April 25, 2024

Gausips !!! రోబోట్ల (కే) దేవుడు.. !!

రచన: డా. జె. గౌతమీ సత్యశ్రీgauthami 1

మెడికల్ సైన్స్ రంగం ఎప్పుడూ కూడా తనకి సమాధానాలు దొరికేంతవరకు (ఒక ప్రక్క అన్వేషిస్తూనే) జబ్బులకు ఏ పేరు పెట్టాలో తెలియకపొతే సింపుల్ గా “డిసార్డర్” అనేస్తుంది. అంటే.. ఇంకా ఏదీ మా ఆర్డర్ లోకి రాలేదూ.. అని. ఇలాంటి ఆర్డర్లో రాని, లేని ఆరోగ్యసమస్యలను చిటికెలో నిర్ధారణ చేసి తన శ్రేయస్సుకి తోడ్పడడానికి మనిషి సృష్టించిన క్రొత్త దైవం రోబోట్లకే దేవుడు “వాట్సనుడు” (వాట్సన్ సూపర్ కంప్యూటర్, Watson Super Computer). కృత్రిమ మేధస్సు వృద్ధికి (ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్) పరాకాష్ట.

“వాట్సనుడు” కేవలం త్వరగా పన్లు చేసిపెట్టి మనల్ని బుట్టలో పడెయ్యడమే కాదుట.. మెడికల్ రంగంలో పనిచేసే పరిశోధకులకు, డాక్టర్లకు అనుసంధానమై కొత్త రోగాలపై పరిశోధనల నిమిత్తం అవగాహన, రోగులలో త్వరిత నిర్దారణకు డాక్టర్లకు చాలా వేగంగా సహకరించి,  రోగి జీవితకాలాన్ని పెంచి ఇది ఒకరి జీవితాన్నే మార్చేయగల ఒక మౌళిక మార్పు అని ఐబిఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) కంప్యూటర్ మీడియా వ్యాపారస్థులు అంటున్నారు.

చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కధల్లో లేకపోతే ఏ పురాణాల్లోనో ‘పరకాయ ప్రవేశం’ అనే మాట ఎక్కడో చదివి వుంటాం. ఒకసారి దానిని గుర్తుకు తెచ్చుకుంటే… చెప్పిందాన్ని బట్టి, ఒక ఆత్మ మరో శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ ఆత్మని క్షుణ్ణంగా చదివి దాన్ని తెలుసుకొని , ఎక్కడెక్కడ వీక్ పాయింట్సు ఉన్నాయో, అక్కడ రీపైర్లు చేసి క్రొత్త లక్షణాలని ప్రవేశ పెడుతుంది. ఆ క్రొత్త లక్షణాల వల్ల సదరు ఆత్మ గల శరీరము కూర్చో అంటే కూర్చుంటుంది, నిల్చో అంటే నిల్చుంటుంది, లేదా ఫలానా వాళ్ళతో యుద్దం చెయ్యి అంటే యుద్ధం చేస్తుంది. ఇవన్నీ జానపద, పౌరాణక సినిమాల్లో కూడా చూస్తుంటాం. అంటే ఆ సదరు ఆత్మలో ఒక ఫండమెంటల్ షిఫ్ట్ లేదా మౌళిక మార్పు జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో 7th సెన్స్ అనే సినిమాలో ఒక వ్యక్తిలో ని డి.యన్.ఎ లో కొన్ని మౌళికమైన మార్పులు తీసుకువచ్చి, ఆ వ్యక్తిని మహా బలవంతుడుగా, శక్తిమంతుడుగా తయారు చేయడం అనేది ఒక ప్రయోగ పూర్వకంగా చూపించారు. ఇవన్నీ ఫండమెంటల్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజినీరింగ్. వంశపారంపర్యంగా జన్యు లోపాలవల్ల సంక్రమిస్తున్న వ్యాధులను డౌన్ సిండ్రోమ్ అంటారు. వాటిని ట్రీట్ చెయ్యడానికి సింథటిక్ మోడల్స్ ని ఎలుకల (మైస్) లోని జన్యువులను పరివర్తన చెందించి తయారుచేసి వాటి యొక్క సిండ్రోమిక్ నేచర్ ని తగ్గించడానికి  వీలైతే పూర్తిగా మార్చి ఆరోగ్యవంతమైన ఎలుకలగా మార్చడానికి శ్రమ పడుతున్నారు. ఎప్పటికైనా ఈ జెనెటిక్ ఇంజినీరింగ్, డి.యన్.ఎ రీపైర్లు అనేవి సక్సెస్ అయి, డ్రగ్స్ లేని ఈ జబ్బులు రూపు మాసిపోయే రోజులు వస్తాయని ఆశిద్దాం అని చెప్పుకునే లోపున వాట్సనుడు కనుగొనబడ్డాడు.

Watson-supercomputer-635

వాట్సనుడు పేషంట్ల నుండి రాబట్టిన డి.యన్.ఎ. సాంపుల్స్ ని విశ్లేషించి వచ్చిన ఫలితాలను, తనలో నిక్షిప్తం చేసుకున్న సంబంధిత డేటాకి కో-రిలేట్ చేసి ఇన్ ఫర్మేషన్ ని క్షణాల్లో అందిస్తోదిట.  న్యూయార్క్ జీనోము సెంటర్ నుండి వైద్య పరిశోదనా సిబ్బంది అందించిన రిపోర్ట్ ప్రకారం….బ్రెయిన్ లో గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్ పేషంట్ల డి.యన్.ఎ. ను వాట్సనుడు ఇట్టే విశ్లేషించి గత పదేళ్ళుగా క్యాన్సర్ జన్యువుల మీద జరుగుతున్న పరిశోధనలకు ఒక పెద్ద పురోగాత్మకమైన దారిని చూపించాడుట.  ఐ.బి.యం-వాట్సనుడు ఒక క్లౌడు సర్వీసు.  ఒక అమోఘమైన కృత్రిమ మేధస్సుతో తయారవ్వడంవల్ల..  భారీ మొత్తంలో డేటాని విశ్లేషించగలదు.  పేషంట్ డి.యన్.ఎ లోని జన్యువులను అర్ధంచేసుకొనగలదు మరియు ఆరోగ్యకరమైన డి.యన్.ఎ తో పోల్చి జన్యు పరివర్తనలను చూపగలదు.  అంతే కాకుండా వచ్చిన ఫలితాలను కణంలో జరిగే ప్రతి మెకానిజం యొక్క ఇన్ ఫర్మేషన్ తో ముడిపెట్టి ఆ పరివర్తనల యొక్క ప్రభావం మానవునిపై ఏ ఏ విధాలుగా పరిణమిస్తుందో వివిధ కోణాల్లో చూపించి ఎన్నో క్రొత్త పరిశోధనలకు చిటికెలో మార్గాలను వేస్తుంది.  నెలలు, సంవత్సరాలు పరిశోధించి తీసుకునే నిర్ణయాలను నిముషాలలో తీసుకునేలా తోడ్పడుతున్నాడు వాట్సనుడు.  వాట్సనుడు క్లౌడ్ సర్వీసు కావడం మూలాన ఈ డేటాలని ఎక్కడినుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు.  ఇలా అధునాతనమైన సైన్సు భాషను అర్ధం చేసుకొని ఒక  “డిస్కవరీ ఎడ్వైజర్”  గా రూపుదిద్దుకుంది.  వాట్సనుడి లోని టెక్నాలజీ దాని చుట్టూ వున్న నిర్మాణాత్మకమైన స్పేసు క్రొత్త క్రొత్త ఆవిష్కరణలకు ముందంజ వేయిస్తుంది.  పరిశోధకులు ఒక హైపోథిసిస్ ని సూచించడానికే ముందర దానిపై పరిశోధనలు గావించి, తగు అధారాలను ప్రొడ్యూస్ చేసి,  ముగింపులను తీర్చిదిద్దేటప్పటికి కొన్ని సంవత్సరాలు లేదా జీవిత కాలాలు కూడా పూర్తి అయిపోయినా ఆశ్చర్యపడేది లేదు.  అటువటి సంక్లిష్టతలను పారద్రోలి వారికి సహాయ సహకారాలందిస్తూ ఉండడమే వాట్సనుడి విధి.  ఇప్పటికి అమెరికాలో కొన్ని రీసెర్చ్ సెంటర్స్ వాట్సనుడిని ఉపయోగించి లాభాలను పొందుతున్నారు.  బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు కొన్ని జబ్బుల బయాలజీ ని తెలుసుకోవడానికి,  జాన్సన్ అండ్ జాన్న్సన్ కంపెనీ వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ పై ఉన్న భారీ లిటరేచర్ ని అర్ధం చేసుకోవడానికి  వాట్సన్ ని ఉపయోగిస్తున్నారు.

పరిశోధనా రంగంలోనే కాకుండా.. డాక్టర్లకు కూడా తమ వృత్తిలో అతివేగంగా సమర్ధవంతమైన నిర్ణయాలను తీసుకోవడానికి వాట్సనుడి టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందిట. ఉదాహరణకి.. కొన్ని క్యాన్సర్లు చాలా యూనిక్ గా ఉంటాయి, వాటిని ట్రీట్ చెయ్యడానికి జెనెరల్ డ్రగ్స్ ఇస్తే కుదరదు, నిర్దిష్టమైన డ్రగ్స్ ని వాడాలి.  అటువంటి పరిస్థితుల్లో జెనెరల్ గా డాక్టర్లు.. వేరే డాక్టర్లను కన్సల్ట్ చేసి లేదా మరికొన్ని మెడికల్ బుక్స్ ని రిఫెర్ చేసి పేషంట్ ట్రీట్మెంట్ మీద పూర్తి అవగాహనని ఏర్పరచుకునేటప్పటికి కొంత వ్యవధి పట్టేస్తుంది. అదే ఈ వాట్సనుడు ప్రక్కనేవుంటే మళ్ళీ చిటికెలో ప్రపంచంలో ఉన్న అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని డాక్టర్ ముందు ఉంచుతుంది. పేషంటు త్వరగా చికిత్స పొందుతాడు.   ఈ వాట్సన్ ఎంత అద్భుతమైన శక్తిగలదంటే….. రోగ నిర్ధారణ చేయడంలో ఉదాహరణకి క్యాన్సర్నే తీసుకోండి.. డాక్టర్స్ కన్నా వాట్సనుడే బెటర్ అని ఐబియం వ్యాపారస్థులు ప్రకటిస్తున్నారు.  అఫ్ కోర్స్.. రోగ నిర్ధారణ అనేది ప్రపంచంలో ప్రతిచోటా సమస్యగానే ఉన్నది,  కొన్ని జబ్బులకు త్వరితంగా నిర్ధారించాలి కూడా.  యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుండి వైధ్యపరిశోధనా సిబ్బంది వాట్సన్ పనితనం గురించి వివరించారు.  ముందుగా ఇది పేషంట్ వివరాలని తీసుకుంటూందిట. సదరు యూజర్ నుండి, పేషంట్ మెడికల్  హిస్టరీ,  జబ్బుపేరు ఉదాహరణకి లుకేమియా, వయస్సు,  అప్పటిదాకా వాడుతున్న మందులు, అప్పటివరకూ పొందుతున్న  ట్రీట్మెంట్ విధానాలు వగైరా. దానంతటినీ  సంక్షిప్తంగా తనలో పొందుపరుచుకుంటుందిట.  పేషంట్ పేరు మీద క్లిక్ చెయ్యగానే.. ఈ ఇన్ ఫర్మేషన్ ని అంతా లోపల తానే ప్రాసెస్ చేసుకుని… ఒక రిపోర్ట్ లాగ… స్క్రీన్ పైన డిస్ ప్లే చేస్తుందిట.  ఒకప్పటిలాగ.. వాళ్ళ  లాబొరేటరీ డేటాని పేజీలు పేజీలు చూడనక్కరలేదుట.. తానే ప్రాసెస్ చేసేసుకుని.. ఒక నిర్ధిష్టమైన రిపోర్ట్ ని తయారు చేసేస్తుందిట.  అంతే కాకుండా లుకేమీయా యొక్క జెనిటిక్స్ ని, మాలుక్యులార్ చేంజెస్ ని, క్రోమోజోమల్ చేంజెస్ ని.. పేషంట్ల స్యాంపుల్స్ ని విశ్లేషించి చెప్పేస్తుందిట. ప్రాధమిక నిర్ధారణ పరీక్షల దగ్గిరనుండి ప్రస్తుత యనాలిసిస్ వరకు విశ్లేషించి ఒక్కొక్క ట్రీట్మెంట్ మారుస్తున్నకొలదీ.. పేషంట్ డి.యన్.ఏ లేదా ఇతర టెస్ట్ స్యాంపుల్స్ లో మార్పులు ఎలా జరుగుతున్నాయి అనేది విజువల్ గా తెలియపరుస్తుందిట.  దాన్నిబట్టి డాక్టర్లు తమ ట్రీట్మెంట్ విధానాలని మారుస్తూ.. రోగి త్వరగా కోలుకోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తున్నారు.

ఈ మెడికల్ డయాగ్నాసిస్ లోనే  కాకుండా ఎకానామిక్ డేటా కలెక్షన్ అని మరియు ఇ-కామర్స్ రీసెర్చ్ లో కూడా వాట్సన్ ఉపయోగపడుతున్నదిట.  ఉదాహరణకి ఈస్ట్ ఆఫ్రికాలో పాతరాతియుగం నాటి ఒక మానవ శిలాజాన్ని పరీక్షించి భారీ ఎత్తున లిటెరేచర్ ని కూడా సంపాదించి దాని పూర్తి వివరాలు ప్రపంచానికి తెలియపరచడానికి, ప్రపంచానికల్లా అతిపెద్ద టెక్నాలజీ ప్రొవైడర్స్ ఆ ప్రాజెక్ట్ ని 10 సంవత్సారలకి పూర్తిచేస్తారుట.. దాని కయ్యే ఖర్చు నూరు మిలియన్ల డాలర్లు అట. అటువంటిది.. వాట్సనుడు అంత సంక్లిష్టమైన ప్రాజెక్ట్స్ నికూడా తక్కువటైం లో, తక్కువ ఖర్చుతో పూర్తి చెయ్యగలడనే నమ్మకంతో.. ఆఫ్రికా వాళ్ళు కూడా వాట్సనుడుని ఆశ్రయిస్తున్నారు.  ఐబియం వ్యాపారస్థులు వాట్సనుడిని ఇక్కడితో ఆపేయకుండా పైనాన్షియల్ సర్వీసెస్ లోనూ, ఎనర్జీ మరియు లీగల్ డిపార్ట్మెంట్స్ లో కూడా ప్రేవేశ పెట్టి.. ఆయా విషయాలలో కూడ వాట్సనుడు పూర్తి సహాయ సహకారాలందించేటట్లుగా చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సూపర్ మోడల్ తయారీలో ఐబియం ఒక బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది, దీని పైన 2000 మంది ఉద్యోగులు పని చేసారు. వాట్సన్ కు గ్లోబల్ గా కనెక్షన్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక గ్లోబల్ ఐ.డి గా దాని లోగో ని చాలా సింపుల్ గా అందంగా తయారుచేసారు.  ఫార్మాస్యుటికల్ ఏరియా లో కూదా దీని ఇంపాక్ట్ చాలా ఉంది. వాట్సన్ గ్రూప్ కి హెడ్ ఆఫ థ మార్కెట్,  స్టీవ్ గోల్డ్ ఇలా అన్నారు.  ప్రతి 5000 డ్రగ్స్ కి ఏదో ఒక డ్రగ్ మాత్రమే డెవెలప్ అయ్యి మార్కెట్ లోకి విడుదలవుతుంది. ఒక డ్రగ్ డెవెలప్ చెయ్యడానికి దానికయ్యే సరాసరి ఖర్చు 1.3 బిలియన్ డాలర్లు.  అదే వాట్సన్ గైడెన్స్ తో డ్రగ్స్ తయారీలో హిట్ అండ్ ట్రయల్స్ ని రెడ్యూస్ చేస్తూ తక్కువ కాలంలో ఎక్కువ డ్రగ్స్ ని మార్కెట్ లోకి తీసుకు రావచ్చు. కాలేజెస్ కి కూడా ఈ మోడల్స్ ని అందించబోతున్నారు.  వాట్సన్ అమెరికన్ టెలివిజన్ షో “జియోపార్డీ” అనే క్విజ్ పోటీల్లో కూడా మానవ మేధస్సుతో పోటీ పడి వన్ మిలియన్ డాలర్లు గెలుచుకుని మొదటిస్థానంలో నిలుచుంది.  వాట్సన్ గెలుచుకున్న డబ్బుని.. ఐబియం వివిధ చారిటీలకు డొనేట్ చేసింది.

IBM-Watcon -2

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మరో ఆసక్తికరమైన విషయం వాట్సనుడిలో ఉంది. వక్తృత్వ పోటీలయిపోయాయి, ఇప్పుడు వంటలు! ఐబియం వాళ్ళు ఒక క్రొత్త అప్లికేషన్ ని వాట్సనుడికి అంటగట్టారు.. అదే కమ్మని వంటకాలను చేసి కాదు చెయ్యమని అందించడం.  24 గంటలు కస్టమర్లతో లైన్లు బారే ఫుడ్ ట్రక్స్ కి ఈ క్రొత్త అప్లికేషన్ తో వాట్సన్ ని అందించారు ఐబియం వాళ్ళు.  ఈ కార్యక్రమాన్నంతా అమెరికన్ టెలివిజన్ లైవ్ షో లో “వాట్సన్ కోగ్ నేటివ్ కుకింగ్ ప్రోగ్రాం”  లో చూపించారు. వాట్సన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. మన అభిరుచుల్ని, ప్రాధాన్యతలని వాట్సన్ లో ఎంటర్ చేసేస్తే.. తనలో నిక్షిప్తమైవున్న ప్రపంచ దేశాల వంటకాల జాబితా నుండి..బెస్ట్ కాంబినేషన్లో ఎంటర్ చేసిన అభిరుచులని బట్టి.. వంటకాన్ని సజెస్ట్ చేస్తూ.. దాని తయారీని కూడా స్క్రీన్ మీద డిస్ ప్లే  చేస్తుందిట.  వాటిని తయారు చేసాక  కస్టమర్లు తిని.. పొగడని వాళ్ళంటూ లేరు.  ఇలా చెఫ్స్ కి కూడా చిటికెలో క్రొత్త క్రొత్త వంటకాలని సజెస్ట్ చేసి.. వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ది చేస్తొందీ ఈ టెక్నాలజీ.

ఇది అంతటితో ఆగలేదు సుమీ.. ఇన్నాళ్ళు అంటే గత 60 ఏళ్ళనుండీ ప్రోగ్రమాటిక్ కంప్యూటింగ్ సిస్టం మీద ఆధారపడ్డాం. కాని వాట్సన్ దీనికి డిఫరెంట్.  ఆన్ లైన్ షాపింగు చెయ్యవచ్చట.  ప్రతిరోజూ మనరోజుని ఎలా గడుపుతామో వాట్సన్ దాన్ని ప్రతిబింబిస్తున్నదట.  మనుష్యులతో మాట్లాడు తుందిట. వెర్బల్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేస్తుందిట.  జోక్స్ ని కూడా అర్ధం చేసుకుంటున్నదట.  ఇది ఇంకా ఇండియాలో అడుగుపెట్టలేదు.  దీని అమోఘమైన కృత్రిమ మేధస్సుతో ఇంటింటా మణిదీపం కాగలదు.  ఇప్పటికే టెక్నాలజీ పెరిగిపోయి ఎక్కడెక్కడో ఉన్న మనుష్యుల మధ్య దూరాన్ని తగ్గించేసింది. దేశ విదేశాలను కలిపేసి ఒకటే గ్రామీణ వాతావరణాన్ని కల్పించింది.  ఇక వాట్సనుడు వచ్చేసాడంటే.. ఏకంగా ప్రపంచాన్ని ఇంట్లోకే తెచ్చిపెట్టేస్తాడు… వేచి ఉందాం ఈ అద్భుతానికి !!!!

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *