March 29, 2024

ఉగ్గుపాలతో…

రచన: నండూరి సుందరీ నాగమణి sundari nagamani

“అప్పుడేమో వాడు వెళ్ళి పక్కింట్లోంచి మామిడి కాయలు తెంపుకుని వచ్చి వాళ్ళమ్మకి ఇస్తాడన్నమాట! అప్పుడేమో వాళ్ళమ్మ  వాడిని ముద్దు చేసి, ఆ మామిడికాయలతో పప్పు వండి, నెయ్యేసి, అన్నంలో కలిపి పెట్టిందట…” మేనత్త చెబుతున్న కథను ఎంతో ఆసక్తిగా వింటున్న చింటూని చూస్తూంటే, వేదనతో…దిగులుతో మానస మనసు బరువెక్కింది.

“చింటూ, ఇటురారా…” పిలిచింది గట్టిగా.

“కనపట్టంలా, అన్నం తింటున్నాడు… తినేసి వస్తాడులే…” తాపీగా చెప్పింది, అనంత.

మానస నిట్టూర్చి పనిలో పడిపోయింది. పసిపిల్లాడికి అలాంటి కథలా చెప్పేది? నాలుగేళ్ళ చింటూకి ఇక దొంగతనం తప్పని ఎలా తెలిసేది? ఆ రాత్రి చింటూని నిద్రపుచ్చుతూ, ‘దొంగతనం తప్పు’ అని చెప్పింది మానస. చిన్నతనంలో తోటకూర దొంగతనం చేసి తెచ్చిన పిల్లాడు పెద్దయ్యాక దొంగయై శిక్ష అనుభవిస్తూ తల్లిని ఎలా నిందించాడో చెప్పి, మంచి మాటలతో వాడి మనసుకు అది తప్పు అని అర్థమయ్యేలా వివరించింది.

మర్నాడు ఆఫీసుకు వెళ్ళబోతూ అనంతతో చెప్పింది మెత్తగానే… “చింటూకి అలాంటి కథలు చెప్పకు అనంతా… మనం చెప్పే కథలు వాళ్ళకి మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చేలా ఉండాలి కాని… దాన్ని పతనం చేసేలా ఉండకూడదు…” అయోమయంగా చూసి, వ్యక్తిత్వం, పతనం అన్న మాటలు వినగానే ఫక్కున నవ్వేసింది అనంత… ఆ నవ్వులో వెక్కిరింపు ఉంది.

ఆమె నవ్వుతో శ్రుతి కలిపాడు, మానస భర్త రమేష్. “ఎందుకు నవ్వుతున్నారు?” అడిగింది, మానస. “నీది మరీ చాదస్తం మానసా… ఏదో చిన్న కథ చెప్పినంత మాత్రాన వాడు పాడైపోతాడా?” తేల్చేస్తూ అన్నాడు, రమేష్.

“అవునండీ… వాడిలో మీరూ ఉన్నారు, నేనూ ఉన్నాను. మంచి నడవడిక జీన్స్ తో పాటు, మంచి పెంపకం వల్లనే వస్తుంది. మీకు నేను చెప్పేది చాదస్తంగా అనిపిస్తుందని నాకు తెలుసు. మీకైతే అబద్ధం చెప్పటం తప్పు కాదు, దొంగతనం తప్పు కాదు, ఎవరి వస్తువులైనా తెచ్చుకొని తిరిగి ఇవ్వకపోవటం తప్పు కాదు, ఎవరినైనా వెక్కిరించటం, వారి లోపాలను చూసి గేలి చేయటం తప్పుకాదు. మన పిల్లలు మన పెంపకాన్ని ప్రతిబింబించేలా ఎదగాలండి… ‘ఎవరు కన్నారో ఈ వెధవని?’ అని నలుగురూ మనల్ని నిందించేలా కాదు…” ఆగింది మానస.

“ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, అక్కడికి నువ్వే నీతి గలదానివి, మేమంతా చెడిపోయిన వాళ్ళమా? అయితే రేపట్నుంచి నీ కొడుకుని నువ్వే పెంచుకో… పగలు నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళకు…” ఉక్రోషంగా అంది అనంత.

“అవును…డబ్బు సంపాదిస్తుందని దీనికి బాగా పొగరు…మానసా, అసలు నీకు నేను, నా చెల్లెలూ ఎలా కనిపిస్తున్నాం? నీ నీతి పన్నాలతో పెంచితే మన పిల్లాడు లోకంలో బతకగలడా? ఎక్కడ దొరికావే సత్తెకాలం దానివి?” ఉరుముతూ మీది మీదికి వచ్చాడు రమేష్.

ఆ భాషకు, సంస్కారానికి పంటి బిగువున తన ఆవేశాన్ని, కంటిలోంచి జారబోతున్న నీటి బిందువును ఆపుకుంది మానస. “ఎంత సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు మీరు? మీరు ఆఫీసు స్టేషనరీ వస్తువులని ఇంట్లోకి తెచ్చి వాడటం నిజం కాదా? మొన్న మీ స్నేహితుడు ఇంటికి వస్తానని ఫోన్ చేస్తే ఊళ్ళో లేమని అబద్ధమాడటం నిజం గాదా? ఎదురింటి వాళ్ళబ్బాయికి పోలియో ఉందని, అవకరంతో నడుస్తాడని అతన్ని మీరిద్దరూ ‘కుంటాడు’ అని వెక్కిరించటం, మీ ఆఫీసు బాయ్ గురించి చెబుతూ అతని ‘నత్తి’ మాటలని మీరు అనుకరించటం, అనంత నవ్వటం నాకు తెలియదా? ఇవన్నీ నాకు నచ్చవు. తప్పని మీకెన్ని సార్లు చెప్పినా మీరు మారటం లేదు, పైగా అది అసలు తప్పే కాదని వాదిస్తారు.  వీటిని నా కొడుకు నేర్చుకోవటం కూడా నాకిష్టం లేదు. మీరు మారరని నాకు అర్థమైపోయింది. ఇక చాలు…” అంటూ లోపలి వెళ్లి, పిల్లాడికి పావుగంటలో పాలు, టిఫిన్ సర్ది ఆ బుట్టతో, భుజాన తన బాగ్ తో, చంకలో చింటుగాడితో బయటకు వచ్చింది.

“అంటే ఏంటి? వీణ్ణి ఒక్కదానివీ  పెంచేద్దామనే, ఉద్యోగం మానేస్తున్నావా ఏంటి?” వ్యంగ్యంగా అడిగింది అనంత. క్రోధంగా చూస్తున్నాడు, రమేష్.

“అవును…నా బాబును పాలతో పెంచుతాను, లోపాలతో కాదు!” దృఢంగా చెప్పి బాబుతో సహా  బయటకు నడిచింది మానస…

***

 

 

 

 

 

14 thoughts on “ఉగ్గుపాలతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *