April 23, 2024

సప్తపది

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు jk

 

షట్పది అంటే ఆఱు పాదాలు కలిగినది అని అర్థము. తుమ్మెదకు కూడ షట్పది అని పేరు. నేను ఇప్పుడు పద్యములలో వచ్చే షట్పదిని గుఱించి మాట్లాడుతున్నాను. ఈ షట్పది నిస్సందేహముగా కన్నడ భాషామతల్లి మణికిరీటమే. కన్నడ ఛందస్సులో ఎన్నో షట్పదులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి – భోగ, శర, కుసుమ, భామినీ షట్పదులు ముఖ్యమైనవి. వీటికి వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఏడు (3+4) మాత్రలు ఉంటాయి. పేరుకు తగ్గట్లే షట్పదికి ఆఱు పాదములు. మొదటి, రెండవ, నాలుగవ, ఐదవ పాదములకు లక్షణములు ఒక్కటే. మూడవ, ఆఱవ పాదమునకు వేఱుగా ఉంటుంది. ప్రాస అవసరము. షట్పదికి గణములు – మా-మా / మా-మా / మా-మా-మా-గ, మా అన్నది పైన చెప్పిన 3,4,5,7 మాత్రలు ఉండే మాత్రాగణములు.

 

మూడు మాత్రలతో భోగషట్పదివలె ఒక ఛందస్సును కవయిత్రి ముద్దుపళని (కొందఱు ఆమె గురువుగారు అంటారు) ఒక కొత్త ఛందస్సును సృష్టించారు.  దీనికి ఏడు పాదములు. ప్రతి పాదమునకు గణముల అమరిక ఈ విధముగా నుంటుంది –

త్రి-త్రి-త్రి-త్రి / త్రి-త్రి-త్రి-త్రి

త్రి-త్రి-త్రి-త్రి – త్రి-త్రి-గ

ఇట్టి ఏడు పాదములతో ఆమె ఆండాళ్ (గోదాదేవి) రచించిన తిరుప్పావై గ్రంథమును అనువదించ దలచుకొన్నారు. కాని పది మాత్రమే ఇప్పుడు మనకు లభ్యము. మచ్చునకు ఒకటి –

సప్తపది – 10

నందనందనుడనగ నా-

నంద మొందు వార లొక్క

కుందరదన నిదురలేప – గోరి వచ్చిరే

నోచు నోము స్వర్గ మిచ్చు

నో చెలీ యిదేల తల్పు

వైచి పండుకొంటి విట్లు – వడిగ రాగదే

నీటుమీఱ బల్క వున్న

చోటనుండి మాటి కొక్క

నోటిమాటకైన మేము – నోచలేదటే

వలసినట్టి చోట కలసి

మెలసి సిరుల వెలసి శ్రీ

తులసిదండ గురులనిండ – దుఱుమువాడటే

పొంగి మంగళంబు లొసగి –

పొగడినంత మనకు నంత-

రంగ వాంఛ లిచ్చు పుణ్య-రాశి గాడటే

ముందు నిదురయందు బేరు

నొందినట్టి కుంభకర్ణు

డిందు నోడి నీకు నిద్ర – యిచ్చినాడటే

తత్తరమ్ము మాని నిద్ర

మత్తువీడి వచ్చి చెల్మి

కత్తెలతో నిపుడు నీవు – పొత్తుగూడవే

ఏ కారణమువల్లనో తఱువాతి సప్తపదులు మనకు దొఱకలేదు. మిగిలిన 20 పద్యములను నేను సప్తపదులుగా అనువదించినాను. మచ్చునకు ఒక ఉదాహరణము –

సప్తపది – 14

(నేను వ్రాసిన సప్తపదులలో యతినిగాని ప్రాసయతినిగాని ఉంచినాను)

 

అలరె నెంతొ యందముగను – నరుణకమలషండము లట

దళము విప్పి ఉదయవేళ – లలన జూడవే

లలితవనమునందు నుండు  -కొలనిలోన నీలి రంగు

కలువపూలు మొగిడె నిపుడు – కలికి జూడవే

వెలితిలేని భక్తితోడ – తెలి విబూది మేన బూసి

మొలను గావిబట్ట గట్టి – రల తపోధనుల్

కడు పవిత్రమైన గుడికి – కమలనాభు గొలువ వెళ్ళి

సడుల జేసిరమ్మ వారు – శంఖరవళితో

తొలుత లేచి పిదప మమ్ము – అలరుబోడి లేపెదనని

పలికినావె నంగనాచి – తెలివి తగ్గెనా

చెలియ వదరుబోతు వీవు – సిగ్గు లేదె లెమ్ము లెమ్ము

అలఘుడైన దీర్ఘబాహు – నలిననయనునిన్

కలిత శంఖచక్రహస్తు – దలచి పాడ సమయ మిదియె

గళము విప్పి మనసు నిండ – లలితగీతముల్

 

ముద్దుపళని ఈ ఛందస్సుకు ఎందుకు సప్తపది అని పేరు పెట్టినారో అనే ప్రశ్న ఉదయించవచ్చును. గోదాదేవి కథ శ్రీరంగనాథునితో జరిగిన పెళ్లితో ముగుస్తుంది. ఈ వివాహ కాలములో సప్తపది కూడ ఒక ఆచారమే కదా?  అందువలన ఆమె ఈ ఛందస్సుకు సప్తపది అని పేరు పెట్టి ఉండవచ్చును.

ముప్పది సప్తపదులు యాహూ ఛందస్సు, రచ్చబండ కూటమిలో ప్రచురించబడినవి. వీటికి సరియైన పాటలు, ఆంగ్లములో అనువాదములు కూడ ప్రచురించియున్నాను.  గడచిన సంవత్సరము Facebookలో వీటిని పునఃప్రచురణ చేసినాను.

హైందవ వివాహసమయములో సప్తపది ఆచారము ఒక legal contract వంటిది. ఆ మంత్రములు సంస్కృతములో పురోహితుడు చెప్పగా వధూవరులు ఏడు అడుగులను ఒకటిగా కలసి వేస్తారు. తెలుగులో ఈ మంత్రములు ఉంటే బాగుగా నుంటుందని తలచి, నేను ఈ సప్తపది ఛందస్సులో సప్తపది మంత్రమును వ్రాసినాను. ఇష్టమైన వారు దీనిని కూడ పెళ్లి వేళలో పాడుకొనవచ్చును.

తెలుగులో సప్తపది మంత్రము –

మొదటి యడుగు నిడుద మిపుడు – భూమి యిచ్చు పంటతోడ

ముదముతో భుజించగ తను-పుష్టికై సదా (1)

రెండవ యడు గిడుద మిపుడు – రిత్తవోని బలము మనకు

మెండుగాను బ్రదుకునందు – నిండగా సదా (2)

మూడవ యడు గిడుద మిపుడు – పూర్ణమౌ విభూతు లెల్ల

కూడుకొనగ గృహమునందు – కొండగా సదా (3)

నాల్గవ యడు గిడుద మిపుడు – నశ్వరమగు భవము శివము

వెల్గ మనకు జీవితాన – వృష్టిగా సదా (4)

అయిదవ యడు గిడుద మిప్పు – డందముగను ముద్దు లొలుకు

ప్రియ తనూభవుల సుశీల – వృత్తికై సదా (5)

ఆఱవ యడు గిడుద మిప్పు – డాయువునకు స్వస్థతకును

కారు లిచ్చు దివ్యమైన – కాంతికై సదా (6)

ఏడవ యడు గిడుద మిపుడు – హృద్యమైన సఖ్యతకయి

వాడని మమకారముకయి – వసుధపై సదా (7)

 

సంస్కృతములో సప్తపది మంత్రము-

ఓం ఇష ఏకపదీ భవ

సా మామనువ్రతా భవ

పుత్రాన్  విందావహై బహూన్

తే సంతు జరదష్టయః (1)

 

ఓం ఊర్జే ద్విపదీ భవ

సా మామనువ్రతా భవ

పుత్రాన్  విందావహై బహూన్

తే సంతు జరదష్టయః (2)

 

ఓం రాయస్పోషాయ త్రిపదీ భవ

సా మామనువ్రతా భవ

పుత్రాన్  విందావహై బహూన్

తే సంతు జరదష్టయః (3)

 

ఓం మార్యాభవ్యాయ చతుష్పదీ భవ

సా మామనువ్రతా భవ

పుత్రాన్  విందావహై బహూన్

తే సంతు జరదష్టయః (4)

 

ఓం ప్రజాభ్యః పంచపదీ భవ

సా మామనువ్రతా భవ

పుత్రాన్  విందావహై బహూన్

తే సంతు జరదష్టయః (5)

 

ఓం ఋతుభ్యః షట్పదీ భవ

సా మామనువ్రతా భవ

పుత్రాన్  విందావహై బహూన్

తే సంతు జరదష్టయః (6)

 

ఓం సఖా సప్తపదీ భవ

సా మామనువ్రతా భవ

పుత్రాన్  విందావహై బహూన్

తే సంతు జరదష్టయః (7)

 

1 thought on “సప్తపది

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *