April 18, 2024

అనుపమ దర్శక నిర్మాత కె. బి. తిలక్ అనుభవాలు-జ్ఞాపకాలు-2

రచన: వనం జ్వాలా నరసింహారావు vanam

కామ్రేడ్స్ తో కలిసి

క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా అరెస్టయిన తిలక్‌‍ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడానికి ముందర ఓ రెండు వారాలు ఏలూరు సబ్ జైలులో వుంచారని చెప్పుకున్నాం గదా. అక్కడున్న రోజులను గుర్తు చేసుకుంటూ, ఉద్యమాల ఊపిరి తీసే ప్రయత్నాలు అప్పట్లో ఎలా జరిగా యోనని సూచనప్రాయంగా చెప్పారు. తన కంటే వయస్సులో పెద్ద వారైన మోతె నారాయణరావు గారు, కార్వంచి రామమూర్తి గారు తిలక్‌‍తో పాటు జైల్లో వున్నారు. అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ శేషాద్రి ఒక సీనియర్ ఐ.సి.యస్. అధికారి. ఆయనో మారు సబ్‌ జైలుకు వచ్చి వీరిని పరామర్శించారు. “ఎందుకీ కుర్రవాడిని (తిలక్‌ను) మీరు చెడగొడుతున్నారు” అని మోతె-కార్వంచి లను ఆయన ప్రశ్నించినప్పుడు సమాధానం ఇచ్చింది వారు కాదు, కాని తిలక్. తనను వాళ్లు చెడగొట్టడం అనేది తప్పు అనీ, మహాత్మా గాంధీ పిలుపు మేరకు తానే స్వచ్చందంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటున్నాననీ ఎదురు జవాబు చెప్పారు తిలక్.

ఉద్యమాలను నీరు కార్చే, కౌన్సిలింగ్ లాంటి వ్యవహారాలు ఈనాటివి కావు అన్నారు తిలక్. తన జైల్‌ మేట్స్ మోతె-కార్వంచి లను కలెక్టర్ వేసిన ప్రశ్నలు దీనికో చక్కని ఉదాహరణ అని ఆయన అభిప్రాయం. ఇలా నీతులు చెప్పడం మన సంస్కృతిలో ఓ అంతర్భాగం అనీ, మన రక్తంలో అవి జీర్ణించుకుపోయాయనీ అంటూ, ఒకవేళ శేషాద్రి మాటలకు తాను లొంగిపోయి నట్లయితే తన ఆశయాలకు అంతటితోనే తిలోదకాలు ఇచ్చినట్లే కదా అన్నారు. పోరాట పటిమను, ఉద్యమాల స్పూర్తిని నీరు కార్చే ప్రయత్నం అనాది ఆచారమే అని గుర్తుచేసుకున్నారు తిలక్.

తిలక్‌ మేనమామ ఎల్. వి. ప్రసాద్‌ గారి తండ్రి అవధులెరుగని ఔత్సాహికుడు. ఏదో, ఎప్పుడూ చేయాలన్న తపన ఆయన గుణం. స్వగ్రామం నుండి తరలి వచ్చి, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో సెటిలయ్యారు. అక్కడి, చల్లపల్లి జమిందారు గారికి చెందిన అటవీ భూమిని నరికించి వ్యవసాయం చేయించడంతో సహా పళ్ల తోటలు కూడా వేయించారు. ఆ రోజుల్లోనే పట్టు ఉత్పత్తి (సెర కల్చర్) ఆయన వ్యాపకాల్లో ఒకటి. తిలక్‌ గారి తల్లి ఆయన ఏకైక కూతురు. అందుకే, ఆమె గారి పేరు మీద కూడా ఓ పళ్లతోట వుంచారాయన. దెందులూరుకు సమీపంలో వున్న ఆ తోటకు వేసవి శెలవుల్లో నడచుకుంటూ వెళ్ళొస్తూ సరదాగా గడుపుతుండేవారిమని గుర్తుచేసుకున్నారు తిలక్.

ఏలూరు సబ్‌ జైల్లో వున్నప్పుడు, ప్రతి రోజూ ఉదయం తననూ, తోటి ఖైదీలను కొంత సేపు ఆరు బయటకు తీసుకొచ్చి తిప్పేవారట అధికారులు. ఆ రోజుల్లో ఎల్. వి. ప్రసాద్ గారి భార్య – తన మేనత్త, పెదమామ బస్వయ్య గారితో తనకు టిఫిన్ పంపేదట. ఎల్‌ వి గారి కుటుంబం ఏలూరులోనే కాపురం వుండేదారోజుల్లో. మద్రాసులో వుండగా, హెచ్. ఎమ్. రెడ్డి గారి వద్ద ఆయన తీసిన “హోనెస్ట్ రోగ్” అనే సినిమాకు పనిచేసిన అనుభవంతో, తానే స్వతంత్రంగా ఓ సినీ కంపెనీ స్థాపించే ప్రయత్నంలో తలమునకలై వున్న శ్రీ ఎల్. వి. ప్రసాద్ ఆ పనిమీద పలుచోట్లకు వెళ్లొస్తుండేవారు. “సత్యమే జయం” అనే తెలుగు నాన్‌ డిటేయిల్డ్ పుస్తకం ఆధారంగా నిర్మించిన చలన చిత్రం హోనెస్ట్ రోగ్.

మొత్తంమీద ఎల్. వి. గారెళ్లిన కొన్నాళ్లకు మద్రాసు చేరుకున్నారు తిలక్. సారధి బ్యానర్ క్రింద కె. ఎస్. ప్రకాశరావు గారు తన మోడల్ ప్రొడక్షన్స్ సంస్థ తరపున నిర్మిస్తున్న “గృహ ప్రవేశం” సినిమా దర్శకత్వం కూడా వహిస్తున్నారు శ్రీ ఎల్. వి. ప్రసాద్ అప్పట్లో. త్రిపురనేని గోపీచంద్ గారు ఆ సినిమా రచయిత.

మోడల్ ప్రొడక్షన్స్ తాలూకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ- “ప్రీమియర్ ఫిల్మ్స్”- ఒక దానిని నెలకొల్పారు అప్పట్లో, శ్రీ కోవెలమూడి భాస్కర్ రావుగారు. దాంతో సంబంధమున్న మరో ప్రముఖ వ్యక్తి రామనాధ బాబు. ఆయన చల్లపల్లి రాజా గారి బావమరిది. ప్రీమియర్ ఫిల్మ్స్ రెప్రజెంటేటివ్‌గా తరచూ ఆంధ్ర ప్రాంతంలోని వివిధ ప్రదేశాలకు వెళ్లవలసి వస్తుండేది తిలక్‌ గారికి. ఆ పని ఆయనకిష్టంలేదు. అయినా తప్పలేదు. అందుకే కొంతకాలమే అలా పనిచేశారు. రెప్రజెంటేటివ్‌గా తన తోడు తీసుకెళ్లిన సినిమా బాక్సుల్లో “వీర్‌కునాల్” అనే హిందీ సినిమా కూడా ఉన్నట్లు గుర్తు చేసుకున్నారాయన.

తన అభిరుచులకూ, ఆశయాలకూ అనుకూలంగా వున్న వ్యక్తులతో ఎక్కువ పరిచయం పెంచుకునే మనస్తత్వం తిలక్ గారికి – నాటికీ, నేటికీ. ఆ బాటలోనే ఎమ్. వి. రాజన్‌తో దోస్తీ కుదిరింది. అప్పటికే పేరు పొందిన సినీ ఎడిటర్ ఆయన. ఎల్.వి.గారికీ సన్నిహితుడు కూడా. ఆయన బ్యాచ్ కు చెందిన వ్యక్తి. గృహప్రవేశం సినిమాకు కూడా ఆయనే ఎడిటర్. హెచ్. ఎమ్‌. రెడ్డిగారితో కలిసి పనిచేశారు. ఎల్. వి. ప్రసాద్‌ గారు భక్త ప్రహ్లాద్ సినీ నిర్మాణం చేస్తున్న ఆ రోజుల్లో, రాజన్‌ గారితో సాన్నిహిత్యం పెంచుకుంటూ, ఎడిటింగ్ లైన్‌లో పట్టు సంపాదించుకునే ప్రయత్నాలు కొనసాగించారు తిలక్.

అందరికీ తెల్సిన విషయమే – భక్త ప్రహ్లాద్ తెలుగులో మొదటి టాకీ చిత్రం. ప్రసాద్ గారందులో నటించారు. మొదటి హిందీ టాకీ చిత్రమైన “ఆలమ్ ఆరా” తో కూడా ప్రసాద్ గారికి సంబంధముంది. భక్త ప్రహ్లాద్ రిలీజ్ అయిన రోజుల్లో ఏలూరులోని పాండురంగ థియేటర్‌లో తిలక్ ఆయన అమ్మమ్మగారి (ప్రసాద్‌గారి తల్లి) తో కల్సి సినిమా చూసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అందులోని ఓ సన్నివేశానికి స్పందిస్తూ ఆమె గారు, తన కుమారుడికి నిజంగా ఏమన్నా జరుగుతున్నదో అన్న రీతిలో ఆందోళన చెందారని నవ్వుకున్నారు!

ఏదేమైనా తెలంగాణా ఉద్యమంతో తన ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలను మాత్రం కొనసాగిస్తూనే ఉండేవారు తిలక్. ఆయన తన సహచరులతో కలిసి జైలు నుండి విడుదలై బెయిల్‌పై వస్తుండే ఉద్యమకారులను ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లో కలుసుకుని, ఇంకో కంటికి తెలియకుండా అజ్ఞాత వాసానికి-వారి వారికి నిర్దేశించిన స్థలాలకు తరలిస్తూండేవారు. ఎస్. వి. నరసయ్యగారు అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ కో ఆర్డినేటర్‌గా వుంటూ అజ్ఞాత కార్యకలాపాల వ్యవహారాలు నడపడానికి కాంటాక్టు పాయింట్ గా వుండే వారు.

అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు తిలక్. “పలనాడు వెలలేని మాగాణిరా…” అనే విప్లవ గీతంతో అనుబంధమున్న పల్లనాడు పులే పుల్ శివయ్య గారిని గురించి చెప్పారు. కమ్యూనిస్టు వుద్యమ ఆరంభంలోనే ఆయన వినుకొండలో ఇంటర్న్ ఖైదీ. కొంతకాలం కండెమ్డ్ సెల్‌లో ఖైదీ కూడా. జైల్లో వున్న రోజుల్లో రాయలసీమ కరువు గాథలు, కండెమ్డ్  సెల్ ఖైదీల వ్యధలు వ్రాశారు. అవన్నీ ఆయన తిలక్‌కు చెప్పడంతో సహా స్క్రిప్ట్స్ కూడ ఇచ్చారట. తన వద్ద అవన్నీ వున్నాయని వెలికి తీయాలని చెప్పారు తిలక్. పులే పుల్ శివయ్యగారు వార్థక్యం కారణంగా, అనారోగ్యం మూలాన్న అజ్ఞాత వాసంలో ఉండలేకపోయినప్పుడు, వేరే మార్గంలేక తిలక్‌గారి సహాయంతో ప్రభుత్వానికి లొంగిపోయారు.

పులే పుల్ శివయ్యగారు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు. రచనానుభవం, పుస్తకపఠనం ఆయన వ్యాపకాలు.  తిలక్‌గారు “భూమికోసం” చిత్ర నిర్మాణం చేస్తున్న రోజుల్లో ఆయన్ను వినుకొండలో కలిసి ఆయన ఆశీర్వాదం పొందారు. తిలక్ సన్నిహితంగా మెలిగిన మరో వ్యక్తి, తన ద్వారా అజ్ఞాత వాసంలోకి వెళ్లే ఏర్పాట్లు చేసిన అతను ప్రఖ్యాత అభ్యుదయ రచయిత కంభం పాటి సత్యనారాయణగారు. ఆయన రచన “కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర” పాపులర్ పుస్తకాల్లో ఒకటి.

మరో వ్యక్తి కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖరరావు గారు. ఆ రోజుల్లో మోహన కుమార్ మంగళం తండ్రి డాక్టర్ సుబ్బరాయన్ గారింట్లో ఆర్. పి. శాస్త్రిగారు అనే కమ్యూనిస్టు అభిమాని అద్దె కుండేవారు. తిలక్ గారు ఆయన్ను ఎరుగుదురు. ఓ సారి శాస్త్రి గారి కార్లో మద్దుకూరిని తీసుకుని, మద్రాసు నుండి బెంగుళూరు వెళ్లి, అక్కడి నుండి మారు పేర్లతో విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ స్టేట్‌లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు అప్పట్లో. తన కాంటాక్ట్ వ్యక్తి కామ్రేడ్ గోళ్ల రాధాకృష్ణమూర్తికి అప్పగించారు తిలక్ అయన్ను.

ఆ రాత్రి తిలక్‌గారు బస చేసిన హోటల్ పేరు “పెర్సీస్” ఇప్పుడు ప్యారడైజ్ వున్న ప్రక్క స్థలంలో వుండేదట అది. హోటల్ గదిలో వున్న తిలక్ సిగరెట్ ఆగుతూ ఆర్పకుండా పడవేయటంతో తివాచికి అంటుకుని పొగలొచ్చాయి. కొంత సేపు గందరగోళం అయింది. ఎట్లా అయితేనేం.. ఆ మర్నాడు రైలులో బయలుదేరి మద్రాసు చేరుకున్నారు తిలక్ తన ప్రస్థానంలో మరో మలుపు వైపుగా ….

చెన్నపట్నం తరలిన సాంస్కృతిక యోధులు

తెలంగాణా విమోచన ఉద్యమం ఊపందుకుంటున్న ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వున్న రీతిలోనే, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ – నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రజా నాట్య మండలికి కూడా అదే పరిస్థితి ఎదురైంది అప్పట్లో. ఉండటం అయితే ఎల్. వి. ప్రసాద్ గారింట్లోనే అయినా తన అజ్ఞాత – ఉద్యమ కార్యక్రమాలను మాత్రం మరెన్నో ఇళ్ల నుండి నిర్వహిస్తుండే వారు తిలక్‌ గారు. భోజనం మాత్రం ఎక్కువగా ప్రసాద్ గారింట్లోనే.

నిషేధం, నీలినీడల్లో ప్రజా నాట్య మండలి తాలూకు వ్యక్తులు ఒక్కరొక్కరే మద్రాసు చేరుకోనారంభించారు. అలా వచ్చిన వారిలో తొలుతగా సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి (“మాభూమి” రచయితలుగా ప్రసిద్ధి కెక్కిన సుంకర – వాసిరెడ్డి), తుమ్మల వెంకట్రామయ్య (రచయిత), రాంభట్ల కృష్ణమూర్తి, షెట్టి ఈశ్వర రావు, తాపీ ధర్మారావు కొడుకు మోహనరావులు ఉన్నారు. ఓ విధంగా సాంస్కృతిక విభాగం అంతా చేరుకుంది మద్రాసుకు.

అలాగే వచ్చిన వారిలో – అక్కడికి అప్పటికే చేరుకున్న వారిలో – తాతినేని ప్రకాశరావు, వీరమాచనేని మధుసూదనరావు, మిక్కిలినేని, పెరుమాళ్లు, చదలవాడ కుటుంబరావు, రాంకోటి, కోగంటి గొపాలకృష్ణయ్యల్లాంటి భవిష్యత్ సినీరంగ దిగ్గజాలు కూడా ఉన్నారు. వీరంతా ప్రజా నాట్య మండలి – కమ్యూనిస్టు ఉద్యమాల్లో తమ శక్తి మేరకు పనిచేసిన వారేనని వేరే చెప్పనక్కర్లేదు.

మరి వీళ్లకు మద్రాసులో ఓ ఆధారం దొరకాలి కధా. అది కె. ఎస్. ప్రకాశరావు గారు, తిలక్‌గారి ద్వారా ఎల్. వి. ప్రసాద్ గారు వీలయినంత వరకు కల్పించసాగారు. ఆ విధంగా సినీ పరిశ్రమలో ప్రజా నాట్య మండలి తాలూకు పలువురు కళాకారులు స్థిరపడడానికి నాంది జరిగింది. ఇతరుల ప్రోద్బలంతో కొంత కాలం పాటు ఎల్. వి. గారు కూడా (ఆంధ్ర) ప్రజా నాట్య మండలి అధ్యక్షుడిగా పనిచేశారు.

సరిగ్గా అదే ప్రాంతంలో కృష్ణా జిల్లాకు చెందిన కొందరు ధనవంతులు ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో ప్రసాద్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించారు. వారిలో నిర్మాతలు ఎ. వి. సుబ్బారావు, శేషగిరి రావులు ఉన్నారు. ఆ సంస్థను ప్రోత్సహించిన వారిలో తాతినేని ప్రకాశరావు గారు కూడా ఒకరు.

ఇదిలా వుండగా తిలక్ గారు అప్పుడప్పుడే సినీరంగంలో ఎడిటర్‌గా స్థిరపడుతున్న రోజులవి. సరిగ్గా అప్పట్లోనే కొండముది గోపాల రాయశర్మ గారు వ్రాసిన “శ్రీమతి” అనే స్క్రిప్ట్ సారథీ ఫిల్మ్స్ కు ఉద్దేశించబడింది వెలుగులోకి వచ్చింది. గృహప్రవేశం సినిమా తీసిన తర్వాత మోడల్ ప్రొడక్షన్స్, సారథి నుండి విడిపోయింది. “స్వతంత్ర ప్రొడక్షన్స్” అనే పేరుతో అదే రోజుల్లో మరో స్వంత కంపెనీని స్థాపించారు. ఇలా విస్తరించసాగాయి తెలుగు వారి ఫిల్మ్ కంపెనీలు రకరకాల కారణాల వల్ల. ఆ స్వతంత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ క్రిందే ఎల్. వి. ప్రసాద్ గారి దర్శకత్వంలో “ద్రోహి” అనే సినిమాను తీశారు కె. ఎస్. గారు.

అభ్యుదయ భావాల సాంఘిక ఇతి వృత్తంగా నిర్మించిన ద్రోహి సినిమాలో నటీనటులుగా ఎల్. వి. ప్రసాద్, కోన ప్రభాకర రావు (మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు ఆ తర్వాత) కె. ఎస్. ప్రకాశరావు, జి. వరలక్ష్మి, రాళ్లబండి కుటుంబ రావులు ఉన్నారు. తాపీ ధర్మారావు రచయిత కాగా ఆరుద్ర స్క్రిప్ట్ తయారిలో సహకరించారు. తాపీ గారు వ్రాసిన “దయ లేదా.. బీదల మీద దయలేదా…” అనే పాటకు బహుళ ప్రజా దరణ లభించింది. దానికి సంగీతం సమకూర్చింది పెండ్యాల.

ద్రోహి సినిమా తీసిన తర్వాత మరో సంస్థ వెలసింది. “ప్రకాశ్ ప్రొడక్షన్స్” అనే పేరుతో దాన్ని స్థాపించారు కె. ఎస్. ప్రకాశరావు గారు. అంతటితో ఆగకుండా “ఫస్ట్ నైట్” అనే సినిమాను తీసి, దానికి ఆయనే దర్శకత్వం వహించారు కూడా. కె. ఎస్. ప్రకాశరావు గారు ప్రఖ్యాత దర్శక – నిర్మాత రాఘవేంద్రరావు తండ్రి గారనే విషయం తెలిసిందే. కె. ఎస్. గారి వేరుకుంపటి ప్రయత్నాలు భవిష్యత్‌లో స్టూడియో స్థాపించే వరకూ వెళ్ళాయి.

కె. ఎస్. కజిన్ కోవెలమూడి భాస్కరరావు గారు కూడా మరో కంపెనీ స్థాపించారు. అదే “ప్రీమియర్ ఫిల్మ్స్”. ఆయనతో పనిచేసిన కొందరు విడిపోయి మరో నూతన ఫిల్మ్ సంస్థ “నవయుగ”కు వచ్చారు. వారిలో అభ్యుదయ భావాల చదలవాడ, కాట్రగడ్డ శ్రీనివాస రావు – ఆయన తోడల్లుడు చంద్రశేఖర రావు, సూరెడ్డి విష్ణులు ఉన్నారు. వీరంతా దాదాపు కమ్యూనిస్టు పార్టీ – అతివాద సిద్దాంతాల అభిమానులే – సానుభూతిపరులే. అయితే వామపక్ష భావాల “వీరు” – “వారయి” వ్యాపార రంగంలో దిగారు – స్థిరపడ్డారు.

కామ్రేడ్ పి. సి. జోషి కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా వున్న రోజుల్లో సర్కారు జిల్లాల్లోని ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారు పలువురు ఆ పార్టీపై అభిమానం పెంచుకున్నారు. ప్రతి ఇంటిలోనూ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో పాటు కనీసం ఒక్కరైనా కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షితులయ్యే వారట. విచిత్రంగా ప్రతి ఇంటిమీద కాంగ్రెస్ – కమ్యూనిస్టు జండాలు ఎగిరేవి. ఇలా ఆకర్షితులైన చాలా మంది ప్రజా నాట్య మండలితో సంబంధాలు పెట్టుకోవడంతో కాలక్రమేణా మద్రాసుకు వచ్చి సినీ రంగంలో స్థిరపడి క్యాపిటలిస్ట్ లయ్యారు.

ఇక ఎల్. వి. ప్రసాద్ గారి విషయానికొస్తే – ఆయన మటుకు ఆయనకు ఏ ఉద్యమాలతో సంబంధం ఆదినుండీ లేదు. ఆయనది ఎప్పుడూ “ప్రొఫెషనల్ మోటివేషనే”. ఆయన సామాజిక స్పందన కేవలం సినీ పరిశ్రమకే – పోనీ – సినిమాలు తీయడం వరకే పరిమితం. ఏ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గోనే వారు కాదాయన.

కొండముది గోపాల రాయశర్మ గారు “శ్రీమతి” అనే సినిమా స్క్రిప్ట్ తయారుచేసి సారథీ బ్యానర్ క్రింద సినిమా తీసేందుకు ఇచ్చారని చెప్పుకున్నాం గదా. దానికి అప్పట్లో డైరెక్టర్ ఎల్. వి. ప్రసాద్. “మేడమ్ ఎక్స్” అనే నవల ఆధారంగా తయారు చేయబడిందా స్క్రిప్ట్.

“శ్రీమతి” సినిమా తీసేందుకు నూతన ఆర్టిస్టుల అన్వేషణలో ఆంధ్రా టూర్‌కెళ్లారు రచయిత కొండముది (ఆయన అప్పటికే నాటక రచయితగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు). డైరెక్టర్ ఎల్. వి. ప్రసాద్ పనిలో పనిగా లొకేషన్ (షూటింగ్ కొరకు) చూడడానికి అమరావతిని కూడా దర్శించారు అప్పుడే.

వారప్పుడు ప్రాథమికంగా ఎంపిక చేసి మద్రాసుకు రమ్మని పిలిచిన వారిలో దశాబ్ధాలపాటు సినీరంగాన్ని, దశాబ్దం పైగా ఆంధ్ర రాజకీయ రంగాన్ని శాసించిన నందమూరి తారక రామారావు గారు ఒకరు. మిగిలిన వారిలో బ్యాంకు ఉద్యోగి – రచయిత ప్రసాద్‌గారు, జర్నలిస్ట్ గా ఆంధ్ర పత్రికలో పని చేసిన వెంకట్రావు గారు, చిన్న చిన్న పాత్రలను సినిమాల్లో పోషించిన ముక్కామల గారి సోదరుడు వున్నారు. రచయిత ప్రసాద్ గారు అ తర్వాత కాలంలో, గవర్నర్ కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్‌ యాక్షన్ (నిసా) అనే స్వచ్చంద సంస్థ రూపొందించిన “భారతరత్న ఇందిరమ్మ” రూప వాణి కార్యక్రమానికి స్క్రిప్ట్ తయారు చేస్తున్నప్పుడు తోడ్పడ్డారు.ఈ రూప వాణి కార్యక్రమం ఇందిర పాత్రను ధరించిన శ్రీమతి గీతారెడ్డి రాజకీయ రంగప్రవేశానికి బాటలు వేసింది. ఎం. ఎల్. ఎ గానూ, మంత్రి గాను ఆమె ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో స్థానం పొందిన సంగతి తెలిసిందే.

ఎన్టీ రామా రావు గారికి మూవీ టెస్ట్, స్టిల్ టెస్ట్, మేకప్ టెస్ట్ ప్రసాద్ గారు చేయించినప్పుడు ఎడిట్ చేసిన ఇద్దరు వ్యక్తులు శ్రీ రాజన్, శ్రీ తిలక్‌లు. ఎమెచ్యూర్ కెమెరామెన్ డి. వి. ఎస్. మణ్యం (సుబ్రహ్మణ్యంగా, గుంటూరులో ఎన్టీఆర్‌కు స్నేహితుడు కూడా ఆయన) స్టిల్‌ను తీశారు. అప్పట్లో స్టిల్ స్టూడియో ఎల్. వి. ప్రసాద్ గారింట్లోనే ఉండేదట. ఆ సందర్భం లోనే తిలక్‌మీద కూడా తీసిన ఓ స్టిల్ ఇప్పటికీ ఆయన వద్ద వుంది.

తిలక్ గారితో సహా అందరూ ఎన్టీ రామారావు గారినే ఎంపిక చేయడం, ఆయనంటే ఇష్టపడడం జరిగింది వెంటనే. అయితే దురదృష్టవశాత్తు “శ్రీమతి” సినిమా తీసే ప్రాజెక్టు వివిధ కారణాలవల్ల వాయిదా పడింది – కనీసం తాత్కాలికంగానన్నా వాయిదా వేయక తప్పలేదు.

దరిమిలా సారథీ ఫిల్మ్స్, చల్లపల్లి రాజాగారి సోదరుడు రామకృష్ణ ప్రసాద్‌గారి ఆధ్వర్యంలోకి పోవటం, “విజయా” వారితో సహా ఇతరుల ప్రొడక్షన్స్ లో ఎల్. వి. ప్రసాద్ బిజీ కావటం కూడా “శ్రీమతి” వాయిదా వేయటానికి దోహదపడ్డాయి.

అప్పట్లో తిలక్, ఆ తర్వాత కె. ఎస్. ప్రకాశరావు గార్లకు మీర్జాపూర్ రాజా గారికి చెందిన “మీర్జాపూర్ స్టూడియో”తో సంబంధముండేది. ఆ స్టూడియో ఆధ్వర్యంలో శరత్ నవల ఆధారంగా “మన దేశం” అనే సినిమా నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. శ్రీ ఎల్. వి. ప్రసాద్ గారు దానికి దర్శకులు. నాయకుడి పాత్రను సిహెచ్. నారాయణ రావు పోషించగా, నాయకిగా ఆయన సరసన మీర్జాపూర్ రాజాగారి భార్య శ్రీమతి కృష్ణవేణి పోషించారు. అందులో సబ్ ఇన్ స్పెక్టర్ పాత్ర వేయటానికి అవకాశమిచ్చారు మొట్టమొదటి సారిగా శ్రీ ఎన్‌. టీ. రామారావుకు. అలా జరిగింది ఆయన సినీరంగ ప్రవేశం.

“వుడోకిన్” అనే రష్యన్ ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ మేకింగ్ – ఎడిటింగ్ మీద రచించిన ఓ చక్కని పుస్తకం తిలక్, ఎన్టీ ఆర్‌ కు బహూకరించారు అప్పట్లో. ఎన్టీ ఆర్‌ను విశ్వవిఖ్యాత నటుడిగా తీర్చిదిద్దడంలో ఆ పుస్తకం ఆయనకెంతగానో తోడ్పడిందని, అది ఎన్టీ ఆరే తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు తిలక్.

సారథీ స్టూడియో నిర్మాణం

క్రమేపీ తిలక్‌ వ్యాపకాలు పెరగ సాగాయి. ఆ కారణాన ప్రసాద్‌ గారింట్లో వుండటం కన్నా వేరే చోట వుండటం మంచిదన్న అభిప్రాయంతో ఓ అద్దె ఇల్లు కూడా తీసుకున్నారాయన. దాంతో పాటే సి. వి. వి. ఆర్. ప్రసాద్, ఎస్. వి. నర్సయ్య గార్లతో సంబంధాలు వృద్ధి చేసుకోవడం, అందరూ కలిసి అభ్యుదయ భావాలున్న కళాకారుల బాగోగులు గురించి ఆలోచించడం మొదలు పెట్టారు.

“సారథీ ఫిల్మ్స్” వ్యవహారం గురించి ఇంతకు ముందే కొంత వరకు తెలుసుకున్నాం గదా. చల్లపల్లి రాజాగారి సోదరుడు, రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోకి – కారణాలు ఏవైతేనేమి – ఆ సంస్థ వెళ్లింది.

అప్పట్లో ప్రజా నాట్య మండలికి చెందిన సి. వి. వి. ఆర్ ప్రసాద్, ఎస్. వి. నర్సయ్య గార్లు, అభ్యుదయ భావాలకు ఆకర్షితులైన అనేక మంది కళాకారులను ఓ వేదిక పై తీసుకు వచ్చే ప్రయత్నం చేసేవారు. శాంతినికేతన్‌లో విద్యనభ్యసించి సినీరంగంలో టెక్నీషియన్‌గా కెమేరా ఫీల్డ్ లోకి ప్రవేశించిన ప్రసాద్‌ గారు చాలా మందికి పరిచయస్తులే. శాంతినికేతన్ నుండి బొంబాయి వెళ్లడం వలన అక్కడ సి. వి. వి. ఆర్‌కు ఎల్. వి. గారితో కూడ పరిచయం అయింది. అభ్యుదయ కళాకారులందరూ ఓ వేదికపై ఎందుకు జమకూడారో కాని ఆ రోజుల్లో జరిగిన ఆ కలయిక భవిష్యత్ సినీరంగ అభివృద్ధిలో ఓ కీలకమైన ఘట్టానికి పరోక్షంగా అతి ముఖ్యమైన మైలు రాయిగా మిగిలి పోయింది.

సారథి ఫిల్మ్స్ బ్యానర్ క్రింద ఐక్య వేదిక వేర్పాటు చేసుకున్న కళాకారుల తొలి ప్రయత్నం  “అంతా మనవాళ్లే” అనే చిత్ర నిర్మాణం. సహకార వ్యవస్థ – సహకార ఉద్యమం ప్రధాన ఇతివృతంగా తీసిన ఆ చిత్రానికి కథా రచయిత శ్రీ కొండేపూడి లక్ష్మి నారాయణ.

అంతా మనవాళ్లే సినీ దర్శకుడిగా పూర్తిగా కాకపోయినా ఆయన కనుసన్నలలోనే – ఆధ్వర్యంలోనే ఈ సినీ నిర్మాణం జరిగిందనే భావన (పేరు పొందిన దర్శకుడైనందున) ప్రేక్షకుల్లో కలగాలనే ఉద్దేశ్యంతో శ్రీ ఎల్. వి. ప్రసాద్ గారి పేరు వాడుకునేందుకు రామకృష్ణ ప్రసాద్ ఆసక్తి కనబర్చారు అప్పుడు ప్రథమంలో. దానికి కారణం ఇంకోటి కూడా ఉంది.

కలిసి ఉన్న రోజుల్లో ఎల్. వి. ప్రసాద్‌ గారి దర్శకత్వం లోనే సారథి ఫిల్మ్స్ సినిమాలు తీసేవారు. అయితే, అభ్యుదయ భావాల కుర్ర కారు నుండి ఎల్. వి. పేరు వాడుకోవడానికి తగినంత మోతాదుల్లో వ్యతిరేకత వ్యక్తమయింది. అలా వ్యతిరేకించిన వారిలో ముందున్న వ్యక్తి శ్రీ తాపీ చాణక్య. ఈయన తాపీ ధర్మారావు గారి మూడో కుమారుడు. చివరకు ఆయనే చిత్ర దర్శకులయ్యారు. ప్రఖ్యాత దర్శకులుగా తెలుగు సినీరంగ ప్రేక్షకులకు ఆయన సుపరిచితులే.

ఇదిలా ఉండగా, నేపధ్యంలో కథ నడిపిస్తున్న తిలక్‌ గారికి, ఎక్కడా ఎటువంటి స్పర్థలుండకూడదనే ఆలోచన కలగడంతో ఆ సమస్యకి పరిష్కారం కుదిరింది. పరిష్కార దిశగా వారు లేవనెత్తి-చర్చించి, రాజీ కొచ్చిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎల్. వి. ప్రసాద్ ఎటూ తెగ బిజీ మనిషి కాబట్టే, ఆయన తన పూర్తి కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ సెట్స్ పై గడపలేరు. ఆయన బిజీ కారణాన సినీ నిర్మాణం జరగడంలో జాప్యం కావటం అంత మంచిది కాదు. జాప్యం మూలాన క్రియేటివిటీ దెబ్బ తినకూడదు. వీటన్నిటికి తోడు రామకృష్ణ ప్రసాద్ గారు తాను లోగడ ఎల్. వి. గారి కిచ్చిన డబ్బు మళ్ళీ వెనక్కు తీసుకోవడం ఆచరణ యోగ్యం కాదు కూడా. చివరకు, ఇవన్నీ చర్చించి, తిలక్‌ గారు తన మేనమామ గారిని ఓ కోరిక కోరారు. తాము తీయదల్చిన సినిమా స్టోరీ లైన్‌ను వినమనీ, ఆయన పేరు ఉపయోగించుకున్నా, లేకపోయినా అభ్యుదయ భావాలున్న వారందరు కలిసి చేస్తున్న ప్రయత్నాలను ఓ గొప్ప వ్యక్తిగా ప్రోత్సహించమనీ అడిగారు. అందుకాయన అంగీకరించడంతో తెలుగు చలన చిత్ర రంగ అభివృద్ధిలో ఎన్నెన్నో ఫిల్మ్స్ సంస్థలు నెలకొనడానికి బాటలు వేసిన ఓ మహామనిషిగా ఎల్. వి. ప్రసాద్‌ గారు మిగిలిపోయారు.

ఆ సినిమా ఎడిటర్ శ్రీ కె. బి. తిలక్. ఆయనకు అదో అనుభూతి. “అంతా మనవాళ్లే” చిత్ర నిర్మాణం మరో అధ్యాయానికి ఆరంభమే కాని అంతం కాదు. ఆ తర్వాత ఆ బృందం సారథి బ్యానర్ క్రింద తీసి, తెలుగు చలన చిత్ర రంగంలో మరో మలుపు మైలు రాయిని వేసిన మేటి చిత్రం “రోజులు మారాయి”. తాపీ ధర్మారావు – కొండేపూడి లక్ష్మీనారాయణల కలం నుండి తెలంగాణోద్యమ ప్రభావం ప్రస్పుటించే కథగా వెలువడిందా చిత్రం. బంజరు భూముల సమస్య ప్రధాన ఇతివృత్తం. కొసరాజు రచించిన “ఏరువాకా సాగేరోరన్నా… చిన్నన్నా… నీ కష్టమంతా తీరే…” అనే ఆ సినిమాలోని పాట నాటి నుండి నేటి వరకూ పల్లె ప్రజలకు మళ్లీ మళ్లీ వినాలని పించే పాట. వారు పాడుకుంటూ పనిచేసే పసందైన పాట.

హిందీ చలన చిత్ర రంగాన్ని దశాబ్దాల తరబడి కథానాయికగా శాసించిన వహీదా రెహ్మాన్ “రోజులు మారాయి” సినిమా ద్వారానే సినీరంగ ప్రవేశం చేసారు. సినీ దర్శకుడు శ్రీ తాపీ చాణక్య ఎడిటర్ శ్రీ తిలక్, డాన్స్ డైరెక్టర్ శ్రీ వెంపటి సత్యం, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వేణు (ప్రఖ్యాత సినీ కళాకారుడు శ్రీ భానుచందర్ తండ్రి) రోజులు మారాయి సినిమా కథానాయకుడిగా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, నాయికగా శ్రీమతి జానకి నటించారు. శ్రీ సి. ఎస్. ఆర్.  తదితరులు కూడా నటించారు

ఈ సినిమాకు కూడా ఎడిటర్‌గా పనిచేసిన శ్రీ తిలక్ ఆ రంగంలో నిలదొక్కుకోవడమే కాకుండా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు.

రోజులు మారాయి శత దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌కు తెలుగు చలన చిత్రరంగం తరలి రావడానికి, ప్రప్రథమంగా సినీ స్టూడియో నిర్మాణం జరగడానికి ఆ శత దినోత్సవ వేడుకలు వేదికయ్యాయి. అదో చారిత్రక సంఘటన అని అంటారు తిలక్.

నాటి రాష్ట్ర మంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి ఆ వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చి, సాహితీ సంస్కృతీ రంగాల అభివృద్ధికి చలన చిత్రరంగ ప్రముఖులు అగ్ర భాగాన నిల్చి తోడ్పడాలని తమ ఉపన్యాసంలో సందేశమిచ్చారు. తదనుగుణంగానే రోజులు మారాయి సినిమా యూనిట్‌కు చెందిన ప్రముఖులందరూ కలిసి కట్టుగా ఆలోచించి హైదరాబాద్ నగరంలోకి “సారథీ స్టూడియో” స్థాపనకు ప్రయత్నాలు ప్రారంభించారు.   అచిరకాలంలోనె ఆది కార్యరూపం దాల్చింది. అమీర్‌పేటలో స్టూడియో వెలసింది.

సారథీ స్టూడియో నిర్మాణం కొరకు స్థలం కావాలని ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని అర్ధించలేదు దాని యజమానులు. ప్రయివేటు వ్యక్తుల వద్ద నుండి కొనుగోలు చేసిన భూమిలోనే స్టూడియో నిర్మాణం జరిగింది. స్టూడియో వున్న అమీర్‌పేట ప్రాంతానికి రెండు మూడు మైళ్ల దూరంలో ఉన్న ఖైరతాబాద్ సమీపంలో సారథీ యూనిట్ కళాకారులందరూ నివసించడానికి ఇళ్ల స్థలాలు కొనుక్కునే ఏర్పాటు చేసారు. అలా కొన్న స్థలంలో నిర్మించిన ఇంట్లోనే ఇప్పటికీ నివాసముంటున్నారు శ్రీ సి. వి. వి. ఆర్. ప్రసాద్.

ఇదే సారథీ స్టూడియోలో విశ్వవిఖ్యాత “నటసార్వభౌములు”, “నటసామ్రాట్టులు”, “పద్మశ్రీ” లుగానూ, “పద్మభూషణ్” లు గానూ గౌరవ పురస్కారం అందుకున్న నటీనటులెందరో, ఎన్నో చిత్రాల్లో నటించడానికి షూటింగ్‌లో ఎన్నో సార్లు పాల్గొన్నారు. వీరిలో ఎన్టీ ఆర్, అక్కినేని, భానుమతి… ఇలా వ్రాసుకుంటూ పోతే అందరూ ఉన్నారు.

కాకపోతే ఆ తర్వాతికాల గమనంలో…. సినీ కాల గమనంలో – ఎవరికి వారే వేరై ఎవరి “సినీ కుంపటి” వారే పెట్టుకుని పరోక్షంగానో, ప్రత్యక్షం గానో సినీరంగ అభివృద్ధికి కృషి చేసారు. స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి ఆశయం నెరవేరిందనే చెప్పుకోవాలి.

సారథీ యూనిట్ పరిణామ క్రమంలో ఇలా పురోగమిస్తుంటే, అదే స్పీడ్‌లోనూ, ఒక్కొక్కసారి అంత కంటే కొద్ది తేడాలోనూ మరిన్ని సంస్థలు వెలిశాయి. వాటిలో ప్రముఖమైనవిగా చెప్పుకోవాలంటే పీపుల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్, ప్రసాద్ ప్రొడక్షన్స్, నవయుగ ప్రొడక్షన్స్.. తిలక్‌గారి అనుపమ ఫిల్మ్స్.

పీపుల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారి తొలి చిత్రం “పల్లెటూరు”. తాతినేని ప్రకాశరావు గారు దర్శకుడుగా సినీరంగ ప్రవేశమయిన ఆ చిత్రంలో కథానాయకుడు శ్రీ ఎన్టీ రామారావు కాగా, శ్రీమతి సావిత్రి కథానాయిక పాత్ర పోషించారు. కథా రచయితలు సుంకర-వాసిరెడ్డి. కొడవటి గంటి కుటుంబరావు గారికి కూడా ఆ చిత్రంతో అనుబంధముంది. తాతినేని గారు మాత్రం అప్పటి వరకూ ఎల్. వి. గారికి అసిస్టెంట్‌గా మాత్రమే వుంటూ వుండేవారు.

అదే విధంగా డాక్టర్ గరికపాటి రాజారావు (ఆయన పజానాట్య మండలి ముఖ్యుల్లో ముఖ్యుడు) గారు స్థాపించిన మరో ప్రోగ్రెసివ్‌ సంస్థ “రాజా ఆర్ట్స్” జమున కథానాయికగా తీసిన చిత్రం “పుట్టిల్లు”. దీనికి ప్రోత్సాహం – సహాయ సహకారం అందించింది నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టరు రాము. ఆయనే స్వర్గీయ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యగారి సోదరుడు స్వర్గీయ పుచ్చల పల్లి రామచంద్రారెడ్డిగారు. ప్రజా వైద్యుడిగా ఆయన్ను ఇప్పటికీ నెల్లూరు ప్రజలు గుర్తుచేసుకుంటుంటారు.

అభ్యుదయ భావాలు, అభ్యుదయ భావాల వేదికలు భారత స్వాతంత్ర్య సమరంలోనూ, తెలంగాణ విమోచన ఉద్యమాలలోనూ ఆ తర్వాత మరికొంతకాలం వరకూ కూడా యువతను ఎంతగానో ఆకర్షించాయి. ఆ యువతను, కమ్యూనిస్టులు గానూ, సోషలిస్టులు గానూ, కాంగ్రెసు పార్టీలో అతివాదులు గాను మలిచాయి. అంత మాత్రాన వారంతా ఆ భావాలకే జీవితాంతం కట్టుబడి వున్నారని చెప్పడానికి వీల్లేదని అంటారు తిలక్. కారణాలు ఎమైతేనేమి.. ఏదో వ్యాపకం పేరుతో .. వారిలో పలువురి భావాలు “అభ్యుదయమే” అయినప్పటికీ.. ఆశయాలు మంచివే అయినప్పటికి – ఆచరణలో మాత్రం “అంతస్తులు” పెంచుకునే వ్యవస్థలోకి లాగాయంటారు తిలక్. కాల మహిమా? సినీ ప్రభావమా? తన్నుతానే ప్రశ్నించుకున్నారు శ్రీ కె. బి. తిలక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *