April 25, 2024

ఎదురు చూపులు ( నోముల కథలు 2014)

రచన: పాంచజన్య

రవికుమార్

పగిలిన పత్తి బుగ్గలతో చేనంతా మంచు కమ్మిన్నట్లు కనిపిస్తోంది. పత్తి బుగ్గలేరుతున్న కూలీలు చందమామల మచ్చోలిగే మెరుతాండ్లు. ఎంత గాసిందో చేను. గంట గడిచిన పట్టిన మునుం(వరుస) ముందుకు సాగక తిప్పలు పడతాండ్లు కూలీలు. రెండుజేతుల్ని రికాం(విశ్రాంతి) లేకుండ ఆడించినా ఏరుడైతలే. వయసులున్నోళ్లే ఏరలేక నేరి (నీరసించి) వడతాండ్రు. వయసుడిగిన మల్లమ్మకేం చేత్తెతది. కండ్ల నజరు (చూపు) తగ్గిపాయే. నడుమెమో గూని (వంగి) పోయే. కూలీకి రాకపోతే దినం గడవదాయే. కింద మీద పడి ఏరుతాంది. తోటికూలోళ్లందరూ ఏరుకుంట ముందకురుతున్నారు. మల్లేమో పట్టిన చోటే, ఏరిన బుగ్గనే పది జాములు ఏరుకుంట ఎన్కబడ్డది. వయసులున్నప్పుడు గీయన్నీ లెక్కే కాకపోయేది. మునుం పట్టిందంటే ఒడిసేదాక ఎల్లక పోయేది. గిప్పుడు పది కాయలు దీసి 20 నిముషాలు కూసుంటాంది. అన్ని అపసోపాలు (అవస్థలు) పడుకుంటనైనా కూలీకి పొతాంది. సగం పొద్దు గడిచింది. సూరీడు నడినెత్తి మీద కొచ్చిండు. కూలోళ్లు ఒక్కోక్కరుగా తినే యాలైందని సద్దులున్న చెటుకాడ్కి నడుస్తుండ్రు. మల్లవ్వ ఇంకా ఏరతనే ఉంది. ‘ఓ ముసల్దాన రారా’ అంటూ కొడలు వరసయ్యే దుర్గమ్మ గట్టు మీదనుంచి కేకేల పెడతాంది. అటు వైపు చూసిన మల్లమ్మ ‘జర్రసేపైతే మీ మునుంల కాదికి జేరుకుంట గప్పుడు తింట మీరు తినుండ్రి’ అంటూ పత్తి బుగ్గలు తీయడంలో మునిగిపోయింది. ‘అత్త నువ్ రా. నా మునుమైనంక నీ మునుం నేనెదుపడతా’ అంటూ మళ్లీ కేకేసింది దుర్గమ్మ.  ‘దుర్గ నీ బాంచెన్ ఎంత చల్లని మాట జెప్పినవే. సచ్చి నీ కడుపున బుడత’ అంటూ దీవెనార్తలు బెట్టుకుంట మునుంల కెళ్లి బైటి కెళ్లింది మల్లమ్మ. చెట్టు నీడ దిక్కు నడవసాగింది. చెట్టుకిందికి జేరంగనే కళ్లు బైరులు (చీకట్లు) కమ్మినట్లైంది. పది నిముషాలు రెండు కాళ్ల మీద నిలబడ్డ చోటే కూకున్నది. చీకట్లు తెలిపోయినంక సద్ది మూట చేతిలకు దీస్కొని విప్పింది. మామిడి తొక్కును నూనెతో (పచ్చడి) కలిసిన మెతుకుల్ని అటూ ఇటూ కలపుతాంది. ముద్ద మాత్రం నోట్ల బెడత లేదు. “అత్త అత్త ఏంది గట్లున్నవ్. గీయాల గూడా తొక్కే పట్టుకొచ్చున్నివ. ఎంతగనమని తింటవ్. కడుపు మండుత లేదా ఏంది నీకు” అంటూ లొడ లొడ వాగుతూనే ఇగో కొంచెం పప్పు ఏస్కో” అంటూ తన కూర గిన్నె మల్లవ్వ ముందుకు జరిపింది దుర్గమ్మ ‘ఏం జేయమంటవే. ఎన్కటి కెళ్లితింటలేమాయే. ఒక దినం చేస్తే రెండు దినాలు ఇంట్ల పండబడ్తిని. చాతనైయ్యి, గాక వండుకుంటున్న’ అంటూ గిన్నెనందుకునేందుకు ముందుకు కదిలింది. అది గాదు గానీ ‘నీ కొడుకు దేశం బోయి ఏడాదైంది. ఏం పంపుతలేడ. నిన్న గాక మొన్న బోయిన గా చంద్రుగాడు పైసలకు పంపుతుండట. వాని అవ్వ ఆ రాజిని సూడు దొర్సానోలిగా తాయారైతాంది.  కట్టిన చీర మళ్ల కడ్తలే. కళ్లబడ్డ నగలు కొంటుంది. తినబుద్దైందాల్లా తింటున్నది. నువ్వేమో గిట్లనే ఉంటివి ఏం ఫోనైనా చేస్తలేవా నువ్ ఏంది’ అని దుర్గమ్మ అడిగేసరికి నోట్ల పెట్టేనే అన్నం ముద్దను అట్లనే సద్దిగిన్నెల పడేసింది దుర్గమ్మ.గొంతు పూడుకుపోయినట్లుగా మాటలొస్తున్నాయ్.

“ఆడు దేశం బోవుడు ఏమోనే దుర్గి కొడుకు ఎట్టున్నడో, ఏం తింటున్నడో. కండ్లళ్ల మెరుత్తాండు. ఒక్కగానోక్క కొడుకు. వాడు పుట్టంగానే మొగోడు పుట్టిండని ఎంత సంబురపడ్డడో నా మొగుడు. ఆడి గురించి ఎన్ని కలలు కన్నడో. ఆడిని రాజోలే పెంచుతనని ఆడికి రాజనే పేరుబెట్టుకున్నడు. ఏటి కేడు యవుసం ఏంత ఎనక్కోచ్చిన ఎన్ని కట్టాలు పడ్డా బిడ్డ మొఖంల నవ్వు జూసి అన్ని మర్సిపోయేటోడు. ఏదో కిడ్నీల బీమారి (రోగం) అచ్చి మంచాన పడ్డాడు పెనిమిటి. బిడ్డ చదువుకు కాలం చెల్లిపాయే. యవుసం పని తలకెత్తుకునే. నేనుప్పుడు ఆడి పెళ్లి గావాలంటే మేనకోడల్నే ఇచ్చి కొడుకు లగ్గం జేస్తిని. లగ్గమైన మూడు దినాలకే పెనిమిటీ పాణమిడిసే. కాలం లేక. పెట్టిన పెట్టుబడులు రాక ఏటికేడే అప్పులు కుప్పపెరిగిపాయే. అయ్య రోగానికైన అప్పు అందులోనే కలిసే. గాదినం ఎందుకో చిన్నబోయి కూసుంటే ఏంది బిడ్డా అనడిగిన. గంతే చంటిపొరని లెక్క అవ్వ నాకు చాతైలేదే అని ఎక్కెక్కి ఏడ్చే. కొంగుబట్టతో కండ్లు తుడిచి ధైర్యంజెప్పిన. అట్లనే నా ఒళ్లోనే పండుకున్నడు. దసరా పండుగకు కూతుర్ని దీస్కపోను తమ్ముడ వచ్చింది. మాపటేల కూడు దిన్నంక ఇంటి ముందు అరుగు మీద కూసోని ముచ్చట బెట్టుకుంటుంటే పిడుగు లాంటి విషయం చెప్పిండు కొడుకు. “అవ్వా నేను దేశం బోతనే” అన్నడు. అట్టనే బీరిపోయి సూత్తుంటే దగ్గరికచ్చి రెండు భూజాల మీద జేతులేసి ఊపుతూ పిలించిండు. ఏంది బిడ్డా దేశంలో వుడెందుకురా అంటే అవ్వా ఈడ బతకలేనే నేను. జేసిన అప్పులు తెరాలంటే దేశం బొవుడొక్కటే నా కున్న దిక్కు అంటూ ఏడ్చినట్లుగా జేబుతుండు. ఓ పూట మాడుకుంటూ ఉండైనా సరే బాకీలు కడుదామంటే పంటలే పండక పోతాంటే అప్పుట్లే కడదామన్నడు. అవు కొడుకు జెప్పింది నిజమే. ఆనల్లేవు. చేన్ల బాయి లేదు. జేసేందుకు కూలీ దొరకదు. రోజు గడుసుడే కనాకష్టంగా ఉన్నది. ఇగ అప్పేడ తేరుద్ది. అయినా దేశం బోవద్దురా ఉన్న భూమి అమ్ముకుందాం అన్న. కొడుకు ఒక్కటంటే ఒక్కటే మాటన్నడు. భూమమ్ముకుంటే గాదినమే సచ్చినట్టన్నడు. అమ్ముకుని పాలోళ్ల (కులస్తులు, బంధువులు) ముందు ఇజ్జత్ పోగొట్టుకునే కంటే ఇసం తాగి సచ్చింది మేలన్నడు. ఎన్ని జెప్పినా నేనసలే ఇనలే. రెండు దినాలు ఇద్దరి మధ్య ఇదే జవుడం (గొడవ) నడిచింది. గాదినం దీపాలు పెట్టే ఏళకు ఒక్కసారిగ ఏడువులు పెడబొబ్బలు ఇనోచ్చియ్. ఇంట్లకెళ్లి అట్లనే బైటికురికొచ్చిన. నారిగాడి ఇంటి ముందు జనం జమగూడిండ్రు. ఆడు నా కొడుకు సోపతి గాడే. ఇద్దరూ కలిసి బడికి పోయినోళ్లే.  యవుసం జేస్తు నోళ్లే. ఆడికి పెళ్లై ఏడాదైనా కాలేదు ఆడికి. ఇంతలో ఆడి పెళ్లాం ఏడ్సుకుంట చేన్ల బాట నుంచి ఉరికొస్తోంది. నేను ఇంటి ముందు జమగూడిన జనాన్ని తోసుకుంట ముందుకు పోయిన. ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నయ్. లోపలికి తొంగి చూసిన. నోట్లకెళ్లి మాటరాలే. నూరగలు కక్కుకుని పడున్నడు నారిగాడు. ఆడికి అటుపక్కనే పురుగు మందు డబ్బా నేల మీద పడున్నది. కొడుకు కండ్లు తెరుచుకుని ఇంటి వాసాలను చూస్తున్నట్లుగా ఉన్నయ్. పాణం పోయేప్పుడు ఎంత గింజుకున్నడో. కాళ్ల కాడి నేలంతా పొక్కిలి లేచింది. కొడుకులాంటోడు. కొడుకీడోడే. ఎందుకిట్ల జేసిండు. ఆడున్నోళ్లందరూ చెవులు కొరుక్కుంటున్నరు. చేసిన అప్పులు తీర్చే దారి లేక పాణమిడ్సిండని అచ్చిన అమీన్‌సాబ్‌కు అక్కడున్నోళ్లు చెబుతుంటే విన్న. అదే రాసుకునో వోయిండు అమీసాబ్. ఇంటికొచ్చిన కొడుకు ఆ దినమంతా ఆడనే ఉన్నడు. ఆడ్ని దానం చేసినం తర్వాత గాని ఇంటికి రాలేదు బిడ్డ. సాయంత్రం అచ్చుడచ్చుడే ఒక మాటన్నడు. అవ్వా ఈడుంటే ఆడి లెక్కనే ఏదో రోజు నేను సత్తనే అన్నడు. ఒక్క నిముషం గుండాగిపోయింది. నేనేం ఎదురుమాట్లాడలే.

ఆ రాత్రి కంటి మీద కునుకు పడితే ఒట్టు. గడికోమారి అవు అప్పులు భరించలేక అటువంటి అఘాయిత్యం చేసుకుంటే? దేశం బోతే బిడ్డ ఈనాటికి కాకపోయిన ఏనాటికైన తిరగత్తడు. చస్తే రాత్రంతా గవే ఆలోచనలు. నిద్రపట్టక పక్కల అటూ ఇటూ బొర్రుతుంటే ఆడే మళ్ల పిల్చిండు. ‘అవ్వ నాకేం గాదే. నేను బోతనే. ఈ గొడ్డు చాకిరి ఎన్నాళ్లు జేసినా మన బత్కులు గిట్టనే ఉంటయ్. అయ్య యపుసం జేసి జేసి తెల్లబొక్క అయిండు. ఆఖరికి ఏం సంపాయించిండు. అప్పులే మిగిలే. అంటూ నచ్చజెప్పుడు మొదలుబెట్టిండు. ఆడి మాటలకు నేనేమీ కరిగిపోలే గానీ కొడుకు ఈనాడు కాకపోయినా ఏనాటీకినా తిరగత్తడని మనసుల అనుకున్న. గంతే సరే బిడ్డ నీకు ఏది తోస్తే అది చేయి. నువ్ ఏడున్న సుఖంగా ఉండాలే. నేను ఒప్పుకుంటనన్నుకున్నడో. ఒప్పుకోకపోయిన పోదామనుకున్నడో గానీ అన్ని ఏర్పాట్లు నాకు దెల్వకుండనే చేసుకున్నడు. ఊళ్ల పెద్ద పటేలు మల్లారెడ్డి కాడ్కి బోయి భూమి తనఖా పెట్టి లచ్చ రూపాయాలు తెచ్చుకున్నడు. ఆట్ని పట్టుకొనే బొంబాయిల ఉన్న ఏజెంటు కాడ్కి పోయిండు. దేశం బోనికీ కావాల్సిన కాయితాలన్నీ అచ్చినంక ఆ ముచ్చట నాతో జెప్పిండు. పెండ్లాన్ని పంపుతనని ఆడి మావను రమ్మడు. సాయంత్రం పొద్దుగూకిం తర్వాత తిన్నంక ఇషయం జెప్పిండు. ‘అవ్వ రేపొద్దుగాల బొంబాయి పోతున్న ఆడికెల్లి దుబాయ్ విమానం ఎక్కిస్తడు ఏజెంటు’ అని. ఆ మాటలు ఇనంగనే నెత్తిన పిడుగుబడ్డట్లయింది. బొంబాయి బస్సు ఎక్కించడానికి కరీనగరు రమ్మన్నడు. ఉలుకుపలుకు లేకుండ కూసున్న నా భూజల్ని పట్టుకుని ఊపుకుంట బతిలాడిండు. ఊ అన్న తర్వాతగానీ లేవలే. ఆడైతే లేచి పోయిన పక్క మీదికెక్కిండు. నేనూ నడుంవాల్చినన్న మాటేగానీ కంటికి కునుకే రాలే. కన్నపేగు దూరమైతాందని తలుచుకోను కళ్లళ్ల నీళ్లు పొంగివచ్చినయ్. ఆడుసూతే ఏడ చిన్నబొతడోనని ఆడికి కనబడకుండా తిరిగి పండకున్న. కొడికూసే ఏళదాక అడివైపు తిరగనే లే మళ్లా. దేశం బోవల్ననే సంబురమో ఆడు రోజు లేచే ఏళ కన్న ముంద్గాలనే లేచిండు. నన్ను తట్టిలేపిండు. మొదటిబస్సుకే బైలేళ్లి కరీనగురం బోయినం. నా పెనిమిటికి బీమార్ అచ్చినప్పుడు పెద్దసుపత్రిలో చేర్పించడానికి అచ్చిన మళ్లా నా కొడుక్ని సాగనంపడానికి అచ్చిన. బస్టాండు ఈ కోస నుంచి ఆ కొస దాక జనమే. బొంబాయి పోయే బస్సులు ఆగే స్టాండ్ ఎక్కడో చివరికి ఉంది. అక్కడికే బోయినం. బల్లల మీద ఎంతమంది కూసున్నరో అంత మందీ నిల్చున్నరు. కొందరి నా కొడుకు లెక్కనే పొతున్నట్టన్నరు. ఆ చేతుల్లగూడ మూటలున్నాయి. ఆళ్ల తరుపు బంధువులూ చానా మందే ఉన్నరు. కూసోను ఎక్కడా జాగా (స్థలం) లేకపోతే అక్కడే నేలమీదే కూలబడ్డ నేను. బస్సు అచ్చే టైం కాలేదే అవ్వ అంతలా చాయ్ దాగుదం పా అన్నడు కొడుకు. నాకేం తాగబుద్ధి కాలే.  నువ్వ్ పోరా బిడ్డా అంటే పోయిండు. చాయ్ తాగేలోపు బస్సు అత్తాంది అనుకుంట అక్కడ జనాలు వచ్చే బస్సుకు ఎదురెళ్లిండ్రు. అప్పటిదాకా ఏమనిపియ్యలే. గానీ బస్సుచూడంగానే పాణాలు దీస్కబోయ్యే యముడొస్తున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా ఆడిని గట్టిగా దగ్గరికి దీసుకున్న. అవ్వ ఏమైందే అని అడిగిండు. నాకేం కాలేదు గానీ నువ్వు పైలం అని జెప్తుంటే నీయవ్వ ఎన్నిసార్లు జెప్తవే ఇప్పటికి లచ్చసార్లు జెప్పినవన్నడు. ఆడి మాట లేవీ నాకు ఇనిపించలే. మళ్లీ అవే మాటలు జెప్పిన. దేశంగాని దేశం బోతున్నవ్, జేబుల ఎప్పుడూ కాసిన్ని పైసలుంచుకో, పంజేసేకాడా పీలంగుండు అవే మాటలు. ఈ సారి ఏమనుకున్నడో, అందరూ సూత్తాండ్లని నమోషి (సిగ్గు) అనిపించిందో నేనేమన్న చినంపోరడ్న అని కసురుకున్నడు. బస్సు ఎక్కి సమాన్లు సర్దుకొని ఆచ్చిండు. నాపక్కనే నిల్చున్నడు. ఆడి పెళ్లాం, మావ ఏదో జెప్తుంటే ఇంటున్నడు. ఏదైన జెప్పబోదామంటే మాటలు గొంతు దాట్తలేవ్. మూగదైన్నట్లుగా అయిన అప్పుడు. చాయ్ తాగచ్చిన డైబర్ బస్సు చాలు (స్టార్ట్) జేసిండు. నా గుండెల్లో ఏదో కోత మొదలైంది. హలాల్ జేసిన మేక కొట్టుకున్నట్లు కొట్టుకోబట్టింది. నాకైతే ఏందోయలే. ఆడైతే అవ్వ పైలమే అంటూ బస్సెక్కిండు. కిటికీ పక్కనే కూసుని అడికెళ్లి నన్నే చూడబట్టిండు. బస్సు కదిలింది. గంతే అప్పటిదాంక ఏడ దాక్కున్నయో కన్నీళ్లు. మాటలు. కొడుకా అంటూ ఒక్కసారిగా గొంతు పెగిలింది. కట్ట తెగినట్లుగానే కన్నీళ్లు దూంకినయ్. కూసున్న సీట్ల కెళ్లి ఒక్కసారిగా లేచి కద ల్తున్న బస్సుల నుంచి బైటికురికొచ్చిండు కొడుకు. ఆమంతం కావలించుకున్నడు. కంటికి మంటికి దారగా పోతున్న కన్నీళ్లను తుడిచిండు ఆడి కళ్లల్లా నీళ్లు సుళ్లు తిరుగినయ్. డైబర్ కేకపెడుతుంటే ఆడిని గట్టిగ పట్టుకున్న. పాలుదాగుతున్న దూడను తలుగుపెట్టి గుంజుతున్నట్లుగా నన్నిడ్సిబోవట్టిండు. నన్ను జూసుకుంటనే బస్సెక్కిండు. బస్సుపోతుంటే కిటికీల కెళ్లి చేయ్యి బైటికి పెట్టి పైలమే అంటూ ఊపుకుంటనే ఉన్నడు. బస్సు మూలతిరిగేదాంక అట్లనే సూసుకుంట ఉన్న. అదే ఇప్పటికీ కళ్ల మొద్దులుతున్నది. యడాదైతాంది కొడుకు బోయి. ఎట్లున్నడో. ఏంజెత్తున్నడో. యాలకు తింటున్నడో లేడో. పండగలొచ్చింది తెలుస్తలే. పోయింది తెలుస్తలే గాదినం నుంచి. మూడేళ్లు అయితేగానీ తిరగిపంపించరంట. ఆడు ఫోను జేత్తే మాట్లాడినట్టు. లేకుంటే లేదు.   బుద్ధి ఎరిగన్నప్పటి నుంచి నన్నిడ్సి ఊరి దాటింది లేదు. గియాల దేశం బోయిండు. ఆడు చల్లంగ తిరిగిరావల్నని వేయ్యి దేవుళ్లకు మొక్కుతున్న. కొమురెళ్లి మల్లన్నకు బోనం జేత్తనని, పెద్ద పట్నమేస్తనని, రాజన్నకు కోడెను కడతనని, సమ్మక్కకు ఎదురుకొళ్లనిస్తనని మొక్కిన అని జెప్పుకుంటూ గుడ్లల నీళ్లన కొంగుతో ఒత్తుకుంది. దేశం బోనికే ఐదు రూపాయల మిత్తికి లచ్చ రూపాయాలు తెచ్చుకునే. ఆడు జేసిది అప్పు మిత్తికే పోబట్టే. అవ్వా నీకేమన్న పంపమంటవానే అని అడుగతడు. ఆడు పడే కష్టం జూసి ఏం పంపమనను. బాకీలు తీరి ఆడు వస్తే చాలు. అంటూ గుడ్ల నీళ్లను పైట కొంగుతో కనుకొలుకుల్లోనే ఒత్తుకుంది.

‘ఏమైంది. తినుడైతదా లేదా గీయాలా. సగం పొద్దు గడిచినా సగం మునుమైనా ఏరకపోతిరి. నడువుండ్రి.. నడువుండ్రి.. ఎన్ని జాములు (గంటలు) తింటరు’ అనుకుంటా కూలోళ్లను ఏగిరబెడతాండు (తొందర) యాజమాని. ‘కూడైనా తిన్నియవా ఏంది. ఖాళీగ కూసున్నట్టే జేత్తనావ్’ అంటూ కూలోళ్లందరూ (ఒక్క సారి)గైయ్యిన లేచిండ్రు. ‘నీ యవ్వ నువ్ కచ్చినప్పుడు చెప్తా. అప్పుడు గిట్లనే ఏగిరబడాలే’ అంటూ పైకి లేచింది చాకలి ఎల్లమ్మ. అమె ఎన్కనే అందరూ లేచిండ్రు. ఎవరి మునుంల వాళ్లు జొచ్చిండ్రు. సద్దులు తిన్నంక ఏం బలమొచ్చిందో ఏమో పరుగులు దీస్తున్నట్టుగనే సాగిపోతుండ్రు. అందరి జేతులు రిక్కరిక్కాడుతున్నయ్. మునుం కాడికి గట్టునున్న పత్తి బొరాం (ధాన్యం నింపే ఒక రకమైన బస్తా) కాడ్కి తిరగలేక చస్తుండు చేన్దారు బుచ్చయ్య. వాళ్లకు పదడుగుల దూరంలో మల్లమ్మ ఎన్కబడ్డది. ఆమేనే ఓ కంటగా చూసిన బుచ్చయ్య “ముసల్దాన ఏరుడు నీ చేతగాతంటే ఇనవు. నేనత్తా నేనత్తా అంటవ్. గిప్పుడేమో ఏరలేక ఎంకబడవడితివి’ అంటూ మల్లమ్మకేసి చూస్తూ కసురుకుంటున్నడు. ‘అయ్యో అన్న అయితదే ఎంత సేపు. మునుం అయినంకనే ఇంటికి పోతలే అనుకుంట ఏరతానే ఉంది మల్లమ్మ. అటు ఇటనా పొద్దు కుంగుతోంది. మునుం అయినోళ్లు సద్దులు సంకన బెట్టుకొని ఇళ్ల బాట బట్టిండ్రు. తన మునుం ఏరుడైన దుర్గమ్మ మల్లమ్మ మునుంను ఎదురుబట్టింది. అలా అలా తన దగ్గరికి చేరిన దుర్గమ్మతో ‘ఈయ్యాల్టి ఈ పొద్దు గడించేందే నీ బాంచెన్’ అంటూ మల్లమ్మ దీవేనారలు బెట్టసాగింది. ఇద్దరు మునుంల నుంచి బైటికెళ్లి చెట్టుకిందున్న సద్దుల్ని దీస్కొని కాళ్లీడ్సుకుంటా ఇంటి బాట పట్టిండ్రు. ఇల్లు జేరేసరికి చిమ్మ చీకట్లు కమ్మినయ్. మెడలోని తాడుకు కట్టిన తాళం చెవి తాళం తీసింది. రెంటినీ పక్కనే ఉన్న గూట్ల పెట్టింది. చీకట్లనే పుతుకులాడుకుంట (పాకులాడుతు) దుగుట్ల పెట్టిన దీపం ముట్టించింది. అన్నం గిన్నె కాడికి బోయి మూత తీసి చూసింది. గిన్నెలున్న అన్నబొటు (ముద్ద)ను జూసి వండాల్సిన పనిలేదనుకుంటూ బైటికొచ్చింది. గడపపక్కన దీపం పెట్తి అక్కడే దర్వాజకు ఒక పక్కగ ఒరిగింది. ఏదో ఆలోచన బడ్డది.

ఒక్కసారిగా దుర్గి చెప్పిన మాటలు ఒక్కసారిగా మదిలమెదిల్నయ్. కొడుకు మీదకి ధ్యాసమళ్లింది. ఊసిల్లుముసిరినట్లు కోడుకు మీది ఆలోచనల్లు మనసుల మెదిల్తానయ్. పాణం నిలబకున్నది. కూకుండది. జప్పున లేచి ఇంట్లకి పోయి మూలకున్న సందుగ దీసింది. బట్టల్ని పక్కకు బెట్టంది. కొడుకు తస్వీరునొకదన్ని దీసింది. “కొత్తకొండ జాతర్ల ముచ్చటపడి, ఆడి అయ్యతోటి దెబ్బలాడి దీయించుకున్నది. మీసాలు గూడా రాలే. చందమామోలిగే ఎట్టున్నడో చూడు కొడుకు ఎట్లున్నడో ఏం జేత్తున్నడో” అనుకుంటూ కళ్ల నీళ్లు బెట్టుకున్నది. సందగను సదిరి బైటికొచ్చింది. తలుపు బెడెం(గొళ్లెం) పెట్టి పానాది (బట) మీదకొచ్చింది. ఆమాసోలిగున్నది. ఆరుగంట్లకే చిమ్మ చీకట్లు కమ్మినయ్” అనుకుంటూ అక్కడే నిలబడింది. ఎదురుగా వస్తున్న మనిషిని “దుకాణం ఎల్లయ్యున్నడ బిడ్డ” అంటూ అడిగింది. “ఆ ఉన్నడు” అని ఆ మనిషి చెప్పంగనే అటేపు సాగింది. చీకట్ల పాతులాడుకుంట పాతులాడుకుంట దుకాణంకాడ్కి జేరింది. “ఎల్లన్న.. ఓ ఎల్లన్న” అన్న పిలుపులకు ఎవలు అనుకుంట బైటికొచ్చింది ఆయన పెండ్లాం లచ్చమ్మ. మల్లమ్మను చూస్తూనే ఏం కావాలి అంటూ అడిగింది. ఎల్లన్న లేడనే పిల్ల అంటూ మల్లమ్మ అడిగేసరికి గిప్పుడే కల్లుకు పోయిండని జెప్పింది లచ్చమ్మ. ఎందుకు ఏం పని అంటూ విషయమడిగింది. ఏం లేదులే బిడ్డా “మా రాజన్న ఏమన్న జాడుగిట్ల రాసిండాని అచ్చిన. నాకేందెల్వదే అవ్వ నాకేమన్న జెప్తడా! పాడా అచ్చినంక ఆయన్నే అడుగు” అంటూ లోపలికెళ్లింది దుకాన్ల అచ్చినోళ్లకు సామన్లు కట్టిచ్చుకుంట కూసున్నది. లచ్చవ్వ. అక్కడే అరుగుమీద ఓ మూలకు గొడకు ఒరిగి కూసున్నది. కండ్లు మూతలు పడుతున్న అట్లనే కూసున్నది. అప్పటికీ చానా చీకటిపడ్డది. “అవ్వ ఆయన ఇప్పుడచ్చేటట్టు లేడు గానీ రేపొద్దున్నరాపోదు. ఇంట్లనే ఉంటడు” అని లచ్చమ్మ జెప్పంగనే మనసు ఉండబుద్దైతలేదు. తెలుసుకున్నంకనే పోత” అంటూ తిమ్మిరు పట్టిన కాళ్లను కొంచెం సాపుకుంటున్నది. “నేను దుక్నం బంద్‌జెత్తాన” అంటూ పెద్ద తలుపులు మూసి లోపలికెళ్లింది లచ్చమ్మ. కదలకుండా, కదిలేందుకు మనసుకురాక అక్కడే కూసున్నది మల్లమ్మ.

రాత్రి 12 జాములైతాందనగ ” ఏం మల్లమ్మ యాలకాని యాలచ్చినవ్ ఏంది ముచ్చట” అంటూ పలకరించిండు ఎల్లయ్య. ఏం లేదే ఎల్లన్న కొడుకు రాజన్న ముచ్చట ఏమన్న జెప్పుతావేమోనని అచ్చిన. పొద్గటి నుంచి మనసు ఆడి మీదకే కొట్టుకుంటాంది. అందుకే అచ్చిన. ఏమన్న మత్లావు తెలిసిందానే. ఆడు ఎప్పుడొస్తడు. అంటూ ఒకదాని వెంట ఒకటి అడుగుతూనే ఉంది మల్లమ్మ ఆ మొన్ననే ఓ రెండు నిముషాలు ఫోన్ల మాట్లడిండు. “ఎమన్నడు. ఎమన్నడు.” అంటూ రెట్టించి అడిగింది మల్లమ్మ. అంత మంచిగనే ఉన్న అని జెప్పమన్నడు. నిన్ను మంచిగ ఉండమన్నడు. అంటూ ఎల్లన్న జెప్పంగనే కండ్ల నీళ్లు దీస్కుంట “నాకేం గని ఆడుఎపుడస్తడట. ఇంకేమన్నడు.” అని అడిగింది మల్లమ్మ. గిప్పట్లైతే రానీకీలు గాదన్నడు. ఇంకా యాడా దికెక్కువైతదన్నడు” అని ఎల్లన్న జెప్పంగనే “అట్లనా” అంటూ నిట్టూర్చింది మల్లమ్మ. ఇప్పటికే చానా చీకటైంది ఇంటిపో రేపొద్దున్న నేనే మీ ఇంటికత్తపో” అంటూ నచ్చజెప్పుడు మొదలు పెట్టిండు ఎల్లన్న. ఏం ఆచ్చునోడే ఆడు ఎప్పుడోత్తడోనని పిట్టకు పెట్టినట్లు జూత్తన్న అనుకుంటూ ఇంటి బాట పట్టింది మల్లమ్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *