March 28, 2024

మాయానగరం-6

రచన: భువనచంద్ర  bhuvana

ఇంకో చోట———–

 

క్రొత్తగా తల్లి అయిన అమ్మాయి…ఓ పక్కన బిడ్డ ఆ పిల్ల రొమ్ము నోటిలో కరిచి పెట్టుకుని పాలు తాగుతుంటే, ఇంకో పక్క చచ్చిన భర్త తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చుని వుంది. ఆ పిల్ల యెక్కిళ్ళకి నగ్నంగా వున్న మరో రొమ్ము ఎగిరెగిరి పడుతోంది. ఎదురింటి పదిహేనేళ్ళ ‘కుర్రాడూ చావుని పట్టించుకోకుండా’ ఆ పిల్ల స్త్రీత్వాన్ని ఆబగా చూస్తున్నాడు.

పిల్లాడు తన మానాన తాను పాలు తాగుతున్నట్టు దేవుడు కూడా పాల సముద్రం మీద శేష తల్పంలో పవళించివుండాలి. లేకపోతే అంటే ఆ యొక్క దేవుడు మేల్కొనివుంటే ఇన్ని ఘోరాలు జరగవుగా! అందుకేనేమో పిల్లలూ దేవుడు ఒకటేనంటారు! ఎవరి మానాన వాళ్ళు వుంటారుగా…

కొత్త తల్లనీ చాలా మంది సింపతైజర్స్ ఉన్నాట్లున్నారు. వాళ్ళు ముక్కు దాకా తాగేసి కళ్ళతో సింపతీ చూపిస్తున్నారు. కొంతమంది ముక్కు తుడుచుకుంటూ ఏడుస్తున్నారు కూడా. అ రోదనలు కూడా అలవాటైన మొక్కుబడుల్లానే వున్నాయి గానీ, సరికొత్త బాధ మిళితమైనది కాదు.మిసెస్ మాధవీరావు రాగానే అర్జంటుగా యమ ఆప్తులైనట్టు చేరిన వాళ్ళు కొంతమంది, అట్లా వొచ్చిన ఒకావిడ చాలా ప్రొఫెషనల్ గా శోకాలందుకుంది.

“ఓయమ్మో..ఓయక్కో…ఇనుములాంటోడ్ని ఆ మహమ్మారి పొట్టనబెట్టుకుంది తల్లోయ్… ఇహ ఈ బొట్టుకీ ఆ బొట్టికాయకీ దిక్కెవరు నాయనోయ్… “అంటూ ఎలుగెత్తి రాగం తీసింది. “అవునే పెద్దమా… అవునవునే పెద్దమ్మా… ఆడు డబ్బా తొక్కుతుంటే వీధంతా దఘదడలాడేది.. ఆడు నవ్వుతూ వుంటే ఇల్లంతా కళ కళ లాడేది…చూడండమ్మాయిగారూ… చూడండి మా తల్లీ.. చచ్చిన పిల్లిలా పడున్నాడు.. తాగి తాగి పుచ్చి సచ్చేసినాడు… మావేంజెయ్యాల కూతురా…” ఇంకొకామె అందుకుంది, అటు తూర్పుగోదావరిని, ఇటి కృష్ణాని భాషతో కలుపుతూ.

ఏడుపులో ఒకరు ఆ ఇంటి గుడిసె పరిస్థితి వివరిస్తే మరొకరు డబ్బులేమన్నా ఇస్తుందేమో పెద్దరికం చూపించేద్దామని, ఆ యాంగిల్ లో తమ ఇంపార్టెన్స్ ని చూపించారు.

మిసెస్ మాధవీరావు ఆ పిల్లని మెల్లగా ఓదార్చి, వీపునిమిరి, చెదిరిన పైటని సరిచేసి, బిడ్డని తన చెతుల్లోకి తీసుకుంది. కాస్త రాగాలు సద్దుమణిగాక ఆ పిల్లని అడిగింది.

“నిన్న మీ ఆయన తాగొచ్చాడా”?

ఆ పిల్ల తల ఊపింది… అవునన్నట్లుగా… ఎక్కిళ్ళు పెడుతూనే..

“రోజూ తాగుతాడా?”

“ఉహు” అన్నట్టు తల అడ్డంగా వూపింది.

“అంటే నిన్ననే తాగాడా?” అడిగింది మాధవి. మొదట ఆ పిల్లని ఏదోవిధం గా మాట్లాడించాలి. మౌనం పగలాలంటే మాటే ఆయుధం.

“ఊ”

“తర్వాత భోంచేశాడా”?

“ఊ”

“చేశాక వాంతి చేసుకున్నాడా?”

కొత్త తల్లి ఝల్లుమంది… వెక్కుతూ..”అవును తల్లీ అవును..రాత్రంతా వాంతులు చేసుకుంటూనేవున్నాడు.. కడుపూ, చాతీ మంటగా వుందని నన్ను కావలించుకుని ఏడ్చాడు….

‘నేను సత్తానే లచ్చీ… నన్ను బతికియ్యవే.. నాకు బతకాలనుందే’ అంటూ పొర్లి పొర్లి తెల్లార్లూ ఏడుస్తూనేవున్నాడు… ఆడికి ఏ జబ్బూ లేదమ్మా..ఆడు దేన్ని మింగాడో అదే ఆడ్ని మింగేసింది, సావుని సారా లాగ తాగేసినాడు తల్లీ…!” మాట్లాడుతూనే వుంది కొత్త తల్లి, ఏడుస్తూనే వుంది. సారాంశం మాత్రం ఇంతే.

“మరి మీరెంచెయ్యలేదా?” పక్క గుడిసెవాళ్ళని అడిగి నాలిక్కరుచుకుంది మాధవీరావు. ఎందుకంటే, వాళ్ళ గుడిసె ముందు కూడా రెండు శవాలున్నై. అయితే అవి కాస్త వయసు మళ్ళిన వాళ్ళవి.

మాట్లాడకుండా ముందుకు నడిచింది మాధవీ రావు.పుల్లలా నిలబడి వుంది చీపురుపుల్లావిడ… గుడిసె ముందు. ఆవిడ కళ్ళల్లో నీళ్ళు లేవు. నిర్ఘాంతపోయివుంది. రోజూ తాగొచ్చి తన్నే భర్త నిశ్చలంగా పడివుండడంతో ‘ఆమె ప్రపంచం’ నిశ్శబ్దమయమయి పోయింది. మిసెస్ మాధవీ రావు సానుభూతిగా ఆమె భుజం మీద చెయ్యివేసినా, నిర్లిప్తంగా చూసిందేగాని ఏవీ మాట్లాడలా..

“నీ భర్త నిన్న తాగాడా?” తెలిసీ అడిగింది మాధవి.

“ఆడుతాగని రోజు లేదమ్మా…ఇదిగో…నిన్న తాగి సచ్చి పడున్నాడు. ఆడ్నిలేపాలంటే సారా పొయ్యాల…సారా పొయ్యాలంటే డబ్బులు కావాల.. డబ్బులు రావాలంటే చిత్తుకాఇతాలు పోజేసి అమ్మాల…ఒక్క క్షణం ఆగుతల్లీ.. చిత్తుకాయితాలు ఏరుకొస్తా..గోనెసంచీ భుజాన వేసుకుని నిర్లిప్థంగా కదిలిపోయింది చీపురుపుల్లావిడ.

మిసెస్ రావ్ కళ్ళల్లో కన్నీరు గంగ లా ఉబికింది.షాకు…షాక్ ఆఫ్ డెత్..

“మృత్యువా?? ఎక్కడే నీ చిరునామా? తనలో తను గొణుక్కుంటూ నడిచి పోతోంది మాధవీరావు.. మొత్త శవాలు లేచిన ఎనిమిది ఇళ్ళల్లోనూ ఎంక్వయిరీ చేసింది. అందరూ నాటుసారా తాగినవాళ్ళే… కడుపునొప్పితో వాంతులు చేసుకుని చచ్చిన వాళ్ళే… మెయిన్ రోడ్డుమీద అడుగుపెట్టబోతుండగా మళ్ళీ ఏడుపులు…వెనక్కి పరిగెత్తి చూస్తే ఏముందీ… వీధి వీధంతా రోదనల మయం… అంటే…..

గురువుగారి కుటీరం  నిశ్శబ్దంగా వుంది.. అందరూ మౌనం గా కూర్చుని వున్నారు. ‘మౌనం’ చెప్పిన మాటల్ని కొందరు మాత్రమే వినగలరు. ఒకసారి ఆ భాషకి అలవాటు పడ్డవాళ్ళు ఎవరు ఏ భాషలో ఏం చెప్పినా నమ్మరు. ఎందుకంటే చెప్పేదీ.. చెప్పగలిగేది పచ్చి నిజాల్ని మాత్రమే. గురువుగారు నిశ్చలం గా కూర్చున్నాడు. నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్నాడు.  అలావున్నాడంటే చాలా తీవ్రంగా అలోచిస్తున్నాట్లు అర్ధం. ఓ శిష్య పరమాణువు నిశ్శబ్దంగా ఓ గ్లాసు తీసి ఫారిన్  విస్కీ అందులో ‘లెక్కా ప్రకారం పోసి, అంటే లెక్క ప్రకారం ‘సోడా’ కలిపి జాగ్రత్తగా భక్తిగా గురువుగారికి సమర్పించాడు. ఆయన దాన్ని చప్పరించి బాగున్నట్టుగా తల ఊపి, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.

అదే గదిలో ఓ మూలగా బోసుబాబు  నించుని వున్నాడు. టెన్షన్ తో చేతులు మాటి మాటికీ పిసుక్కుంటున్నాడు. అతని మొహం నిండా చెమట.. చొక్కా ఎప్పుడో తడిసింది చెమటతో. బురదలో జలకమాడిన పందిలా అప్పుడప్పుడూ తల ఎగరేస్తూ, ఎండిపోయిన పెదాల్ని నాలికతో తడుపుకుంటూ వున్నాడు.

మొత్తం డెబ్బైరెండు శవాలు… గా.మో.క వీధి రోదనలతో అట్టుడికిపోతోంది. అందరూ సర్కారీ—-బోసుబాబు షాపు నించి కొనుక్కుని తాగినవారే.. అందరూ తాగాక కడుపునొప్పితో లుంగలు చుట్టుకుని గిల గిలా తన్నుకు చచ్చినవాళ్ళే.

పోలీసు కుక్క దొంగల వాసన పట్టినట్లుగా ‘మృత్యువాసన పసిగట్టి పరిగెత్తుకొచ్చాడు బోసు.

గురువుగారు కళ్ళు తెరిచాడు. “చూడు బోసుబాబూ, నీ చుట్టం ఎవతో విధవ ముండని తెచ్చావు చూడు, ఆవిడ్ని వెంటనే తెర వెనక్కి పంపించు. మిగిలివున్న సారాని మూడోకంటికి తెలియకుండా మురిక్కాలవలో పోయించు… అర్జెంటుగా నలుగురయిదుగురు పత్రికోళ్ళని కొనేసి గుడిసెల సిటీ లో ‘కలరా’ మహమ్మారి లా వ్యాపించిందని పత్రికల్లోనూ చానల్స్ లోనూ అదరగొట్టించు. అట్లాగే గవర్న్మెంటు ఆస్పత్రిలో లేటెస్ట్ గా చచ్చిన వాళ్ళందరూ ‘కలరా తోనే చచ్చారని లోపాయికారీగా డాక్టర్ల తో స్టేట్మెంట్లు ఇప్పించు….డబ్బుకు వెనుకాడకు. ఇదంతా అర్జంటుగా జరగాలి. ఆలస్యం అయితే ఆ బ్రహ్మ దేవుడు కూడా నీకు బెయిల్ ఇప్పించలేడు. పన్లోపని… అన్నీ ‘సెట్’ చేసి నువ్వు కూడా ఫుల్లుగా మందుకొట్టి ఆస్పత్రిలో చెరిపో… నీ పరిస్థితి విషమంగా వుందనీ, చావడానికి సిద్ధంగా వున్నావనీ పుకార్లు నేను పుట్టిస్త… అప్పుడుగాని నువ్వు బతకడానికి చాన్సులేదు. ఇంకోకటి… బెడ్ మీదనుంచే ‘నేను చచ్చినా పర్వాలేదు… నా గుడిసె వాళ్ళు, నా ప్రజలు బాగుండాలనీ’ ఓ స్టేట్ మెంటు పాడు. ఓ మూడు నాలుగు లక్షలు జనాలని ఆదుకోడానికి విరాళంగా ఇచ్చెయ్యి..! నీ పేర అన్నదానాలూ మిగితావీ మనోళ్ళు చూసుకుంటారు… వెళ్ళిపో…! బతికిపో..!!” అన్నాడు గురువుగారు.

ఎప్పుడో చిన్నప్పుడు గుళ్ళో విన్న గజేంద్రమోక్షం హరికధ గుర్తొచ్చింది బోసుబాబుకి. దైవం మానుషరూపేణా అన్నట్టు, “దైవం గురువుగారి రూపం లో దర్శనమిచ్చాడు” అనుకుంటూ ఢమాల్న గురువుగారి పాదాలమీద పడ్డాడు బోసు.

“పాద నమస్కారాలు తర్వాత..ముందు ప్రాణాలు దక్కించుకో “ ఆశీర్వదించాడు ‘గురూ’ గారు.

“గుడిసెల సిటీ లో ‘కలరా’ కరాళ నృత్యం….

“అసువులుబాసిన ఎనబాసిన ఎనభైమంది”….

“ఆడా మగాతో సహా ఆకలితీర్చుకున్న కలరా మహమ్మారి”..

“చావు బ్రతుకుల్లో ఉండి కూడా ప్రజలకోసం పరితపిస్తున్న బోసుబాబు”….

“నాలుగులక్షల రూపాయలు పేదకుటుంబాలకి విరాళమిచ్చిన బోసు”…

“బోసుపరిస్థితి విషమం”…

“48 గంటలు గడిస్తేగాని ఏ విషయమూ చెప్పలేమని డాక్టర్ల ప్రకటన”…

“బోస్ పేరిట అన్నదాన ప్రదానం, నిరిపేద శవదహనం, మంచినీళ్ళ బాటిళ్ళ పంపిణీ”..

“నేను మరణిస్తే నా వాళ్ళ మధ్యే నా అంత్యక్రియలు చెయ్యండి” కోమాలోకి వెళ్ళకముందు బోసుబాబు చివరి మాట.

ఎన్నిసార్లు చూసినా సూర్యోదయం సూర్యోదయం లాగే ఉంటుంది. ఏన్నిసార్లు మోసపోయినా రాజకీయ నాయకుల మాటలకు ప్రజలు మోసపోతూనే వుంటారు. నెలరోజులకల్లా బోసుబాబు మహానాయకుడై పోయాడు…అదీ హాస్పిటల్ లో ఐసియు లో ఉంటూనే…డబ్బు ఖర్చైతేనేం?..డబ్బు డబ్బుని సంపాదిస్తుంది అనేది జగమెరిగిన సత్యం. నమ్మకం అనే విత్తనాన్ని జనాల గుండెల్లో నాటితే చాలు.ఆ విత్తనాలు పదవులు అనే వృక్షాలుగా ఎదిగి, ‘ధనం’ అనే ఫలాన్ని ఇబ్బడి ముబ్బడిగా ఇస్తాయి.

మొత్తానికి బోసుబాబు మృత్యుంజయుడయ్యాడు. గుడిసెల సిటీ వాళ్ళందరూ అతన్ని పూలరధంలో బాణాసంచాలతో మేళతాళాల్తో ఊరేగిస్తూ హాస్పిటల్నించి గుడిసెల సిటీ కి తీసుకువచ్చారు. ఇంటిముందు వేసిన పచ్చని పందిరి కింద నీరసంగా నిలబడి “నేను బతికి బట్టకట్టడం కేవలం  మీ ప్రార్ధనలవల్లే జరిగింది. యీ ప్రాణం మీరు పెట్టిన భిక్ష.. యీ జన్మంతా మీ సేవచేసుకోవడం తప్ప మీ ఋణం ఎలా తీర్చుకోగలను”.. అని కన్నీళ్ళతో అన్నాడు. ఆ ‘వార్తే’ అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రకటించాయి.

మళ్ళీ కలుద్దాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *