April 25, 2024

భార్యాభర్తలు – 2 (వెండితెర నవల)

రచన: ముళ్లపూడి వెంకటరమణ

రచన: ముళ్లపూడి వెంకటరమణ
హాసం ప్రచురణలు
హైదరాబాద్

movieposter

కలకత్తా, బొంబాయి, మద్రాసు నగరాలనుండి దేశమధ్యంలో విశాఖపట్నం, బెజవాడ, రాజమండ్రి, అంగలకుదురు వగైరాలకు వెళ్లే రైళ్లు కొడుకుల దగ్గరనుంచి తండ్రులకు మనియార్డర్లకోసం ఎస్.ఒ.ఎస్. ఉత్తరాలనే తరచు మోసుకు వెళ్తూ ఉంటాయి. కొన్ని దుర్మార్గపు రైలు ముఖ్యంగా ఇలాంటి ఉత్తరాలను ఆలస్యం కూడా చేస్తూ ఉంటాయి. కాని హేమ రాసిన ఉపద్రవపు ఉతరాన్ని ఆ రోజు రైలు క్షణాలమీద పట్టుకెళ్ళి విశాఖపట్నంలో పబ్లిక్ ప్రాసిక్యూటరు ధర్మారావుగారి చేత్ల్లో పడేసింది. ఆయన హుందాగా, తాపీగా ఆ వుత్తరం చదవడం మొదలుపెట్టి, మధ్యలో కాస్త ఆశ్చర్యపడి చివరకు చర్రున మండిపడ్డాడు కొడుకు ప్రయోజకత్వం తెలిసి. “ఎంత పొగరు!” అన్నాడు. ఎదురుగుండా ఉంటే వాడిచేతే చెప్పించేవాడు ఎంత పొగరో.

“మాణిక్యం! మాణిక్యం” అంటూ పళ్ళ్లు పటపటా కొరుక్కుంటూ భార్యను పిలిచాడు ధర్మారావుగారు.

“ఏవండి ఎందుకు పిలిచారూ” అంటూ వచ్చింది, ధర్మపత్ని.

“నీ సుపుత్రుడు జేసిన ఘనకార్యానికి-”

“ఆఁ ఎవరూ?” అందావిడ ఇద్దరు సుపుత్రులలోనూ ఘనకార్య సాధకుడెవరో తేల్చుకోలేక.

“ఇంకెవరు – ఆనంద్”

“ఆనందా! ఏం చేశాడండీ” అంది తల్లి గాభరాపడుతూ.

భర్త కోపంగా ఆవిడ చేతికి ఉత్తరం అందించి, “ఇది చదువు. నీకే తెలుస్తుంది” అని ధుమధుమలాడుతూ, గణగణమంటున్న టెలిఫోను దగ్గరకు వెళ్లాడు.

మాణిక్యమ్మగారికి ఏమీ కనబడలేదు. భర్త కోపంతో పుత్రుడి ప్రవర్తనతో అంతా అయోమయంగా మసక మసగ్గా కనబడింది.

“అమ్మాయీ తాయారూ!” అని కోడల్ని పిలిచిందావిడ.

కోడలు తాయారమ్మ గుణవతి. ఏ గుణం అన్నది వేరేసంగతి. అత్తగారిమాట విననిరకం కోడలుకాదు; ఆ మాటకొస్తే ఆమెకు అందరిమాటలూ వినాలని ఉంటుంది. ఎవరెవరు ఎంత రహస్యంగా మాట్లాడుకున్నా చాటునైనా నిలబడి వినాలన్న తహతహ. ఆమె పట్టుదలను, కార్యదీక్షను పరీక్షించడానికన్నట్టు భగవంతుడు ఆమెకు బ్రహ్మచెముడు పెట్టి చూశాడు. తాయారమ్మ లొంగే ఘటంకాదు. హియరింగ్ ఎయిడ్ పెట్టుకు మరీ వింటుంది. అంటే ఈ కాలం చెవిటి వాళ్ళు పెట్టుకునే మిషనుకాదు. అంతకన్న గొప్పది. ఆమె పెద్ద కొడుకు చక్రధర్‌ని అందుకు నియోగించింది. ఎవరేవరేమనుకుంటున్నారో ఆ పిల్లాడు శ్రద్దగా విని తల్లికి అన్నీ పూసగుచ్చినట్లు చెప్పుతాడు.

నాయనమ్మ, తాతయ్యల మాటలకోసం తెరచాటున ఉండి చెవులు రిక్కించుకున్న అమ్మకి, కన్నబిడ్డడు సంగతి తెలియజెప్పాడు. “అమ్మా, నాయనమ్మ పిలుస్తోంది”

“మీ నాన్న అప్పుడే రారు పద” అంది తాయరు.

“అదికాదమ్మా, నాయనమ్మ. నాయనమ్మ”

“ఆఁ …”

“అదికాదమ్మా. నాయనమ్మా – నాయనమ్మా – ” అన్నాడు కొడుకు కాళ్లు కొంచెం పైకెత్తి చెవిదగ్గర నోరుపెట్టి.

“మీ నాయనమ్మ పిలుస్తోంది. వినబడింది ఉండు” అంటూ తాయారమ్మ సావిట్లోకి వచ్చి “ఏం అత్తయ్యా” అంది భయభక్తులు నటిస్తూ.

“కళ్ళజోడు లేదు. ఇది కాస్త చదివిపెట్టమ్మా”

తాయారు పరమానందపడిపోయింది. ఏకంగా ఉత్తరానికుత్తరం చేతికొచ్చింది. ఎవరిదో ఏమిటో! ఆశగా తెరచి చదవడానికి ఉపక్రమించింది. పక్కగదిలో ఫోనులో మాట్లాడుతున్న ధర్మారావు గారి గుండె గతుక్కుమంది – ఈ సన్నివేశం చూడగానే. తరవాత మాట్లాడతాను అని రిసీవర్ పడేసి గబగబవచ్చాడు. “ఇలా ఇవ్వమ్మా – నేను చదివి చెబుతాను కాని, నువ్వెళ్ళి పని చూసుకో” అంటూ ఉత్తరం దాదాపు లాగేసుకున్నంత పని చేశాడు. కోడలు అటు వెళ్ళగానే, భార్యను సున్నితంగా హెచ్చరించాడు “ఇది అందరికీ తెలియవలసిన విషయంకాదు” అంటూ ఉత్తరంలో విషయం తెలియజెప్పసాగాడు.

తాయారుకి పెద్దలయెడ ఉన్న భక్తి అంతింతనరానిది అయినందువల్ల పెద్దలమాట వినవలెను అన్న – నీతివాక్యం మనసుకు హత్తుకున్నందువల్ల తెరచాటునే నిలబడి, “ఒరేయ్ వింటూ వుండు” అని కొడుకును పురమాయించింది – పనిలో పనిగా కొడుక్కూ మహమంచి బుద్ధులు మప్పినట్టుంటుందని.

జరిగిన కథవిని నిట్టూర్చింది మాణిక్యాంబగారు. “ఏమోనండి. చిన్నబ్బాయి యీ పనిచేశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను…” అంది.

భర్త చర్రున చూశాడు. “పెద్దబ్బాయి చేశాడంటే మహ నమ్ముతావు కాబోలు” అన్నట్టు.

“అయినా వాడికా మూడుముళ్లు వేయించమని చెబితే నా మాట మీరు వింటేగా” అందావిడా బాధగా.

ధర్మారావుగారు మండిపడ్డాడు. “బాధ్యత తైలియని వాడికి పెళ్ళిచేసి మాత్రం ప్రయోజనం ఏమిటి? పెద్దబ్బాయి ఏం చేశాడు? అయిదుగురు బిడ్డల తండ్రయి ఏమీ తెలియనట్టు దేశదిమ్మరిలా తిరగటంలా?… పెద్దవాడు ప్లీడరు. చిన్నవాడు డాక్టరు అయి మనకు పేరు ప్రతిష్టలు తెస్తారనుకున్నాను. ఇలా పనికిమాలినవాళ్ళయి మన పరువు తీస్తారనుకోలేదు.” అన్నాడు చిరాగ్గా.

“ఏమిటి బావగారూ. ఏవరిమీదో ధుమధుమలాడుతున్నారు?” అంటూ ప్రవేశించాడు వెంకటరత్నంగారు. అన్నగారిని చూడగానే మాణిక్యాంబగారికి ప్రాణం లేచొచ్చింది. “సమయాని కొచ్చావన్నయ్యా” అంది తెరిపినబడి.

“ఎమిటమ్మా ఏం జరిగింది?”

“ఇదిగో చూడు” అంటూ ధర్మారావుగారు ఉత్తరం అందించాడు.

తెరవెనక తాయారమ్మకి ఈ భాగోతం నచ్చలేదు. ఏం జరుగుతోందో తెలియటంలేదు. ఆ దిక్కుమాలిన ఉత్తరమ్ముక్కని అందరూ చదివేస్తున్నారు. కుర్రవెధవ ఏం వింటున్నాడో ఎమిటో… ఇవన్నీ అనక చెప్పడానికి పూర్తిగా జ్ఞాపకం ఉంటాయో ఉండవో.. ఆమె ప్రాణం విలవిల్లాడింది.

“వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారా?” అంది ఇక ఉండబట్టలేక.

“వాళ్లు ఏం మాట్లాడడం లేదమ్మా.”

“లేదూ?”

అయిపోయింది. గడువు తీరిపోయింది. తాయరమ్మ సంతానం అంతా బిలబిల్లాడుతూ అక్కడికి వచ్చి సభచేసింది-

“అమ్మా ఆకలేస్తోందమ్మా.”

“ఆఁ?”

“తమ్ముడు నా బంతి లాక్కున్నాడమ్మా.”

“అమ్మా నాక్కావాలమ్మా – నాకమ్మా-”

ఇహనిక్కడుంటే ఆ బోరు దక్కదు. మావగారు వచ్చి చూస్తే కొంప మునుగుతంది.

“ఇస్. పదండి పదండి, తాతయ్య.” అంటూ ఆవిడ ఊరేగింపును తన గదివేపు మళ్ళించింది.

పెద్ద ముగ్గురూ చెయ్యవలసినంత చర్చా చేశారు. తల్లి పసిపిల్లలా బెంబేలెత్తి పోయింది. తండ్రి కోపంగా గెంతులు వేస్తున్నాడు. మేనమామ ఒకడే పెద్దవాడిలా స్థిమితంగా ఉన్నాడు.

“మించిపోయిందేం లేదమ్మా – నేను వెంటనేవెళ్ళి అన్ని విషయాలూ పరిష్కరించుకొని వస్తాను” అని ధైర్యం చెప్పాడయన.

“ఎలా చేస్తావో…. యిక వాడు మాత్రం ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. చదువూలేదు. సంధ్యాలేదు…” అన్నాడు తండ్రి చండశాసనుడైపోయి.

 

*                            *                                  *

 

కొడుకు ఆనంద్‌కి ఈ వేడి ఇంకా తగ్గలేదు. టింగు – రంగారావులా విలాసంగా ఈలవేస్తూ గోలచేస్తూ పూలబాలల మధ్య విహరిస్తూ హృదయాలు హరిస్తూ యుగమొక క్షణంలా తిరుగుతున్నాడు. ముస్తాబు పూర్తిచేసి బయల్దేరబోతున్న ఆనంద్‌కి లలితమైన పిలుపు వినబడింది. అవతలికి తొంగిచూసి. “ఓ పద్మా రా రా” అన్నాడు. అంతలోనే తేలిగ్గా నాలిక్కరుచుకొని ” ఓ లలితా కమాన్ కమాన్” అన్నాడు.

“పద్మా అని పిలిచావ్. పేరుకూడా మరచిపోయావ్”.

“అబ్బే అదేం లేదు – పద్మా అని పిలువ బోయి…”

“ఆఁ !” అంది లలిత.

“సారీ, లలితా అని పిలవబోయి పద్మా అన్నాను. అంతే.”

“అంతేగదా. ఒకవేళ పద్మకోసం వెయిట్ చేస్తున్నావేమో చెప్పు. నేను వెళ్తా” అంది లలిత ప్రణయకోపానికి ముద్రపట్టి.

“అరెరె.బలేదానివే నువ్వు, మర్చిపోయాను. మనమెక్కడికో వెళదామనుకున్నాం గదూ? ఆఁ… నాకు తెలుసు, నువ్వు కరెక్టు టైం కొస్తావని. కమాన్ కమాన్ కూర్చో” అన్నాడు ఆనంద్ కంగారు తమాయించుకుని. కాని భయంగానేవుంది. పద్మ వస్తానంది. వచ్చే వేళైంది. వస్తే ఏంగాను?…. యథాలాపంగా గుమ్మందగ్గరకు వెళ్ళి బయటకు తొంగి చూశాడు. అనుకున్నంతపనీ అయింది. పద్మ! వచ్చేస్తోంది!

“కోంప మునిగింది” అనుకుని గదిలోకి పరుగెత్తి కొచ్చాడు. “లలితా నువ్వు ముందు బాత్‌రూంకెళ్ళి చక్కగా మొహం కడుక్కురా.  ఊఁ-” అన్నాడు హడావిడిగా.

“యెందుకు టాయిలెట్టయే వచ్చానుగా-” అంది లలిత తెల్లబోయి.  “ఆ ఆ – అయే వచ్చావు గాని ఎండలో వచ్చావుగాదూ – మొహం ఎలా వాడిపోయిందో చూడూ.”

“అబ్బబ్బా పోనిస్తురూ”

“ఏమిటి రారా-ముందు మొహం కడుక్కో. త్వరగా పదపద” అని ఊపిరి సలపనంతగా కంగారు పెట్టేసి బాత్‌రూంవేపు తోసుకువెళ్ళాడు. కాలం ఎంత విలువైనదో ఇపుడు తెలుస్తోంది.

“అబ్బ. ఎందు కానంద్” అంది లలిత గుమ్మందగ్గర ఆగి గునుస్తూ.

“ఏందుకేమిటి సోపు, టవల్ రెడీగా వున్నాయి. బ్యూటివుల్ సెంటు చక్కగా పూసుకురా” అంటూ ఆమెను లోపలికితోసి తలుపేసి హమ్మయ్య అనుకున్నాడు కళ్ళుమూసుకుని.

“లోపలికి రావచ్చా” అంది లలితమైన కంఠం.

స్విచ్ నొక్కినట్టు క్షణంలో ఉత్సాహం వెలిగింది ఆనంద్ ముఖంలో. “హల్లో డియర్ పద్మా! నీకోసమే యెదురు చూస్తున్నా, అ రావచ్చా అని అడుగుతావేమిటి?” అన్నాడు అప్యాయంగ చేయిజాస్తూ.

“అహఁ. అదేంకాదు-రాకూడని సమయంలో వచ్చానేమోనని…” అంది పద్మ గదంతా పరకాయించి అదోరకంగా చూసి నవ్వుతూ.

“ఇది నీ సొంత యిల్లులాటిది. పద” అని నవ్వును అభినయిస్తూ చేయిపట్టుకుని లోపలకి తీసుకువచ్చాడు ఆనంద్.

సోఫా దగ్గిర చూడచక్కని ‘ఆడజోడు’ జూడగానే పద్మ ఆగిపోయింది.

ఆనంద్ నీరసంగా నవ్వాడు; ”

అది మా మేనత్తకూతురు” అన్నాడు జోడుకేసిచూసి. “ఇవ్వాళే ఊరునుండి వచ్చింది. ఊఁ… అరె. అలా చూస్తావేమిటి పద” అన్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *