March 29, 2024

నాన్నా!… నన్ను మన్నించు (తండ్రి – కూతురు)

రచన: ముచ్చర్ల రజనీ శకుంతల mucherla rajani shakuntala

”మమ్మీ…! ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ నుండి ఫోన్‌..” బాబు వచ్చి చెప్పడంతోనే వంటింట్లో ఉన్న నేను ఉలిక్కిపడ్డాను. ‘బాబోయ్‌…! మళ్లీ నాన్నగార్కి ఏం కాలేదు కదా..’ నా మనస్సు ఝల్లుమంది భయంతో. పది రోజుల క్రితమే నాన్నగార్కి మైల్డ్‌గా చెస్ట్‌ పెయిన్‌ వస్తే యశోదా హాస్పిటల్‌లో చూపించాము. హార్ట్‌లో మూడు బ్లాక్స్‌ ఉన్నాయని, హార్ట్‌ సర్జరీగానీ, స్టంట్స్‌గానీ వెయ్యాలని చెప్పారు. అన్నయ్యలిద్దరూ ఎలా తప్పించుకోవాలా అని చూశారు. నాన్నగారి మీద ఉన్న ప్రేమ వల్ల హాస్పిటల్‌ చుట్టూ తిరగడం, డాక్టర్‌తో మాట్లాడ్డం నాకు తప్పలేదు. పెద్దన్నయ్య ”ఆఫీస్‌లో లీవ్‌ దొరకదు… నువ్వు చూపించు… ఏమన్నారో చెప్పు… చూద్దాం…!” అన్నాడు.
రెండో అన్నయ్య ”వదిన కూడా జాబ్‌ చేస్తోంది. ఇంట్లో ఎవరూ లేకుండా నాన్నని ఇంట్లో పెడితే ఎవరు చూసుకుంటారు?” అనేవాడు డైరెక్ట్‌గానే.
ఇక మా శ్రీవారి సంగతి చెప్పక్కర్లేదు. మామా-అల్లుళ్లకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నేను ఎటూ చెప్పలేక సతమతమవుతాను…
సెంట్రల్‌ గవర్నమెంట్‌లో మంచి గ్రేడ్‌ వన్‌ ఆఫీసర్‌గా చేసి, రిటైర్‌ అయిన నాన్నగార్కి పరిస్థితి అంతా అర్థమయింది. తనవల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనుకునే మనస్తత్వం. అందుకే అమ్మ పోయిన ఆరునెలలకే వైజాగ్‌లో ఉండలేక, ఉన్న ఇల్లు అమ్మేసి, పిల్లలందరూ హైద్రాబాద్‌లో ఉన్నారని, ఇక్కడకు వస్తే… ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పి ఆయన్ని ఓల్డ్‌ఏజ్‌ హోమ్‌లో చేర్పించారు. పోనీ, నేనంటే అమ్మాయిని. కానీ కన్నకొడుకులు పట్టించుకోకపోతే ఎలా…? కానీ ఇద్దరన్నయ్యలతో ఎంత వాదించినా, నాకు ప్రయోజనం లేకపోయింది. పెళ్లాల చాటు మొగుళ్లు… అర్థమయింది. యు…యస్‌…లో ఉన్న అక్కకి ఫోన్‌ చేస్తే… ”ఎంత ఖర్చవుతుందో చెప్పవే… అందరం షేర్‌ చేసుకుందాం…” అంది.
నాకు ఏడుపు వచ్చింది. నా అసహాయతకి నాకే ఒళ్లు మండింది. అందరిమీదా కోపం వచ్చింది.
చిన్నతనం నుండి పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ఆయనకి గుండెనొప్పి వస్తే… ఆదుకునేవారే లేకుండా అయ్యారు.
ఛ… ఎందుకీ బ్రతుకు…?
ఖిఖిఖి
గబగబా ఫోన్‌ ఎత్తి ”హలో” అన్నాను వణికే కంఠంతో. ఏం వినవలసి వస్తుందోనని భయం.
అవతల నుండి హోమ్‌ వార్డెన్‌… ”మీ నాన్నగారు మందులు వేసుకోనని మారాం చేస్తున్నారమ్మా… కాస్త మీరు చెప్పండి” అంటూ ఫోన్‌ ఇచ్చింది.
‘హమ్మయ్య’ అనుకున్నాను ముందుగా నాన్నగార్కి ఏమీ కానందుకు.
”నాన్నగారండీ…” ప్రేమగా పిలిచాను.
”అమ్మాయ్‌…! నేను ఈ మాత్రలు వేసుకోను. రోజూ పది రకాల మాత్రలు ఇచ్చి చంపుతున్నారు. నోరంతా చేదుగా అయిపోయింది. ఏమీ తినబుద్ధి కాదు. కాస్త నువ్వయినా చెప్పవా… ఈ మందులు ఇవ్వొద్దని…” అవతల నుండి నాన్నగారు రొప్పుతూ.
”నాన్నా…! ప్లీజ్‌ వేసుకోండి. డాక్టర్‌గారు చెప్పలే… తప్పనిసరిగా వాడాలని… ప్లీజ్‌… వేసుకోండి నాన్నా… మా నాన్నవి కదూ…!” బ్రతిమిలాడాను.
”నిజం చెప్పు… నిజంగా మీ నాన్ననయితే ఇలా వదిలేస్తారా మీరందరూ… నేనెవరికోసం బ్రతకాలి చెప్పు…”
”నా…న్నా…” నాకు ఏడుపు ఆగలేదు.
”అవును. మందులు వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాలి… ఎవరికోసం చెప్పు… ఈ బ్రతుకు నాకు బ్రతకాలని లేదమ్మా… త్వరగా మీ అమ్మ దగ్గరకి వెళ్లిపోవాలని ఉంది…” ఆయన గొంతులో జీర…”
నేను బరువెక్కిన గుండెతో నా నోట మాట రాలేదు.
”ఏమిటి…? ఏడుస్తున్నావా?” అవతలనుండి నాన్నగారు.
ఎనభై రెండేళ్ల అనుభవం ఆయన ప్రతిమాటలోనూ తెలుస్తుంది.
”లే…దు…”
”రేపు వస్తావా?” ఆశగా అడిగారు.
”రేపా? పి…ల్ల…ల…కి… స్కూ…లు… ఉంది నాన్నా!”
”నాకు తెలుసు… మీరెవ్వరూ నాకోసం రారు… నేను ఒంటరిగా ఇక్కడ పడి చావాలి…” చిన్నపిల్లలు అలిగినట్లు అంత పెద్దాయన అలా అంటూంటే నామీద నాకే అసహ్యం వేసింది.
”వస్తాన్లే నాన్నా..” అనేశాను ఆపుకోలేక. ఈయనకి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు తర్వాత అనుకున్నాను.
ఆయనలో చెప్పలేని సంతోషం… చిన్నపిల్లాడిలా… ”మరి వచ్చేప్పుడు కాస్త నిమ్మకాయ పచ్చడి తేమ్మా…!” ఈ మందులతో నోరంతా చప్పబడిపోయింది…”
”అలాగే నాన్నా… తెస్తాను.”
”సరే రా! మందు వేసుకుంటాన్లే…”
”సరే… మరి ఉండనా…?”
”ఊఁ…!”
రేపు ఈయనకి ఎలాంటి అబద్ధం చెప్పి వెళ్లాలా అని ఆలోచనలో పడ్డాను.
ఖిఖిఖి
రోజులు అలా గడుస్తున్నాయి.
నాన్నగారి అనారోగ్యం తప్ప నాకే లోటు లేదు నిజానికి.
మా అందరి అభిప్రాయాలు నాన్నగారికి తెలిసిపోయాయి. అందుకే సర్జరీ అంటే అసలు ఒప్పుకోలేదు. పోనీ, స్టంట్స్‌ వేయించుకోమన్నా వద్దన్నారు. అలా అనడానికి కారణం కడుపున పుట్టిన మేము  నలుగురమే అని నాకు తెలుసు.
‘బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి…? ఆ దేవుడు తీసుకువెళ్లినపుడు ప్రశాంతంగా వెళ్లిపోతాను. ఏ సర్జరీలు వద్దు నాకు. నా వల్ల మీ అందరికీ ఇబ్బందులూ వద్దు…” అన్నారు.
”కానీ నాన్నగారు, స్టంట్స్‌ వేస్తే మరో ఐదు సంవత్సరాలయినా గ్యారంటీ అంటున్నారు డాక్టర్లు…”
”వద్దమ్మా! నాకిష్టం లేదు. అవన్నీ చేయించుకుంటే, డాక్టర్లు రెస్ట్‌ అంటారు… అన్నీ నేను భరించలేను. ఎలా అయ్యేదుంటే అలా కానివ్వు…” అన్నారు. కానీ ఆయనకి తెలుసని నాకు తెలుసు.
వచ్చాక అన్నయ్యవాళ్లతో అదే విషయం చెప్తే… ”సర్జరీకి, మందులకి ఎంత లేదన్నా… ఐదు లక్షలు అవుతుంది. హాస్పటల్‌లో ఉంటే ఎవరు తిరగాలి? మందులు టైమ్‌కి ఎవరిస్తారు? డిశ్చార్జ్‌ అయ్యాక ఎవరింట్లో ఉంచుకోవాలి? మీ ఆయనా… ఒప్పుకోడు. మా ఆవిడా ఒప్పుకోదు… ఇక చిన్నాడి పరిస్థితి నీకు తెలుసు. వాళ్లావిడా జాబ్‌ చేస్తోంది. అసలు కుదరదు. అక్క యు.ఎస్‌ నుండి రాలేదు.
అయినా మొత్తం డబ్బులు ఎవరు పెట్టాలి? అందరం షేర్‌ చేసుకున్నా… ఆయన్ని ఎక్కడ ఉంచాలీ అనేది సమస్య… ఇవన్నీ అవసరమా…? ఉండనీ ఇలా… ఎన్నాళ్లో అలా… అప్పుడప్పుడు వెళ్లి చూసొద్దాం…”
‘వీడు కన్నకొడుకేనా?’ రెండు చెంపలూ వాయించాలని ఉన్నా, నోరు మూసుకొని ఇంటికి వచ్చాను.
ఆ రాత్రినుండి నాకు కంటిమీద కునుకు ఉండేది కాదు… నాన్నగారే గుర్తొచ్చేవారు.
అలా అని తెచ్చి ఇంట్లో ఉంచుకోవడం నాకు కుదరదు. అటు అత్తగారు, ఇటు ఈయన.
ఖిఖిఖి
మా ఇంటికి దగ్గరలో ఉన్న హోమ్‌కి షిఫ్ట్‌ చేశాను. కనీసం రెండు రోజులకొకసారయినా వెళ్లిరావొచ్చనే ఉద్దేశంతో…
”ఏం! నీకే పట్టిందా?” అంటూ ఇంట్లో దెప్పుళ్లు, నరకం అనుభవించాను.
అటు కన్నతండ్రి…
ఇటు కట్టుకున్న భర్త…
ఖిఖిఖి
రాను రాను నాన్నగారి పరిస్థితి మరీ హీనంగా తయారయ్యింది. అల్జిమర్స్‌  వచ్చేసింది. నన్నే గుర్తుపట్టలేని స్థితికి వచ్చారు. బెడ్‌సోర్స్‌ దానికి తోడు…
తినే ఆ ఒక్క స్పూన్‌ పెరుగన్నం కూడా నేను వెళ్లి తినిపిస్తేనే తినేవారు.
చంటిపిల్లాడిలా అయిపోయారు.
ఆయన అవస్థ చూసి, నాకే అనిపించింది… ”భగవాన్‌! ఇంకా ఆయన్ని ఇలా బాధపెట్టకు. త్వరగా నీ దగ్గరకి తీసుకువెళ్లు…” అంటూ ప్రార్థించాను. నాకెంత బాధ కలిగితే అలా అనుకుని ఉంటానో నాకే తెలుసు.
ఖిఖిఖి
నా మొర ఆలకించాడో… ఆయన ఆయుష్షు తీరిందో గానీ…
బెడ్‌సోర్స్‌తో మూడు నెలలు అవస్థలు పడి నాన్నగారు చనిపోయారు.
నాకు మాత్రం ఒకటే దిగులు… చివరి క్షణాల్లో నేను నాన్నగార్ని నా దగ్గర ఉంచుకోలేకపోయానే అని…
అన్నయ్యలిద్దరూ మొక్కుబడిగా దినాలు కానిచ్చారు. నాన్నగారు బ్రతికినన్నాళ్లూ ఎవర్నీ ఒక్క పైసా అడగలేదు. తన పెన్షన్‌ డబ్బులతోనే వెళ్లదీశారు.
అంతిమ యాత్రకు, దినాల ఖర్చులకు మాత్రం ఇద్దరూ కూర్చొని లెక్కలు వేశారు. ఆడపిల్లలైనా మీరూ పెట్టాలి… అంటూ నాకు, అక్కకు సజెషన్స్‌ ఇచ్చారు. మమతానుబంధాల కంటే మనీకే వాల్యూ ఎక్కువ ఈ కాలంలో అని మరోసారి నాకు అర్థం అయ్యింది.
ఖిఖిఖి
అంతా పూర్తయ్యాక నాన్నగారున్న ఓల్డేజ్‌ హోమ్‌కి వెళ్లాను. ఆయన రూమ్‌ ఖాళీ చేయమని వార్డెన్‌ ఒకటే ఫోన్లు. నాన్నగారు వాడిన వాకింగ్‌ స్టిక్‌, స్వెట్టర్‌, చెప్పులు, మందులు, బట్టలు, మంచం, వీల్‌ఛెయిర్‌ అన్నీ చూస్తుంటే నాకు  దుఃఖం ఆగలేదు.
”రాజీగారూ! మీ నాన్నగారు మీకీ బ్యాగ్‌ ఇమ్మన్నారు…” అంటూ వార్డెన్‌ ఒక బ్యాగ్‌ తెచ్చి ఇచ్చింది.
ఏముందా అని తీసి చూశాను. అందులో నాన్నగారి డైరీ, మరో చిన్న బాక్స్‌లో నాలుగు బంగారు గాజులు.
డైరీలో నాన్నగారు చివరి రోజులలో రాసుకున్న పేజీలు…
వణుకుతున్న అక్షరాలు.
నా కళ్లు అక్షరాల వెంట పరుగిడుతుంటే, తెలియకుండానే కన్నీళ్లు ఆగలేదు.
నేను అనాధను… నాకెవ్వరూ లేరు… భార్య ఉందనుకున్నాను. నన్ను ఒంటరిని చేసి, ఒక్కడినే చేసి, వదిలేసి వెళ్లిపోయింది. పదిహేను సంవత్సరాల నుండి నేను ఒంటరిని. చిన్నతనం నుండి ప్రేమగా, అపురూపంగా పెంచుకున్న పిల్లలు పెళ్లి కాగానే ఎంతగా మారిపోయారు. కనీసం నా ఒక్కడికి అన్నం పెట్టలేని బ్రతుకులా అవి. కూతుళ్లని నేను తప్పు పట్టను. కూతుళ్ల ఇళ్లలో ఉండే ఆచారం లేదు మనకి.
నా అనుకున్నవాళ్లందరూ పరాయివాళ్లని తెలిసిన నేను ఇంకా దేనికోసం బ్రతికి ఉండాలి?
ఓ దేవుడా!
నన్ను తొందరగా నీ దగ్గరకి తీసుకువెళ్లు. ఈ హోమ్‌లో ఒక్కొక్కరిదీ ఒకో కథ. ఒంటరిగా నేనీ గదిలో ఉండలేకపోతున్నాను. కనీసం వేరొకరితో మాట్లాడాలన్నా ఎవరూ లేరు, ఎవరూ రారు. రెండు, మూడు నెలలకు ఒకసారి వచ్చి, ముళ్లమీద కూర్చున్నట్టు కూర్చునే నా ఇద్దరు కొడుకుల్ని చూసి నేను బాధపడలేదు, నా అదృష్టం ఇంతే అని సరిపెట్టుకున్నాను.
ఎప్పుడూ ఇస్త్రీ బట్టలతో టిప్‌టాప్‌గా తయారయ్యి ఆఫీస్‌కి వెళ్లేవాడిని. కానీ ఇప్పుడు నా బట్టలు ఉతకడానికి పనిమనిషి నిరాకరించినా, ఏమీ చెయ్యలేని పరిస్థితి.
చల్లారిపోయిన అన్నం, ఉడికీ ఉడకని కూరలు… నాకు రుచించడం లేదు.
నాకు చెస్ట్‌ పెయిన్‌ వచ్చి, హాస్పిటల్‌కి వెళ్తే, ఆపరేషన్‌కి లెక్కలువేసిన నా పిల్లల్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
రేపు నేను చనిపోయినా, ఖర్చులకి వెనకాడతారేమో! అందుకే ఈ గాజుల్ని నా అంతిమ సంస్కారానికి వాడుకోవలసిందిగా కోరుకుంటున్నాను.
చిన్నప్పుడు మా అమ్మానాన్నలు నా బారసాలను ఘనంగా చేశారుట. మరి ఈ నాన్న అంతిమసంస్కారాలు కూడా ఘనంగా జరగాలి. అదీ నా ఖర్చుతో… రాజీ! మీ అమ్మ ఎంతో ఇష్టంగా చేయించుకున్న గాజులవి. అవి అమ్మి మీ ఖర్చులు తీసుకోండి. పిల్లలందరూ కలసిమెలసి ఉండండి… డబ్బే జీవితం కాదు. నేను సరిగా పెంచలేదేమో!
మనిషికి ఒంటరితనానికి మించిన నరకం లేదు.
మీరంతా ఎప్పటికీ కలసి మెలసి ఆనందంగా జీవించాలని కోరుకుంటూ…
అనాధగా మిగిలిన మీ నాన్న
నా కళ్లు వర్షించసాగాయి. ఎంత తప్పు చేశాను! గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవలసిన మేము ఆయన గుండెల మీద తన్నాము. ఎంత నరకం అనుభవించారో… భగవాన్‌! ఈ లోకంలో తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోనివాళ్లకు పెద్దశిక్షలు విధించు…! అప్పుడు గానీ మాలాంటివాళ్లకు బుద్ధి రాదు… అనుకుంటూ… వెనుతిరిగాను. ”నాన్నా…! నన్ను మన్నించు!”
(నాన్నగారికి ప్రేమతో అంకితం…)

కథా విశ్లేషణ
అనాధ అయిన కన్నతండ్రి ప్రేమరాహిత్యంతో ఆఖరి రోజులు నిస్సారంగా, నిస్సహాయంగా వెళ్లదీసే ఆ తండ్రికి నలుగురు పిల్లలున్నారు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఊర్లో ఉండి, వృద్ధాశ్రమంలో ఒంటరితనంతో బాధపడుతూ మారాం చేసే తండ్రిని కూతురు రాజీ సముదాయిస్తూ ఉంటుంది.
చివరికి గుండెకి ఆపరేషన్‌ చెయ్యాలంటే కొడుకులు వెనుకాడి…ఎన్నాళ్లు ఉండాలో అన్నాళ్లుంటాడులే అనుకుంటారు. స్వార్థపరులైన కొడుకులు పదినిముషాలు తండ్రితో మాట్లాడ్డం టైమ్‌ వేస్ట్‌ అనుకుంటారు. కూతురు భర్త నెదిరించలేక, కన్నతండ్రి బాధని చూడలేక తల్లడిల్లిపోతుంది. తన అంత్యక్రియలకి కూడా భార్య గాజులు అమ్మి చెయ్యమని చెప్తాడు ఆ పెద్దాయన తన ఆఖరి ఉత్తరంలో.
ముచ్చెర్ల రజనీ శకుంతల ఎన్నో నవలలు, మరెన్నో కథలు రాసిన సీనియర్‌ రచయిత్రి. తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. చదివించే శక్తి వీరి స్వంతం.
నిరాదరణకి గురైన వృద్ధుని వేదన, కూతురి ఆవేదన పాఠకుల హృదయాల్లోకి చొచ్చుకొని పోయేట్లు వర్ణించారు. మనసంత కలచివేయక తప్పదు.

6 thoughts on “నాన్నా!… నన్ను మన్నించు (తండ్రి – కూతురు)

Leave a Reply to Jayasri Tipirneni Cancel reply

Your email address will not be published. Required fields are marked *