March 28, 2024

గర్భాశయపు సమస్యలు-4

 రచన:  డాక్టర్ జె. గౌతమి సత్యశ్రీ pic. for maalika

                  పి.హెచ్.డి.

 

స్త్రీ హార్మోను ఈస్ట్రోజెన్ అసాధారణత్వం- ముందస్తు రుతువరతి-రుమటాయిడ్ కీళ్ళవాపు

[low estrogen levels cause early menopause with high risk of rheumatoid arthritis (RA)]

 

మహిళల జీవితంలో రెండు ముఖ్యమైన దశలు- పుట్టినప్పటినుండి రుతుక్రమం మొదలయ్యేదాక ఒక దశ, రుతుక్రమం నుంచి రుతుక్రమం నిలిచేదాక మరొక దశ. ఈ రుతుక్రమం నిలిచిపోయే దశని రుతువిరతి లేదా మెనోపాజ్ అని అంటారు. ఈ సాధారణ మెనోపాజ్ 45-50 సంవత్సరాల లోపు మహిళలకు సంప్రాప్తిస్తుంది. అండాశయం నుండి అండాలు వెలువడడం ఆగిపోతుంది. కొన్ని నెలలకు పీరియడ్స్, ఈస్త్రోజెన్ (స్త్రీ సెక్స్ హార్మోన్)  ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. అయితే కొంతమందిలో అసహజరీతి లో ఈస్త్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోయి, మెనోపాజ్ ముందుగా అంటే 40 సంవత్సరాల లోపే ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా అది తీవ్రమైన రుమటాయిడ్ కీళ్ళవాపులకు దారి తీస్తుంది. ఈ కీళ్ళవాపులు స్వయంచాలిక రోగనిరోధక లోపం (ఆటో ఇమ్యూన్ డిసార్డర్, auto immune disorder) గా వైద్యపరం గా పరిగణించబడింది. శరీరంలో వివిధ ఆరోగ్యలోపాల వల్ల లేదా వంశపారంపర్య లక్షణంగా కూడా  దీనంతటికీ గురి అవ్వడానికి వీలు ఉంది. ఈస్ట్రోజెన్ లోపాలు రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ (కీళ్ళవాపులు) కు ఒక స్వతంత్ర కారకమవుతున్నదని పరిశోదనల ద్వారా తెలుస్తుంది. ఇటువంటివారు తీవ్ర అస్వశ్థతకు లోనయి, కీళ్ళ హానికి గురవుతారు. సాధారణ మెనోపాజ్ జరుగునప్పుడు కూడా ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగి, కీళ్ళవాతం వస్తుంది. అది వయసురీత్యా జరిగే ప్రక్రియ అనుకోవచ్చు. కానీ ఇదంతా చిన్నవయసుల్లో జరిగితే ఇంకా బాధాకరం కదండీ!  అసలు ఈస్ట్రోజెన్ హార్మోనులు రోగనిరోధక వ్యవస్థ లేదా ఇమ్యూన్ సిస్టం (immune system) మీద ఎలా పని చేస్తుందో చూద్దాం.

తెల్లరక్త కణాలు ఇమ్యూన్ సిస్టం లో ప్రముఖ పాత్రను వహిస్తాయి. మరొక రకమైన తెల్లకణాలను లింఫోసైట్స్ (lymphocytes) లేదా కణికలు లేని తెల్లరక్తకణాలు  అని అంటారు. తెల్లకణాల వలె, ఈ లింఫోసైట్స్ కూడా రోగనిరోధక వ్యవస్థ తో అనుసంధానమై ఉంటాయి. ఇవి కూడా మిగితా రక్తకణాల వలె, బోన్ మేరో (Bone marrow) లో ఉత్పత్తి అవుతాయి, మెడ క్రింద గల వినాళ గ్రంధి (థైమస్, Thymus) లో పరిపక్వత చెందుతాయి. కనుకనే ఈ లింఫోసైట్స్ ను T (thymus)-లింఫో సైట్స్ అని అంటారు.   శరీరంలోని ఈ లింఫోసైట్స్ ఏడు ఉపభాగాలుగా ప్రత్యేక విధులను నిర్వహిస్తున్నాయి. ఈ విభాగాలు 1. సహాయక కణాలు (హెల్పర్, Helper cells, TH), 2. విషపూరితకణాలు (సైటో టాక్సిక్. Cytotoxic cells) 3. మెమరీ కణాలు 4. నియంత్రణ కణాలు (రెగ్యులేటరీ లేదా సప్రెసర్ కణాలు, regulatory or suppressor cells) 5. నేచురల్ కిల్లర్ కణాలు 6. శ్లేష్మ సంబంధ స్థిరరాశి కణాలు (మ్యూకోసల్) 7.గామా డెల్టా కణాలు. సహాయక కణాలు రోగ నిరోధకత్వంలోనూ, విషపూరిత కణాలు, మెమరీ కణాలు బయటినుండి శరీరానికి సోకిన వ్యాధి కారక కణాలపై లేదా ట్యూమర్ కణాలపై దాడి చేయడానికి, నియంత్రణ కణాలు మరియు నేచురల్ కిల్లర్ కణాలు వ్యాధి లక్షణాలు పూర్తిగా పోయేంతవరకు  రోగ నిరోధకత్వాన్ని మరికొంతకాలం కొనసాగిస్తూ పూర్తిగా వ్యాధి లక్షణాలని అరికట్టడానికి, మిగితా కణాల విధులకు కూడా సహకరించడానికి ఉపయోగపడతాయి. TH, సహాయక కణాలు, తిరిగి మరికొన్ని ఉపకణాలు (TH1, TH2, TH3, TH17, TH9 మరియు TFH) గా చెప్పుకోబడినవి.

