April 18, 2024

ఉదారవాదం Vs. తత్వవాదం (The HIndus: An Alternative History)

 

 

వెండీ డానిగర్ పుస్తకం పై సురేశ్ కొలిచాల ఈమాట.కామ్‍లో వ్రాసిన వ్యాసం పై విమర్శ

ముందుమాట

||శ్రద్ధావాననసూయశ్చ శృణుయోదపి యో నరః….

కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ||

పై పేర్కొన్న రెండు వాక్యాలు భగవద్గీతలోనివి. ఆ రెంటినీ పలికింది కృష్ణుడే. మొదటి వాక్యం వినగోరేవారి (శ్రోతల) యొక్క లక్షణాలను పేర్కొంటే రెండవది విన్న తరువాత ఏది ఉంటుంది, ఏది పోతుందని చెబుతున్నాయి.

వినగోరేవారికి శ్రద్ధ, అనసూయత్వం (అసూయ లేకపోవడం) అన్న గుణాలతో బాటు మిగతా అన్ని సద్గుణాలూ ఉండాలి (అనసూయశ్చ లోని చ కారం ఇతర సద్గుణాల్ని నొక్కి చెబుతోంది.). అలా సల్లక్షణాలతో కూడిన శ్రోతకు మంచి విషయాలను ఉపదేశిస్తే వారిలో అజ్ఞానం, సమ్మోహం పూర్తిగా నశిస్తాయి. ఇవి కేవలం వినేవారికే ఉండాలనుకుంటే పొరబాటే అవుతుంది. చెప్పేవారిలో ఈ లక్షణాలు ఇంకా ఎక్కువగా ఉండాలి. లేకపోతే ఆ చెప్పేదంతా “కేకీక కేకికి కాక కాకికా” అన్న చందంగా ఉండిపోతుంది.

ఈ ’కృష్ణ సిద్ధాంతా’న్ని రచయితలు – పాఠకులకు కూడా అన్వయించుకోవచ్చునన్న అభిప్రాయంతో శీర్షికలోని రెండవ భాగంలో ఉదహరించిన రచయితలు (వెండీ డానిగర్, సురేశ్ కొలిచాల), వారి రచనలను పరిశీలించడమే ప్రస్తుత వ్యాసం యొక్క ఉద్దేశ్యం.

భారతదేశం – తాత్వికత

చరిత్ర కళ్ళు తెరచినప్పటి నుండి భారతదేశం తాత్వికతకు చిరునామాగా నిలబడింది. ఈ దేశంలో అనేక ఇతరమైన ప్రాపంచిక విషయాలు ఎన్ని వచ్చినా, పోయినా తాత్వికత మాత్రం ధృవనక్షత్రంలా అలా వెలుగుతూనే ఉంది. స్థిర సత్యాలను పేర్కొనే వేదాలు, స్థిర సత్యాల అస్తి-నాస్తి ప్రహేళికలపై ప్రశ్నల్ని సంధించి సమాధానాలను అందించిన ఉపనిషత్తులు, ఆయా సత్యాల పరిణామ దశల్ని అనేకానేక పాత్రల ద్వారా పరిచయం చేయించే పురాణాలు, ఆయా పురాణాలలోని పాత్రల ఔచిత్య-అనౌచిత్యాలపై పుంఖానుపుంఖాలుగా వెలువడిన స్వతంత్ర్య గ్రంథాలు – ఇలా భారతీయత యొక్క అసలు పరిచయం తత్వశాస్త్రంలోనే దొరుకుతుంది.

ఏనాడు ’రచన’ అన్నది మొదలైందో అనాటి నుండి నేటి వరకూ అతి ఎక్కువ ప్రచారాన్ని పొందినవి సనాతన ధర్మంలోని అంశాల ఆధారంగా వ్రాసిన రచనలే. ఆనాటి రఘువంశం నుండి రామాయణ కల్పవృక్షం మీదుగా నిన్న మొన్నటి భైరప్ప వ్రాసిన ’పర్వ’ వరకూ వచ్చిన రచనలు, వాటి పై పాఠక లోకం  వెలిబుచ్చిన అనుకూల-వ్యతిరేక-తటస్థ చర్చలు/అభిప్రాయాలు/స్పందనలే ఇందుకు ఉదాహరణలు.

రచనలు – అనుకూల, ప్రతికూలతలు

రెండు గట్ల మధ్య ఒద్దికగా పారే నదిని పెద్దగా పట్టించుకోరు. కాని హటాత్తుగా హోరెత్తి, ఊర్లోకి చొచ్చుకువస్తే ఎక్కడలేని అల్లకల్లోలం. అప్పుడే అందరూ నది గురించి మాట్లాడుకుంటారు. ఆవిధంగా ప్రాచీన పరంపరకు అనుగుణంగా వ్రాయబడ్డ పుస్తకాల కంటే అవ్వాటికి వ్యతిరేకంగానో లేక ప్రత్యామ్నాయంగానో ఓ రచన వస్తే…అది ఊళ్ళోకి ఉరికొచ్చిన నదిలా బెంబేలెత్తిస్తుంది. స్వచ్ఛంగా ఉన్న ఇళ్ళు బురదతో కుళ్ళినట్టు ఒకానొక ఒరవడికి అలవాటైన ప్రాణాలు అనుకోని దాడికి ఒక్కసారిగా గిమగిమలాడతాయి.

ప్రస్తుతం వెండీ డానిగర్ అనబడే ఓ పాశ్చాత్య మేధావి, బహుపుస్తక రచయిత్రి “The HIndus: An Alternative History” అనే పుస్తకాన్ని వ్రాసింది. అది గట్టు మరచి ఊళ్ళోకొచ్చిన నదిలా మారింది. దాంతో సదరు వరద మంచిదా? కాదా? అన్న చర్చలు ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి కూడా. అటువంటి అనేకానేక చర్చల్లో నేను చదివినది సురేశ్ కొలిచాల గారు ఈమాట.కామ్ లో వ్రాసిన హిందూమత చరిత్రలో ప్రత్యమ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? అన్న వ్యాసం.

పై వ్యాసంలో రచయిత గారు ఎన్నెన్నో విషయాల్ని ఉటంకించారు. మరికొన్ని సూచనలు, సలహాలను పొందుపరిచారు. అంతేగాక కొన్ని ధార్మిక గ్రంథాలలోని శ్లోకాలకు వ్యాఖ్యానాలు చేసారు. చివరగా కొన్ని సిద్ధంతాలనూ చేసారు. వెండీ డానిగర్ వ్యక్తిగత విశేషాలను సయితం పేర్కొన్నారు. అలానే, ఆమె పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్ ఇండియాపై వ్యాజం నడిపిన దీనానాథ్ బాత్రా గురించి కూడా వివరించారు. ఇలా సాగిన సురేశ్ కొలిచాల గారి వ్యాసంలోని వ్యాసార్థాన్ని (వ్యాసము + అర్థము) నా మాటల్లో తర్జుమా జేస్తే –

“రచయితగారు తమ పిల్లలకు భారత, భాగవత, రామాయణ కథలనే వారికి తోచిన విధంగా చెబుతుంటారు. వారు చెబుతున్న అల్లిబిల్లి కథలు వింటూ పిల్లలు ఊఁ కొడుతూ నిద్రపోతారు. ఆవిధంగా వారు భారతీయతను, తత్వశాస్త్రాన్ని గౌరవిస్తుంటారు. వాటి ఘనతను గుర్తు చేసుకుంటూంటారు. వారి దృష్టిలో హిందువు ఎవరంటే భారత, భాగవత, రామాయణాలు మొదలైన [అల్లిబిల్లి] కథలను తరతరాలుగా చెప్పుకొచ్చేవారు. రచయితగారు నాలుగేళ్ళ క్రితమే, యాభై ఏళ్ళుగా ఇండాలజీలో పరిశోధనల్ని చేస్తున్న వెండీ డానిగర్ అనే మేధావి వ్రాసిన The Hindus : An Alternative History అనే పుస్తకాన్ని చదివారు. చదివాక ఆమెతో పూర్తిగా ఏకీభవించలేదు. ఆమె విశ్లేషణలపై అభ్యంతరాలను తనలోనే లేవనెత్తుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంలో కొన్ని కొన్ని పొరబాట్లను కనిపెట్టారు. హిందూ మతంలోని కొన్ని ముఖ్యాంశాల్ని స్పృశించకుండా వదిలేయడం ద్వారా ఆమె పుస్తకం అసమగ్రమని కూడా గ్రహించారు.

ఇన్ని నకారాత్మకాలు (negatives) ఉన్నా సురేశ్ గారికి వెండీలోను, ఆమె పుస్తకంలోనూ హిందువులను అవమానపరిచే అంశాలు గాని, హిందూ మతాన్ని పనిగట్టుకొని కించపరిచే ఉద్దేశం గాని కోశానా కనిపించలేదు. అంతేగాక, రచయిత గారికి వెండీలో ఒక పరిశోధకురాలు తాను ఎన్నుకున్న అంశంపై అన్నీ దృక్కోణాలను విశ్లేషించడానికి, అన్నీ ప్రత్యామ్నాయ కథనాలను వీలైనంతగా చర్చించడానికి పడే తాపత్రయమే కనబడింది. ప్రతి అంశంపై ఇప్పటిదాకా మనకు తెలిసిన సమాచారం అసమగ్రమేనని ఇంకా ఎన్నో పరిశోధనలకు ఆస్కారం ఉందని అడుగడుగునా చెప్పుకునే సత్య శోధనా తత్పరతే కనిపించింది. విదేశీ వనితగా తాను చేసే విశ్లేషణల్లో తనకు తెలియకుండానేపాశ్చాత్య పక్షపాతం’ (western bias) చొరబడే ప్రమాదం ఉందని ఒప్పుకునే నిజాయితీ కనబడింది.”

ఇలా అభ్యంతరాలు-తాపత్రయాలు, పొరబాట్లు-సత్యశోధనా తత్పరత, అసమగ్రత-ఆస్కారాల నడుమన సురేశ్ గారు కొన్ని మౌలికాంశాల్ని స్పృశించారు. అందులో ప్రధానమైనవి:

  • వాక్‍స్వాతంత్య్రం – నిర్వచనాలు, చరిత్ర, ఆధునిక ధోరణులు.
  • భావ ప్రకటనా స్వేచ్ఛ – వివరాలు.
  • ప్రపంచ చరిత్రలో పుస్తక నిషేధాలు.
  • భారతీయ శిక్షాస్మృతిలోని 295ఎ సెక్షన్ చరిత్ర – స్వాతంత్య్రానికి పూర్వం – తరువాత
  • బాత్ర అభియోగాలు – నిజానిజాలు.
  • ప్రాచ్యవాదం, వలసవాదం.

పై విషయాలనన్నింటినీ విశ్లేషించిన రచయిత గారు చివరగా “హిందుత్వవాదం వల్లే హిందూమతానికి అత్యంతప్రమాదం” అన్న తీర్మానంతో “భారతీయ సంస్కృతిని రక్షిస్తున్నాం అని రొమ్ములు విరుచుకుంటున్న వారిచేతిలోనే మన సంస్కృతికి బమియన్ బుద్ధుల విగ్రహాలకు పట్టిన గతి పట్టకుండా చూసుకోవాల్సిన తక్షణావసరం మనందరిదీ కూడా.” అంటూ వ్యాసాన్ని ముగిస్తారు.

సురేశ్ గారి వ్యాసం – ఒక పరిశీలన

ఈ క్రిందన చదవబోయే పరిశీలనలో పై పేర్కొన్న అన్ని విషయాలకు సంబంధించిన చర్చ జరుపలేదు. స్థలాభావం, విస్తార బాహుళ్యం వల్ల కొన్ని ప్రధానమైన విషయాలను మాత్రమే పేర్కొనడం జరిగింది. ప్రతి విషయానికి ఒక శీర్షిక నిచ్చి, ఆ క్రింద వివరాలను పొందుపర్చడమైంది.

సనాతన ధర్మం – అనుకూల, ప్రతికూల రచనలు – కొన్ని ఉదాహరణలు

  1. 1910వ సంవత్సరంలో ఏలూరుకు చెందిన మల్లంపల్లి మల్లికార్జున శాస్త్రి అనే వీరశైవుడు “దుర్వాదిగజాంకుశం” అనే తాత్విక ఖండనా గ్రంథాన్ని పద్యరూపంలో వ్రాసి ప్రచురించాడు. శివవరపు వీరభద్ర పాకయాజి అనే మరో శైవుడు (వీర శైవుడు కాడు) వెలువరించిన కొన్ని ’దురభిప్రాయాల’పై ఖండనానుబంధ ప్రతిబంధంగా ఈ పుస్తకాన్ని వ్రాసినట్టు మల్లికార్జునుడు ప్రకటించాడు. మల్లికార్జునుని ప్రకటన అతని మాటాల్లోనే….

శా.        వ్రాయంగూడని యాజి పత్రికలు చేరన్వెంటనే నాయభి

ప్రాయంబిచ్చితి యాజి దాని దురభిప్రాయంబుతో ఖండనన్

జేయంగా నిరసించినాడనుట పైజేర్చెన్ స్వపుస్తకంబుతో

దాయాజ్యాఖు(డు కొన్ని కొత్తలనుబంధంబంచుబేర్వెట్టుచున్.

అని చెబుతూ

క.         అనుబంధ ప్రతిబంధం | బొనరించెద బ్రహ్మబంధులులికిపడంగన్

మన బంధులైన ప్రాచీ | న నిబంధనకర్తలకు ఘనప్రథ నిలువన్.

 

అని భీషణ ప్రతిజ్ఞ కూడా చేసాడు. అక్కడితో ఆగక…

క.         విరసత సదభిప్రాయము | దురభిప్రాయమనుకొంచు దురభిప్రాయాం

తరుడై చేసిన ఖండన | దురభిప్రాయంబె గాక తోచునె పెరగాన్

 

అని సదభిప్రాయ – దురభిప్రాయ వర్గీకరణను కూడా చేసేసాడు.

  1. 1913 లో అనంత కృష్ణశాస్త్రి అనే చెన్నపురి (చెన్నై) సంస్కృత కళాశాలలో లబ్ధప్రతిష్టుడైన పండితుడొకరు “వివాహసమయ మీమాంస – అబ్ధియాన విమర్శ” అన్న పేరుతో సంస్కృత పొత్తాన్ని వెలువరించారు. ఇందులో బ్రాహ్మణులు సముద్రాన్ని దాటరాదన్న విషయంపై విస్తృతంగా చర్చించారు. సముద్రయానం నిషేధితమైనదనే అభిప్రాయాన్ని శ్రుతి, స్మృతుల నుండి సేకరించిన ఉక్తులతో సోదాహరణంగాను, ఘంటాపథంగానూ చెప్పారు.
  2. 1936లో ముద్రింపబడిన “ఆదవాని కథ” అనే పుస్తకంలో అద్వైత-ద్వైత పీఠాధిపతుల మధ్య 1935 డిసెంబర్ నెలలో జరగవలసిన సిద్ధాంత చర్చ జరగకపోవడానికి గల కారణాల్ని ఏకరవుపెట్టడమైంది. ఈ పుస్తకంలో అద్వైత-ద్వైత వర్గాల మధ్య కరపత్రాల యుద్ధమెలా మొదలైంది, ఎవరెవరు ఎలాంటి కరపత్రాల్ని అచ్చువేయించారు, ఆయా పీఠాధిపతులు ఏయే ఉత్తరాలు వ్రాసారు మొదలైనవన్నింటినీ తారీఖులతో సహా ముద్రించారు. దీన్ని ముద్రించింది ద్వైతులు. మరి దానిపై అద్వైతుల ప్రతిస్పందన గురించి వివరాలు లేవు.

ఈ పుస్తకారంభం ఇలా ఉంటుంది….

“శ్రీమత్పరమహంస పరివ్రాజకత్వాద్యనేకగుణగణా లంకృతులును శ్రీమదుత్తరాది మఠ మఠాధీశులునగు శ్రీ సత్యధ్యాన తీర్థపూజ్యపాదుల వారీ పురమునకు (ఆదవానికి)…దిగ్విజయము చేసినారు. యథావిధిగ నశేషాస్తిక సంఘమునకు ప్రతిదినము సాయంకాలము ధర్మోపదేశమును చేయుచుండిరి. ఈ కాలమున ఈయూరి అద్వైతప్రబోధక సంఘమువారు శ్రీవారి ధర్మోపదేశమును విని సహింపనేరక అద్వైత ప్రాశస్త్యమును గురించి పండితులు ఉపన్యసింతురని ఆహ్వాన పత్రికను పంచిబెట్టిరి.”

పై పుస్తకాలను, సదరు రచయితలను ఉదహరించడానికి కారణం సురేశ్ గారు ప్రప్రథమంగా ప్రస్తావించిన “వాక్ స్వాతంత్ర్యం”.

పై పుస్తకాల్ని పరిశీలిస్తే ఓ వంద సంవత్సరాల క్రితం కూడా భారతీయ తత్వవేత్తలు తమలో తాము ఖండన-మండనాదుల్ని చేసుకునేవారని, వాటిలో భాగంగా పుస్తకాల్ని ముద్రించి మరీ స్పర్ధించేవారని స్పష్టమవుతోంది.

ఈ వాదప్రతివాదాలన్నీ వేద, ఉపనిషత్తు, పురాణ, ప్రాచీన గ్రంథాలలోని శ్లోకాల సరిహద్దుల్లోనో లేక ఉత్తర ప్రత్యుత్తరాల్లానో, పోటీ సభల నిర్వహణలతోనో సాగాయన్నది తేటతెల్లమవుతోంది. అంతేగాక పై పేర్కొన్న పుస్తకాల్లో ప్రతివాదుల కుచితమైన గౌరవాన్ని ఇస్తూనే ఖండన-మండనాదుల్ని జరిపారన్నది విస్పష్టం. అంతేగాక, పూర్వపక్షాన్ని మసిపూసి మారేడుకాయ చేయకుండా యథాతథంగా ఉదహరిస్తూ తమ తమ వాదనల్ని ప్రతిపాదించిన వైనం ఈనాటి ఊగుడు మాటల విమర్శకులకు ఆదర్శవంతమైనదిగా చెప్పక తప్పదు.

పై పేర్కొన్న రచయితల్లోకెల్లా “యాజీవదత్యేవమశుద్ధరూపం’ అంటూ ప్రతివాది పట్ల దుందుడుకుగా వ్యవహరించిన ’దుర్వాదిగజాంకుశ’ గ్రంథకర్త మల్లంపల్లి మల్లికార్జున శాస్త్రి సైతం శ్రుతి, స్మృతి శ్లోకపంక్తుల్ని పేర్కొంటూ పద్యాలను చాలా ఒడుపుగా నడిపించారు. ఈ క్రింది పద్యం చూడండి…

శ్రుతి.   “అశ్మానమాఖణం ప్రపదే”

తే.గీ.     ఖననమగుదన్క శైలలింగమును దాల్తు

ననెడి వాక్యము పై శ్రుతుల్వినుచు ఖనన

కృత్యమునకు శివలింగియే మరొకడు

కాడు విషయుండటంచు నిష్కర్షజేసె

 

  1. ఇలా ఇరవయ్యవ శతాబ్ది తొలిభాగంలో సనాతన ధర్మపథ పాంథులు అవ్యాహతంగా తమలో తాము వాద-ప్రతివాదాలు చేసుకొంటూ, పుస్తకాలు వ్రాసుకొంటూ ఉండగా ఏతన్మధ్యే భారత రాజ్యాంగకర్తల్లో ఒకరైన బాబాసాహేబ్ అంబేద్కర్ “Riddles in Hinduism” అన్న పుస్తకాన్ని వ్రాసారు. నిజానికి ఈ పుస్తకం ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ముద్రింపబడిందో నాకు తెలియదు గానీ అంబేద్కర్ మరణానంతరం ప్రభుత్వ నిధులతో ముద్రించారన్నది చదివాను. ఈ పుస్తకంపై అప్పట్లో గొడవలు, అల్లర్లు చెలరేగినట్టుగా సమాచారం లేదన్నది నా ఎరుకలోని విషయం. అలాగే ఇటీవలి కాలంలో కొందరు ప్రతివిమర్శలు చేసినట్టుగా కనబడుతోందే తప్ప మరే రకమైన అఘాయిత్యాలకు పాల్పడిన దాఖలాలు లేవు.
  2. తెలుగు సీమలోని కొన్ని ప్రముఖ ఘట్టాలను గుర్తుచేసుకోదల్చితే ’రామాయణ కల్పవృక్షం” – ’రామాయణ విషవృక్షం’ రచనలు ప్రముఖంగా గుర్తుకువస్తాయి. వాటితో బాటే ’దేవాలయాల పై బూతుబొమ్మలెందుకు?”, ’రాముడికి సీత ఏమౌతుంది?” వంటివాటిని కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఇటీవలి కాలంలో ద్రౌపది పై వచ్చిన పుస్తకానికి కొన్ని సాహిత్య బిరుదులు, సన్మానాలూ జరిగాయి. వీటితో బాటు ప్రొ. కంచె ఐలయ్య గారి పుస్తకం, దాని పై ఆంద్రభూమి సంపాదకులు ఎమ్.వి.ఆర్. శాస్త్రి గారు వ్రాసిన ప్రతివిమర్శను కూడా స్మరించుకోవచ్చు.

ఇలా మనకు సమీపమైన గతంలో అంటే స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తర్వాత కూడా మతపరమైన చర్చలు, గొడవలు, వాదాలు, ఖండనలు ఇలా పుస్తకాల రూపంలో సాగేవని తెలుస్తోంది. దీన్నిబట్టి హిందూ రాజుల కాలంలోను, బ్రిటీషు రాజ్యంలోను, నేటి స్వపరిపాలనలో సైతం ’వాక్‍స్వాతంత్ర్యం’ మెండుగా ఉండేదని, ఉంటోందని అర్థమవుతోంది.

ఈ మెండుదనం హైందవుల అంతర్యుద్ధాల్లోనే గాక బైటి నుండి జరిగే దాడులకు కూడా వర్తిస్తోంది. తమలో తామే పరస్పర దాడులకు అలవాటు పడ్డ జీవులపై బయటి నుండి జరిగే దాడి కొత్తగా ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఐతే ఇటీవలి కాలంలో తలెత్తినట్టుగా కనబడుతున్న “హిందూత్వ వాదం” ఎక్కడ, ఎప్పుడు, ఎలా అస్తిత్వంలోకి వచ్చిందన్న విషయాన్ని (విడిగా) కూలంకషంగా చర్చించవచ్చు.

ఈ భాగానికి ముక్తాయింపుగా మరొక రచనను ఉదహరించదలిచాను. అది 1914లో వచ్చిన  ’దానవ వధ అను ప్రహ్లాదహిరణ్యకశిపము’ అనే పద్య నాటకం. వ్రాసినవారు ’వుమ్రే అలిషా కవి’ (ఉమర్ ఆలీ షా 1884-1945AD). దీని ప్రారంభ పద్యం మిలా ఉంది:

క.         కరుణామయు( డగుపరమే

శ్వరు(డు, మహమ్మద్ రసూల్ ప్రవక్తయు స్థిరుల

చరసెద, నాఖైలలిగురు

వరుని స్తుతించెదను భక్తవత్సలు( డనుచున్

 

హిందూ మతగ్రంథమైన భాగవతంలోని ’ప్రహ్లాద చరిత్ర’ను వ్రాస్తూ ఓ పారశీక ముస్లిము నాందీ పద్యంగా తన మతానికి చెందిన దేవుణ్ణి, గురువుల్ని స్మరించుకున్నందుకు ఆ కాలంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదని వినికిడి. ఇప్పుడు నాబోటి వానికి కూడా ఎలాంటి అభ్యంతరమూ లేదు! బహుశా ఇటువంటివి ఇతర భాషల్లోను, ఇతర ప్రాంతాల్లోనూ ఆయా కాలాల్లో జరిగివుండివుండవచ్చు (ఉదా: సంత శిశునాళ షరీఫ –19వ శతాబ్దంలో కన్నడంలో తత్వపదాలు వ్రాసిన తొలి ముస్లిమ్).

చెప్పొచ్చేదేమిటంటే, ఉదారవాదులు కోరే విధంగా ప్రాచీన, అర్వాచీన స్పందనలన్నీ పుస్తకాలు/పత్రికా వ్యాసాలు/కరపత్రాల రూపాల్లోనే వచ్చాయన్నది నిస్సందేహం.

సురేశ్ గారు ఉదహరించిన దేశీయమైన (రంగీలా రసూల్ మొ.) పుస్తక నిషేధాలు, హత్యలు, బెదిరింపులు ఇతరత్రాలన్నీ మతపరమైన స్పందనల్లోని భాగమే ఐనా కొన్ని కారణాంతరాల చేత అవే ప్రముఖమైన ఘటనలుగా చలామణిలోకి వచ్చివుంటాయి. వీటితో బాటే పైన ఉదహరింపబడ్డ పుస్తకాలను కూడా పరిగణలోనికి తీసుకుంటే భారతదేశంలో ఆయా కాలాల్లో, అనేక ప్రాంతాల్లో వచ్చిన మత సంబంధమైన ప్రతిస్పందనల్ని 360 డిగ్రీల దృక్కోణంలో పూర్తిగా చూడ వీలు కలుగుతుంది. ఇలా చేయకుండా, వెలుగులోకి వ(తె) చ్చిన కొన్ని ఘటనల్నే సిసలైన చరిత్రగా భావించడం, ఆవిధంగా హిందువుల నాడిని పట్టడానికి ప్రయత్నించడం అసమగ్రం, అసమంజసం!

కోర్టులు, వ్యాజాలు

ఈ సందర్భంలో సాహిత్య-విద్యా రంగాలతో గాక రాజకీయాల్తో ముడిపడినదైనా ద్రోణంరాజు సత్యనారాయణ vs. ఎన్.టి. రామారావు వ్యాజాన్ని ఉదహరించదలిచాను. ద్రోణంరాజు గారు వందకు పైగా చేసిన ఆరోపణల్లో చాలావరకు నిరాధారమని తేలినా కొన్నింటిలో మాత్రం ఋజువులు ఉండినట్టుగా కోర్ట్ భావించడంతో ఆ వ్యాజం స్వీకరించబడింది. అదేవిధంగానే బాత్రా చేసిన ఆరోపణలు సురేశ్ గారికి పిదపబుద్ధిగా తోచినా ఎంతోకొంత సరుకు లేనిదే కోర్ట్ విచారణకు స్వీకరించివుండదు, ప్రతివాదులకు నోటీసుల్ని పంపకుండా ఉండివుండదు.

దీనానాథ్ బాత్రా కోర్ట్ మెట్లెక్కితే అది అతని వ్యక్తిగతమే గానీ సమస్త భారతీయుల మనోభిప్రాయం మాత్రం కాలేదు. సమస్త హిందువులూ ఆ వ్యాజానికి జేజేలు కొట్టినట్టు దాఖలాలు లేవు. కనుక భారతదేశం భ్రష్టుపట్టిపోతోందని సురేశ్ గారు బాధపడవలసిన అవసరం లేదు. ఒకవేళ బాధ అవసరమైతే హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొ. సుబ్రహ్మణ్య స్వామికి జరిగిన అవమానం పట్ల కూడా వ్యక్తమవ్వాలి.

ఇక పెంగ్విన్ ఇండియా వారు పుస్తకాన్ని భారతదేశం నుండి ఉపసంహరించడంపై వ్యాఖ్యానించాలంటే అదొక వ్యాపార తంత్రం. పుస్తక ముద్రణా వ్యాపారంలో ఓ పుస్తకాన్ని అమ్మితే ఎంత లాభం, ఎంత నష్టమన్న లెక్కలకు ప్రాధాన్యత ఉన్నట్టే కోర్టుకెక్కిన పుస్తకాన్ని వెనక్కి తీసుకోవడానికీ ఉంటుంది. సదరు వ్యాపారంలో సురేశ్ గారి భావాలకు, నాబోటి వారి భావాలకు తావు లేదు. వ్యాపారం శుద్ధ లౌకికం. ఫక్తు వ్యాపార నిర్ణయాలపై మేధావులు కృంగిపోవడాలు, నొచ్చుకోవడాలు చేయడం మొదలుబెడితే ఎలా?

భాష – భావం – స్వేచ్ఛ

“భాషా వ్యక్తార్థ వాచా” –మానవుల పరస్పర వ్యవహారాల్లో ఉపయోగపడే సాధనం భాష. అంతేగాదు, ఒక వ్యక్తి లక్షణాల్ని, స్వరూపాన్నీ కూడా భాష తెలియజేస్తుంది. ’మాట’గా మారి ఇతరులకు చేరుతుంది గనుక ఆ భాషలో మన లక్షణం, స్వరూపం వికృతాలు కాకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసమే తెలుగు వారు కూడా “మాట ఘనం మానిక పిచ్చ” అన్న సామెతను పుట్టించారు. కన్నడిగులు సైతం ’మాతే ముత్తు – మాతే మృత్యు’ (మాటే ముత్యం – మాటే మృత్యువు) అని చెప్పుకొచ్చారు. కారకమైనా, మారకమైనా మాట మీదే ఆధారపడివుంటుంది గనుక మాటను పలకాలన్నా, వ్రాయాలన్నా జాగ్రత్తగా ఉండక తప్పదు.

నిర్విరామ స్వేచ్ఛ అన్నది జీవితంలో ఎన్నడూ, ఎప్పుడూ లేదు, ఉండదు, రాబోదు కూడా. అడుగు తీసి అడుగు వేస్తే ఏదో ఒక భౌతిక, శారీరక, మానసిక పరిధులు మనల్ని నియంత్రిస్తుంటాయి. బ్రతుకు మీద ఆశ వున్న వాడు ’ప్రమాదకరం’ అన్న సూచికను అతిక్రమించడు. ఆ సూచిక తన స్వేచ్ఛను నియంత్రిస్తున్న నియంత అని భావించడు. కనుక హద్దుల్లో ఉండడమే సర్వధా శ్రేయస్కరం. మన మనుగడకు మూలాధారమైన మాటలను హద్దుల్లో నిర్బంధించుకోవడం అత్యావశ్యకం.

“ఊరుకు కరణము – భాషకు వ్యాకరణము శత్రువు”లంటూ దేవరకొండ బాలగంగాధర తిలక్ తన ఒకానొక కథలో చమత్కరించాడు. అది చమత్కారమే గానీ విశ్వజనీన సత్యం కాదు. కర్త, కర్మ, క్రియలు లేని భాషలో సౌందర్యముండదు. ’రాముడు వచ్చినది’, ’సీత పోయినాడు’ వంటివి విచిత్ర ప్రయోగాలు కాగలవే గానీ విద్వజ్జన సమ్మోదం కాలేవు. విణ్ణానాన్ని పంచలేవు, పెంచబోవు. పైగా చెప్పదల్చుకొన్న భావాలను తేలిపోయేట్టుగా చేయగలవు. కనుక భాషాప్రయోగాలలో జాగ్రత్త లవసరం.

భావవ్యక్తీకరణకు – భాషకు అత్యంత నికట సంబంధమున్నది గనుక భావ రూపంలో ప్రసరించే విచారధార పై కూడా సంయమన మవసరం.

తెలుగునాట తొలి నవలా రచయిత, నాటకకర్త, చరిత్రకారుడు, ప్రహసన రచయిత ఐన కందుకూరి వీరేశలింగం గారు ’సరస్వతీ నారద విలాపం’ అన్న పేరుతో ఓ ఖండకావ్యం వ్రాసారు. అందులో వారి కాలం నాటి కవులు రసహీనమైన, కేవల అలంకరణప్రాయాలైన రచనలు చేస్తూ కవిత్వాన్ని (తద్వారా భాషను) క్షోభపెట్టారని ఆక్షేపించారు. ఉదాహరణకు ఈ పద్యం చూడండి:

“దయమాలి తుదముట్ట తలకట్లు నిగిడించు

ధీరుడై నన్ను బాధించు నొకడు

పాదంబులోపల పాదంబు లిమిడించి

వీరుడై నన్ను నొప్పించు నొకడు

ప్రాసంబుపై పెక్కు ప్రాసంబు లడరించి

పోటు బంటయి నన్ను పొడుచు నొకడు

బెండు పల్కులు గూర్చి నిండైన నగలంచు

దిట్టయై చెవుల వేధించు నొకడు

 

ఖడ్గ చక్రాది రూపముల్ గానిపించి

వర్ణముల్ మార్చి నను చిక్కుపరుచు నొకడు

కుమతు లొడలెల్ల విరిచి ప్రాణములు తీయ

ఒడలి పస లేక శుష్కించి యున్నదాన”

(డా. సి. నారాయణ రెడ్డి గారి ఆధునికాంధ్ర కవిత్వం (భావకవిత్వ యుగమ్ వరకు) నుండి ఉదాహృతం)

 

1887లో రచింపబడ్డ ఈ కావ్యంలోనే ఆనాటి భాషా ఘోష ఇలావుంటే నూరు సంవత్సరాల ఇవతలకు ఆ ఘోష ఇంకెంత వికృతంగా తయారయిందో మనమే సాక్షులం. అలా మాతృభాషకే విఘాతం కలుగుతున్న రోజుల్లో సంస్కృతం లాంటి సంక్లిష్ట భాషను వెండీ లాంటి ఒక పరకీయ వ్యక్తి సంపూర్ణ సాధికారతను సాధించినట్టుగా చెప్పుకోవడం, ప్రచురణకర్తలు ఆమెను హిందూయిజంపై ప్రపంచంలోనే అగ్రగ్రామి మేధావిగా పొగడ్డం, సురేశ్ కొలిచాల గారు దాన్ని సమర్ధించడం నా వరకూ ఓ వింతే. కారణజన్ములైన ఆచార్య త్రయం కూడా తమని తాము అగ్రస్థాయి మేధావులుగా ప్రకటించుకోలేదు మరి వెండీమ తల్లి world’s foremost scholar on Hinduism ఎలాగైంది చెప్మా?

 

గుంటూరుకు చెందిన తెలుగు అధ్యాపకులు పిల్లలమర్రి వేంకట హనుమంత రావు గారు 1956లో ప్రకటించిన “ఇష్టాగోష్ఠి” అనే తమ వ్యాస సంకలనంలోని “సంస్కృతము – భారతీయత” వ్యాసంలో…

“నీ దగ్గర విదేశీ సంస్కృతి ఉండవచ్చు కాని విదేశీయులు నీవద్దకు వచ్చినపుడు నీవు చూపగలిగే నీస్వంత ప్రతిభయేది? భారతీయతగదా! నేను అన్నిటినీ గ్రహిస్తాను. కాని నా భారతీయ సంస్కృతిని మాత్రం మరువను. విదేశీయులు నీదేశం వచ్చి నేర్చుకోదలిస్తే నీవు నేర్పగలిగేది మళ్ళీ విదేశీ సంస్కృతిగదా! అది అతనికి ఉన్నదే! భారతీయుల్లోని మహత్వాన్ని పొందుదామని వచ్చిన విదేశీయునికి, ఈ సంస్కృత జ్ఞానం, భారతీయ వైశిష్ట్యం లేకపోతే నీ వందించగలిగేది పూజ్యం. విదేశీయులు నీవద్ద నేర్వవలెనన్న నీవు భారతీయుడవై యుండాలి. నీ పూర్వులు ఎంతటి మహత్కార్యాన్ని సాధించారో తరచి చూడాలంటే సంస్కృతం అవసరం. ఇప్పటి విద్యాభ్యాసం వల్ల మనం ఆంగ్ల మనస్తత్వంతో అలమటిస్తున్నాం. ముందుతరాల వారైనా మేం భారతీయులం, మా భారతీయ విజ్ఞాన భాండాగారం అనంతమైంది అని మహోన్నత శృంగాలపై నుంచి మహనీయంగా ప్రవచింప గలగాలంటే వారికి సంస్కృత భాషా పరిజ్ఞానం అత్యవసరం. “

1956లో పిల్లలమర్రిగారు పేర్కొన్న “ముందు తరాల”లో 1972లో పుట్టిన నేనున్నాను. నాతో బాటే పుట్టినవారు గాక ఆ తర్వాత పుట్టిన వారందరూ ఉన్నారు. కాని ఇందరిలో ఎందరు సంస్కృతాన్ని కనీసంగానైనా నేర్చుకున్నారన్నది చర్చనీయాంశమే! అంతేకాదు, ఓ యూదు రచయిత్రి తెలుసుకున్నంత సంస్కృతమైనా నేర్చుకున్నామా లేదా అన్నది ఓ ప్రహేళికే!

1975 ఏప్రిల్ లో ఆంధ్ర సాహిత్య అకాడెమీ వారు ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించిన “ఆధునికాంధ్ర కవిత్వం (భావకవిత్వ యుగంవరకు)” అన్న పుస్తకంలో డా. సి. నారాయణ రెడ్డిగారు ఇలా వ్రాస్తారు:

          “భౌతిక జగత్తులో ఎన్నెన్ని చిత్రమైన మార్పులు వచ్చినా, మానవునిలోని మౌలిక మనః ప్రవృత్తుల్లో చెప్పుకోదగ్గ పరివర్తనం రాలేదు. రాగద్వేషాలు, పాపపుణ్యాలు, అధికార వాంఛ, కీర్తికాంక్ష, ప్రకృతి ప్రీతి, దైవభీతి  సగటు మానవుణ్ణి పెనవేసుకునే ఉన్నాయి. ఇవి ఉన్నన్నినాళ్ళు కవిత్వం ఉంటుంది.” (అవతారిక నుండి గ్రహించింది)

పై మాటల్లో ఎంతో సత్యమున్నది. వేదోపనిషత్పురాణేతిహాసాలతో సహా ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని కావ్యాలని పరిగణించి చూస్తే అవి శాశ్వతంగా నిలబడేవుంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా మానవ హృదయ స్థాయీ భావాలను లోగొని వ్రాయబడినవే. అదే సమయంలో మానవ మేధస్సు యొక్క గ్రహణశక్తికి అందని అతీత విషయాలను కూడా చెప్పగలిగే సామర్థ్యముండబట్టి వేదాలు ’అపౌరుషేయా”లుగా, ’నిత్యా’లుగా పిలువబడ్డాయి. మిగిలినవి ’నిత్యానిత్యాలు’గా చెప్పబడ్డాయి.

ఈ వ్యాసపు ’ముందుమాట’లో పేర్కొన్నట్టు మతగ్రంథాల ఆధారంగా వ్రాయబడ్డ పుస్తకాలే చరిత్రలో అత్యధికంగా అమ్ముడుపోయాయి. ప్రస్తుత చర్చావిషయమైన వెండీ పుస్తకం నవీన ఉదాహరణ. వెండీ లాంటి పాశ్చాత్య భావజాలకుల్ని ఆకర్షించి, అవ్వారి చేత కూడా పుస్తకాల్ని వ్రాయిస్తున్నాయంటే అది భారత ప్రాచీన తత్వ రచనల్లో ఉండే నిత్యత్వం, నూతనత్వమే గాక ఎప్పటికప్పుడు ఏదోక కొత్త విషయాన్ని తెలియజేస్తున్నట్టుండే పద-వాక్య ప్రయోగాలే కారణం. ఆ గ్రంథాలు మహితాత్ములైన ఆచార్య త్రయం మొదలుగొని అప్రబుద్ధ ఐన వెండీ వరకు వారి వారికి కావలసిన కోణాల్ని సరఫరా చేసాయి, చేస్తున్నాయి, చేయబోతాయి కూడా. తాము స్థిరంగా నిలుస్తూ (ఒక్క అక్షరాన్ని కూడా మార్చుకోకుండా) తిట్టేవాళ్ళను, కాల్చేవాళ్ళనూ, పొగిడేవాళ్ళనూ, పక్కన పెట్టేసే వాళ్ళనూ సంతోష పెడుతున్న భారతీయ సనాతన గ్రంథాలు ఆచంద్రార్కాలు. గంగానదిలో స్నానించే వాడితో బాటూ మూత్ర విసర్జన చేసేవాడూ ఉంటాడు. ఎవరి దృష్టి వారిది – ఎవరి ఫలితం వారిది. అంతే.

ఆన్‍లైన్ వార్తాపత్రికలు – ప్రతిస్పందనలపై ప్రతిరోధాలు

వెండీ పుస్తకం పై “ది హిందూ” వార్తాపత్రిక వారు తమ వెబ్ పత్రికలో ప్రచురించిన చాపెల్ మెహ్రా వ్యాసం పై డా. ఐ.వి.ఎన్.ఎస్. రాజు గారు తన ప్రతిస్పందనను వ్రాస్తూ “We see many books on the shelves of our book shops but the works of the Indian Seers like Vyasa and Valmiki would intrigue the mankind as long as it exit and that is the power of content.  These works are eternal as they have got eternal significance to all the seekers at all levels. “ అని అన్నారు. ఈ మాటల్లో కూడా ఒక నిష్టుర సత్యమున్నది. నేను ఈ వ్యాసం వ్రాస్తున్న నాటికి రాజుగారు పై కామెంటును ’ది హిందూ’కు పంపి దాదాపు వారం రోజులు పైనే గడిచింది. ’ది హిందూ’ ఈ కామెంట్ ను ఇంకా ప్రచురించలేదు!. వారిదే గాక నేను వ్రాసిన వ్యాఖ్యను కూడా నొక్కి పెట్టేవుంచారు. ఈ పద్ధతి ఎటువంటిది? నీతులు చెబుతూనే గోతులు తీయడం ఎంత వరకు సమంజసం?

భాషలో లోతు, వైవిధ్యత, అర్థానుసంధాన ప్రాశస్త్యం

మళ్ళీ అసలు విషయానికి మళ్ళితే – భాష ఎంత నాజూకుగా ఉంటుందో, భావ వైవిధ్యం అంతగా పెరుగుతుంది. అర్థానుసంధాన వైవిధ్యమూ విస్తృతమవుతుంది. వైవిధ్యం పెరిగే కొద్దీ లోతు కూడా పెరుగుతుంది. లోతు ఎక్కువయ్యే కొద్దీ నైపుణ్య సంపాదన మరింత ఎక్కువవుతుంది. ఆ నైపుణ్య సాధనకు ఒక జీవిత కాలం చాలదు.

సంస్కృత భాష లోని నాజూకుదనం, భావార్థ వైవిధ్యం, గహనత్వ-గూఢత్వాలు ప్రబలమన్నది సర్వాంగీకారమైనదే. ఆ దివ్యభాషకు ఒక అజ్ఞుడిగా నేనివ్వాల్సిన ప్రశంసా పత్రమేదీ లేదు. చిత్ర కవిత, విలోమ కావ్యం వంటి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవ్వగలను. అటువంటి సంస్కృత భాషను “Perfected, artificial” అంటూ వ్యాఖ్యానించింది వెండీ డానిగర్.

“న+శ్వ”గా వ్రాయాల్సిన పదపరిచ్ఛేదాన్ని ఉద్దేశ్యపూర్వకంగా “అ+శ్వ” అని వ్రాసింది. ఈమె చెప్పేదే సరైనదైనప్పుడు ’అద్వైత’ పదాన్ని అ+ద్వైతంగా విడదీయ్యాల్సి వస్తుంది. అ అంటే నారాయణుడన్న అర్థముంది గనుక అద్వైతం అంటే నారాయణుని ద్వైతంగానే చెప్పాల్సివస్తుంది. దాంతో శంకరులవారు ప్రతిపాదించదలచిన ద్వైతరాహిత్యం (non-dualism) సిద్ధించదుగాక సిద్ధించదు. సురేశ్ గారికి, ఇతర ఉదారవాదులకు ఈ వ్యాకరణ భంగం అంగీకారమేనా? రసభంగమైన కావ్యాన్ని, వ్యాకరణభంగమైన సిద్ధాంతాన్ని భుజాన మొయ్యాల్సిన అవసరం ఎవరిది? ఎవరికి? ఎందుకు?

నేను చదివిన మేరకు సంస్కృత పదాల అర్థాల్ని వివరించడానికి వెండీ ఎక్కువగా మేదీనికోశం మీద ఆధారపడినట్టుగా తెలుస్తోంది. కానీ కోశకారు డిచ్చిన నానార్థాలలో తనకు అనుకూలమైన అర్థాన్ని మాత్రమే వాడుకుంది. ఉదాహరణకు “వాసన” పదం. మేదినీకరుడు ఈ పదానికి ’ధూపం’ అన్న అర్థంతో బాటు ’జ్ఞానం’ అనే అర్థాన్నిచ్చాడు. హలాయుధుడు తన కోశంలో ’వాసన’ను ప్రాగ్జన్మ జ్ఞానం (పూర్వజన్మ స్మృతి)గా వ్యాఖ్యానించాడు. కానీ వెండీ వీటిని స్వీకరించకుండా ’ధూపం’ అన్న అర్థాన్నే వాడుతూపోయింది. పరిశోధనాత్మక రచనల్లో ఇటువంటి ధోరణి అభిలషణీయం కాదన్నది నా అభిప్రాయం. సంకుచితార్థాలను వాడుతూ ప్రతిపాదింపబడేవి సిద్ధాంతాలు కాలేవు.

ఇక భాషా స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ గురించి….

“వాదో నావలంభ్యః” అని నారద భక్తిసూత్రం చెబుతోంది. ఏదేనీ విషయాన్ని అవసరమైనదాని కంటే ఎక్కువగా విస్తరించడం గాని, లేనిపోని వ్యాఖ్యానాలు చేయడం గాని కూడదు. ఎందుకంటే “బాహుళ్యావకాశాత్” అని నారదుడే వివరిస్తాడు. అక్కిరాజు ఉమాకాంతం మాటాల్లో చెప్పాలంటే “అతి విస్తరణ, ఊగుడు మాటలు” భావ/భాష స్వేచ్ఛలో భాగమైనా హానినే కలిగిస్తాయి. అవి తమలోని స్వచ్ఛతను కోల్పోయి వ్యక్తికి, సమాజానికి ఎటువంటి ఉపయోగాన్నీ ఆపాదించిపెట్టవు. కనుక “అతి మతిని చెరుస్తుం”దన్న నానుడిని జ్ఞప్తిలో పెట్టుకుని భావాలను, భాషను ఒక మితిలో ఉంచుకోవడం సర్వధా శ్రేయస్కరం. మేలు చేయలేకపోయినా చెరుపు చేయకుండా ఉండడం ముఖ్యం.

సమన్వయ సాధన – ఆవశ్యకత

సురేశ్ గారు తమ వ్యాసంలో ఇలా అన్నారు:

సిద్ధాంత చర్చలు, వాదవివాదాలతో భారతీయ తాత్వికత చరిత్ర అంతా నిండి ఉంది. నాసదీయ సూక్తంలో దేవుడి జ్ఞానాన్నే ప్రశ్నించే తాత్విక చింతన భారతీయ దర్శనాల్లో మొదటినుంచి కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో ఎన్నో సంవాద వివాదాలు కనిపిస్తాయి. వేదాలను నిరసించే వ్యాఖ్యలు ఉపనిషత్తులోను, ఇతిహాస, పురాణాలలోను కనిపిస్తాయి.”

సురేశ్ గారి పై మాటల్లోని వారి అర్థాలేవైనా నాకు వినబడుతున్న ’ధ్వని’ మాత్రం వేరుగా ఉంది. సురేశ్ గారు తమ వయ్యక్తిక ఉద్దేశ్యాన్ని సార్వజనికం చేసే ప్రయత్నం కనిపిస్తోంది. ఇలా అనడానికి సదరు వాక్య నిర్మాణమే నిదర్శనం.

వేదవ్యాస రచితమైన బ్రహ్మసూత్రాలలో “తత్తు సమన్వయాత్” అన్న సూత్రమొక టున్నది. ఇది చాలా సులువుగా అర్థమయ్యే సూత్రం. బహు గ్రంథ విస్తృతము, పద గుంఫనా గహనము, బహ్వర్థ గంభీరమూ ఐన సనాతన ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలంటే అన్ని గ్రంథాలను సమన్వయ పరచుకుంటూ చదవాలన్నది వేదవ్యాసుని అభిలాష (ఆదేశం కూడానూ).

వేదాలను విభజించిన వానిగా, 18 పురాణాలు, అంతే సంఖ్యలో ఉప పురాణాలను, ఒక ఇతిహాసాన్ని వ్రాసిన మహానుభావుని మాటను లెక్క చేయకుండా సమన్వయపూర్వకంగా అధ్యయనం చేయాల్సిన గ్రంథాలను విడదీసి, విడివిడిగా, పొడి పొడిగా చదవేసి తీర్మానాలను చేయడం, అపహాస్య-అవహేళన-అపనిందలు వేయడం ఏ విధంగా సబబు? ఇది ఎటువంటి విజ్ఞానం? మూల రచయిత ఉద్దేశ్యాలను, జ్ఞానాన్ని శంకిస్తూ వక్రవ్యాఖ్యలు చేయడమేనా పరిశోధన? “అమ్మా/అయ్యా – ఇది ఏవిధంగా చూసిన తప్పు. దిద్దుకొమ్మ”ని చెప్పేవారిని ద్రోహులుగాను, ఉన్మాదులుగానూ ముద్రవేయడం ఏ రకపు సంస్కారం?

ఇంతకూ సమన్వయ మంటే ఏమిటి? దానికి ఉదాహరణ ఏమిటి?

అపి స్వర్ణమయీం లంకాం న మే రోచసి లక్ష్మణా

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి (రామాయణము)

 

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్టితాత్

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః (మహాభారతం – భగవద్గీత)

 

పైపై చూపులకు రెండు శ్లోకాలు వేరువేరుగా ఉన్నట్టు కనిపించవచ్చు కానీ అంతర్లీనంగా రెండూ శ్లోకాలు వేర్వేరు సందర్భాలను వాడుకొని ఒకే విషయాన్ని ఉపదేశిస్తున్నాయి. ఎలాగంటే

స్వర్ణమయీం లంకాం = పరధర్మాత్వనుష్టితాత్

న మే రోచసి = భయావహః

జననీ జన్మభూమిశ్చ = స్వధర్మో విగుణః

స్వర్గాదపి గరీయసి = శ్రేయాన్ స్వధర్మో

బంగారుమయమైన లంక రాముడికి రుచించనట్టే అందమైన పరధర్మం కృష్ణుడికి రుచించలేదు. తాళిబొట్టులో మాత్రమే బంగారాన్ని కలిగివున్న కన్నతల్లి బంగారుమయమైన లంక కంటే గొప్పది అన్నాడు రాముడు. విగుణమైన స్వధర్మమే మేలన్నాడు కృష్ణుడు. సుఖమయమైన స్వర్గం కంటే జన్మభూమి గొప్పదన్నాడు రాముడు. స్వధర్మంలో సంభవించే మరణమే ఉత్తమమన్నాడు కృష్ణుడు.

కలౌ కల్మషచిత్తానాం పాపద్రవ్యోపజీవినామ్

విధిక్రియావిహీనానామ్ గతిర్గోవింద కీర్తనమ్ (భాగవతం)

 

కల్మష చిత్తం, పాపద్రవ్యం, విధిక్రియా విహీనత్వం = పరధర్మం (కలి పరమైన అధర్మాలు) = లంక

గోవింద కీర్తనమ్ = స్వధర్మం = జననీ, జన్మభూమి

గతిః = శ్రేయః = స్వర్గాదపి గరీయసి

అంటే అది కృతయుగమైన లేక ద్వాపరమైన – చెప్పినవాడు రాముడైన లేక కృష్ణుడైనా లేక వ్యాసుడైనా – ఉపమానోపమేయాలు వేరు వేరుగా అగుపడినా – అందరూ చెప్పదల్చుకున్న సత్యమొకటే. ఇటువంటి ఏక సత్యత్వాన్ని “తత్తు సమన్వయాత్” ద్వారా సాధించడమే అసలైన పరిశోధన.

“ఏకమ్ సత్ విప్రా బహుధా వదంతి”!

 

భారతీయ ప్రాచీన శాస్త్రాల అధ్యయన క్రమం

సనాతన భారతీయ ధార్మిక గ్రంథాల విశ్లేషణ చేసే సందర్భంలో విశ్లేషకులు రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి:

1. ప్రసంగం

2. ప్రసక్తి

ఒక ప్రసంగంలో ఎన్నో ప్రసక్తులు ఉంటాయి. ఉదా: రామాయణంలోని రామ వనవాసం. ఈ ప్రసంగం పుట్టడానికి ఎన్ని ప్రసక్తులు అవసరమయ్యయో చూడాలి.

సురేశ్ గారు దశరథుని కాముకత్వం వల్ల వనవాస ప్రసంగం పుట్టుకొచ్చిందన్నట్టుగా వ్రాసారు. అది చదివిన వారికి మరే ప్రసక్తి లేనట్టుగా అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి ఐదు ప్రసక్తులు ఉన్నాయి:

1. దశరథునికి శ్రవణ కుమారుని తల్లిదండ్రు లిచ్చిన శాపం.

2. కైకేయికి దశరథుడిచ్చిన మూడు వరాలు.

3. మంథర – కైకేయి సంభాషణ.

4. ఎప్పుడో ఇచ్చిన వరాలను రామ పట్టాభిషేక సమయంలోనే కైక అడగడం.

5. వశిష్ఠుడు వంటి బ్రహ్మర్షి నిర్ధారించిన పట్టాభిషేక ముహూర్తం విఫలమవడం.

పైవన్నీ ఒక్క బిందువు దగ్గర కలిసినప్పుడే వనవాస ప్రసంగం సంభవనీయమైంది. ఇందులో ఏ ఒక్క ప్రసక్తిని వదిలినా ప్రసంగంలోని పరమార్థం మాయమైపోతుంది. ప్రస్తుతం వెండీ గాని, సురేశ్ గారు గాని చేసినది ఇదే. ఏదో ఒకటి రెండు శ్లోకాలను తీసుకొని అందులోని మాటలే సిద్ధాంతమని అనుకోవడం పొరబాటు.

అలానే కురుక్షేత్రంలో అర్జున విషాదాన్ని, నిర్వేదాన్ని ఒకటి, రెండు భగవద్గీత శ్లోకాలతోనే సరిపెట్టాలని చూస్తే అది విపరీతార్థాలకు దారి తీస్తుంది. బంధువుల్ని చంపలేనని ఏడ్చిన అర్జునుడు కృష్ణప్రబోధంతో యుద్ధానికి మళ్ళాడు. కానీ అభిమన్యుని మరణంతో మళ్ళీ దుఃఖించి యుద్ధం మధ్యలోనే అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యాడు. అంతకు మునుపు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కృష్ణుడి మీద అహంకరించాడు. ఇలా ఎన్నెన్నో ప్రసక్తుల్ని చేర్చి అర్జునుడిని ఉద్దేశ్యించి గీతలో కృష్ణుడు వాడిన పదాలను విశ్లేషించాలి.

రెండో అధ్యాయం మొదట్లోనే కృష్ణుడు “క్లైబ్యం మాస్మ గమః పార్థ” అని అర్జునుణ్ణి మందలిస్తాడు. క్లైబ్యం అంటే నపుంసకత్వమని అర్థం కదా! అర్జునుడు నపుంసకుడా? కానప్పుడు ఆ పదాన్ని కృష్ణుడు ఎందుకు వాడాడు? – ఇవన్నీ అర్థం కావాలంటే భారత యుద్ధం వరకూ గల అర్జునుని వ్యవహారాలన్నింటినీ సమీక్షించాలే తప్ప ఒక్క యుద్ధ ప్రసంగంతోనే నిర్ధారణలకు రాకూడదు.

ఇతర ఉదారవాదుల స్పందనలు

సురేశ్ కొలిచాల గారి వ్యాసంపై జరిగిన చర్చలో పాల్గొన్న రామారావు కన్నెగంటి గారు ’భారతీయ గ్రంథాలలో వైరుధ్యాలున్నా’యని ఘోషించారు. రామారావు గారు 4 వేదాలు, 36 పురాణోపపురణాలు, 2 ఇతిహాసాలు, 6 వేదాంగాలు, ప్రాచీనాచార్య కృతాలైన అసంఖ్యాక గ్రంథాలను చదివి పై నిర్ణయానికి వచ్చినట్టు చెప్పలేదు గనుక వారి వ్యాఖ్యలు నిరాధారాలు, కేవల వయ్యక్తికాలు. ఇలా నిరాధారంగా, గంపగుత్తగా వారు చేసిన వ్యాఖ్యలకు విలువనివ్వాల్సిన పని లేదు గానీ అటువంటి అసంబద్ధపు మాటలు రేకెత్తించే కోలాహలం అంతా ఇంతా కాదు.

వీరితో బాటే అన్నయ్యగారు తమ వంతు కృషిగా “మీ [సురేశ్ కొలిచాల] వ్యాసంపై వచ్చిన కొన్ని కామెంట్లను పరిశీలిస్తే చాందసులు మతమౌఢ్యం ముసుగు కనిపించకుండా పాండిత్యప్రకర్ష ప్రదర్శిస్తూ మీ అభిప్రాయాలపై దాడిచేయడం శోచనీయం.” అని బాధపడ్డారు. వీరి పై మాటలు చాలా చాలా హాస్యాస్పదాలు. అంతేగాక వారు ఎక్కిన కొమ్మను వారే నరుక్కున్నట్టుగా ఉంది. తెలుగు, సంస్కృత భాషలు మరియు వాటి వ్యాకరణ-ఛందస్సులు మతమౌఢ్యాన్ని, ఛాందసత్వాన్ని, పాండిత్యప్రకర్షల్నీ పెంపొందిస్తున్నాయి గనుక వాటిని పాఠ్యాంశాలుగా ఇంకా కొనసాగిస్తూండడం చాలా శోచనీయమన్నట్టుగా ఉన్నాయా మాటలు. ఇది నగుబాటు గాక ఇంకేమిటి?

ఈ హ్రస్వదృష్టి వ్యాఖ్యానానికి కారణమున్నది. అన్నయ్యగారు తమ పరిశీలనలో భాగంగా పెరవారి వ్యాఖ్యలపై రంధ్రాన్వేషణలోనే ఇరుక్కుపోవడం వల్ల తమకు తాముగా చేసుకుంటున్న స్వవచోఘాతాల్ని చూసుకోలేకపోయారు. ఇటువంటివారు మొదటగా తమలోని అభావ కశ్మలాల్ని శుభ్రంగా కడుక్కున్న మీదట పరులపై వ్యాఖ్యలు వ్రాస్తే ఉభయకుశలోపరిగా ఉంటుంది.

ముగింపు

వైవిధ్యానికి, వైరుధ్యానికి తేడా తెలుసుకోకుండా తమకు తోచిందే వేదంగా చెలామణీ చేయించాలనుకోవడం అత్యంత విచారకరం. తత్వ సమన్వయం పట్ల సంయమనం లేనివారు సిద్ధాంతాల్ని చేయబూనడం ప్రమాదకరం. సముద్రంలో అనంత సంఖ్యలో అలలు ఉన్నట్టే ఒక్కొక్క అక్షరంలో అనల్పార్థాల్ని నింపుకొని అటు లౌకిక ప్రయోజనాలను, ఇటు పారలౌకిక ప్రయాణాలనూ చక్కగా సమతూకంలో ఉంచుతున్న ధార్మిక గ్రంథాల విశ్లేషణలో శ్లేషలకు, స్వకపోలకల్పితాలకు తావివ్వకూడదన్న కనీస మర్యాదను మర్చిపోయిన వారు హితబోధల్ని చేయడం ఒక విపర్యాసం.

ఈ వ్యాసం పై జరిగిన చర్చలోను, ఫేస్‍బుక్ లో సాగిన సమాంతర వ్యాఖ్యానాల్లోనూ ఉదారవాదుల పలాయనవాదం అయా వేదికలపై పాలుపంచుకొన్నవారికి అవగతమైనదే. బహుశా ఇప్పటికైనా తమకు తెలిసిన “హిందూయిజం” చాలా అత్యల్పమని, తాము సరిదిద్దుకోవల్సిన అంశాలు అనేకాలున్నాయని ఉదారవాదులు గ్రహిస్తే అది వారికే మేలు. లేకుంటే….

అమిత్రమ్ కురుతే మిత్రమ్ మిత్రమ్ ద్వేష్టీ హినస్తి చ

కర్మ చారభతే దుష్టం తమాహుర్మూఢచేతసమ్ (విదుర నీతి)

 

స్వస్తి!

@@@@@

3 thoughts on “ఉదారవాదం Vs. తత్వవాదం (The HIndus: An Alternative History)

  1. చాలా చక్కగా చెప్పారు. “తత్తు సమన్వయాత్” అన్నట్టుగానే ఉంది మీ వ్యాసం.

Leave a Reply to హరీష్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *