April 25, 2024

మాయానగరం: 9

రచన:భువనచంద్రbhuvana

 

 

 

 

“పోనీ ఇవాళ మా ఇంట్లో భోంచేద్దురు గాని.. అదీ మీకు ఇష్టం అయితేనే..! మెల్లగా అన్నది మాధవీరావ్. “అమ్మయ్యా..మాధవిగారూ.. అన్నపూర్ణాదేవే ఎదురుగా వచ్చి ‘భక్తా..ఇదిగో ప్రసాదం’ అంటూ అంటూ వడ్డిస్తానంటే వద్దనేవాడు లోకంలో వుంటాడాండీ?  తొలి నే జేసిన పూజాఫలమో… నేటి ఆలయ దర్శన సౌభాగ్యమో…లేకపోతే…” ఆనందం అంతా ముఖంలో ప్రతిఫలిస్తుండగా అన్నాడు ఆనందరావు.

“అయ్యా..నేను అన్నపూర్ణాదేవిని గాదు. జస్ట్ మాధవిని. పాయింటు టూ నాకు సరిగ్గా వంట రాదు. శాకపాకాలన్నీ మీ ‘దంతసిరి’  మీద ఆధారపడి వుంటాయి..” నవ్వీ నవ్వనట్టు నవ్వింది మాధవి.

“మరి నా సంగతి?” కావాలనే అన్నది శోభ.

“నువ్వు లేకపోతే ఎలాగూ.. అసలు ఇవాళ రోజంతా వుండాలనుకున్నదే నీతోగదా..!” స్నేహంతోనూ,  ప్రేమతోనూ శోభని దగ్గిరికి తీసుకుంది మాధవి. శోభ కళ్ళల్లో నీళ్ళు తిరిగినై.

లక్ష గ్రంధాలు చెప్పలేని విషయం ఒక్క స్పర్శ చెప్పగలదు. ‘అంతటి ఆత్మీయ స్పర్శ దొరకడం శోభ జీవితంలో ఇదే మొదటిసారి. ఆ విషయం గమనించినా గమనించనట్టు నటించాడు ఆనందరావు.

——————

శోభ కూరలు సెలెక్ట్ చేస్తోంది. ” మీరు ఆగండి శోభగారూ…నన్ను సెలెక్ట్ చెయ్యనివ్వండి…! అంటూ ఆమెని ఆపాడు  ఆనందరావు.

“అదేమీ?” ఆశ్చర్యంగా అడిగింది శోభ.

“మీరు సెలెక్ట్ చేస్తున్న పద్దతి చూస్తే తెలిసింది.. కూరగాయలు కోయడం లో మీకేమాత్రమూ అనుభవం లేదని..!” నవ్వాడు ఆనందరావు.

“అంటే” కొంచెం చిన్నబుచ్చుకుని అన్నది శోభ. వాళ్లిద్దరి సంభాషణ వింటూ ఆనందిస్తోంది మాధవి.

“ఇదిగో యీ వంకాయల్ని ఇలా చూసి అలా తట్టలో పడేస్తున్నారు. కొద్దిగా, మరీ గట్టిగా కాకుండా నొక్కి చూడండి… మెత్తగా అనిపిస్తే అవి లేతకాయలన్నమాట. గట్టిగా వుంటే లోపలంతా ముదురు గింజల తోటి వుంటై… టేస్టు వుండదు. వంకాయలు వన్నె తగ్గకుండా నవ నవలాడుతూ వుంటే తాజావన్నమాట. అలాగే పుచ్చులు లేకుండా చూసుకోవాలి…!” అంటూ ఏ కూరగాయని ఎలా సెలెక్టు చెయ్యాలో చక్కగా వివరించాడు ఆనందరావు.

“బీరకాయల్ని?”… నవ్వుతూ అడిగింది మాధవి.

“మీకు తెలిసీ అడుగుతున్నారు. అయినా చెబుతున్నా… పైన  గీతలుగా ఉన్నాయి కదా చెక్కులు. వాటిని స్మూత్ గా గిల్లి చూడండి. తీగలుగా దారాలుగా వుంటే అది ముదురుది. ఓన్లీ కండ మాత్రమే వస్తే లేతది.” చూపించాడు ఆనందరావు.

“ఇవన్నీ మీకెలా నేర్పారు ఆనందరావు గారూ?” ఉత్సాహంగా అడిగింది శోభారాణి.

“మొదట మా అమ్మ నేర్పారు.  ఆ తరువాత జీవితం నేర్పింది…!” నవ్వాడు ఆనందరావు. మార్కెట్టులో కూరగాయలు కొని మాధవి ఇంటికి వెళ్ళేసరికి ఒంటిగంట అయ్యింది. “పోనీ ఒక పని చేద్దాం… కేరేజీ ఏదన్నా వుంటే ఇవ్వండి.. యీ పూటకి బయటినుండి పట్టుకొచ్చేస్తాను…!” అన్నాడు ఆనందరావు.”నిజం చెబితే ఆకలే లేదు. తొందరేముందీ… చక్కగా వండుకుని మూడింటికి తిందాం. చిటికెలో వంట చేసేస్తాగా..!” నవ్వింది మాధవి. శోభ కూరగాయలు తరుగుతానన్నది. “శోభాజీ… తప్పకుండా తరగండి. అయితే అన్ని ముక్కలు ఒకే సైజులో వుండేలా తరగాలి. ఒకటి పెద్దదిగా, ఒకటి చిన్నదిగా వుంటే ఉప్పూ, కారాలు సరిగ్గా పట్టవు..!” జాగ్రత్తలు చెప్పాడు ఆనందరావు.

“మీ మాటలు వింటుంటే మీకు వంటలు బాగా వచ్చు అనిపిస్తోంది!” అన్నది మాధవి. “ఎవరు నేర్పారూ? మీ అమ్మగారా?” అని కూడా అన్నది.

“అవును…” నిట్టూర్చి అన్నాడు ఆనందరావు.

“అదేంటి… అలా నిట్టూర్చారూ?” మాధవి అడిగింది.

“మాధవిగారూ, ఒక చిన్న రిక్వెస్టు… యీ పూట వంట నన్ను చెయ్యనిస్తారా?” మీదకి చూస్తూ అన్నాడు ఆనందరావు.

“నేను చేస్తానుగా…!” అర్ధం కాక అన్నది మాధవి.

“సరే… మా అమ్మ జ్ఞాపకం వచ్చినప్పుడు నా గుండె బరువెక్కిపోతుంది. ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి నా పదమూడేళ్ళ వయసులో వంట చేస్తుండేవాడిని… ఆ తరువాత ఏదో ఓ పుస్తకం పట్టుకుని ఆమె జ్ఞాపకాల తుఫానునించి తప్పించుకునేవాడ్ని. ఎందుకో ఇవ్వాళ… చాలా చాలా సంవత్సరాల తర్వాత మా అమ్మ అతి గాడంగా గుర్తొచ్చింది…! ” తలవంచుకునే మెల్లిగా అన్నాడు ఆనందరావు.

“ఓకె… స్టవ్ వెలిగించి నేను తప్పుకుంటాను. ఉప్పూ కారం పసుపు పోపు దినుసులు ఇవిగో ఈ డబ్బాల్లో వున్నాయి. నూనె నెయ్యి ఎట్సెట్రా అదిగో వాటిల్లో వున్నాయి. కానీ ఒక్క విషయం…. ఇవాళ మీరు మాకు చేసేది కేవలం వంట అనుకోవద్దు. మీ అమ్మగారి ప్రసాదం అనుకుని ఆనందంగా చేసి మాకు వడ్డించండి…!” ఆనందరావు భుజాన్ని అనుకోకుండానే మెల్లగా తట్టి అన్నది మాధవి. అంతేగాదు శోభ వంక కూడా అర్ధవంతంగా చూసింది.. హాల్లోకి రమ్మని.

ఓ బెడ్ రూము, కొంచెం పెద్ద హాలూ, మాంచి కంఫర్టబుల్ కిచెనూ, బాత్ రూమూ వున్నాయి ఆ  అపార్ట్‌మెంట్

అది కంట్రాక్టర్ తన కోసం కట్టుకున్నది. లక్కీగా మాధవికి దొరికింది.

“ఏంటక్కా… బాగా సెంటిమెంటల్ గా ఫీలవుతున్నట్టు వున్నారాయన…” అన్నది శోభ… గుసగుస గా.

“కొన్ని జ్ఞాపకాల గాఢత అలానే వుంటుంది లే. హీ విల్ భీ ఆల్ రైట్… డోంట్ వర్రీ!” అని నిట్టూర్చింది మాధవి.

గంట గడిచింది. “మాధవిగారూ… టమోటా పప్పు… వంకాయ, చిక్కుడుకాయ కూర… మిరియాలూ,  టమాటాల చారు… సింపుల్ గా కేబేజీ పచ్చడి… రెడీ…!” హాల్లోకి వచ్చాడు ఆనందరావు.

“ఓహ్… అంత త్వరగానా?” ఆశ్చర్యంగా అన్నది శోభా.

“ఇంకా అన్నం వుడకాలి గదా… గివ్ మీ టెన్ మినిట్స్ ” నవ్వాడు ఆనందరావు.

“హలో…” కొద్దిగా ఆయాసపడుతూ లోపలికి వచ్చింది మిసెస్ సుందరీబాయి. “ఓహ్… చాలా మంది గెస్టులున్నారనుకుంటాను మాధవీరావ్… హూ ఈజ్ దిస్ యంగ్ గాళ్… హూ ఈజ్ థట్ స్మార్ట్ చాప్…!” గడ గడా ప్రశ్నలడిగింది శోభా వంకా, ఆనందరావ్ వంకా తేరిపార జూస్తూ…

“యీ పిల్ల నా చెల్లెలు శోభ.. ఆయన ఆనందరావుగారనీ…” ఏం చెప్పాలో తెలీక ఆగింది.

“ఓ గుడ్ నేమ్.. గ్లాడ్ టూ సీ యూ మిస్టర్ ఆనంద్… నా పేరు సుందరీబాయ్ కిషన్ చంద్ జరీవాలా.. మా డేడీ మీకు తెలిసుండవచ్చు. ది గ్రేట్ చమన్ లాల్….!” ఆనందరావు చెయ్యి దొరకబుచ్చుకుని వీలున్నంత గట్టిగా నొక్కి అలాగే పట్టుకుని అన్నది సుందరి.

“ఓహ్… నైస్ టూ సీ యూ సుందరిగారూ..!” విడిపించుకుని అన్నాడు ఆనందరావు.

” మీకు సిగ్గు కొంచెం ఎక్కువనుకుంటాను… యూ నో.. సిగ్గుపడే మగాళ్ళు ‘అక్కడ” మాత్రం రెచ్చిపోతారని నా ఫ్రెండ్ జమ్నా బలాల్ చెప్తూ వుంటుంది!” కన్ను కొట్టి గట్టిగా నవ్వి అన్నది సుందరి. ఎవరికీ నవ్వు రాలేదుగానీ కుక్కర్ మాత్రం యీల వేసింది.

“ఓహ్… ఇంకా లంచ్ చెయ్యలేదా? గుడ్… నేనూ ఇవ్వాళ లేటే… కమాన్… తిండి మీద యుద్ధం ప్రకటిద్దాం!” ఉత్సాహంగా అన్నది సుందరి. ‘అలాగే..!”  అని మాధవి శోభ వంక చూసి వంటగదిలోకి వెళ్ళింది.

“మీరేం చేస్తుంటారు మిష్టర్ ఆనంద్…!” కుతూహలంగా అడిగింది.

“ప్రస్తుతానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నానండీ…!” నవ్వాడు ఆనందరావు.

“ఓ.. యూ హావ్ అ వెరీ క్యూట్ స్టైల్..!” కళ్ళు కొద్దిగా వెడల్పు చేసి, ఎడమకన్ను కొట్టి అన్నది సుందరి.

“ధాంక్యూ!” నవ్వాడు ఆనందరావు. ఈ సుందరి ఎవత్తో గానీ చాలా ఫాస్ట్ గా వుంది… జాగ్రత్తగా వుండకపోతే శీలం

శ్రీశైలంలో తేలుతుందని మనసులో అనుకున్నాడు… అసలీమె మాధవికి ఎలా పరిచయమైందీ? అని కూడా మనసులోనే ఓ ప్రశ్న వేసేసుకున్నాడు.

శోభా, మాధవీరావు ఇద్దరూ గిన్నెలు తీసుకొచ్చారు… హాల్లోకి. రైటింగ్ టేబుల్ మాత్రం మాధవికి వున్నది గానీ డైనింగ్ టేబుల్ లేదు. అందువల్ల చాపలు పరిచి వాటిమీద న్యూస్ పేపర్లు పాతవి పరిచి మధ్యలో వంట వండిన గిన్నెలు అమర్చారు.

“సారీ ప్లేటు ఒక్కటే అదీ నేను తినేది మాత్రమే ఉంది గనక, ఇవ్వాళ అందరం పేపర్ ప్లేట్లలోనే తినక తప్పదు.!” నాలుగు పేపర్ ప్లేట్లని న్యూస్ పేపర్లపైన పొందిగ్గా పెట్టి అన్నది మాధవి.

“ముద్దలు కలిపి పెట్టినా ఓ కే అక్కా!” నవ్వుతూ పప్పు, కూర పచ్చడి వడ్డిస్తూ అన్నది శోభ. “ఓ చిన్న ఎమెండ్ మెంట్ యంగ్ గాళ్… ఆ కలిపి ముద్దలు పెట్టేది మగవాళ్లు ఐ మీన్ ఆనంద్ గారయితే ఇంకా బాగుంటుంది. మై స్వీట్ హబ్బీ… అదే దట్ క్యూట్ ఫెలో నాకు అలానే తినిపిస్తారు!” ఓ పెద్ద జోకు వేసినట్టు సుందరి నవ్వుతుంటే శోభ ఆ మాటలకి గుడ్లు తేలేసింది. మాధవి చిన్నగా నవ్వింది. నవ్వి “ఇవ్వాళ మీవారిక్కడ లేరు కదా… ఎవరి ప్లేట్ లో వాళ్లు కలుపుకుని తిందాం… సరేనా…!” తను కూర్చుంటూ మిగితా వాళ్ళని కూర్చోమని సైగ చేస్తూ అన్నది మాధవి.

“వావ్… ఫెంటాస్టిక్. యే టమాటర్ కీ దాల్ హై నా…!” పప్పులో వేలు ముంచి నోట్లో పెట్టుకుని టేస్టుచేసి అన్నది సుందరి.

“వో ఏతో దాల్ హై… ఓ బెగన్ కీ సబ్జీ…!” చెప్పింది మాధవి.

“ఆనందరావుగారూ.. పప్పు అద్భుతం.. ఓహ్… కూరా అద్భుతమే… నిజం చెప్పనా… కేబేజీ చెట్నీ గురించి నేను ఇప్పటివరకూ వినను కూడా వినలేదు. రుచి చూస్తుంటే మతిపోతోంది” అన్నంలో కలుపుకుని గబగబా ముద్దలు తింటూ అన్నది శోభ.

“ఠీక్ బోలా యంగ్ గాళ్… మాధవీ తో సూపర్ కుక్ హై?” అన్నది సుందరి.

“వంట చేసింది మాధవి అక్కకాదు.. ఆనంద్ గారు..!” ఠక్కున అన్నది శోభ.

“రియల్లీ…!” కళ్ళు పత్తికాయలంత పెద్దవి చేసి ఆశ్చర్యంతో అన్నది సుందరి? “ఐ కాన్ట్  బిలీవ్…!” అని కూడా అన్నది.

“నిజంగా ఆయనే ఆంటీ…!” అన్నది శోభా.

“ఓ గాడ్… ఏమన్నావూ? ఆంటీనా… ఐయాం జస్ట్…” టప టపా ఎడమ చేతితో తల మీద బాదుకోవడం మొదలెట్టింది సుందరి.

“లేదు సుందరీ… అక్కా అనబోయి ఆంటీ అన్నది సుందరి. అది ‘నటన’ అని అందరికీ తెలుస్తున్నా ఏమి అనలేని పరిస్థితి.

సుందరి బుర్రలో ఏదో తుఫాను వస్తోందని గుర్తించింది మాధవి.

“ఆనంద్ జీ… మీరు గనక రోజూ ఇలానే నాకు వండి పెడతానని ప్రామిస్ చేస్తే మీ చేత స్టార్ హోటల్ పెట్టించి కేషియర్ గా నేనే వుంటా…!” అన్నది మళ్ళీ.

“స్టార్ హోటల్ పెట్టించినప్పుడు ఆఫ్ట్రాల్ కేషియర్ ఉద్యోగం ఎందుకూ? ఓనరే మీరవుతారు గదా!” నవ్వాడు ఆనందరావు.

“ఎప్పుడూ మీతోనే.. ఐ మీన్… ఎప్పటికప్పుడు మీ రుచుల్ని ఆస్వాదించ వచ్చుగా… అందుకని. ” మళ్ళీ కళ్ళు చికిలించి నవ్వుతూ అన్నది సుందరి. చున్నీ జారిపోయేలా భుజాల్ని విదిలించింది కూడా.

అందరికీ అర్ధమయ్యింది… సుందరి అలోచనలు ఎటు మళ్ళుతున్నాయో.

“అంత కష్టం ఎందుకు సుందరిగారూ… నేను ప్రొఫెషనల్ ని కాదు. అందునా వెజిటేరియన్  గాడ్ని. ఏదో సరదాగా ఇవాళ వంట చేశా గానీ, వంట కనీసం నా హాబీ కూడా కాదు…. ఎందుకులెండి.. ఏదో కాస్త నన్ను నాలాగా బతకనివ్వండి..” నవ్వి విషయాన్ని తేల్చేశాడు ఆనందరావు.

“పదార్ధాలు మాత్రం నిజంగా అద్భుతం… ఇప్పుడు యీ యొక్క ‘రసం’ యొక్క రుచుని అనుభవిద్దాం..!” ఓ గరిటెడు రసం చేతిలో పోసుకుని పీలుస్తూ అన్నది శోభ….” వావ్.. నధింగ్ టూ బీట్… సూపర్బ్!”

“ఓకె మాధవీ… నేను మళ్ళీ వస్తా.. ఆనంద్ జీ… సూపర్ లంచ్ కి ధ్యాంక్స్.. ఒక్క లంచ్ తోనే విడిచి పెట్టను సుమా.. బై!”  శెలవు తీసుకుంది సుందరి. కారు ఎక్కేదాకా చూస్తూ నిలబడారు.

“అబ్బ… తలవాచిపోయిందనుకో అక్కా ఆవిడ ఎక్స్ ప్రెషన్స్ చూసీ… అదేంటో.. ఆనంద్ గారూ… మేము వుండబట్టి సరిపోయింది.. అదే మీరు ఆవిడతో ఒంటరిగా వుంటే మిమ్మల్ని కొరుక్కు తినేసేది… ఓరి బాబోయ్ అంత కాంక్షా కళ్ళల్లో…!” ఆశ్చర్యంగానూ, తల నెప్పి తీరిందన్న సంతోషంతోనూ అన్నది శోభ. సుందరి వున్నంత సేపూ ఓ అన్ ఈజీ ఫీలింగ్.

“లేదే… షి లుక్స్ వెరీ జెంటిల్&  నైస్” అన్నాడు ఆనందరావు.

“మైగాడ్.. జెంటిల్ & నైసా?” షాక్ తిన్నది శోభా.

పకపకా నవ్వాడు ఆనందరావు.

“ఎందుకూ నవ్వుతున్నారూ?” చిరుకోపంగా అన్నది శోభ.

మాధవి కూడా చిన్నగా నవ్వి. “శోభా…ఆనందరావు గారు కావాలనే అలా అన్నారు. ఎందుకన్నారో తెలుసా…. సుందరి కంటే వెయ్యి రెట్లు ఆశతో,  కాంక్షతో శామ్యూల్ రెడ్డి పొద్దున్న నిన్ను చాశాడు. అతని మీద సదభిప్రాయం వున్నది కనక ఆ విషయం నీకు అర్ధం కాలేదు. కానీ మాకు మాత్రం క్లియర్ గా అర్ధమైంది. నిజం చెబితే నా మనసులో శామ్యూల్ గురించిన ఆందోళన ఇంకా తగ్గలేదు దయచేసి జాగ్రత్తగా మసులుకో. అతను ఎందుకో చాలా చెడ్దవాడని, నా మనసు చెబుతోంది!” అన్నది మిసెస్ మాధవీరావు.

“ఎగ్జాక్ట్లీ… నేను చెప్పదలుచుకున్నదీ అదే శోభ గారు… బట్… కంగారు పడకండి… మీ వెనక మేమున్నాంగా…!” అనునయంగా అన్నాడు ఆనందరావు.

 

మళ్ళీ కలుద్దాం…   భువనచంద్ర

1 thought on “మాయానగరం: 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *