March 29, 2024

ప్రమదాక్షరి కథామాలిక – తండ్రి – తనయ

సమీక్ష: మంథా భానుమతి

 vasu

వివిధ సాహిత్య ప్రయోగాలకు ఆలవాలమైన ‘మాలిక’  అంతర్జాల పత్రిక, వినూత్నమైన విధానంలో, కొందరు రచయిత్రులను ఒకే కథావస్తువు పై కథానికలు రచియింపమని కోరింది. ఇరవై నాలుగురు రచయిత్రులు   స్పందించి తనయలుగా తాము అనుభూతించిన సంఘటనలను కథల రూపంలోకి తీసుకొచ్చి, తమ ప్రతిభను చూపించారు.

తండ్రీ కూతుళ్ల అనుబంధం తరతరాలుగా అపురూపమయిందే! కానీ అనాదిగా ఆడవాళ్లని అబలలుగా, ఆటబొమ్మలుగా భావించే సమాజంలో ఒక్కో తండ్రే, కంచే చేనుమేసిన చందాన ఆమె జీవితాన్ని ఏదో విధంగా బాధిస్తుంటే.. మరొక తండ్రి సున్నితమైన ప్రేమని కనపరుస్తూ, తమ బంగారు తల్లుల్ని, అరచేతిలో పెట్టుకుని పెంచుతున్నాడు. అంతులేని ధైర్యాన్నిచ్చి కూతురు జీవితాన్ని కాపాడుతున్నాడు. కొందరు ఉదాత్తులు కణ్వమహర్షులే అవుతున్నారు. అందిన కథలను చూస్తుంటే, ఒకే అంశంపై ఇంతటి వైవిధ్యం సాధ్యమా అని ఆశ్చర్యం కలిగింది. ఏ కథలోని విషయం మరొక కథలో కనబడలేదు.

ప్రతీ ఒక్క రచయిత్రీ తమ రచనల్లోని పాత్రలతో లీనమై తమ తమ శైలిలో చక్కని కథలను అందించారు. పాఠకులు ఆదరించారు. ఆ ప్రేరణతో ఈ కథలన్నిటినీ పుస్తక రూపం లోనికి తీసుకు రావాలని, ఆసక్తిగల పాఠకులతో తమ రచనలను పంచుకోవాలనీ రచయిత్రులందరూ  నిర్ణయించుకున్నారు. ఒక బృహత్ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

ఆ నిర్ణయ ఫలితమే మీముందున్న ఈ కథామాలిక.. ప్రమదలందరూ కలిసి అల్లిన పూల మాల. ఈ అపురూపమైన కథలకి నన్ను విశ్లేషణ రాయమని మాలిక అంతర్జాల పత్రిక సంపాదకురాలు, జే.వి పబ్లికేషన్స్ అధినేత శ్రీమతి జ్యోతి వలభోజు కోరగానే, ఈ మహదవకాశాన్ని ఆనందంగా స్వీకరించాను.

ఈ మాలిక లోని రచయిత్రులను అందరినీ  అభినందిస్తూ కొన్ని కథలగురించి తెలుసుకుంటూ  ముందుకు సాగుదాం.. మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండదగిన, ప్రతీ తండ్రికి, కూతురికి బహుమతిగా ఇవ్వదగిన అపురూపమైన పుస్తకం “ప్రమదాక్షరి కథామాలిక … తండ్రి తనయ”

డా. మంథా  భానుమతి, రచయిత్రి, విశ్లేషకురాలు.

 

” మీచ్ తుమ్చీ లేక్”—వి. బాలా మూర్తి.

“దైవం మానుషరూపేణ..” అని పెద్దలు చెప్పిన మాట కొందరు ఉదాత్తులైన మనుషుల్లో మనం చూస్తూనే ఉంటాం.

తండ్రి ప్రేమాభిమానాల్లో, ఆప్యాయతలో పెరిగి పెద్దదైన శుభకి, అతనికి యాక్సిడెంట్ అయి, చావు బ్రతుకుల్లో ఉన్నాడని తెలిసినప్పుడు తల్లడిల్లి పోతుంది. చిన్నతనం నుంచీ తండ్రి వద్దే ఎక్కువ చేరిక శుభకి. ఆటలలో, చదువులో.. అన్నిటా బాబా సలహా లేనిదే ముందుకు నడిచేది కాదు. తనకిష్టమైన మెడిసిన్ చదవాలన్నా.. తండ్రే ప్రోత్సహించాడు, అమ్మ అంత ఖర్చు భరించలేమేమో అని తటపటాయించినా కూడా. తనని ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్న బాబాకి యాక్సిడెంటా? పరుగు పరుగున హాస్పిటల్ కి వెళ్లి స్నేహితుల సహాయంతో కావలసిన వన్నీ సమకూరుస్తుంది. అత్యవసరంగా రక్తం కావాలంటే కావలసిన ఏర్పాట్లు చెయ్యడానికి సిద్ధపడుతుంది.

అదే సమయంలో తనకి తెలిసిన ఒక నిజం మనసుని కృంగ దీస్తుంది. అయోమయంగా ఇంటికి జేరి అన్యమనస్కంగా ప్రవర్తిస్తున్న శుభని అమ్మ నిలదీస్తుంది, ఎందుకలా ఉన్నావని. తల్లిని నిజం చెప్పమని అడుగుతుంది.

 

“బంధాలు-బాధ్యతలు”— జి.యస్. లక్ష్మి.

 

కూతురంటే ఎంతో నమ్మకం, ప్రేమ ఆ తండ్రికి. కొడుకుల కంటే బాగా చదువుతుంది.. పట్టుదల, నాన్నంటే ఎంతో అభిమానం గౌరవం ఉన్న సరోజ అటువంటి పని చేసిందంటే నమ్మలేకపోయాడతను. క్రమశిక్షణే ప్రాణంగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శేషాద్రి, కన్న కూతురి ఆశలు నిర్దాక్షిణ్యంగా చిదిమేశాడు.

అర్ధరాత్రి, తను పని చేసుకునే గదిలోకి దొంగలా దూరి, తన కాగితాలు తీసి వెతికి, ఏం చేస్తోంది.. ముద్దుల కూతురు తన నమ్మకాన్ని వమ్ము చేస్తోంది.  ఉగ్రరూపం దాల్చిన నాన్నని చూసి కన్నీరు మున్నీరైన  కూతుర్ని చూసిన ఆ తండ్రి మనసు కొంచెం కూడా కరగలేదు. ఆవేశం తట్టుకోలేక కుప్పకూలిపోయిన నాన్నని కాపాడుకోడమే తన కర్తవ్యం అనుకుంది సరోజ. కనీసం సంజాయిషీ చెప్పుకోడానికి కూడా అవకాశం ఇవ్వకుండా శిక్షవేసిన తండ్రి మీద కొంచెం కూడా కోపం రాలేదా అమాయకురాలికి.

 

“కణ్వశాకుంతలం”- నండూరి సుందరీ నాగమణి

“వెన్నవంటి తల్లిదండ్రులు, రాళ్లలాంటి కన్నబిడ్డలు..” అనే నానుడి, సాధారణంగా కొడుకుల గురించి చెప్తుంటారు. తల్లిదండ్రులని అర్ధం చేసుకోకుండా, వృద్ధాప్యంలో చెంత చేరిన తల్లిదండ్రులను చీటికి మాటికి విసుక్కుంటూ న్యూనత పరుస్తూ, ఎప్పుడు తీసికెళ్లిపోతావు భగవంతుడా అని వారు నిత్యం ప్రార్ధించే స్థితికి తీసుకొచ్చిన పుత్రుల గురించి అన్న మాట అది. దానికి అనేక కారణాలుండచ్చు.. ఆర్ధికపరమైనవి, ఆలి సంబంధమైనవి, బంధుపరమైనవి.. ఈవిధంగా!

అయితే.. ప్రాణంగా ప్రేమించి, గారాబంగా పెద్ద చేసిన కన్నతండ్రిని, ప్రేమ మత్తులో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిన కూతుళ్ల మాటేమిటి? వాళ్లు కూడా రాళ్లే కదా! ప్రాణమున్న రాళ్లు కనుక, అదీ.. సాధారణంగా సున్నిత హృదయులై ఉంటారు కనుక ఎప్పటికైనా తమ తప్పు తెలుసుకుని తండ్రిని అర్ధం చేసుకుని తోడునీడగా ఉన్నప్పుడు ఆ రాళ్లు, వెన్నలవకపోయినా కనీసం దెబ్బతియ్యడం మానగలుగుతారు.

 

“ఎంత మంచివాడవు నాన్నా!”—ఆర్. దమయంతి.

‘పురుషు డదృష్టమహిమ గలిగినంతవరకును కళ గల్గియుండును. అగ్నితోఁగలిసియుండు నంతఁదనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనే నల్లనైపోవును.’ భాస్కరశతక కారుడన్నట్లు అగ్గిలేని బొగ్గు నల్లగా కళా హీనమై ఉంటుంది. భార్యావిహీనుడైన పురుషుడుకూడా కళతప్పి వెలాతెలా పోతాడు. అగ్గి తగిలిన బొగ్గు రగిలినట్లే పురుషుడు కూడా స్త్రీ తోడుంటే ప్రకాశిస్తాడు. అయితే ఆ ప్రకాశం హాని కలిగించనిదై, ఆ స్త్రీ జీవితంలో వెలుగు నింపుతే పురుషుని జన్మ ధన్యమైనట్లే. ఆ అగ్ని హాని కలిగించకుండా నియంత్రించగలగాలి.. ఆ నియంత్రించే శక్తి సమయానికి అందుబాటులో ఉండాలి.. అప్పుడు అంతా, అందరికీ ఆనందమయమే!

జగన్నాధానికి భార్యపోయినందుకు విచారంగా ఉన్నా, అంతకంటే ఒంటరితనం ఎక్కువ బాధిస్తోంది. ఒక్కగానొక్క్క కూతురు రమ్య పంచప్రాణాలూ నాన్న దగ్గరే ఉన్నాయి. పోనీ కూతురి దగ్గర ఉందామంటే.. అక్కడా ఉక్కిరిబిక్కిరైనట్లే ఉంది. నిస్సారంగా గడుస్తున్నతండ్రి జీవితంలోకి ఇంచుమించు తన ఈడుదే అయిన, దిక్కులేని లీలని సహాయార్ధం పంపుతుంది.. “నాన్నా! నీకొక బహుమతి పంపిస్తున్నా.” అంటూ.

 

“ఏం బంధాలివి?”—-పి.యస్.యమ్.లక్ష్మి

సృష్టిలో కొన్ని జంతువులు తమపిల్లల్ని తామే చంపుకుంటాయి. ముఖ్యంగా గండుపిల్లులు.. అందుకే పిల్లి తనపిల్లల్ని ఏడిళ్లు తిప్పుతుందంటారు. ఆ విధంగా చెయ్యడం.. తండ్రి పిల్లి నుంచి తన పాపాయిలని రక్షించుకోడానికే. (ఒక తండ్రి పిల్లి తన కూనల్ని మెడదగ్గర కొరికి చంపెయ్యడం.. తరువాత ఆ తల్లి పిల్లి పడిన హృదయ విదారకమైన వేదన, పిల్లలకోసం వెతుక్కోడం.. నేను స్వయంగా చూశాను).

అదే మృగతృష్ణ కొందరు మనుషుల్లో కూడా ఉంటుంది. మృగం నుండే కదా మనిషి ఉద్భవించింది మరీ! తండ్రీ కూతుళ్ల బంధం ఎంత అపురూపమయిందో మృగం వంటి మనుషుల్లో అంతే నికృష్టమయింది కూడా. స్వార్ధంతో తన సుఖం కోసం, సున్నితంగా ఆప్యాయంగా చూసుకోవలసిన తమ ముద్దు పాపల్ని అష్టకష్టాల పాల్జేసిన తండ్రులు కనిపిస్తూనే ఉంటారు. అటువంటి గండు పిల్లిలాంటి తండ్రినుంచి తననీ, చెల్లెళ్లనీ కాపాడుకున్న ఒక ధీరోదాత్త ‘వనజ’. తల్లి లేని పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన తండ్రి పదేళ్ల పసిపిల్ల చేత అడ్డమైన చాకిరీ చేయిస్తూ, వారి తిండి కూడా తను తినేస్తూ ఏమైనా అడుగుతే గొడ్డును బాదినట్టు బాదుతూ ఉంటాడు –

 

. ”ఒక ఇంటి కథ”— సుజల గంటి.

ప్రకృతి సహజమైన ఒక వాస్తవం..

మగ జంతువులకి తన పిల్లల మీద ప్రేమ ఉండదు సరి కదా.. వాటికి ఏవి తన పిల్లలో కూడా తెలియదు. పిల్లలు వాటి ఆహారం అవి సంపాదించుకునే వరకూ వాటి ఆకలి తీర్చవలసిన బాధ్యత తల్లిదే. పాలు తాగడం అయిపోయి, తమ తిండి తాము వెతుక్కునే స్థితి వచ్చే సరికి తల్లికి కూడా తన పిల్లలు గుర్తుండవు. అది జంతు న్యాయం. అదే జంతు న్యాయాన్ని మనుషులు పాటిస్తే.. వారి నేమనాలి? జంతువులు కనీసం వాటి మానాన బతకమని పిల్లల్ని వదిలేస్తాయి. జంతువులని మించిన మనుష్యులు కొందరు, తమ సుఖ సంతోషాల కోసం, తమ మగపిల్లల సౌఖ్యాల కోసం అమాయకులైన ఆడపిల్లల్ని బలి చేస్తారు. జంతువులకి లేని ఆలోచించగల మెదడు ఉంది కదా మరి! అమ్మాయిలు, తండ్రి మీదున్న నమ్మకంతో, ప్రేమతో బలి పశువులవుతారు.

అటువంటి బలిపశువులే ఆనంద, అమృతలు. ఆడపిల్లలని తండ్రి చిన్న చూపు చూసినా స్వశక్తితో చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతుంటాయి ఆనందకి. ఉద్యోగంలో మంచి స్థానం సంపాదించుకుని, బాగా సంపాదిస్తుంటారు అక్కా చెల్లెలూ. మంచి ఇల్లు, దేనికీ లోటు లేకుండా గడిచిపోయే జీవితం.. తండ్రికి పిల్లల పెళ్లి దృష్టే లేదు.

 

“ఓ నాన్న.”— సమ్మెట ఉమాదేవి.

సాధారణంగా ఏ ఇంట్లోనైనా మనం తరచూ వినే మాటలు.“మా అమ్మాయికి తండ్రి దగ్గరే చనువు, గారం. అది అడిగిందల్లా ఇచ్చేస్తారు..” మురిపెంగా నిష్ఠూరం వేస్తుందో తల్లి.“మా ఆవిడేం తక్కువ తిందా! మా వాడికి అమ్మ దగ్గర ఆడిందాట, పాడింది పాట..” నవ్వుతూ చురక వేస్తాడు తండ్రి. అదేమిటో కానీ తండ్రే, కూతురి మనోభావాల్ని బాగా అర్ధం చేసుకుంటాడేమో అనిపిస్తుంది, చాలా ఇళ్లల్లో వ్యవహారాలు చూస్తుంటే. సహజంగా బేల అయిన అమ్మాయికి తండ్రి భౌతిక, మానసిక బలాలు కొండంత అండనీ, సముద్రమంత ధైర్యాన్నీ ఇస్తాయి.

 

 

“దహనం”—సి. ఉమాదేవి

“ప్రపంచంలోని సంబంధాలన్నీ ఆర్ధిక పరమైనవే..” ఒక మహానుభావుడు చెప్పినట్లు సంసారం మొదలు సామ్రాజ్యాల వరకూ ఆస్థి.. డబ్బు. అంతే… అక్కచెల్లెళ్లు లేరు, తల్లిదండ్రులు లేరు.. తను తన చిన్ని పొట్ట, “అపుత్రస్య గతిర్నాస్తి..”.. పుత్రులనే వారు పున్నామనరకం నుండి తప్పిస్తారని, మన సంస్కృతిలో కొడుకనే వాడు కొరివి పెట్టాలని.. కొడుకు కోసం తపస్సు చేసే వాళ్లున్నారు. ఆ కొడుకులే, అవిటి చెల్లెలికి ఆధారం కల్పించడానికి తన కున్న కొద్ది ఆస్థీ ఇచ్చిన తండ్రి మీద కోపంతో, అతను చనిపోతే కొరివి పెట్టడానికి రాకపోతే ఆ చెల్లెలి పరిస్థితి ఏమిటి? ఆదుకుంటామని అన్ని కబుర్లూ చెప్పిన ఊరివారు ఎవరూ ముందుకు రాకపోతే ఆ నిస్సహాయురాలి కర్తవ్యం ఏమిటి? –

 

. “నాన్న కూతురు”— మణి వడ్లమాని.

ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయంటే.. మామిడి తోరణాలకి పరుగెత్తాల్సిందే. మా చిన్నప్పుడు రాటలు, పందిళ్లు.. తాటాకు వాసనలు, మొగలిపూల ఘుమఘుమలు. నెల ముందుగానే చుట్టాలందరూ వచ్చేసే వారు. బాబాయనీ,, అత్తయ్యనీ.. రకరకాల పిలుపులు.. అంతా హడావుడి. సంబరాలు. అంత ఆనందం, సంతోషం.. అప్పగింతలు దగ్గరకొచ్చే సరికి, సన్నాయి శహనలో మొదలు పెట్టగానే.. అప్పగించుకుంటున్న అత్త గారితో సహా కన్నీరు మున్నీరయ్యే వారు. కన్న తండ్రి కండువా తడిసి ముద్దై పోయేది. ఆ తరువాత, మూణ్ణిద్దర్లనీ, మణుగుడుపులనీ.. వీళ్లు వాళ్లింటికి.. వాళ్లు వీళ్లింటికి వస్తూ పోతూ, అన్నయ్యా, వదిన గారూ అని పిలుచుకుంటూ, ఏవో చిన్న చిన్న అలకలూ అవీ ఉన్నా అలా కలిసిపోయే వారు. మరి.. ఇప్పుడలాకాదే..

 

. “నాన్నకో ఈ మెయిల్”—– వారణాసి నాగలక్ష్మి.

ఆ భగవంతుని సృష్టి కంటుంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంటుంది. సృష్ట్యాది నుంచీ ఏ ఒక్క పదార్ధం కానీ, జంతువు కానీ మనిషి కానీ వారి వారి స్వభావాలు మారకుండా నడిచిపోతోంది. ఉప్పు ఉప్పగానే, బెల్లం తియ్యగానే, కాకి నల్లగానే, కోకిల పాట మధురం గానే, పులి.. చెప్పుకుంటూ పోతే ఎన్నో!

మానవ స్వభావాల్లో కూడా అంతే.. ఏ మార్పూ ఉండదు.. కానీ మారడానికి ప్రయత్నాలు జరగచ్చు, జరుగుతాయి కూడా.. సందర్భానుసారంగా! ఆడపిల్ల పుట్టిందంటే ఎందుకో ‘దడ’.. ఎప్పట్నుంచో! ఇప్పటికీ కొన్ని చోట్ల.. ఆధునికులమనీ, విశాలహృదయులమనీ  చెప్పుకునే వాళ్లల్లో కూడా అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మగవారిలో.. –

 

శాంతి .. స్వాతి శ్రీపాద

పుత్రుడనే వాడు లేకపోతే పున్నామ నరకానికి పోతామనే భావన ఐదారు దశాబ్దాల క్రితం చాలా ఉండేది.. మధ్యతరగతి కుటుంబాలలో! అందుకని కొడుకు పుట్టే వరకూ కూతుళ్ళని కని, అధిక సంతానాన్ని భరించలేక, పిల్లల్ని వేధించుకు తినే వారి శాతం చాలానే ఉండేది.కొడుకుని అందలం ఎక్కించి, కూతుళ్లని చిన్న చూపు చూడ్డం, ఆ వంశోద్ధారకుడు అక్కల్నీ, చెల్లెళ్ళనీ ఎన్ని తిట్లు తిట్టినా వాడిని ఏమీ అనకుండా ఎదురు కూతుళ్ళనే తిట్టడం సాధారణమైన విషయంగా ఉండేది. ఇంటి యజమాని నిరంకుశత్వానికి బలైపోయిన ఆడకూతుళ్ళ సంఖ్య అధికంగానే ఉండేది.

 

 

చాందినీ – మాలాకుమార్

కన్నపిల్లలమీద ఎంత ప్రేమ ఉన్నా తమ అలవాట్లను, వ్యసనాలను వదిలించుకోలేరు కొందరు తల్లిదండ్రులు. తల్లులకేం వ్యసనం అనుకుంటాం.. కానీ పిల్లలు పిలుస్తున్నా వినిపించుకోకుండా పుస్తకాలు పట్టుక్కూర్చోడం, ఇంటిపనులని గాలికొదిలి టివీ చూస్తూ కూర్చోడం వంటివన్నీ మానసిక బలహీనతలే. ఇంక తండ్రుల విషయానికొస్తే, అలవాట్లేంఖర్మ.. వ్యసనాలే కోకొల్లలు. ఒకటో తేదీనాడే జీతం అంతా పేకాటకి అర్పణం చేసి ఇల్లు చేరే వాళ్ళు నాకు నలుగురైదుగురు తెలుసు. ఇంక మందుబాబులు, బియ్యం నిండుకున్నా సిగరెట్ పెట్టెకి తగలేసే వాళ్ళు.. లాటరీ టికెట్ల మోజుతో కోటీశ్వరులవాలనుకే వాళ్ళు, నష్టాలొచ్చినా షేర్లమార్కెట్లో లక్షలు పోగొట్టుకొనేవాళ్ళు ఎంతమందో! పెళ్ళాం, పిల్లలు అలో లక్షణా అని గోలెడుతున్నా వాళ్లకేం పట్టదు.

 

వర్షంలో గొడుగు: శశి తన్నీరు

జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు, ప్రకృతి సహజంగా పురుషుడు భౌతికంగా ఎంత బలవంతుడో మానసికంగా అంత బలహీనుడవటం చూస్తుంటాం. ముగ్గురు పిల్లల్ని ఒంటరిగా పెంచడం.. అదీ అప్పటి వరకూ ఇంటి విషయాలు ఏవీ పట్టించుకోని వాడు, అంత సులభం కాదు. కానీ ధృఢ సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తాడు ఆనంద్. ఎంతో ఉదాత్తమైన వ్యక్తిత్వం కలవాడు ఆనంద్. నిండు గర్భిణి అయిన భార్య, లేవలేక ఏదో అందియ్యమంటే నిర్లక్ష్యంగా లేచి వెళ్ళిపోతాడు. అప్పుడా భార్య అంటుంది, “మీకు, ఆ పైన పెట్టిన గొడుగుకు తేడాలేదు” అని. ఇదేం పోలిక అనుకున్నాను మొదట. తర్వాత కథ నడుస్తుంటే అర్ధమయింది.

 

చిరంజీవ … విజయీభవ: జ్యోతి వలబోజు

కొన్ని దశాబ్దాల క్రితం మగవారు సంపాదించి పోషించడం, ఆడవారు ఇంటి బాధ్యతలు నిర్వహించడం.. ఈ రెండు విధులూ ఒక గిరి గీసినట్లు ఉండేవి. (ఇప్పుడు కూడా ఉందనుకోండి.. కానీ కొన్ని చోట్ల మగవారు కూడా ఇంటి బాధ్యతలు పట్టించుకోవడం చూస్తుంటాం. అంటే పట్టించుకునే వారి శాతం పెరిగింది.)

“నాన్నగారు” అంటే చాలా కుటుంబాలలో, సభ్యులకి అందని చందమామ. ఏది కావాలన్నా అమ్మ రికమెండ్ చెయ్యవలసిందే. తలెత్తి చూడ్డానికే భయపడే వాళ్లు. మనసులో పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా పైకి చూపిస్తే క్రమశిక్షణ పోతుందేమో అనే అభిప్రాయం నాన్నగారికే కాదు అమ్మకి కూడా ఉండేది. అల్లరి చేస్తే, “మీ నాన్నగారికి చెప్తా అంతే..” అనే మాటతో ఠపీమని మూల కూర్చోవడమే. అందులో ఆడపిల్ల అంటే ఇంకొంచెం ఎక్కువే ‘జాగ్రత్త’ ఉండేది. దాంతో తండ్రి దగ్గర చనువు ఉండదు. ఇష్టం లేని చదువులు, నచ్చని బట్టలు, బలవంతపు నిర్బంధాలు.. ఇవన్నీ చాలా సహజం. ముఖ్యంగా వివాహ విషయంలో, “దాన్నడిగేదేంటి.. నేను అన్నీ ఆలోచించే చేస్తాను కదా.. “ అనే అభిప్రాయం తండ్రులకి సహజంగా ఉండేది.

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *