April 20, 2024

మెహజబీన్ బానో – సాటిలేనిది

రచన: భువనచంద్ర

“చలొ   దిల్‌దార్ చలో .. చాంద్ కే పార్ చలో….

అంటూ స్వచ్ఛమైన ధవళవస్త్రాలు ధరించి ఆ వెన్నెలలోనే కలిసిపోయిందా?? చుక్కలతో చేరి మాయమయిందా?? లేక ఈ మానవలోకాన్ని వదిలి ప్రేమలోకాలకు తరలిపోయిందా మీనాకుమారి.

ఒకవైపు నైరాశ్యం, మరోవైపు నిరంతరం ప్రేమాన్వేషణ,  ఒకవైపు అందమైన కవితారచన, మరోవైపు జీవితాన అంతులేని విషాదం. ఈ నాలుగు స్తంబాలమీద కట్టిన పేకమేడలాంటి ప్రేమమందిరంలో కొలువైన అందమైన దేవత మాహెజబీన్ బానో…

మరణించే ముందు “నూర్జహాన్” కవిత రూపంలో ఓ కోరిక కోరిందట.. “మిత్రులారా! దయచేసి నా సమాధి పక్కన ‘గుర్తుగా’ నాకోసం మొక్కను నాటండి. ఎందుకంటే వసంతకాలంలో కోయిలలు వచ్చి మధురమైన గీతాల్ని ఆలపిస్తాయి. అలా ఆలపించే సమయంలో వాటి కన్నులలోంచి వెచ్చని కన్నీరు జారి నా సమాధి మీద పడుతుంది. ఎవరైనా కన్నీరు కారిస్తే నా కళ్లు చూడలేవు. అందుకే మొక్కను నాటండి” అని. ఎంత గొప్ప కవిత…!! ఎంత సున్నితమైన భావం..! కోయిల కన్నీరు కారిస్తే  చూసి సహించలేని/భరించలేని బేలహృదయం  నూర్జహాన్ దైతే… జీవితాన్ని ‘నలిపి’ వేసినవారిని కూడా క్షమించి “మిగిలిన ‘సినిమా’ పూర్తి చేసుకో, నేనెక్కువ కాలం బ్రతకను.” అని చివరి కాల్‌షీట్లనిచ్చి తన గుర్తుగా ‘పాకీజా’ లాంటి సినిమాని మిగిల్చిపోయిన బేలహృదయం మెహజబీన్ బానో అన్న పేరు పెట్టబడిన మీనాకుమారిది.

meena-kumari1

తల్లి ఇక్బాల్ఉన్నీసా.. తండ్రి ఆలీ బక్ష్. ఇక్బాల్ఉన్నీసా  స్వచ్చమైన హిందువు. రవీంద్రనాథ్ టాగోర్ తమ్ముడి మనవరాలు. అసలు పేరు ప్రభావతి. సంగీత పాఠాలు చెప్పే  అలీ బక్ష్ మెల్లగా అమె హృదయాన్ని ఆక్రమించుకుని పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు పుట్టారు. పెద్దవాడు ఖుర్షీద్.  రెండో ఆమె మాధురి. చివరిది మెహజబీన్. ప్రభావతి నృత్యకళాకారిణి కూడా. దాంతో మెహజబీన్‌కి అటు సంగీతం, ఇటు నృత్యం. రెండూ అబ్బాయి. ‘నటి’ కావాలనే ప్రభావతి(ఇక్బాలున్నీసా) ఆశ మీనాకుమారి ద్వారా తీరుతుందని ఆనాడు ఎవరూ వూహించలేదు. అసలు పుట్టగానే మీనాని ఓ అనాధాశ్రమం ముందు వదిలేశారు. పెంచలేమని! కానీ, ఎందుకు మనసు తొలిచిందో.. వాళ్ళే వెనక్కి వచ్చి బిడ్డను మళ్లీ అక్కున చేర్చుకున్నారు.

చిత్రం ఏమిటంటే, ‘వదిలించుకోవాల’నుకున్న పిల్లే వాళ్ళ జీవితానికి ‘ఆధారం’ కావడం. మీనాకుమారిని ‘గుర్తించి’ వేషమిచ్చింది విజయ్ భట్. అప్పటి గొప్ప హీరో హీరోయిన్లు జైరాజ్ – మెహతాబ్‌ల కూతురిగా,  మొదటి పారితోషికం పాతిక రూపాయలు. సినిమా పేరు ‘లెధర్ ఫేస్’! ఆ తరవాత చాలా చిత్రాల్లో బాలనటిగా నటిస్తూ కుటుంబాన్ని ‘గట్టెక్కించింది. అన్ని సినిమాలూ విజయ్‌భట్‌గారివే. మెహజబీన్‌ని “బేబీ మీనా’గా మార్చిందీ విజయ్‌భట్‌గారే.

మీనాకి హీరోయిన్‌గా మొదటి సినిమా కేదార్‌వర్మగారి ‘దాదాజీ’. బసంత్ స్టూడియోస్‌లో హోమివాడియా ద్వారా దక్కింది. దురదృష్టం ఏమంటే సినిమా పూర్తయ్యాక ‘నెగటివ్’ పూర్తిగా కాలిపోయింది. అదృష్టం వెనకనే దురదృష్టం నీడలా వెంబడించినా మరో అవకాశం హోమివాడియా ద్వారానే దక్కింది. సినిమా పేరు ‘లక్ష్మీనారాయణి’, లక్ష్మీదేవి పాత్రనిచ్చారు. పారితోషికం నాలుగు వేలు. ఆ తరవాత కొన్ని సినిమాలు అన్నీ పౌరాణిక సినిమాలు చేసింది. ఆ తరవాత హోమివాడియాగారే పదివేలకి మరో పిక్చర్‌లో ‘బుక్’ చేశారు. ‘తమాషా’ అనే పిక్చర్ షూటింగ్‌లో మీనాకుమారి కమాల్ అమ్రోహీని కలిసింది. అప్పటికతను సినిమాకి ‘లక్ష’ తీసుకుంటున్న రచయిత, దర్శకుడు. ఆయన ‘మహల్’ సినీచరిత్రని తిరగరాసింది. (అశోక్ కుమార్, మధుబాల).. మధుబాలతో అనార్కలీ సినిమా తీద్దామనుకుని మధుబాల (అసలు పేరు ముంతాజ్)ని సంప్రదిస్తే దిలీప్‌కుమార్‌ని సలీంగా పెడితేనే నాయిక పాత్ర చేస్తానని పేచీ పెట్టడం వల్ల మీనాకుమారికి ‘అనార్కలీ’ పాత్ర దక్కింది. అద్భుతంగా నటిస్తున్న ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మీనా తిన్న అతి పెద్ద దెబ్బ ఇది. అయితే చిత్రంగా విజయ్ భట్ ‘బైజూ బావ్‌రా’ అవకాశం మీనాని వెతుక్కుంటూ వచ్చింది. అలాగే దిలీప్‌కుమార్‌తో ‘ఫుట్‌పాత్’ చిత్రం, బైజూ బావ్‌రాలోని ‘గౌరి’ పాత్ర మీనాకుమారిని ఎవరెస్టంత ఎత్తున నిలబెట్టింది. ఆ సినిమాతోనే ‘రఫీ’ ప్రభంజనం మొదలైంది కూడా.

తండ్రి ఆలీబక్ష్‌కి తెలియకుండా సోదరి మధు సాయంతో ‘సయ్యద్ అమీర్ హైదర్ కమాల్ నఖ్వి (కమాల్ అమ్రోహీ)ని పెళ్ళి చేసుకుంది మీనాకుమారి.  కమాల్ కి  అప్పటికే ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యకి పిల్లల్లేరు. అసలు మీనా కమాల్‌ని ప్రేమించి మూడో భార్యగా ‘ఎలా’ వెళ్లిందనేది సినీ ప్రముఖుల్నీ ‘తొలిచిన’ ప్రశ్న. లవ్ యీజ్ బ్లైండ్.. అంతే..

1953లో ఫిలింఫేర్ పత్రిక ప్రవేశ పెట్టిన తొట్టతొలి ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డు మీనాకుమారిని వరించింది. సంగీతం నౌషాద్. ఆయన ఉండేది మీనాకి ఆల్‌మోస్ట్ ఎదురింట్లోనే. ‘బైజూ బావ్‌రా’ ఆమెని సూపర్ స్టార్‌ని చేస్తే ‘ఫుట్‌పాత్’ చిత్రం నెగటివ్ కాలిపోయి మళ్లీ మీనాకి దుఃఖాన్ని మిగిల్చింది.

1953ఇఓ కమాల్  అమ్రోహీ నిర్మించిన ‘దాయ్‌రా’లో నటిస్తూ ఇంటిని వదిలి కమాల్ దగ్గరికి కట్టుబట్టలతో వెళ్ళిపోయింది  మీనా. అది ఫ్లాప్.

అయినా ‘శరత్ చంద్ర’నవల ‘పరిణీత’లో నటించి (అశోక్ కుమార్ హీరో) 1954 సంవత్సరపు ఫిలింఫేర్ అవార్డుని అందుకుంది అంటే మొదటి రెండు ఫిలిం ఫేర్ అవార్టులు వరసగా అందుకున్న ఘనత మీనాదే. ఆ సమయంలోనే మీనా సోదరి ‘మధు’ హాస్య నటుడు మెహమూద్ ని పెళ్లి చేసుకుంది.

ఒకపక్క సినిమా తరవాత సినిమా, మరోపక్క కమాల్ అమ్రోహీ పెడుతున్న ఆంక్షలు.. వీటితో మీనాకుమారి నలిగిపోయింది. హిట్ మీద హిట్ అటు.. మెట్టు తరవాత మెట్టు ‘కిందకి’ జారుతూ ఇటు…  ఏక్ హీ రాస్తా.. శారద…    మిస్ మేరీ (తెలుగు మిస్సమ్మ) మేమ్ సాబ్.. అర్ధాంగినీ.. చిరాగ్ కహా.. రోషన్ కహా,  ఆజాద్ , దిల్ అప్‌నా ఔర్ ప్రీత్ పరాయీ.. కోహినూర్.. భాభీ కీ చూడియా (వదినగారి గాజులు), ఆర్తీ.. మై చుప్ రహూంగీ.. సాహిబ్ బీబీ ఔర్ గులాం… కాజల్.. నూర్జహాన్.. బెనజీర్ సినిమాలలో.. ఇలా విజయ పరంపర… జీవితంలో మాత్రం ఒక్కో అడుగూ దిగిపోతూ మనస్ఫర్ధలు ఎక్కువయ్యాయి. ‘సాహెబ్ బీబీ ఔర్ గులాం’ లో సహజత్వం కోసం మొట్టమొదటిసారి గొంతులో పోసుకున్న ‘బ్రాందీ’ మీనాకుమారికి జీవిత సహచరిగా  మారుతుందని ఎవరూ వూహించలేదు. అంతేగాదు, కమాల్ అమ్రోహీ ప్రొడక్షన్ మేనేజర్ బాకర్ ‘పింజిరేకే పంచీ’ (పంజరంలో పక్షి) షూటింగ్‌లో మీనాని చెంపదెబ్బ కొట్టడం.. టాప్ హీరోయిన్ని ఆఫ్ట్రాల్ ఓ మేనేజర్ కొట్టడమా? కారణం కమాల్ చూపిస్తున్న అలుసే. అప్పుడే అరిచింది.”గెటౌట్ ఆ కమాల్ గడపలో అడుగుపెట్టనని. ఆ తరవాత ఏముంటుందీ?

ప్రేమ దొరక్క, ప్రేమ అనే ఆకలి తీరక మీనా ‘మందు’లో ప్రేమని వెదుక్కుంది. మీనా ఓ సహజ రచయిత్రి. కవితల్లేది.. కవితా దాహం తీర్చడానికి గుల్జార్ తోడుండేవాడు. వృత్తిలో ఎదుగుతున్న కొద్దీ జీవితంలో ఓడిపోతూనే వచ్చింది మీనా.

దిల్ ఎక్ మందిర్, పూర్ణిమ, ఫూల్ ఔర్ పత్తర్ , సాహెబ్ బీబీ ఔర్ గులాంకు మూడో ఫిలింఫేర్ అవార్డు అందుకున్న మీనా ‘ఫూల్ ఔర్ పత్తర్’  సినిమాకి మరోసారి ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. విచిత్రం ఏమంటే మీనా చెల్లెలు మధు కూడా మెహమూద్‌తో విడిపోయింది.

ఈలోగా ఎన్నోసార్లు కమాల్ మీనాని క్షమించమని అడిగినా మీనా జవాబివ్వలా. మేరే అప్నే.. దుష్మన్  ఇవన్నీ అనారోగ్యంతో చేసిన సినిమాలే. అయినా ఆమెకి ఆమే సాటి అని నిరూపించాయి. మళ్లీ కమాల్‌కి ఫోన్ చేసి ‘నీ సినిమా పూర్తి చేసుకో’ అని ‘పాకీజా’ చిత్రాన్ని పూర్తి చేసింది. ఎవరికి ఏది ఎలా ఎప్పుడు ఇవ్వాలని ‘అల్లా’ నిర్ణయించాడొ అవన్నీ ఇచ్చేసి  ‘గోమతీ కీ కినారే’ అనే ఆఖరి సినిమాతో ‘అంతిమ’ గమ్యాన్ని చేరుకుంది మెహజబీన్ బానో (సాటిలేనిది అని అర్ధం) ఆమెలాగానే ఉండే మన మహానటి సావిత్రీ మందుకీ బానిసైంది మీనాలాగా. ఏదయితేనేం పాకీజా అద్భుత విజయాన్ని విన్న మీనా అన్నది. “ఇన్షా అల్లా” అని. లెట్ దై విష్ బీ డన్..

ఆ మహా నటి ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది. ఆమె సినిమా చూసిన ప్రతిసారీ.. మన కళ్లల్లో కన్నీటి బిందువుగా జన్మిస్తూనే వుంటుంది. అయినా ఇది ఆమె యీ భూమిమీదకు వచ్చిన దినం సందర్భంగా మళ్లీ మళ్లీ దీవిద్దాం.

Long Live MEENAA

 

 

 

మీనాకుమారి నటించిన కొన్ని చిత్రాలనుండి అపురూపమైన గీతాలు

చూద్దాం..

మరికొన్ని విందాం:

5 thoughts on “మెహజబీన్ బానో – సాటిలేనిది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *