March 29, 2024

తెలుగు పాటల్లో మంచి సాహిత్యం లేదా?

రచన: దేవి

చిత్రగీతాల్లో కొన్ని సందర్భానికి తగినట్టూ కొన్ని తగనట్టూ ఉంటూ ఉంటాయి. కొన్ని కాలక్షేపానికి మాత్రమే సరిపోయేవైతే కొన్ని పూర్తి పాట కూడా వినలేనట్టు ఉంటాయి. కానీ కొన్ని మాత్రం జీవనసత్యాలను, సత్యం యొక్క తత్త్వాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి.
అవి ఇప్పటికీ స్మృతిపథంనుంచి అలనాటి శ్రోతలకు తొలగకపోవడం మాత్రమే కాదు, కొత్తగా వినే వాళ్ళకూ  మన చిత్రగీతాల్లో కూడా ఇన్ని గూఢార్థాలు ఉండగలవా అన్న ఆశ్చర్యమూ కలుగ జేస్తాయి.

మొదటగా జగమే మాయ బ్రతుకేమాయ అనే పాట (దేవదాసు)లోంచి తీసుకొని వింటే ఎంత తేలికపదాలతో అద్వైతపాఠసారాన్నంతా బోధించినారో తెలుస్తుంది. కనిపించే ప్రపంచం అంతా మిథ్య అని ప్రపంచంతో పాటు అగుపించే భేదాలన్నీ వట్టి భ్రమలేననీ నిరూపిస్తారు. సందర్భం ఏదైనా అన్ని కాలాల్లో పనికి వచ్చే పాట. అందరికీ అర్థం కావలసిన పాట. గమనిస్తే ‘జగమంతా మాయ, భ్రమ’ అని వేదాలసారమంటారు. కనిపిస్తుంటే మాయ ఎలా అయితుందనేది ప్రశ్న. పచ్చని తోటలు స్మశానాలుగా మారడమూ, భవ్యమైన కోటలు , సామ్రాజ్యాలు రాళ్ళగుట్టలుగా పడిఉండడమూ మనం చూస్తాం.
అదేవిధంగా ప్రకృతి విలయతాండవమాడే తుఫాన్లూ, భూకంపాలూ వచ్చి ఆగిపోవడమూ చూస్తాం. అంటే ఈ రోజు ఏదైతే ఉందో అది శాశ్వతం కాదని తెలుసుకోగలగాల. మంచైనా, చెడైనా ఉన్నది పోయి క్రొత్త సృష్టి జరుగుతూనే ఉంది. ఉంటుంది. వికాసము, వినాశమూ కూడా మాయేననీ,
అట్లే నిలిచిపోదనీ, మారుతూ ఉంటుందని; కనిపిస్తూ, కనుమరుగయితూ ఉంటుంది కాబట్టి కనిపించేదంతా మాయ అంటున్నారు.
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ అనే వాక్యం చూస్తే కావడిగానో బల్లగానో కుర్చీగానో మనం చూస్తున్నదంతా నిజానికి కొయ్య/చెక్క యొక్క అనేక రూపాలు మాత్రమే. కుండలుగా, బొమ్మలుగా పాత్రలుగా చూసేదంతా మట్టి యొక్క విభిన్న రూపాలే.
ఏకం సత్ విప్రాః బహుధా వదంతి = ఒక సత్యాన్నే చెప్పే విధాలు అనేకరకాలు అన్నట్టు ఒక దైవస్వరూపమే అన్ని రూపాలూ ధరించినట్లు ఒక ద్రవ్యమే అన్ని రూపాల్లో ఉంది. అన్నీ లయమైనపుడు ఒక్కటే మూలపదార్థం మిగులుతుంది.  మనుషుల్లో
కక్షలూ కార్పణ్యాలూ అర్థం లేనివనీ, సృష్టిలో జీవకోటి అంతా ఒక్కటేననీ, ఒకరికి కలిగే బాధే అందరికీ కలుగుతుందనీ అందరం తెలుసుకుంటే ఒకరిమీద ఒకరి ఆధిపత్యం కోసం తగువులాడడం ఉండదు.

బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ ఈ ఎఱుకే నిత్యమానందమోయ్ అన్నారు ఇంకో చరణంలో. బాధే సౌఖ్యము ఎట్లవుతుంది అని చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. అంతా భావనలోనే ఉంటుందని, కష్టం సుఖం అనేవి మన మనస్సు చూపే ప్రతిక్రియ మాత్రమే ననీ, వివిధ సందర్భాల్లో ఒకే క్రియకు విభిన్న ప్రతిక్రియలు మనమే చూపుతుంటామని తెలుసుకోవాల. ఎట్లంటే కొడుక్కు ఆకలేసినపుడు వేడిగా పొగలు కక్కే అన్నాన్ని మెత్తగా కలిపి నోటితో ఊది మరీ తినిపించే అమ్మకు చేతులు కాలుతున్నాయన్న ఊహకూడా ఉండదు. మామూలుగా అయితే వేడివస్తువులను ముట్టుకుంటే అమ్మకు కాలదా? కాలుతుందనే క్రియ సమానమే
అయినా ఇక్కడ బాధే సౌఖ్యమయింది. కొడుక్కు తృప్తిగా తినిపిస్తున్న సంతోషం బాధను మరిపించేస్తుంది.
కొడుక్కు వేళదాటిపోతుందనుకుంటే తన ఆకలి, నిద్రమఱచి అమ్మ చీకటితో లేచి అన్నీ సిద్ధం చేసే తరుణం,
ఆపదలో చిక్కిన వారిని ప్రాణాలకు తెగించి కాపాడే వీరుల సుగుణం
అంటువ్యాధులు ఉన్నవారికి వైద్యులూ, వారి సహాయకులూ చేసే సేవల్లో ఉన్న నిస్వార్థ గుణం
ఇటువంటి ఉదాహరణలెన్నో చెప్పవచ్చు.

*********************


రెండవదిగా మనిషిమారలేదు అయినా కాంక్ష తీరలేదు (గుండమ్మకథ) పాట వింటే చంద్రమండలాన్ని , మంగళగ్రహాన్ని అందుకునే ఎత్తుకు మనిషి ఎదిగినా మనసు ఎదగలేదనీ కవి చెప్తున్నాడు. మనిషి ఆశకు అంతూ పొంతూ ఉండదు. తనకున్నది చాలదు
ఇంకా కావాలనే ఆశతో సాటిమనిషిని దోచుకోవాలనో వారిమీద అధికారం చెలాయించాలనో అనుకోవడం మానడంలేదు. వన్యమృగాలనుంచీ తనను తాను రక్షించుకోవడానికి అవస్థ పడినస్థాయినుంచీ మంగళయాన్ ను అందుకునే దాకా సాధించగలిగినా, తన మనసు
మీద తాను ఆధిపత్యం సంపాదించలేకపోయినాడు. ఆశ, మోహం,క్రోధం, ద్వేషం, పగ మొదలైన తనలోపలి శత్రువులపై విజయం సాధించలేక, తాను మారలేకుండా ఉన్నాడు. ఆలోచనాపరిధి ‘విస్తృతి’ పెరిగినంతగా ‘లోతు’ పెరగలేదని అందరికీ ప్రేమ ఆనందం పంచగలిగే స్థాయి ని చేరుకోలేక
పోతున్నాడనే అమూల్యమైన విషయాన్నిచిన్నమాటల్లోనే ఈ పాట చెప్తుంది.

**********************

మూడవదిగా అణువు అణువున వెలసిన దేవా (మానవుడు దానవుడు) పాట వింటే ఎక్కడ మంచిగుణాలున్నాయో వాటినన్నింటిని మనందరిలో నింపుకోగలిగే అర్హత ప్రసాదించమని శక్తి స్వరూపాన్ని ప్రార్థిస్తున్నట్టుగా ఎంతో స్ఫూర్తిప్రదంగా ఉంటుంది.
అనుక్షణం వచ్చే ఆపదలనుండి మనల్ని మనం రక్షించుకొనే శక్తి మనందరికీ రావాలని, అందరూ అందరికోసం నిలవాలని తాత్పర్యం. ఈ భౌతికలోకం లో కనిపించే దేవుళ్ళై మానవతకు ప్రతిరూపాలైన వైద్యులు, సంఘసేవకులు, ఋషులు ఏవిధమైన
జంకు లేకుండా  సమాజంకోసం పాటుపడుతుంటారు. రోగి కష్టాలు తీర్చే వైద్యుని సేవాగుణం, తమదికాని బాధలను తమది గా భావించి సేవచేసే వారి త్యాగగుణం, సమాజం సర్వసమభావంతో సుసంస్కృతం కావాలనే త్యాగబుద్ధితో సర్వప్రపంచాన్ని, స్వసుఖాలను విడిచి
సంస్కారాన్ని అందించడానికి పాటుపడే ఋషుల గొప్పదనాన్ని మాకివ్వమంటూ పాడే పాట ఎంతగొప్పది!

***********************


నాల్గవదిగా మౌనమె నీ భాష ఓ మూగమనసా (గుప్పెడుమనసు)పాట విన్నామంటే మనం ఎన్ని ఆదర్శాలు చెప్పుకున్నా మన మనసు వేసే కోతిగంతుల్ని నియంత్రించలేకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు.
మనసు మాట్లాడక మౌనంగా ఉన్నా దానివల్ల మనం ఎంత ప్రభావితం అయితామో చూడండి. కనులకు తోచింది స్వంతం కావాలని కలలు కంటాము, అవి కల్లలు కాగానే కన్నీటి పర్యంతం అయితాము.  అందాన్నో, అధికారాన్నో, ప్రేమనో మనదనుకొని ఆశపడి, అవమానం పాలై తలచి తలచి కుములుతూ మనలను, మనచుట్టూ ఉండే వాళ్ళనూ కలవరపెడతాము. చందమామను చూసి తృప్తి పడితే చాలదా, చేరుకోవాలని ఎగిరితే అయితుందా? అక్కడికి చేరుకోవడానికి అన్ని హంగులూ అమర్చుకోవడానికి ప్రయత్నించి సాధించాలంతే. అంతే గానీ, కలలుగని తీరలేదని కుంగిపోరాదు. లేదా మన స్థాయికి తగినదాన్నిమాత్రమే కోరుకోగలగాలని తెలియజెప్పేది చరణంలోని ఈ పంక్తి. ‘ఉన్నది వదిలేవు లేనిది కోరేవు ఒక పొరబాటుకు యుగములు పొగిలేవు…’

**************************

ఐదవదిగా ఏతల్లి నినుగన్నదో ఆ తల్లినే గన్న భూమి గొప్పదిరా (బొబ్బిలిపులి) పాట వినితీరవలసినది.  జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనేది రామాయణంలోని మాట అయినా ఈమధ్య ప్రాచుర్యంలోకి తెచ్చినది రామారావు పాట . సైనికులు దేశం కోసం చేసే త్యాగం ఎంత గొప్పదో చిన్న మాటల్లో చెప్పినారు. నీ తల్లి మోసేది నవమాసాలైతే ఈ తల్లి (కన్న భూమి, ఉన్నభూమి) మోయాలి కడవరకూ, కట్టె (ఈ శరీరం) కాలేవరకూ. మనం విడిచిదంతా అసహ్యం లేకుండా తనలోకి తీసుకుంటుంది.చివరకు మననే తనలో కలిపేసుకుంటుంది. ఆ ఋణం తీర్చుకోవాలంటే ఆ భూమిమీద ఉన్న మనుషులు
ప్రశాంతంగా ఉండేటట్లు చూడాలంటే సైనికధర్మం కన్నా గొప్పది లేదు. గుండె రాయి చేసుకొని, కుటుంబాలను విడిచి, రాళ్ళు, రప్పలు, కొండల్లో ఆకలిదప్పుల్ని నియంత్రించుకుంటూ దురాక్రమణదారుల్ని ప్రాణాలు పణం పెట్టి ఆపాల. కాబట్టి స్వంతభూమి గుండెలపై ఫిరంగులు పేలకుండా చూడడానికి సైనికులు వారి గుండెలపై తూటాల వర్షానికీ లెక్కచేయక సరిహద్దుల ప్రశాంతతను కాపాడతారు. అయినవారందరికీ దూరంగా చలికొండల్లో, దూరతీరాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ మనకు ప్రశాంతతను ప్రసాదిస్తారు.
అటువంటి సైనిక జీవితం, మరణం ఎంత గొప్పవనేది నిరూపిస్తుంది ఈ పాట.

*****************************


ఆరవదిగా గోరంతదీపంలోని ఈ పాట చూడండి.   ఆత్మహత్యలకు ఇప్పుడు కారణమంటూ ఒకటి కాదు అనేకం ఉంటున్నాయి. పదవతరగతి తప్పినదగ్గర్నించీ, రాష్ట్రస్వావలంబన వరకూ ప్రతీదానికీ ఆత్మహత్య తేలిక పరిష్కారమనుకుంటున్న ఈ సమాజంలో ఎప్పుడూ పాజిటివ్ దృక్పథాన్ని కలిగిఉండాలనే పాట. గోరంత దీపం కొండంతవెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు … గోరంత దీపం కొండంత చీకటిలో దారిచూపినట్టే చిగురంత చిన్ని ఆశ మనిషి మనసులో దీపమై వెలిగితే అది భవితను తీర్చిదిద్దుతుంది. మనమూ ఈ సమాజానికి ఏదో ఒకవిధంగా ఉపయోగపడాలనే దృష్టి, మనోభావన ఉండాలిగానీ ఒక చిన్న సమస్య ఎదురైతే ఈ శరీరాన్ని అంతం చేసేయాలనో, చేస్తానంటూ ఎవరినో బెదరించాలనో ఆవేశపడకూడదు. ఇంకేమీ జరగదన్న నిరాశ ఎందుకు? చనిపోయి సాధించినా శరీరమే లేనపుడు ఆ సాధన ప్రయోజనం ఏమి మిగుల్తుంది? తనవారికోసం త్యాగం చేసినా , ఆ వెలుగు వారికళ్ళలో చూడగలిగినపుడు కదా ఆ త్యాగానికి విలువ! అనుక్షణం మారే ప్రకృతిలో భాగం మనిషి. మనిషి, మనసూ, పరిస్థితీ అన్నీ మారవచ్చు రేపన్న రోజు అనే
ఆశాభావాన్ని తన ఊపిరిగా మనిషి మసలగలగడమే గొప్ప. మార్పుకోసం ప్రయత్నించాలేగానీ, మార్పురాదని క్రుంగిపోవడం జీవితాన్ని, మరణాన్ని శాసించాలనుకోవడం మూర్ఖత్వం. తొందరపాటు నిర్ణయాలవల్ల మనచుట్టూ ఉన్నవారిని కష్టాల సుడిగుండంలోకి తోసేయడమే అయితుంది. ఒకరికొకరు బాసటగానిలబడి ఆశాదీపపు వెలుగుల్లో ఉదయకాంతి వైపు పయనించడమే జీవితం.
మతితప్పిన కాకులరొదలో మౌనమే వెలుగు , జగమంతా దగా చేసినా చిగురంత ఆశను వెలిగించమనే ప్రతి వాక్యంలోనూ ఆలోచించిన కొద్దీ ఆశాభావం పొంగిపొరలుతున్న పాట నాటికీ నేటికీ కూడా ఆణిముత్యమే.

******************************

జీవితానుభవాన్ని కాచివడబోసి లలితమైన పదాల్లో అనంతమైన సారాన్ని నింపి సినీకవులు కొందరు ఆణిముత్యాలవంటి పాటలెన్నో వ్రాసినారు. ఇక్కడ కొన్నిటిని మాత్రమే పరిచయం చేయడం జరిగిందికానీ మనకిటువంటి పాటలకేమీ తక్కువలేదు.
హిందీపాటల్లో ఉన్న అర్థవంతమైన సాహిత్యం తెలుగులో లేదని ఒక వక్త అనడం విన్నాక చాలా బాధ కలిగింది. గమనించాలేగానీ మన పాటల్లో ఉన్న సాహిత్యవిలువలూ తక్కువేమీ కాదు. కాకపోతే సముద్రంలో ఉప్పునీటిబిందువులున్నంతగా ముత్యాలుండకపోవచ్చు.ఇదే మాట ప్రతీ భాష యొక్క సినీ సాహిత్యానికీ వర్తించేదే. కాదంటారా?

7 thoughts on “తెలుగు పాటల్లో మంచి సాహిత్యం లేదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *