April 19, 2024

అండమాన్ డైరీ – 6

రచన: దాసరి అమరేంద్ర

            డిగ్లీపూర్‌లో నా ముఖ్య లక్ష్యం రాస్‌ &  స్మిత్‌ ద్వీపాలు.

ఫోటోలు చూసి ఉన్నాను. సయామీస్‌ కవలల్లా ఆ రెండు ద్వీపాలూ ఓ ఇసుక దారితో సంధింపబడి ఉండడం  అక్కడి ముఖ్య ఆకర్షణ. ఆ ద్వీపాలకు వెళ్ళాలంటే ముందు పది కిలోమీటర్లు ఉత్తరాన ఉన్న ఏరియల్‌ బే జెట్టీ చేరుకోవాలి. అక్కడినుంచి మళ్ళా మరపడవలో అరగంట ప్రయాణిస్తే ఆ ద్వీపాలకు చేరుకోవచ్చు. ఆలస్యమయి పోతోందన్న హడావుడిలో దారిలో కనిపిస్తోన్న అండమాన్ల ఏకైక నది కాల్‌పోంగ్‌ని కూడా విస్మరించి పదిగంటల ప్రాంతంలో జెట్టీ చేరుకొన్నాం. కాకపోతే అక్కడ ఇంకా రోజు తెల్లవారలేదు.

‘పదిన్నరకు గానీ ఆఫీసుల వాళ్ళు రారు. ఆ ద్వీపాలకు వెళ్ళడానికి రెగ్యులర్‌గా తిరిగే పడవలంటూ లేవు. ఎవరికి వారు బోటు మాట్లాడుకొని వెళ్ళిరావాలి. ఫారెస్టు వాళ్ళ పర్మిషనూ తీసుకోవాలి. అది కూడా పడవకీ, అందులో ఎక్కే మనుషులకీ కలపి ఒక్కటే పర్మిషను ఇస్తారు’ ఓపిగ్గా వివరించాడు అక్కడి చౌకీదారు!

చేసేదేముందీ… నిరీక్షణ.

ఓ ఇన్నోవాలో మధ్యవయసు బెంగాలీ దంపతులు వచ్చి కలిసారు. మనిషికి మనిషి సాయం. ముగ్గురమున్నా రానూ పోనూ బోటు అంటే మూడు వేలు. ఖర్చు ఎక్కువగదా అని ఆలోచిస్తోంటే మరో ఒరియా ఫామిలీ. వాళ్ళిద్దరు, ఇద్దరు టీనేజి ఆడపిల్లలు వచ్చి కలిసారు. ఈ లోగా ఓ ఫ్రెంచి పెద్దవయసు జంట. అంతా కలసి తొమ్మిది! బోటుకు సరిపడా ప్రయాణీకులు.

SAM_4166

అరగంట ప్రయాణం.. అటూఇటూ ఏవేవో ద్వీపాలు.. అరణ్యాలు.. ఆహ్లాదకరమైన ప్రయాణం. పదకొండు గంటల  ప్రాంతంలో లోతులేని తీరంలో నిర్మలమైన జలాల మధ్య ఆ ద్వీప ద్వయంలో దిగాం.

ఎటు చూసినా నీళ్ళే.. తెల్లని ఇసుకే… పచ్చని చెట్లే.. మా పదిమందిమీ, మరో పడవలో అపుడే దిగుతోన్న మరో పది మందీ ` ఆనాటికి ఆ ద్వీపాలకు మా ఇరవై మందిమే అతిధులం. రాస్‌ ద్వీపంలో స్నానాలకూ నీళ్ళల్లో ఆటలకూ అనువుగా ఉన్న సముద్రం, కొంచెం లోపల మాలాంటి వాళ్ళ  కోసం నేలకు ఇరవై అడుగుల ఎత్తున వెదురుతో నిర్మించిన పిక్నిక్‌ హట్‌లు.. ఆ ద్వీపానికీ పక్కనున్న స్మిత్‌ ద్వీపానికీ మధ్య నున్న ‘ఇసుక వంతెన’.. పోటు నీళ్ళు వచ్చి ఆ వంతెనను ముంచెత్తితే చూద్దామన్న తాపత్రయం.. మా బోటుమేట్లతో కలసిన తాత్కాలిక స్నేహాలు… మరో బోటులో వచ్చిన వారితో కబుర్లు.. ఓ గంట తెలియకుండా గడిచిపోయింది. ఆ రెండు ద్వీపాలూ ఎంతో సుందరంగా ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత అందమైన ద్వీపాల్లో ఇవీ ఉన్నాయట. ప్రపంచం సంగతి తెలియదు గానీ నేను చూసిన చక్కని ప్రదేశాల్లో ఇవి ఎన్నదగ్గవి.

రెండో బోటు పూర్తిగా ఓ కుటుంబానికే చెందినది. అంతా కలసి ఆరుగురు. నలుగురు ఢిల్లీ మనుషులు. మిగిలిన ఇద్దరూ డిగ్లీపూర్‌లో పనిచేస్తోన్న ఓ నావీ అధికారీ, అతని భార్యా. మాటల మధ్య నేను భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ మనిషినని తెలుసుకొని ఆ నావీ అధికారి ‘‘మీ ఆఫీసరొకాయన పోయినేడాది ఏదో ప్రాజెక్టు విషయంలో డిగ్లీపూర్‌ వచ్చాడు. హఠాత్తుగా గుండెపోటు. ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాం. ఇప్పటికీ అయ్యో అనిపిస్తూ ఉంటుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘ఎవరూ ` గురురాజా’ అని అడిగాను ` గుండె లయ తప్పుతోండగా! అవును. అతనే. ఏడేళ్ళ క్రితం బెంగుళూరులో మా టీమ్‌లోనే ఉండే వాడు. నాకన్నా అయిదారేళ్ళు చిన్న. మంచివాడు. నవ్వు మొహం. నమ్మకస్తుడు. ‘హఠాత్తుగా అండమాన్ల ఏదో మారుమూల ప్రాంతంలో గుండెపోటుతో పోయాడు’ అని కొలీగ్స్‌ ఏడాది క్రితం చెప్పిన మాట నిజం. ఆ మారు మూల, ఈ డిగ్లీపూర్‌ అన్నమాట. ప్రపంచం ఎంత చిన్నదీ!!

మరో గంట ఆ రెండు ద్వీపాలనూ తిరుగాడుతూ, మేం తెచ్చుకొన్న ఫలహారాలను కలగలపి పంచుకొని తింటూ, కబుర్లు చెప్పుకొంటూ ` అలా తాపీగా నీటి ఒడ్డున పచ్చార్లు చేస్తోంటే సముద్ర మధ్యం లోంచి ఈదుకొంటూ వస్తోన్న ఓ తెల్లజంట కనిపించింది. వాళ్ళు ఒడ్డు చేరీ చేరకుండానే పలకరించి ‘ఏ దేశమూ?’ అని అడిగాను. ‘జర్మనీ’ అన్నాడు. ‘ఎన్ని రోజులు పట్టిందీ ఈదుకొంటూ రావడానికీ’ అని నా చమత్కారం! అతనికి అర్ధంగాలేదు. ‘రోజులేమిటీ? గంటన్నర’ అన్నాడు. ‘జర్మనీ అంటున్నావు. అంత దూరం నుంచి గంటన్నరలో ఎలా వచ్చేసావూ?’ జోకు కొనసాగించాను. ఈ సారి పేలింది. ‘బావుంది బాసునీ జోకు.. జర్మనీ నుంచి గాదులే. అల్లదిగో ఆ దూరాన కనపడుతోందే కొండ చెరియ.. అక్కడ దిగాం నీళ్ళలో.. చల్లని నీళ్ళలో… చక్కని ఈత.. ఏదేమైనా నీ జోకు బ్రహ్మాండంగా ఉందనుకో’ అని మాట కలిపాడు ఆ జర్మనీ యువకుడు.

SAM_4183 SAM_4188SAM_4190

ద్విదీప యాత్ర ముగించుకొని జెట్టీ చేరే సరికి రెండయిపోయింది.

‘పద క్రిష్ణా సాడిల్‌ పీక్‌కు’ అన్నాను.

‘కష్టం సార్‌. రెండయిపోయింది. నాకూ దారి అంత బాగా తెలియదు. కనీసం ఓ గంట పడుతుంది చేరడానికి. మళ్ళా మరో గంట ట్రెక్కింగట కొండ ఎక్కడానికి. ఇదంతా పెట్టుకొంటే ఇక్కడే చీకటి పడిపోతుంది. వదిలేద్దాం’ అన్నాడు.

నిజమే. అతను చెప్పినది నిజమే. టైము సమస్యే!

అయినా ప్రాణం ఘోరంగా ఉసూరు మంది. ప్రపంచపు ఎవరెస్టు ఎలానూ ఎక్కలేను. కనీసం అండమాన్ల అత్యున్నత శిఖరమైనా ఎక్కుదామని ముచ్చటపడ్డాను. అది కాస్తా బెడిసికొడుతోంది. చేసేదేముందీ!!

‘‘పోనీ ఓ పని చేద్దాం సార్‌.. మాయా బందర్‌ శివార్లలో ‘కరమ్‌టాంగ్‌’ అన్న బీచి ఉంది. సముద్రపు తాబేళ్ళు సీజన్లో ఒడ్డుకు వచ్చి గుడ్లు పెడతాయి. ఇది సీజను. అక్కడికి తీసుకువెళతా’’ ఓదార్చాడు కృష్ణ.

తిరుగు ప్రయాణం. నీళ్ళు తక్కువగా ఉన్న కాల్‌పోంగ్‌ నది దగ్గర కాసేపు. అండమాన్ల ఏకైక జల విద్యుత్‌ కేంద్రం ఈనది మీదే ఉందట. సాడిల్‌పీక్‌ కొండల్లో దీని పుట్టుక. పాతిక ఇరవై కిలోమీటర్లు ప్రవహించి ` సాగర సంగమం. మళ్ళా డిగ్లీపూర్‌ ఊళ్ళో.. నడిబొడ్డున 2008లో నిర్మించిన డాల్ఫిన్‌ ఫౌంటైన్‌, ఊరుదాటి సాగిపోగా శివార్లలో శివపురం, నవగ్రామం, నిశ్చిత్‌పూర్‌, కాళీఘాట్‌, జగన్నాధడేరా ` అన్నీ ఏదో శరత్‌ నవలల్లో కనిపించే ఊళ్ళలా అనిపించాయి. అవి దాటుకొని గంటా గంటన్నర సాగగా ` ఆస్టిన్‌ జలసంధి.

SAM_4193

మధ్య అండమాన్‌ ద్వీపాన్నీ, ఉత్తర అండమాన్‌ ద్వీపాన్నీ కలిపే (విడదీసే) జలసంధి ఇది. దక్షిణ అండమాన్‌, మధ్య అండమాన్ల మధ్య ఉన్న జలసంధుల్ని ఒకటికి రెండు సార్లు ` బస్సుతో సహా ` ఫెర్రీలో దాటవలసి వచ్చింది. మార్గాంతరం లేదు. ఇక్కడ మాత్రం ఆ జలసంధి మీద సుమారు వంద మీటర్ల పొడవున్న వంతెన కట్టారు. 2003లో ఆవిష్కరణ జరిగిందట. ఆవిష్కరణ సందర్భంగానో, ఆ తర్వాత ఆరునెలల్లోనే వచ్చిన సునామీలో దెబ్బతినడం వల్లనో ` ఆ రోజుల్లో ఈ వంతెన బాగా వార్తల్లోకి ఎక్కిన గుర్తుంది. ఏదేమైనా ఆ వంతెనా, దిగువన నీళ్ళూ, అటూ ఇటూ అడవులూ ` చక్కని ప్రదేశమది. ఓ పావుగంట. పదిహేను ఇరవై ఫోటోలు..

SAM_4204

మాయాబందర్‌ పది కిలోమీటర్లలో ఉందనగా దారి మళ్ళి మూడు నాలుగు కిలోమీటర్లు వెళితే వస్తుంది కరమ్‌టాంగ్‌ బీచ్‌. ఏడాది క్రితమే ఆ బీచ్‌ను ఎకోపార్క్‌గా డెవలప్‌ చేసారట. ఆ కొత్త దనపు చిహ్నాలు పుష్కలంగా కనిపించాయి. పైగా మా కృష్ణకి ఈ మాయాబందర్‌ ప్రాంతపు బీచి అంటే సొంత ఇలాకా కిందే లెక్క. గబగబా వెళ్ళి ఆ ప్రదేశపు ఫార్మాలిటీలు ముగించి ‘రండిసార్‌’ అంటూ తిన్నగా తాబేళ్ళ శిబిరాలకు తీసుకెళ్ళాడు.

బీచ్‌లో సముద్రపు నీళ్ళకు దూరంగా, చెట్టూ చేమలకు చేరువలో ఓ అరడజను శిబిరాలు నిర్మించారు. వాటి చుట్టూ నాలుగడుగులు ఎత్తు చెక్కగోడలు. గేటు, తాళం. ఒక్కో శిబిరంలో నాలుగయిదు ఇసుకలో పాతిన బోర్డులు. ఆ బోర్డుల్లో అక్కడక్కడ తాబేళ్ళు ఏయే రోజున ఎన్నెన్ని గుడ్లు పెట్టాయో ` ఆ వివరాలు. అదో ఆసక్తికర ప్రపంచం. కనిపించకుండా ఇసుకలో ఉండిపోయిన వందలాది గుడ్లను పలకరిస్తూ, ఆ బీచ్‌ పొడవునా ఓ అరగంట నడుస్తూ.. అక్కడో గంట. మామూలే. యాత్రికులు దాదాపు లేనేలేరు. ఒకటీ అరా విదేశీయులు తప్పిస్తే.

SAM_4215

తీరిగ్గా అస్తమిస్తోన్న సూర్యుడ్ని ఫోటోలు తీసుకొంటూ, రాళ్ళూ రప్పలతో నిండిన సముద్ర తీరాలను పలకరిస్తూ గదికి చేరేసరికి ఆరుదాటింది. చీకటి మొదలయింది. రిసెప్షనావిడ పలకరించింది. ‘‘ఒట్టి పలకరింపులేనా? టీ తాగించవూ?’’ చనువు తీసుకొని అడిగేసాను. ఫలించింది. సంతోషంగా ఒప్పుకొంది. ‘ఇక్కడ గాదు ` మా ఇంట్లో. నేనే పెట్టి ఇస్తాను. ఏడిరటికి మా ఇంటికిరా’ అని ఆహ్వానించింది. ఏనుగెక్కిన సంబరం.

చెప్పులు క్రిందే వదిలి చెక్క మెట్లు ఎక్కి వెళ్ళాను. గొప్ప ‘ఆశ్చర్యం’ నాకోసం ఎదురు చూస్తూ కనిపించింది. అదో విలక్షణమైన ఇల్లు. గదులు లేవు. గదుల మధ్య గోడలు లేనే లేవు. రెండో అంతస్థులో ఏడెనిమిది వందల చదరపుటడుగుల స్థలంలో చుట్టూ గోడ మాత్రం కట్టారు. అంతా కలసి ఓ నలుచదరపు స్థలం. అందులో ఫర్నీచరూ బీరువాల సాయంతో అవసరమైనంత వరకూ సిటింగ్‌ ఏరియా, డైనింగ్‌ ఏరియా, వంటగది, పడకగది అంటూ వేరు వేరు ప్రదేశాలు సృష్టించారు. తమ అభిరుచి ప్రకారం ` కొంచెం ముదురు రంగులలోనే ఇల్లంతా  కళాత్మక అలంకరణ. ‘ఇది నా కలల ఇల్లు. రెండేళ్ళ క్రితమే ఈ మేడ మీది ఖాళీ స్థలాన్ని ఇలా ఇల్లులా చేసుకొన్నాం. గోడల్లేని ఇల్లన్నది నేను చిన్నప్పట్నించీ కోరుకొన్న సంపద’ వివరించిందావిడ. ‘మీ ఆయన ఎక్కడా!’ అడిగాను. పోర్ట్‌బ్లెయిర్‌ వెళ్ళాడట. లేటుగా వస్తాడు. కబుర్లు సాగాయి. ‘మీది అసలు ఏ ప్రాంతమూ? ఏ భాషా?’, అడిగాను. తటపటాయించింది. ‘మా అమ్మ తమిళియన్‌. నాన్న హిందీ మనిషి. మళ్ళా మానాయనమ్మ ఇక్కడి తెగలకు చెందిన మనిషి. ఏజాతి అని చెప్పనూ?’ అందావిడ. అసలా ప్రశ్న అడగకుండానే ఉండాలనిపించింది. ‘‘ఏదేమైనా నాకంటూ ఒక ఉనికి లేకపోవడమే మంచిదనిపిస్తోంది. వీళ్ళే నా వాళ్ళు అనుకోకుండా ఎవరైనా నా మనుషులే అనుకొనే అవకాశం నాకు చక్కగా అమరింది కదా’’ అన్నారావిడ సర్దుకొని. మంచి భావధోరణి. అసలా మానసిక పరిపక్వత లేకపోతే నాలాంటి అపరిచిత పరదేశిని ఆ సమయంలో అతిధిగా ఆహ్వానించగలదా? అన్నట్టు ఆవిడ పేరు రాఖీ. సందర్భానికి సరిగ్గా సరిపోయినపేరు!!

SAM_4243

ఏడున్నరకు మళ్ళా ఊళ్ళో ప్రవేశించి తెలిసిన దారులలోనే ఓ గంట సేపు నడక. మూడు మందిరాలకూ మరోసారీ మరోసారీ వెళ్ళాను. అందరూ పరిచయంగా పలకరించారు. నిన్న హోటలు పరిచయం చేసిన పాపన్న కనిపించాడు. ఓ చిరు కాంట్రాక్టరతను. నడివయసు. కలిసి ఓ అరగంట తిరిగాం. మళ్ళా ఇద్దరం ఆ తమిళ పెద్దావిడ హోటలుకే వెళ్ళాం. తిరిగి గది  చేరేసరికి గంట పది కొట్టేసింది.

ఒక్కసారి డిగ్లీపూర్‌ ట్రిప్పు సింహావలోకనం చేసుకొన్నా.

నా అలవాటు ప్రకారం ఉన్న రెండు రోజుల్నీ సద్వినియోగం చేసుకోలేకపోయాననిపించింది. అసలు నిన్న మాయాబందర్లో ఆగకుండా తిన్నగా డిగ్లీపూర్‌ వెళ్ళి, ఈ రోజంతా అక్కడే గడిపి ఏ శిఖరమూ విడిచి పెట్టకుండా క్షుణ్ణంగా ఆ ప్రదేశమంతా తిరిగితే బావుండేది గాదూ?! నిజమేననిపించింది.

కానీ నాది కాలు నిలవని మనస్తత్వం. క్షుణ్ణంగా తిరగడం అన్నది నా ఒంటికి పడదు. రోలింగ్‌ స్టోన్‌గానైనా సరే అన్ని తిరిగెయ్యాలన్న ఆబ! ఏదేమైనా మాయాబందరు వదిలిపెట్టినట్లయితే అవిస్‌ ద్వీపం? శ్రీకాకుళం తెలుగువాళ్ళు?. హేమంత్‌కుమార్‌ భక్తిగీతాలు? రాఖీతో టీ తాగడం? తమిళ మనిషి హోటలు? గుడ్లు పెట్టే సముద్రపు తాబేళ్ళు? మూడు మందిరాలు? విజయన్‌? మణి? క్రిష్ణ? ` వీటిల్ని వింతలూ విశేషాల దర్శనపు త్రాసులో పెట్టి తూచగలమా? అది సాధ్యమా? అసలది సమంజసమేనా?

* * * * *

ఎవరో గ్రీకు రాకుమారుడు నిశ్చల తటాకంలో తన నీడను చూసుకొని, ఎవరో అనుకొని, ఆ రూపంతో ప్రేమలో పడిపోయాడట. అలా స్వీయానురాగ బద్ధులవడాన్ని నార్సిసిజం అంటారు. నా రూపానికి ` ఈ నాటి భాషలో చెప్పాలంటే ` అంత సీను లేదు గానీ అడపాదడపా నేనే తీసిన ఫోటోలతో నేను ప్రేమలో పడిపోవడం కద్దు.

ఊరు బావుంది. వాతావరణం బావుంది. ఆకాశంలో మరీ దట్టంగా గాకుండా మేఘాలు.. చిన్న చిన్న గుట్టలెలానూ ఉన్నాయి. అద్భుత సూర్యోదయానికి అత్యద్భుత వేదిక అని స్ఫురించింది. మరి ఆ దృశ్యాన్ని మనసులో నింపుకోవడానికి ఏ చోటు సరి అయినదీ? మొన్న మధ్యాహ్నం నిరాశ మిగిల్చిన పిడబ్ల్యూడీ గెస్ట్‌హౌస్‌!!! తెరచి ఉంటుందా ఇంత ఉదయం?! ప్రయత్నిస్తే తప్పేముందీ?!

అయిదుంబావు కల్లా బయట పడ్డాను. మరో పది నిముషాల్లో ఆ గెస్టుహౌస్‌. ఏ చౌకీదారో ఉండి ‘ఏం పనీ?’ అని ప్రశ్నిస్తాడనుకొన్నాను. లేడు. బయటి బడా గేటు కూడా తాళం లేకుండా ఉంది. మెల్లగా ట్రెస్‌ పాస్‌!! వెళ్ళి వెళ్ళి అతిధుల కోసం ముఖ్య భవనానికి కాస్తంత పెడగా, సముద్రానికి సరిగ్గా ‘పైన’, ఎదురుగా చక్కని దృశ్యం కనిపించేలా ` ఓ చిరు, గోడల్లేని, కుటీరం.. అందులో నే ఒక్కడినీ ` సూర్యుడ్ని పట్టుకోవడం కోసం మాటు వేసి..

అరుణ కాంతి. వెలుగు రేకలు. మెల్లగా మెల్లమెల్లగా దిగువన సరస్సులా ప్రశాంతంగా ఉన్న సముద్రమంతా పరచుకొన్న మంద్రపు అరుణవర్ణం. ఆకాశమూ ఎరుపు ` సముద్రమూ ఎరుపు. మధ్యలో నుదిటి బొట్టులా దూరాన ఎవిస్‌ద్వీపం. ఉండుండి ఆ చివరి నుంచి ఈ చివరికి ఎగురుతూ ఏదో ఒంటరిపక్షి. అలాగే సాగిపోయిన ఓ మరపడవ. కొంచెం కెమెరాను ఉత్తరానికి మళ్ళించగా అతి చక్కని ఉక్కు రంగు సముద్రం. సముద్రంలో మబ్బుల నీడలు. ఫోటోలకు ఫ్రేముల్లాగా చెట్ల ఆకులు. ఒకటికి మరొకటి పడవలు. పురిటి నొప్పులపుడమిలోంచి తల బయట పెట్టే ప్రయత్నం చేస్తోన్న సూరీడు. అడ్డుకొంటోన్న మేఘాలు. అరచేత్తో సూర్యోదయం ఆపగలమా? చీల్చుకొని బయట పడిన ఇనబింబం.. రెండున్నర నిముషాల్లో పూర్తి చెక్రం. ఆ క్షణాలను విడిచి పెట్టడండా పట్టుకోవాలని కెమెరా విశ్వ ప్రయత్నం. ఆ పదిహేను నిముషాల్లో ఏభైకి పైగా క్లిక్కులు.. వాటిల్లోంచి బయట పడి పక్కన చూస్తే ఆ కుటీరంలో నాతో పాటు మరో పెద్ద వయసు దంపతులు.

SAM_4249 SAM_4261 SAM_4283 SAM_4285

ఏమని వర్ణించను  ఆ ఉదయపు నా సంతోషాన్నీ?! కష్టం!!

భారంగా వెనక్కితిరిగాను. ఆరయింది. ఏడున్నరకు పోర్ట్‌బ్లెయిర్‌ బస్సు.. ఇంకా గంటన్నర సమయముంది. మెల్లగా ఊళ్ళో తెలిసిన ప్రదేశాల పరామర్శ..వరలక్ష్మిగారు ఆవిష్కరించినట్టు తెలిపే శిలాఫలకమున్న క్రీడల మైదానం.. ముందుకు వెళితే సముద్ర దృశ్యం.. మెల్లగా మేలుకొంటోన్న ఊరు..టీ దుకాణాలు.. పచారీ కొట్లు.. అంతగా ఆకలి లేకపోయినా నిన్న డిన్నరు చేసిన చిన్న హోటలు తెరచి ఉండడం గమనించి వెళ్ళి కూర్చున్నాను. ‘ఓ పావుగంట పడుతుంది ఇడ్లీలు రడీ అవడానికి. ఉండగలవా?’ ప్రశ్న. ‘సంతోషంగా’ జవాబు. ఉన్నంతలో నీట్‌గా అమర్చి ఉన్న వంట పాత్రలు, గ్యాసు పొయ్యి. ‘‘మా ఆయన తాగితాగి పోయాడు. నలుగురు పిల్లలు. నాకు చదువులేదు. అంచేత ఇది మొదలెట్టాను. ఊళ్ళో వాళ్ళు సహాయం చేసారు. పదేళ్ళయింది. ఇబ్బందులు పడ్డ మాటనిజం. పిల్లలు పెద్దాళ్ళయ్యారు. పెద్దమ్మాయి పెళ్ళయింది. రెండో వాడు కొడుకు. పోర్ట్‌బ్లెయిర్‌లో ఏదో పని. తన పొట్టకు సరిపోతుంది. ఇంకా ఇద్దరు పిల్లలు స్కూలు చదువుల్లోనే ఉన్నారు. బాగా చదివించాలని కోరిక. పర్లేదు. బతుకు బాగానే సాగిపోతోంది’.. కొంచెం మాటల్లో పెట్టగా మనసు విప్పి కష్ట సుఖాలు చెప్పిందావిడ. చదువులేకపోయినా సామర్ధ్యం ఉన్న మంచి  మనిషి. బతుకు భయంలేని మనిషి. ప్రపంచం మీద నమ్మకం  ఉన్న మనిషి. మరి బతుకు బాగా సాగడంలో ఆశ్చర్యమేముంది?

SAM_4290

ఈలోగా కుశలమడగడానికీ వీడ్కోలు పలకడానికీ నన్ను వెదుక్కుంటూ విజయన్‌ వచ్చాడు. హోటల్లో లేకపోతే నావాలకం పసిగట్టి ఇలా రోడ్ల మీద ఉంటానని ఊహించి వెదుకుతున్నాడు. అతనికి ఈ హోటలావిడ బాగా పరిచయం. పరస్పర గౌరవం వారిది. ముగ్గురం కాసేపు కబుర్లాడి, టీ తాగి విడివడ్డాం. దారిలో అపర వివేకానందుడిలా ఓ పెద్ద మనిషి. ‘సంఫ్‌ు పరివార్‌’ వారు ధర్మ ప్రచారానికి అండమాన్లు పంపిన బృందపు మనిషట!

SAM_4293

ఏడున్నరకు బస్సు బయల్దేరింది.

ప్రకాష్‌కు ఫోన్‌ చేసాను.

‘ఓ రిక్వెస్టు. మొన్న లక్ష్మి పుట్టినరోజయితే ఇవాళ నాది. అరవైలో అడుగుపెడుతున్నా. ఊళ్ళోకి వెళ్ళడం గాదు గానీ, మీ అందరూ రండి. మీ మెస్‌లోనే తీరిగ్గా డిన్నరు చేద్దాం’ అన్నాను. ఓ క్షణం ఆగి ‘ఓ! అలాగే. కానీ ఓ మాట చెప్పండి. బస్సు బయల్దేరిందన్నారు గాబట్టి రెండిరటి కల్లా మీరు ఇంటికి చేరతారు. ఓపిక ఉందా? స్క్యూబా డైవింగ్‌కు ఈ రోజే రాగలరా? దానికో నాలుగు గంటలు పడుతుంది మరి’’ అన్నాడు.

ఎగిరి గంతెయ్యడమే తరువాయి.

ఓపికా, శక్తీ ` పూర్తిగా శరీరానికే సంబంధించినవి గావు గదా.. ఆసక్తికి కూడా సంబంధించినవి. ఇష్టమైన పని అయితే అలుపూ ఆయాసం లేకుండా ఎంతసేపైనా చేస్తాం గదా.

‘రైఠో అలాగే చేద్దాం. మూడు మూడున్నరకు బయల్దేరితే సరిపోతుంది గదా. రాగానే వెళిపోదాం’ మళ్ళీ అతను ఎక్కడ మనసు మార్చుకుంటాడో అని గబగబా అనేసాను.

‘స్క్యూబా’ అన్నది ‘నీళ్ళలో శ్వాసించడానికి ఉపయోగపడే పరికరం’ అన్న ఇంగ్లీషు మాటకు హ్రస్వరూపం. నీళ్ళ లోపలికి చేరుకొన్న వాళ్ళు ఆ పరికరం సాయంతో ‘మామూలుగా’ ఊపిరి పీల్చుకోగలుగుతారన్నమాట. లోపలికి మనం తీసుకువెళ్ళే గాలి పరిమాణం బట్టి ఊపిరి కోసం బయటకు రాకుండా చాలాసేపు లోపలే తిరుగాడే అవకాశముంటుంది. పీల్చుకోడానికి గాలి సిలెండరు, నీళ్ళలోపలే ఉండిపోడానికి సీసపు పలకల బరువులు అమర్చిన లైఫ్‌ జాకెట్టూ, జలచరాలూ ఇత్యాదుల నుంచి రక్షణ కోసం వంటికి అతుక్కొని ఉండే రబ్బరు తొడుగు, కాళ్ళకు పెద్ద పెద్ద ఫిన్‌లు, మొహానికి మాస్కు. ఇదీ సగటు స్క్యూబా డైవరు స్వరూపం. ఇదీ ఆనాడు సాయంత్రం నాలుగున్నర సమయంలో నా స్వీయ స్వరూపం.

దక్షిణ అండమాన్‌ ద్వీపపు అట్టడుగు ప్రదేశం ` చిడియాతపు. పోర్ట్‌బ్లెయిర్‌ నుంచి పాతిక కిలోమీటర్లు. నేను, ప్రకాష్‌, మరో ముగ్గురు స్నేహితులు, ఇద్దరు సహాయకులు, ఒక ఇన్‌స్ట్రక్టరు ` ఇదీ ఆనాటి మా బృందం. చిడియాతపు నుంచి మళ్ళా బోటులో మరో పదినిముషాలు వెళితే డైవింగ్‌ చేసే ప్రదేశం`కరప్షన్‌ రాక్‌ వస్తుంది. ఒక్కరొక్కరంగా అందరం తలా ఓ పదినిముషాలు డైవింగ్‌ చేసాం.

ఇన్‌స్ట్రక్టర్‌ ముందే వివరంగా చెప్పాడు. ‘‘లోతుకు వెళ్ళిన కొద్దీ మన మీద నీటి వత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా చెవులు నొప్పి పుడతాయి. ఆ నొప్పి నుంచి తప్పించుకోవాలంటే ఓ పద్ధతి ప్రకారం మన చెవుల ద్వారా నిశ్వసించాలి. ఈ జాగ్రత్త తీసుకొటే డైవింగ్‌ను బాగా ఎంజాయ్‌ చెయ్యవచ్చు’’. అతను ఆ నిశ్వసించడం ఎలాగో చేసి చూపించాడు కూడానూ.

బోటులోంచి మెల్లగా జారి బుడుంగున నీళ్ళలోకి వెళ్ళిపోయాను. పదిహేను ఇరవై అడుగులు దిగి ఉంటాను. సముద్రపు అడుగు కనిపించింది. అక్కడి రాళ్ళు, కోరళ్ళు, చేపలు ` సహ డ్రైవరు, మా ఇద్దరినీ నిర్దేశిస్తోన్న ఇన్‌స్ట్రక్టరు.. అన్నట్టు మనంతట మనం ఇష్టం వచ్చినట్టు గభాలున నీటి ఉపరితలం మీదకు రాలేం, లైఫ్‌ జాకెట్‌లో సీసపు పలకల బరువు ఉందిగదా. మనం తేలడమూ, మునగడమూ అంతా ఇన్‌స్ట్రక్టర్‌ చేతిలో ఉందన్నమాట.. రంగురంగుల చేపలు, ఇంకా ఆసక్తికరమైన కోరళ్ళు, డ్రైవింగ్‌ చేసేస్తున్నామన్న థ్రిల్లు ` అంతా బావుంది కానీ వీటన్నిటినీ ‘చెవిలో నొప్పి’ అధిగమించేసింది! చెవులతో నిశ్వసించడంలో ఘోరంగా విఫలమయ్యాను. అతికష్టం మీద, బలవంతంగా నొప్పిని భరిస్తూ ఆ పదినిముషాలు గడిపాను. బయటకు వచ్చాక బతుకు జీవుగా అనుకొన్నాను. అరుదైన, అమూల్యమైన డైవింగ్‌ అవకాశాన్ని అలా అక్షరాలా నీరు కార్చేసానన్నమాట!!

డిన్నరు అందరూ కలసి చేద్దామనుకొన్నది చివరికి నేనూ ప్రకాషే అయ్యాం.

‘బాబుకు రేపు పరీక్ష.. శాంతి వచ్చే పరిస్థితి లేదు..’

ఒక రకంగా మంచిదే అయింది.

ఇప్పటికి అయిదారేళ్ళుగా నాలుగయిదు సార్లు కలుసుకొన్న మాట నిజమే. కానీ అదంతా ‘సామూహిక కలయిక’. అందరం కలుసుకోవడం, అందర్లో కలుసుకోవడం కబుర్లు చెప్పుకోవడం, సరదాగా ఆయా ప్రదేశాలు చూడడం. అంతే లోతుగా మాటలు చెప్పుకొనే అవకాశం ఇప్పటిదాకా రానేలేదు. ఈ రోజు ఆ సందర్భం.

ప్రకాష్‌ కోరుకొండ సైనిక్‌ స్కూలు విద్యార్ధి. పూనాలో  ఉన్న ప్రతిష్టాకరమైన ‘నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ’లో చదివిన మనిషి. కావాలని నావీ ఎన్నుకొన్నాడు. దాదాపు ఇరవై సంవత్సరాల డిఫెన్సు జీవితం. ‘చిన్నప్పటినుంచీ ` మా ఊళ్ళో ఓ పెద్దాయన ప్రేరణ పుణ్యమా అని ` డిఫెన్సు సర్వీసే కోరుకున్నా. కష్టమే అయినా అది సాధించుకోగలిగాను. ఈ ఇరవై ఏళ్ళూ నా శాయశక్తులా పనిచేసాను. పనిని ఎంజాయ్‌ చేసాను. సౌకర్యవంతమైన జీవితం. కానీ మా డిఫెన్సులో వడపోత ఎక్కువ. పోటీ విపరీతం. సివిల్‌ ఉద్యోగాలలో లాగా ఓసారి చేరడం, నాలుగయిదేళ్ళ తర్వాత మరో ఉద్యోగంలోకి జంప్‌ చెయ్యడం ` ఇక్కడ ఉండదు. అంచేత ఎన్నికైన మెరికలంతా జీవితాంతం పోటీ పడుతూనే ఉంటారు. అందులో మంచి ప్రతిభావంతులైనా వెనకబడిపోవచ్చు. అది ఇక్కడి జీవనసూత్రం. ఒకసారి వెనక పడిపోతే, ప్రమోషను మిస్సయితే ఇంకా సర్వీసులో కొనసాగడం మర్యాదకు విరుద్ధం. అది నాకూ ఎపుడో ఓ సారి జరుగుతుంది. బయటకు వస్తాను. అందుకు సిద్ధపడే ఉన్నాను…’ ఏ ఉద్వేగాలూ లేకుండా చెప్పుకొచ్చాడు. దిగులూ భయమూ లేనే లేవు… పరిపక్వత ఉన్న మనిషి! వ్యవస్థ మీద ఏ రకమైన ఫిర్యాదులూ లేకపోగా మంచి గౌరవం ఉన్న మనిషి. ఇలాంటి వాళ్ళకు ఏనాడూ బతుకు భయం ఉండదు!

‘‘మీకు ఎల్లుండి హేవలాక్‌కు టికెట్లు తీసుకొన్నాను. మొన్నట్లానే ఉదయం ఆరుంబావు ఫెర్రీ. మళ్ళా సాయంత్రం నాలుగున్నరకు తిరుగు ప్రయాణం. అంతా కలసి మీకు అక్కడ ఎనిమిది గంటలుంటాయి. అలాగే పదిహేడో తారీఖున ‘వాండూర్‌’ కూడా బుక్‌ చేసాను. అదో ఫుల్‌ డే ప్రోగ్రాం. అన్నట్టు మేమంతా పదిహేడు ఉదయం హైదరాబాదు వెళుతున్నాం. ముందు మీతోపాటే ఆదివారం పద్దెనిమిదిన అనుకొన్నాం గానీ అనుకోని పరిస్థితిలో ఓ రోజు ముందు వెళ్ళవలసి వస్తోంది. మీరు ఇప్పటికే అండమాన్‌ వాసులయిపోయారు. ఇబ్బంది పడరని తెలుసు. మా గెస్టుహౌసు వదిలేసి ఇంటికొచ్చెయ్యండి. కారూ, స్కూటరూ ఉంటాయి. మీ ఇష్టం. ఆదివారం ఉదయం మిమ్మల్ని ఎయిర్‌ పోర్టులో డ్రాప్‌ చెయ్యడానికి మొన్న వచ్చిన డ్రైవర్నే రమ్మన్నాను. నమ్మకస్తుడు. చెప్పిన సమయానికి వస్తాడు’’… ప్రణాళికాబద్ధత అసలు డిఫెన్సు జీవితంలోనే ఉంది. అందులో ప్రకాష్‌ మరీ నిష్ణాతుడు.

రేపటి మౌంట్‌ హారియట్‌ యాత్ర గురించి ప్రకాష్‌ దగ్గర కొన్ని సూచనలు తీసుకొన్నాను. రేపు నేను వెళ్ళేది టూరిస్టుగా గాదు. దాదాపు ఐలాండర్‌ ` అండమాన్‌ ద్వీపవాసిగా! ఆ పడవలు, ఆ ఏర్పాట్లు, ఆ రేట్లు ` అవి వేరు. అసలు మెయిన్‌ లాండ్‌ నుంచి అండమాన్‌ వరకూ విమానమూ ఓడల ఛార్జీల నుంచి, ద్వీపాల మధ్య హెలికాఫ్టరూ ఫెర్రీల ఛార్జీల వరకూ టూరిస్టులకొక రేటు, అక్కడ నివసించే వాళ్ళకు మరో రేటు. అందులో ప్రకాష్‌లాగా తాత్కాలిక శాశ్వత నివాసులూ ఈ తక్కువ రేట్లకు అర్హులే..

* * * * *

మార్చి పదిహేనున నా లక్ష్యం దక్షిణ అండమాన్‌ ద్వీపపు శిఖరం ` మౌంట్‌ హారియట్‌ చేరడం.. అక్కడ అడవీ, ట్రిక్కెంగు మార్గమూ ఉన్నాయట. వాటినో చూపు చూడడం.. ఇంకా సమయం మిగిలితే ఊరి బజార్లలోనూ, రెస్టారెంట్లలోనూ, జన సామాన్యం మధ్యా రెండు మూడు గంటలు గడపడం.. నేనూ, నా ఏక్టివా, పోర్టుబ్లెయిరూ, అంతే! అమరేంద్రాస్‌ డే అవుట్‌…

మౌంట్‌ హారియట్‌ వెళ్ళడానికి రెండు మార్గాలున్నాయి. భూ మార్గం, జల మార్గం. పోర్ట్‌బ్లెయిర్‌లో బయల్దేరి ‘ది గ్రేట్‌ అండమాన్‌ ట్రంక్‌ రోడ్‌’ పట్టుకొని, ఫెరార్‌ గంజ్‌ వరకూ వెళ్ళి, కుడివేపుకు మళ్ళి, ఆలీపూర్‌ స్టీవార్ట్‌ గంజ్‌ల మీదుగా మౌంట్‌ హారియట్‌ చేరుకోవడం. ఇది భూమార్గం. ఏభై అరవై కిలోమీటర్లు. ఇది మహాచుట్టుదారి. అలా గాకుండా ఛాటమ్‌ జెట్టీ చేరుకొని, మరపడవలో సముద్రం దాటి బేంబూప్లాట్‌ జెట్టీ అందుకొని, రోడ్డు పట్టుకొని శిఖరం చేరుకోవడం మరో మార్గం. ఇది మహా దగ్గరి దారి. అంతా కలసి పదిహేను కిలోమీటర్లు. ఛాటమ్‌`బేంబూఫ్లాట్‌ జలమార్గంలో మరబోటుల్లో కార్లూ స్కూటర్లను సముద్రం దాటించే సదుపాయం కూడా ఉంది. మరిహనేం! నేను జలమార్గాన్ని ఎన్నుకొన్నాను.

ఋజు మార్గంలో వెళ్ళకుండా ఊరంతా ఓ చెక్కరు గొట్టి ఉదయం ఎనిమిది కల్లా ఛాటమ్‌ జెట్టీ చేరుకొన్నాను. ప్రయాణీకులు అందరూ ఆ ఊరి నివాసులే. పనీ పాటలకోసం, ఉద్యోగాలకోసం రోజూ అట్నించిఇటూ ఇట్నించిఅటూ సిటీ బస్సుల్లో ప్రయాణం చేసినట్టుగా ఈ మరపడవ ప్రయాణాలు చేసేవాళ్ళే. నిజానికి నేనే కొత్తవాడిని. ఆ కొత్త బయట పడకుండా ఉండాలని నా తాపత్రయం. బయట పడితే జరిగే ప్రమాదం ఏమీలేదు. మనుషులు మంచాళ్ళు.. కొత్త దనాన్ని అలుసుగా చేసుకొని లాభం పొందాలన్న ఆలోచన తెలియని వాళ్ళు ` అయినా మనుషుల్లో మనిషిగా కలసి పోవాలన్న కోరిక ` అదోముచ్చట. ఆ కోరిక చాలా వరకూ తీర్చుకోగలిగాను. ‘రెగ్యులర్స్‌’ను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాళ్ళు కొంటున్నట్టే పడవ టిక్కెట్టు కొని, వాళ్ళు ఎక్కిస్తున్నట్టే స్కూటర్ని పడవలో ఎక్కించి, వాళ్ళలాగానే ప్రవర్తిస్తూ ` బేంబూ ఫ్లాట్‌ జెట్టీ చేరాను. అదో ఇరవై నిముషాల ప్రయాణం. నీళ్ళల్లో రెండు  కిలోమీటర్ల దూరం.

SAM_4328

జెట్టీ దిగాక ఒక చిన్న పాటి పట్టణం దర్శన మిచ్చింది! షాపులు, బాంకులు, లోకల్‌ ఆఫీసులు ` సోమవారం           ఉదయపు కోలాహలం. అక్కడినుంచి హారియెట్‌కు దారి చెప్పే బోర్డులేం లేవు. అసలది టూరిస్టుల మార్గం గాదనుకొంటాను. ఫెర్రీలో వచ్చే వాళ్ళు కుడిపక్కన అయిదారు కిలోమీటర్ల దూరాన ఉన్న నార్త్‌ బే బీచ్‌లో దిగి కొండ ఎక్కుతారట. ఒకళ్ళిద్దర్ని అడగగా దారి వివరించారు. ఓ అయిదు నిముషాలు వెదుకులాడి, పట్టుకొన్నాను.

మళ్ళా ఓ సముద్రతీర ప్రయాణం. అయిదారు కిలోమీటర్లు.. ఆపైన మెల్లగా కొండదారి. చెక్‌ పోస్టు. అటవీ విభాగం వాళ్ళకు ప్రవేశరుసుము చెల్లించి ` మెల్లగా, మెల్ల మెల్లగా పైకి, పైపైకి. ఇలాంటి ప్రయాణాల్లో నాకు తనివిదీరడం అన్న ప్రసక్తే ఉండదు గదా.. మొట్టమొదటిసారి చెట్లనూ, అడవుల్నీ, కొండలనూ, సముద్రాన్నీ చూస్తున్నంత ఉత్తేజంతో స్కూటర్ని ముందుకు నడిపించాను. ఒకచోట అడవి అందానికి ఆపుకోలేక స్కూటరాపి రెండు మూడు నిముషాలు కెమెరాను మెల్లగా గుండ్రంగా తిప్పి వీడియో  కూడా తీసాను. ఏమాట కామాట, ఆ అడవి, ఆ రోడ్డు, ఆ ఎత్తున ఒక్కో చోట నుంచి సముద్ర దృశ్యాలూ, గొప్పగా, గొప్పగొప్పగా ఉన్నాయి. ఆ అందాన్నీ, ఆనందాన్నీ వేరే దేనితోనూ పోల్చలేం.

4342 / 4355

కొంతైనా కొండ ఎక్కవలసి ఉంటుందని ఆశపడ్డాను. అదేమీ లేకుండా స్కూటరు తిన్నగా గిరిశిఖరం చేర్చేసింది. కానీ అక్కడ ` ప్రకాష్‌ ముందే చెప్పినా, నేను ఊహించని సుందర ఉద్యానవనం కనిపించి సంతోష పెట్టింది. అక్కడే ఫారెస్టు వాళ్ళ ఆఫీసులు.. ఒకటి రెండు అథెంటిక్‌ నికోబరీస్‌ గుడిసెలు. నేలకు పది  అడుగుల ఎత్తున్న, గుండ్రంగా చుట్టు గుడిసెలు, రెల్లు గడ్డి పైకప్పు.. ఓ పక్కన సముద్రాన్ని అవలోకిస్తూ ఎత్తుపాటి అబ్జర్వేషను టవరు.. సముద్రం, కొండలు, అడవి, పక్షులు, వాటి కిలకిలారావాలు, దూరంగా వెళుతోన్న బోటు, ఎదురుగా దూరాన రాస్‌ ద్వీపం, సముద్రానికీ ఆకాశానికీ విభజన రేఖ తెలియకపోవడం, ఆ పారవశ్యంలో ఓ పావుగంట. గబగబా ఫోటోలు, వీడియోలు విత్‌ నా కామెంటరీ!!

SAM_4386

పక్కనే ఓ ప్రలోభపు ప్రకటన బోర్డు. ‘సుదీర్ఘమైన ప్రకృతి మార్గం. పొడవు పదిహేను కిలోమీటర్లు. ఇక్కడ మొదలై కాలాపద్థర్‌, మౌంట్‌ కార్పెంటర్‌ల మీదుగా మధువన్‌ బీచి చేరి సముద్రం పక్కగా సాగి దీపస్తంభం మీదుగా తిరిగి ఇక్కడికే వచ్చేదారి’ అంటూ వివరాలు. నాలాంటి వాడికి అసలు అడవి అంటూ ఉంటే చాలు ` ఇంకే ప్రలోభమూ అక్కర్లేదు. కాళ్ళు పదపద నడవమంటాయి. నడవడం మొదలెట్టాను. ఎందుకైనా మంచిదని అక్కడున్న ఇద్దరు ముగ్గురు టూరిస్టు కుర్రాళ్ళని ‘వస్తారా’ అని అడిగాను. వాళ్ళకు మూడు నాలుగు గంటలు స్పేర్‌ చేసే అవకాశం లేదన్నారు. అక్కడి ఆఫీసు వాళ్ళను అడిగాను పర్మిషన్‌ ఏమన్నా తీసుకోవాలా? దారి క్షేమమే గదా అని. అవసరం లేదు, అంతా సురక్షితం అని భరోసా ఇచ్చారు. రక్‌సాక్‌లో చూసుకొన్నాను.. పళ్ళూ, బ్రెడ్డూ, నీళ్ళూ ఉన్నాయి. మరో నాలుగు గంటలు సరిపెట్టుకోవచ్చు.

తొమ్మిదిన్నరకు మొదలైన ట్రెక్కు నాలుగుంబావుకు ముగిసింది.

ఏవి ట్రెక్కది!! ఆ కొండల్లో అడవుల్లో నేనొక్కడినే. అడవులంతా నేనే. నేనంతా అడవులే. మహా వృక్షాలూ, వాటినల్లుకొని ఏవేవో తీగలు, లతలు, అనేకానేక పక్షుల కిలకిలారావాలు, ఉండుండి ఏదో  పక్షి కూసే తియ్యని గండు  కూతలు, హఠాత్తుగా సర్పం ఆకారంలో ఏదో చెట్టు వేరు, గగుర్పాటు, ఆధునిక దారు శిల్పాలలాగా కొన్ని కొన్ని చెట్టు మొదళ్ళు, అరగంట గడిచాక కాలాపద్థర్‌ అన్న నిజంగా నల్లగా ఉన్న బండరాళ్ళు, ఓ రాతిమీద 1876లో వారెన్‌ఫోర్డ్‌ అన్న పెద్ద మనిషి చేసిన శిలా సంతకం, అడవుల వీడియో చిత్రీకరణ, గాలి శబ్దాలను కాలాతీతంగా బంధించే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మల్లెపూవులో నాగభూషణం బాపతు కవిత్వం, నడక వెర్సస్‌ విశ్రాంతి, అందం ప్లస్‌ ఆనందం, అలుపు తెప్పించని వాతావరణం. ఉష్ణ మండలపుటడవులకే సాధ్యమైన ఆకుపచ్చని సౌందర్యం, బ్యాక్‌ పాక్‌ కొంగు లాగిన వానరం ` పెనుగులాట ` పాము పడగలాంటి చెట్టు మొదలు, మనిషి తొడల్లాంటి మరోమొదలు, హఠాత్తుగా లోయలు, పచ్చని చెట్లు నిండిన లోయలు, మరో చోట సూర్యుడు చొరలేనంత చిక్కని కొమ్మల కనోపీ, నాకే ఎందుకు ఇంత అదృష్టం అన్న స్వీయ అసూయ ` ట్రెక్కింగు మార్గంలో ఓ జంక్షను!

ఓ పెద్ద చెట్టు మొదలుకు రెండు సైడ్‌ బోర్డులు ` బాణం గుర్తులలో! ఒక్కటి మధువన్‌ దారి చూపిస్తోంది. రెండోది కాలాటాంగ్‌ అనే ఊరికి దారితీస్తోంది. నేను మధువనం దారి చేపట్టాను. దారిలో అప్పటిదాకా ఏ ఇబ్బందీ కలగకపోయినా మనుషుల జాడ లేనేలేదు! మధువనం, సముద్రతీరం, నడక, దీపస్థంభం, మళ్ళా మౌంట్‌ హారియట్‌ ` దారిలో ఎక్కడ ఏ పెడదారిలో పడతానో అని భయం. సరిదిద్దే దిక్కు దొరకదు కదా అని సంకోచం. ‘పోనీ దారి తప్పావే అనుకో.. వచ్చే నష్టమే ముందీ? మరో నాలుగ్గంటలు అడవుల్లో తిరుగుతావు. రెండిరటికి చేరే బదులు ఆరింటికి చేరతావు. సెల్‌ఫోనుంది. అడపాదడపా సిగ్నల్‌ దొరుకుతోంది. ఏవిటీ నీ భయం. ఆ మాత్రం రిస్కు తీసుకోలేవా?’ అని బుద్ధి మనసుకు హితవు చెప్పింది. గుండె గట్టి పరచుకొని అడుగు మధువన్‌ వేపువేసాను.

అప్పటికే నడక మొదలెట్టి దాదాపు రెండు గంటలు.. మధువన్‌ దారిలో దిగుడు ఎక్కువ.. హఠాత్తుగా ఇద్దరు యాత్రికులు! నార్త్‌ బేవేపు నుంచి లైట్‌హౌస్‌ మీదుగా వస్తున్నారట.. వివరాలు పంచుకొన్నాం. దాదాపు మధ్య బిందువు దగ్గర కలిసామని బోధపడిరది. నేనడచిన దారి గురించి నే వర్ణించి వివరించాను. కాలాపద్ధర్‌, మనిషి తొడలు, పాము పడగలాంటి కొండ గుర్తులు బోధించాను. వాళ్ళదగ్గర్నించీ అలాంటి వివరాలు అడిగి అడిగి రాబట్టాను!

దిగేకొద్దీ చెట్ల సంఖ్య తగ్గసాగింది. దారి మరింత ప్రస్ఫుటమయింది. దూరంగా సముద్రం కనిపించి దిశానిర్దేశం చెయ్యసాగింది. ఏ ఇబ్బందులూ పడకుండా, మారుతోన్న పరిసరాలను చూసుకొంటూ ` సముద్రతీరం చేరుకొన్నాను. కానీ అప్పటికే ఒంటిగంట దాటింది. అపుడు అర్ధమయింది నేను చేసిన పొరపాటు ` మౌంట్‌ హారియట్‌లో నేను  చూసిన 15 కిలోమీటర్ల దూరం రౌండ్‌ ట్రిప్పుకు కాదు! అక్కడ్నించి మధువన్‌ బీచ్‌కు! గుండె గుభేలుమన్నమాట నిజం! అదృష్టవశాత్తూ అక్కడ చేపలవేటగాళ్ళు కనిపించారు.. మాటల్లో పెట్టాను. ‘పోతేపోయింది.. మళ్ళా వచ్చిన దారి వెంబడే వెళ్ళమంటారా? కనీసం నాలుగింటికి వెనక్కి చేరే అవకాశం ఉంటుంది’ అని ఓ బెదురు బీద ప్రశ్న వేసాను. వాళ్ళు నవ్వేసి ‘అదేం అవసరం లేదు.. ఇక్కడ్నించి లైట్‌ హౌసూ, మళ్ళా అక్కడ్నించి నీ స్కూటరున్న మౌంట్‌ హారియట్టూ సులభంగానే చేరుకోవచ్చు.. నువ్వన్న నాలుగ్గంటల సమయానికి నిక్షేపంగా చేరుకొంటావు. భయపడక’ అని ధైర్యం చెప్పారు! రెట్టించిన ఉత్సాహంతో అడుగు వేసాను.

కాసేపు సముద్రంతోడు, మళ్ళా ఎత్తులు ఎక్కడం, ఓ గంట గడిచాక లైట్‌హౌసు, అక్కడ్నించి నికోబార్‌ రెస్టారెంటు వైపు చూపు సారింపు ` దిగువనే నార్త్‌బే బీచ్‌లో లీలగా నివసిస్తోన్న కోలాహలం, ఎదురుగా కనిపిస్తోన్న హారియట్‌ మార్గం, అప్పటికే ఇరవై కిలోమీటర్లు నడవడం వల్ల ఫిర్యాదు చేస్తోన్న మోకాళ్ళు, కొంచెం ఆకలి, అయిపోయిన తినుబండారాలూ మంచినీళ్ళూ, అలసిన శరీరం, అలుపురాని మనస్సు ` మౌంట్‌ హారియట్‌ చేరేసరికి నాలుగు దాటేసింది. ఆరుగంటల పై చిలుకు ట్రెక్కు. అనుకోకుండా అదనపు ఆనందం!

మెల్లగా స్కూటరు స్టార్టు చేసి బేంబూ ఫ్లాట్‌ జెట్టీ చేరేసరికి నాలుగున్నర అయింది. ఓ ఇరవై నిముషాలు పడవలో చేరగిలబడి విశ్రాంతి తీసుకొనేసరికి శరీరం మళ్ళా అదుపులోకి వచ్చేసింది. తిన్నగా ఇంటిదారి పట్టాను. దారిలో ఓ తెలుగు హైస్కూలు బోర్డు.. సాయంత్రమయిపోయింది గాబట్టి స్కూలు ఖాళీగా ఉంది. అయినా లోపలికి వెళ్ళాను. ఒకళ్ళిద్దరు టీచర్లు.. కబుర్లు.. స్కూలు గురించి.. పిల్లల గురించి.. టీచర్ల గురించి.. అబర్డీన్‌ బజారు దరిదాపుల్లో ఉన్న తెలుగు సంఘం గురించి.. సాయంత్రం కలుసుకోబోతోన్న వాళ్ళ కమిటీ మీటింగు గురించి ` ఈ టీచర్లలో ఒకాయన కమిటీ సభ్యుడు.

ఈలోగా సుజీత్‌ ఆనంద్‌ నుంచి ఫోను. రాస్‌ Ê స్మిత్‌ ద్వీపాల్లో కలసి నాలుగు గంటలు గడిపిన మనిషి. ‘మేం ఇవాళే పోర్ట్‌ బ్లెయిర్‌ చేరాం. జెట్టీ దగ్గర హోటలు, నువు రాగలిగితే కలసి భోంచెయ్యవచ్చు’ ఆహ్వానం. నాకేమో ఇలాంటి వంటే మహా ఇష్టంగదా. ‘‘తప్పకుండా.. కాకపోతే కొంచెం లేటవుతుంది. ఎనిమిదిన్నర ప్రాంతంలో వస్తాను.. పర్లేదు గదా’’ అన్నాను. ప్రోగ్రాం ఫిక్సయింది. ఎందుకైనా మంచిదని ప్రకాష్‌కు ఫోను చేసి ఆ రాత్రి వేరే మరేమీ కార్యక్రమం లేదని నిర్ధారించుకొన్నాను.

సుజీత్‌ ఓ ఫ్రీలాన్స్‌ షార్ట్‌ ఫిలిమ్‌ మేకర్‌.. ఆవిడ లెక్చెరరనుకొంటాను. ఇద్దరికీ తిరగడమంటే మహా చెడ్డ ఇష్టం. ఏడాదికోసారి ఇలా పెద్ద ట్రిప్పులు వేస్తూ ఉంటారు. ఉండేది కలకత్తాలో. ఆర్ధికంగా పెద్ద నిలకడలేని జంట. ‘ఈ ట్రిప్పుకు బాగా ఖర్చయింది. తెలియక హెలికాఫ్టరుకూ, టాక్సీలకూ బోలెడు ఖర్చు పెట్టేసాం. నీలాగా తిరిగి ఉంటే చాలా ఆదా  చేసే వాళ్ళం’ యధాలాపంగా అన్నాడు సుజీత్‌.

తొమ్మిది గంటల ప్రాంతంలో కాస్తంత వెదుక్కొని ఓ సీఫుడ్‌ పుష్కలంగా దొరికే హోటల్లో స్థిరపడ్డాం. అతనో స్పిరిటెడ్‌ మనిషి. నాకు అదంటే అభ్యంతరమూ వెగటూ లేవు. కబుర్లు బాగా సాగాయి. అతనంతగా గాకపోయినా ఆనందిత కూడా సంభాషణా చాతుర్యం కల మనిషే.. ఎంతైనా లెక్చెరరు గదా. గంటన్నరా రెండు గంటల సేపు గలగలా కబుర్లు.. మర్నాటి హేవలాక్‌ యాత్రకు బాగా పొద్దున్నే బయట పడాలని తెలిసినా, వాళ్ళ కంపెనీ వదలబుద్ధి గాలేదు. ‘2013లో ట్రిప్పు వెయ్యను గానీ 2014లో మనం కలసి లడఖ్‌, ల్హే వెళదాం. ఎప్పటినుంచో తీరని కోరిక నాకు’ అని ప్రతిపాదించాడు. నాకూ ఇంత వరకూ తీరని కోరికే అది. సరే ‘ల్హే’ అంటే సరేలే అనుకొన్నాం. పదకొండు గంటల ప్రాంతంలో విడివడ్డాం.

* * * * *

కొంతమంది కారణజన్ములు ఉంటారు.

ఆ ఉదయం నాకో అనుమానం వచ్చేసింది. రాత్రి గదికి చేరుకొని పక్క మీదకు చేరే సరికి తేదీ మారింది. మళ్ళీ పొద్దున్నే నేవీ సెక్యూరిటీ గార్డులు కూడా కునికిపాట్లు పడే వేళ నేనూ, నా ఏక్టివా అయిదున్నర ప్రాంతంలో ఫీనిక్స్‌ బే జెట్టీ వేపు పరుగులు పెడుతున్నాం. నే పుట్టింది ట్రావెలర్‌గా బతకడం కోసమేనా? తెలుసు. ఇదో అతిశయపు ప్రశ్న అని. కానీ నాకు ఆ క్షణంలో కలిగిన భావన అది!!

జెట్టీ బయట, రోడ్డు మీద, పార్కింగ్‌ ప్లేస్‌లో ఏక్టివా పెట్టాను.  మరీ పొద్దున్న గాబట్టి అక్కడ అటెండెంటు అంటూ ఎవరూ లేరు. అసలు పగటిపూట కూడా ఉంటారా అన్నది అనుమానమే. అలా రోడ్డు పక్కన పదమూడు పధ్నాలుగు గంటలసేపు బండి వదలడమా అన్న సంకోచం. అందులోనూ అది నాది గాని బండాయె.. జెట్టీ గేటు దగ్గర వాచ్‌మన్‌ సలహా అడిగాను. మరేం పర్లేదు అన్నాడు. అయినా అతి జాగ్రత్తగా ` చాదస్తం అనాలి నిజానికి ` లోపలికి వెళ్ళి ఓ గుమస్తా గారిని అడిగాను. అతనూ పర్లేదన్నాడు. పార్క్‌ చేసి వదిలేసాను.

అలవాటైన దారి.. అనుకోకుండా ఫెర్రీలో ఇది వరకు హేవలాక్‌ వెళ్ళినపుడు తటస్థించిన ‘ధర్మేంద్ర’ కెప్టెన్‌. నేనతనికి పాతకాపునన్నమాట.. ఉషోదయం జరిగిపోయి అప్పటికే అరగంట దాటేసింది. కానీ ఆ ఏటవాలు సూర్యుని కిరణాలు సముద్రపు నీళ్ళను వెండి వెలుగుల వెల్లువలో ముంచెత్తాయి. తళతళలు, మిలమిలలు, దాదాపు గంటసేపు ఆ చక్కని దృశ్యం, అటూ ఇటూ సాగిపోతోన్న సోదర ఫెర్రీలు, పడవలు. అందాల రాముడులో ‘రాజహంస’లా ఎమ్‌.వి.మార్క్రుజ్‌ అన్న మూడు వందల మంది పట్టే గంటకు ఏభై కిలోమీటర్ల స్పీడుతో నడిచే అట్టహాసపు నౌక.. ఏదో ట్రావెల్‌ ఏజన్సీ వారి కండెక్టెడ్‌ టూర్‌లో వస్తోన్న పాతిక ముప్ఫై మంది తమిళులు.. వాళ్ళతో కబుర్లు.

SAM_4413

‘‘నేను రిటైరయిన స్కూలు టీచర్ని. జీవితాంతం ఓ మారు మూల గ్రామంలో పనిచేసాను. టీచర్ని గాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టి పిల్లల్ని చదివించాను. అబ్బాయికి చెన్నైలో ఉద్యోగం. నాకు అండమాన్‌ సంగతి అటుంచి అసలు చెన్నై వెళ్ళడమన్నా బెరుకూ, సంకోచం. అబ్బాయి పట్టు బట్టాడు. మా ఇద్దరికీ ఈ ట్రిప్పు టిక్కెట్లు కొన్నాడు. విమానంలో వచ్చాం. ఇపుడు ` ఇదిగో ఈ షిప్పులో. ఈ ప్రయాణాలు నేను కలలో కూడా ఊహించనివి’’, వచ్చీ రాని ఇంగ్లీషులో చెప్పుకొచ్చాడో పెద్దాయన. కాస్తంత శ్రద్ధ చూపించే సరికి పాపం తన కృతజ్ఞత నిండిన కధంతా చెప్పుకొచ్చాడు. సంతోషం పంచుకోడానికి సరి అయిన మనుషులు కావాలి గదా! ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో హేవలాక్‌ జెట్టీలో దిగాం.

హేవలాక్‌లో దిగగానే పాపం మా పాత గైడు వచ్చి పలకరించాడు. నేను అక్కర్లేదులే అన్నా కూడా పోర్టు బ్లెయిర్‌ ఏజంటు, ఆనంద్‌, మర్యాద కోసం ఇతడిని మళ్ళీ పనిలో పెట్టాడన్నమాట. అతని సాయంతో దిగీ దిగగానే ఓ స్కూటరు అందిపుచ్చుకొన్నాను. పాత స్నేహాన్ని పునస్కరించుకొని రాధానగర్‌ బీచ్‌ని పలకరించడానికి వెళ్ళాను. ఆనాడు నేను నిర్దేశించుకొన్న కార్యక్రమం అతి సరళమైనది. గత యాత్రలో బాగా నచ్చిన రాధానగర్‌లో రెండు మూడు గంటలు గడపడం, పోయిన సారి వెళ్ళలేకపోయిన ద్వీపపు తూర్పు తీరపు ప్రాంతాలను మరో రెండు మూడు గంటలు తిరగడం, వీలయితే తూర్పు తీరం వెంటనే సాగగా దిగువన దక్షిణాన వచ్చే ఏనుగుల శిక్షణ శిబిరంలో ఓ అడుగు వేసి రావడం.

ఆ శుక్రవారపు ఉదయం తొమ్మిదిన్నర సమయంలో సహజంగానే ఆ అందమైన రాధానగర్‌ బీచిలో పట్టుమని పాతిక మంది పర్యాటకులు కూడా లేరు. కానీ పాపం రాబోయే పర్యాటకుల కోసం ఎదురుచూస్తూ కొబ్బరి బోండాల వారు, టీషర్టుల వారు, జడ పిన్నుల వారు, టీ కెటిళ్ళ వారు. వీళ్ళతో బాటు పోలీసులు ఇద్దరు ముగ్గురు. ఎందుకో వీళ్ళంతా నా వాళ్ళు అనిపించేసింది. కబుర్లు, నాకు సాధ్యమయిన చిరుకొనుగోళ్ళు.

ఓ రెండు గంటలపాటు రాధానగర్లో తిరగడమే తిరగడం. ఏమాత్రం తొందరలేకుండా (అలా ఉండడం నాకు చాలా కష్టం) ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ రెండు మూడు కిలోమీటర్ల నడక.. వరసాగ్గా ఫోటోలు, మంచి ఏంగిల్‌ కోసం చిన్నపాటి చెట్లు ఎక్కడం.. ఇసుకలో స్థిరనివాసం ఏర్పరచుకొని ఆసక్తికరమైన దారు శిల్పాల్లా దర్శన మిస్తోన్న వృక్షాల కాండాలు`కొమ్మలు.. మళ్ళా వాటికి ఉత్సాహంగా విదేశీయువ పర్యాటకులు చేసిన గవ్వల ముస్తాబులు (వీళ్ళు మనలాగాదు ` మనం రోజు గడిపే చోట వాళ్ళు వారం గడుపుతారు. హేవలాక్‌, నీల్‌ లాంటి ద్వీపాల్లో అయిదారువారాలు గడపడం వాళ్ళకు సర్వ సామాన్యం).. సుతిమెత్తగా పలకరిస్తోన్న కడలి కెరటాలు.. వాటి అడుగున ఎన్నడూ లేనంతగా శుభ్రపడిపోయి మనకే ముచ్చట కలిగించే మన పాదాలు..

SAM_4432 SAM_4445 SAM_4448

ఓ పాప ఆడుకొంటూ కనిపించింది. ఆరేళ్ళుంటాయేమో.. పక్కన వాళ్ళ అమ్మా నాన్నా తీరిగ్గా పక్కలవీ పరచుకొని చెట్టు నీడన ఉన్నారు. ఆవిడ చేతిలో పుస్తకం. అతను ఫోటోలు తీస్తూ బిజీగా.. ముచ్చటనిపించి వెళ్ళి అడిగాను ‘పాపను ఫోటో తీస్తే మీకేమయినా అభ్యంతరమా?’ అని. అదేం లేదన్నారు. ఆ ప్రక్రియలో మాటలు కలిసాయి. ఫ్రెంచి వాళ్ళు. మద్రాసు దగ్గర ఏదో కార్ల కంపెనీలో అతను ఇంజనీరు. ఇండియా వచ్చి ఏడాది దాటింది. బానే అలవాటు పడ్డారు. చెన్నై విపరీత వాతావరణం, పాండిచ్చేరి ఫ్రెంచి సువాసనలు, పాప వెళుతోన్న స్కూలు, మద్రాసులోని కన్సర్వేటివ్‌ సాంస్కృతిక వాతావరణం, భాషా సమస్యలు ` ఓ పావుగంటా ఇరవై నిముషాలు అలవోకగా కబుర్లు. ఆవిడా మా కబుర్లలో చేరారు. తరచి తరచి అడిగితే ‘అంతా బానే ఉంది కానీ మద్రాసు లాంటి మర్యాదకరమైన ఊళ్ళో కూడా తెల్ల వనిత కనిపిస్తే అమర్యాదగా చూస్తారు కుర్రాళ్ళు. ఒకటి రెండు సార్లు విపరీత పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది’ అని చెప్పారావిడ. ఏదో అంటారే.. గుండె తరుక్కుపోవడం, అలాంటి బాధ కలిగింది నాకు.

రెండు గంటలు అస్సలు తెలియకుండా గడిచిపోయాయి. రాధానగర్‌తో అనుకొన్న పరిచయం, స్నేహం, ఆత్మీయత సాధించుకోగలిగానన్న సంతృప్తి. ఇహ మరోసారి ఎప్పుడు వెళ్ళినా, ఎన్నేళ్ళ తర్వాత వెళ్ళినా ఆ బీచి నన్ను గుర్తు పట్టి పలకరించి తీరుతుంది.!!

రాధానగర్‌ పలకరింపులు ముగించి ద్వీపపు తూర్పు తీర విహారానికి వెళుతోంటే దారిలో మూడో నెంబరు గ్రామం. గోవిందనగరు మెయిన్‌ బజారు కనిపించి పలకరించి నిలవరించింది. కావాలని మళ్ళీ వారం క్రితం కనిపెట్టి మంచి కాఫీ చేయించుకొని త్రాగిన దుకాణానికే వెళ్ళి, అతను గుర్తు పడితే సంతోషపడిపోయి ` అక్కడో అరగంట. ఓ బ్రిటీషు పెద్దాయన, అతనికి నిత్యసహచరుడిగా ఓ కేరళ యువకుడు. కేరళ ఆయుర్వేద (కాయకల్ప?) చికిత్స కోసం రెండు మూడు నెలలు గడపడానికి వచ్చాడట ఆ పెద్దాయన. పల్చగా, చురుగ్గా, భేషజాలు లేకుండా ఉన్నాడు. బ్రిటీషు వాళ్ళు మామూలుగా చూపించే దర్పం కోసం వెదికాను. కనిపించనే కనిపించలేదు. మరింకేం మాటలు విరివిగా సాగాయి. ఆశ్చర్యమూ విషాదమూ ఏమిటంటే వారం పది రోజుల క్రితం ఇదే హోటల్లో ఇలాంటి సందర్భంలోనే ఎస్టోనియా మితృలు ఏ ఆవేదన వ్యక్తపరచారో ఖచ్ఛితంగా అదే మాట ఈయనా అన్నాడు. ‘ఏమిటీ చీదరా? ఎందుకు మీకీ విషయంలో అంత నిర్లక్ష్యం’ అని.  దుఃఖమనిపించింది. దీనికి సమాధానం మనందరి దగ్గరా లేదూ? అందరూ చీపుళ్ళు పట్టుకొని వెళ్ళమని గాదు నేను అనేది. చదువుకొని సివిక్‌ సెన్స్‌ అన్నమాట విని ఉన్న ఇరవై పాతిక మంది భారతీయులయినా ` ‘మేము మా అంతట మేవు పరిసరాలను పాడు చెయ్యం. ఎక్కడబడితే అక్కడ చెత్త వెయ్యం. కాల అకృత్యాలు తీర్చుకోం’ అని అనుకొని పాటిస్తే గణనీయమయిన మార్పురాదూ మన పరిసరాలలో!!

మెయిన్‌ బజారు వదలి తూర్పు దిక్కుకు మళ్ళాను. ఆ తీరమంతటా అనేకానేక స్థాయిలకు చెందిన హోటళ్ళు, రిసార్టులు, పర్ణశాలలు, టెంట్లు ` కనీసం పాతిక ముప్ఫై ఉన్నాయి. అందులో అండమాన్‌ టూరిజం వారి డాల్ఫిన్‌ రిసార్ట్‌ ఒకటి. గవర్నమెంటు వారి రిసార్టుల్లో ఒక సౌలభ్యం ఉంది. ఇతర విషయాలు ఎలా ఉన్నా వాటి లొకేషన్‌ మాత్రం అద్భుతంగా ఉంటుంది. కొండల్లో అయితే లోయల్ని అవలోకిస్తూ, నదీ తీరాలలో అయితే విజయవాడ వెన్నెల రిసార్ట్‌లాగానూ, గోవాల్లాంటి చోట బీచిని ఆనుకొనీ ` అలా ఉంటాయి, ఆయా లొకేషన్లు. ఈ హేవలాక్‌ లోనూ డాల్ఫిన్‌ రిసార్ట్‌ ఉన్న సముద్ర తీర ప్రదేశం చాలా బావుంది. చౌకీదారు సౌజన్యంతో రిసార్టంతా తిరిగి వచ్చాను. పక్కనే ఉన్న సముద్రం మనలో కలిగించే ఆనందమూ శాంతీ మాటల్లో చెప్పడం కష్టం.

‘‘ఈ తూర్పు రోడ్డు అయదారు కిలోమీటర్లు వెళ్ళి వెళ్ళి కాలాపద్థర్‌ బీచి దాకా వెళుతుంది. ఓ రెండు కిలోమీటర్ల పాటు ఒడ్డంతా హోటళ్ళు, రిసార్టులు. ఆ తర్వాత అచ్చమైన అందమే. నాదో సలహా, మీరు కాలాపద్ధర్‌ దగ్గరే ఆగకుండా ఇంకా లోపలి గ్రామాల్లోకి వెళ్ళండి. మరో ఆరేడు కిలోమీటర్లు మంచి రోడ్డు వెళుతుంది..’’ సలహా చెప్పాడా యువ చౌకీదారు!!

చక్కటి మార్గం. చాలా చోట్ల సముద్రానికి పది అడుగుల ఎత్తున.. ఓ పక్కన పచ్చని చెట్ల కొండ చరియలతో మరో పక్క లేత నీలపు రంగు లోతు లేని నీళ్ళతో.. మళ్ళా ఆ నీళ్ళల్లో ఆసక్తికరమైన బండరాళ్ళతో.. మరపురాని సమయమా తీర రేఖ యాత్ర. అడుగడుగునా అందం పలకరించి ఆగమని ఆజ్ఞాపిస్తోంటే ఆగకుండా ఎలా ఉండడం? కనీసం అరడజను ` హాల్టులు.. నీళ్ళతో కరచాలనాలు. అరుదుగా కనిపిస్తోన్న ఒకరిద్దరు సహ యాత్రీకులతో చిరునవ్వులు. హఠాత్తుగా ఓ స్కూటరు మీద ఎదురయిన డిగ్లీపూర్‌ రాస్‌ Ê స్మిత్‌ లో కలసి గడిపిన ఫ్రెంచి పెద్ద వయసు జంట. అతి ఉల్లాసంగా కాలాపద్థర్‌ బీచి.. ముప్ఫై నలభై ఫోటోలు.. నాలుగయిదు వీడియోలు.. ‘రాధానగర్‌ కన్నా బావుందా?’ అనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *