March 29, 2024

మౌనరాగం – 7

రచన: అంగులూరి అంజనీదేవి

http://www.angulurianjanidevi.comanjanidevi

anguluri.anjanidevi.novelist@gmail.com

నేత్రా పత్రిక కొనటానికి కొంతమంది ముందుకొచ్చినా, రేటు దగ్గర వెనక్కి తగ్గటంతో ఆ టెండర్‌ అమృతరావుకి దక్కింది. ఆ పత్రిక చూసుకునే బాధ్యత తన కొడుక్కి అప్పజెప్పాడు అమృతరావు. పత్రికాఫీసులో పాత రికార్డులన్నీ పరిశీలించి, కొంతమందిని సమావేశపరిచాక, సుభాష్‌చంద్ర దగ్గర కీలకమైన వ్యక్తి దేదీప్య అని తెలియగానే దేదీప్యను పిలిపించారు. జాబ్‌లో జాయిన్‌ కమ్మని దేదీప్యను కోరారు.

ప్రస్తుతం ఉద్యోగం అవసరం అయినందువల్ల ఆ ఆఫర్‌ దేదీప్యకి మండుటెండలో వెన్నెలవర్షంలా అన్పించటమే కాకుండా సుభాష్‌చంద్ర ఆశయాలను తిరిగి బ్రతికించే అవకాశం మళ్లీ వచ్చినట్లు భావించింది.

‘‘మే ఐ కమిన్‌ సర్‌!’’ అంది దేదీప్య.

సుభాష్‌చంద్ర సీట్లో కూర్చుని వున్న అన్వేష్‌ దేదీప్యను చూడగానే ఉవ్వెత్తున ఎగసిన కెరంటంలా అయ్యాడు. వేలకోట్ల నక్షత్రాలు అతని ముఖంలోకి తన్నుకొచ్చి నిన్ను చూడగానే నాకెందుకింత ఆనందం?’ అన్నట్లుగా  చూసి….. వెంటనే వెనక్కి తగ్గి…

‘‘ఎస్‌! కమిన్‌!’’ అన్నాడు.

అన్వేష్‌ని సుభాష్‌చంద్ర సీట్లో చూడగానే ఒక్కక్షణం ఆశ్చర్యం… అంతుపట్టని  భావ సంచలనం. గతానికి వర్తమానానికి మధ్య యుద్దం.  భవిష్యత్తుకి వర్తమానానికి మధ్య రాజీ.

ఏ వ్యక్తీ గతంలో జీవించాలనుకోరు. అలాగే దేదీప్య కూడా  అప్పటికప్పుడు అన్వేష్‌ పట్ల పాజిటివ్‌ థింకింగ్‌ను డెవలప్‌ చేసుకొంది. వెంటనే సుభాష్‌చంద్ర గుర్తొచ్చి అన్వేష్‌ వైపు ఆనందంగా చూసింది.

అదీకాక తన క్లాస్‌మేంట్‌ అన్వేష్‌ని చెయిర్‌మెన్‌ సీట్లో చూస్తుంటే గర్వంగా అన్పించిందే తప్ప  యింకే ఫీలింగ్‌ రాలేదు.

ఒక్కో అడుగు ఎంత మెల్లగా వెయ్యాలన్నా చేతకాని దానిలా త్వరగా వెళ్లినట్లే వెళ్లి అతనికి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. ఆమెనలా చూస్తుంటే ఆ పరిసరాలు ఆమెకు బాగా అలవాటయినవిగా అన్పిస్తూ ప్రతి అంగుళం ఆమెకు ఇష్టమైనదిగా అన్పించింది.

‘‘దేదీప్యా! సుభాష్‌చంద్రగారి రికార్డులో పి.ఎ.గా మీ పేరు చూశాను కాని మీరనుకోలేదు.  బావున్నారా?’’ అన్నాడు. అతని గొంతులో ఆప్యాయత ధ్వనించటం గమనించింది. దేదీప్య.

‘‘బాగున్నాను సర్‌!’’ అంది ఆమె ‘సర్‌’ అనగానే అన్వేష్‌కి తను కూర్చున్న సీటును గుర్తు చేసినట్లు అన్పించి, ఆమె దృష్టిలో ఆ సీటుకి ఎంత వాల్యువుందో అర్థమై కాస్త సర్దుకొని కూర్చున్నాడు.

ఎం.బి.ఎ.పూర్తి చేసిన అన్వేష్‌ ఈ రెండేళ్లలో బాగా మారాడు. ఆ మార్పు అతనిలో డిగ్నిటీని తెచ్చింది. డీసెన్సీనీ పెంచింది. దేన్నైనా మెరుపు వేగంతో గ్రహించగలిగే నేర్పును నేర్పింది.

‘‘దేదీప్యా! సుభాష్‌చంద్ర అన్ని విషయాలు మీతో చెబుతారని, మీ గురించి కూడా  ఆయన బాగా కేర్‌ తీసుకుంటుండేవారని, మీరు ఆయన కుడి భుజంలా వుండేవారు అందరు అనుకుంటున్నారు.  మరి ఈ పత్రిక యింత లాస్‌లో నడుస్తున్నప్పుడు మీరీ లాస్‌ను ముందే ఎందుకు అంచనా వెయ్యలేదు?’’ అంటూ కాస్త ముందుకి వంగి ఆసక్తిగా అడిగాడు అన్వేష్‌.

అతనలా అడుగుతుంటే సుభాష్‌చంద్ర గుర్తొచ్చి  ఆమె హృదయం కదలి ద్రవించింది. మనసు మౌనంగా ఏడ్చింది. ఆమె ముఖంలోని మార్పును గమనిస్తూ….

‘‘మీకు మాట్లాడానిపించకపోతే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. బై ది బై ఈ ప్రతికను కొనేటప్పుడు మాత్రం నా ఫ్రెండ్స్‌ వద్దని హెచ్చరించారు. నాన్నగారే ధైర్యం చేసి కొన్నారు.  బిజినెస్‌ పరంగా లాస్‌లో వున్నవి కొంటే చేతులారా చేతుల్ని కాల్చుకున్నట్లే కదా!’’ అన్నాడు.  దానికి సమాధానంగా ఆమె ఏమి చెబుతుందో అన్నట్లుగా ఆమె వైపు చూశాడు. ఆ పత్రిక గురించి ఏం తెలుసుకోవాలన్నా ఆమె ద్వారానే అవుతుందని అక్కడ వున్న రికార్డులు తిరగెయ్యటంతో అర్థమైంది అన్వేష్‌కి.

పత్రిక గురించి తనకి తెలిసింది చెప్పాలని అన్వేష్‌ వైపు చూసింది.

‘‘ఈ లాస్‌ పత్రికకి సంబంధించింది అని నేను అనుకోవటం లేదు. ఆ రోజు చాలా సేపు సుభాష్‌చంద్ర సిస్టమ్‌ ముందే కూర్చుని వున్నారు నేను వెళ్లేటప్పటికి సిస్టమ్‌లో షేర్‌మార్కెట్‌ గురించి కన్పించింది. అప్పటికే ఆయన చనిపోయి వున్నారు.’’ అంది.

‘‘సిస్టమ్‌లో కన్పించిన షేర్‌ మార్కెట్‌కి,  ఆయన చనిపోవటానికి ఏమిటి సంబంధం?’’ అనుమానంగా అడిగాడు అన్వేష్‌.

‘ఆయన షేర్స్‌ మీద కోట్లలో ఇన్వెస్ట్‌ చేసి నష్టపోయినట్లు అన్పించింది.’’ అంది దేదీప్య.

‘‘దానివల్ల నష్టం ఎందుకొస్తుంది?  ‘నికరంగా సంవత్సరానికి ఇంత రాబడి’ అని ఇస్తున్న కంపెనీ షేర్లలో  ఇన్వెస్ట్‌ చేస్తే ఆ డబ్బు సురక్షితంగానూ, లాభసాటిగా వుంటుంది కదా!’’ అన్నాడు అన్వేష్‌.

‘‘ఆయనలా చేసి వుండరు. కొనటం, అమ్మటం లాంటి డైలీ ట్రేడింగ్‌ చేసి వుంటారు.’’ అంది దేదీప్య.

‘‘అలా చేయదలచుకున్నప్పుడు దానికి లోతైన పరిజ్ఞానం అవసరం. విచిత్రమేమిటంటే ఇలా షేర్స్‌ మీద ఇన్వెస్ట్‌ చేసేవాళ్లంతా తమకు దాని గురించి బాగా తెలుసనుకుంటారు. సరేలే! అంతా తెలిసిన వాళ్లే వుంటే మరి నష్టపోయేవాళ్లెవరుంటారు?’’ అంటూ అంతటితో ఆ విషయం మాట్లాడడం ఆపేశాడు అన్వేష్‌.

‘‘ ఈ పత్రికకి నేత్రా పేరుని తీసేసి ఏదైనా ఒక మంచి పేరు పెట్టాలి దేదీప్యా!’’ అన్నాడు అన్వేష్‌?

‘‘లక్ష్యం పెట్టండి! బావుంటుంది.’’ అంది వెంటనే దేదీప్య.

‘‘వెరీగుడ్‌ మీకీ పేరు ఎలా తట్టింది?  పేరు కోసం రాత్రంతా మా ఇంట్లో వాళ్లు ఆలోచించారు.  నేను కూడా….’’ అన్నాడు సంతోషంగా

‘‘నేనంతగా ఏం ఆలోచించలేదు.   మీ పేరులోంచి సగం కట్‌ చేసి చెప్పానంతే!’’ అంది సింపుల్‌గా దేదీప్య.

‘‘నా పేరులో రెండు పదాలు వున్నాయని గుర్తొస్తేనే నవ్వొస్తుంది.’’ అన్నాడు నవ్వుతూ సరదాగా.

దేదీప్య కలిసింది.  ఇప్పుడే అయినా ఆమెతో యింకా మాట్లాడాలన్న ఫీలింగ్‌తో…  మధ్య మధ్యలో అతనితో మాట్లాడాలని ఎవరొచ్చినా వెనక్కి పంపించి వేస్తున్నాడు.

‘‘మీ పేరులో వున్న లక్ష్యం, అన్వేషణ పదాలను చూసి కావ్య నవ్వేది కూడా. కామెంట్‌ చేస్తుండేది.’’ అంది కావ్యను గుర్తుచేస్తూ

‘‘ మా అమ్మ నాకెంతో ఇష్టంగా పెట్టిందా పేరు. అసలు నా పేరులో ఏముందో తెలిస్తే కావ్య అలా కామెంట్‌  చేసి వుండేది కాదు.’’ అన్వేష్‌.

‘‘పేరులో ఏముంటుంది? మీ పేరు పూర్తిగా పలకటం కష్టంగా అన్పించి జనాలు చచ్చిపోతుంటే…. ఒక్కరోజన్నా కావ్య మీ పూర్తి పేరును క్లియర్‌గా పలికిందా?’’అంది దేదీప్య.

‘‘ ఆ మాటకొస్తే మీ పేరు కూడా అంతే! పిలవగా, పిలవగా అలవాటైతేనే తప్ప వెంటనే పిలవలేరు.  నేను ఫస్ట్‌ మీ పేరుని వినగానే నా నాలుక మడతపడి జీవితంలో మీ పేరు పలకగలనో లేదో అనుకొని ఆ రోజు రాత్రంతా ప్రాక్టీస్‌ చేశాను.’’ అంటూ ఆ రోజును గుర్తుచేసుకున్నాడు. అతనికి దేదీప్య సమక్షం ఆనందంగా, ఆహ్లాదంగా వుంది. సీరియస్‌గా, మితబాషిలా వుండే అన్వేష్‌ ఒక్క దేదీప్య దగ్గరే అలా వుండగలుగుతున్నాడు.

‘‘కవర్‌ చేసుకోవద్దు. మీ పేరుని ఎవరికి చెప్పాలన్నా కావ్య లక్స్‌సోప్‌ అనే చెబుతుంది.’’ అంటూ అతను బాస్‌ తను పి.ఎ. అన్న విషయం మరచిపోయి గట్టిగా నవ్వింది…. నవ్వుతూనే వుంది పెళ్లికి ముందు ఏం నవ్విందో ఆ తర్వాత మళ్లీ నవ్వనేలేదు. ఇప్పుడు నవ్వుతోంది. ఆమె నవ్వు వింటుంటే  అన్వేష్‌లో ఇంతకాలం నిర్జీవమై వున్న నరాలన్నీ యాక్టివేట్‌ అవుతున్నాయి.  కనీసం ఒకరి దగ్గరన్నా మనల్ని మనం మరచిపోయే అదృష్టం అంటే ఇలాగే వుంటుంది.

వాళ్ల మాటలు ప్రవాహంలా సాగుతున్నాయి.

‘‘కావ్య యిప్పుడు ఎక్కడుంది?’’ అడిగాడు అన్వేష్‌.

‘‘ఎందుకు? మిమ్మల్ని లక్స్‌సోప్‌ అన్నందుకు రివెంజ్‌ తీర్చుకోటానికా?’’ అంది దేదీప్య.  ఆమె ముఖంలో యింకా నవ్వు తగ్గకపోవడం గమనించి తను కూడా నవ్వుతూ…..

‘‘రివెంజ్‌ తీర్చుకోటానికి కాదు నా పేరులో ‘నెంబర్‌ వన్‌ ’ వుందని  మ్యాప్‌ గీసి చూపిద్దామని ……’’ అన్నాడు.

‘‘అవునా… కావ్య ఇక్కడే వుంది. దానికి తర్వాత చూపిద్దాం. ముందు నాకు చూపించండి!’’ అంటూ ఇంట్రస్టింగ్‌గా అడిగింది. అన్ని బాధల్ని మరచిపోయి చిన్పపిల్లలా మారిపోయిందాక్షణం దేదీప్య

వెంటనే టేబుల్‌పై ఇద్దరికి కన్పించే విధంగా ఒక పేపరు పెట్టాడు అన్వేష్‌… ఆ పేపర్‌పై…..

“LAKSHYANVESH” అని ఇంగ్లీష్‌లో రాశాడు.

ఆసక్తిగా చూస్తోంది దేదీప్య.

ABCDలలో  నా పేరులో వున్న మొదటి అక్షరం L  ఎన్నో అక్షరమో కౌంట్‌ చేసి చెప్పండి!’’ అంటూ దేదీప్య వైపు చూశాడు.

‘‘ఊ…. .  L అక్షరము 12వ అక్షరము అవుతుంది.’’అంది మనసులోనే కౌంట్‌ చేసుకొని దేదీప్య.

‘‘అలాగే అన్ని అక్షరాలను మనసులోనే కౌంట్‌ చేసుకొని చెప్పండి! వరుసగా రాస్తాను.’’ అన్నాడు.

‘‘సరే! చెబుతాను రాయండి!’’ అంటూ ఉత్సాహంగా ఒకటి తర్వాత ఒకటి చెప్పింది దేదీప్య. ఆమె చెప్తుంటే వరుసగా…..

12+1+11+19+8+25+1+14+22+5+19+8 అని రాసి

మొత్తం కలిపి కౌంట్‌ చేశాడు.  145 వచ్చింది.

145 సంఖ్యను మళ్లీ విడదీసి కౌంట్‌ చేస్తే

1 + 4 + 5 = 10  సంఖ్య వచ్చింది. దీన్ని కూడా విడదీసి కౌంట్‌ చేస్తే

1 + 0 = 1 వచ్చింది.

ఇప్పుడు చెప్పు. నా పేరులో నెంబర్‌ 1 వుంది కదా! ఇది కావ్యకి తెలిస్తే షాకవదా?’’ అన్నాడు.

‘‘కావ్య కాదు. ముందు నేను షాకయ్యాను నిజంగా 1 వచ్చింది “ అంది దేదీప్య.

గర్వంగా అన్పించింది అన్వేష్‌కి

‘‘పత్రిక పేరు గురించి మళ్లీ ఏమైనా ఆలోచిస్తారా? అదే ఫైనలా?’’ అంది దేదీప్య.

‘‘లక్ష్యం నాకు నచ్చింది దేదీప్యా! పత్రిక పేరు ‘లక్ష్యం’ అనే పెడదాం. మా యింట్లోవాళ్లు కూడా ఈ పేరును బాగా ఇష్టపడ్తారు.’’ అన్నాడు అన్వేష్‌.

‘‘దేదీప్యా! సుభాష్‌చంద్ర పత్రిక ఫీల్డ్‌లో నీకు ట్రైనింగ్‌ యిప్పించటం కోసం తన స్పెషల్‌ ఇంట్రస్ట్‌తో నిన్ను యు.కె. పంపారు. కదా?’’ అడిగాడు అన్వేష్‌.

‘‘అవును. పంపారు నేను ట్రైనింగ్‌ అయి వచ్చిన కొద్ది రోజులకే ఆయన చనిపోయారు. అదే ట్రాజడీ!’’ అంది బాధగా.

సుభాష్‌చంద్ర గుర్తు రాగానే ఆమె మూడ్‌ అవుట్‌ అయింది. ఆమెను అలాంటి మూడ్‌లో చూడటం అతనికి యిష్టం లేదు.  ఇంకెప్పుడు సుభాష్‌చంద్రను గుర్తుచేయకూడదనుకున్నాడు.

‘‘రేపు ఢిల్లీ వెళ్లి మన పత్రికకు ‘లక్ష్యం’ అనే పేరు రిజష్టర్‌ చేయించుకుని వస్తాను.’’ అన్నాడు అన్వేష్‌.

‘‘ఒ.కె.’’ అంది దేదీప్య.

‘లక్ష్యం’ పేరు విన్నప్పుడు ఆమె ముఖంలో అంతులేని తృప్తి తొంగి చూడటం అన్వేష్‌ గమనించాడు.

ఆ క్షణంలో ‘లక్ష్యం’ కోసం ఏమైనా చెయ్యాలి. ఏదైనా సాధించాలి.  ఎంతయినా కష్టపడాలి.  అన్నది వాళ్లిద్దరిలో అంతర్లీనంగా ఇంజెక్ట్‌ అయింది.

 

* * * *

 

పత్రిక ఆఫీసు నుండి ఇంటికి రాగానే  కావ్యకి కాల్‌ చేసింది దేదీప్య.

‘హలో’ అంది కావ్య.

‘‘ఎక్కడున్నావు కావ్యా?’’

‘‘ఇంట్లోనే తీరిగ్గా క్రికెట్‌ చూస్తున్నా! ఏంటో చెప్పు?’’

‘‘నేను నీకో సర్‌ఫ్రైజ్‌ న్యూస్‌  చెప్పాలి.  నేను రానా మీ ఇంటికి?’’

‘‘ రా… ఇంట్లో కూడా ఎవరూ లేరు.’’ అని కావ్య అనగానే కాల్‌ కట్‌ చేసి కావ్య ఇంటికి వెళ్లింది దేదీప్య.

టి.వి.లో వస్తున్న ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో లీనమై చూస్తున్న కావ్య దేదీప్య పిలుపు విని మన లోకంలోకి వచ్చింది.

‘‘ఏదో సర్‌ప్రైజ్‌ న్యూస్‌ అన్నావు…’’ అంది కావ్య… తన దృష్టిని టి.వి. మీద నుండి మరల్చకుండానే

‘‘సర్‌ఫ్రైజ్‌ న్యూసే…. నేనైతే మార్నింగ్‌ షాకయ్యాను. నేను చూస్తున్నది నిజమేనా అన్నంతగా ఆశ్చర్యపోయాను.  నేత్రా పత్రికను కొన్నదేవరో తెలుసా?  లక్ష్యాన్వేష్‌ ఫాదర్‌ అమృతరావు.  ఇప్పుడా పత్రిక చెయిర్‌మెన్‌ లక్ష్యాన్వేష్‌!’’ అంది దేదీప్య. కళ్లని, చేతుల్ని ` నేనో అద్భుతాన్ని చూశానన్నట్లుగా తిప్పుతూ…

‘‘అంటే! నువ్వు లక్ష్యాన్వేష్‌ని కలిశావా? మాట్లాడావా?’’అంటూ సోఫాలోంచి ఎగిరిపడ్డంత పని చేసింది కావ్య పేరు పలికేటప్పుడు మాత్రం కాస్త తడబడింది నోరు తిరగక ….

లక్ష్యాన్వేష్‌తో దేదీప్య మాట్లాడిరదంటే ఎయిత్‌ వండరే కావ్యకి.

‘‘మాట్లాడాను ఇప్పుడు అన్వేష్‌ చాలా మారిపోయాడు. చూస్తే నువ్వు నమ్మలేనంతగా మారిపోయాడు.  ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. నీ గురించి కూడా అడిగాడు.  నాకెందుకో అతన్ని చూడగానే మా ఇద్దరి మధ్యన జరిగిన విషయాలేమి గుర్తు రాలేదు.  పైగా అవన్నీ నాకిప్పుడు సిల్లీగా అన్పిస్తున్నాయి. ’’ అంటూ ప్రొద్దున వాళ్లిద్దరి మధ్యన జరిగిన మాటలన్నీ చెప్పింది దేదీప్య.

ఊపిరి బిగబట్టి విన్న కావ్యకి మనసంతా అదోలా అయింది. కానీ అంతలోనే నవ్వుతూ……

‘‘శతృవులిద్దరు మళ్లీ మిత్రులయ్యారన్నమాట.’’ అంది కావ్య. క్రికెట్‌ చూస్తూ కూడా కావ్య మనసు అన్వేష్‌నే గుర్తు చేసుకుంటోంది. ఇన్ని రోజులు కావ్య మనసు అట్టడుగు పొరల్లో అతను దాగి వుండటం కావ్యకి తెలుసు.

‘‘నేనెప్పుడు అ్యన్వేష్‌ని శత్రువులా చూడలేదు. అలాగని మిత్రుడుగా కూడా అనుకోలేదు.  జస్ట్‌ క్లాస్‌మేట్‌. అంతవరకే’’ అంది దేదీప్య.

కావ్య యింకేం మాట్లాకుండా క్రికెట్‌ చూస్తోంది.

‘‘క్రికెట్‌ చూస్తుంటే నాకో విషయం గుర్తొస్తోంది. కావ్యా! అప్పట్లో మన క్లాస్‌ బాయిస్‌ `అంతా క్రికెట్‌ ఆడటానికి గ్రౌండ్‌ కెళ్తూ. ‘మమ్మల్ని ఎంకరేజ్‌ చెయ్యటానికి మీరు రారా?’ అని మనల్ని అడిగినప్పుడు ‘‘ఎందుకు రాము మీరు ఆడే గ్రౌండ్‌లో ఒక టెంట్‌.  టెంట్‌ క్రింద టేబుల్‌. టేబుల్‌ పక్కన తినటానికి స్నాక్స్‌. త్రాగటానికి కూల్‌డ్రింక్స్‌ అరేంజ్‌ చేస్తే అవి తింటూ, త్రాగుచూ చప్పట్లు కొడుతూ మిమ్మల్ని ఎంకరేజ్‌ చేస్తాం.’’ అని నువ్వంటే……‘‘అవన్నీ అరేంజ్‌ చేయ్యటానికి ముందు నువ్వు డబ్బులివ్వు’’ అన్నాడు అన్వేష్‌. ‘’ఈ లక్స్‌సోప్‌ది  ఎప్పుడూ బిజినెస్‌ మైండే…..’’అని నువ్వు కామెంట్‌ చేశావు.’’. అంటూ అప్పటి సంగతుల్ని  గుర్తుచేసుకొని ఉత్సాహంగా చెప్పింది దేదీప్య.

‘‘నీకవన్నీ ఇంకా గుర్తున్నాయో దేదీప్యా?’’ అని ఆశ్చర్యపోతూ నవ్వింది కావ్య.పుట్టిన రోజున అభిరాం విష్‌ చేస్తాడని ఎదురు చూస్తుంటే అన్వేష్‌ వచ్చి…. రెండు రోజా పువ్వుల్ని చేతికిస్తూ ‘హేపీ బర్త్‌డే దేదీప్యా! ఈ డ్రస్‌లో నువ్వు మందార ఆకులో చుట్టిన  గులాబిలా వున్నావు.’’ అని అనటం కూడా దేదీప్యకి గుర్తుంది. పైకి చెబితే బావుండదని అలాంటివి మనసులోనే దాచుకొంది.

ఏది ఏమైనా దేదీప్య ముఖంలో ఇన్ని రోజులు కన్పించని నవ్వుని, హుషారుని చూస్తుంటే….   గతం ఘనమైంది  అనటానికి ఇది నిదర్శన మేమో అన్పించింది కావ్యకి.

 

* * * * *

 

ఢిల్లీ వెళ్లిన అన్వేష్‌ పత్రికకు ‘లక్ష్యం’ అనే పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకొని వచ్చాడు.

అన్వేష్‌ మాట్లాడుతుంటే అతనికి ఎదురుగా కూర్చుంది దేదీప్య.

‘‘మీరు చెప్పినట్లే మన ‘లక్ష్యం’ పేరును ఢిల్లీలో రిజిస్ట్రేషన్‌ చేయించుకొని వచ్చాను.  ఇక మన పత్రికను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలంటే  అతి తక్కువ కాలంలో విశేషమైన పేరు ప్రఖ్యాతలు రావాలంటే ఏం చేయాలో చెప్పండి?’’ అన్నాడు అన్వేష్‌.

ఆలోచనలో పడింది దేదీప్య.

‘‘అంత  ఆలోచన దేనికి దేదీప్యా! మీరు యు.కె.లో సంపాయించిన నైపుణ్యంతో పాటు మీ అనుభవాన్ని కూడా ఈ పత్రికపై పెట్టి అన్ని రకాల ప్లానింగ్స్‌ చేద్దాం.’’ అన్నాడు అన్వేష్‌. ఇన్ని రోజులు పత్రికలో పని చేసిన అనుభవం వున్న దేదీప్య అన్వేష్‌ మాటలకి  వెంటనే  స్పందించింది.

‘‘ఇట్స్‌ ఓ.కె.  మిస్టర్‌ అన్వేష్‌!  పత్రికను నిర్వహించటమంటే ముఖ్యంగా డెడికేషన్‌, పోకస్‌ మైండ్‌ అవసరం, ఈ ప్రాజెక్టులో గోల్‌ రీచ్‌ అవ్వాలంటే యిప్పుడున్న టీమ్‌లో కొన్ని ఛేంజెస్‌ అవసరం ముఖ్యంగా ఎంగ్‌ టాలెంట్‌ని ఇన్‌వైట్‌ చేయాల్సిన అవసరం వుంది.  ఎంగర్స్‌తో కొత్తటీమ్‌ని  ఫాం చేద్దాం!’’ అంది దేదీప్య.

‘‘మరి టీమ్‌కి ఎవరెవరు కావాలో సజెస్ట్‌ చెయ్యండి.’’ అన్నాడు అన్వేష్‌.

దేదీప్య వెంటనే పత్రికారంగంలో అనుభవం వున్న ఐదుగురి పేర్లు చెప్పింది.

ఈ ఐదుగురి పేర్ల మీద ఫీడ్‌ బ్యాక్‌ ను పోల్చుకొని చూసి.

‘‘వెరీగుడ్‌ దేదీప్యా! ఎక్స్‌లెంట్‌ విన్నింగ్‌ టీమ్‌ని చూజ్‌ చేశారు.  వీరి గురించి బయట మంచి పేరు వుంది.  ఓ.కె. వీరిని ఎప్పుడు అప్రోచ్‌ అవుదాము?’’ అని అడిగాడు అన్వేష్‌.

‘‘రేపు మార్నింగ్‌ వెళ్దాము.’’.  అంది దేదీప్య.

‘‘ఓ.కె. వాళ్లతో మనం ఏమేమి డిస్కస్‌ చెయ్యాలో నోట్స్‌ ప్రిపేర్‌ చెయ్యండి! రేపు పట్టుకెళ్దాం. ’’ అన్నాడు.

నోట్స్‌ ప్రిపేర్‌ చెయ్యటంలో మునిగిపోయింది దేదీప్య.

తెల్లవారింది.

సుభాష్‌చంద్ర ద్వారా అయిన పరిచయాలను లక్ష్యం కోసం బాగా ఉపయోగించుకొంది దేదీప్య.

నోట్స్‌ ప్రిపేరు చేసి వెళ్లటానికి రెడీ అయింది.

లక్ష్యాన్వేష్‌ దేదీప్యకి కాల్‌ చేశాడు.  కాల్‌ లిఫ్ట్‌ చేసి….

‘‘అయాం రెడీ అన్వేష్‌! వేర్‌ ఆర్‌యూ’’ అంది దేదీప్య.

‘‘నేను బయలు దేరుతున్నాను దేదీప్యా! ఫైవ్‌ మినిట్స్‌లో మీ ఇంటి దగ్గర వుంటాను.’’ అని కాల్‌ చేసి, తనే స్వయంగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లి దేదీప్య ఇంటి ముందు ఆగగానే దేదీప్య వచ్చి కారెక్కింది.

ఇద్దరు కారులో వెళ్లిపోయారు.

వాళ్లు చూజ్‌ చేసుకున్న ఐదుగురు టీమ్‌ మెంబర్స్‌ని పర్సనల్‌గా కలుసుకొని ‘లక్ష్యం’ పత్రికగోల్స్‌ని, ప్యూచర్‌ ప్లాన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్‌ చేశారు.

మీరు మా పత్రికలో చేరాలని వాళ్లను కోరారు.

అన్వేష్‌ లక్ష్యాలను నచ్చిన ఆ విన్నింగ్‌ టీమ్‌ అన్వేష్‌ ప్రపోజల్స్‌ని ఓ.కె. చెయ్యటంతో దేదీప్య.  అన్వేష్‌ చాలా హేపీగా ఫీలయ్యారు.  ఆ సంతోషంలో ఇద్దరు ఒకరికి ఒకరు కంగ్రాట్స్‌ చెప్పుకున్నారు.

‘‘సర్‌! మా ప్రపోజల్స్‌ని యాక్సెప్ట్‌  చేసినందుకు థ్యాంక్స్‌.’’ అంటూ రేపు ఆఫీసు కొచ్చి జాయిన్‌ కమ్మని చెప్పారు.

 

* * * * *

 

తర్వాత రోజు…

ఐదుగురు టీమ్‌ మెంబర్స్‌ ఆఫీసుకి రావటంతో అన్వేష్‌, దేదీప్య వాళ్లను రిసీవ్‌ చేసుకొని, వాళ్ల వాళ్ల ఛాంబర్లలో బాధ్యతలన్ని అప్పగించారు.

మద్యాహ్నం…

ఐదుగురు టీమ్‌ లీడర్స్‌ దేదీప్యతో కలసి కాన్‌ఫరెన్స్‌ని అరేంజ్‌ చేశాడు అన్వేష్‌.

పత్రికను బయటకు తీసుకురావటానికి ప్లాన్‌ తయారు చేసి చర్చలు జరిపారు.

ఆ ఐదుగురిలో నలుగురు డైరెక్టర్స్‌, ఒకరు పత్రిక ఎడిటర్‌, అన్వేష్‌ పత్రికకు చెయిర్‌మెన్‌, దేదీప్య చీప్‌ అడ్వయిజర్‌గా వుండాలని నిర్ణయం తీసుకున్నారు.

వందకోట్ల బారీ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్‌ మొత్తం 23 ఎడిషన్లు, మెట్రో సిటీస్‌ బెంగుళూరు, ఢిల్లీ, చెన్నైలలో కూడా మోడరన్‌ టెక్నాలజీతో పత్రికను తీసుకురావాలని డిసైడయ్యారు.

దీనితో పాటు ఇంటర్‌నెట్‌ ఎడిషన్‌ని కూడా తీసుకురావాలనుకున్నారు. వెంటనే ఆయా డిస్టిక్ట్‌ సెంట్రల్‌ ఆఫీసులో, సెంట్రల్‌ డెస్క్‌ రీజనల్‌ డస్క్‌, అడ్వర్‌టైజ్‌మెంట్‌ సర్కులేషన్‌, అడ్మినిస్ట్రేషన్‌ ప్రొడక్షన్‌ శాఖలను రీకన్‌స్ట్రక్ట్‌ చెయ్యటానికి ప్లానింగ్‌ తయారు చేసుకున్నారు.

తెల్లవారి…. అన్ని జిల్లాల్లోను, ఆఫీసుకొచ్చి టీమ్‌ లీడర్స్‌ వాళ్ల పనుల్లో నిమగ్నమయ్యారు.

దేదీప్య, అన్వేష్‌ ఇతర దేశాల్లో వున్నటువంటి పత్రికల టెక్నాలజీని స్టడీ చేసి చాలా అడ్వాన్స్‌డ్‌ మిషన్స్‌, టెక్నాలజీకి ఆర్డర్స్‌ ఇచ్చారు.

ఎడిటర్స్‌తో సహా మిగతా టీమ్‌ల లీడర్స్‌ తమ సెక్షన్లలో టాలెంట్‌డ్‌ పర్సన్స్‌నీ జాయిన్‌ చేసుకున్నారు.

జిల్లా ఎడిసన్‌లలోను, మెరుగైన టీమ్‌లను ఎంపిక చేసుకొని, నియామకాలు పూర్తి చేసి పత్రిక ప్రచురణకు అంతా స్ధిదం చేసుకున్నారు.

ఇదంతా జరగటానికి రెండు నెలలు పట్టింది.

ఈ రెండు నెలలలో అన్వేష్‌, దేదీప్య తమను తాము మరచిపోయి చాలా కష్టపడి పని చేశారు.

అనుకున్నట్లుగానే ‘లక్ష్యం’ పత్రిక ప్రారంభించటానికి మొత్తం సిద్దమైంది.  అన్ని జిల్లా కేంద్రాలలోను, మెట్రో సిటీస్‌ లోను పత్రిక డమ్మీలు కూడా సిద్ధం చేశారు.  ప్రాక్టీస్‌ కూడా  అయిపోయింది.

అన్వేష్‌, దేదీప్య, ఎడిటర్స్‌, సహ డైరెక్టర్స్‌లో కాన్ఫ్‌డెన్స్‌ పెరిగింది.  డమ్మీలోనే పత్రిక వర్త్‌ బయటపడింది. అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్‌ రావటంతో అందరు సంతోషంగా ఫీలయ్యారు.

అన్వేష్‌, దేదీప్య, డైరెక్టర్స్‌, ఎడిటర్‌ అతిముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. పత్రిక ప్రారంబోత్సవానికి ఎవరి చేత ప్రారంభించాలనే చర్చ అందరిలో మొదలైంది.

‘లక్ష్యం’ పత్రికకి అబ్దుల్‌కలాం అయితేనే తగిన వ్యక్తి అని అభిప్రాయం అందరిలో వ్యక్తమయింది.

అబ్దుల్‌కలం అపాయింట్‌మెంట్‌ కోసం  దేదీప్య, అన్వేష్‌ వెళ్లారు.

 

* * * * * *

 

‘లక్ష్యం’ ఆవిష్కరణోత్సవానికి అబ్దుల్‌కలాం అపాయింట్‌మెంట్‌కి అనుగుణంగా డేట్‌ ఫిక్స్‌ అయింది.

అన్ని జిల్లా కేంద్రాలలో మెట్రోసిటీ సిబ్బందికి అన్వేష్‌, దేదీప్య, ఎడిటర్‌, డైరెక్టర్లు డేట్‌ని అనౌన్స్‌ చేశారు.

అన్ని ప్రచురణ కేంద్రాలలో ఈ ఫంక్షన్ని గ్రాండ్‌గా అరేంజ్‌ చేశారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అందరు ఎదురు చూస్తున్న……

లాంచింగ్‌ డేట్‌ రానే వచ్చింది.

విశాక సముద్ర తీరాన ఆవిష్కరణ సభకు అతిథులంతా వచ్చారు.

మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, కవులు, కళాకారులు, ప్రజలు విశేషంగా ఆవిష్కరణ సభకు హాజరయ్యారు.

అందరి హర్షద్వానాల మధ్య అన్వేష్‌ తన ‘లక్ష్యం’ ప్రతులను అబ్దుల్‌ కలాంగారి చేతికి అందించారు.

చిరునవ్వుతో అబ్దుల్‌కలాం వాటికి స్వీకరించి అన్వేష్‌ ‘లక్ష్యాన్ని’ ప్రజల చేతికి అందించారు.

సభలో వున్న అధికారులు, వివిధ వర్గాల ప్రజలు అన్వేష్‌ ‘లక్ష్యాన్ని’ గుండెలకి హత్తుకున్నారు.

తొలి సంచికలో వున్న లక్ష్యాలు, అంశాలు, అన్ని వర్గాలను ఆ కట్టుకునే రీతిలో వున్న రచనలు, వివిధ రకాల ప్రజల జీవితాలను ప్రతిబింబించే వార్తలు, సభికులను మంత్ర ముగ్ధులను చేశాయి.

ఆ ఆవిష్కరణ సభలో ప్రతివ్యక్తి అన్వేష్‌ ‘లక్ష్యాన్ని’ అభినందించిన తీరు, ప్రశంసలతో ముంచెత్తిన విధానం, ‘లక్ష్యం’ పత్రికకు వున్న భవిష్యత్తును చెబుతుండటంతో దేదీప్య ఎంతో గర్వపడింది. తను అనుకున్నది సాధించటంతో కొంత సక్సెస్‌ అయ్యానని తృప్తిగా ఫీలయింది.

ఆ రోజు పార్టీ ముగిశాక అన్వేష్‌ దేదీప్య కార్లో మాట్లాడుకుంటూ బయలుదేరారు.

రోడ్డు పక్కన వున్న ఇద్దరు ముసలి వాళ్లలో ఒకరు స్పృహ తప్పిపడిపోతే ఇంకొకళ్లు ఏడుస్తూ కూర్చుని వుండటం గమనించిన దేదీప్య దిగ్భ్రాంతి చెంది వెంటనే కారు ఆపమని అన్వేష్‌తో చెప్పింది.

అన్వేష్‌ కారు ఆపుతూ ఎందుకన్నట్లుగా చూశాడు.

‘‘వాళ్లిద్దరు మా అత్తా, మామగార్లు అన్వేష్‌!’’ అని దేదీప్య అనగానే మెరుపులా కిందకి దిగి వాళ్లను సమీపించాడు అన్వేష్‌. అతనితోపాటు దేదీప్య కూడా వెళ్లింది.

‘‘ఇక్కడున్నారేంటి అత్తయ్యా? ఏం  జరిగింది.?’’ అని కంగారుగా అడుగుతున్న దేదీప్యను చూసి ఆమె ఏడుపు స్థాయి యింకా పెరిగింది. ఆ ఉప్పెన ఆగేలా లేదు.

‘‘ఏం జరిగింది అత్తయ్యా? మామయ్యగారికి ఏమైంది?’’ అంది బాధగా బలరామయ్య వైపు చూస్తు అన్వేష్‌ అలాగే చూస్తూ నిలబడ్డాడు.

మాట్లాడకలేపోతోంది బ్రమరాంబిక ఆమె గత కొన్ని రోజులుగా తిండి సరిగ్గా తిన్నట్లు లేదు.  నోటమాట రావటం లేదు. ఆ ఏడుపు కూడా కష్టంగా ఏడుస్తోంది.

‘‘సరే! ముందు ఇంటి కెళ్దాం రండి!’’ అంటూ మామగారిని అన్వేష్‌ సాయంతో కార్లో ఎక్కించింది దేదీప్య.  వాళ్లతోపాటు బ్రమరాంబిక కూడా కారెక్కింది.

వాళ్లను దేదీప్య ఇంట్లో వదిలి అన్వేష్‌ వెళ్లిపోయాడు.

కోడలి వైభోగం, సౌకర్యవంతమైన జీవితం, ఆ ఇల్లు చూస్తుంటే బ్రమరాంబికకి మతిపోతోంది.

దేదీప్య వెంటనే డాక్టర్‌ గారికి ఫోన్‌ చెయ్యగానే, డాక్టర్‌వచ్చి  బలరామయ్యకు తగిన ట్రీట్‌మెంట్‌ ఇచ్చివెళ్లారు.

ఎ.సి. రూంలో పడుకొని హాయిగా నిద్రపోతున్న భర్తను చూసి నిశ్చింతంగా గాలి పీల్చుకొంది బ్రమరాంబిక.  ఆమె కడుపునిండా తిండి తిని ఎన్నిరోజులైందో….అదే విషయం కోడలని కూడా చూడకుండా కళ్లనీళ్లు పెట్టుకుంటూ దేదీప్యతో చెప్పుకొంది.

దేదీప్య మనసు కదలిపోయింది.

దేదీప్య ఒకప్పుడు నిర్దయగా, దారుణంగా చూశానన్న విషయం గుర్తొచ్చి  బ్రమరాంబిక గుండెనెవరో పిండినట్లైంది. ‘క్షమించు తల్లీ! అని అడిగే ధైర్యం లేని దానిలా తప్పు చేసినట్లు తలవంచుకొంది.

‘‘జీవితంలో జరిగిపోయిన మంచి విషయాలేమైనా వుంటే గుర్తు చేసుకుంటూ ప్రశాంతంగా వుండండి అత్తయ్యా! తలవంచుకొని బాధపడే వయసు కాదు మీది.  మీ రూంలో టి.వి. పెట్టించాను. అందులో ‘సంస్కృతి’ ఛానల్‌ వస్తుంది అందులో మీరు చూడదగినవి వస్తుంటాయి.  చూడండి.’’ అంది దేదీప్య.

అనుభవం అందుకున్న శిఖరంలా, మహోన్నతంగా అన్పిస్తున్న దేదీప్యనో క్షణం అలాగే చూసి….

‘‘డైరీలో రాతల్ని చూసి…. పక్కన పడుకున్నట్లు అనుమానించి….కోడల్ని నిర్ధాక్షిణ్యంగా వదిలేశామని మా ముఖం మీద ఉమ్మేసినవాళ్లున్నారు దేదీప్యా! దానికి వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లు కూడా వున్నారు.

కానీ లోకందేం పోయింది. అన్ని కోణాల్లో మాట్లాడుతుంది.  మనం గుడ్డివాళ్లం కావటమే మన తప్పు.’’అంది బ్రమరాంబిక.

ఇప్పుడా విషయాలను వినాలని లేకపోయినా మౌనగంభీంగా కూర్చుంది దేదీప్య.

‘‘ఆ తప్పే మమ్మల్నిలా నడివీదిపాలు చేసింది తల్లీ! దీపక్‌ ఇప్పుడు మన లోకంలో లేడు. నేహ అనే అమ్మాయితో సంబంధం పెట్టుకొని… అప్పుడు మీరున్న వీధిలోనే ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నాడు. వాడికేమైనా పెద్ద, చిన్నా, భయం వుందా? అడిగేవాళ్లున్నారా? మాకే డబ్బులు యివ్వటం కూడా మానేశాడు.  మీ తోడికోడలు తన రెక్కల కష్టంతో తన కుటుంబాన్ని  నెట్టుకొస్తోంది. నీ మరిది మెడికల్‌ షాపులో పనిచేస్తున్నాడు.  ఎటొచ్చీ మాకే కష్టాలు వచ్చాయి. ఈ వయసులో  ఏ పనీ చెయ్యలేం కదమ్మా.’’ అంది బ్రమరాంబిక.

అతి సహజంగా మాట్లాడుతున్న ఆమెనే చూస్తూ గాఢంగా శ్వాస పీల్చి ‘ఎవరా నేహ?’ అని మనసులో అనుకుంటూ….

‘‘మీరే పనీ చెయ్యనవసరం లేదు అత్తయ్యా! ఇక నుండి నాదగ్గరే వుండండి!’’ అంది దేదీప్య.

‘‘దీపక్‌ లేకుండా మేము నీ దగ్గర….’’ అంది బ్రమరాంబిక.

‘‘నేను మీ కోడల్నే కదా…. పరాయిదాన్ని కాదుగా.  ఈ పరిస్థితిలో మీరు నా దగ్గర వుండటమే శ్రేయస్కరం.’’ అంది దేదీప్య.

‘‘మేం నీకు ఏం చేశామని మా మీద ఈ దయ?’’ పైగా నిన్ను కష్టపెట్టాం కూడా…. అంది బ్రమరాంబిక తన తప్పును తాను తెలుసుకున్న దానిలా.

‘‘మిమ్మల్ని నేను అర్థం చేసకోగలను అత్తయ్యా! మీరు నాకు న్యాయం చెయ్యలేదని, నావైపు మాట్లాడలేదని ఒకప్పుడు నేను అనుకున్న మాట వాస్తవమే. కానీ యిప్పుడలా అనుకోవటం లేదు. నేను ఇలా ఒంటరిగా వుండే కన్నా, మీ అండదండలు కూడా నాకు అవసరమే కదా!  అదే మీ బిడ్డను అయితే నన్నిలా ఒంటరిగా వదిలేస్తారా?’’

‘‘అంత మాట అనకు దేదీప్యా! నువ్వెక్కడ?మేమెక్కడ? చిటికె వేస్తే చాలు నీ ముందు వాలే వాళ్లు ఎందరో వున్నారు.  ప్రస్తుతం నీ స్థితి మాకు తెలియంది కాదు.’’ అంది బ్రమరాంబిక.

‘‘వాళ్లంతా మనవాళ్లు అవుతారా అత్తయ్యా?’’

‘‘నిజమే తల్లీ! నా పిచ్చి కాకుంటే నీ కన్నా ముందు రోడ్డు మీద ఎందరో మమ్మల్ని చూశారు.  వాళ్లంతా మమ్మల్ని కారులో ఎక్కించుకొని వాళ్ల ఇళ్లకు తీసికెళ్లి ఎ.సి. రూముల్లో పడుకోబెట్టారా? డాక్టర్లను పిలిపించి ట్రీట్‌మెంట్‌ యిప్పించారా?’’ అంటూ కళ్లు ఒత్తుకొంది.

అత్తగారిని ఓదారుస్తు, మామగారిని పరామర్శిస్తూ అక్కడే కూర్చుంది దేదీప్య.

 

తెల్లవారింది.

ప్రతి జిల్లా నుండి మార్కెట్‌లోకి ‘లక్ష్యం పత్రిక పాఠకుడి చేతుల్లోకి వెళ్లింది.

దేదీప్య, అన్వేష్‌, ఏ ఆశయాలతోనైతే ‘లక్ష్యం’ని ప్రారంభించారో అదే ఆశయంతో ‘లక్ష్యం’ ప్రతి పాఠకుడి ముంగిలిని తట్టింది.

పత్రికలో వచ్చిన కథనాలు, సామాన్య జనహితాన్ని కోరిన లక్ష్యం విధానం, రంగులతో ఆవిష్కృతమైన వైనం, ప్రజల్లో విశేష స్పందన తెచ్చింది.

ఏ మారుమూల పల్లెలలో చూసినా, అభివృద్ది చెందిన పట్టణాలలో చూసినా ‘లక్ష్యం’ గురించే చర్చ. ప్రతివాడలో, ప్రతి వీధిలో ‘లక్ష్యం’ కనబడిరది.

మహిళలు, స్టూడెంట్స్‌, మేధావులు, వర్కర్స్‌, కవులు, కళాకారులు, లక్ష్యాన్ని ఆదరించారు.

వివిధ జిల్లా కేంద్రాల నుండి ‘లక్ష్యం’ సర్కులేషన్‌ ఇంతకింత రెట్టింపయి ఆంధ్రప్రదేశ్‌ అంతా లార్జెస్ట్‌ సర్కులేటేడ్‌ ‘డైలీ’ గా గుర్తింపు తెచ్చుకొంది.

కుప్పలు, తెప్పలుగా వస్తున్న వ్యాసాల ప్రకటనలు, జనాదరణ కలిగిన పత్రికకు ప్రాణం పోస్తున్న ప్రభుత్వ ప్రకటనలతో ‘లక్ష్యం’ రెవెన్యు వేలకోట్లకు పడగెత్తింది.

దిన, దిన ప్రవర్థమానమవుతున్న ‘లక్ష్యం’ పత్రికతో అన్వేష్‌ ఆలోచనలు ముందుకు సాగుతున్నాయి.

 

* * * * *

 

పశ్చిమ దిశలో సూర్యుడు ఎరుపు రంగుకి మారుతుంటే భర్త పక్కన బాల్కనీలో కూర్చుని ఆసక్తిగా తిలకిస్తున్న లాలిత్యకి దేదీప్య ఇంటిముందున్న మొక్కలు పూలు పూసి దేదీప్యను గుర్తు చేస్తుంటే మనసు భగ్గుమంది.

దేదీప్య ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాక కూడా ఆమె గుర్తురావటానికి కారణం ఆ మొక్కలే. పూలంటే మక్కువగల అభిరాం వాటిని చూస్తూ రిలాక్స్‌గా ఫీలవ్వడం భరించలేకుండా వుంది. ఆవిడగారూ పూలు పూయించి వెళ్లటం, ఈయనగారిలా ఫీలవుతూ వాటినే చూడటం…. ఈ రిలేషన్‌కి  ఏరంగు పూయాలో అర్థం కాకుండా వుంది.

అరుణాదేవి ` లాలిత్యను విజయవాడ తీసుకెళ్లి సైకియాట్రిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ యిప్పించాక నార్మల్‌ అయింది. అభిరాం అభిరుచులకి తగిన విధంగా మారింది.  అభిరాంకి ఇప్పుడెలాంటి అసంతృప్తి లేదు.  అతనికి కావలసింది దొరికాక వేరే ఆలోచనలు కూడా అతనికి రావటం లేదు.

ఎంత కౌన్సిలింగ్‌ ఇప్పించినా….లాలిత్య మారేంతవరకే మారింది కాని, ఆడవాళ్లలో అతి సహజంగా వుండే అసూయ, అనుమానం ఆమెలో అలాగే వుండిపోయాయి.  మొన్నటివరకు అభిరాం బైక్‌ మీద తిరిగి దేదీప్య యిప్పుడు అన్వేష్‌ కారులో తిరుగుతూ కన్పిస్తుంటే….

‘మైన్డ్‌ బ్లోయింగ్‌ తెలుసా?’’ అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా తన కళ్లని, చేతుల్ని విచిత్రంగా తిప్పింది లాలిత్య.

‘‘ఏం చూసో! మతిపోవడం….’’ అన్నాడు అతని చూపులు, ఒక పువ్వుపై రెండు తుమ్మెదలు కావాలని ప్రయత్నిస్తుంటే వాటికన్నా ముందు మూడో తుమ్మెద ఆ పువ్వులోని మకరందాన్ని తాగి మత్తుగా ఎగిరి మరో పువ్వుపై వాలుతుంటే అటే చూస్తున్నాడు అభిరాం.  తనింత ఎక్స్‌ప్రెషన్‌ యిచ్చినా తన వైపు చూడని భర్త చూపుల్ని వెంటనే ఆమె చూపులు ఫాలో అయ్యాయి.  చిదంబరంలో రహస్యం చూద్దామని అంతదూరం వెళ్తే అక్కడో గుడ్డ కన్పించినట్లు… అక్కడే కన్పించలేదు  లాలిత్యకి

‘‘నాకు మతి పోవటం దేనికో మీకు చెప్పాలిగా, దేదీప్యకి మీ బైక్‌ మీద నుండి వాళ్ల బాస్‌ కార్లోకి ప్రమోషన్‌ వచ్చినందుకు….’’ అంది.

ఇంకా…. నీలో వుండే ఈ పురుగు చావలేదా? అన్నట్లుగా చూశాడు అభి.

‘‘ మీ అమ్మగారు! బామ్మా! ఎప్పుడు చూసినా…. దేదీప్యను చూసి నేర్చుకో అనే వాళ్లు. ఏముందండి ఆ దేదీప్య దగ్గర?’’ అడిగింది. లాలిత్య అదేంటో తెలిసుకోవాలని వుంది లాలిత్యకి.

మాట్లాడలేదు అభి. అటు, ఇటు కాని సమాధానం వచ్చేలా తన భుజాలను కుదిపి అంతటితో తన సమాధానం అయిపోయినట్లు చూశాడు.

భర్త మౌనాన్ని సహించలేకపోయింది. అంత కష్టపడి పెద్ద కొండ ఎక్కితే అక్కడ దేవుడు లేకుండా రాయి కన్పించినట్లు తన శ్రమకు ఫలితం లేనట్లు బాధపడిరది.  అయినా అంత సమాధానం లేని ప్రశ్నా తనది?

‘‘చూడండీ! దేదీప్యలాగా నేను ప్రేమించినవాడి మీద డైరీలో కవిత్వం రాసుకొని వాడితో కలసి ఫోటోలు దిగి, వాడు కాదంటే వేరెవర్నో పెళ్లి చేసుకోలేదుగా… అవన్నీ తెలిసి మొగుడు వదిలేస్తే ఉద్యోగం పేరుతో రోజూ వాళ్ల బాస్‌ కార్లో తిరగడం లేదుగా… ఇలాంటి పనుల దేదీప్యకి చేతనయినట్లు నాకు చేతకావుగా… ఇదేనా మీవాళ్ల బాధ?’’ అంది లాలిత్య…. దేదీప్య ప్రేమించింది అభిని అన్న విషయం తప్ప మిగతా మొత్తం తెలుసు లాలిత్యకి.

లాలిత్య ఏం మాట్లాడుతుందో తెలిసినా… అవన్నీ  తెలిశాయో అర్థం కాలేదు అభికి.  అదే విషయం ఆమెను ప్రశ్నించే లోపలే……

‘‘ఇవన్నీ తెలియాలంటే అంత ఈజీ కాదు లెండి కష్టపడి సేకరిస్తే తెలుస్తాయి ఒకరోజు నేహ వాళ్ల యింట్లో పనిచేసే అమ్మాయికి నా పాత నైటీ ఇచ్చి మంచి చేసుకొని అడిగి తెలుసుకున్నాను.’’ అంది ఎలా వున్నాయి నా తెలివితేటలు అన్నట్లుగా చూస్తూ….

‘‘నేహ ఎవరు?’’ అడిగాడు అభిరాం.

‘‘నేహ…. దీపక్‌ కీప్‌!’’ టక్కున చెప్పింది లాలిత్య.

‘‘దీపక్‌కి కీప్‌ కూడా వుందా?’’ అంటూ షాకయ్యాడు అభిరాం.

‘‘ఉంది. మన వీధిలోనే ఆ చివర యింట్లో వుంటుంది. అయినా మీరెందుకంత షాకయ్యారు?’’ అంది అనుమానంగా చూస్తూ.

‘‘నాకు షాకెందుకు? ఏదో నువ్వు చెబుతున్నావు కాబట్టి వింటున్నాను. వినకపోతే మళ్లీ వినలేదంటావుగా…..’’ అంటూ తనలోని ఫీలింగ్స్‌ని కప్పిపుచ్చుకున్నాడు.

‘‘నేహ కూడా చదువుకున్న అమ్మాయేనట. ఉద్యోగం రాకపోవటంతో డిప్రెషన్‌లో వుంటే! దీపక్‌ పరిచయమై షెల్టరిచ్చాడట. దీపక్‌ ఎంత మంచివాడో. అతనిదెంత మంచి మనసో కదండీ?  ఆ దేదీప్య….’’ అంటూ ఇంకా ఏదో అనబోతుంటే వినలేని వాడిలా అక్కడనుండి క్రిందకి దిగాడు అతనికెందుకో బాధగా వుంది. అది పైకి చెప్పుకోలేని బాధ.

భర్త ఎక్కడికెళ్తున్నాడో అర్థం కాలేదు లాలిత్యకి.  అతను బయటకెళ్లాడు అనటానికి సాక్షిగా

అభిరాం నేరుగా వెళ్లి నేహ వుండే యింటి కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. డోర్‌ తీసి…..

‘‘ఎవరు కావాలండీ? ఆయన ఇంట్లో లేరు.’’ అని నేహ అంటుంటే… ఏ మాత్రం విన్పించుకోకుండా లోపలకెళ్లి సోఫాలో కూర్చున్నాడు అభిరాం.

అతను వెళ్లింది దీపక్‌తో మాట్లాడాలని, కానీ అతను లేకపోవటంతో నేహవైపు చూస్తూ…

‘కూర్చో… నీతో మాట్లాడాలి!’’ అన్నాడు. అతను ‘నువ్వు’ అని సంబోధించటంతో రోషంగా చూసింది నేహ.

‘‘అసలు మీరెవరో చెప్పి మాట్లాడండి! లేదంటే బయటకు నడవండి!’’ అంది కోపంగా.

అభిరాం ఆమె వైపు తీక్షణంగా చూశాడు.

‘‘దీపక్‌ ఒకప్పుడు మా యింటి పక్కన వుండేవాడు.నేను యశోదర కొడుకును.’’ అన్నాడు.

‘‘ ఓ మీరా?’’అంది మిా గురించి నాకు ముందే తెలుసు అన్నట్లుగా వుందా స్వరం.

‘‘ఆ…. నేనే…. చూస్తుంటే చదువుకున్న దానిలా కన్పిస్తున్నావు. జీవితాన్ని ఆ మాత్రం  ప్లాన్‌  చేసుకోలేకపోయావా? అయినా ఈ దీపక్కే దొరికాడా నీకు?’’ అన్నాడు ఆమెనే చూస్తూ. ఆ చూపులోని చులకన భావం, ఆమెను నిలువెల్లా చీరేసినట్ల్లు అన్పించింది.

‘‘కార్పొరేట్‌ చదువులు చదివినవాళ్లే సరైన ప్లాన్‌ చేసుకోలేక అవకతవకల బ్రతుకును గుట్టుగా లాక్కొస్తున్నారు.  ఎక్కడో జైల్లో వుండి బోస్టర్‌ స్కూల్లో చదివినదాన్ని అనుకున్న ప్లానింగ్‌ ఎలా సాధించుకోగలను?’’ అంది.

నేహ మాటల ఎక్కడో తాకాయి. ఆమె జైల్లో వుండి చదివాను అనగానే కాస్త జంకినా…. మళ్లీ అదేం పట్టనట్లు…..

‘‘నువ్వు దీపక్‌ని వదిలెయ్‌!’’ అన్నాడు.

‘‘మీరు వదిలెయ్యమనగానే వదిలెయ్యటానికి దీపక్‌ ఏమైనా నాచేతిలో బొమ్మనా? చటుక్కున వదిలేసి వెళ్లిపోవటానికి? అయినా అది చెప్పటానికి మీరెవరు?’’ అంది.

‘‘మంచి చెప్పటానికి ఎవరైతేనేం? నీ మంచికే చెబుతున్నా విను’’ అన్నాడు అభిరాం.

‘‘ఏంటండీ! మీరు చెప్పే మంచి? నా సమక్షంలో అతను బాగున్నాడు.  నేను కూడా అతని నీడలో హాయిగా వున్నాను.  అంతకన్నా మంచేంటి?’’ అంది నేహ.

ఆ మాటలకు అసహ్యంగా చూశాడు.

‘‘పెళ్లి చేసుకోకుండా కలసి వుండటానికి సిగ్గుగా లేదూ?’’ అన్నాడు కోపంగా అరుస్తూ.

‘‘పెళ్లి చేసుకొని భర్త వుండగా వేరే వాళ్లతో తిరగట్లేదుగా ఆ దేదీప్యలాగ….’ అంది నేహ కూడా అదే స్థాయిలో అరుస్తూ.

‘‘నోర్ముయ్‌!’’ అన్నాడు.

అసలే మాటంటే పడని నేహ అతనలా అనగానే ఉక్రోషంతో ఉడికిపోయింది.

‘‘దీపక్‌ తరపు వాళ్లనెవర్ని నేనింతవరకు చూడలేదు.  వాళ్లెవ్వరూ మీలాగ నన్ను బెదిరించలేదు.  అయితే మీరు దేదీప్య తరుపు నుండి వచ్చారన్నమాట’’ అంటూ సూటిగా అతన్నే చూసింది.

ఆ చూపుకి….. అభిరాం సమాధానం చెప్పలేక ఒక్క క్షణం నిస్సహాయంగా చూశాడు.  అతని నిస్సహాయతను వెంటనే గమనించింది దేదీప్య.

నిర్లక్ష్యంగా నవ్వింది.  ఆమె దృష్టిలో దేదీప్యను పూచికపుల్లను చేసి వదిలాడు దీపక్‌. ఆమె తరుపున రావటానికి ఎవరూ లేరని కూడా చెప్పాడు. ఆ ధైర్యంతోనే దీపక్‌తో కలసి వుంటోంది.

నేహ నవ్విన నవ్వు అతనిలోని ఆత్మబలాన్ని హరించి వేసింది  ఇప్పుడు తను ఏ మాత్రం ఆవేశపడినా పరిస్థితి క్లిష్టంగా మారే అవకాశం వుందని గ్రహించాడు.

‘‘నన్ను నోర్ముయ్‌ అంటూ… సిగ్గు లేదా అంటూ వ్యక్తిత్వం లేనివాళ్లను బెదిరించినట్లు బెదిరిస్తున్నారు.  నాకు లేదా నోరు? మిమ్మల్ని బెదిరించటానికి? దేదీప్య తరపున మాట్లాడటానికి  నా దగ్గరకి మీరొచ్చారని నేను కూడా మీ భార్యతో చెప్పగలను.’’. అంది నేహ పెద్దగా అరవకపోయినా స్పష్టంగా, నెమ్మదిగా అంది.

అసలే భయస్తుడైన అభిరాంకి….ఆమె దోరణికి చెమట్లుపోశాయి.  తను వెళ్లి మాట్లాడగానే ఆమె జంకి, తనకి భయపడి పరిగెత్తుతుందనుకున్నాడు. ఇలా రివర్స్‌ అవుతుందని మాత్రం వూహించలేదు. ఇక చేసేది లేక……

‘‘సరే నేను చెప్పేది ఏదో చెప్పాను. తర్వాత నీ కర్మ.’’ అంటూ వెళఙ్లపోయాడు.

 

* * * * *

 

జీవితమంటే చందమామ కథ కాదని, ఏదీ ఆకాశం నుండి రాలి పడదని నమ్మి తన పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలను వినియోగించి తనేమిటో నిరూపించుకొంది దేదీప్య.

అడుగడుగున ఎదురయ్యే అనుభావాలను తట్టుకుంటూ, అనేక సమస్యలకు ఒంటిరిగా పరిష్కారం వెతుక్కుంటూ, చేదునిజాలను జీర్ణించుకుంటూ ముందుకు సాగే వ్యక్తిత్వం వున్న దేదీప్య ` ప్రతి సమస్యను తన మానసిక ఎదుగుదలకి ఓ అవకాశంగా భావించిందేకాని ఏనాడు ఏడుస్తూ కూర్చోలేదు.

కాని ఆరు నెలలుగు ఇంటా`బయట, ఆఫీసులో వచ్చిన మార్పులు దేదీప్య మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి.  ఎంత కష్టపడ్డా, ఎంత సాధించినా, శారీరకంగా, మానసికంగా సంతృప్తికరమైన రిలీఫ్‌ లేక విరక్తిగా, బాధగా, చిరాగ్గా అన్పిస్తూ ఎవరితో మాట్లాడాలన్నా విసుగ్గా ఫీలవుతోంది.

చిన్న విషయాలకి కూడా కోపం తెచ్చుకుంటోంది.  కోపాన్ని కంట్రోల్‌ చేసుకోకపోతే, ఆ కోపంలో తనేదైనా చెయ్యరానిది చేస్తే పత్రికాఫీసులో తనకున్న మంచిపేరు డామేజి అవుతుందని చాలా జాగ్రత్తగా వుంటోంది.

కానీ తనకి వచ్చిన కష్టాలు, వ్యధను కల్గించిన సమస్యలు, అనుభవించిన మానసిక క్షోభ గుర్తొస్తూ ఈ రోజెందుకో గట్టిగా ఏడ్వాలనిపిస్తోంది దేదీప్యకి.  ఏడ్చే అదృష్టం కూడా అందరికి రాదన్నట్లు ఏడ్వటానికి కూడా ఆమెకి తగినంత ప్రైరసీ దొరకటం లేదు.

‘‘హాయ్‌! దేదీప్యా!’’ అంటూ కావ్య వచ్చి దేదీప్యకి ఎదురుగా కూర్చుంది.  కావ్య అప్పుడుప్పుడు దేదీప్య వాళ్ల ఆఫీసుకి వస్తుంది.

‘‘హాయ్‌! ’’ అంటూ దేదీప్య తన ముఖంలోని బాధను బయటపడనీయకుండా జాగ్రత్త పడ్తూ ఏదో అవసరం వున్నట్లు క్రిందికి వంగి వెతకసాగింది.

‘‘ఏంటి దేదీప్యా! వెతుకుతున్నావ్‌? పోతే దొరకటం కష్టం. వెతకటం వృధా ప్రయాస.  ముందే జాగ్రత్త వుండొద్దా?’’ అంది కావ్య.

దేదీప్య ఏం మాట్లాడలేదు.  ఏదో పని వున్నట్లు అక్కడున్న ఫైల్స్‌ని అటు ఇటు మారుస్తోంది.

దేదీప్య ముందు కూర్చుని వుందనే కాని కావ్య మనసంతా అన్వేష్‌ చాంబర్‌ వైపే వుంది. దేదీప్య దగ్గరకి వచ్చిన ప్రతిసారి ఆమెతో మాట్లాడినంతసేపు మాట్లాడి…. ఏ మాటలు లేకపోయినా అన్వేష్‌ దగ్గర హాజరు వేయించుకొని వెళ్తుంది.

దేదీప్యను, అన్వేష్‌ను చూస్తుంటే కాలేజీ రోజులు కళ్ల ముందు కదులుతుంటాయి కావ్యకి.

‘‘ఒక్కసారి కావ్యా! ఒకే ఒక్క సారి దేదీప్యతో నన్ను మాట్లాడిపించు. ఎలాగైనా తనను నాతో మాట్లాడేలా చెయ్యి.  మా యిద్దర్ని కలిపి పుణ్యం కట్టుకో..’’ అనేవాడు.  దేదీప్య పుట్టిన రోజున కావ్య చూస్తుండగానే అన్వేష్‌ దేదీప్యకి దగ్గరగా వచ్చి బర్త్‌డే గ్రీటింగ్‌ కార్డు ఇస్తూ…. ఈ రోజు నువ్వు మందారాకులో చుట్టిన గులాబిలా వున్నావు దేదీప్యా!’’ అది తను విన్నట్లు దేదీప్యకి తెలియదు. అన్నాడు. అది గుర్తురాగానే దేదీప్య వైపు చూస్తూ….

‘‘అలా వున్నావేం దేదీప్యా? దేని గురించైనా బాధపడ్తున్నావా?’’ అంటూ దేదీప్య ముఖంలోకి చూస్తూ అడిగింది కావ్య.

‘‘దీపక్‌ గుర్తొస్తున్నాడు కావ్యా!’’ అంది దేదీప్య నెమ్మదిగా ఏదోలా చూస్తూ…..

దేదీప్య ముఖంలోని భావాలను స్పష్టంగా చదవలేక, అస్పష్టంగా మారిన తన ఆలోచనలన్నీ ఒక కొలిక్కి రాక…. ఆ ప్రయత్నంగానే  దేదీప్య చేతిని పట్టుకొని నెమ్మదిగా నిమురుతూ కూర్చుంది కావ్య.

ఆ రాత్రి చాలా సేపు ఆలోచిస్తూ నిద్రపోలేదు దేదీప్య.

ఆలస్యంగా నిద్రపట్టింది…..

కలలో ఎవరో తన వెంటబడ్తున్నట్లు…. ఎడారిలో పరిగెత్తి, పరిగెత్తి,….. దాహంగా వుండి నీటికోసం వెళ్తే అక్కడ నేతి గిన్నెలు ప్రత్యక్షమైనట్లు… తను కావానుకున్నవాళ్లు నెమ్మది, నెమ్మదిగా వెనక్కి , వెనక్కి వెళ్లి పోతున్నట్లు కన్పిస్తూ… భయంతో ఏడుస్తూ అన్వేష్‌కి ఫోన్‌ చేసింది.

అన్వేష్‌ ఫోన్లోనే ఏదో మాట్లాడుతున్నాడు.  ఆమె ఏదో చెబుతోంది.  అన్వేష్‌ ఓదార్పుకి సొమ్మసిల్లిన ఆమె మనసులో…. మూడు సంవత్సరాల గతం సుదీర్ఘంగా సుడులు తిరుగుతూ ఆగిపోయింది.

దేదీప్యకి మెలుకువవచ్చి చూడగానే అత్తగారు ఆందోళనగా తన వైపే చూస్తూ నిలబడివున్నారు. ఏమైందో అర్థం కాలేదు దేదీప్యకి.

‘‘దేదీప్యా! నువ్వు నిద్రలో ఏడుస్తున్నావు.  అరుస్తున్నావు. భయంతో వణికి పోతున్నావు. పీడకల ఏమైనా వచ్చిందా?’’ అంది బ్రమరాంబిక.

‘‘అవునత్తయ్యా!’’ అంది దేదీప్య.

‘‘లేచి మంచినీళ్లు తాగి పడుకో.’’ అంటూ బ్రమరాంబిక కోడలి పక్కనే తోడుగా ధైర్యం చెబుతూ పడుకొంది.

అత్తగారు అమ్మలా తనమీద చేయి వేసి పడుకోవటం గమనిస్తూ… అన్వేష్‌కి తను కాల్‌ చెయ్యటం నిజం కాదని, కలని తెలిసి ‘‘థ్యాంక్‌గాడ్‌’’ అనుకొంది.

అన్వేష్‌కి కాల్‌ చేసింది కావ్య…..

‘‘చెప్పు కావ్యా!’’ అన్నాడు అన్వేష్‌. అతను బిజీగా వున్నప్పుడు తప్ప ఏ టైంలో కావ్య కాల్‌ చేసినా మాట్లాడతాడు.

‘‘మీతో కొంచెం మాట్లాడాలి. బిజీగా వున్నారేమో?’’ అంది కావ్య.

‘‘ఇప్పుడే ఫ్రీ అయ్యాను. ఏంటో చెప్పు?’’ అన్నాడు.

‘‘ దేదీప్య మీకు గుర్తుందా? ఇప్పటి దేదీప్యకాదు. అప్పటి దేదీప్య! ‘‘ అంది కావ్య.  నిన్న దేదీప్య ముఖంలో బాధ చూశాక అన్వేష్‌తో దేదీప్య గురించి మాట్లాడి ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించుకొంది.

‘‘కావ్యా! ఈ రోజు ఆఫీసులో వర్కెలా చేశావ్‌? నార్మల్‌గానే వున్నావా?’’ అన్నాడు నవ్వుతూ.

‘‘వర్క్‌మైండ్‌తో ఆలోచించే మీలాంటి వాళ్లకి వర్క్‌ తప్ప యింకేం గుర్తు రాదని నాకు తెలుసులెండి! అయినా దేదీప్య గురించి ఎందుకు అడుగుతున్నానంటే ఒకప్పుడు దేదీప్య కోసం మీరు పడ్డ తపన, తాపత్రయం ఇప్పుడేమయ్యాయో తెలుసుకుందామని… మీరు దేదీప్యకి పంపిన మేసేజ్‌లు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా వున్నాయి. వాటిని చూస్తుంటే, ఇప్పటి మీ ముభావం చూస్తుంటే ఆశ్చర్యంగా వుంది.’’ అంది కావ్య.

‘‘అప్పటి దేదీప్యను నేనెప్పుడో మరచిపోయాను. ఇప్పటి దేదీప్య మాత్రమే నాకు గుర్తుంది. మేసేజ్‌లు నీ దగ్గర ఎందుకున్నాయ్‌? డిలిట్‌ చేస్తే పోతాయి కదా! ఇంకా ఎందుకవి? ’’ అన్నాడు.

‘‘ఆ మెసేజ్‌లు నాకు నచ్చాయి.  అప్పుడప్పుడు చదువుకోవచ్చని అలాగే వుంచుకున్నాను.’’ అంది కావ్య.

‘‘అవి నీకు పంపినవి కావుగా?’’ అన్నాడు వెంటనే.

ఈ లక్స్‌ సోప్‌కి నా మనసెప్పుడు అర్థమవుతుందో! అసలు అవుతుందో లేదో?

‘‘ మీ ప్రియురాలి కోసం పంపినవేనని ఒప్పుకుంటున్నాను మహశయా! అప్పట్లో ఆమె గుర్తింపు కోసం ఎంత పట్టుదలతో ప్రయత్నించారో ఇప్పుడు ప్రపంచం మిమ్మల్ని గుర్తించాలని ప్రయత్నిస్తున్నారు. మీ ప్రయత్నం అప్పుడు ఫలించకపోయినా ఇప్పుడు ఫలించింది. ప్రముఖ స్థాయిలో నిలిచారు.’’ అంది కావ్య.

నవ్వాడు. అతని నవ్వు ఎప్పుడైనా బావుంటుంది. ఈ రోజు యింకా బాగుంది.

లక్ష్యం అనే మహశక్తిని ఆషామాషీగా తీసుకోకుండా చిత్తశుద్దితో, పట్టుదలతో, కృషితో సాధించుకుంటే ఒక మనిషిలోఎలాంటి సంతృప్తి పుడ్తుందో అంతకన్నా ఎక్కువ సంతృప్తి అతని నవ్వులో విన్పించింది.

‘‘చదువుకునే రోజుల్లో దేదీప్య తప్ప మరో ఆలోచన లేని మీరు ఈ స్థాయికి రావటమే ఆశ్యర్యంగా వుంది.  దీనికి కారణం దేదీప్య మీ పక్కన వుండటమే కారణమని అనుకోకుండా వుండలేకపోతున్నాను.’’. అంది కావ్య.

‘‘అలా ఎప్పుడూ అనుకోకు. ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకొని వుంటుంది. సుత్తితో బద్దలు కొడితే  శిల్పం రాదు.  ఉలితో నెమ్మదిగా చెక్కాలి.  అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి వుంటుంది.  ఏదో సాధిద్ధామన్న ఊహల్లో బ్రతికితే విజయం రాదు. కష్టమనే ఉలితో పట్టుదలగా చెక్కితే గెలుపు అనే శిల్పం బయటపడ్తుంది. ఆ తపన లేని మనిషి రాయి లాగానే బ్రతుకుతాడు.  నాకు రాయిలా బ్రతకటం ఇష్టం లేక కష్టపడ్డాను.’’ అన్నాడు అన్వేష్‌. తన కష్టాన్ని నమ్ముకొని తను వేసిన ఒక్కో అడుగు గుర్తు చేసుకుంటూ….

కావ్య మాట్లాడకుండా మౌనంగా వుంది.

‘‘ఏంటి కావ్యా! మాటలు ఆపేశావు? ఇవాల్టి వార్తలు. ఇంతటితో అయిపోయాయా?’’ అన్నాడు సరదాగా.

‘‘నేనూ, దేదీప్య భర్త దీపక్‌ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. దేదీప్య, దీపక్‌ ఏవో కారణాలవల్ల విడిపోయారు.  అతను త్వరలోనే దేదీప్య విలువ తెలుసుకొని మారబోతున్న టైంలో నేహ అనే అమ్మాయి పరిచయమై దేదీప్య అవసరం దీపక్‌కి లేకుండా చేసింది.’’ అంది కావ్య.

‘‘ఇన్ని రోజులు నాకీ విషయాలు ఎందుకు చెప్పలేదు.?’’ అన్నాడు అన్వేష్‌.

‘‘మానసికంగా బాధపడ్తున్న దేదీప్య ముఖం చూసైనా అర్థం చేసుకొని తన ప్రాబ్లమ్స్‌ఏమిటో అడగవలసింది కదా?’’ అంది కావ్య నిష్టూరంగా.

‘‘ చెప్తే  వినేవాడిని. ఆమె పర్సనల్‌ విషయాలు నాతో ఎప్పుడు చెప్పేది కాదు.’’ ఆన్నాడు.

‘‘నేను అనేది… మీరు అడగవలసింది కదా అని. మీకు దేదీప్య అంటే ఇంట్రస్ట్‌ తగ్గిపోయింది, అభిమానం లేదు. ప్రేమ అంతకన్నాలేదు.  ఆమె  సమస్యల్ని పరిష్కరించాలన్న ద్యాస కూడా లేనంతగా మీ లక్ష్యంలో మీరు మునిగిపోయారు.’’ అంది నిర్మొహమాటంగా.

‘‘కావ్యా! నన్ను వదిలెయ్‌! నాకు బోలెడు పనుంది.’’ అంటూ కాల్‌ కట్‌ చేశాడు అన్వేష్‌.

అతని పద్దతి కావ్యకి నచ్చలేదు.

మగవాళ్లెప్పుడు స్వార్థపరులు అనటం విన్నది కాని ఇప్పుడు అన్వేష్‌ రూపంలో చూస్తోంది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *