April 16, 2024

మాయానగరం – 5

 

పాఠకులకి అదో మిస్టరీ! జీవితాన్ని అతి సున్నితంగా గడిపేవాళ్ళే ఒక్కొక్కసారి అత్యంత కఠిన సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కొంతమంది ‘అతి’ కఠినంగా కనిపించినా ‘సమస్య’ ఎదురైనప్పుడు చివురాకులా వొణికిపోవడమూ లోకంలో చూస్తాం.

మిసెస్ మాధవీరావ్ నవలలూ, కథల్లాగా ఆమె ఆలోచనలూ సున్నితాలే. ఆమె కేరక్టర్‌లా ఆమె కట్టేవి కూడా బుల్లి బోర్డరుండే తెల్లచీరలే. ఏ విధమైన ఆడంబరాలూ లేవు. ఓ సారి ట్రైన్‌లో వెడుతూ ప్లాట్‌ఫాం మీద ఎవరో తిని పారేసిన విస్తరి కోసం పిల్లలూ, కుక్కలూ పోటీ పడటం చూసింది. ఇది చాలా నగరాల్లో ప్రతి పూటా కనిపించే దృశ్యమే అయినా ఆవిడకి మాత్రం అదే మొదటిసారి.

తను రాసే నవల్లోని పాత్రలకీ, సృష్టిలోని యీ సజీవ పాత్రలకీ గల వృత్యాసాన్ని ఆ క్షణంలో ఆమె గుర్తించి గగుర్పాటు చెందింది. “అసలింతకాలమూ నేను చేసిందేంటి?  అసలు నాకు సామాజిక స్పృహ అనేది లేశమైనా  ఉన్నదా?” అని తనని తాను ప్రశ్నించుకుంది. ప్రేమ గుడ్డిది కాదుగానీ ప్రేమించినవాళ్లు ప్రపంచాన్ని మర్చిపోయి గుడ్డివాళ్లలా బిహేవ్ చేస్తారు. వాళ్లకి వాళ్ల లోకమేగానీ, భయం, సిగ్గు, లజ్జలాంటివన్నీ గుర్తుండవు. అందుకే బీచ్‌లోనూ, పార్కుల్లోనూ, సినిమా హాల్లలోనూ ‘పబ్లిక్’ ప్రణయాల్ని చూసి మిగతావాళ్లు నవ్వుకునేది. యీ ‘అవ’లక్షణం ప్రేమికులకే కాదు. కళాకారులకీ ఉంది. ప్రేమకీ, కళకీ లిమిటేషన్లూ, రిజర్వేషన్లూ ఉండవు. ‘ప్రపంచమే’ తమలో ఉన్నట్టు ‘ఐడెంటిఫై’ చేసుకోవడం యీ ‘పిచ్చి’కి పరాకాష్ట. అయితే ‘సర్వంలో తననీ తనలోనే సర్వాన్నీ చూడగలగడమే నిజమైన మోక్షం’ అంటారు రుషులూ, జ్ఞానులూ. కానీ అంత భావతీవ్రత ఎవరికుంటుందీ?

సరే.. మిసెస్ మాధవీరావ్ ఆనాడు ట్రైన్‌లో ఆలోచించింది.. ఆలోచిస్తున్నకొద్దీ ఆమెకి ‘వాస్తవం’ బోధపడింది. తక్షణమే ‘ప్రేమ’ అన్న సబ్జక్టుని పక్కనపెట్టి సమాజం మీద దృష్టి మళ్ళించింది. ఆ రోజే తను చూసిన దృశ్యాన్ని ‘బేస్’ చేసుకుని చాలా చక్కని నవల వ్రాసింది. ఆ నవలని వ్రాస్తునంత కాలం ‘అటువంటి’ పిల్లల్నీ, పెద్దల్నీ ఎందరి అనుభవాల్ని ‘ఇంటర్వ్యూ’ పేరు మీద పోగు చేసిందో లెక్క లేదు. చిత్రం ఏమంటే ఆ నవల ఆవిడ చేసిన మునపటి నవలల్లాగా ‘బెస్ట్ సెల్లర్’ కాలేదు కదా, బాగా లేదనే విమర్శలు కూడా వచ్చాయి. అంతే కాదు.. అంత గొప్ప రచయిత్రి ఇటువంటి ‘పనికిరాని  కన్నీళ్ల’ కథల్ని వ్రాయడం తమకి బాధ కలిగించిందని కూడా అభిమానులు ఉత్తరాల్లో రాశారు. లోకంలో ఇదో విచిత్రం. నిజాన్ని కళ్లెదురుగా చూస్తున్నా ఎవడూ నమ్మడూ.. పట్టించుకోడూ.. అదే అందంగా అబద్ధాన్ని చెబితే మాత్రం మహదానందంతో మురిసిపొతాడు. ప్రజల నైజం గురించి రాజకీయ నాయకులకి బాగా తెలుసు. అందుకే అందమైన అసందర్భపు వాగ్దానాలతో ఓట్లు కొల్లగొడతారు.

ప్రజల కాళ్లు భూమ్మీద ఉంటై. తలలు మాత్రం ఆకాశంలో ఉంటై.. చెయ్యాల్సిందొకటి ‘ఎన్నో’ చేస్తామంటూ కలల్ని గుప్పించడమే. రచయితలూ, రాజ/ప్రజా కవులు చేసేదీ అదే. ఇహ సినిమావాళ్ల విషయమే వేరు. ‘ఒక్క’ హీరో వందమందిని చితగ్గొడతాడు. ప్రజలు చప్పట్లు చరిచీ, యీలలు వేసీ, ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతారు. యీ ‘సైకాలజీ’ తెలిసినవాడే ‘భగవంతుడ్ని’ కనిపెట్టాడు. రెండు చేతులూ, ఒక మొఖము, శరీరంతో కాదు. నాలుగు తలల్తో బ్రహ్మనీ, ఇంకా అనేకానేక తలల్తో ఇతర దేవుళ్ళనీ, లెక్కకు మించిన హస్తాలతో దేవతల్నీ కనిపెట్టి ‘ప్రచారం’ చేశాడు. ఆ ప్రచారం ప్రపంచంలో ‘చివరి’ మనిషి వున్నంత కాలం కొనసాగుతూనే ఉంటూంది. మఠాలకీ, చర్చిలకీ ‘బంగారు గుడ్లు’ పెడుతూనే ఉంటూంది. రమ్ము, విస్కీ, బ్రాందీ కన్నా ఘాటుది ‘మతం’ దాంతో సరితూగే ‘కులం’. యీ రెండూ చాలు.. జనాభాని నియంత్రించడానికి.

సరే….’నవల మీద ప్రజాభిప్రాయం’ చూసిన మాధవీరావ్ దిమ్మదిరిగిపోయింది. తన నవల .. కష్టపడి ఎంతో పరిశోధించి రాసిన నవల ప్రజల్లో ‘మార్పుని కొంచెమైనా తెస్తుందని త్రికరణశుద్ధిగా నమ్మింది. ఎంతో కొంత సామాజిక న్యాయానికి సహాయపడుతుందనీ విశ్వసించింది. ఆ నమ్మకం వమ్మయ్యేసరికి నిర్ఘాంతపోయింది.

‘అమెరికా’వాడే భారతీయుల ‘నాడి’ పట్టుకోలేక ఖంగుతిన్నాడు. మిసెస్ మాధవీరావ్ అనబడే అబల ఎంత? ‘ఫెయిల్యూర్’ ఆమె కళ్లు తెరిపించింది. మరో రచయిత్రి అయితే ‘కన్నీటి గాధలు’ పక్కనబెట్టి మళ్లీ ప్రేమ కథల ‘దస్త్రాల్ని’ జనం మీదకి ఒదిలేది. కానీ మాధవికి చిత్తశుద్ధి వుంది. అందుకే ‘ఎక్కడ పప్పులో కాలేశానా’ అని తనలో తను ప్రశ్నించుకుని మళ్లీ ప్రజల్ని ‘అర్ధం’ చేస్కునే ప్రయత్నం చేసింది. ప్రజల్నీ. వారి ఆలోచనల్నీ, అలవాట్లనీ గమనించడం మొదలెట్టింది. అనేక ‘ఇజాల్ని’ అధ్యయనం చేసి ‘నిజాల్ని’ కనుక్కునే దిశగా అడుగులు వేసింది. నిజమైన ‘షాక్’ తిన్నది అప్పుడే.

యీ సమసమాజ నిర్మాణం అన్నది పుస్తకాల్లోనూ, కవితల్లోనూ, కలల్లోనూ, రాజకీయ నాయకుల ప్రసంగాల్లోనూ  తప్ప ‘మనుగడ’లో మాత్రం కనిపించకపోయేసరికి దిగ్భ్రాంతికి గురయింది. లిబరేషనూ – యీక్వాలిటీ – సొషల్ జస్టిస్ – మొరాలిటీ మొదలైన గంభీరమైన పదాలు ఉపన్యాసాల్లో తప్ప ప్రాక్టికల్‌గా  జీవితంలో వాడబడవనీ, కనబడవనీ గ్రహించింది. అందరిలోనూ, నరనరానా నిండిపోయిన ‘మత్తు’ని అర్ధం చేసుకోవడానికి ఆవిడ చాలానే కష్టపడాల్సొచ్చింది.  ‘ధనం’ మత్తు ఒకడిదైతే ‘పదవి’ మత్తు మరొకడిది. కోటీశ్వరుడి నించి కూలివాడిదాకా ‘ఏదో’ ఒక మత్తు‌కి బానిసలేనని సంపూర్ణంగా అర్ధం చేసుకుంది. కాకా పట్టడం, చెంచాగిరీ చెయ్యడం, అడ్డమైనవాళ్లని అందలమెక్కించడం, మాటల్ని ‘మోసె‌య్యడం, డబ్బున్న, అధికారం వున్న ప్రతివాడి దగ్గరా వెకిలి నవ్వులు నవ్వడం, అదే మనుషులు ‘లేని’ వాళ్ల దగ్గర ‘మృగాల్లా’ ప్రవర్తించడం  చూసి విస్తుపోయింది.

నేటి మానవుడితో పోలిస్తే రాతియుగం మానవుడు ‘కోటి’ రెట్లు గొప్పవాడు. వాడి కష్టాలేవో వాడు పడ్డాడు. అంతేగానీ, వాడు ‘కోర్టు’ల్ని కనిపెట్టలా, పోలీసుల్నీ, లాకప్ డెత్‌ల్నీ కనిపెట్టలా. మంత్రుల్నీ, ప్రజాప్రతినిధుల్నీ, రోగాల్నీ, ఆసుపత్రుల్నీ, వైద్యాల్నీ, వైద్యుల్నీ కూడా కనిపెట్టలా.. ప్రకృతిని ప్రకృతిలా స్వచ్చంగా ఉంచాడు. మనిషి మనిషిగా బతికి మనిషిగా చచ్చాడు. తుపాకుల్నీ, అణుబాంబుల్నీ, అధికారాన్ని కనిపెట్టి సాటివాళ్లని భయపెట్టలా.. ప్రకృతిలో ప్రకృతి సహజంగా లభించే ఆహారాన్ని తను తిన్నాడు. ఇతర్లని ‘తిన’నిచ్చాడు. మరి ఇప్పుడు? దగా, మోసం, కుళ్లు, ద్వేషం,, స్వార్ధం.. మదం.. ఇవన్నీ మనిషికి పర్యాయ పదాలయ్యాయి. ‘తెలిసీ తెలీనివాడ్ని నానా డైరెక్టివ్ ప్రినిసిపల్సూ’ అడ్డుపెట్టుకుని ‘గద్దె’ నెక్కించడం .. “ఇప్పుడు నువ్వు గొప్పవాడివి.. యీ గొప్పదనం ఇలాగే ఉండాలంటే నన్ను కాకాబట్టు.. నాకు మాత్రం భజన చెయ్యి..” అని అదుపులో పెట్టుకుని అధికారాన్ని ‘తెర’చాటు నించి అనుభవించడం. ఇదీ .. ఇప్పటి ‘జ్ఞానుల’ పనే కాదు.. ‘నీతి’ కూడా!!

ఇవన్నీ కొంచెమో గొప్పో అర్ధమయ్యాక మాధవి విచలితురాలయింది. గొర్రెల్లా, పందుల్లా బతుకుతున్న ‘సామాన్యు’ని ఎడ్యుకేట్ చేసి వారిలో ‘చైతన్యం’ తీసుకురావాల్ని నిర్ణయించుకుంది. అదో మహా కార్యమనీ,  తనలాంటి ‘కలం’ పట్టిన వాళ్ల భుజాల మీదే ఆ భారం నిలిచి వుందనీ… ప్రగతి పధం వైపు ‘అడుగులేస్తే ఏదో ఒకనాడు ‘మార్పు’ వచ్చి తీరుతుందని’  విశ్వసించింది. ఆ ఉద్వేగంతో ‘చూసిన నిజాన్ని చూసినట్టుగా’ మరో కలం పేరుతో వ్రాయాలని నిశ్చయించుకుంది. ఆవిడ ప్రస్తుత కలం పేరు ‘జ్యోతి.

పత్రికల్లో అనేక రకాలున్నాయి. కొన్ని పత్రికలూ, టీవీచానల్సూ, కేవలం ‘సంచలన’ వార్తల కోసమే ఎదురుచూస్తాయి. ‘సంచలన వార్తలు’ సర్క్యులేషన్ పెంచుతాయనేది పరమ సత్యం.. అయితే , అసలు సిసలైన  ‘సంచలన వార్త’ ఏదనేది సంపాదకుడి ‘బట్ట తల’ మీద ఆధారపడి వుంటుంది.

‘అమెరికాలో ‘కుక్క’కి చూడముచ్చటైన ‘కోడి’ పుట్టింది’

‘ఫలానా సినిమా తార అయిదో బాయ్‌ఫ్రెండ్ ఎవరూ?’

‘ఫలానా దేశపు ప్రెసిడెంటుకీ, ఆయన సెక్రెటరీకి మధ్య వున్న ‘జింగ్ జింగ్’ తెలుసుకోవాలా? ఆదివారం స్పెషల్ చదవండి.

ఇవీ .. సం.. చలన వార్తలు..

సరే .. ఇవన్నీ చదవడానికి కుతూహలపడేవాళ్లు లక్షమందైతే, తాము చదివింది అందరికీ ‘అర్జంటు’గా వినిపించే రకం పదిలక్షలమంది.

“ఏవండోయ్.. ఈ చిత్రం చూశారా? ఫలానా ఊళ్ళో వేపచెట్టుకి పాలు పడ్డాయిటండీ” అని ఓ అత్యుత్సాహి చెప్పగానే, అర్జంటుగా ఆ వూరు బయల్దేరి, ఆ చెట్టుకి పూజలూ, వ్రతాలూ చేసేవాళ్లు లెక్కకు మించి వుంటారు.

యీ పత్రికలు కళ్లముందు జరిగే ఆకలి చావుల్నీ, మానభంగాల్నీ, దొపిడీలనీ,  దౌర్జన్యాలనీ పట్టించుకోవు. ఎందుకంటే అవన్నీ సమాజానికీ, రౌడీలకీ, రాజకీయనాయకులకీ సంబంధించినవి. తెలిసీ బురదలో రాయి విసరడం దేనికీ? ఇదీ కొన్ని పత్రికల ‘పాలసీ’. మరికొన్ని పత్రికలు భక్తి, వేదాంతాన్నీ టన్నులకొద్దీ ప్రజల మీద గుమ్మరిస్తుంతాయి. ఇవీ ‘పచ్చగానే’ ఉంటాయి. మరికొన్ని పత్రికలు రాజకీయ పార్టీల నీడలో బ్రతికేస్తూ ఉంటాయి. అవి ‘రెండావులదూడ’ల్లాంటివి. అధికార పక్షం నించీ,  ప్రతిపక్షం నించీ కూడా ‘ప్రకటనల్ని’ పెంపు చేసుకుంటాయి.

సరే… చాలా పత్రికలు ‘జ్యోతి’ అనే (అనబడే కలం పేరు గల్గిన) మాధవీరావు రచనల్ని బుట్టదాఖలా చేసినా, ఒక పత్రిక మాత్రం మంచి సపోర్టింగిచ్చింది. ఆ పత్రిక ఎడిటర్‌ నిస్సందేహంగా ప్రజాక్షేమం కోరుకున్నవాడు గనకనూ.. నిజాల్ని మాత్రమే ప్రచురించాలని కంకణం కట్టుకున్నందువల్లనూ, మాధవి రచనలు వెలుగు చూస్తున్నాయి. ఈ విధంగా ప్రేమకథా రచయిత్రి ఫ్రీలాన్సింగ్ జర్నలిస్టుగా మారింది.

మాధవి చేసిన పరకాయ ప్రవేశం కొందరికి ‘కాల్లో ముల్లు’ అయితే మరి కొందరికి ‘కంట్లో నలుసు’, ‘చెవిలో జోరీగ’గా మారింది. ఏమాత్రం రాజకీయానుభవం లేకుండా, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని చూడకుండా, ఎదుటివాడి ‘కెపాసిటీ’ గురించి లేశమాత్రమైనా లెక్కించకుండా, పచ్చి నిజాల్ని పబ్లిక్‌లో బయటపెట్టేస్తే ఎలా? ఎవరైనా ఎంతకాలం సహిస్తారూ? ‘సహించడం’ – ‘సహనం’ అనేది మధ్యతరగతివాడికి మాత్రమే గల జన్మహక్కు. పైవాళ్లూ, కిందవాళ్లూ కూడా సహించరు. ‘సహనం’ అంటే వాళ్లకి ఎలర్జీ. పైవాడు నేర్పుగా తెర వెనక్కి ఉండి చెయ్యాల్సింది చేయిస్తాడు. క్రిందివాడు అప్పటికప్పుడే లెక్కల్ని తేల్చేస్తాడు. మెల్లగా ఓ పెద్ద, చిన్న ఫోన్ కాల్‌తో మాధవికి సపోర్టిచ్చిన పత్రికని క్షణాల్లో మూయించేశాడు. ఆ పత్రిక మూతబడటం మరో పత్రికకి వరమైంది. ఆ పత్రికాధిపతి మందీ మార్బలం ఉన్నవాడు. పుట్టుకతో ధనవంతుడూ. ఆదీగాక ‘నిర్భయుడు’. తనంతట తనే మాధవికి కబురు చేసి ‘రాతలు’ కొనసాగించమన్నాడు. పెద్దలు ఆలోచనలో పడ్డారు. వాళ్లు వెంటనే రియాక్టు కాలేదు. ‘నెమ్మది’ మీద రియాక్టవుదామని నిర్ణయించుకున్నారు. ప్రతికనీ, మాధవినీ కూడా ప్రస్తుతం  ‘అబ్జర్వేషన్’లో ఉంచారు. ఆ ఆలోచన మహా గొప్పది. ఎందుకంటే అటు ప్రెస్‌కి ‘ఫ్రీడం’ ఇచ్చినట్టూ ఉంటుంది. ఇటు పత్రికాధిపతి లొసుగుల్ని కనిపెట్టడానికి ‘టైం’ గైన్ చేసినట్టూ వుంటుంది.  ఇదీ నిజమైన వేటంటే.. యీ వేటాడే పద్ధతే వేరు. ఇది పులి వేటలాంటిది. ‘ఎర’ పెట్టి ఓపిగ్గా ‘ఎదురు’ చూడ్డమే యీ వేటలోని మర్మం. వేటాడేవాడు ‘వేట’ని డైరెక్టుగా చేస్తాడు. ‘వేట’ తనంతట తాను వలలొ పడేట్టు చేస్తాడు.

ఇవన్నీ తెలియని మాధవీరావు జరిగిందేమిటో స్వయంగా తెలుసుకుని ‘వార్త’ రాద్దామని గుడిసెల సిటీలో అడుగెట్టింది.

‘భయం’ అనే బూచి ఇప్పటికే గుడిసెలవాళ్లందర్నీ తన గుప్పిట్లో ఇరికించుకుంది. ఆ ‘భయా’న్ని పోగొట్టుకోవాలంటే ‘తాగాలి’. కానీ ‘తాగా’లంటే ‘భయం’. తాక్కపోయినా భయమే. తాగేశారు. ఫుల్లుగా.. మస్తుగా.. ముక్కుదాకా తాగేసి జనం ‘వాగు’తున్నారు. అయినా ఎందుకో ‘తెలీని’ భయం వాళ్ల గుండెల్లో ఉంది.

‘తెలియని’  దానికి భయపడడం దేవుడికి భయపడటంలాంటిది. దేవుడికి ‘మానవుడు’ కల్పించిన రూపం తప్ప వేరే రూపం లేదు. పాపానికి రూపం ఉందో లేదో తెలీదు. హేతువాదికైనా, వేదాంతికైనా పాపం అంటే భీతి ఉంటూనే ఉంటూంది. మొదటివాడు ఒప్పుకోడు. రెండోవాడు ఒప్పుకుంటాడు. అంతే తేడా!

మిసెస్ మాధవీరావ్ మొదట కలిసింది మొన్న పెళ్లయిన అమ్మాయిని. కొత్త ‘గుడిసె’ సింగారం ఇంకా మాయలేదు. చుట్టూ గోడలమీద అందంగా చారలుగా గీసిన ఇటుకపొడి రంగు చారలూ, సున్నపు చారలూ ఇంకా అతిథుల్ని ఆహ్వానిస్తూనే ఉన్నాయి. రెండ్రోజుల క్రితం కట్టిన  మావిడాకులు పచ్చదనం తగ్గినా కళకళలాడుతూనే ఉన్నాయి. ఆ పిల్ల కాళ్ల పారాణీ, చేతులకి పెట్టుకున్న గోరింటాకూ రంగులీనుతూనే ఉన్నాయి. వాకిట్లో శవం. శవం పక్కన నవవధువు. రొమ్ములు ఎగిరెగిరి పడేట్టు ఏడుస్తూ చచ్చిన మొగుడి కాళ్లని తడుముతూ.. చుట్టాలు పక్కాలూ బిక్కమొహాల్తో వున్నారు.

ఏమని అడగాలి? ఎలా సముదాయించాలీ..? మెల్లగా ఆ పిల్ల పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేసింది. ఆ పిల్లకేమయిందో ఏమో అమాంతం మాధవి ఒళ్ళో పడి ‘అమ్మా’ అని అరిచి మూర్చబోయింది. జీవితంలో ‘తల్లి’ కాలేకపోయినా, ‘తల్లి’లా ఆ పిల్లని కౌగిలించుకుంది  మాధవీరావ్.

 

2 thoughts on “మాయానగరం – 5

Leave a Reply to SHAFI Cancel reply

Your email address will not be published. Required fields are marked *