April 25, 2024

వెటకారియా రొంబ కామెడియా 5 – ఎలెక్షన్ల జాతర

రచన: మధు అద్దంకి  madhu

ఢం ఢం ఢం ఢమ ఢమా….ఢబ్ ఢబ్..ఢభీ ఢబీ అన్న శబ్దాలు విని ఉలిక్కి పడి లేచారు గౌరమ్మ, గురవయ్యా… టయిం ఎంతయ్యిందీ అనుకుంటూ చూస్తే రాత్రి 3.00 అయ్యింది.. ఈ టయింలో శబ్దాలేంటి అనుకుంటూ ఉంటే ఏమండీ అని గావుకేక పెట్టింది గౌరమ్మ…

ఆ కేకకి ఉలిక్కిపడి వెన్ను చరుచుకుంటూ “ఓసి నీ మొహం మండా ఎందుకే అంత గావు కేక పెట్టావు” అంటే “ఏమండీ ఒక్కసారి ఆ శబ్దం వినండి” అన్నది…

శబ్దం విన్నాక ఓ పొలికేక పెట్టాడు..

“ఓరి మీ ఇంట్లో దొంగల్ దోల ఎందుకలా పొలికేక పెట్టారు” అని గురవయ్య వీపు మీద ఒక్క చరుపు చరిచింది గౌరమ్మా…

“అబ్బా కొట్టకే వీపు మండుతోంది” అన్నాడు గురవయ్య.

“సర్లే ఇక మీదట కొట్టను గాని ఇలా చరుస్తాను” అని ఒక్కటిచ్చింది …

అబ్బా అని వీపు రాసుకున్నాడు గురవయ్య..

ఇంతలో మళ్ళా ధభీ ధభీ మని శబ్దం వినిపించింది..

“ఏమండీ అని అరవబోయిన గౌరమ్మ నోరు నొక్కి ఇంక అరిచి భయపెట్టకు ఎవరో ఏమిటో…ఒకవేళ దొంగలైతే అప్పుడు గావుకేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళని లేపొచ్చు “ అని నెమ్మదిగా మెయిన్ డోర్ దగ్గరికి నడిచాడు..

“ఏమండీ ఊహూ..” అంటూ గుడ్లల్లో నీరు కుక్కుకుంటూ, నోట్లో మాటని కుక్కుకుంటూ పిచ్చి చూపులు చూస్తోంది గురవమ్మ..

 

తలుపు ఓరగా తెరిచి ఎవరూ అని అడగబోతున్న గురవయ్య మొహానికి ఫెడీల్మని తలుపు కొట్టుకుని పొలికేక మీద పొలికేక పెట్టాడు..

ఆ కేకలు విని తన వంతు తను గావుకేకలు పెట్టడం మొదలెట్టింది గౌరమ్మ…

వీరి కేకలు విని లోపలకొచ్చిన ఆరుగురు కూడా పొలికేకలు పెట్టారు…అలా కేకలు పెట్టీ పెట్టీ అలిసిపోయి కూర్చున్నారు..

అలసట తీరాక ఒకరినొకరు చూసుకున్నాక విషయం గుర్తొచ్చి ఎవరు మీరు అని అడిగాడు గురవయ్య… “మేము “తెలంగాణ జాగృతి పార్టీ” కార్యకర్తలం ..మా వోటర్లని అణుక్షణం జాగృతి చేస్తుంటాం జాగారంతో” అన్నారు..

అర్ధరాత్రి మద్దెల గొడవేందయ్యా అంటే..అరే చుప్ మద్దెలేంది మా పార్టీ గుర్తు “తోపుడు బండి”..మా పార్టీ కి వోటేస్తే మీకు తోపుడు బండి వచ్చ్హేల చేస్తాం..ఆ బండి మీద కూర్సుని మీరు మీ పనికి పోవచ్చు, కాయగూరలు కొనొచ్చు, ఒక్కటేంది మొత్తం పన్లే జూసుకోవచ్చు. ఎందుకంటే మా పార్టీ అచ్చినంక మీరు ఇండ్లల్లో ఏడుంటారు.. రోడ్లమీదే మీ బతుకు తీ! అందుకనే మా పార్టీని గెలిపించి తోపుడు బండి గిట్ల పట్టుకుపొన్రి!! “

“ఏంటేంటి మీ పార్టీ గెలిస్తే మేము రోడ్లమీదుండాలా? అయితే మీ పార్టీకి మేము వోటెయ్యం” అన్నారు గవరయ్య,గౌరమ్మ…

“మా పార్టీకి ఎయ్యకుంటే ఇప్పుడే రోడ్ మీదకి పోతారు…అరేయ్!! ..ఈళ్ళ సామాన్ తీసి బయట పడేయండ్రా”  అని అరిచాడు ఒకడు…

“బాబ్బాబు మీకు పుణ్యముంటుంది..మీ పార్టీ కే వోటేస్తాం మమ్మల్నిల ఉండనియ్యి..

“అయితే తీ ఒక 5 వేలిచ్చుకో..

“ఇదేం అన్యాయం మీరు మాకు డబ్బులిస్తే మేము వోటెయ్యాలి కాని మీరేంది రివెర్స్ అడుగుతున్నారు” అన్నాడు గురవయ్యా..

అదంతే తీ! ఆంధ్రోల్లకి అంతా రివర్స్ ఇంక..పైసలిస్తావా రోడ్ మీదకి పోతావా” అన్నాడు..

ఇదెక్కడి ఖర్మా రా బాబూ అనుకుంటూ లోపలికెళ్ళి 5 వేలిచ్చి వాళ్ళకి ఒక దణ్ణం పెత్తారు..

“వోట్ మాత్రం మా పార్టీ కే వెయ్యాలా..మీకు తోపుడు బండి నేనిప్పిస్తా అంటూ బయటకి నడిచారు కార్యకర్తలు…

తర్వాత ఢభీ ఢభీ ఢాం ఢాం అని డప్పులు కొట్టుకుంటూ కాలనీలో ముందుకు పోయారు కార్యకర్తలు..

బ్రతుకు జీవుడా అనుకుంటూ తలుపేసుకుని వెళ్ళి మంచమ్మీద వాలారు..

 

* * * * *

 

బోయ్య్ బోయ్య్ మన్న శబ్దానికి మళ్ళా ఇద్దరికీ మెలుకువొచ్చింది..భయంగా ఒకరినొకరు చూసుకున్నారు భార్యాభర్తలు..ఇంతలో మాటలు వినపడ్డాయ్ లవుడ్ స్పీకర్ లో ..అయ్యలారా అమ్మలార బాగున్నారా? 4 యేళ్ళయింది మిమ్మల్ని చూసి వోట్లడుక్కుని..మళ్ళీ అడుక్కునే టైమొచ్చింది..అమ్మా మాదాకోళం తల్లీ వోటెయ్యండమ్మా…వొటేయ్యండయ్యా…అని గొంతు వినబడుతోంది…ఛీ ఛీ వెధవ సంత నిద్రపోవడానికి లేదు అని విసుక్కుని తిరిగి పడుకుందాం అనుకుంటూండగా తలుపులు కొట్టిన శబ్దం విని తలుపు తీయడానికి వెళ్ళాడు.. ఇందాకట్లా ఎవరూ తన మొహమ్మీద ఫెడేల్మని తలుపు తన్నకుండా తనే ధడాల్ మని తలుపు తీశాడు…

అక్కడ పాంటు,షర్ట్ వేసుకుని చిరునవ్వుతో నిలబడ్డారు కొంతమంది కార్యకర్తలు..

“ఎవరు మీరు?” అనడిగాడు?

మేము ” నా.సో.పా” కార్యకర్తలమండీ…

“నా.సో.పా నా అదేంటి మేమెప్పుడు పేరు కూడ వినలేదు..

“అంటే అదేనండీ.. దివంగత ముఖ్యమంత్రి కులశేఖర్ గడ్డి  కొడుకు పార్టీ ” నా సొంత పార్టీ” కార్యకర్తలమండి…

“సరే అయితే ఈ టయింలో ఎందుకొచ్చారు?”

“పొద్దున్నే అందరూ ఫ్రెష్ గా ఉంటారు కదండీ అందుకని మా కార్యక్రమం తెల్లారగట్టే మొదలెడతామండీ..  “వచ్చిందగ్గరనుండి చూస్తున్నాను ఎమిటయ్యా బలవంతంగా పెదవులు బిగబట్టి నవ్వుతున్నారు?అలా నవ్వి నవ్వి మీ బుగ్గలు వాచిపోతాయేమో!!”

“ఏమి వాచినా, ఎక్కడ వాచినా మేమిలాగే నవ్వాలండీ లేకుంటే జన్మంతా మేమేడవాలి” అన్నారు వాళ్ళు..

“సర్లే అయితే ఎమంటారు?”

“మీరు మా పార్టీకే వొటెయ్యాలండీ..ఎందుకంటే మా పార్టీకి మీరు వొటేస్తే మిమ్మల్ని ఓదార్చడానికి మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాము…వోటుకి మీకు 15 వేలిచ్చి గెలిచాక మేము 15 వేల కోట్లు దోచుకుంటాము…మళ్ళా 5 ఏళ్ళ దాకా మీ గుమ్మం తొక్కం.. మీ మొహం చూడం..మా వల్ల మీకెటువంటి ఇబ్బంది ఉండదు “ అని వాళ్ళ పాంప్లెట్లు ఇచ్చారు..మరి డబ్బు అంటే పోలింగ్ బూత్ దగ్గర తీసుకోండి అని నవ్వుతూ వీడ్కోలు చెప్పి వెళ్ళారు…

బాగుంది వరస అనుకుంటూ మళ్ళా నిద్రకు పడ్డారు….

ఈ సారి వారు కాలింగ్ బెల్ చప్పుడికి లేచారు..తలుపు తెరవగానే చిరునవ్వుతో ఉన్న మహిళ ఫుటో కనిపించింది..ఫుటో ఎలా బెల్ కొట్టింది అనుకుంటుండగానే ఫుటో  జరిపి వ్యక్తులు ముందుకొచ్చారు..

“ఎవరు మీరు?”

“ మేము ” నేషనక్ బ్రేకింగ్ పార్టీ” నుండి వచ్చామండి..ఈ ఫుటోలొ[ ఉన్న వ్యక్తి ఇన్నాళ్ళు మన దేశాన్ని శాసించిన మహిళ.. ఈవిడకి మీరు తప్పక వోటెయ్యాలి ఎందువల్లంటే కలిసుంటే లేదు సుఖం ఈవిడ సిద్ధాంతం అందరు సుఖంగా ఉండాలని దేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టాలని ఈవిడ ప్రయత్నం..మన రాష్ట్రాన్ని కూడ అభివృద్ధి పేరిట ముక్కలు చేసింది కదా..ఆ ముక్కల్లో దొరికినదానిని దోచుకోవచ్చు అన్న సిద్ధాంతం కల పార్టీ మాది.. కాబట్టి మీరు తప్పక వోటెయ్యాలి..మీరు గనక మాకు వోటేస్తె మీ ఇంటిని కూడ సునాయాసంగా ముక్కలు చేస్తామని హామీ ఇస్తున్నాం” అని వారి పాంప్లెట్ చేతిలో పెట్టి వీడ్కోలు తీసుకున్నారు..

ఇంత జరిగాక ఇక నిద్ర మీద ఆశ చచ్చిపోయి మిగతా పనులు చూసుకోడానికి పూనుకున్నారు..

కాని మధ్య మధ్యలో గావుకేకలు, పొలికేకలు పెడుతూనే ఉన్నారు..

 

ఈ విధంగా రోజంతా 24 గంటలు అన్ని పార్టీ లో అన్ని వీధుల్లో, పేటల్లో ఊళ్ళల్లో ఈ విధంగా భీభత్సం సృష్టించి తమ తమ పార్టీల ప్రచారం చేసుకున్నారు…

మరి జనాలెవ్వరికి వోటేశారు ? అందరికీ తెలిసిన విషయమేగా…

4 thoughts on “వెటకారియా రొంబ కామెడియా 5 – ఎలెక్షన్ల జాతర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *