March 29, 2024

అనుకున్నదొక్కటి .. అయినదొక్కటి ..

రచన: లక్ష్మీ వసంత vasanta

ఈ ఆదివారం అయినా ఈనాడు అనుబంధంలో కథ, హిందూలో కల్పనా శర్మ వ్యాసం చదివేయాలి అన్న నా చిన్న చిన్న ఆశలకి గంట కొట్టేస్తూ ఫోన్‌ కర్కశంగా మోగింది.  ట్రింగ్..ట్రింగ్ మంటూ ..  ఖంగారు  పడకండి అవి లాండ్ లైన్‌ మాత్రమే ఉన్న రోజులు మరి . నా జీవితంలో ఎప్పటికైనా ఈనాడు ఆదివారం అనుబంధంలో నా కథ చూసుకోవాలని ఎంత ఆశో!!  కథకి వేసిన బొమ్మ కింద నా పేరు రచయిత్రి  – సి. వకుళ అని చూసుకోవాలని కలలు కంటూ ఉంటాను. ఐతే అది ఉత్త పగటి కల, నువ్వు అసలే పగలు ఎక్కువ నిద్రపోతావు.  నీ పేరు వకుళ అని కాదు  అసలు ఊర్మిళ అని  ఉండాల్సింది అంటూ ఆటలు పట్టిస్తారు పిల్లలూ, వారి నాన్న కూడ కలిసిపోయి! అదేమిటో కానీ   ఈ విషయంలో వాళ్ళందరూ ఒకటైపోతారు .

నా కథలంటే అందరికీ వేళాకోళమే. ” అమ్మా ! నువ్వు పుట్టినప్పటి నుంచి చదివేస్తున్నంత మాత్రాన, రచయిత్రివి అయిపోలేవు. రచయిత్రిగా  పుట్టాలి ” అంటూ పెద్దవాడు అస్తమానం నన్ను ఏడిపిసాడు.  అయినా సరే నా ఆశ చచ్చిపోలేదు.  దానికి మటుకు నీళ్ళు పోసి అలా బతికించుకుంటూ వస్తున్నాను.  ఎందుకంటే మా ఇంట్లో చిన్న మొక్క అయినా బతకదు అదేమిటో మరి ?  మనకి మొక్కలు అచ్చి రావు అని మా అమ్మ తరచు వాడే మాటే నేనూ వాడేస్తాను, అసలు విషయం ఏంటంటే.. నాకు నీళ్ళు పోయాలంటే .. హ్మం ..చెప్పేస్తున్నా (ఎవరైనా అంటే ఊరుకోను కానీ..) నాకు బద్ధకం ఎక్కువ . అందుకే మా ఇంట్లో పచ్చదనమూ అవీ జాంతా నై ..

పెద్ద వాడు –  ‘నాకు ఏ ట్యూషన్లూ వద్దు, అమ్మా నే చదువుకుంటాగా’  అని అంటే వినకుండా ‘అందరూ ఇక్కడే చదివి పెద్ద ఇంజనీర్లు అయిపోయారుట్రా’  అంటూ నేనే ఈ కోచింగ్ లో పెట్టాను.  దాంతో ఆదివారం అయినా వాడు సమయానికి  ఇంట్లో  లేకుండా పోయాడు .

నా రెండో సుపుత్రుడు ‘ఇప్పుడే మంచి నిద్ర పడుతుందమ్మా , ఇలా పొద్దున్నే తొమ్మిదింటికే  నన్ను ఎందుకు లేపావు ?’  అంటూ చిందులు వేస్తాడు ..

ఇక మా ఆయనన అంటారా ? హు  – అసలు ఇక్కడ ఉన్నప్పుడే సాయం లేదు. ఇక ఊరులో లేనాయన  గురించి  యేమనుకుంటాం ? ఉన్నా,  అదిగో ఏ పని చేసినా ఒంకలు పెడతావు. ఐనా ఈ పెద్ద గిన్నెలో పాలు కాస్తే ఏమయిందిట?  ఇప్పుడు ఏం కొంపలు మునిగాయి ?’ అంటారు.  ఏమీ మునగలేదు కానీ   అది అన్నం గి్న్నె.  అది మళ్ళీ తోముకోవాలి  ఇప్పుడు. –  అని పళ్ళు నూరుకున్నా లాభం ఉండదు,   నేను అనే మాటలకి చీమ అయినా కుట్టినట్టుండదు ఎందుకో మరి. పైగా ఆ మాటంటే  ‘ చీమలల్లేవుగా మనింట్లో ’ అంటూ నవ్వుతాడు  ప్రభాకర్ . నాకు ఒళ్ళు మండేలా. సెన్సాఫ్ హూమర్ కేం తక్కువ లేదు.  ఇంట్లో పని చెప్పక పోతే చాలు ఆయనంత సరదా మనిసి ఉండరు ప్రపంచంలో .

ఇలాంటి ఇంట్లో నా కథలూ, కావ్యాలు ఎలా జరుగుతాయి  మరి? అప్పటికీ నా శాయశక్తులా మూడు పుస్తకాలు, ఆరు వార్తా పత్రికలు రోజంతా చదువుతూనే ఉంటా. నా కోరికని  పచ్చగా బ్రతికించుకుంటూ ..

ఇంతకీ ఆ ట్రింగ్ మనే గంట నా గుండెల్లో ధడ్ ధడ్ మని రైళ్ళు పరుగులు పెట్టించింది.  ఎందుకంటే, దానికోసం రింగ్ రింగ్ అంటూ వెనక్కి వెళ్ళాలి నలుపు తెలుపుల ఫ్లాష్ బాక్ లోకి… ఇదిగో వెళుతున్నా ..

ప్రభాకర్ వారింటికి ఒకసారి డిన్నర్ కి వెళ్ళి వచ్చి ఎన్ని పగళ్లు,  రాత్రులు వర్ణించి చెప్పాడు అంటే… నాకు ఆశాదేవి అంటే పరమ చిరాకు పుట్టేసింది. ఎవరీ ఆశాదేవి అంటే???  వాళ్ళ బాస్ భార్య పేరు అదే.  ఆవిడ వండిన వంట , సర్దుకున్న ఇల్లు గురించి మెచ్చుకున్నప్పుడల్లా , మన ఇల్లు చూడు, నీ వంట చూడు అని అన్యాపదేశంగా నా ఇంటిని , వంటని దెప్పుతున్నట్టు ఫీల్ అయిపోయి , ఆ విషయమై పెద్ద యుద్ధాలు కూడా అయి ఆఖరుకి మరెప్పుడూ ఆ ఊసు ఎత్తనని ఒక శాంతి ఒప్పందం జరిగాక  మా ఇంట సమరం ముగిసింది .

ఈ ఆదివారం ఏమయిందంటే  ప్రభాకర్ నుంచి వచ్చిన ఫోన్‌  వచ్చింది . ఆ ఆశాదేవి, ఆవిడ గారి   భర్తా వస్తున్నారుట మా ఇంటికి. ఏదో పెళ్ళికి దిగారట .  సమయం ఉంది కదా మన ప్రభాకర్ ఇంటికి కూడా వెళదాం అని ముచ్చట పడ్డారుట.  వాళ్ళూ ఏ  క్షణంలోనైనా వస్తారు  కాబట్టి,  అప్పటికే  నే చేయవల్సిన పనులు గుర్తు వచ్చి సరే అంటూ ఫోన్‌ పెట్టి  ‘పరుగులు తీయాలి’ అనుకుంటూ కూలబడ్డాను ఇలా సోఫాలో .

‘ఎక్కడనించి మొదలుపెట్టాలి ‘ అని ఆలోచిస్తూ మొదటి అడుగుగా ఎగురుతున్న వార్తా పత్రికలు అన్నీ కలగలిపి  ఈ వారం కూడా నా కోరిక తీరలేదు అనుకుని నిట్టురుస్తూ .. బీరువా తెలుపు తెరిచి అందులో పడేసాను, నేనసలే పెద్ద పనిమంతురాలిని కాదు అని చెప్పానా ! ఆ పై నాది జాలి గుండె, పని వారికీ కావాలి సెలవు అని నమ్మి, ఆదివారం సెలవిచ్చేసాను పనిమనిషి కి. దాంతో సింక్ నిండా గిన్నెలు నా రాక కోసం ఎదురు చూస్తూ పడి ఉన్నాయి .

నిన్న యోగా (ఈ మధ్యే మొదలు పెట్టాను లెండి )చేస్తూ, హాల్ మధ్యలో పడుకుని తల పైకెత్తి చూస్తే ఏమిటో మసక మసకగా కనిపించిది. ఏమిటా అని కళ్ళ జోడు పెట్టుకుని చూస్తే ,ఈవిడ మన జోలికి రాదులే అని ధైర్యంగా అల్లుకున్న సాలి గూళ్ళూ.   ఈ మధ్యనేగా  పండక్కి (అంటే ఆరు నెలలయిందేమో)  తుడిపించానే .. అబ్బ ఈ ఇంటికి ఎంత చేసినా సరిపోదు అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాను .

పాతది ఇచ్చి గుండ్రంగా ఎంత బాగుందో అని ముచ్చట పడి కొన్న వాక్యూం క్లినర్ అలా దుమ్ము పట్టి పడి ఉంది ఆ మూల వాడొచ్చు కదా!  ప్రభాకర్ గొంతు సిన్మా లోలా వెనక నించి వినిపించింది ’ ఆ నాకూ తెలుసు.. చేతులు పీకవూ !’

‘వెయ్యి రూపాయలు కట్టి నేర్చుకున్నావు ఆ ఏరోబిక్స్. డబ్బు వేస్ట్ .’

ఓహో!  ఇంట్లో ఈ పనులు చేస్తే చాలని కాబోలు ఈయన గారి అభిప్రాయం . ఛా!!  ఇలాంటివన్నీ ఆడవారిని ఇంటికి కట్టి పడేసేందుకు వాడే  పద జాలం .. ఏం? పోనీ  నువ్వు చేయవచ్చుగా  ఆ క్లీనింగేదో ముచ్చటగా ! వేల రూపాయిలు పోసి కొన్నందుకు ? అట్టేట్టా ? అంతే మరి.  ఆ పైన ఆ  ఊసు బంద్ .

ఎక్కడని మొదలు పెట్టాలి ? సింక్ లో ముందు తేలికగా ఉన్న కంచాలు, గ్లాసులు కడిగి పెట్టి మిగిలినవి బయట బుట్టలో నీళ్ళు పోసి నాన పెట్టా. అదేమిటో మనం తోమితే అంట్లు ఇన్నేసి కనిపిస్తాయి పని మనిషి అలా వచ్చి ఇలా తోమేస్తుంది అదేమి వింతో కదూ ?  అయినా ఇన్ని అంట్ల గిన్నెలు అసలు ఎలా అయాయి ? హమ్మో . ఇక్కడే కూర్చుంటే ఎలా అనుకుంటూ అక్కడ నుంచి  కదిలా..   భోజనాలకి వస్తారా ? అనుకుంటూ ఫ్రిజ్ తలుపు తెరిచి తొంగి చూస్తే ఏవో  కొన్ని కూరలు కనిపించాయి. ఏదో ఒకటి ఆలోచిద్దాం ముందు తరిగి పెట్టుకుంటే పోలా  అని నాలుగు రకాల కూరలు తరిగి పడేసాను.

ఇక ఇల్లు సర్దడం సంగతి చూడాలి.  అసలే వచ్చేది ఆశాదేవి. చాలా అందంగా కూడా ఉండే ఉంటుంది .. ప్రభాకర్ కి సౌందర్య ఆరాధన ఎక్కువ అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చి..  కొత్త వాక్యూం క్లీనర్ వాడే ముహూర్తం వచ్చింది అని దానిని లాక్కుంటూ వచ్చి , అన్ని అమర్చుకుని  ఆ సాలెగూడుల పని చూసా.  ఇంకా  చాలా మూలలు ‘ మా సంగతో’  అంటూ  దుమ్ము ముఖాలతో అరచి చెప్పాయి. అదేదో  యాడ్ లోలాగ పాలల్లో  కార్న్‌ ఫ్లేక్స్ తిని ఉన్నానేమొ , మహా హుషారుగా ఎంత బాగా పని చేస్తోందో అంటూ హాల్ లో మార్బుల్ నేల, సోఫాల కిందా, పైనా  తీవాసీ అన్నీ శుభ్రం   చేసి హమ్మయ్య అని నిట్టూర్చేసరికి , మరి నా సంగతేమిటి ? అంటూ చూసాయి, ఎంత బాగున్నాయో అని ఇష్టపడి కొన్న ప్లాస్టిక్ పూలు.. అవి కాస్తా బూజు పూలుగా కనిపించేసరికి వాటికి కొళాయి కింద ఒక సారి తలస్నానం చేయించి , వాస్ లని కూడా చేతి గుడ్డ తో తుడిచి..

అబ్బబ్బ . ఇంటి పని ఎంతకీ తెమలదేం ? గోడ  మీద ఉన్న  కు కు వాచ్ పదకొండు అయిందని చెప్పింది కు కు అంటూ అరుస్తూ. బాబోయ్ కాలం ఇలా ఆగిపోనీ అని పాడుకుంటూ వంటింట్లోకి జంప్ చేసి , కుకర్లో అన్నం పప్పు పడేసి  నాకు బాగా వచ్చిన సాంబారు చేద్దాం అని తరిగిన కూరలు పాన్‌ లో పడేసాను .  ఇంకా గదుల సంగతి చూద్దాం  అని పిల్లల గదిలోకి అడుగు పెట్టాను. రాత్రి ఏమైనా టోర్నడో వచ్చిందేమో అన్నట్టుగా ఉంది ఆ గది పరిస్థితిని చూస్తూంటే . గది నిండా దుప్పట్లు, దిళ్ళూ, పుస్తకాలు చెల్లా చెదురుగా పడున్నాయి.. నీ చిన్నప్పటి కబుర్లు చెప్పమ్మా అంటే మా చీకటి గది ఆట గురించి చెప్పాను. ఇంక అంతే. నేను నా గదిలో ప్రపంచం అంతా నిశ్చింతగా ఉంది అన్న భ్రమలో చేతిలో ఒక పుస్తకం పట్టుకుని చదువుకునే సమయాన వీళ్ళిద్దరూ ఇలాంటి ఆటలు ఆడుకుంటారు ..

ఆ దుప్పట్ల మధ్యలోనే ఎక్కడో  మా చిన్న వాడు  ఎక్కడో  ఉండే ఉంటాడు.  సర్దడం అనే కార్యాన్ని  కుదించి ‘ అన్నీ తోసేయడం’  అనే కార్యక్రమంలోకి దూకాను ..  కనిపించినవి కనిపించినట్టు  బీరువాలలోకి తోసేసాను.  ఇంతకన్నా ఏమీ చేయలేం , బాబూ లేవరా ! అన్న నా పిలుపు సాంద్రత వాడికి సరిపోదు  అని తెలిసినా  నా ప్రయత్నం నేను చేసి విరమించుకున్నాను . ఎందుకంటే , ఇంకా,,ఇంకా  అరిచే ఓపిక నాకు లేదు.

మరో గదిలోకి అడుగిడితే అంతా ఆదివారం ఆబిడ్స్ బజారులా ఉంది.  నాకు కావల్సిన పుస్తకం ఒకటి   కనిపించక , అలా అన్ని పరిచింది నేనే అని గుర్తు వచ్చింది.  ఇది జరిగి వారం అయింది.  అయినా ఇలాగే ఉందా ? ఈ గది. ఎవరికీ పట్టదు. ఛా!!  అని విసుక్కుంటూ ఆ చెదురు మదురుగా పడి ఉన్న పుస్తకాలు అన్నీ వాటి బీరువాలోకి ఎక్కించాను . మధ్యలో తిలక్ కవిత్వం కనిపించి ఒక్కసారి అనుకుంటూ ఒక్క పది నిముషాలే అనుకున్నాను. ఇంతలో  ఏదో వాసన. వంటింట్లోంచి మాడు పిలుపులు ముక్కుని పట్టి లాగాయి .

నేను ఒక్కర్తినీ ఎన్ని విషయాలని చూసుకోను.. అంటూ ఉక్రోషంతో ముక్కు పీలుస్తూ  ఒక్క ఉదుటున వంటింట్లోకి వెళ్ళా.

మరీ అంతా మగవాళ్ళే ఇంటి నిండా.. ఒక్క ఆడ పిల్ల ఉంటే ఎంత సాయంగా ఉండేది ? అమ్మో ఈ మాట అనుకుంటే చాలు అమ్మ సతాయింపులు గుర్తు వచ్చేస్తాయి.. వద్దు అందరూ కలిసి పనులు చేసుకోవాలి. మగ పిల్లాడు అని ముద్దు చేయను. ఏదో చిన్న పిల్లలని ఇంకా పనులు చెప్పటం లేదు అంతే .. లేక పోతే వాళ్ళ నాన్న లాగే తయారవరూ ?

మాడి పోయిన వాటి నుండి పనికి వచ్చేవి వేరు చేసి , పూరీల కూర కోసం ఆలూ మళ్ళీ కుకర్ లో పడేసి సాంబారు, కొబ్బరి పచ్చడి ( కొబ్బరి కోరు ఫ్రిజ్ లో ఉంది కొంచెం  నయం పని తగ్గింది)  కాబేజ్ కొబ్బరి కూర , ఎలెక్ట్రిక్ కుకర్ లో నాలుగు రకాల కూరలతో బిర్యాని, దానిలోకి ఉల్లి తరుగు  రైతా కి. ఇలా నాలుగు చేతులతో ఎడా పెడా వంట అయింది అనిపించి , పాలు కూడా కాచి ఉంచాను. నాకు వచ్చిన ఒకే ఒక స్వీట్ .. పాయసం చేద్దాం అని తీర్మానించుకున్నాను నాకు నేనే .

నేను చూడని, కలవని ఆశా దేవి తో నాకు ఈ పోటీ ఏమిటొ. పోనీలే పిల్లలు ఆదివారం కదా. శుభ్రం గా తింటారు. ఎప్పుడు వస్తారో ఏమిటో. భోజనాల వేళ కి వస్తే ఉంటాయి అనే కదా ఇదంతా చేయడం .

సరే ఆఖరుకి మా గదిలోకి అడుగుపెట్టి  ఒక్కసారిగా తుళ్ళిపడ్డాను. లోపల  ఒక్క అంగుళం కూడా ఖాళీ లేదు. నాకు ఇంత మతి మరుపేమిటి ?   నిన్నే కదా అలమారాలు సర్దుకుందామని అన్నీ తీసి బయట పెట్టి , గ్రిషాం పుస్తకం ఆఖరి పేజీలు చదువుతూ సోఫాలోనే నిద్రపోయాను . అసలు నిజం ఏమిటంటే ఎప్పటికప్పుడు తర్వాత సర్దుకుందాం అని తోసేసిన బట్టలలోంచి చీర ఉంటే జాకెట్టు ఉండదు, కుర్తా ఉంటే చున్ని ఉండదు.  నాలాంటి వారే కాబోలు ఈ మిక్స్ అండ్ మాచ్ అనే కొత్త ఫాషన్‌ మొదలు పెట్టారు , ఇలా కాదని నిన్నే మంచి రోజని ముహూర్తం చూసి మొదలుపెట్టాను , అబ్బే మంచి రోజు అంటే నాకు మూడ్ వచ్చిన రోజు అని అంతే .

ఇప్పుడు ఈ పని కూడా నా ! సరే పనిలో పని అని , చీరలన్నీ బొత్తుగా ఒక వేపు, సల్వార్ సూట్స్ అన్నీ మరొక వేపు, జాకెట్లు అన్ని ఇంకో అరలో ఇలా ముచ్చట గా సర్దుకుంటూ ఒక గంట గడిచిపోయింది . అమ్మా .. అన్న  మావాడి   కేకతో తుళ్ళి పడి,  లేచి ముందు పాలు తాగు . ఇవాళ్టికి బ్రేక్ ఫాస్ట్  వొద్దు . ఇంక ఏకంగా భోజనం చేసేద్దువు గానీ.  అంటూ స్నానంచేయమంటూ  వాడిని  బాత్రూంలోకి తోసాను .

అలమారాలో బట్టలు సర్దడం అయింది , నా అలంకరణల అలమారా తెరిస్తే .. అదీ అంతే   నానా రకాల సీసాలు, డబ్బాలతో నిండిపోయి కనిపించింది . అన్ని కష్టాలు ఇలా ఒక్కసారే  అందరిలోనూ  నాకే ఎందుకు వస్తాయి ? ఇలా ఎందుకు ఉంది ? ఎప్పటికప్పుడు సర్దుతూనే  ఉన్నాగా ? అయి నా , ఈ ఆశాదేవి కి ఈ ఆదివారం నా ఇల్లే దొరికిందా  రావడానికి? సందర్శించడానికి ??

ఖాళీ అయిపోయిన క్ర్రిమ్  సీసాలు , పౌడరు డబ్బాలు , పనికిరాని పోషక పదార్ధాల సీసాలు. అబ్బే నాకోసం కాదు. రోజురోజుకి తరిగి పోతున్న రూపాయి విలువలాంటి నా జుట్టు కోసం . అటు జడా కాదు, ఇటు పోనీ కాదు.  బాబ్డ్ అసలే కాదు నాలుగంటే నాలుగు రంగు వేసిన నల్లటి వెంట్రుకలు మిగిలాయి , ఇంకా ఎందుకీ డబ్బాలు, సీసాలు.  అన్నీ తీసి డస్ట్ బిన్‌ లో పడేసి కసి తీర్చుకున్నాను . అన్నిటికీ టైం ఉంటుంది అని అందుకే అంటారు ప్రభాకర్.  ఎప్పటినించి చెపుతున్నాడు చైనా మన భూభాగం ఆక్రమించుకుంటున్నట్టు నువ్వు అన్ని అలమారాలు ఆక్రమించుకున్నావు . నా దువ్వెన ఎక్కడుందో వెతుక్కోడానికి అరగంట పడుతోంది నాకు. ఐనా ఇన్ని సీసాలు , డబ్బాలు కొంటావు కానీ నువ్వు వాడడం ఎప్పుడూ చూడ లేదు ,”అవి ఎలా పని చేస్తాయో తెలీదు కదా ఇంకా ? “.నా జవాబు  “ఎప్పుడు తెలుస్తుంది ? నువ్వు వాడితే నే కదా తెలిసేది “.అమ్మో ! నా అందం కి హాని కలిగిస్తే ..ఇలా అనంతంగా సాగిపోతుంది ఆలోచనా స్రవంతి  , కానీ తెమలదు .. చివరికి చూసారా. నాకు  జ్ఞానోదయం అయింది . అందరూ ఆ టైం కోసం ఎదురు చూడాలి అంతే ..ఊరికే మాటలు అనేసి తొందర పెడితే అవుతుందా ? తెలుసుకోరూ ..

ఈ వైజాగ్ లో చల్ల గా ఉంటుంది అని మురిసిపోవడమే కానీ , ఈ చెమటదారలు గురించి ఎవరూ చెప్పరు . జిడ్డు తయారు చేసే ఫాక్టరీలా ఉంది నా ముఖం . తలంటి పోసుకుందాం అని మధ్యలో ఎప్పుడో ఫలానా నూనె పట్టించాను తలకి.  అది అంతా ముఖం మీదకి చేరి, నా ముఖం ఆనవాలు నేనే పట్టలేకపోతున్నాను . ఇంక స్నానాని కి వెళితే మంచిది ..

ఈ ఇంటి పని , ఒంటి పని ఎంత చేసినా తెమలదు అంటుంది అమ్మ .. నిజమే ..

ట్రింగ్ ..ట్రింగ్ ..తలుపు పిలుపు మోగింది ..

బాబూ ! వీడు బాత్రూం లో దూరినట్టున్నాడు ..

అబ్బ .. తప్పదు అనుకుని వెళ్ళి తలుపు తీసాను ..

అందంగా నేను ఊహించినట్టే ఆమే ఆశాదేవి, మాకు బాస్ , ఆవిడకి భర్త నిరంజన్‌ గారు  గుమ్మంలో నిలబడున్నారు.

ఉక్కిరి బిక్కిరి అయాను ..

మాడమ్‌ ఉన్నారా ?? ఆశాదేవి .. నా జిడ్డు ముఖంలోకి చూస్తూ …ఖర్మ ఖర్మ !!

ఉన్నారు.  రండి అంటూ .. లోపల కూర్చో బెట్టి మా గది లోని  బాత్రూం లో కి మాయం అయిపోయాను ..

ఈ విధం గా ఆ ఆదివారం  మా ఇంట్లో నాకే .. ఏం  చెప్ప మంటారండీ !! .. సిగ్గు సిగ్గు .

****

 

19 thoughts on “అనుకున్నదొక్కటి .. అయినదొక్కటి ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *