April 19, 2024

జ్ఞానపీఠ గ్రహీతలూ- మన పరిచయాలు

రచన: లక్ష్మీదేవి

gnanapeetha

సహృదయానికి సాహిత్యం ఆనందప్రదాయకమైనది. సాహిత్య ప్రపంచంలో ఘనులై, మణులై, అక్షర ముత్యాల గనులై వెలసిన కవి పండితులు, రచనాకారులు మనకెందరో ఉన్నారు. వారిని మన మనసుల్లోనే  గౌరవించుకోవడంతో ఆగకుండా, మనప్రాంతంలో అందరికీ తెలుసునని ఊరుకోకుండా, భారతంలోని అన్ని రాష్ట్రాల్లో, ప్రపంచంలోని కొన్ని దేశాల్లోనైనా వారి రచనా పాటవాన్ని, భావ ప్రాభవాన్ని పరిచయం చేసే ప్రయత్నాల్ని “కువెంపు ప్రతిష్ఠానం” స్ఫూర్తితో  మనమూ చేపట్టాలి. కవుల భావజాలాలపట్ల, భాషాశైలుల పట్ల భిన్నాభిప్రాయాలున్నా వారి లేఖనా సామర్థ్యాన్ని, సమాజానికి మేధో దాహం తీర్చే వారి యోచనా స్రవంతిని భారతీయ భాషలకు, విదేశీ భాషలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.

దేశదేశాల్లో ఉన్న కవుల రచయితల గురించి మనకు తెలిసినంతగా పక్కరాష్ట్రాలలో ఉన్న కవుల రచయితల గురించి కూడా మనకు తెలియక పోవడం విచిత్రంగా ఉంటుంది. మన రచయితల రచనలను విదేశీభాషల్లో అనువదింపజేయాలనీ, ప్రపంచఖ్యాతి వారికి కలగాలని మనం కోరుకోవడంలో ఏ తప్పూ లేదు. కనీసం మన రచయితల గురించి మన చుట్టు ప్రక్కల రాష్ట్రాల్లో అయినా తెలియజేయగలిగితే ఎంతో బాగుంటుంది. మన రాష్ట్రాలన్నీ రెండుమూడు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్న నేపథ్యంలో ద్విభాషీయులకు కొదువలేదు. వారి సహాయంతో మన సాహిత్యకారుల పరిచయ పుస్తకాలు వ్రాయించి, సభాసమావేశాలు నిర్వహించి, ఆయా రాష్ట్రీయులకు కొంతైనా తెలియజేస్తూ పోతే మనకు మన భారతీయ రచనల గురించి, వ్రాసినవాళ్ళ గురించి అవగాహన వస్తుంది.

చెప్పాలంటే మనం అత్యున్నతంగా భావించే జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలైన భారతీయ సాహిత్యకారుల గురించి మనకు తెలిసినదెంత? మన రాష్ట్రంలో మూడు జ్ఞానపీఠ పురస్కారాలు  వస్తే ఇంకో పదిమంది అందుకు అర్హులని మనకు తెలుసు. కానీ భారతదేశంలో ఎందరికి తెలుసు? మన కవుల్లో ఎంతటి ఉదాత్తరచనలు చేసేవారున్నారో ఎంత ప్రౌఢమైన రచనలు చేసే వారున్నారో మనమే ప్రక్కరాష్ట్రాల ప్రజలకు తెలియజేసే పనికి పూనుకోవాలి. వారి రచనలను కొద్దిగా పరిచయం చేయాలి.

భారతీయుల సంస్కారం, నుడికారం, అలవాట్లు , పూర్వచరిత్ర ఒకటే అయిన నేపథ్యంలో మనవారి రచనల్లో విశిష్టత వారికీ,  వారి రచనల్లో విశిష్టత మనకూ అర్థం కావడం కోసం పెద్ద కష్టపడనక్కరలేదు. కనీసం ఆంగ్లానువాదాలకన్నా ఇవి సులువైనవి. అవసరమైనవి. ఎందుకంటే మన నుడికారాలు, సాంఘికజీవనాలు, సామెతలతో సహా వారికర్థం కావడానికి పాశ్చాత్య భాషల్లోంచీ/లోకీ అనువదించినంత సందిగ్ధతా ఉండదు. మన గొప్ప కవుల గురించి వారి రచన గురించి అన్ని రాష్ట్రాల్లో సదస్సులు, సమావేశాలూ నిర్వహిస్తూ అక్కడివారికి అవగాహన వస్తుంది.

సరిగ్గా ఇటువంటి ప్రయత్నమే మన తెలుగు విశ్వవిద్యాలయం, మన కన్నడ విశ్వవిద్యాలయాల సహకారంతో కువెంపు ప్రతిష్ఠానం చేపట్టింది.

కుప్పళి వెంకటప్ప పుట్టప్ప అనే కన్నడ మొదటి జ్ఞానపీఠ బహుమతి గ్రహీత గురించిన రెండు రోజుల సదస్సు(18,

19 అక్టోబర్ 2014) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. వారి జీవితం-రచనల గురించి, వారి జ్ఞానపీఠ దక్కిన రచన శ్రీరామాయణ దర్శనం అనే గ్రంథంతో విశ్వనాథ సత్యనారాయణ వారి కల్పవృక్షం తో తులనాత్మక పరిశీలన గురించి, వారి వైదుష్యం గురించీ, అనువాదాల గురించీ పత్రసమర్పణలు జరిగినాయి. వారి గురించిన ఒక డాక్యుమెంటరీ ప్రదర్శన, వారు రచించిన ఒక నాటకపు తెలుగు అనువాదపు ప్రదర్శన జరిగింది.

ఇటువంటి ప్రయత్నం మనమూ చేయాలని సదస్సులో పాల్గొన్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య ఎన్ గోపి, కేంద్ర సాహిత్య అకాదమీ కార్యదర్శి శ్రీనివాస్ గారు కూడా అభిప్రాయపడినారు.

“రాష్ట్రకవి కువెంపు ప్రతిష్ఠానం” ఏడాది పొడుగునా కుప్పళిలోనూ, కర్ణాటకలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ విద్వత్ గోష్ఠుల్ని, సభాసమావేశాల్నీ నిర్వహిస్తుంది. ముంబయి, దిల్లీ, కోల్ కతా, భువనేశ్వర్ లో విజయవంతంగా నిర్వహిస్తున్నది. అంతేకాక ఇతరభాషల సాహిత్యవేత్తలను ప్రత్యేకంగా ఎన్నిక చేసి కువెంపు పురస్కారం పేరిట ఐదులక్షల రూపాయల బహుమానం ఇవ్వడం జరుగుతున్నది. ఈసారి మహారాష్ట్రకు చెందిన నామవర్ సింగ్ అందుకున్నారంట . అంతేకాక ఒక సంచార వాహనంలో అద్దాల అరల్లో కువెంపు రచనలని ఆకర్షణీయంగా అమర్చి ఊరూరా తిరుగుతూ, ప్రదర్శన, అమ్మకం చేస్తున్నది. కవి ఇంటిని కవిమనె పేరుతో వారి పుస్తకాలు, వస్తువులతో ఒక ప్రదర్శనశాలగా ఏర్పాటు చేయడమే కాక ఒక అధ్యయన కేంద్రంగా రూపుదిద్దింది. వీటన్నింటిలో ప్రజాసహకారం , ప్రభుత్వతోడ్పాటు ఇతోధికంగా ఉందని వేరే చెప్పనవసరం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *