March 29, 2024

వాళ్లు – ఒక పాదచారి అనుభవ విశేషాలు.

ఒక సమీక్ష : మంథా భానుమతి.

vallu 14 p1

హిమాలయ పర్వత సానువుల కేగిన ఒక యువకుని స్వానుభవ స్వగతం, స్వప్న మాసపత్రికలో వచ్చిన భువనచంద్ర రాజుగారి “వాళ్లు” ధారావాహిక. అది తన స్వానుభవమేననీ, అందులోని పాత్రలు నిజంగా తనకు తారసపడిన వ్యక్తులేననీ రచయిత చెప్తారు.

ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, కట్టు బట్టలతో, చేత చిల్లిగవ్వ లేకుండా, హిమాలయ శీతల వాతావరణంలో నడక ప్రారంభించిన ఆ యువకుని అనుభవాలే.. పాఠకునివి కూడ అవుతాయి. అంతగా లీనమయిపోతాము.

మరి ఎవరీ “వాళ్లు”.. పాదచారి పయనంలో ఎదురైన వాళ్లు. సాధువులు, యాత్రికులు, పశువుల్ని కాచుకునే వాళ్లు, పృకృతి ఆరాధకులు, ఢాంబికులు కూడా..

“నిత్య జీవితంలో ఏది అన్వేషించాలి? మనస్సుని శరీరం నుంచి వేరు చేసి చూస్తే ఏమవుతుంది?”

“ఏ దిక్కూ లేనివాళ్లని తూర్పు తిరిగి దండం పెట్టమంటారు. ఎందుకో తెలుసా?”

తూర్పుకి తిరుగుతే మిగిలిన దిక్కులు తెలుస్తాయని. దీన్నే నానుడిగా వ్యంగ్యంగా కూడా వాడుతుంటారనుకోండి.  ఇటువంటి ఎన్నో విషయాలు, విశేషాలు అడుగడుగునా ఈ అసాధారణ ‘వచన కావ్యంలో’ గ్రాహ్యమవుతూ ఉంటాయి.

“అన్నం బ్రహ్మ.. రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః” — భోజనం చేస్తూ ఈ విధంగా మనఃస్ఫూర్తిగా భావిస్తే దేవాలయం వంటి దేహం పులకించదా..

“ఎవరైనా ఏ ప్ర్రదేశానికి వెళ్లాలన్నా ఆ చోటు ఆహ్వానిస్తేనే వెళ్లగలుగుతాం. గతం అనే పునాదిమీద వర్తమానం నిర్మించుకుంటాం..”

ఇటువంటి ఎన్నో విషయాలమీది అవగాహనతో ఈ రచన సాగిపోతుంటుంది.

చట్టి అంటే ఏమిటో నాకు ఇది చదివాకే అర్ధమయింది. ఈ రచనలో సాధువులకున్న అతీత శక్తి అడుగడుగునా కనిపిస్తుంటుంది. ఆదిలోనే ఇంతగా ఆకట్టుకున్న ఈ ధారావాహిక మున్ముందు ఎక్కడెక్కడికి తీసుకెళ్తుందో అని ఆసక్తి కలుగక మానదు మొదటి భాగం లోనే..

“విద్యలనేవి ఉపయోగానికే గానీ ప్రదర్శనకి కాదూ..” రెండవ భాగంలో మొదట్లోనే నేర్చుకునే పాఠం..VAALLU 1P1

“భౌతికమైన కళ్లు మూసుకుంటే మనో నేత్రాలు తెరుచుకుని, ఇష్టదైవాన్ని ఆరాధించుకోవచ్చు”  అన్నేసి సార్లు తిరుపతి వెళ్లనక్కర్లేదు. ఒకసారి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు తమ ప్రసంగంలో తిరుమల ఆలయంలోకి వెళ్తూనే మనం కనబోయేవన్నీ ఎంత అనర్గళంగా, విస్తారంగా వర్ణించారంటే.. మనోఫలకంలో ఆ దృశ్యాలన్నీ స్పష్టంగా గోచరిస్తాయి. అది వారి గ్రహణశక్తికి, మనన ప్రతిభకీ తార్కాణం. ఆవిధంగా విహరించగలగడం ఏకాగ్రత ఉంటే సాధ్యమేనని మనకి ఈ భాగంలో చూపిస్తారు రచయిత. మనస్సు ఒక సృష్టి కర్త. దేన్నైనా సృష్టించగలదు అనేది అందరికీ అనుభవమే..

ఈ కావ్యంలో.. (ఇది నవల కాదు.. అందుకే నేను వచన కావ్యం అని అంటున్నా..) ముందుకు నడుస్తున్నకొద్దీ, భారతీయ హిందూ ధర్మం, వేదాంతం విశ్వరూపం దాలుస్తాయి. మూడవ భాగంలోకి ప్రవేశించినప్పట్నుంచీ పాఠకులు ఆలోచనలో, తర్కంలో పడతారు.. తమకు తెలియకుండానే.

“మానవుడు కూడా భగవంతువి సృష్టే. అన్ని జీవుల వంటివాడే.. మిగిలిన జీవులకి లేని తాపత్రయం ఆ జీవికి మాత్రం ఎందుకు? మిగిలిన జీవుల మీద ఆధిపత్యం చెలాయించాలని ఎందుకు చూస్తాడు.. తనకి ఉన్నదీ, మిగిలిన వాటికీ లేనిదీ ఏమిటి? వాడీ ప్రకృతిని ఎంత కాలం హింసించ గలడు?”

ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు పాదచారితో పయనిస్తేనే గోచరమౌతాయి.

పదార్ధాన్నీ, దానిలోని శక్తినీ, ఆశక్తి ఉనికినీ, పదార్ధానికీ శక్తికీ గల సంబంధాన్నీ వైజ్ఞానికి పరంగా విశ్లేషిస్తారు రచయిత.

అఘోరాల గురించిన సరైన అవగాహన మనలో ఎంత మందికి ఉంది.. నిద్రాణంగా ఉన్న అనేక కుతూహల సందేహాలకి సమాధానాలు దొరుకుతాయీ బాటలో చదువరికి. మధ్యలో కుహనా సన్యాసులు ఎదురౌతారు. మంచి పక్కనే చెడు ఉంటుంది కదా. వారే లోకాయతులు.

బోలెడు డిగ్రీలుండి కూడా గోనె బట్ట మాత్రమే ధరించే బోరీబాబా మనసొక ట్రాన్స్మీటరంటారు.. అదెలా? పైగా బండరాయి కూడా జడం కాదుట. దానికీ స్పందనలుంటాయి.

“ధనం వెనుక పరుగులు మాని, ప్రకృతిలోని సౌందర్యాన్ని అణువణువునా నింపుకోవాలి.” బోరీబాబాతో కలిసి సాగించిన పయనంలో జరిగిన జ్ఞానోదయం..

“నీ ప్రాప్తం ఏమిటో అది నీకు ఎక్కడున్నాదక్కుతుంది..”

అసలు ఆ పాదచారి హిమాలయాలకి ఎందుకు వెళ్లాడు.. అంత మానసిక అలజడి ఎందుకు. వయసుకి మించిన ఆ ఆలోచనలేమిటి.. అతనికే తెలియదు. “వాళ్లు” చెప్పాల్సిందే.

జీవితం అనేది క్షణాల మూట. ఏ క్షణమూ వేరే క్షణంలా ఉండదు. కానీ నిన్న మనకి ఆనందం కలిగితే ఆ విధంగానే రేపు గడవాలనుకుంటాం. ఇవేళ బాధ దుఃఖం ఉంటే రేపది ఉండకూడదనుకుంటాం. మనం అనుకున్నట్లు జరక్కపోతే తిట్టుకుంటాం.. అలా కాకుండా నిరంతరం ఆనందమయ స్థితిలో ఉండడం ఎలాగ?

“ఏ పని చేస్తున్నా భగవదర్పితం అనుకుంటే ఆ స్థితి లభిస్తుంది.”

కానీ.. ఈ కావ్యం చదువుతుంటే మనసు తెలియని భావోద్వేగానికి ఎదుకు లోనవుతోంది? అలౌకిక స్థితిలో కూడా.. ఇంత పయనం సాగిచాక కూడా.. చలించకుండా ఎందుకుండ లేకపోతున్నా? ఇవన్నీ సమాధానం తెలియని ప్రశ్నలు. ప్రయాణం పూర్తి అవుతే కానీ తెలియదేమో.. వేచి చూడాలి.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని ఏవిధంగా నియంత్రించుకోవచ్చో.. కష్టమే కానీ సాధనతో సాధ్యమవనిది లేదు. ఆశ్రమంలోని దయామయి బోధనలు సులభ గ్రాహ్యాలు.

ముందుకి నడిచిన కొద్దీ, కొత్త కొత్త వింతల్నీ, విషయాలనీ ఎన్నింటినో మనకి అనుభవైక వైద్యం చేయిస్తారు పాదచారి..

మచ్చుకు కొన్ని..

“పుస్తకాల్లో ఉన్నది మస్తకానికి ఎక్కించడం వేరూ, జీవితాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడం వేరూ. నీ జీవితాన్నే ఓ పుస్తకంగా భావించుకుని, ప్రతీక్షణాన్ని ఓ అక్షరంగా అర్ధం చేసుకుంటే.. అర్ధం కానిదేది?”

“కోటి పుస్తకాలు చెప్పలేని భావాన్ని ఒక్క స్పర్శ చెప్పగలదు.”

“జననం.. మరణం..  రెండూ రెండు అట్టలు. ఈ అట్టల మధ్య కుట్టబడిన పుస్తకమే జీవితం. ఏ క్షణపు అనుభవం ఆ క్షణంలోనే నమోదవుతుంది. కాయితానికి ఒక పేజీ రాత్రయితే ఇంకో పేజీ పగలు. రోజుకో కాయితం నిండుతూ ఉంటుంది.”

“ఒక శ్వాస. లోపలికి రాగానే కోట్లాది కోట్ల రక్తనాడులనీ, రక్త కేశనాళికల్నీ పని చేయిస్తోంది. ఒకే మానవశరీరానికి విద్యుత్ సరఫరా చేసే పవర్ స్టేషన్ లాగా పని చెస్తోంది.” ఎంత చక్కని పోలిక..

ఇటువంటి జీవన సత్యాలెన్నో ఈ యాత్రలో తెలుసుకుంటాం.

కాశ్మీర్ కవయిత్రి, శుకమహర్షి వంటి స్థిర చిత్త, కృష్ణుడు తప్ప సమస్త జనులూ స్త్రీలే అని చెప్పే లల్లాదేవి వేదాంత సారాన్ని అర్ధం చేసుకోవడానికి యత్నిస్తూ.. మరలా కలిసిన అఘోరా సూచనతో విషయ ప్రపంచంలోకి వస్తాం.. పాదచారితో మనం కూడా.

అక్కడికి మొదటి మజిలీ మాత్రమే అయింది.

చాలా సులభంగా.. మామూలు మనుషులకి బోధపడేట్లుగా ఈ జీవితానికి ఆవల ఉన్న అతీతాన్ని అందించాలని రచయిత చేసిన ప్రయత్నం సఫలమయిందనే నాకనిపించింది.

ఈ అపూర్వ చిత్రాన్ని ఒక పుస్తకంగా తీసుకు వస్తే, లౌకిక విషయాల ప్రాధాన్యతని తగ్గించుకోవాలని తాపత్రయ పడుతున్న అనేకమందికి ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.

(రెండవ భాగం– విశ్లేషణ. త్వరలో..)

 

 

7 thoughts on “వాళ్లు – ఒక పాదచారి అనుభవ విశేషాలు.

  1. నిజంగా చక్కని విశ్లేషణ. భువనచంద్రగారి రచనల గురించి తెలుసును. కౌముది పత్రికలో ‘మనసు పొరల్లో’ ధారావాహిక చదివాను.. ఎంతగానో నచ్చింది. అయితే ‘వాళ్ళు’ గురించిన మీ విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంది. మనసులోని కొన్ని సందేహాలకు చక్కని జవాబులు దొరుకుతాయేమో… నేను తప్పక చదవాలి అనిపించేలా ఉంది విశ్లేషణ. చదువుతాను…

  2. భానుమతి గారు మీ ఈ విశ్లేషణ చదివిన తర్వాత నాకు వాళ్ళు పుస్తకం చదవాలని అనిపించింది.. చాలా రోజుల నుండి ప్రయత్నిస్తే నాకది అందినది..అందులో మీ ఈ విశ్లేషణ పుస్తకం మొదట్లోనే చూసి నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి….నిజంగా భువనచంద్ర గారు చాలా బాగా రాసారు….ఆయనకు నా నమస్కారాలు…

Leave a Reply to Mani Vadlamani Cancel reply

Your email address will not be published. Required fields are marked *