T-కణాల విభజన

చిత్రంలో చూపిన విధంగా పరిపక్వత చెందిన T-కణాలు సైటోకైన్లను (పచ్చ మరియు ఆరెంజ్ బాక్సులలో చూపించినవి) స్రవిస్తాయి. స్త్రీ హార్మోను ఈస్ట్రోజెను సైటోకైన్లపై పనిచేసి వాటిలో కొన్నిటిని (పచ్చ బాక్సులు) స్టిమ్యులేట్ (ఉత్తేజ పరచడం) చేస్తూ లేదా కొన్నిటిని (ఆరెంజ్ బాక్సులు) బ్లాకు (నిరోధించి) చేస్తూ తద్వారా వివిధ సహాయక కణాలను స్టిమ్యులేట్ చేస్తాయి. ఆ స్టిమ్యులేటెడ్ సహాయక కణాలు మరికొన్ని సైటోకైన్లను (ఎరుపు రంగు యారో తో చూపబడినవి) స్రవించగా, ఆ సైటోకైన్లు శరీరంలో కి చొచ్చుకుని వచ్చిన వ్యాధి కారకాలపై దాడి చేసి, వాటిని నిర్జీవం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియ లో శరీరం వాపులకు (క్రానిక్ ఇన్ ఫ్లమేషన్, chronic inflammation) గురి అవుతుంది. దీనినే వ్యాధినిరోధక ప్రతిచర్య లేదా ఇమ్యూన్ రియాక్షన్ (Immune reaction) అని అంటారు.

ఈ వ్యాధినిరోధక ప్రతిచర్యలవల్ల, సైటోకైన్ల ఉత్పత్తి ఎక్కువ అవ్వకుండా, వాపులను కంట్రోలు చేయడం, మళ్ళీ ఈస్ట్రోజెన్ మీదే అధారపడిఉంది. ఈస్ట్రోజెన్ థైమస్ లో పరిపక్వత చెందుతున్న T-కణాలను సమయానుచితం గా నిరోధిస్తుంది. దీనివల్ల వాటినుండి సహాయక కణాలు మొదలైన ఇతర కణాలు వెలువడవు మరియు వాటి సైటోకైన్ల ఉత్పత్తి మీద నియంత్రణ జరుగుతుంది. కీళ్ళవాపులు ఉండవు, నిరోధించబడతాయి. ఈ విధంగా ఈస్ట్రోజెన్ ద్విపాత్రాభినయం చేస్తుంది.

ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోయిన వాళ్ళలో త్వరగా రుతుక్రమం ఆగిపోవడమే కాకుండా T-కణాల పై కంట్రోలు తప్పిపోతుంది, సైటోకైన్ల ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది, శరీరం తీవ్రమైన రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ కు గురి అవుతుంది.

సైటోకైన్ల అధిక ఉత్పత్తి ఇంకా రుమటాయిడ్ ఆర్ఠ్రైటిస్ గా దింపనంతవరకు ఈస్ట్రోజెన్ ను హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ (Harmonal replacement therapy, HRT) ద్వారా బూస్ట్ చేస్తారు. అప్పుడు మెనోపాజ్ లక్షణాలన్నీ పోయి, మరల రుతుక్రమం చక్కబడడం, ఆరోగ్యం బాగుపడడం జరుగుతుంది. అదే రుమటాయిడ్ వ్యాధి కూడా సంక్రమించేసాక హార్మోనల్ థెరపీ ని వైద్యులు సూచించరు. ఎందుకంటే అది గుండెజబ్బులను ఎక్కువ చేస్తుంది. మామూలుగానే రుమటాయిడ్ వ్యాధులు గుండెపోటు, రక్తపోటులకు దారితీస్తాయి. రుమటాయిడ్ వ్యాధి తో బాధ పడేవారికి హార్మోనల్ థెరపీ ఇస్తే ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతాయి. అందుచేత కేవలం తాత్కాలికమైన మందులు వాడడమే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *