March 29, 2024

పెనుగొండ గత కీర్తి–కవి హృదయార్తి

రచన: లక్ష్మీదేవి

puttaparthinarayanacharyulu-682x1024

                       సరస్వతీ పుత్రులు, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఛందస్సు మీద పట్టు రాని  పన్నెండేళ్ల లేత ప్రాయములోనే వ్రాసిన పెనుగొండ లక్ష్మి అను గేయకావ్యములోని ప్రతి పద్యమూ రత్నము వంటిదే. ఘనగిరియై రాయల వంశావళి కీర్తికాంతుల ఛటలను పట్టి నిల్పినదైన పెనుగొండ నేటి స్థితిని చూచి మనసు ద్రవించి వ్రాసిన ఈ చిన్ని కావ్యములో రసావిష్కరణ, పదలాలిత్యము, ప్రౌఢ రచనాశైలీ సౌరభం ఎంత నాణ్యమైనదో చదువరులు తెలిసికొని యానందింపవచ్చును.

పదమూడు వందల ముప్పదియారు-యేబది ప్రాంతాలలో హరిహరరాయలు విద్యానగరాన్ని ఏలుతుండగా బుక్కరాయలు పెనుగొండ రాజప్రతినిధిగా అనంతసాగరుడు పెనుగొండ కోటను కట్టినారు.

తరువాతి కాలములో నిది కృష్ణదేవరాయ సార్వభౌములకు వేసవి విడిదిగా నుండినది. తళ్ళికోట యుద్ధానంతరము తిరుమలరాయలు రాజుగా ఈ దుర్గాన్ని పాలించినారు.

గత శతాబ్దపు రెండవదశకములో పుట్టపర్తివారు వ్రాసిన ఈ  కావ్యఖండిక పద్యాలలో గతచరిత్ర వైభవకీర్తులు దుష్కరుల కరములందు శిధిలమైనవనే యార్తి అడుగడుగనా కనిపిస్తుంది. ఆనాటి వీరత్వపు వైభవాన్ని మళ్ళీ చైతన్యం నిండిన జీవశక్తిగా జాతిని నిలబెట్టాలనే తీవ్ర ఆకాంక్షతో ప్రతి పదమూ ఉరకలెత్తింది.

1 lak

            చ. మెలికలు దీరి, చెక్కుల సమీపమున న్నటియించు ముంగురుల్

గులకలలాడు, పెన్నొసటఁ గట్టిన పాపటబొట్టు, గన్నుబొ

మ్మలకును, మధ్యదీర్చిన సమంబగు గుంకుమరేఖ దొడ్డసొ

మ్ములివియె చాలు, నాసుకవి ముద్దులు గట్టెడు భావసృష్టికిన్.

(తా. ఒంపులు తిరిగి చెక్కిళ్ళపై ఆడుచున్న ముంగురులు, నుదుటన పాపిడి బొట్టు, కనుబొమ్మల మధ్య కుంకుమరేఖ పెద్ద నగలుగా శిల్పమునందముగా చెక్కిన శిల్పి కవియే. ఆతని ప్రతిభకివియే తార్కాణములు.)

 

            మ. మున్నూఱేండ్లు వయస్సు వచ్చి పడినన్పోకుండు లే సోయగం

బన్నా! యెంతటి వింత, యీ ప్రతిభయన్నా! తమ్మిపూచూలికిన్

కన్నుల్నాసిక దిద్దితీర్చినటులై, గన్పట్టు, సృష్టిక్రమో

త్పన్నఁబౌ కొఱతెందుగానఁబడదబ్బా! భావనాసృష్టిలో.

(తా.మూడువందల యేళ్ళు గడచినా ఈ శిల్పాల లేలేత సోయగాలు వాడలేదు. ఆహా! ఎంత వింత గదా ! ఈ నారాయణమూర్తి ప్రతిమకు కన్నులు, ముక్కు తీర్చిదిద్ది చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ భావనా సృష్టిలో లోటే కనిపింపలేదు.)

ఇటువంటి పద్యాలలో అచటి శిల్పకళా సంపదను, శిల్పుల గొప్పదనాన్ని “సింగారం’ గా వర్ణించుట చూడవచ్చు.

              మ. నీకన్గోనలనొక్క బాష్పకణమున్వీక్షించినన్గాని, త

ల్లీ! కాయంబున వేయిగత్తులొకసారే గ్రుచ్చినట్లై, మహా

శోకంబుల్కలుచిందు, జీవము చలించున్, పెంపుగోల్పడ్డ యీ

లోకంబింక, నొనర్పజాలునెటునీలో దుఃఖవిచ్ఛేదముల్.

(తా.ఈ పెనుగొండ లక్ష్మి కోటను సంబోధిస్తూ అమ్మా!  నీ కన్నీటి చుక్క చూసినంతనే వేయి కత్తులు గుచ్చినట్లు దుఃఖము గల్గి జీవుడు చలించిపోతున్నాడే , నీ శోకాన్ని నశింపజేయుటెట్లు?)

కరుణరసాన్ని చిందు ఈ పద్యం చదువరుల చలింపజేయకుండునా? ఇటువంటివెన్నో ఇచ్చట చదువుతున్నపుడు కనుకొలకుల్లో నీరు చేరినట్లైతే, వ్రాయు వారి చిత్తమవ్వేళనెంత రోదించెనో గదా యని తోచకమానదు.

అయితే వీరపుత్రులను గన్నఈ గడ్డ వైభవాన్ని అంతే ప్రభావితం చేస్తూ రచించిన ఈ పద్యరత్నముల సంగతీ చూద్దాము.

2 lak

           మ. దళముల్దాల్చిన విచ్చుకత్తులు వినిద్రచ్ఛాయలీ మేటి కో

టల, రాపాడెడునాఁడు, మా తెలుఁగుజెండా పైని, వారాహ శు

భ్రలసత్కాంతులు, చిమ్మిరేఁగి, దెసలెల్లన్ లాస్యముల్ ద్రొక్కు, వే

ళల, వీక్షించిన మాదుతాతల, యనల్పప్రాభవంబెంచెదన్.

(తా.ఆనాడు రాయల సైనికదళాల విచ్చుకత్తుల కాంతులు కోటగోడల అన్నివైపులా ప్రసరిస్తుండగా చూడగల్గిన మా తాతల వైభవమే వైభవముగదా!)

                                గీ. కసిమసంగిన లేతసింగంబుదనదు

సటలు రిక్కించి, వన ప్రదేశములనెల్ల

గాంచు విధముననున్న నీ కట్టడంబు

శత్రువులకు మృత్యువన్న నాశ్చర్యమేమి.

(తా.సింహంపిల్ల జూలు రిక్కించి చుట్టుప్రక్కల పరికించుచున్నట్టు గంభీరంగా కూర్చున్న ఈ కట్టడము ఒకప్పుడు శత్రువుల పాలిటి మృత్యువుగా ఉండడంలో సందేహమేముంది?)

                               గీ. కొండచిలువవిధాన కన్గూరుచున్న యిది,

యొకానొకనాడు గ్రుడ్లెఱ్ఱసేసి

పొంగి చెరలాడు వేడినిప్పుకలు, చేట

లను జెఱగివైచి, పైని జిమ్మినదిసుమ్ము.

(తా.పెద్దజంతువును మ్రింగి కూర్చున్న కొండచిలువ సాధువుగా కన్పించినట్టుగా ఇప్పుడిట్లగుపించు కోట ఒకప్పుడు  వైరులపై నిప్పులు చెఱిగినదే సుమా.)

 

ఈ పద్యాలలో యలనాడు యెగజిమ్మిన రౌద్రరసము కనులార గాంచని పాఠకుండబోడనియే విశ్వసింతును.

           మ. తలలన్ వ్రాలిచి దీర్ఘకాలముగ నిద్రల్వోవు నీ కోట గో

డలలో దాఁగిలిమూతలాడుకొనుచుండన్, ఘోరఘూకాలు, గ

బ్బిలము ల్రచ్చలఁ గొల్వుదీర్చఁగను, దేవీ! యూరకిట్లుంటయున్

గలదే! యాంధ్రులరక్తనాళములఁ జిల్కన్ రాదె తేజంబులన్.

(తా. తలలు వాల్చి నిదురిస్తున్నట్టున్న భవ్యమైన ఈ కోటగోడలలో  గుడ్లగూబలు దాగుడుమూతలాడుతుండగా గబ్బిలాలు రచ్చల గొల్వుండగా, మా ఆంధ్రుల రక్తములో తేజము జిల్కగా రారాదా! ఇట్లూరకుంటిమే!) అంటూ భయానకమైన నేటి యా కోటగోడల స్థితిని వర్ణించుట చదివి యొడలెల్ల జలదరించును.

                చ. అరిపయిఁ గత్తి దూసినమహమ్మదురాజుల చీకుకత్తి వా

దరలకుఁ గన్నుఁబ్రామి, యెడఁదక్కినవీయవి, వల్లకాటిలోఁ

బెరిగిన మల్లెపూవులు దపించి కృశించినవెన్నియో మహా

పరమ కళాప్రబంధములు, వారి కఠోర కటాక్షధాటికిన్.

(తా.వల్లకాటిలో మల్లెపూవులు నాశనమైనట్టుగా మహా గరిమ గల మన కళలు, ప్రబంధములు  మహమ్మదుల కత్తి పదునులకు కృశించి నశించెనో గదా.)

మన సంస్కృతీపరిమళాలను వెదజల్లే కళలు, ప్రబంధములెన్నో యే విధముగా నాశమైనవో భీభత్సంగా

వర్ణించిన పద్యాలు చూడవలసినవే. అక్కడి అద్భుతమైన శిల్పకళా సృష్టిని, చెక్కిన శిల్పులను వారు కొనియాడిన విధము అప్పటికప్పుడే మనలను పెనుగొండకు దీసుకొనిపోయి ఆ సౌందర్య నిధులైన శిల్పప్రభల కన్నులకెదురుగా నిల్పినట్లుండును కదా!

                 సీ. ఎట్లు పైకెత్తిరో యేన్గుగున్నలకైన

తలదిమ్ము గొలుపు నీ శిలలబరువు

యేరీతి మలిఁచిరో యీ స్తంభములయందు

ప్రోవు గ్రమ్మిన మల్లెపూల చాలు

యే లేపనంబున నీ కుడ్యములకెల్ల

దనరించినారొ యద్దాలతళుకు

యే యంత్రమున వెలయించిరో వీనికిఁ

జెడకయుండెడు చిరంజీవశక్తి

గీ. కనివిని యెఱుంగనట్టి దుర్ఘటములైన

పనులు, స్వాభావికముగ నుండినవి వారి

కా మహాశక్తి యేరీతి యబ్బెనొక్కొ

కాలమో! జీవనమొ! యేదొ! కారణంబు.

(తా.ఇంతింత పెద్ద శిలలను ఎచటినుండి ఎటుల దెచ్చిరో మరి ఇవి యేనుగు గున్నలు గూడ మోయలేనంత బరువున్నాయే, ఈ స్తంభములలో మల్లెపూల దండవరుసలు ఎట్లు చెక్కినారో, ఇంతగా మెఱుగుపెట్టినట్టు అద్దాలవలె మెరిసే ఈ గోడలకే లేపనాలలదినారో, యే యంత్రాలతో వీటికి ఇన్నియేళ్ళ ఆయువు పోసినారో లోకమే కనివిని యెఱుగనిఈ శక్తి నాటి శిల్పులకు, పనివాండ్రకేరీతి యబ్బినదో)!

           మ. కవులన్, బంగరు పల్లకీలనిడి, యుత్కంఠాప్తితోఁ బండిత

స్తవముల్ మ్రోయఁగ, రత్నకంకణఝణత్కారంబుగా, నాత్మహ

స్తవిలాసమ్మున, మ్రోసితెచ్చెనటనౌరా! సార్వభౌముండు, నే

డవలోకింపుము, నీరవంబులయి, శూన్యంబైన వీమార్గముల్.

(తా.కవులను పల్లకీ మీదెక్కించి సార్వభౌముడే మ్రోసెనట యాహా! నాటి వైభవములేమాయెనో నేటికీ నిస్తబ్ధత యావరించినది. అన్ని ప్రయత్నాలనూ చేసి చివరకు వైరి చేతులలో విఫలమైన ఈ పాత కోటగోడలు మంచిరోజులెపుడు వచ్చునో యని యెదురుచూస్తున్నాయి.)

3 lak

అన్ని వెల్గులు వెల్గి , యన్ని విధ్వంసములు గాంచి నీరవమున నిల్చిన నేటి యా కోటగోడల శిథిలాలను గాంచి శాంతముగనున్న స్థితి చూసి తోచిన భావములివ్వేమో !

                     గీ. యత్నశతములు విఫలంబులైనఁ దుదకు

వెడఁగుఁ దనమూని నిల్చు జీవియును బోలె

ముందు రాఁ బోవు గతికిఁ జూపులు నిగుడ్చి

కాచుకొని యున్నదీ ప్రాఁతకట్టడంబు.

 

నవరసాలూరు నీ కావ్యమును పుట్టపర్తివారు ధారాశుద్ధితో, సొబగులు చిందు పదసంపదతో యలరారు చంపకాలు, మత్తేభాలు, శార్దూలాలు, సీసగీతముల సెలయేళ్ళు విలసిల్లు చిట్టడవి వలె తీరిచి దిద్దినారు.

       మ. అమితౌద్ధత్యముతోడఁ గూలకషణంబై పారు కాలప్రవా

హము, ప్రావృడ్ఘన మేఘజాలము తిరంబా! యింక రావా! శర

త్సమయంబుల్, మృదురీతి బల్కు గవిహంసల్ బుట్టరా! లోకమాం

ద్యము నిద్రింపద! పిచ్చితల్లి! యిటులేలా, సంకుచద్భావముల్!

(తా. ఓ నా పిచ్చితల్లీ, ఇంత దిగులుగా నుంటివే? వలదమ్మా దిగులు. కాలప్రవాహపు ఉద్ధృతిలో ఏదీ స్థిరమూ.  శాశ్వతమూ కాదు. శరత్తులు, మధువుల పదములల్లు కవులు మళ్ళీ రారనుకున్నావా, ఈ మబ్బులు వీడి వెన్నెలలు కురిసే సమయము వస్తుందమ్మా)

అని ఆశాభావమూ మనకు కలుగజేస్తున్న ఈ కావ్యము సర్వజన పఠనీయము.

3 thoughts on “పెనుగొండ గత కీర్తి–కవి హృదయార్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *