March 29, 2024

మౌనరాగం – 8

రచన: అంగులూరి అంజనీదేవి  anjanidevi

 

 

 

http://www.angulurianjanidevi.com 

anguluri.anjanidevi.novelist@gmail.com

‘అర్థం లేని మెహమాటాలకి, నిరర్ధకమైన మానవ సంబంధాలకి ప్రాధాన్యత యివ్వటం నాకు ఇష్టం వుండదు.’ అని అప్పుడెప్పుడో ఒక సందర్భములో అన్వేష్‌ అనటం గుర్తొచ్చింది కావ్యకి.

 

* * * * *

 

కారు దిగింది హుందాగా నడుచుకుంటూ లోపలకి వస్తున్న అన్వేష్‌ని చూసి ‘ఎవరు?’ అన్నట్లుగా చూస్తూ నిలబడింది నేహ. ఆమెకు దగ్గరగా వెళ్లి….

‘‘నేహ అంటే మీరేనా?’’ అంటూ నేహ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు అన్వేష్‌.

‘‘నేనే… అంది నేహ. నేహ వయసు దేదీప్య కన్నా పెద్దదేం కాదనిపించింది.

‘‘నేను లక్ష్యాన్వేష్‌ని.  లక్ష్యం పత్రిక ఛైర్మన్‌ని’’ అన్నాడు అన్వేష్‌.

‘‘చెప్పండి!’’ అంది వినయంగా నేహ

‘‘నేను మీతో కొంచెం మాట్లాడాలి.’’ అన్నాడు.

‘‘లోపలకి రండి!’’ అంటూ మర్యాదపూర్వకంగా లోపలకి ఆహ్వానించింది. లోపలకెళ్లి కూర్చున్నాడు అన్వేష్‌?

‘‘దీపక్‌ మీకేమవుతాడు?’’ అడిగాడు. అన్వేష్‌.

అతను అడిగే తీరుకి తడబడ్తూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నేహకి.

మళ్లీ రెట్టించి అడిగాడు.

‘‘మీకెందుకు?’’ అంది ధైర్యాన్ని కూడదీసుకుంటూ ….

‘‘అంత అర్థం కాని, అర్థం లేని రిలేషనా మీది? సమాధానం చెప్పలేకపోతున్నారు?’’ అని అన్వేష్‌ అనగానే నేహకు చిరాగ్గా అన్పించింది. మొన్న అభిరాం రావటం…. ఈ రోజు ఇతను రావటం.. వీళ్లకి సమాధానం చెప్పటం ఆమె వల్లకాక కోపంగా చూస్తూ….

‘‘మా రిలేషన్‌ గురించి మీకు  చెప్పాల్సిన అవసరం నాకు లేదు.’’ అంది.

‘‘నాకు చెప్పొద్దు లెండి.! కనీసం మీకు మీరైనా చెప్పుకున్నారా? ఎందుకంటే బయటవాళ్లకి చెప్పాల్సిన అవసరం లేకపోయినా మీ మనసుకైనా మీరు సమాధానం చెప్పుకోవాలిగా?’’ అన్నాడు.

మాట్లాడలేదు నేహ.

‘‘ కానీ నేను ఇక్కడికి రావటానికి మాత్రం ఓ అర్థం వుంది. అంతేకాదు. జీవితంలో మనం ఏది చేసినా దానికో అర్థం వుండాలి. ఒక మనిషిని  పెళ్లెందుకు చేసుకుంటాం? జీవితాంతం కష్టం, సుఖం పంచుకుంటూ తోడుగా,నీడగా వుంటారని…. ఉద్యోగం ఎందుకు చేస్తాం? ఆర్థిక భద్రతతో గౌరవంగా బ్రతకటం కోసం.. అలాగే మీరు దీపక్‌ దగ్గర ఎందుకుంటున్నారు? ఏ  లాభాన్ని ఆశించి వుంటున్నారు?’’ అన్నాడు.

‘‘ అతను నన్ను పోషిస్తున్నాడు.’’ అంది వెంటనే.

‘‘అతను శారీరకంగా మీ నుండి ఆశించే మిమ్మల్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఇది మీకు సెక్యూర్ట్‌గా వుంది. కంపర్టబుల్‌ జోన్‌లా వుంది.  మిమ్మల్ని మించిన అందం అతనికి అందుబాటులోకి వస్తే   మీరీ జోన్‌ లోంచి తప్పుకోవలసిందే! ఒకప్పుడు వాళ్ళభార్య వున్న జోన్‌ లోనే ఇప్పుడు  మీరు వున్నారు.  వదులుకుంటూ

బ్రతకటం అలవాటు పడ్డవాళ్లు దేన్నైనా ఈజీగా  వదులుకుంటారు.  ఏది ఏమైనా జీవితం చివరి ఘడియ వరకు మీరీ జోన్‌లో వుండలేదన్నది మాత్రం నేను చెప్పగలను.’’ అన్నాడు.

అతను చెప్పేది సహజంగా అన్పించి….

‘‘ఇంతకన్నా నన్నేం చేయమంటారు? నాకిది తప్పని సరి జీవితం అయిపోయింది. నిరుద్యోగిగా వుంటూ నన్ను నేను  పోషించుకోలేని స్థితిలో…  నేను యిక్కడ వుంటున్నాను.’’ అంది నిజాయితీగా.

‘‘మీరిక్కడ వుండటానికి నిజంగా మిా నిరుద్యోగమే కారణమైతే మీ అర్హతకి తగిన విధంగా నేను ఉద్యోగం ఇప్పిస్తాను. ఎక్కడో కాదు.  మా దగ్గరే….’ అన్నాడు అన్వేష్‌.

‘‘లక్ష్యం’ పత్రికలోనా? ’’ అంది నేహ.

‘‘కాదు.  కాగజ్‌నగర్‌లో వుంటున్న మా తాతయ్య వాళ్ల పేపర్‌ మిల్లులో జాబ్‌ యిప్పిస్తాను దానివల్ల మీ లైఫ్‌కి ఆర్థికంగా సెక్యూరిటీ వుంటుంది.’’ అన్నాడు అన్వేష్‌.

దీపక్‌ని వదిలెయ్యమని చెప్పకుండానే చెప్పినట్లు ఆ మాటలు నేహ మనసు మీద బాగా పనిచేశాయి. ఆర్థికంగా అభద్రతా భావంతో భయపడ్తున్న ఆమెకు ధైర్యాన్ని యిచ్చాయి.

కానీ దీపక్‌ని వదిలితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందేమోనన్న అనుమానం బయలు దేరింది ఆమెలో.

‘‘ ఏంటి మీ ఆలోచన?’’ అన్నాడు అన్వేష్‌.

‘‘దీపక్‌తో ఓ మాట చెప్పాలని వుందండి?’’అంది.

‘‘దీపక్‌తో చెబితే మిమ్మల్ని వెళ్లనిస్తాడా?’’ అన్నాడు. ఆభయం ఆమెలో లేకపోలేదు.

‘‘నన్ను మీరిప్పుడే తీసుకెళ్తారా? అయినా… నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి?’’అంది.

ఆమెకు జవాబు చెప్పకుండా అతని ఆలోచనలో అతనుండటం చూసి… ఆ మౌనాన్ని మరోవిధంగా అర్థం చేసుకొని…. వదిలేస్తాడని తెలిసి కూడా దీపక్‌ను నమ్మినందుకు సిగ్గుపడ్తూ…. అన్వేష్‌తో యింకేం మాట్లాడకుండా….

‘‘ఒక్క నిముషం! ఇప్పుడే వస్తాను.’’ అంటూ లోపలకెళ్లి బట్టలు సర్దుకొంది.  అతనలా కూర్చుని వుండగానే తనకి సంబంధించిన వస్తువులతో బయటకి వచ్చింది.

అన్వేష్‌ దగ్గర కాగజ్‌నగర్‌లో వున్న పేపర్‌మిల్లు అడ్రస్‌ తీసుకొంది.  ముందుగా ఎవరి యింట్లో దిగాలో వివరాలు అడిగి తెలుసుకొంది.

‘‘మీరు నన్ను స్టేషన్‌ వరకు డ్రాప్‌ చెయ్యండి! నేను కాగజ్‌నగర్‌ వెళ్తాను.’’ అంది.

‘‘ఇంత త్వరగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు.  మీరు నిజంగా తెలివైన అమ్మాయి.’’ అంటూ కారు వైపు నడిచాడు అన్వేష్‌.

అతని వెంటే వెళ్లి కారెక్కింది నేహ.

 

* * * * * *

ఆఫీసు నుండి ఇంటికొచ్చిన దీపక్‌`నేహ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతూ                    చుట్టూ వెదికాడు.

పిలవకముందే పలుకుతూ, తన చుట్టూ తిరగుతూ వుండే నేహ ఎటెళ్లిందో అర్థం  కాక దిగ్బ్రాంతి చెందాడు.  ఎంతకీ కన్పించకపోవటంతో….

దిక్కుతోచక కుర్చీలో కూలబడ్డాడు……

మాట మాత్రమైనా తనతో చెప్పకుండా నేహ ఎక్కడికి వెళ్లింది?ఎక్కడికెళ్లాలన్నా ఆమెకంటూ ఎవరూ లేరు. ఏదైనా అవసరమె బయటకి వెళ్లిందా?అయినా బయటకి వెళ్లే అవసరాలు ఆమెకు ఏమున్నాయి?  ఏది కావాలన్నా తనకే చెబుతుంది కదా? తను తెచ్చేంతవరకు ఎంత ఆలస్యమైనా ఆగుతుంది.

నిమిషాలు గంటల్లోకి మారుతుంటే…..

బయట వర్షం పడ్తూ అతని మనసులాగే చిత్తడిగా మారింది.

వెళ్లిపొమ్మనేంత వరకు ఆమె తనకే సొంతం అనుకున్నాడు.

దేదీప్యకున్నంత బావుకత్వం! సున్నితత్వం లేకపోయినా…..  నేహ తనేం చెబితే అది చేసేది.  ‘ఇలా వుంటే చాలా!’ అన్నట్లుగా చూసేది. తనకి ఏ మాత్రం నచ్చకపోయినా వెళ్లిపొమ్మంటాడని భయంగా వుండేది. ఎలా చెబితే అలా వినేది.  అటువంటప్పుడు ఆనందంతో అతని చాతి పొంగేది.

ఎంత ఎదురుచూస్తున్నా యింకా రాదేం నేహ? తనని పూర్తిగా వదిలేసి వెళ్లిపోయిందా? ఆ ఊహనే భరించలేకపోతున్నాడు.

చూస్తుంటే పిచ్చి ఎక్కేలా వుంది దీపక్‌కి.

నేహకి తనేం తక్కువ చేశాడు? దేదీప్య కన్నా ఎక్కువగానే చూసుకున్నాడు.. కష్టపడి కబుర్లు చెప్పాడు. అప్పుడప్పుడు రెస్టారెంట్‌కి తీసికెళ్లాడు. ఫిలిమ్స్‌ చూపించాడు. పువ్వులు కొనిపెట్టాడు. ఏది తక్కువైనా వెళ్లిపోతుందన్న భయంతో ఏది అడిగితే అది చేశాడు.

చివరకి ఏమైంది?

ఆఫీసులో మొన్న కావ్య చెప్పినట్టే జరిగింది.

వెంటనే కావ్య మాటలు గుర్తొచ్చాయి.

‘‘దేదీప్య విషయంలో మీరు పొరపాటు చేస్తున్నారు.  దీపక్‌ గారు!  డైరీలో రాసినంత మాత్రాన తప్పులు జరిగే పనైతే చాలమంది పెళ్లిళ్లు మానేసి సెల్‌ఫోన్లో మాట్లాడుకుంటూ కాపురాలు చేసేవాళ్లు…. ఎప్పుడైనా కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచించి వాస్తవానికి దగ్గరగా బ్రతికితే బావుంటుంది. ఎప్పటికైనా నేహ మీ మనిషి

కాదు… జాగ్రత్తగా మళ్లీ వినండి. ఎప్పటికైనా నేహ మీ మనిషి కాదు. మీకు కోపం వచ్చినా, తనకి కోపంవచ్చినా తనే వెళ్లిపోతుంది.’’ అంటూ…… కావ్య చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.

ఇలా జరుగుతుందని కలలో కూడా వూహించలేదు.

తలపట్టుక్కూర్చున్నాడు.

ఆ బాధలో….ఎంత మందు తాగాడో అతనికే తెలియదు.

ఎంత మందు తాగినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా తనకంటూ ఓ మనిషి లేకుంటే ఆ శూన్యత భయంకరమని అర్థమయి దీపక్‌కికి. దీన్ని పూడ్చటం ఎవరితరం కాదని తెలిసి మౌనంగా రోధించాడు.

ఆవేదనతో, ఆక్రోశంతో అతని గుండె బరువెక్కింది.

దేదీప్య అయితే తనతో చెప్పకుండా ఇలా వెళ్లిపోయేదా? వెళ్లదు….

తను ఏ మాత్రం ఎట్రాక్ట్‌ చేసి హోల్డ్‌ చెయకపోయినా ఎక్కడికీ పోని సొంతవస్తువులా పడి వుండేది. కట్టుకున్న భార్యకి ` బయటవాళ్లకి అదే తేడా!

అనవసరంగా అనుమానించి` గోరంతలు, కొండంతలు చేసి దేవతలాంటి దేదీప్యను దూరం చేసుకున్నాడు.

నిజం చెప్పాలంటే నేహ విషయంలో తనెంత కష్టపడ్డాడు? ఆమెను ఎట్రాక్ట్‌ చేసి హోల్డ్‌ చెయ్యటానికి ఎన్ని అవస్థలు పడ్డాడు?

అయినా వదిలేసి వెళ్లిపోయింది.

రోజులు  దొర్లుతుంటే అతని మీద ఇనుపగుండ్లు దొర్లుతున్నట్లే వుంది.

నేహ చేసిన గాయం విపరీతంగా సలుపుతుంటే….

దేదీప్య క్షణక్షణం గుర్తుకొస్తోంది.

గుర్తుకొచ్చిన ప్రతిక్షణం గుండెను రంపంతో కోస్తున్నట్లే అన్పిస్తోంది.

పెళ్లికి ముందు  ఏ అమ్మాయి అయినా తన కాబోయే భర్త  గురించి కలలు కనటం సహజం. తను మాత్రం పెళ్లికి ముందు ఎంత మంది అమ్మాయిలతో మాట్లాడలేదు? ఎంత మందికి ‘ఐలవ్‌యు’ చెప్పలేదు?

పెళ్లి అయ్యాక దేదీప్య తనకేం లోటు చేసింది?

పైగా తన జీవితంలోకి ఆమె ప్రవేశించిన తర్వాత జరిగిన తప్పుకాదు కదా అది? డైరీని చూసినప్పుడు తన మనసు ఎందుకిలా ఆలోచించలేకపోయింది?  ఏదైనా దూరమయ్యాకే దాని విలువ తెస్తుందా? తను దూరమయ్యాక దేదీప్య మనసు ఎంత గాయపడిరదో కదా? తనిప్పుడు వెళ్తే దేదీప్య తనను యాక్సెప్ట్‌ చేస్తుందా? చేసినా…చెయ్యకపోయినా దేదీప్య దగ్గరకి తను వెళ్లాలి.  లేకుంటే ఈ శూన్యతను భరించలేడు.

కట్టుకున్న మనిషి లేక, తల్లిదండ్రులు ఎక్కుడున్నారో తెలియక అసలేంటి తనిలా? ఎందుకిలాంటి చెత్త మలుపు తిరిగింది తన బ్రతుకు?

‘‘దేదీప్య కావాలి! దేదీప్యతో జీవితం కావాలి!’ అని మనసు బలంగా కోరుతుంటే…. అతని మనసు శ్రావణ మేఘమై కడిగిన ముత్యమై…

దేదీప్య ఇంటికెళ్లి… తలుపు తట్టాడు.

తలుపు తియ్యగానే దేదీప్యకి బదులుగా తన తల్లి కన్పించటంతో` ‘ఇది కలా` వైష్ణవ మాయ’ అన్నట్లుగా ఆశ్చర్యపోయాడు.

ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ లోపలకి వెళ్లగానే తండ్రి కన్పించాడు.  వాళ్లిద్దరు అక్కడ వున్నందువల్లనేమో ఆ వాతావరణం ఆహ్లాదంగా అన్పించింది.

వాళ్లిద్దరు కొడుకును చూసి సంతోషపడి, మాట్లాడుతూ కూర్చున్నారు.

దేదీప్య వాళ్లకి కల్పించిన సౌకర్యవంతమైన జీవితాన్ని చూసి అతని కళ్లు చెమర్చాయి.

ఉన్నపళంగా వదిలేసి … దేదీప్యకి తను ద్రోహం చేసినా…. నేహే సర్వస్వం అనుకొని, నిర్దాక్షిణ్యంగా వదిలేసిన తన తల్లిదండ్రుల్ని దేదీప్య ఆదుకోవటం, మానవత్వంతో కూడిన పని. అలాంటి దేదీప్యకా తను యిన్ని రోజులు దూరంగా వున్నది అన్న బాధ తప్ప ఇంకేం లేదు దీపక్‌లో.

అంతలో ఫోన్‌ రింగ్‌ అవుతుంటే అటువైపు చూస్తూ ….

‘‘అమెరికా నుండి దేదీప్య అన్నయ్య ఫోన్‌ చేస్తున్నాడు….వెళ్లి మాట్లాడు దీపక్‌.’’ అంది బ్రమరాంబిక. దేదీప్యకి ఫోనంటూ వస్తే వాళ్ల అన్నయ్య దగ్గర నుండే వస్తుందని ఆమెకు తెలుసు…

‘‘నేనెలా మాట్లాడాలి? నా గురించి వాళ్లకి తెలియదా?’’ అన్నాడు దీపక్‌.

‘‘ నీ గురించి దేదీప్య వాళ్లకేమీ చెప్పలేదు.  వాళ్లెప్పుడు ఫోన్‌ చేసినా నువ్వు బయటకెళ్లావనే చెబుతుంది.’’ అని తల్లి అనగానే వెంటనే వెళ్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేసి… ఎప్పటిలాగే మాట్లాడాడు.  అలా మాట్లాడాక… ఇప్పుడు తనకి అందరు వున్నారన్న ఫీలింగ్‌ కలిగింది దీపక్‌కి.

అప్పుడే అక్కడకి వచ్చిన దేదీప్య  దీపక్‌ను చూసి ఆశ్చర్యపోలేదు. అతని తల్లిదండ్రుల కోసం వచ్చాడనుకొంది.

అర్జంట్‌గా అన్వేష్‌తో కలిసి యశోదర వాళ్ల ఇంటికి వెళ్లే పని వుండటంతో వెళ్లిపోయింది.

యశోదర మహిళా సంఘ అధ్యక్షురాలిగా ఎన్నికయింది. ఆ న్యూస్‌ని అన్ని పేపర్లు కవర్‌ చేశాయి. ‘లక్ష్యం’ పేపరు హైలెట్‌ చేసింది.

ఆ సందర్భంగా దేదీప్య, అన్వేష్‌ స్వయంగా వెళ్లి యశోదరను అభినందించారు.

దేదీప్య వైపు ప్రేమగా చూస్తూ….

‘‘మీ అత్త, మామలు నీ దగ్గరే వున్నారట కదా! బావున్నారా?’’ అడిగింది.

‘‘బావున్నారాంటీ! మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నారు. ఒకసారి వచ్చి మిమ్మల్ని పలకరిస్తామని కూడా అన్నారు.’’ అంది దేదీప్య నవ్వుతూ.

దేదీప్య నవ్వులో శృతి కలుపుతూ…..

లాలిత్యను పిలిచి జ్యూస్‌ తీసుకురమ్మని చెప్పింది యశోధర.

అత్తగారి మాటలకి అందమైన టాయ్‌లా తల వూపి బుద్దిగా కిచెన్‌లోకి వెళ్తున్న లాలిత్యను చూసి ఆశ్యర్యపోయింది దేదీప్య. ఇంతమార్పా లాలిత్యలో….

లాలిత్యలో వచ్చిన మార్పును నమ్మలేకపోయినా సంతోషంగా వుంది.

లేటెస్ట్‌ ప్రింటెడ్‌ శారీలో, చేతులనిండా గాజులతో, సగం వరకు గట్టిగా అల్లి వదిలేసిన పొడవైన జడలో…..ఆ తలలో మూరెడు సన్నజాజి మాలతో….. చూస్తుంటే లాలిత్య మళ్లీ పుట్టిందా అనిపించేలా కొత్తగా… సంస్కృతికి మారు పేరులా మూర్తీభవించిన తెలుగుతనంతో మనసారా చూడాలనిపించేలా…..అలసిపోయినా కళ్లుకి చూడగానే సేదదీరేలా అన్పిస్తోంది.

దేదీప్య కళ్లలో భావాలను, మనసులోని సందేహాలను పసిగట్టినదానిలా….

‘లాలిత్యకి విజయవాడలో వుండే ఫేమస్‌ సైకియాట్రిస్ట్‌ డా॥ ఇండ్లరామసుబ్బారెడ్డి గారి దగ్గర కౌన్సిలింగ్‌ యిప్పించాక చాల మారిపోయింది దేదీప్యా! ఒకప్పుడు లాలిత్యను చూసినవాళ్లు ఇప్పుడు నమ్మలేకపోతున్నారు. నా కోడలు ఎలా వుండాలని నేను కోరుకున్నానో లాలిత్య అలా తయారయినందుకు గొప్పగా ఫీలవుతున్నాను.’’ అంది దేదీప్యనే చూస్తూ యశోదర. గతంలో ఒక మగ మృగం చర్య వల్ల లాలిత్య మానసిక వ్యాధికి గురైందని యశోదరకి తెలియదు. దేదీప్య కూడా వివరాలు అడగలేదు.

కిచెన్‌లోకెల్లి జ్యూస్‌ తయారు చేస్తున్న లాలిత్య ఆలోచనలు….అన్వేష్‌ పక్కన కూర్చుని వున్న దేదీప్య చుట్టే తిరుగుతున్నాయి.

వాళ్లిద్దరు కూర్చున్న విధానం కాని, మాట్లాడుతున్న తీరు కాని ఎక్స్‌ట్రార్డనరీగా అన్పిస్తూ…. ఇన్నాళ్లు లాలిత్యలో కలిగిన సంకుచిత భావాలను చిత్తు చేస్తున్నాయి.

అలాంటి భావాలు తనలో కలిగినందుకు సిగ్గుతో, ప్రశ్చాత్తాపంతో బాధతో చచ్చిపోతోంది.

తనేనా దేదీప్యను పరుషమైన, కఠినమైన మాటలతో అంతగా కుళ్లబొడిచింది? అని కూడా ఆశ్చర్యపోయింది….. ఇదంతా… నేహ వెళ్లిపోయిందని ఆ వీధిలోని వాళ్లంతా దేదీప్య గొప్పతనాన్ని,  మంచితనాన్ని ప్రశంసిస్తుంటే విని, ఆత్మపరిశీలన చేసుకున్నాక ఆమెలో కలిగింది.

ట్రేలో జ్యూస్‌ గ్లాసుల్ని పెట్టుకొని, వచ్చి ముగ్గురికి ఇచ్చింది లాలిత్య.

దేదీప్య ముందు ఒక్కక్షణం సైలెంట్‌గా నిలబడి….

‘‘దేదీప్యా! మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్‌ చేసుకొని, మీ పట్ల మిస్‌ బిహేవ్‌ చేశాను. ఐ యాం సారీ!’’ అంది.

ఒక్కక్షణం లాలిత్యవైపు చూసింది దేదీప్య.

లాలిత్య అంతరంగం నుండి సుగందంలా వెలువడిన ఆ సంస్కారానికి వశమైపోయింది దేదీప్య.

సభ్యత, సంస్కారాలకి ఖరీదు లేనప్పటికీ అవి అన్నింటిని కొనగలవు. దేన్నైనా సొంతం చేసుకోగలవు. అన్నట్లు ఆ ముగ్గురు మంత్రముగ్దులై నమ్రత నిండిన కళ్లతో ఆమెనే చూస్తున్నారు.

‘‘ఇట్స్‌ ఓ.కె.’’ అంది దేదీప్య చాలా కూల్‌గా, ప్లజంట్‌గా లాలిత్య చేతిని తన చేతిలోకి స్నేహ భావంతో తీసుకుంటూ…

తృప్తి నిండిన కళ్లతోవాళ్లనే చూస్తూ….

‘‘అన్వేష్‌! మహిళ సంఘ అధ్యక్షురాలిగా నాదో చిన్న కోరిక’’. అంది యశోదర.

‘‘చెప్పండి! మేడమ్‌!’’ అన్నాడు అన్వేష్‌.

‘‘రోజు రోజుకి ఆడవాళ్ల సమస్యలు పెరిగిపోతున్నాయి అన్వేష్‌! పెళ్లి కాగానే తన సంపాదనంతా చెడ్డ అలవాట్లకి ఖర్చుపెడ్తూ భార్యల్ని వాళ్ల బాధలకి వాళ్లను వదిలేస్తున్నారు. చేతనైతే బయటకెళ్లి సంపాయించుకోమని సలహా యిస్తున్నారు. బయటకెళ్లగానే ఉద్యోగాలు రావటానికి వాళ్లేమైనా ఎం.బి.ఎ.లు , ఎం.సి.ఎ.లు చేశారా? చాలా వరకు అక్షర జ్ఞానం కూడా వుండదు వాళ్లకి…’’ అంటూ ఆగిపోయింది.

ఆమె చెప్పేది వింటూ ఇంకా ఏమి చెబుతుందో విందామన్నట్లుగా చూస్తున్నారు దేదీప్య, అన్వేష్‌.

‘‘ఈ ప్రపంచంలో ఎవరికైనా సుఖంగా సంసారం చేసుకుంటూ ఆనందంగా వుండాలని వుంటుంది.  దాని కోసమే ప్రయత్నిస్తారు. కానీ అది దొరకనప్పుడు ఏం చేయాలి? అన్నదే మా ఆలోచన. స్త్రీలం కాబట్టి ఎందుకూ పనికిరామన్న భావంతో, బయటకొస్తే చలామణి కాలేమేమోనన్న భయంతో, భర్త తన ఫీలింగ్స్‌ని పట్టించుకోకపోయినా అలాగే నెట్టుకొస్తున్నారు.  వ్యక్తిత్వం బాగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో యిలా ఎన్ని రోజులు నెట్టుకురాగలరు? అన్నదే మా బాధ. అందుకే ఇలాంటి వాళ్ల కోసం ఒక పరిశ్రమ లాంటిది పెట్టాలని నిర్ణయించుకున్నాను.’’ అంది యశోదర.

‘‘మీ ఆలోచన బావుంది మేడమ్‌!’’ అంటూ యశోదరను మెచ్చుకున్నాడు అన్వేష్‌.

‘‘ నా ఆలోచన కార్య రూపంలోకి రావాలంటే ఆర్థికంగా కొంత హెల్ప్‌ చెయ్యటానికి మీలాంటి వాళ్లు ముందుకు రావాలి.’’ అంది యశోదర.

‘‘ష్యూర్‌ మేడమ్‌!’’ అంటూ వెంటనే చెక్‌ రాసి యశోదర చేతికి యిచ్చాడు అన్వేష్‌.

‘‘ఇక మేము వెళ్లొస్తాము మేడమ్‌!’’ అంటూ ఆ ఇద్దరు బయటకొచ్చారు.

‘‘దేదీప్యను తన కారులో ఆమె ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తూ…

‘‘దేదీప్యా! నాకు కావ్య యింటి అడ్రస్‌ యివ్వు…..వెళ్లి కలవాలి. ఈ మధ్యన నా మీద ఎందుకో కోపంగా వుంది కాల్‌ చెయ్యట్లేదు.’’ అన్నాడు కారు దిగిన దేదీప్యతో.

కావ్య ఇంటి అడ్రస్‌ చెప్పగానే అతని కారు కదిలింది.

 

* * * * *

 

దేదీప్య చెప్పిన అడ్రస్‌ ప్రకారం అన్వేష్‌ కారు వెళ్లి సంపంగి చెట్టు వున్న ఇంటి ముందు ఆగింది.

కారు దిగిన అన్వేష్‌ హుందాగా నడుస్తూ బాల్కనీలో నిలబడివున్న సరళమ్మ దగ్గరకి వెళ్లాడు.

‘‘కావ్య వుందాండి?’’ అడిగాడు అన్వేష్‌.

‘‘వుంది.  మీరెవరు?’’ అంది సరళమ్మ.

‘‘కావ్య ఫ్రెండ్‌ని. అన్వేష్‌ అని చెప్పండి!’’ అన్నాడు.

‘‘కూర్చోబాబు!     పిలుస్తాను.’’ అంటూ లోపలకి వెళ్లి.

‘‘కావ్యా! ఎవరో అన్వేష్‌ అట.  నీ కోసం వచ్చాడు.’’అంటూ బెడ్‌ రూం డోర్‌ తట్టింది సరళమ్మ.

అన్వేష్‌ పేరు వినగానే ‘‘ఆ… వస్తున్నా’’ అంటూ మెరుపులా బయటకొచ్చింది కావ్య.

లైట్‌ పింక్‌ కలర్‌ శారీలో వున్న కావ్య తల తుడుచుకుంటూ వెళ్లి అన్వేష్‌కి ఎదురుగా నిలబడి ‘హాయ్‌’ చెప్పి కూర్చుంది.

‘‘ఇవాళ నిద్రలేవటం లేటయింది అన్వేష్‌! ఆఫీసుకి టైమయింది.’’ అంది తన వేళ్లను జుట్టులోకి పోనిచ్చి సవరించుకుటూ.

‘‘నాకోసం ఇవాళ ఆఫీసుకి వెళ్లటం మానుకోలేవా కావ్యా! నీతో కొంచెం మాట్లాడాలి.’’ అన్నాడు.

జుట్టు వదిలి న్యూస్‌పేపర్‌ చేతిలోకి తీసుకుంటున్న కావ్య అతని మాటలకి తలెత్తకుండానే కళ్లతో చూసింది. ఆ చూపు నేరుగా అతని గుండెల్ని తాకింది.

వెంటనే కావ్యకి దేదీప్య గుర్తురావటంతో….

‘‘నాకు ఇవాళ ఆఫీసులో అర్జంట్‌ మీటింగ్‌ వుంది. సారీ!’’ అంది కావ్య.

అన్వేష్‌ ఏం మాట్లాడలేదు. లోలోన ఫీలయ్యాడు. అది గమనించిన కావ్య వుండబట్టలేక….

‘‘ మీ అవసరానికి దేదీప్యను ఆఫీసులో బాగా వుపయోగించుకుంటున్నారు. ఆమె పర్సనల్‌ లైఫ్‌లో జరుగుతున్న సమస్యల్ని చెబుతున్నప్పుడు వినాల్సిన అవసరం కూడా లేనట్లు కాల్‌ కట్‌ చేశారు. ఇప్పుడు నా పని వదిలేసుకొని మీ కోసం ఎలా వస్తాననుకున్నారు?’’ అంది కావ్య.

నవ్వాడు అన్వేష్‌

‘‘నువ్వు ఈ మధ్యన ఊరిలో లేవా కావ్యా?’’

‘‘లేను నల్గొండ వెళ్లి ఈ రోజే వచ్చాను.’’

‘‘చూడు కావ్యా! దేదీప్య గురించి నీకన్నా నేనే ఎక్కువగా ఆలోచిస్తాను.  ఎందుకంటే ఆమె నాకు ఇప్పుడు మంచి స్నేహితురాలు.  నువ్వా రోజు ఫోన్లో మాట్లాడిన వెంటనే నేహ దగ్గరకి వెళ్లి మాట్లాడాను.  తాతయ్య తో చెప్పి కాగజ్‌నగర్‌లో వుండే పేపర్‌ మిల్లులో నేహకి ఉద్యోగం యిప్పించాను. ఆమె ఇక వైజాగ్‌ రాదు.  ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయినట్లే కదా?’’ అంటూ తిన్నగా ఆమె కళ్లలోకి చూశాడు.

దేదీప్యకి అంత సహాయం చేసిన అన్వేష్‌ని తొందరపడి అలా అన్నందుకు ఫీలవుతూ….        ‘‘సారీ!’’ చెప్పింది కావ్య…

‘‘ఎప్పుడు చూసినా, మీ ఫ్రెండ్‌ దేదీప్య గురించే ఆలోచిస్తావా? నేను కూడా నీకు….’’ అంటుండగా సరళమ్మ అటువైపు రావటంతో…చెప్పాలనుకున్నది ఆపేశాడు అన్వేష్‌.

‘‘సరే! మీతో కలసి బయటికొస్తాను. ఒక టెన్‌మినిట్స్‌ వెయిట్‌ చెయ్యండి!’’ అంటూ లోపలకెళ్లింది.

 

‘‘మమ్మీ! నేను ఆఫీసుకి వెళ్తున్నా.’’ అంటూ బయటకొచ్చి అన్వేష్‌ కారెక్కింది.

కారు నడుపుతున్నాడు అన్వేష్‌. అతని చూపులు రోడ్డును గమనిస్తున్నా మనసు కావ్యను పరికిస్తోంది.  కావాలనుకున్నది. దొరక్కపోయినా దొరికనదాన్ని కావలసిన విధంగా మార్చుకోవటంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు.   మనసును సంసిద్ధం చేసుకుంటున్నాడు.

‘‘దేదీప్యకి అప్పట్లో మీరు పంపిన మెసేజ్‌లు చూసుకుందామని వచ్చారా మా యింటికి?’’ అంటూ టాపిక్‌ని దేదీప్య పైకి మళ్లించింది.

‘‘పర్వాలేదు. అప్పటి విషయాలను నువ్వేం మరచి పోనట్లున్నావ్‌.’’

‘‘అప్పట్లో ఎప్పుడు మీరు నా దగ్గరకి వచ్చినా దేదీప్య గురించి తెలుసుకోవటానికే కదా! ఇవాళ కూడా అందుకే వచ్చారేమో అనుకున్నా….’’

‘‘ఇందాక నేనేదో మాట చెప్పబోయి ఆగాను. అదేమిటో అడగవా?’’ అంటూ బీచ్‌ దగ్గర కారు ఆపాడు.

అర్థం కానిది, దొరకనిది సైతం వెతికి పట్టుకునే సత్తా వున్న అన్వేష్‌కి కావ్య అంతరంగాన్ని అంచనా వెయ్యడం అంత కష్టమేం కాదు.

‘‘అవును కదూ! మరిచిపోయాను. చెప్పండి!’’ అంది కావ్య.

‘‘ఏంటో కావ్యా! ఇది వరకు ఏ విషయమైనా నీ దగ్గరే మాట్లాడగలిగే వాడ్ని. ఇప్పుడు నీ విషయమే నీ దగ్గర మాట్లాడాలంటే టెన్షన్‌గా వుంది.’’ అన్నాడు కావ్యనే చూస్తూ.

ఇద్దరు కారు దిగి ఇసుకలో మెల్లగా నడుస్తున్నారు.

కావ్యకి అతని మాటలు కొత్తగా అన్పిస్తున్నాయి…..తన కలగన్నది నిజం కాబోతుందా అని అనుమానం వచ్చింది. మళ్లీ తన అనుమానం నిజం కాదేమోననుకొని…..

‘‘చెప్పు అన్వేష్‌! నా ద్వారా మళ్లీ ఏదైనా సాధించుకోవాలనుకుంటున్నారా?’’అంది కావ్య.  ఆమె మాటల్లోని ఆత్మాభిమానానికి కదిలిపోయాడు.

‘‘ఒకవేళ నిన్నే సాధించుకోవాలనుకుంటే?’’ అన్నాడు

ఆ మాటలకి నడుస్తున్న కావ్య అడుగులు ఆగిపోయాయి.  అన్వేష్‌ ఏమీ ఎరగనివాడిలా కావ్య ముఖంలోని మార్పుల్ని గమనించసాగాడు.

‘‘జోక్‌ చెయ్యటానికా నన్నింత దూరం తీసుకొచ్చారు?’’ అంది కావ్య మామూలు దోరణిలో..

వెంటనే ఆమె వైపు చూశాడు.

‘‘ మా అమ్మా, నాన్న గారు ఈ మధ్యన నన్ను పెళ్లి చేసుకోమని తొందర చేస్తున్నారు. పెళ్లి అనగానే ఎందుకో ముందు నువ్వే గుర్తొచ్చావు.  నేనంటే ఏమిటో నీకు తెలుసు… నా మనసులో ఏముందో తెలుసుకోటానికి యింత టైం పట్టింది.  తెలుసుకున్నాక నీకు చెప్పాలనిపించింది.’’ అన్నాడు.

కావ్య ఏం మాట్లాడకుండా అతన్నే గమనిస్తోంది.

‘‘దేవుడు మనిషికి మరచిపోవటమనే గొప్ప వరాన్ని యిచ్చాడు కావ్యా! నేను దేదీప్యను ప్రేమించానన్నది ఎంత నిజమో నిన్ను యిప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది అంతే నిజం’’ అన్నాడు.

కావ్య కళ్లలోకి అనుకోకుండా నీళ్లొచ్చాయి.

‘‘ఇది కలా?నిజమా? అన్వేష్‌?’’ అన్నట్లు చూసింది కావ్య.

ఆమె మనసుతోపాటు ముఖం కూడా వేలకాంతులతో వెలిగినట్లై, గుండె లోపల గూడు కట్టుకున్న భావం సముద్రపు హోరులా మారి, చైతన్యమైన అలలా వురకలేస్తోంది.

‘‘ నా మనసు గురించి నీకన్నా ఎక్కువగా చదివిన వాళ్లెవరూ లేరు కావ్యా! అందుకే నువ్వైతేనే నాకు కరక్ట్‌ అన్పించింది. అయినా ఒక్కటి చెప్పు? నీ మనసులో నేను లేకపోతే నా దగ్గర ఎప్పుడూ కావాలనే దేదీప్య ప్రసక్తి తెచ్చేదానివి. దేదీప్య వంకతో ఆఫీసుకి తరుచుగా వచ్చి నన్ను గమనిస్తుండేదానివి. నాకు, దేదీప్యకి మధ్య యిప్పుడు కూడా ఏమైనా జరుగుతుందేమో చూద్దామని వచ్చేదానివి.  మరి ఏమి లేదని తెలిశాక కూడా నువ్వెందుకొచ్చావు? నా కోసమే కదా?’’ అన్నాడు.

ఆ మాటలు వినగానే కావ్యకి తన మనసును అన్వేష్‌ దొంగతనంగా చదివాడని అర్థమైంది.                                       ‘‘పిడికెడు అనుభూతి కోసం హృదయాన్ని పోగొట్టుకున్న క్షణం నుండి నాలోనేవున్న మీకోసం నా మనసు నిద్రపోలేదు అన్వేష్‌!’’  పదాలు దొరకని ప్రపంచంలోకి వెళ్లి మౌనంగా నిన్నే గమనిస్తోంది. నీ ఉనికి చుట్టే తిరుగుతోంది. అని కావ్య అనగానే….

అన్వేష్‌ హృదయం ఉప్పొంగింది… విశాఖ సముద్ర తీరాన్ని తాకే కెరటంలా….

 

* * * * *

 

వాతావరణం ప్రశాంతంగా వుంది.

పత్రికాఫీసు నుండి ఇంటి కొచ్చాక  రీఫ్రెష్‌ అయి భోంచేసి, తన బెడ్‌ రూంలోకి వెళ్లి చదువుకుంటూ కూర్చుని వున్న దేదీప్య పక్కన కూర్చున్నాడు దీపక్‌.

‘‘కావ్య అన్ని చెప్పింది దేదీప్యా!  నేనిప్పుడు చాలా హేపీగా వున్నాను. నా మనసులో నీపట్ల ఎలాంటి భావబేదాలు లేవు. అన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు నేను  నీ మనిషిగా, నీ దగ్గరకి వచ్చాను.’’ అంటూ ఆమె  చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

స్త్రీ ఎంత ఎత్తులో వున్నా, ఆ స్త్రీ చేతిని ఒక్క భర్త మాత్రమే అలా పట్టుకోగలడు.

కష్టం వచ్చినప్పుడు కాని,  అమితమైన సంతోషం వచ్చినప్పుడు కానీ నీ మౌనమే నిన్ను రక్షింస్తుంది అన్నట్లుగా మాట్లాడలేదు దేదీప్య.  సుఖంలోను, కష్టంలోను ఆమె మోముపై కన్పిస్తున్న ఆ గాంభీర్యం, ఆ స్థితి ప్రజ్ఞత దీపక్‌కి ఏదో నేర్పుతున్నట్లు అన్పించింది.

తన ఆగమనాన్ని దేదీప్య అంగీకరించిందా లేదా అన్న సందేహం వచ్చినవాడిలా ఒక్కక్షణం ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె కళ్లలో ఏ భావం లేదు.

కొన్ని సందర్భాల్లో భార్య ముఖంలోని భావాలను చదివే శక్తి ఏ భర్తకీ వుండదు.  దీపక్‌ పరిస్థితి కూడా అలాగే వుంది. తన భార్య తనను నచ్చి…. పరిపూర్ణంగా తను ఆమె మనిషినైపోతే బావుండు అని తొలిసారిగా అనుకున్నాడు.

ఒక మనిషి నచ్చటం అనేది రకరకాలుగా వుంటుంది,  శరీరం నచ్చటం, ప్రవర్తన నచ్చటం…తెలివితేటలు నచ్చటం… డబ్బు నచ్చటం…… అంతేకాని మొత్తంగా ఒకరికి ఒకరు నచ్చటం అనేది ఎక్కడా జరగదు. అవతలవారి మంచితనంతో పాటు,  వారి బలహీనతల్ని పట్టించుకోకపోవటం ‘సర్దుబాటు.’ కొన్ని

నచ్చటంతో మరికొన్నిటిని ఇష్టపడటం ‘ప్రేమ.’ డబ్బు నచ్చటంతో మిగతావి వదిలిపెట్టటం ‘వ్యాపారం.’ ఈ వ్యాపార సరళితో సాగే కొన్ని కాపురాలలో తన కాపురం కూడా ఒకటి.  తనేమైనా ప్రత్యేకమైన వ్యక్తా, అనుకొంది దేదీప్య.

‘‘కాపురం అంటే వ్యాపారం కాదని తెలుసుకున్నాను దేదీప్యా! ఇకపై నిన్ను పువ్వుల్లో పెట్టుకొని… ’’ అని అంటున్న అతన్ని తన చేతి సైగతోనే మధ్యలో ఆపింది దేదీప్య.

‘‘ఎందుకండీ అంత కష్టపడ్తారు. నన్ను మీరెలా చూసుకుంటారో….. ఎలా చూడగలరో…నాకు తెలియదా? ఇప్పుడు నేను అన్నీ వదిలేసి మీ చేయి పట్టుకొని, కొత్తగా కాపురానికి వచ్చినట్లు వచ్చినా నన్ను పువ్వుల్లో పెట్టుకొని  చూడరని, పువ్వులపై నడిపించలేరని తెలుసు. అక్కడ వుండే ప్రతి ముళ్లూ ఎంత వాడిగా వుంటుందో నాకు తెలుసు.  కానీ…. ఈ జీవన యాత్రలో మీతోడు నాకెంతో అవసరం. మీతోడు లేకుండా మమ్మల్ని ఈ

సమాజం గౌరవించేంత ఎత్తుకి ఎదిగితే మీలాంటి భర్తలకి భ్యార్యలుండరు, సేవలుండవు.’’ అని మనసులో అనుకుంటూ…

ప్రస్తుతం మానవ సంబంధాలని డబ్బుతో లెక్కకట్టి, వ్యాపార బంధాలుగా చేసుకుంటుంటే… మానవతా విలువల్ని పెంచుకుంటూ, మానవత్వంతో అత్త, మామల్ని ఆదరించి, భర్తని క్షమించి, స్వయంకృషిని నమ్ముకొని తనకు తానే ఆదర్శంగా నిలిచిన దేదీప్య మౌనం చూసి ఎప్పటిలా ఫీలవ్వకుండా …. సరికొత్త రాగాలను వింటున్నట్టు… కళ్లు మూసుకొని ప్రశాంతంగా పడుకున్న దీపక్‌ మనసు మౌనరాగాలను పలికింది.

అప్పుడు… దేదీప్య తన చీర కొంగుతో  అతని మోముపై చెమట బిందువుల్ని అద్దుతున్నట్లు… కురులతో ముఖాన్నంతా కప్పినట్లు… అద్భుతమైన కల వచ్చింది దీపక్‌కి.

దేదీప్య మాత్రం లక్ష్యం పేపర్‌లోని ఎడిటోరియల్‌ చదువుతూ… ‘ఇక ముందు పాఠకుల్ని నైరాశ్యపు అగాధాల్లోకి నెట్టివేసే సంపాదకీయాలకి స్వస్తి చెప్పి…. హృదయాంతరాలను విప్పి చూపితే  మనమెలా వుంటామో దాన్నే వ్యక్తీకరించి….దైనందిన జీవితంలోని అనుబంధాలను అక్షరాల్లోకి అనువదించాలి’ అని మనసులో అనుకొంటూ భర్త వైపు చూసింది. అతను కలలో నవ్వుకుంటున్నాడు. ఆ నవ్వునే చూస్తూ కూర్చుంది దేదీప్య.

నిద్రలో వున్న దీపక్‌ ఎప్పుడు మేల్కొన్నాడో తెలియదు కాని అతని చేయి దేదీప్య భుజాలచుట్టూ చేరి దగ్గరికి లాక్కుంది.

ఆ  చర్యకి… ఒక్కక్షణం…. ఆమె మనసులో ఏదో సంచలనం మొదలై…క్షణాల్లో అది గుండె నిండా వ్యాపించి ఆశ్చర్యపోయేలా చేసింది. కానీ… గతంలో తను తన అస్థిత్వాన్ని కోల్పోయి… ఒంటరిగా ఎవరు చూడకుండా బోరున ఏడ్చుకున్న క్షణాల కన్నా ఈ క్షణాలు ఎంతో రీలిఫ్‌గా అనిపించి….. ఆమె గుండె చప్పుడు ఆ గదిలోని ఎ.సి. చప్పుడుని ఆలింగనం చేసుకుంది.

ఇప్పుడు దేదీప్య మనసు…. పూలగుత్తిలా పైన వేళాడుతున్న ఖరీదైన షాండిలీర్‌లా దేదీప్యమానమై వెలిగింది.

ఆ వెలుగు వాళ్ల జీవితాలనే కాక…. లక్ష్యం పత్రికతోపాటు ప్రసరిస్తూ`తన                   అనుభవాలను పాఠాలుగా మార్చుకొని…. లక్షల లక్ష్యాలను వెలిగిస్తుంది.

 

‌ సమాప్తం

 

 

 

 

1 thought on “మౌనరాగం – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *