March 29, 2024

వినాయకునిపై పద్యాలు –

రచన:జెజ్జాల కృష్ణ మోహన రావుj.k.mohanrao

 

శ్రీమతి జ్యోతిగారు “మాలికకు రచనను పంపుతున్నారు గదా” అని వినాయకచవితి  ఉదయము జ్ఞాపకపరచారు.  అందువల్ల వినాయకునిపైన నేను వ్రాసిన పద్యాలను ఏర్చి కూర్చిన ఈ రచన పాఠకలోకానికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. మొత్తము 25 రకముల వృత్తములలో, జాతులలో 39పద్యములు ఉన్నాయి.  వృత్తముల వివరణలు, నాగబంధ చిత్రము చివర ఇవ్వబడినవి.

 

శ్లోకములు –

శుక్లాంబరధరున్, విష్ణున్, (శుక్లాంబరధరం విష్ణుం)

శశివర్ణున్, చతుర్భుజున్, (శశివర్ణం చతుర్భుజం)

ప్రసన్నవదనున్ దల్తున్ (ప్రసన్నవదనం ధ్యాయేత్)

విఘ్న మ్మన్నియుఁ బాపఁగా  (సర్వవిఘ్నోపశాంతయే) – (1)

 

అనంత విశ్వ సంచారీ

అనాథకుల నాయకా

వినాయకా సదా నీకు

ప్రణామమ్ము లొసంగెదన్ – (2)

 

ఆప రావయ్య విఘ్నమ్ముల్

ఆపదలను బాప రా

పాపములను బోగొట్టి

నాపైఁ గరుణఁ జూపరా – (3)

 

గుంజీల నెన్నొ తీస్తా నేన్

రంజిల్ల జేయరా మదిన్

సంజలోన ప్రభాతాన

నిన్ జపింతు సుధామయా – (4)

 

కిణపా –

కావుమయ విఘ్నేశా

దేవగురు దేవేశా

పావన పరంధామా

ప్రోవుము వరారామా  – (5)

 

పార్వతికి మోదమ్మై

శర్వునికి మోదమ్మై

సర్వజగ మోదమ్మై

యుర్వి కిడు మోదమ్మున్ – (6)

 

మాధవుని కల్లుండా

మోదముల కిల్లై, నా

వేదనలఁ బాపంగా

రా దరికి హేరంబా  – (7)

 

సురి –

గణముల దేవుండై

యనఘుఁడు నీవుండన్

దనువిటఁ గంపించెన్

మనసునఁ దల్వంగన్ – (8)

 

భువనము  మ్రోఁగెన్గాఁ

గవనముఁ బాడంగా

నవముగఁ బారెన్గా

భవసుత రాగమ్మై – (9)

 

త్రిజగము లేకమ్మై

నిజముగ వేచే, నో

గజముఖ రావయ్యా

విజయము నీయంగా  – (10)

 

గజగతి –

గజముఖా గణపతీ

గజగతీ గజపతీ

త్రిజగ వందిత పదా

నిజము గొల్తును సదా – (11)

 

అజయ, వందితగణా,

త్రిజగపూజితగుణా,

గజగతిన్ వరములన్

గజముఖా యొసఁగ రా – (12)

 

గణదేహా –

జగదాధారా – సద్గణదేహా

జగణాకారా – సద్గుణగేహా

నగజానందా – నాదవినోదా

నిగమాంబోధీ – నిశ్చల నాదా  – (13)

 

తృషాగ్ని –

అనాదిదేవా – అనాథబంధూ

సనాతనాత్మా – సనూతనాశా

అనూహ్యరూపా – అనంతదీపా

వినోదచిత్తా – వినాయకా రా – (14)

 

సుముఖీ –

సుముఖుని దల్తును – సుందరమై

ప్రముఖుని దల్తును – పావనమై

యమలుని దల్తును – హ్లాదముగా

విమలుని దల్తును – వేదముగా – (15)

 

గౌరీ-

పారంగతునిన్ – పరమాశల నిప్డున్

వారించఁగ దు-ర్భర విఘ్నము లెప్డున్

గౌరీసుతు నే – ఘన భక్తిని దల్తున్

హారమ్ములతో – హరి కాప్తుని గొల్తున్ – (16)

 

గజలలిత (కుసుమవిచిత్రా ) –

ఘనుని దలంతున్ – గజలలితాస్యున్

మనసునఁ గొల్తున్ – మనసిజరూపున్

నను దయతోడన్ – నయముగఁ గావన్

గణపతి నీకున్ – గరముల మోడ్తున్ – (17)

 

మోదకము –

మోదకహస్తుని – మ్రొక్కెద నిప్పుడు

బాధల దీర్చును – భక్తుల కెప్పుడు

పేదలఁ బ్రోచును – విఘ్నము లాపును

మేధను నెల్లర – మించిన దైవము – (18)

 

ఖేదము బాపెడు – ఖేలన వీక్షణ

మోదము లిచ్చెడు – మోదక భక్షణ

నీ దరహాసము – నిల్పును విఘ్నము

పాదము లందున – భక్తి నిమగ్నము – (19)

 

సువర్ణపూరము –

వరద వినాయకా సు-వర్ణపూర రావా

గిరితనూజ పుత్త్ర – గీతికా వినోదా

హరిహరేంద్రచిత్త – హర్షదాయకా యీ

విరుల నందుకోర – విశ్వరూపధారీ – (20)

 

గజాస్య –

మోదకమ్ముల నిత్తు – ముదమార నీకున్

బాధకమ్ముల బాపు – ప్రణతోఽస్మి యందున్

నాదబిందు విలాస – నను గావు మయ్యా

ఆదిదేవ గజాస్య – యగజాననాత్మా- (21)

 

గజానన –

ఓ గజానన దేవ – యుమకు సుతుఁడ

వేగ మాపుమ విఘ్న – విషమములను

రాగతాళలయంపు – రవళి యలర

స్వాగతమ్మిదె స్వామి – సరస గొలుతు – (22)

 

నాగానన –

గణపతి, పలు వి-ఘ్నమ్ముల నిలుపర

అనఘుని నిను నే – నర్చన సలిపెద

గుణనిధియగు నిన్ – గూర్మిని గొలుతును

ప్రణతులఁ గొనరా – పాపముఁ గడుగఁగ- (23)

 

కరుణను గను నా-గానన సతతము

శరణని యనెదన్ – స్కంధుని సహజుఁడ

వర సుర వినుతా – వందనములఁ గొను

హరుని తనయుఁడా – హర్షము నొసఁగఁగ – (24)

 

సుగంధి (తూణకము) –

వారిజాసనాప్త ,కాలవంశజా, సతీసుతా, (వా స కా వం స తా)

తారకాసఖాంగ, వంద తప్పులన్ క్షమించవా ,(తా స వం త క్ష వా)

వారణాక్ష , సిద్ధి తల్ప, పార్వతీ తనూభవా, (వా క్ష త పా త వా)

వారిజాతపాద, పాపభంజనా, యశోనిధీ, (వా త పా భం య ధీ)

ధీరకాయ, విఘ్నభంగ, దివ్యవేశరూపకా, (ధీ య భం ది శ కా)

కారణాంశ, నీవె దిక్కు కావరా, సదా శివా! (కా శ ది కా స వా)  – (25)

(కుండలీకరణములలోని అక్షరములు నాగబంధములో రెండు పాదములు సంధించిన చోటులోని అక్షరములు, బొమ్మను చూడండి)

 

గజరాజ-

విజయేంద్రు గౌరికి – బ్రియమైన కొమరునిన్

నిజమైన విద్యల – నికరమ్ము కొఱకు స-

ద్గజరాజశీర్షుని – గణనాథు సుముఖు నం-

బుజనేత్రు వైష్ణవు – ముదమార దలతు నేన్- (26)

 

కడు దివ్య దీప్తితో – గజరాజ ముఖముతో

నడిమింట రమ్ము తి-న్నగ నీవు నగవుతో

అడుగంగ నిచ్చు యో – యగజాంశ, యిడుములన్

విడిపించు, యిత్తు నీ – ప్రియమైన కుడుములన్- (27)

 

గజవరవిలసిత (ఋషభగజవిలసిత) –

మోదకహస్త నా కిట – ముదముల నొసఁగుమా

నాదవినోద, జ్ఞానపు – నయనము నొసఁగుమా

కాదన కో వినాయక – గజవరవిలసితా

నీ దయ నీయుమా నిను – నిరతము దలఁతు నేన్- (28)

 

పృథ్వి –

నగేంద్రసుతనందనా – నవ యుగాధిదేవాఽచ్యుతా

జగాధిపతినందనా – జయ జగద్ధితాపేక్షితా

ప్రగాఢకరుణాకరా – వరమృగాననా చిన్మయా

సుగాత్ర గణనాయకా – శుభమృగాసనా సన్మయా – (29)

 

వినాయక  –

వినాయకుఁడ కావరా – నిన్ – వినా యెవరు లేరులే

అనంగసమ దేవ రా – నీ – వనాథలకు మేరువే

ప్రణామములు నీకెరా – యీ – వనీపకుని నోర్చరా

మనస్సు యిది నీదెరా – నా – మనోరథముఁ దీర్చరా – (30)

 

మాత్రాగణములతో వినాయక –

మహేశ్వర మహాకృతీ – శ్రీ – మహాగణపతీ, ద్యుతీ

మహాఽఘమదనాశనా – సుర – మహోత్పలవిలోచనా

సహాయముల నీయవా – నా – సహోదర శుభంకరా

బృహద్భువన మోహనా – హృ- ద్విహారి విఘ్నేశ్వరా – (31)

 

లలితాతనయ –

జగముల ఱేఁడైన హేరంబ – సద్బుద్ధి నొసఁగుచుఁ గావా

నగజకు సత్పుత్త్ర విఘ్నేశ – నానా గణములకు దేవా

నిగనిగ లాడంగ వెల్గొంది – నీవిందు ననుఁ గన రావా

ముగ మది మాతంగ రాజమ్ము – మోదమ్ము నిడు మనుభావా – (32)

 

ప్రియముగ నా గౌరి ప్రేమించు – ప్రీతించు సుతునికి లాలీ

జయమును లోకమ్మునం దిచ్చు – సర్వేశు సుతునికి లాలీ

భయమును విఘ్నమ్ముఁ బాపేవు – ప్రత్యక్ష గురువుకు లాలీ

హయముగ నా నెల్క నెక్కేవు – హర్షాత్మ శిశువుకు లాలీ – (33)

 

మత్తేభవిక్రీడితము –

మదమాతంగమువోలె రూప మొకటిన్ – మాధుర్య ముప్పొంగగా

సదయుండౌ గజచర్మధారి ధరియిం-చన్, దేవియున్ మాఱె దా

మదమాతంగిగ, దివ్య దంపతుల యా – మత్తేభవిక్రీడితం

బది విఘ్నేశ్వర జన్మ కారణము, శో-భల్ నిండె విశ్వమ్ములో – (34)

 

సామజము  –

హృదిలో సామజవక్త్రుఁ గొల్తును – మృదూక్తుల్ నిండు పద్యమ్ముతో

సదుపాయమ్ముల నివ్వ వేఁడెద – సదా సద్భక్తి నిండారఁగా

నిధి నీవే గద యో వినాయక – నిదేశమ్మిమ్ము లంబోదరా

మధురాకారముతోడ నర్తించు – మదాత్మాకాశమం దిచ్ఛతో – (35)

 

మేదురదంతం  (కిరీట) –

దండము మేదుర-దంతుని కిత్తును – దప్పుల నొప్పుగ – దప్పక జేయుము

దండము విఘ్నవి-దారక దేవర – తామరసాక్ష సు-ధారసమానస

దండము నీదు ప-దమ్ముల కెప్పుడు  -తత్వ విచారణ – తామసవారణ

దండము చిన్మయ – దండము చిద్భవ – దండము సద్భవ – దండ ముమాభవ – (36)

 

ఓఁవి –

వర సమ్మోద దాయక

వరదా ఓ వినాయక

ధరలో నను బాయక

గురువై కావవయ్య – (37)

 

గజవదన –

అందముగా ధవ-ళాంబర శోభల

చందురు వన్నెల – చతుర్భుజమ్ముల

మందహాసముల – మాధవాంశముల

స్కంధాగ్రజ ననుఁ – గావు విఘ్నముల – (38)

 

గజవదనా రా – గజవదనా రా

త్రిజగ వందితా – సుజన పోషకా

సృజనాత్మక ది-గ్విజయ కారకా

భజియింతును నిన్ – కుజన మారకా – (39)

 

1. కిణపా – భ/య/గ – యతి లేదు – 7 ఉష్ణిక్ 15

2. సురి – న/య/గ – యతి లేదు – 7 ఉష్ణిక్ 16

3. గజగతి – న/భ/ల – యతి లేదు – 8 అనుష్టుప్ 120

4. గణదేహా – స/మ/స/గ – యతి (1, 6) – 10 పంక్తి 196

5. తృషాగ్ని – జ/త/ర/గ – యతి (1, 6) – 10 పంక్తి 166

6. సుముఖీ – న/జ/జ/లగ – యతి (1, 8) – 11 త్రిష్టుప్ 880

7. గౌరీ – త/జ/జ/య – యతి (1, 6) – 12 జగతి 877

8. గజలలిత (కుసుమవిచిత్రా) – న/య/న/య – యతి (1, 7) – 12జగతి  976

9. మోదకము – భ/భ/భ /భ, – యతి (1, 7) – 12 జగతి 3511

10. సువర్ణపూరము – న/ర/ర/ర/గ – యతి (1, 9) – 13 అతిజగతి 1368

11. *గజాస్య – ర/స/న-/ర/గ – యతి (1, 8) – 13 అతిజగతి 1499

12. *గజానన – ర/స/న/న/ల – యతి (1, 8) – 13 అతిజగతి 8155

13. *నాగానన – న/న/త/న/లల – యతి (1, 8)  – 14 శక్వరి 16192

14. సుగంధి (తూణకము) – ర/జ/ర/జ/ర –  యతి (1, 9) – 15 అతిశక్వరి 10923

15. గజరాజ- స/జ/న/భ/స – యతి (1, 8) – 15 అతిశక్వరి  15852

16. గజవరవిలసిత (ఋషభగజవిలసిత) – భ/ర/న/న/న/గ – యతి (1, 8) – 16 అష్టి 32727

17. పృథ్వి – జ/స/జ/స/య/లగ – యతి (1, 9) – 17 అత్యష్టి 38750

18. వినాయక – జ/స/య/జ/స/లగ – యతి (1, 9) – 17 అత్యష్టి 47710

19. *లలితాతనయ –  న/య/య/య/న/స/గ – యతి (1, 11) – 19 అతిధృతి 127568

20. మత్తేభవిక్రీడితము – స/భ/ర/న/మ/య/లగ – యతి (1, 14) – 20 కృతి 298676

21. సామజము – స/భ/ర/న/మ/య/లగ – యతి (1, 12) – 20 కృతి 298676

22. మేదురదంత (కిరీట) – భ/భ/భ/భ/భ/భ/భ/భ – యతి (1, 7, 13, 19) – 24 సంకృతి 14380471

* సార్థకనామ గణాక్షర వృత్తములు

 

23. శ్లోకము – పాదమునకు ఎనిమిది అక్షరములు, 5,6,7 అక్షరములు –

బేసి పాదములలో య-గణము, సరిపాదములలో జ-గణము, చివరి అక్షరము గురువు లేక గురుతుల్యము

24. ఓఁవి – పాదమునకు 5-12 అక్షరములు, నాలుగవ పాదము చిన్నది, మొదటి మూడు పాదములకు అంత్యప్రాస

25. గజవదన – 6 / 6 (ఆఱు అక్షరములకు 8-12 మాత్రలు)

 

నాగబంధము –

నాగబంధ చిత్రము.  దీనికి షడ్భుజి సౌష్ఠవము గలదు. ఎడమవైపు చిత్రములో నాగాకారము ఏ విధముగా వచ్చునో అన్నది చూపబడినది. కుడివైపు చిత్రములో నాగబంధ పద్యము ఉన్నది. చిత్రము నైలాను త్రాడుతో చేసినాను. త్రాడు భాగములు సంధించు చోటులలో రెందు పాదములలోని అక్షరము ఒకటిగా నుండవలయును.

nAga+poem

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *