April 19, 2024

పాప-బాబు బ్యాచ్:

రచన: మధు అద్దంకి madhu

  చక్కని యూనిఫార్ములు వేసుకుని ముద్దు ముద్దుగా బ్యాచీలు బ్యాచీలుగా స్కూల్ కి వెళ్ళే పాపలు, బాబుల గురించి ఏమి చెప్తుందబ్బా అనుకుంటున్నారా? అయితే మీరు మాంఛి ముద్దపప్పులో కాలేసినట్టే!! నేను చెప్పేది ఆ పాపా, బాబులు గురించి కాదు..వీళ్ళు వేరే.. ఎహే సాగదీయకుండా సంగతి చెప్పు అంటారా? అయితే పదండి కధలోకి వెల్దాం…

అనగనగా అనకాపల్లి.. అక్కడ ఉన్న ఎన్నో మధ్యతరగతి కుటుంబాల్లో ఒకటి సింగినాదం రామారావుది!!! ఆయన్ని అందరు రాముడు అని అంటారు…ఆయనకి పాపం ఒక భార్య, కొడుకు ఉన్నారు..సదరు భార్య పేరు కామేశ్వరి ఉరఫ్ కావుడు.. కొడుకు పేరు భీమారావు ఉరఫ్ భీముడు.. పేరు చదివి అలాంటి పర్సనాలిటీ ఊహించుకుంటే అరటి తొక్క మీద  కాలేసినట్టే. మన భీముడు బక్కపల్చగా , తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంటాడు.. ఇకపోతే మన క్యారెక్టర్లని రాముడు, కావుడు, భీముడుగా ఫిక్స్ అయిపోదాం.. మనకి కూసంత వీజీగా ఉంటుంది..

మన భీముడికి ముందు ఐద్రాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబొచ్చింది..అక్కడ రెండేళ్లు పనిజేసాక అమేరికా పంపారు..వెళ్ళేముందు మన భీముడు పెళ్ళికొడుకయ్యాడు.. భార్య పేరు క్రిష్ణవేణి.. ఆమెని అందరు క్రిష్ణుడు అని పిలుస్తారు.. ఇప్పుడు అర్ధమయ్యిందిగా రాముడు, కాముడు, భీముడు, క్రిష్ణుడు…..

పెళ్ళయ్యాక భీముడు భార్యతో కలిసి అమేరికా బయలుదేరాడు..వెళ్ళిన ఒక సంవత్సరం తర్వాత తల్లితండ్రులకి  విసా పంపించి తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు..మన రాముడు, కాముడు అమేరికాకి పయనమయ్యారు….

ముందు అనకాపల్లి నుండి ఐద్రాబాద్కి ట్రెయిన్లో వచ్చి అక్కడినుండి ప్లేట్(ఫ్లయిట్)  పట్టుకున్నారు..ఫ్లయిట్ లోకి ఎక్కి తమ సీట్లు చూసుకున్నాక తమ చేతుల్లో ఉన్న హ్యాండ్ బ్యాగేజీ  ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తుండగా ఎయిర్  హోస్టెస్స్ మీ పైన క్యాబిన్ లో పెట్టండి అనగా పెట్టబోయి అక్కడ వేరెవరిదో బ్యాగేజీ ఉండగా చూసి ఈ బ్యాగేజి ఎవరిది వెంటనే తీయండి మా బ్యాగేజీ పెట్టుకోవాలి అని అడిగారు..సాటి ప్రయాణీకుడు మీరెక్కడైనా పెట్టుకోవచ్చండి వేరే వాళ్ళు పెట్టుకున్నారు కదా అంటే కాదు నా క్యాబిన్ నాకే సొంతం అని ఒక అరగంట సేపు వాదించి వాదించి అలిసిపోయి చివరాఖరుకి ఆ బ్యాగేజీ తన వళ్ళోనే పెట్టుకూర్చున్నాడు..

పక్కనున్న ప్రయాణీకుడు అడిగాడు మీరు ఎక్కడిదాకా అని?

మేము అమేరికా వెల్తున్నాం అని బదులిచ్చాడు రాముడు..

ఓ అవునా బావుంది..మేము అక్కడికే మా బాబు దగ్గరికి వెళుతున్నాం.. దారంతా మంచి కాలక్షేపం లెండి అన్నాడు తోటి ప్రయాణీకుడు…

మీరు వెళ్ళటం మొదటిసారేనా అడిగాడు తో.ప్ర( తోటి ప్రయాణీకుడు).

అవునండీ అంటూ బదులిచ్చాడు రాముడు..అంతలోనే బోల్డు ఆస్చర్యపోతూ మీరెలా కనిపెట్టారు అని అడిగాడు రాముడు

హి హి హీ మీరు వెరయిటీగా హ్యాండ్ బాగేజ్ వొళ్ళో పెట్టుక్కూర్చున్నప్పుడే కనిపెట్టేశానుగా అన్నాడు తో.ప్ర.

అవునండీ మరేమో అని రాముడు ఏదో చెప్పబోయేంతలో చెళ్ళున జబ్బ మీద చరిచి హి హి హీ నేను చూశానులెండి ఆ చోద్యమంతా అన్నాడు తో.ప్ర

ఇంతకీ అమెరికాలో మీరే ఊరు వెల్తున్నారు అనడిగాడు తో.ప్ర…

మేము శాన్ జోస్ కి వెల్తున్నాము అన్నాడు రాముడు..ఎక్కడో భళ్ళున పగిలిన శబ్దం వినపడగానే ఒక్కసారిగా ప్రయాణీకులందరు ఉలిక్కిపడి శబ్దం వచ్చినవైపు చూశారు..

రాముడు, నిద్రకి జోగుతున్న కాముడు కూడ అటువైపు చూసి ఆశ్చర్య పోయారు.. పగిలింది గాజు కాదని తో.ప్ర నవ్వని తెలుసుకుని ప్రయాణీకులందరు ఎవడీ వేస్ట్ ఫెల్లో అన్నట్టుగా చూసి మళ్ళా సినిమాలు చూడటంలో మునిగిపోయారు..

రాముడికి మాత్రం తో.ప్ర ఎందుకు నవ్వాడో అర్ధం కాలేదు.. అదే మాట అతనిని అడిగాడు ఎందుకండీ అంత భయంకరంగా నవ్వారు అని?

అతను మళ్ళీ నవ్వి శాన్ జోస్ అంటే నవ్వరేంటి మరి..శానోసే అనాలి అన్నాడు..మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటూ ఒక అరగంట సేపు ఎలా మాట్లాడాలి అక్కడి కధ కమామీషు అంతా దంచికొట్టాడు..

మన రాముడనుకున్నాడు ఎంతైన ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి లోకజ్ఞానం ఎక్కువ అని.అదే మాట అతనితో అంటే మళ్ళీ భళ్ళున పగిలిన శబ్దమయ్యింది…ఈ సారి ఆ పక్కనున్న ప్రయాణీకుడు ఏమిటీ డిస్టబెన్స్ నోట్లోనే నవ్వుకోకుండా అని రంకె పెట్టాడు..అప్పుడు చప్పున గప్చుప్ అయ్యి నెమ్మదిగా అన్నాడు ” నేను పుట్టి పెరిగింది అంబాజీ పేట ,అమెరికా కాదు అక్కడినుండే వస్తున్నా అని..

రాముడడిగాడు అయితే మీకీ విషయాలన్నీ ఎలా తెలుసు అంటే పాపా బాబు బ్యాచ్ ద్వారా తెలిసాయి అని..

వాళ్లెవరు అనడిగాడు రాముడు.. ఇంకెవరు మనమే అన్నాడు తో.ప్ర

అర్ధంకానట్టుగా ఒక రకమైన మొహం పెట్టాడు రాముడు.. అంటే మనలాగ పిల్లల్ని చూడటానికి ఆంధ్రా నుండి అమెరికా వెళ్ళే వాళ్ళన్నమాట అన్నాడు తో.ప్ర..వాళ్ల వాళ్ళ అనుభవాలని చెపుతుంటే విని నేర్చుకున్నది ఈ జ్ఞానమంతా.

ఇంతకీ శానోసే లో మీ బాబు ఎక్కడుంటాడు ఏమి చేస్తుంటాడు అనడిగాడు తో.ప్ర..

మా అబ్బాయి ఫలానా చోట ఉంటాడు, ఫలాన కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అని అన్నాడు రాముడు..

ఏంటీ ఈ ఏరియాలోనా అని పక్కకి తిరిగి భార్యతో చెప్పాడు అదేనోయ్ మనవాడి ఇంటినుండి హైవే ఎక్కాక ఎనిమిదవ జంక్షన్లో రైటుకు దిగి తిన్నగా పోతె మక్ డోనాల్డ్స్ వస్తుంది చూడు అక్కడ నుండి లెఫ్ట్ కి తిరిగితే వచ్చే రోడ్లో ఉన్న మూడవ నంబర్ అపార్ట్మెంట్లు ఇవి.ముందు మనవాడు చెత్తగా ఉన్నాయి అని కొనడానికి ఇష్టపడలేదు కదా అవే ఇవి అన్నాడు..అని ఇటు తిరిగి రాముడితో అన్నాడు మీ అబ్బాయి అక్కడ ఇల్లు కొనుక్కున్నాడా లేక అద్దె కుంటున్నాడా?

రాముడన్నాడు మా వాడు అద్దెకే ఉంటున్నాడండీ..ఇప్పుడే కొత్తగా ఇల్లు కొనుక్కున్నాడు..గ్రుహప్రవేశం ఉంది…

ఇంతకీ ఎక్కడ కొన్నాడు మీ వాడు ఇల్లు అనడిగాడు తో.ప్ర

ఫలానా చోట అన్నాడు రాముడు..

అదేంటి నల్లోళ్ళు ఉన్నచోట తీసుకున్నాడు అనడిగాడు తో.ప్ర.

ఏమోనండీ మాకు తెలియదు అన్నాడు రాముడు.

అయితేనేమి చాలా చీప్గా కొనుంటాడు..అక్కడ మనవాళ్ళు ఎవరూ ఉండటానికి ఇష్టపడరు అన్నాడు తో.ప్ర..

ఇంతలో తో.ప్రా భార్య కాముడితో మాట్లడటం మొదలెట్టింది

మీరు కూడా మీ బాబుని చూడటానికే వెళ్తున్నారా అనడిగింది కాముడు..

అవునండీ  మేము ముందు మా బాబు దగ్గరికి వెళ్ళి అక్కడనుండి మా పాప దగ్గరికి వెళ్తాము..పాపకి ఈ యేడు బాబు పుట్టాడు. తోడుగా ఉండటానికి వెల్తున్నాము అంది తో.ప్ర.భా( తోటి ప్రయణీకుడి భార్య)

మీ పాప ,అల్లుడు ఏమి చేస్తుంటారు అనడిగింది కాముడు… అల్లుడుగారేమో సొంత కంపెనీ పెట్టుకున్నారు..పాపేమో ఆయనకి ఇంటినుండే పని చేసి పెడుతుంది..ఇప్పుడు బాబు పుట్టాక ఇబ్బందిగా ఉంది మమ్మీ నువ్వు రా అంటే బయలుదేరాం..ఎలానో బయలుదేరాం కద అని ముందు మా బాబు దగ్గరికి వెల్తున్నాం..

మా పాప ఇంట్లో అసలు నేనేపని చేయక్కరలేదండీ…అన్నీ ఉన్నాయి, గుడ్డలుతికేందుకు, అంట్లు తోమేందుకు, ఇల్లూడ్చేందుకు అన్నీ ఉన్నాయి.. అవన్నీ వింటూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది కాముడు..పోతే బాబుని చూసుకోవాలి చిన్నోడు కదా..

మీ బాబు, కోడలు  ఏమి చేస్తుంటారు? అనడిగింది కాముడు..బాబేమో ఒక పెద్ద కంపెనీలో ఉజ్జోగం చేస్తాడు..మా కోడలు కూడ ఉజ్జోగం చేస్తుంది..వాళ్ళకేమో ఒక పాప…పాపకి 4 ఏళ్ళు వచ్చాయి..డే కేర్ లో వేశారు అన్నది తో.ప్ర.భా

డే కేర్ అంటే అనడిగింది కాముడు..

డే కేర్ అంటే పిల్లల క్రెష్..చిన్న పాపలని బాబులని చూసుకోవడానికి పెట్టారు..

పొద్దుట్నుండి సాయంత్రం తల్లితండ్రులు వచ్చి తీసుకుని వెళ్ళే వరకు వారిని చూసుకుంటారు..అన్నం పెడతారు,పాలు పడతారు, నిద్ర పుచ్చుతారు, ఆడిస్తారు..

ఓ అలాగా అని ఊ కొట్టింది కాముడు.

మరి మీరున్నప్పుడు మీ మనవరాలిని డే కేర్ పంపక్కరలేదు అనుకుంటా అన్నది కాముడు..

లేదండి పాప మామూలుగానే డే కేర్ కి వెళుతుంది..లేకుంటే అలవాటు తప్పిపోతుంది అన్నది తో.ప్ర.భా

మరి మీ అబ్బాయి కోడలు ఏమి చేస్తుంటారు అనడిగింది తో.ప్ర.భా

మా అబ్బాయి ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు..మా కోడలు ఉద్యోగాల వేటలో ఉంది అన్నది కాముడు.

వాళ్ళకి పాపా బాబా అనడిగింది తో.ప్ర.భా

ఇంకా లేదండీ అన్నది కాముడు..

అయితే మీకు పిల్లలని చూసే పనిలేదు కదా మరి మీరు అమెరికా ఎందుకు వెళుతున్నట్టు అనడిగింది తో.ప్ర.భా

అదేంటి పిల్లలు లేకపోతేనేమి మా అబ్బాయిని కొడలిని  చూడటానికి వెళుతున్నాము అన్నది కాముడు.

ఇదిలా ఉండగా అమెరికా మీద తనకున్న నాలెడ్జ్ ని దంచికొట్టాడు తో.ప్రా.. అక్కడ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి వాటిల్లో ఎంత మంది భారతీయులు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి ఉద్యోగాలు చేస్తుంటారు, అందులో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వారు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు,

అమెరికా జాగ్రఫి, బాటనీ, కెమిస్ట్రీ, అన్నీ కలిపి మధ్య మధ్యలో వాళ్ళ పాప, బాబుల గురించి చెప్పి చెప్పి రాముడు మెదడు చెంచాతో  తినేశాడు..

ఈ లోపల వాళ్ళ ప్లేన్ లండన్ లో ఆగింది…ఈ సారి ట్రాన్సిట్లో ఉన్నదంతా పాపా బాబు బ్యాచ్ వాళ్ళే ..మళ్ళా మా పాప మా బాబు అనుకుంటూ కబుర్లు మొదలు…ఈ సారి వీళ్ళతో పాటు మన రాముడు, కాముడు కూడ చేరి వాళ్ళ పాపా బాబుల గురించి మాట్లాడటం మొదలెట్టారు.. ఆ విధంగా వారు కూడా ఆ బ్యాచ్లో చేరిపోయారు..

ఇదండీ పాపా బాబు బ్యాచ్… ఇలాంటి వారు కోకొల్లలు..వీరు ఫ్లైట్లల్లో, ట్రాన్సిట్ లాంజ్ లో తప్ప మిగితా చోట ఎక్కడా కనిపించరు.. కనిపించిన కొద్దిసేపట్లో అమెరికా, లండన్, ఫ్రాన్స్ ఇంకా ఏ దేశం గురించైన తమకున్న జ్ఞానాన్నంతా మనకు వద్దన్నా వినిపిస్తారు…

( నేను ఎన్నో సార్లు ప్రయాణం చేసినప్పుడు ఈ బ్యాచ్ అంతా నాకెదురుపడిన వాళ్ళే….మీకు కూడా తప్పక తగులుతారు..)

2 thoughts on “పాప-బాబు బ్యాచ్:

Leave a Reply to Prabhakar Rao Achanta Cancel reply

Your email address will not be published. Required fields are marked *