా తల్లే, నాతల్లే” అంటూ మెటికలు విరుచుకొని, “ఎవండీ వింటున్నారా, వింటున్నారా! అమ్మాయి పాటి తెలివితేటలు మీకు లేకపోయాయి” అంది.

రావుబహదూరుగారు ఒప్పేసుకొనే వాడేమో తెలీదు గాని, ఆ లోపల పిల్లలు పరుగెత్తుకు వచ్చి సుగుణని ఆడుకుందికి పిలిచారు. సుగుణ వెళూవుంటే తల్లి పిలిచింది. “అమ్మా, తల్లీ, సుగుణమ్మ తల్లీ, ఇలా ఒకసారి వచ్చిపో! నీకు ఇష్టమని చెప్పి బజార్నుంచి మైసూరుపాకు, లడ్డూ, జిలేబీ, మసాల దోసే అన్నీ తెచ్చాను. దా, తినిపో” అంది.

“ఒద్దమ్మా, మేష్టరూ, ‘ఊళ్లో కలరా ఉందీ, బజార్నుంచి ఏదీ తినొద్దూ’ అన్నారు” అంది సుగుణ.

“అలాగేః? అయితే అట్టే పెడతాలే. కలరా తగ్గింతరవాతే తిందువుగాని-” అంది కనకదుర్గమ్మగారు.

 

***

 

మర్నాడు రివాజు ప్రకారం సూర్యుడు ఉదయించాడు లోకం మీదికి. కొంతసేపటికి రావుబహదూర్‌గారు కూడా అదేపని చెయ్యడానికి గాను ముస్తాబై మీసాలను ఖుషామత్ చేసుకుంటున్నారు విలాసంగా.

వార్తాహరుడు వెంగళప్ప, ఆరోజు “శుభవార్త”, అది పడిన పత్రికా పట్టుకు చక్కావచ్చాడు – శ్రీమతే రామానుజాయనమః. అయ్యా! ఈ రోజు పత్రిక చూశారా? ఆరోగ్యపురంలో కలరా విజృంభణ” అంటూ.

“ఏ ఆరోగ్యపురం ఎక్కడయ్యా?

“అదేనండి. మెన్న ఆరోగ్యశాఖమంత్రి వచ్చి ఆరంభించి పోలేదూ – మన యింటి వెనకాల పేట? దాంటో 15మంది దాదాపు మరణఁవున్నూ,” మరో 15మంది – మరణమున్నూ.”

రావుబహదూర్‌గారు, ఆ! అని నిర్ఘాంతపోయేసరికి, మళ్ళీ ఆ శ్రమలేకుండా సుగుణ పరుగెత్తుకువచ్చి “నాన్న నాన్నా! అమ్మ డోక్కుంటోంది” అంది.

నాన్నగారు కంగారుపడ్దారు. “ఆ డోకులే! డోకులే!” అంటూండగా “శ్రీమతే రామానుజాయనమః. అయ్యా, ఆర్యోగపురంలోనే కాదు. అంతఃపురంలోకి కూడా ప్రవేశించింది” అంటూనే, రావుబహదూరుగారి వెంట తనూ పెరట్లోకి పరుగెత్తాడు వెంగళప్ప.

కనకదుర్గమ్మగారు, దొడ్ది వరండాలో ఒక సులకమంచంమీద కూర్చుని డోక్కుంటోంది.

“ఇంకేఁవుందండి! అయిపోయిందంది. ముంచుకొచ్చేస్తోందండి, మృత్యువు ముంచుకొచ్చేసిందండి. ఇహ నేను బతకను. ఓయమ్మో నేనిహ బతకను” అంటూ ఆపసోపాలు పడిపోతూంది.

“ఏవిఁటి వెంగళప్పా! చూస్తూ అలా నిలబడ్డావేం? వెళ్ళి డాక్టర్ని పిలుచుకురావయ్యా” అన్నాడు యజమాని కంగారుపడుతూ.

శ్రీమతే రామానుజాయనమః అంటూ వీధివైపు పరిగెత్తి వెంగళప్ప హాల్లో పని మనిషిని చూసి హడలేసి పో పొమ్మంటూ అంతలోనే ఎదురొచ్చిన తన భార్య శాంతను చూసి ఆపేశాడు.

“ఏమే! ఏమే! నువ్వెందుకే ఇక్కడికి చస్తున్నావ్! కలరానే కనకదుర్గమ్మగారికి కలరానే!” అన్నాడు.

“ఆ! కలరానా!” అంటూ శాంతమ్మ మరింత కంగారుగా లోపలికి బయల్దేరింది. వెంగళప్ప అడ్డు తగిలాడు. “ఇదిగో నువ్వింటికెళ్ళు. అది అంటువ్యాధే ! వాళ్ళకేం, వాళ్లో పిల్లను దత్తయినా తెచ్చుకున్నారు. మనకీ అదీ లేదు, వంశం నిలబడ్డానికి – పో ! పో చెప్తా” అన్నాడు.

శాంతమ్మ విసుక్కుంది. “చాల్లెండి ఇంతకాలం వాళ్ల ఉప్పుతిని, ఆపదలో ముఖం తప్పిస్తామా” అంటూ లోపలికి వెళ్ళిపోయింది. శ్రీమతే రామానుజాయనమః అనుకుంటూ వెంగళప్ప డాక్టర్ కోసం పరుగెత్తాడు.

శాంతమ్మ వెళ్ళేసరికి కనకదుర్గమ్మగారు “ప్రయాణ సన్నాహం”లో చాలా హడావిడిగావుంది. రావుబహదూర్‌గారి దగ్గర ప్రమాణాలు చేయించుకుంటోంది. పసిపిల్ల సుగుణ బిక్కమొహం పెట్టి తండ్రి వెనుక నిలబడివుంది.

“ఎమండి! పోతున్నాను. వెళ్ళిపోతున్నాను, చెప్పండి చేతిలో చెయ్యివేసి ప్రమాణం చేయండి. అమ్మాయిని పువ్వులో పెట్టి పెంచుతారు కదూ?”

“పెంచుతాను” అన్నాడు, భర్త దుఃఖం అణచుకుంటూ.

“నాకు ద్రోహం చెయ్యరు కదూ? మళ్లీ పెళ్ళి చేసుకోరు కదూ?” అందావిడ దీనంగా.

“చేసుకోను.”

“నేను పోయింతరవాత, ఆడదాన్ని కన్నెత్తి చూడరుకదూ?”

అంత విచారంలోనూ రావుబహదూర్‌గారు అదోరకంగా నవ్వాడు. “నువ్వుండగా మాత్రం చూశానా కనకం? ఇక జన్మజన్మలకి ఆడదాని మొహం చూడను” అన్నాడు.

“అయితే పోతాను. ప్రశాంతంగా పోతాను” అని అంతపని చేయబోయి, ఏడుపువచ్చి; అంతలో శాంతమ్మను చూసి, చెప్పి మరీపోదామని ఆగి, “శాంతమ్మక్కా! వచ్చేవా?” అంటూ బావురుమంది కనకదుర్గమ్మగారు.

“ఊరుకో దుర్గమ్మక్కా. ఊరుకో. అలా అధైర్యపడితే ఎలా” అంది శాంతమ్మక్క కంటతడి పెడుతూ.'”లేదు. ఇహ లాభం లేదు; ఆ దేవదేవుడి ఆజ్ఞ అయిపోయింది. వెళ్ళిపోతున్నాను… అదిగో. పుష్పకవిమానం కూడా వచ్చేసింది” అంది దుర్గమ్మక్క ఆశగా పైకిచూస్తూ.

“అమ్మా!” అంటూ సుగుణ తల్లి దగ్గరకు పోబోయింది.

ఆవిడ వెంటనే వారించింది. “అయ్యో అయ్యో! పిచ్చితల్లి! దూరంగా పోమ్మా. నా దగ్గరికి రావదమ్మా. ఈ గాలికూడా సోకకూడదన్నారు. పిన్ని దగ్గరకెళ్ళు. ….శాంతమ్మక్కా! మా చెల్లెలు పోతూ పోతూ సుగుణను నా కొప్పగించింది. నేను పోతూ పోతూ నీ చేతుల్లో పెడుతున్నాను. ఇహ దానికి తల్లయినా; తండ్రయినా నువ్వే… అది వఠ్ఠి పిచ్చితల్లి. ఆక లెరగదు. అన్నం తినడం తెలీదు. చారెడ్నెయ్యేసి దోసెడన్నం కలిపితే బలవంతాన తినేది! ఎలా పెంచుతావో ఏమో” అంది. వెంటనే భర్తకేసి తిరిగి “ఏవండీ ఇంకా అలా కూచున్నారేవండి! ఆ విల్లు కాయితాలు పట్రండి” అని వురమాయించింది.

“ఇప్పడవెందుకే” అన్నాడు భర్త, ఆవిడకి పోయిన ఊహ అందక.

“అయ్యో! ఆస్తంత నా పేర తగులడింది గదండీ! నాతో బాటు అదీ తగులడ్డం దేనికి ! తీసుకురండి. అమ్మాయి పేర రాయించి తీసుకురండి. నేపోయేలోగా అవి రిజిష్ట్రీ అయిపోవాలి. వెళ్ళండి” అంది.

డాక్టరు వచ్చినా, పరీక్షచేస్తున్నా ఆవిడ ధ్యాసంతా ఆస్తిమీదా, రిజిస్ట్రేషనుమీదా ఉంది. మరోమాట తలకి తోచదు. మరోకళ్లకి తోచనివ్వదు. పరీక్షపూర్తిచేసి డాక్టరుగారు ఆలోచిస్తూ నిలబడ్డారు.

“అయ్యా! డాక్టరుగారూ, ఈ విల్లు రిజిష్ట్రీ అయీదాకా నయినా ప్రాణాలతో ఉంటానా?” అందావిడ దీనంగా.

“అమ్మ మీ కలాటి ప్రమాదం ఏమీలేదండి.”

“అదే ఈ వైధ్యుల కొచ్చిన జబ్బు. చచ్చేదాకా, బతుకుతారనే చెబుతారు” అంది కనకదుర్గమ్మగారు, రుసరుసలాడుతూ.

“డాక్టరుగారూ, ఇంతకూ ఏమిటండీ! కలరాయేనా?” అన్నాడు రావుబహదూర్‌గారు అదుర్దాగా.

డాక్టరు తృప్తిగా మందహాసం చేశాడు. “మీ పూజ ఫలించింది. ఇవీ, మామూలు వాంతులు కావు. వేవిళ్ళు. వంశోద్దారకుడు పుట్టబోతున్నాడండీ మీకూ!” అన్నాడు.

రావుబహదూరుగారు ముక్కున వేలేసుకుని నిర్ఘాంతపోయాడు “ఆఁ!…” అంటూ.

కనకదుర్గమ్మ దుఃఖం, భయం క్షణాలమీద మాయమైపోయాయి. తన ఈ అఘాయిత్యపు ఆర్బాటానికైతేనేమి, ఇన్నాళకు బిడ్డతల్లి కాబోతున్నందుకైతేనేమి ఆవిడకి సిగ్గు ముంచెత్తుకొచ్చింది. చూసేవాళ్ళకి ‘ఎన్నాళ్ళకెన్నాళ్ళకు’ అనిపించేలా, చాలా కాలం తరువాత ఇన్నాళ్ళకు ఆవిడ సిగ్గుపడింది. చాలా అందంగా సిగ్గుపడింది.

“దుర్గమ్మకా! విన్నావా! సుగుణ వచ్చిన వేళావిశేషం. నీ కడుపున ఓ కాయ కాస్తూంది” అంది శాంతమ్మ, సంతోషంతో మొహం ఇంత చేసుకుని.

“ఊ! ఒకళ్ళ అదృష్టం ఎందుకవుతుందిలే. ఎన్ని నోములు నోచాను! ఎన్ని వ్రతాలు చేశాను, అన్నీ ఈనాటికి ఫలించాయి” అంది దుర్గమ్మక్క పుల్లవిరువుగా.

 

 

***

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *