April 18, 2024

మాయానగరం – 4

రచన: భువనచంద్ర రాజు  bhuvana

మిస్ శోభారాణి బియ్యస్సీ పనిచేసే ప్రయివేటు స్కూలుకి యజమానీ, కరెస్పాండెంటూ, రెక్టారూ కూడా శామ్యూల్ రెడ్డే. వాళ్ల పూర్వీకులు రెడ్లయినా ‘మతం’ పుచ్చుకున్నారు.  పెళ్ళిళ్ళూ, చావులూ కూడా ‘మతం’ పద్ధతిలో జరుగుతై. లెటర్‌హెడ్‌లో మటుకు K.S.రెడ్డి అని వుంటుంది. అనగా, కాటమరెడ్డి శామ్యూల్ రెడ్డి అని అర్ధం. K S రెడ్డికి ‘ప్రాఫిట్ మోటివ్’తో బాటు ‘పైకి ఎగబాకాలనే ఆశలూ వున్నాయి. ‘నిచ్చెనలు’ ఎలా వేయాలో బాగా తెలిసినవాడవటం చేత ‘గుడిసెల సిటీ’నించి కొంతమంది పిల్లల్ని పోగుచేసి ‘ఉదారంగా’ సీట్లిచ్చి ‘మహానుభావుడు’ అన్న పేరు కొట్టేయడమే కాక గవర్నమెంటు సొమ్ముని కూడా సాంక్షన్ చేయించుకున్నాడు.

పిల్లలకి స్కూలంటే ఎలర్జీ. వాళ్ల ఫస్టు ప్రిఫరెన్శు ‘రిక్షా’లే. వర్డ్స్‌వర్త్ పద్యాలూ, షేక్స్పియర్ నాటకాలకంటే వాళ్లకి  ‘రిక్షా బెల్లే’ సంగీతంలా వినిపిస్తుంది. పెద్దవాళ్ల క్కూడా పిల్లల్ని బడికి పంపాలంటే భయమే.. ఎందుకంటే చదువుకుని చెడిపోతారని. చదువుకున్నోడు ‘చిన్న’పనులు చెయ్యడంవల్ల డిగ్నిటీకి భంగం కనుక. ‘పెద్ద’ ఉద్యోగాలు రావు సో ఇంటికి భారంగా తయారవుతారని పెద్దోళ్ళ భయం. అంతేగాదు. చదివీ చదివీ డిగ్రీలు సంపాయించి నిరుద్యోగులుగా కాలం వెళ్లబుచ్చుతున్న నిర్భాగ్యుల చరిత్రలూ వాళ్లకి తెలుసు. ‘చీపురు పుల్లావిడ’కి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు సైకిల్ సర్వీసింగ్ ప్రొఫెషన్‌లో వున్నాడు. ప్రస్తుతం  ‘బాజీ’గారి దుకాణంలో ఎప్రెంటిస్. భోజనంగాక కొంత ‘చేతి’ ఖర్చుకి సంపాయించుకుంటున్నాడు.  చదువుతానని చిన్నతనంలో వాడు పేచీ పెడితే చీపురు పుల్లావిడ చీపురెట్టి వాడ్ని చావగొట్టి బాజీ దుకాణంలో చేర్పించింది. ఆ సందర్భంలో “సదివి నువ్వేటి  జేత్తావురా నంజికొడకా.. మావేలు విడిచిన మేనత్తగారి మొగుడ్ని చూడు. నోట్టో అక్షరం ముక్క లేకపోయినా ‘మంత్రి’ గిరీ దక్కించుకున్నాడు. సదువుకున్న నాయాళ్లందరూ ఆయనకి పడీ పడీ మొక్కేవోళ్లు. సంతకం పెట్టడం రాకపోయినా కలేక్టర్లకి ఆజ్ఞలిచ్చేవోడు. బుర్రుండాలి గానీ సదువులో ఏవుందిరా సవటా” అవటాని ఓ చిన్న సైజు ఉపన్యాసం కూడా దంచింది. దేశంలో ‘ప్రజలకి’ బుర్ర లేదని ఎవరనగల్రు. కానీ రెండో కుర్రాణ్ని మాత్రం రెడ్డిగారి బళ్లో చేర్పించక తప్పలా. ఎందుకలా? కానీ ఖర్చు లేకపోవటమే కాదు. ..”అంత పెద్ద బాబొచ్చి కాళ్లా వేళ్లా పడితే’ కాదని ఎట్టాగన్నూ?” అని రీజనింగ్ కూడా ఇచ్చింది..

శ్రీయుత శామ్యూల్ రెడ్డిగారు రోజూ స్కూల్ని దర్శించరు. ఎందుకంటే ఆయనో రెండు అనాధ శరణాలయాలు కూడా ‘ఫారిన్ ఫండ్స్’ తో నడిపిస్తున్నాడు. స్కూల్ కంటే లాభసాటి వ్యాపారం అనాధ శరణాలయం.

K.S.రెడ్డిగారు  స్కూల్ని మామూలుగా విజిట్ చెయ్యరు. VIPలా ముందు కబురు పంపుతారు. వారొస్తున్నారంటే టీచర్లకీ, పిల్లలకీ కూడా ‘శీతాకాలపు వణుకు’ అప్రయత్నంగా వస్తుంది. ఎవరి మీద ఏ కామెంటేస్తాడో.. ఏ విధంగా ‘కుప్పి’గంతులు వేస్తాడోనని అందరికీ భయమే. వాళ్ల భయాన్ని చూస్తే, ‘ముందు మనిషి పుట్టి భయం పుట్టిందా లేక భయం పుట్టాక మనిషి పుట్టాడా’ అన్న పాయింటు మీద రిసెర్చి చెయ్యాలనిపిస్తుంది.

మిస్ శోభారాణి బియ్యస్సీ ఆ స్కూల్లో చేరి ఆర్నెల్లయింది. అపాయింట్‌మెంట్ ఆర్డరిస్తూ శామ్యూల్‌గారు అత్యంత నెమ్మదిగానూ, స్పష్టంగానూ, తియ్యగానూ ‘సచ్చీలత’ గురించీ, సత్యవాక్య పరిపాలన గురించీ, ఉపాధ్యాయుల విధుల గురించీ, “గురు”శబ్దం యొక్క మహత్తును గురించీ అనర్గళంగా గంటన్నర ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసాన్ని సంపూర్తిగా, కళ్లు ఇంత పెద్దవి చేసుకుని విన్న శోభారాణి ఆయనకి మనసావాచా కర్మణా జోహార్లర్పించింది. ఉపనిషత్యాంశాలన్నీ ‘టీ’ కప్పులో  పోసిచ్చినంతగా ‘ఇంప్రెస్’ అయింది. ఇప్పుడాయన విజిట్‌కి వస్తున్నరని తెలియగానే ‘భయం’ లేకుండా కించుక ఉత్సాహంతో ఎదురు చూస్తున్నది శోభారాణినే. ఇంకా ఆనాడు శామ్యూల్‌గారిచ్చిన ఉపన్యాసమూ, ఆ నెమ్మదితనమూ ఆవిడ మనసులోంచి చెరిగిపోలేదు.

మిగతారోజుల్లో ‘గుడిసెల సిటీ’ పిల్లల్ని బయటకు పోకుండా ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఆ విషయం స్టాఫందరికీ తెలుసు. అందుకే చూసీ చూడనట్టు ఊరుకుంటారు. ‘రెక్టారు’గారు వచ్చే రోజున మాత్రం ఎన్ని యాతనలు పడైనా ఆ పిల్లకాయల్ని క్లాసుల్లో కూర్చోపెట్టక తప్పదు. అందుకోసం ఆ రోజున ప్రత్యేకంగా వాళ్లకి చాక్లెట్లూ, బిస్కెట్లూ ‘ పిడత కింద పప్పు’ లాంటి మధుర పదార్ధాలను ‘ఎర’గా వేస్తారు. టీచర్లకి ఇదో ఆవదం.

ఇవ్వాళ ఆ పిల్లల్లందర్నీ ‘కనెక్టు’ చేసి తీసుకు రావలసిన బాధ్యతని మిస్.శోభారాణీ బియ్యస్సీ మీద పెట్టేశారు సీనియర్ టీచర్లు. ఆ యొక్క పనిలో వున్న కష్టనష్టాలు తెలుసు గనక చక్కగా శోభారాణిని ఇరికించేశారని చెప్పడమే ధర్మం కూడా.. అమాయకంగా ఆ పనికి ఒప్పుకుంది శోభారాణి.

నిన్న ఉతికి ఆరవేసి మడతలు పెట్టిన గులాబిరంగు వాయిల్ చీర, చక్కని మేచింగ్ బ్లౌజూ, తల్లో ఓ చక్కని గులాబీపువ్వుతో తనని తను అలంకరించుకుని ‘గుడిసెల సిటీ’లో అడుగుపెట్టింది శోభారాణి.

సౌందర్య సలహా ప్రకాం వేగంగా పరిగెత్తగల ఇద్దరు ‘ఇద్దరు సీనియర్ స్టూండెంట్స్’ని కూడా తీసుకువెళ్లడంతో ఆవిడకి పిల్లల్నెలా పట్టాలా అన్న దిగులు కూడా పోయింది. సరే… మొట్టమొదటిసారి గుడిసెలసిటీలో గుడిసె గుడిసెకీ ‘గాడెస్’లా వెళ్ళి పిల్లల గురించి ‘ఎంక్వైరీ’ మొదలెట్టింది. బిస్కెట్లూ, చాక్లెట్లూ ఎట్సెట్రా సరంజామా సిద్ధంగా వుంది గనక ఓ పదిమందిని బెదిరించో, బామాలో, బుజ్జగించో ‘కేచ్’ చెయ్యగలిగింది గానీ ‘పదకొండోవాడి జాడ మాత్రం దొరకలా. ‘క్వయిరీ’ ప్రకారం ఆ కుర్రాడుండేది మోహన్‌దాస్ కరంచంద్‌గాంధీ (గామోకా) వీధిలో. మిగతా కుర్రాళ్ళని సీనియర్ కుర్రాళ్లతో బడికి పంపి పదకొండోవాడి కోసం స్వయంగా గామోకా వీధిలోకి అడుగెట్టింది శోభారాణి. జస్ట్ అప్పుడే గామోకా వీధిలో మూడో యింట్లోనించి బయటకొచ్చిన బోస్‌బాబు అప్సరసలా, స్వప్నసుందరిలా, అలనాటి బి.సరోజాదేవిని తలదన్నేలా, నడుస్తూ వస్తున్న శోభారాణి బియ్యస్సీని చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. ఆ క్షణంలో ముసలాడి జబ్బూ, గురువుగారి సలహా అన్నీ మర్చిపోయి నోరు తెరుచుకుని నిలబడ్డాడు. మిస్ శోభ తనని గుర్తించనైనా గుర్తించకుండా అడుగులు వేస్తూ తన మానాన తాను పోవడం చూసి అప్రయంతంగా ‘ఆగండి’ అని ఓ చిన్న సైజు కేక పెట్టాడు. మిస్ శోభారాణి ఆగి వెనక్కి తిరిగి చూసింది. బోస్‌బాబు ఇంకా విస్మయంలోనే ఉన్నాడు. “ఏం” అన్నట్టుగా సైగ చేసింది. పొలిటిషియన్‌కి ఆ మాత్రం ప్రోత్సాహం చాలు. గబగబా ఆమె దగ్గరకు వెళ్ళి మెల్లగా , ‘యీ చుట్టు పక్కల్నించి వెంటనే వెళ్ళిపోండీ. ‘కలరా’ ఉన్నట్టు అనుమానంగా ఉంది’ అన్నాడు. “మీ అంత అందమైనవాళ్లు ఆ విషయం తెలియకుండా ఇక్కడికి రావడం నేను భరించలేను” అని కూడా అన్నాడు.

మిస్ శోభారాణి భయపడుతూ “థేంక్స్” అని మెల్లిగా అని గబగబా వెనక్కి తిరిగింది. ఆమె ఆ సందు మలుపు తిరిగేంతవరకూ బోసుబాబు చూస్తూనే ఉన్నాడు. ఆమె రుద్దుకున్న ‘సోపు’ పరిమళం ఆ చుట్టుపట్ల ఇంకా పరిమళిస్తూనే ఉంది. బోసుబాబుకి తనలోంచి ఏదో ‘శక్తి’ బయటికొచ్చి ఆమె ‘వెంట’ వెళ్ళిపోయినట్టనిపించింది. అసలామె ఎవరో, ఆవిడ పేరేమిటో, ఏం చేస్తోందో, ఎక్కడ వుంటుందో ఎట్సెట్రా వివరాలు తెలుసుకోనందుకు తనని తాను తిట్టుకున్నాడు. ఇంకొంచెం సేపు మాట్లాడనందుకు తనని తనే దూషించుకున్నాడు. ‘నేను వెధవని’ అని కూడా అనుకున్నాడు. కానీ వివరాలు తెలుసుకోవాలంటే ఎంత సేపు?

‘ప్రేమ’ అనే రెండక్షరాలని బేస్ చేసుకుని రెండు కోట్ల కథలూ ఇరవై కోట్ల కవితలూ అదే సంఖ్యలో నవలలూ ‘పబ్లిష్’ అయినా ఆ ‘ప్రేమ’ని సమర్ధవంతంగా ‘భాష’లో ఇమడ్చగలిగిన ‘సత్తా’ ఎవరూ చూపలేకపోయారన్నది నిర్వివాదాంశం. ప్రేమకి పరిధి లేదు.. భాష లేదు…. ప్రిన్సిపుల్స్ లేవు.. సిద్ధాంతాలూ, ఈక్వేషన్లూ, తారతమ్యాలూ అసలే లేవు.  ప్రేమని పదవులూ, అంతస్థులూ ఆజ్ఞలూ, ఆపలేవు.  ప్రేమకి నిర్వచనం తెలీకుండానే నిర్జీవులైన వాలు కోకొల్లలు. ప్రేమాన్వేషనలో పిచ్చివాళ్లయినవారి సంఖ్య తక్కువ కాదు. భగ్న ప్రేమికుల జాబితాలో భూగోళాన్నే చుట్టేయ్యొచ్చు. విచిత్రం ఏమంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ‘ఒక్క’సారైనా ప్రేమించినవాళ్లే!! కొన్ని ప్రేమలకి పబ్లిసిటీ ఉంటుంది. కొన్ని ప్రేమలు ‘మౌన’ కావ్యాలై మనసులోనే అలజడి చేస్తుంటాయి.

మిసెస్ మాధవీరావ్ ‘మౌన ప్రేమ’ కోవకి చెందినటువంటిది. అసలామెకి పెళ్ళే కాలేదు. ఆవిడ మిస్టర్ రావుని ప్రేమించింది. ఆరాధించింది అతన్నే మనసా వాచా భర్తగా ఎంచుకుంది. తన ప్రేమ వ్యవహారం అతని ముందు పెట్టేలోగానే ఆయన ఏక్సిడెంటులో ‘బకెట్’ తన్నేశాడు. పెళ్ళి కాలేదు కనక ‘విధవ’ కాలేదు. కానీ మనసులో ఆయన్నే ‘భర్త’గా నిలిపింది గనక మాధవీలత కాస్తా ‘మిసెస్ మాధవీరావ్’ గా మిగిలిపోయింది.  ఆయన ‘భౌతికంగా’ చనిపోయినా తన మనసులో ‘సజీవంగా’ ఉన్నాడనే ఆవిడ నమ్మకమూ, విశ్వాసమూ కూడా.

‘ఆయన’ పోగానే (ఒక్క క్షణం ఐనా వాళ్లు కలిసి లేరు) ఆ పరిసరాల్లో ఉండలేక మళ్లీ మరొకర్ని ప్రేమించలేక, చాలా మంది ‘పెళ్లి ప్రపోజల్’ తెచ్చినా తన మనసుని సమాధాన పరుచుకోలేక ఆ ఊరొదిలి ‘యీ’ ఊరు చేరింది. మొదట్లో తన ‘బాధ’ని,  ‘ప్రేమ’నీ,  కవితా, కథా.. నవలా రూపాల్లో బంధించి పత్రికలకి పంపింది. అవి గోడక్కొట్టిన బంతిలా వెనక్కి తిరిగొస్తున్నా తన పని మాత్రం మానలా. చివరికి ఆమె కథలూ, కవితలూ, నవలలూ ‘తిరిగి’రావటం మానేశాయి. ‘ప్రేమ’ని అత్యంత సున్నితంగానూ, సుందరంగానూ రాసే ‘రచయిత్రి’ అన్న పేరు కూడా ఆవిడకి తెచ్చిపెట్టాయి. ఆంధ్రదేశం ప్రేమకథా రచయిత్రిగా ఆమెకి నీరాజనాలు పట్టింది. ప్రేమలోని తియ్యదనమూ, ప్రేమలోని విరహమూ, విషాదమూ, ప్రేమలోని ఉద్రేకమూ, ఉత్సాహమూ, ప్రేమలోని తీవ్రతా ఆమె ‘కలం’ చెప్పగలిగినంతగా మరే ‘కలం’ వ్రాయలేదనడం సత్యదూరం కాదు. పేరుతోబాటు డబ్బు వచ్చింది. ఆమెకి మొదటినించీ ‘డబ్బు’ కి లోటు లేదు గనక ఆవిడ జీవితం బాగానే నడుస్తోంది. మిసెస్ మాధవీరావ్‌గా మాత్రం ఆవిడ పాఠకులకు  తెలుసుగానీ ఆమె ముఖం ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఆమె ఎవరికీ కనీసం ‘ఫోటో’ కూడా ఇవ్వలేదు. ‘ నో పబ్లిసిటీ’ అనేది ఆవిడ తత్వం..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *