March 28, 2024

ఆరాధ్య – 6

రచన: అంగులూరి అంజనీదేవి

”మీరేం చావొద్దు. అతన్నొక్కసారి పిలిపించి, మీ చిన్న తమ్ముడు దగ్గర కూర్చోబెడదాం!”

”ఎందుకు? వాడి దగ్గర కూర్చోబెట్టి అల్లుడికి మందు అలవాటు చేపిద్దామనా? అసలేంటే నీ ప్లానూ?”

”మందు కాదు. విందు కాదు. మీ తమ్ముడు చేత నాలుగు మంచి మాటలు చెప్పిద్దాం!”

”మంచిమాటలా! దయ్యాలు వేదాలు వల్లించినట్లు వాడి దగ్గర మంచిమాట లెక్కడున్నాయే! వాడసలే కొట్టి మాట్లాడే రకం. దానివల్లనే వాడి పిల్లలకి కూడా పెళ్లిళ్లు కాలేదు. అమ్మాయిలు బాగున్నారని నచ్చి ముందుకొచ్చిన వాళ్లు కూడా ”అబ్బో! వాళ్లబ్బ రౌడీ! ఆ తలనొప్పి మాకెందుకు?” అని తిరిగి చూడకుండా వెళ్లిపోతున్నారు. అలాంటివాడితో అల్లుడికి మంచిమాటలు చెప్పిస్తావా? కొంచెమైనా జ్ఞానముందా నీకు?”

”మంచిమాటలా! పాడా! అమ్మాయిని బాగ చూసుకోమని బెదిరించి పంపిస్తే సరిపోతుంది. ఇక మన జోలికి రాడు. మనం ఏం చేసినా నోరెత్తడు. మనం పెళ్లిలో ఇస్తామని చెప్పిన డబ్బులు, బంగారం, ప్లాట్‌ ఇవేమీ ఇవ్వకపోయినా ఏం కాదు” అంది.

”నీలాగా ఆలోచించేవాళ్లు వుండబట్టే అత్తగారిళ్లకు వెళ్లిన ఆడపిల్లలకి ఓ గౌరవం, విలువ లేకుండా పోతున్నాయి. అవి లేనప్పుడు ప్రేమాభిమానాలు ఎక్కడ నుండి వస్తాయి? నీరు, నీడ లేని అడవిలో బొంతల్లా పడి వుంటున్నారు. నా బిడ్డకి అలాంటి గతి వద్దు. నువ్వు హైదరాబాదు వెళ్లు ఆరాధ్యా!” అన్నాడు కూతురు వైపు తిరిగి శాంతారాం.

భర్త చెప్పేది నచ్చక ఒక్క ఉదుటున లేచి బయటకెళ్లింది రమాదేవి. వెళ్లి షాపులో కూర్చుంది.

”డాడీ! నేను హైదరాబాదు వెళ్లాలీ అంటే ఆయన నగల కోసం నాకు ఇచ్చిన మూడు లక్షలకి నేను సమాధానం చెప్పాలి. ఈ నగలు ఇక్కడే వుంచండి! డబ్బులిస్తే తీసికెళ్తాను” అంది.

”అంత డబ్బు ఇప్పుడు ఎక్కడ నుండి వస్తుంది ఆరాధ్యా!”

”మమ్మీ నగలు ఫ్యూరేగా నాన్నా!వాటిని తీసికెళ్తాను. ఈ లోపల నువ్వు డబ్బులు రెడీ చేసి కాల్‌చెయ్యి నగలిచ్చి డబ్బులు తీసికెళ్తాను. ప్రస్తుతం మా అవసరాలు కూడా తీరతాయి” అంది.

”వాటిని తీసికెల్తే మీ మమ్మీ బాధ పడుతుంది ఆరాధ్యా!”

”దేనికి డాడీ బాధ?”

”అదంతే ఆరాధ్యా! వాటిమీద ఎప్పటినుండో మమకారం పెంచుకొని వుంది మీ మమ్మీ!” అన్నాడు.

”మమ్మీకి నామీద కూడా మమకారం వుందిగా డాడీ!” అంది ఆరాధ్య.

”అది వేరు. ఇది వేరు తల్లీ!” అన్నాడు శాంతారాం.

”అదేంటో నాకర్థం కావటం లేదు డాడీ!”

”సునీల్‌కి పెళ్లయితే వాటిని వాడి భార్యకి ఇచ్చుకోవాలని వుంది ఆరాధ్యా! ఇప్పుడు నువ్వు వాటిని తీసికెళ్తే బాధపడుతుంది. వద్దని చెప్పదు. మంచమెక్కి దిగులు పడుతుంది. నీకు తెలుసుగా మీ మమ్మీ తత్వం. దాన్నెందుకు చెప్పు ఈ వయసులో బాధపెట్టటం…”

”అయితే నన్నేం చేయమంటారు డాడీ?”

”నిదానంగా పంపిస్తానమ్మా! నేను హేమంత్‌కి కాల్‌ చేసి చెప్పాను. మళ్లీ కూడా కాల్‌ చేస్తానని చెప్పాను. నీకు చెప్పలేదా?”

”చెప్పారు”

”మరి ఇంత లోపలే తొందరేంటి? పంపిస్తానన్నానుగా! నామీద నమ్మకం లేదా? నేనెటుపోతాను చెప్పు!”

”మరీ అంత నిష్ఠూరంగా మాట్లాడకండి డాడీ! మనం తప్పు చేశాం! ఇది చాలా సున్నితమైన సందర్భం. నాకు మీరు కావాలి… ఆయనా కావాలి”

”అదేనమ్మా! అందరం బాగుండాలి. ముఖ్యంగా నువ్వు బాగుండాలి. కొద్దిరోజులు ఇక్కడే వుండు. హేమంత్‌ వచ్చి తీసికెళ్తాడు”

”ఇక్కడ వుంటే నా ఉద్యోగం పోతుంది డాడీ!”

”సరే! వెళ్లు! నువ్వు వెళ్లినా మా ఇద్దరి మనసు నీ దగ్గరే వుంటుందమ్మా! ఎలా వుంటావో ఏమో అని…” అన్నాడు.

”అందరం మంచివాళ్లమే డాడీ! అందుకే బాగుంటాం! కానీ పరిస్థితులు కూడా బాగుండాలిగా!” అంది ఆరాధ్య.

”పరిస్థితులదేముందమ్మా! మనం ఎలా తిప్పుకుంటే అలా తిరుగుతాయి”

”అవి తిరగవు డాడీ! మనం తిరుగుతాం. ఈ నగలు మీ దగ్గర వుంచండి! హేమంత్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ తీసుకొని డబ్బులు ఆయన అకౌంట్లో వేయండి! తొందరేం లేదు. టెన్షన్‌ పడకండి!” అంది ఆరాధ్య.

శాంతారాం నిజంగానే సంతోషపడ్డాడు.

ఆరాధ్య తల్లి దగ్గరకి వెళ్లి షాపులో కూర్చుంది.

”ఎందుకమ్మా ఇలా వచ్చావు?”

”నీతో మాట్లాడాలని వచ్చాను మమ్మీ!”

”అయితే ఇంట్లోకి పద. అక్కడ మాట్లాడుకుందాం!” అంటూ వెంటనే షాపు షెట్టర్‌ కిందకి లాగి ఆరాధ్యను ఇంట్లోకి తీసికెళ్లింది రమాదేవి. ఆరాధ్యను ఎప్పుడూ షాపులో కూర్చోనివ్వదు. పదిమంది వచ్చిపోతుంటారు. ఆరాధ్యను చూస్తే బావుండదని షాపులోకి రానివ్వదు.

ఇంట్లోకి వెళ్లాక ఆరాధ్య వైపు ప్రశాంతంగా చూసి ”మాట్లాడు ఆరాధ్యా!” అంది రమాదేవి.

”డాడీ హేమంత్‌ అకౌంట్లో మనీ వేస్తాడట మమ్మీ! నన్ను హైదరాబాదు వెళ్లమంటున్నాడు”

”నువ్వేమన్నావు?” వెంటనే అడిగింది రమాదేవి.

”వెళ్తానన్నాను. కానీ డాడీని కొంచెం త్వరగా మనీ వెయ్యమని చెప్పు మమ్మీ! లేకుంటే హేమంత్‌ ఊరుకోడు”

”ఆయన దగ్గర డబ్బులెక్కడివే! అన్నీ దొంగమాటలు. నిన్ను హేమంత్‌ దగ్గరకి పంపాలని వెదవ నాటకాలు ఆడుతున్నాడు. ఏం అవసరం లేదు. నువ్వు హేమంత్‌ దగ్గరకి వెళ్లకు…”

”మరి నేను ఎక్కడ వుండాలి?”

”హైదరాబాదులో లేడీస్‌ హాస్టల్సేమైనా కరువయ్యాయా? ఎక్కడుండాలి అంటావ్‌! వెళ్లి హాస్టల్లో వుండు” అంది రమాదేవి.

”పెళ్లయ్యాక హాస్టల్లో వుంటే బాగుండదు మమ్మీ! బయట విషయాలు నీకు తెలియవు. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్‌!” అంది ఆరాధ్య.

”అయితే మీ ఫ్రెండ్సెవరైనా వుంటే వాళ్ల దగ్గరకి వెళ్లి వుండు”

”ఇదంతా ఎందుకు? ఆ డబ్బులేవో ఇస్తే హేమంత్‌ దగ్గరే వుంటాను కదా!”

”అవే వుంటే వాడిచేత ఇన్ని మాటలు పడతామా?” అంది బాధగా రమాదేవి. నన్ను అర్థం చేసుకో అన్నట్లు కళ్లనీళ్లు తుడుచుకుంది. అల్లుడ్ని తిట్టింది. ”ఏం అల్లుడో ఏమో అత్తంటే గౌరవం లేదు. బావమర్ధి అంటే ప్రేమ లేదు. మామ అంటే లక్ష్యం లేదు” అంటూ గొణిగింది.

ఆరాధ్యకు ఆందోళన మొదలైంది… ఎంత అడిగినా తల్లి డబ్బులిచ్చేటట్లు లేదు. తను ఏ ముఖం పెట్టుకొని హేమంత్‌ దగ్గరకి వెళ్లాలి? వెళ్లినా ఒక్కరోజు మౌనంగా వుండి మళ్లీ రోజూ డబ్బుల ప్రసక్తి తీసుకురాడా? అన్ని డబ్బుల్ని తనెక్కడ నుండి తేవాలి? ఫ్రెండ్స్‌ని అడిగినా అంత డబ్బు ఇస్తారా? ఒకవేళ ఫ్రెండ్స్‌ దగ్గర అప్పు చేస్తే హేమంత్‌ ఇప్పుడు పడ్తున్న ఇబ్బందుల్నే తను పడాల్సి వస్తుంది. అప్పుడు నెలనెలా కడుతున్న చిట్టీ ఆగిపోతుంది. అప్పు ఎందుకులే చెయ్యటం అనుకుని డబ్బుల్లేకుండా వట్టిచేతులతో వెళ్తే హేమంత్‌ ఏమంటాడో ఏమో! ఆ డబ్బులు గుర్తొచ్చినప్పుడల్లా ఆవేశపడొచ్చు. కొట్టొచ్చు. తిట్టొచ్చు. ఎంతయినా అవి డబ్బులు కదా! అందుకే భయంగా వుంది. తల్లి చెప్పినట్లు ఫ్రెండ్స్‌ దగ్గరకి వెళ్లాలని లేదు భర్త దగ్గరకే వెళ్లి వుండాలని వుంది. కానీ భర్త దగ్గరకి వెళ్లి వుంటే ఆత్మాభిమానం కొంచెం కూడా వుండదు. ఆత్మగౌరవాన్ని పూర్తిగా చంపుకోవాలి. అనుక్షణం అతన్ని తప్పించుకు తిరగాలి. దొంగలా వుండాలి. దొంగ బ్రతుకు తనకి ఇష్టంలేదు. అందుకే వెంటనే కిచెన్‌లోకి వెళ్లి తలుపు గడియపెట్టుకుంది ఆరాధ్య.

”ఎందుకే తలుపు మూసుకుంటావ్‌! నువ్వు బయటికిరా నీతో మాట్లాడాలి” అంటూ ఏదో అనుమానం వచ్చి ఏడ్చింది రమాదేవి. ఎంతసేపయినా ఆ ఏడుపు ఆగలేదు. తల్లి ఏడుపు వినలేక బయటకొచ్చింది ఆరాధ్య.

ఆరాధ్యతో రమాదేవి చాలాసేపు మాట్లాడింది.

తల్లి చెప్పినట్లు విని ఆ రాత్రి బయలుదేరి హైదరాబాదుకి వెళ్లింది ఆరాధ్య.

 

* * * * *

ఉదయాన్నే నిద్రలేచి ఎదురుగావున్న మిల్క్‌ పాయింట్‌ దగ్గరకెళ్లి పాల పాకెట్‌ కొనుక్కొని నాలుగు అడుగులు వెయ్యగానే, బ్యాగ్‌ తగిలించుకొని నడుచుకుంటూ వస్తున్న ఆరాధ్య కన్పించింది వాత్సల్యకి…

చూడగానే ఆశ్చర్యపోతూ ”ఏంటీ! ఈ టైంలో ఇటొస్తున్నావ్‌! ఎక్కడికెళ్తున్నావ్‌?” అడిగింది వాత్సల్య.

ఎప్పుడైనా వెంటనే సమాధానం చెప్పే ఆరాధ్య, మౌనంగా మెడచుట్టూ వున్న చున్నీని ఇంకాస్త దగ్గర చేసి పట్టుకుంటూ, జారిపోకపోయినా భుజానికి  వున్న బ్యాగ్‌ సరిచేసుకుంటూ నడుస్తోంది.

వాత్సల్య ఆరాధ్యకు మరికాస్త చేరువై భుజాలచుట్టూ చేయివేసి ”చెప్పవే?” అంది.

ఆరాధ్య మాట్లాడకపోవటంతో ఏదో గుచ్చుకుంటే అరిచినట్లు ఓ చిన్న అరుపు అరిచి ఆరాధ్య భుజాల చుట్టూ వేసిన చేతిని తీసేసింది వాత్సల్య.

”అర్థంకాక ”ఏమైందే? నా భుజం కత్తిలాగ గుచ్చుకుందా? అరిచావ్‌?” అడిగింది ఆరాధ్య.

”భుజం కాదు. నీ జుట్టు. చెత్తమీద చేయి పెట్టినట్లు ఆ జుట్టేంటే అంత రఫ్‌గా, అంత పొడవుగా మరీ హెవీగా వుంది. వీపంతా జుట్టే! దగ్గరకొచ్చి ముట్టుకుంటే చాలు చెంపలు, చేతులు గీరుకుపోయేలా వున్నాయ్‌! హేమంత్‌ ఎలా మేనేజ్‌ చేస్తున్నాడే!” అడిగింది వాత్సల్య.

హేమంత్‌ పేరు వినగానే పైకి ప్రకటించలేని చలనం కలిగింది ఆరాధ్యలో.

వెంటనే క్లిప్‌ పెట్టి వదిలేసి వున్న ఆరాధ్య జుట్టును గుప్పెట పట్టి పైకి లేపి వీపుపైకి నెమ్మదిగా వదులుతూ సరదాగా నవ్వింది వాత్సల్య.

”అప్పటి కవులు ఏం చూసేవారే ఈ జుట్టులో? అంగుళం, అంగుళం కొలుచుకుంటూ కవిత్వం చెప్పేవాళ్లట. నాకయితే గుచ్చుకోవటం తప్ప ఇంకే ఫీలింగ్‌ రావటం లేదు” అంది అల్లరిగా వాత్సల్య.

”కవుల సంగతి నాకు తెలియదు. హేమంత్‌ మాత్రం నా జుట్టుని బాగా మెచ్చుకునేవాడు” అంది ఆరాధ్య వాత్సల్య వైపు తిరిగి.

అప్పుడు చూసింది వాత్సల్య ఆరాధ్య ముఖంలోకి ”ఏంటే అలా వున్నావ్‌?” అంటూ నుదుటిమీద చేయిపెట్టి చూసి ”వేడిగా వుందేంటి జ్వరమా?” అడిగింది.

”జ్వరమేం లేదు. మా ఊరు వెళ్లాను. రాత్రంతా జర్నీ చేసి వచ్చాను కదా! అందుకే అలా వుందేమో!” అని ఆరాధ్య చెబుతుంటే ఆరాధ్య మొబైల్‌ రింగయింది. లిఫ్ట్‌ చేసి

”హలో… మమ్మీ! ఇప్పుడే ట్రైన్‌ దిగి వాత్సల్య దగ్గరకి వెళ్తున్నా…” అంది.

అవతలవైపు నుండి రమాదేవి ”మంచిపని చేస్తున్నావు ఆరాధ్యా! వాడి దగ్గరకి వెళ్తే ఒకసారి కాకపోయినా ఒకసారి ఫ్యూర్‌నగలు తెమ్మని టార్చర్‌పెడతాడు. నాకు తెలిసి వాడికి దూరంగా వుండటమే బెటర్‌” అంది. తల్లి గొంతులో చాలా సంతోషం విన్పించింది ఆరాధ్యకి.

ఆరాధ్య తల్లితో మాట్లాడుతుండగానే వాత్సల్య వుండే ఇల్లొచ్చింది.

”రావే!” అంటూ వాత్సల్య ఆరాధ్య చేయిపట్టుకొని ఆప్యాయంగా లోపలికి తీసికెళ్తూ ”నిన్ను చూస్తుంటే ఏదో సమస్యతో సతమతమవుతున్నట్లు భారంగా అన్పిస్తున్నావు. ఏం జరిగింది?”

”హేమంత్‌ ఇంట్లో లేడు. అతను లేకుండా ఇంట్లో వుండలేక ఇలా వచ్చాను” అంటూ అబద్ధం చెప్పింది. తర్వాత నెమ్మదిగా నిజం చెప్పొచ్చులే అనుకుంది.

”నాకు తెలిసి హేమంత్‌ ఎక్కడికీ వెళ్లడు. ఒకవేళ అతను ఇంట్లో లేకపోయినా అలవాటు చేసుకోవాలి. నైబర్స్‌ ఎవరో ఒకరు వుంటారుగా. తోడు పడుకోబెట్టుకుంటే సరి” అంది.

వాత్సల్య వాళ్ల రూంమేట్‌ సరయు ఇంకా నిద్ర లేవలేదు. సరయు కూడా వాత్సల్యతో పాటే సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తోంది. ఇద్దరు కలిసి చాలా రోజులుగా ఆ ఇంట్లో వుంటున్నారు.

వాత్సల్య కిచెన్‌లోకి వెళ్లి కాఫీ పెడుతూ ”రోజూ ఈ టైంలో కాఫీ నువ్వు పెడతావేమో కదా! ఇవాళ నా చేతి కాఫీ టేస్ట్‌ చూడు” అంది.

”నేను పెట్టను. హేమంత్‌పెడతాడు. మా ఇద్దరికి బాక్స్‌లోకి అన్నం, కర్రీ కూడా అతనే ప్రిపేర్‌ చేస్తాడు”

”అలా అయితే కష్టం కదా!”

”ఎవరికి?”

”హేమంత్‌కి…”

”ఇక ముందు ఆ కష్టం హేమంత్‌కి వుండదులే!”

”ఎందుకుండదు. మొన్న ఇంటికెళ్లి వంటేమైనా  నేర్చుకొని వచ్చావా ఏం?”

”లేదు. మా మమ్మీ నేను వంట ఇంట్లోకి వెళితేనే తిడుతుంది. కాళ్లు విరగ్గొడతా అంటుంది”

”అదేంటి?”

”ఈ రోజుల్లో అమ్మాయిలు వంటలు చెయ్యరట… నన్ను బి.టెక్‌ చేయించింది వంట చెయ్యటానికి కాదట. అందుకే నాకు వంటరాదు”

”మరి హేమంత్‌ ఏమీ అనడా?”

”ప్రేమ ఎక్కువగా వున్నప్పుడు ఏమీ అనడు. తక్కువగా వున్నప్పుడు మాత్రం…” అంటూ ఆరాధ్య వాత్సల్య ఇచ్చిన కాఫీ కప్పు అందుకొంది.

తను కూడా ఓ కాఫీ కప్‌ పట్టుకొని ఇంట్రెస్టింగ్‌గా ”ఆ… చెప్పు! చెప్పు! తక్కువగా వున్నప్పుడు ఏమంటాడు?” అంది.

ఆరాధ్య వెంటనే చేతిలో వున్న కప్పుని స్టౌపక్కన పెట్టి మెడచుట్టూ వున్న చున్నీని నడుంకి కట్టుకొని హేమంత్‌లా యాక్షన్‌ చేస్తూ నాలిక మడతపెట్టి

”అసలు మీ మమ్మీ ఇన్ని రోజులు నీకు వంటనేర్పకుండా ఏం చేసిందే? వంట రాదు, టైంకు నిద్ర లేవడం రాదు. చేసిపెట్టింది తినడం రాదు.అదేం అంటే మా అమ్మాయి అంటే మాకు ప్రేమంటారు! ఏం ప్రేమే మీవాళ్ల ప్రేమ. అసలు మీ వాళ్ళకి నీమీద ప్రేమ వుందా? వుంటే ఇలాగేనా వుండేది?” అని ఎంత వుడుక్కుంటాడో” అంది.

ఆరాధ్య చెప్పే విధానం చూసి వాత్సల్య తనలో తాను నవ్వుకుంటూ ఒక కప్పు కాఫీని చిన్న సైజు ప్లాస్క్‌లో పోసింది ”ఇది సరయు లేవగానే తాగి స్నానం చేసి రెడీ అవుతుంది.  నేను ఈ లోపల వంటచేసి తనకు నాకు బాక్స్‌ రెడీ చేస్తాను. నీక్కూడా ఇవాళ ఇక్కడే బాక్స్‌ పెడతాను. రెడీ అవ్వు ఇంకో వారం రోజుల వరకు వంట డ్యూటి నాదే. ఆ తర్వాత వారం సరయు చేస్తుంది”

”బావుంది మీపని…” అంది ఆరాధ్య.

”బాగుందా! ఏం బాగుందే! ఈ ఇంట్లో నేను, సరయు ఇద్దరమే అయ్యాం. ఇంకో మెంబర్‌ మాతో కలిస్తే ఎకనామికల్‌గా సపోర్ట్‌ వుండేది. అన్నీ షేర్‌ చేసుకునేవాళ్లం.అన్నీ అంటే రెంట్‌, కరెంట్‌, రేషన్‌ ఎట్‌సెట్రా! అదే ఆలోచిస్తున్నాం! మన ఆఫీసులోనే సింగిల్‌గా ఎవరైనా వుంటే మా గదిలో జాయిన్‌ చేసుకుందామని…” అంది వాత్సల్య. ఒకప్పుడు ఏ ఐటమ్‌ ఎంత రేటు వుండేదో ఇప్పుడుఎంత పెరిగిందో వివరించింది. వాత్సల్య చెప్పేది నిజమే. ఆదాయం పెరిగింది. అంతకు మించిన ఖర్చులు పెరిగాయి. అవసరాలు ఎక్కువయ్యాయి. వాటికి తగినట్టుగా పోటీ పెరిగింది. పోటీపడాలన్న ఫ్యాషన్‌ పెరిగింది.

సరయు అప్పుడే నిద్రలేచి ప్లాస్క్‌లో వున్న కాఫీ తాగుతూ వాళ్ల దగ్గరకి వచ్చింది. వాత్సల్య ఆరాధ్యను సరయుకు పరిచయం చేసింది.

ముగ్గురు రెడీ అయి ఆఫీసుకెళ్లారు.

 

* * * **

ఆరాధ్య ఊరెళ్లి పదిరోజులు దాటినా తిరిగా హైదరాబాదు రాలేదని హేమంత్‌ ఆలోచనలో పడ్డాడు. ఫోన్‌ చేస్తే ఆరాధ్య లిఫ్ట్‌ చెయ్యటం లేదు. వాళ్ల నాన్న గారు కూడా అంతే! చెయ్యగా, చెయ్యగా ఒకసారి రమాదేవి లిఫ్ట్‌ చేసి ”వస్తుందిలే బాబు! తొందరేముంది?” అంది.

వాళ్లకి తొందర లేకపోవచ్చు తనెలా వుండాలి? కంప్యూటర్‌ ముందు కూర్చొని వర్క్‌ చేస్తుంటే కళ్లకి ఆరాధ్యనే కన్పిస్తోంది.ఒకటి చెయ్యబోయి ఇంకొకటి చేస్తున్నాను. ఇంకొకటి చెయ్యబోయి మరొకటి చేస్తున్నాను. డిలీట్‌ చెయ్యాల్సిన వాటిని వుంచుతున్నాను. వుంచాల్సిన వాటిని డిలీట్‌ చేస్తున్నాను. మైండ్‌ మొత్తం డిస్టర్బడ్‌గా వుంది. ఎటూ ఆలోచించలేకపోతున్నాను. ఏం చేయలేకపోతున్నాను. వాళ్లకేం వాళ్లేమైనా మాట్లాడతారు.

ఆరాధ్య తల్లిదండ్రులు ఎలాంటివారో హేమంత్‌కి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సునీల్‌కి కడుపు నిండా తిండిపెట్టి పెంచితే కూతురికేమో ”నువ్వంటే మాకు ప్రేమ” అంటూ మాయను పెట్టి పెంచారు. ఆ మాయ వల్లనే, ఆ మోసపు మాటల వల్లనే ఆరాధ్య మూర్ఖంగా తయారయింది. ఆ మూర్ఖానికి తోడుగా పెళ్లికి ముందు ఏం నూరిపోశారో ఏమో పెళ్లి అయిన క్షణం నుండే చెప్పినమాట వినేది కాదు. ప్రేమగా మాట్లాడేది కాదు. ప్రేమగా చూసేది కాదు. అలిగేది. ఆవేశపడేది. పిచ్చిగా అరిచేది. ఎంత ముద్దు చేసినా అలక నుండి దిగేది కాదు.

తినమని చెప్పగానే తినదు. పిలవాలి. బ్రతిమాలాలి. ఎప్పుడో తింటుంది. దాని కోసం గంటలు గంటలు టైం పడుతుంది. అప్పటికే మిడ్‌నైట్‌ దాటేది. ఏ ఐటమ్‌ చేసి పెట్టినా నచ్చేది కాదు. ‘నువ్వు చేసింది ఒక్కటి కూడా మా మమ్మీ చేసినట్లు లేదు. టేస్ట్‌లెస్‌. తినలేకపోతున్నా… ఆకలిని తట్టుకోలేక రోజంతా జ్యూస్‌లు తాగి, తాగి చచ్చిపోతానేమో!’ అంటుంది. ఏదో పెద్ద నేరం చేసినవాడిని చూసినట్లు చూస్తుంది. అలా ఎందుకు చూస్తుందో ఒక్కోసారి అర్థంకాక ”ఎందుకలా చూస్తావ్‌ ఆరాధ్యా?” అని అడిగితే

”నాకు యాపిల్‌ కంపెనీ లాప్‌ట్యాప్‌ని వాడాలని వుంది. మీరేమో ‘ఇంట్లో నుండి కనెక్టయి చేసే ఆఫీస్‌ వర్క్‌ నీకేముంటుంది’ అంటారు. వర్క్‌ లేనంత మాత్రాన లాప్‌టాప్‌ కొనరా? ఆఫీస్‌ వర్క్‌ లేనంత మాత్రాన లాప్‌టాప్‌తో వేరే అవసరాలేం వుండవా? మీకేం! మీరు కంపెనీ వాళ్లు ఇచ్చిన ల్యాప్‌టాప్‌ని వాడుతున్నారు. మీరు ఓ.కె. మరి నేను?నేను కూడా మీలాగే బి.టెక్‌ చేసిన అమ్మాయిని కదా! నాకుండదా లాప్‌టాప్‌ యూజ్‌ చెయ్యాలని? యాపిల్‌ కంపెనీ కాకపోయినా కనీసం లెనోవా కంపెనీదైనా కొనివ్వొచ్చు కదా! ఎన్నిసార్లు రిపీట్‌ చేసి అడిగినా ‘నో’ అంటారే కాని కొనిస్తున్నారా? ఆ మాత్రం డబ్బుల్లేనప్పుడు పెళ్లెందుకు చేసుకున్నారు? అసలు పెళ్లికి ముందు నాకు ఎన్నెన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ వుండేవి. అవన్నీ రివర్సయ్యాయి” అంటూ ముఖం పక్కకి తిప్పేసుకుంటుంది. అటు తిప్పిన ముఖం ఇటు తిరగాలీ అంటే దానికో రోజు పట్టేది. అయినా భరించాడు. కొద్దికొద్దిగా మార్చుకోవచ్చులే అనుకున్నాడు. ఈ లోపలే గోల్డ్‌ గొడవ వచ్చి వెళ్లిపోయింది. వెళ్లిపోయినా ఇన్నిరోజులా వుండేది? వెంటనే రావొద్దా! కనీసం ఫోన్‌ అయినా చెయ్యొద్దా! అక్కడే వుండిపోతే ఇక్కడ జాబ్‌ సంగతేంటి? ఆ జాబ్‌ రావటానికి తనెంత కష్టపడ్డాడు? అది తెలిసే ఇన్నిరోజులు వుందా?

కాశిరెడ్డితో జరిగింది మొత్తం చెప్పాడు హేమంత్‌. అది విని కాశిరెడ్డి ఆశ్చర్యపోలేదు. ‘గోల్డే కాదు హేమంత్‌! రిసెప్షన్‌లో ఆరాధ్యకి వాళ్లు కట్టిన చీర కూడా నువ్వు ఇచ్చిన ఇరవై అయిదువేలు చేసి వుండదని మా వదినలు అప్పుడే అన్నారు. వాళ్లు మన దగ్గర షాపింగ్‌ చెయ్యకపోవటం కూడా ఇలా చెయ్యాలన్న ప్లాన్‌తోనే! అది విని నాకే అన్పించింది మోసాలు ఇలా చేసేవాళ్లు కూడా వున్నారా అని… డబ్బు పాపిష్టిది. ఏమైనా చేయిస్తుంది. కానీ నువ్వు ఇవేం మనసులో పెట్టుకోకుండా వాళ్ల ఊరెళ్లి ఆరాధ్యను తీసుకురా!” అన్నాడు.

కళ్యాణమ్మ కూడా అదే చెప్పింది. ”నువ్వు ఆరాధ్యను ఎక్కువ రోజులు వాళ్ల మమ్మీకి దగ్గరగా వుంచొద్దు హేమంత్‌! ఎందుకంటే ఇంతవరకు నువ్వు చెప్పినదాన్నిబట్టి చూస్తుంటే ఆరాధ్య మీద వాళ్ల మమ్మీ ప్రభావం ఎక్కువగా వున్నట్లనిపిస్తోంది. నిజానికి రమాదేవికి వాళ్ల కూతురంటే ప్రేమకన్నా అసూయనే ఎక్కువగా వుంది. ఆ అసూయతోనే కూతురు వైభవాన్ని కంటినిండుగా చూడలేక ఆరోజు రిసెప్షన్‌లో ఒకరికి తెలియకుండా ఒకర్ని రెచ్చగొట్టింది. ఆవిడ తత్వం ఇదీ అని తెలియని వాళ్ల బంధువులంతా కాట్లకుక్కల్లా అరుచుకున్నారు. పనిలో పనిగా రమాదేవి నన్నుకూడా అనవసరంగా బ్లేమ్‌ చేసింది. ఆవిడ దగ్గర నాలాంటి వాళ్లు ఒక్కక్షణం వుండాల్సి వచ్చినా తమ హుందాతనాన్ని పక్కన పెట్టి ఆమెలాగే చిల్లరగా బిహేవ్‌ చెయ్యాల్సి వస్తుంది. నాకు అలా చెయ్యటం ఇష్టం లేకనేమో అంకుల్‌ని తీసుకొని ఇంటికెళ్లిపోయాను. మేమలా వెళ్లిపోతే నువ్వు బాధపడతావని నాకు తెలుసు. కానీ నేను బాధపడుతూ అక్కడ వుండలేకపోయాను. పెళ్లిళ్లలో ఇలాంటివి మామూలే! ఇప్పుడు నీకు ఆరాధ్య ముఖ్యం. వెంటనే వెళ్లి ఆరాధ్యను హైదరాబాదు తీసుకురా! వాళ్ల దగ్గర వుంచొద్దు” అంది.

కాశిరెడ్డి, కళ్యాణమ్మ చెప్పింది విని ఆరాధ్యను  తీసుకురావాలని ఊరు బయలుదేరాడు హేమంత్‌.

* * * *

హేమంత్‌ ట్రైన్లో కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు.

అతనికి ఎప్పుడెప్పుడు ఆరాధ్యను చూద్దామా అని వుంది.

అతనికి ఎదురుగా వున్న సీట్లో ఒక నడివయస్కురాలు కూర్చుని అతన్నే చూస్తోంది. ఆమె ఎందుకలా చూస్తుందో హేమంత్‌కి అర్థం కాలేదు. ఆమె అతన్ని చూడటమే కాదు. పలకరించాలని కూడా చూస్తోంది. మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గుతోంది. ‘ఈమె ఎవరు? నన్నే చూస్తోంది?’ అని మనసులో అనుకున్నాడే కాని అతనామె వైపు పరిశీలనగా చూడలేదు.

లాప్‌టాప్‌ ముందు పెట్టుకొని ఆఫీసు వర్కేదో వుంటే సీరియస్‌గా బ్రౌజ్‌ చేసుకుంటున్నాడు.

ఒక అర్థగంట ప్రయాణం చేశాక ”బాబూ! నీపేరు రాకేష్‌ కదూ!” అంది.

”నాపేరు రాకేష్‌ కాదమ్మా! హేమంత్‌!” అన్నాడు. అప్పుడు కూడా అతనామె వైపు చూడకుండా లాప్‌టాప్‌లో ఏదో సైట్‌ ఓపెన్‌ చేసే మూడ్‌లో వున్నాడు.

”నువ్వు అబద్దం చెబుతున్నావు. నీ పేరు రాకేష్‌నే!” అంది.

అప్పుడు చూశాడు ఆమె వైపు హేమంత్‌. అతని చూపులు ఆమె ముఖం మీదకి మళ్లకముందే చేతి మీద గాయాన్ని చూశాయి. అది చాలా పాత గాయం. చూడగానే మనసు కళుక్కుమంది.

”అమ్మా! మీరేదో కన్‌ఫ్యూజన్‌లో వున్నారు” అన్నాడు చాలా నమ్రతగా. అతనంత నమ్రతగా మాట్లాడటానికి కారణం ఆమెలోని హుందాతనం. వేష భాషలు. అతని వయసు అబ్బాయిలు ఎవరైనా ఆమెను చూడగానే ‘అమ్మా!’ అని మర్యాద ఇస్తూ మాట్లాడేలా వుందామె.

”నాకు స్పష్టంగా తెలుసు. నువ్వు రాకేష్‌వే! నీకు ఆరాధ్య తెలుసు కదూ?”

”తెలుసు. ఆరాధ్య నా భార్య. రాకేష్‌ మాత్రం నా పేరు కాదు”

”వాత్సల్య నిన్న ఫోన్లో ఆరాధ్య గురించి చెప్పినప్పుడే అనుకున్నాను. ఆరాధ్యను నువ్వే పెళ్లి చేసుకొని వుంటావని, పెళ్లయి మూడు నెలలు కాకముందే మోజు తీరి వదిలేసి వుంటావని…”

”ఆరాధ్యను నేను వదిలేశానా? వాత్సల్య అలా ఎందుకు చెప్పింది?”

”అబద్ధం చెప్పలేక… ఎందుకంటే ఇప్పుడు ఆరాధ్య వుండేది వాత్సల్య దగ్గరే కాబట్టి…”

షాక్‌ తిని ”ఆరాధ్య వాత్సల్య దగ్గర వుందా? ఊరెళ్లిన ఆరాధ్య వాత్సల్య దగ్గర ఎందుకుంది? ఈ మధ్యన సిమ్‌ ఛేంజ్‌ చేసిందో ఏమో వాత్సల్య నాకు కాంటాక్ట్‌లో లేదు”అన్నాడు.

”మనసు మంచిది కానప్పుడు మంచి పనులు చెయ్యనప్పుడు ఎవరూ మనకు కాంటాక్ట్‌లో వుండరు”

”ఎందుకమ్మా మీరింత కోపంగా మాట్లాడుతున్నారు? మీరెవరు?”

”నేనెవరైతే ఏంలే! ఆరాధ్యకు జాబ్‌ ఇప్పిస్తానని, హైదరాబాదు రమ్మని, రైలెక్కగానే హ్యాండిచ్చావు. ఇప్పుడు పెళ్లి చేసుకొని హ్యాండిచ్చావు! ఎందుకయ్యా అబ్బాయిలు మరీ ఇంత దిగజారిపోతున్నారు? వ్యక్తిత్వం వుండదా మీకు? రోజురోజుకి ఏం నేర్చుకుంటున్నారు” అని కోపంగా లేచి వాష్‌బేసిన్‌ వైపు వెళ్లింది.

బిత్తరపోయి చూశాడు హేమంత్‌.

ఆమెను చూస్తుంటే ఇప్పుడే కొత్తగా చూసినట్లు లేదు. ఎన్నో యుగాల ముందు నుండే చూసినట్లుంది. ముఖ్యంగా ఆమె నడక తన తల్లి నడకలా వుంది.ముఖం కూడా తన తల్లిలాగే వుంది. మాట్లాడుతున్నప్పుడు ఆ గొంతు కూడా అలాగే ఉంది.

వాష్‌బేసిన్‌ దగ్గర నుండి ఆమె తిరిగి రాలేదు. అక్కడే నిలబడి నాప్‌కిన్‌తో ముఖం తుడుచుకుంటోంది. ఈసారి ఆమెను పరిశీలనగా చూడాలనుకున్నాడు. ఆమె కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.

ఆమె వచ్చింది. ఎప్పటిలాగే తన సీట్లో కూర్చుంది. హేమంత్‌ వైపు చూడకుండా కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది. హేమంత్‌ మాత్రం ఆమె చేతిపై వున్న మచ్చనే చూస్తున్నాడు. ఆ మచ్చ ఇరవై సంవత్సరాల నాటిది. కాలం గతించినా మచ్చ మాత్రం అలాగే వుంది. దాన్ని చూస్తుంటే తండ్రి గుర్తొచ్చాడు హేమంత్‌కి… అప్పుడు హేమంత్‌ వయసు ల్యాబ్‌లో వచ్చిన మెడికల్‌ రిపోర్ట్స్‌ ప్రకారం ఆరు సంవత్సరాలు.

అతను హేమంత్‌ని వదిలెయ్యమని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె బాబును వదిలెయ్యనని భర్తతో తెగేసి చెప్పింది. ఆయన వినలేదు. ‘ఎన్నిసార్లు చెప్పాలే నీకు? వాడిని ఇంట్లో వుంచొద్దని… నా మాటంటే నీకు లెక్క లేదా? విలువ లేదా? నిన్నేం చేస్తానో చూడు” అంటూ ఇనుపరాడ్‌ను ఎర్రగా కాల్చి హేమంత్‌ కళ్లముందే ఆమె చేతిమీద పెట్టాడు. ఆమె కెవ్వున అరిచి ”నేనైనా చస్తాను కాని బాబును మాత్రం విడిచిపెట్టను” అంది మొండిగా. ఆయన రౌద్రంగా చూసి ఆమెను కాల్చిన చోటే మళ్లీ మళ్లీ కాల్చి బయటకెళ్లిపోయాడు. తల్లి ఏడుస్తుంటే హేమంత్‌ కూడా ఏడ్చాడు. ఆమె కాలిన బాధను కూడా పట్టించుకోకుండా హేమంత్‌ని ఆత్రంగా ఒడిలోకి లాక్కుంది. ”నా కన్నా! నా బాబు! నా తండ్రీ! ఎలా వదలాలిరా నిన్నూ! దేవుడు నాకెందుకీ శిక్ష వేశాడు. ఏం పాపం చేశానని…”అంటూ గొంతు నరాలు తెగేలా ఏడ్చింది. తల్లి చెంపల మీద కారుతున్న కన్నీళ్లను తుడిచాడు హేమంత్‌. గబుక్కున హేమంత్‌ చేతుల్ని పట్టుకొని అపురూపంగా చూసుకుంటూ ముద్దు పెట్టుకుంది. ఆ సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా హేమంత్‌ కదిలిపోతుంటాడు. ఇది తన జీవితంలోనే జరిగిందా! అని నిస్తేజంగా చూస్తూ కూర్చుంటాడు. ఫ్రెండ్స్‌ వచ్చి లేపేంత వరకు లేవడు. ఇప్పటికీ ఆ అనుభవాలను మరచిపోలేదు. తల్లినీ మరచిపోలేదు.

కళ్లముందు వున్నా లేకున్నా మనిషి తను చనిపోయే వరకు గుర్తుపెట్టుకునేది తల్లిని మాత్రమే! కారణం తల్లికి వుండే ఆధారాలు, ఋజువులు ఇంకే ప్రాణికి వుండవు. సృష్టిలో మనిషికి ఏ అనుబంధాన్నైనా ఒకరు పరిచయం చెయ్యాల్సిందే! కన్నతల్లి ఒడి వాసనను ఒకరు పరిచయంచెయ్యాల్సిన అవసరం వుండదు. ఎందుకంటే మనిషి పుట్టేది అక్కడే! ఉష్ణపక్షిలా సేదదీరేది అక్కడే!

ఆమె అలాగే కూర్చుని కిటికీపై మోచేయి వుంచి ఆలోచనగా బయటికి చూస్తోంది.

ఆమెకు ఎదురుగా కూర్చుని వున్న హేమంత్‌ ఆర్తిగా, ఆబగా, ఆర్ధ్రంగా, అపూర్వంగా ఆమెను చూస్తున్నాడు. ఈమె తన తల్లీ అన్న భావన అతనికి చాలా గొప్పగా అద్భుతంగా, అద్వితీయంగా వుంది. తనలో కలుగుతున్న ఎమోషన్స్‌ని కంట్రోల్‌ చేసుకుంటూ…

”అమ్మా! మీ పేరు లక్ష్మీ శార్వాణి కదూ?” అని నెమ్మదిగా అడిగాడు తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని…

ఆమె ఉలిక్కిపడింది. ఒక్కక్షణం ఆమె ఎక్కడుందో ఆమెకే అర్థం కాలేదు. ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె పేరుకు ముందు లక్ష్మీని తీసేసి చాలా కాలమైంది. ఉపేంద్ర కూడా శార్వాణి అనే పిలుస్తాడు. ఆమె ఎవరికి చెప్పినా శార్వాణి అనే చెబుతుంది. ఈ అబ్బాయికి తన పూర్తిపేరు ఎలా తెలిసింది?

”ఎవరు బాబు నువ్వు? నా పూర్తి పేరు చెబుతున్నావ్‌! అది నన్ను లోగడ అందరూ పిలిచిన పేరు. ఇప్పుడు వుట్టి శార్వాణినే! కానీ అప్పటి నా పేరు ఇప్పుడు నీకెలా తెలిసింది?” అంది.

హేమంత్‌ ఒక్కక్షణం మాట్లాడలేదు.

”చెప్పు బాబు! ఎవరు నువ్వు?”

”మీరు కని, ఆరు సంవత్సరాలు పెంచి, అంతు తెలియని వింత వ్యాధితో బాధపడుతున్న నన్ను డబ్బులు ఖర్చవుతాయని హాస్పిటల్లో చేర్పించకుండా ఎక్కడో వదిలేస్తే విధి నన్ను ఇంతవాడిని చేసి, ఇప్పుడు మళ్లీ ఎందుకో ఏమో నన్ను నీకు కనబడేలా చేసింది. కాదు కాదు నిన్ను నాకు కనబడేలా చేసింది. ఇది మరీ చిత్రంగా వుందమ్మా!” అన్నాడు.

విపరీతంగా చలించిపోయింది శార్వాణి. చెట్టంత పెరిగి, కత్తిలా చురుగ్గా వున్న ఈ అబ్బాయి తను కన్న కొడుకా? ఇంతవాడై మళ్లీ తనకు కన్పిస్తాడని ఆరోజు తను ఊహించిందా? దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ఎప్పుడు ఎవరికి ఏదివ్వాలో అప్పుడే ఇస్తాడంటారు. ఇలాంటిదేనా!! సంతోషంతో ఆమె నోట మాట ఆగిపోయింది. కంటి నిండుగా హేమంత్‌ను చూస్తూ రెప్పలు ఆర్పటం మరచిపోయింది.

”ఏంటమ్మా మాట్లాడకుండా చూస్తున్నావ్‌! ‘ఈ హేమంత్‌ ఎవరో! ఇతనేంటి నా కొడుకేంటి!’ అన్న అనుమానమా!!”

”లేదు హేమంత్‌! నా గతం నాకు గుర్తుంది. నువ్వూ నాకు గుర్తున్నావ్‌! కానీ ఎలాంటి పరిస్థితిలో నేనలా చెయ్యాల్సి వచ్చిందో! ఏమి ఆశించి చేశానో నీకు తెలియదు. తెలుసుకునేంత వయసు అప్పుడు నీకు లేదు. ఇప్పుడు చెబుతాను విను. లేకుంటే ‘మా అమ్మ నన్ను వదిలేసింది’ అన్న చెడు భావనే నీలో వుంటుంది. అది పోవాలి”

”అదంతా ఇప్పుడెందుకమ్మా! నాకు వాత్సల్య మొబైల్‌ నెంబర్‌ వుంటే ఇవ్వు. నువ్వు చెప్పింది నిజమైతే నేనిప్పుడే వాత్సల్యతో మాట్లాడాలి”

”నేను చెప్పింది నిజమే హేమంత్‌! ఒకప్పుడు ఆరాధ్య ఇదే ట్రైన్‌లో నాకు పరిచయమైంది. ఆమెకు జాబ్‌ ఇప్పిస్తాను హైదరాబాదు రమ్మని రాకేష్‌ అనే అబ్బాయి మోసం చేశాడు. అది తెలిసి జాలిపడి ఆమెను నాతో తీసికెళ్లాను. జాబ్‌ సర్చింగ్‌లో ఆమెకు వాత్సల్య అయితే హెల్ప్‌గా వుంటుందని వాత్సల్య  నెంబర్‌ ఇచ్చి వాత్సల్యను పరిచయం చేశాను. జాబ్‌ వచ్చేంత వరకు నా దగ్గరే షెల్టరిచ్చాను. కానీ ఒక రోజు అనుకోకుండా ఆరాధ్యని నీ బైక్‌ మీద చూశాను. రాకేష్‌తో తిరుగుతుందని అపార్థం చేసుకున్నాను. ఆమె ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా ఇంట్లోంచి వెళ్లగొట్టాను. అప్పటి నుండి ఆమె నాకు టచ్‌లో లేదు. కానీ వాత్సల్య ఫోన్‌ చేసినప్పుడు ఆరాధ్య గురించి చెబుతుంటుంది. ఇన్ని రోజులు తెలియదు కాని ఇప్పుడు ఆరాధ్య నా కోడలే అని తెలిసి ఆనందంగా వుంది. ఇదిగో వాత్సల్య మొబైల్‌ నెంబర్‌. మాట్లాడు” అంటూ తన సెల్‌ఫోన్‌లో ఫీడయివున్న వాత్సల్య మొబైల్‌ నెంబర్ని హేమంత్‌కి చూపించింది.

అతనా నెంబర్ని వెంటనే తన మొబైల్లో నొక్కి వాత్సల్యకి కాల్‌ చేశాడు.

వాత్సల్య హేమంత్‌ కాల్‌ని లిఫ్ట్‌ చెయ్యలేదు.

నాలుగుసార్లు ట్రై చేసినా ఆమె లిఫ్ట్‌ చెయ్యలేదు.

శార్వాణికి అర్థమైంది. ”నువ్వాగు హేమంత్‌! నేను నా మొబైల్లోంచి కాల్‌ చేసి మాట్లాడతాను. తనకి నీ కాల్‌ని లిఫ్ట్‌ చెయ్యటం ఇష్టం లేనట్లుంది” అంది.

హేమంత్‌ ”సరే! అమ్మా! మాట్లాడు” అన్నాడు.

హేమంత్‌ ”అమ్మా!” అని అంటుంటే ఆమె శరీరంలోని తంత్రులన్నీ సున్నితంగా స్పందించి బలాన్ని పుంజుకుంటున్నాయి. జీవితంలో ”అమ్మా!” అన్న పిలుపు వింటానని, నాకూ ఓ కొడుకున్నాడన్న భద్రత ఫీల్‌తో బ్రతుకుతానని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఎందుకో హేమంత్‌ కన్పించినప్పటి నుండి ఇంతకాలం వున్న భయం, వెలితి, అసంతృప్తి చేత్తో తీసేసినట్లు వెళ్లిపోయాయి.

వెంటనే తన మొబైల్లోంచి వాత్సల్యకి కాల్‌ చేసింది శార్వాణి. ఒక్క రింగ్‌కే లిఫ్ట్‌ చేసి ”చెప్పండి ఆంటీ!” అంది వాత్సల్య.

హేమంత్‌ వెంటనే లేచి తల్లి పక్కన కూర్చున్నాడు. ఆమె మాట్లాడుతున్న మొబైల్‌ స్పీకరాన్‌ చేసి వినసాగాడు.

”ఆరాధ్య బాగుందా?” అడిగింది లక్ష్మీశార్వాణి.

”దానికేం? బాగుందాంటి! ఆఫీసులో వుంది” చెప్పింది వాత్సల్య.

”హేమంత్‌తో తన స్టోరీ ఎంతవరకు వచ్చింది?” తీగ లాగింది శార్వాణి.

”ఏముందాంటి రావటానికి? తన పాటికి తను, అతని పాటికి అతను సైలెంట్‌గా వుండిపోయారు” అంటూ డొంకను కదిలించింది వాత్సల్య.

”ఆరాధ్య నీ దగ్గర వున్నట్లు హేమంత్‌కి తెలుసా?” ఆరాతీసింది శార్వాణి.

”తెలియకపోవచ్చాంటీ! ఎందుకంటే తనెప్పుడూ హేమంత్‌తో మాట్లాడలేదు. నన్ను కూడా మాట్లాడవద్దని చెప్పింది” అంటూ నిజం చెప్పింది వాత్సల్య.

”తను చెబితే నువ్వు వింటావా?” ప్రశ్నించింది శార్వాణి.

”ఫ్రెండ్‌ కదా! వినాలి” నవ్వుతూ జవాబిచ్చింది వాత్సల్య.

”హేమంత్‌ కూడా ఫ్రెండేనన్నావ్‌! పెళ్లిలో ఆడబడుచులా హారతి కూడా పట్టానని చెప్పావ్‌!”

”చెప్పాను. కానీ ఆరాధ్య ఇప్పుడు నా రూంమ్మేట్‌ ఆంటీ!”

”రూంమ్మేట్‌ అంటే?” తెలిసినా కావాలనే అడిగింది శార్వాణి.

”మా ఖర్చులు తనుకూడా షేర్‌ చేసుకుంటుంది. మాతోపాటు వుంటుంది. మేము చేసినట్లే తనుకూడా ఓ వారం రోజులు వంట చేస్తుంది. ఇంతే ఆంటీ!” అంది వాత్సల్య.

”కానీ హైదరాబాదులో వుంటూ హేమంత్‌కి కన్పించకుండా ఎలా వుంటోంది?”

”తన దగ్గర హేమంత్‌ ఇంటి సెకెండ్‌ కీ వుందాంటీ! హేమంత్‌ లేనప్పుడు వెళ్లి తన డ్రస్‌లు తెచ్చుకుంది. ఆఫీసుకెళ్తోంది. వాళ్లిద్దరి ఆఫీస్‌ టైమింగ్స్‌ ఒకటి కాదు కాబట్టి ఒకరి కొకరు ఎదురయ్యే చాన్సెస్‌ లేవు. పైగా తనిప్పుడు హెయిర్‌స్టైల్‌ మార్చుకుంది. సడెన్‌గా మీరు చూసినా ఆరాధ్యను గుర్తుపట్టలేరు.”

హేమంత్‌కి వాత్సల్య మాటలు స్పష్టంగా విన్పిస్తున్నాయి.

ఆశ్చర్యపోతున్నాడు. యాంగ్జయిటీగా వింటున్నాడు.

”అయ్యో! అలా ఎందుకు చేసింది?” నమ్మలేకపోతోంది శార్వాణి.

”ఏమో ఆంటీ! నాకూ అదే డౌట్‌గా వుంది. నేను ఎన్నిసార్లు కామెంట్‌ చేసినా ‘నా జుట్టంటే హేమంత్‌కి ఇష్టం. దాని గురించి నువ్వేమీ అనకు’ అనేది. ఇప్పుడు మొత్తం కట్‌ చేయించుకొని స్టైలే మార్చేసింది. ఇదంతా చూస్తుంటే హేమంత్‌కి ఇష్టమైన పనిని చెయ్యొద్దని అలా చేసిందో లేక సరయు బలవంతంగా తీసికెళ్లి అలా చేయించిందో తెలియదు. ఒక రోజయితే వాళ్లిద్దరు బ్యూటీపార్లర్‌కి వెళ్లొచ్చారు. ఇప్పుడు ఆరాధ్య నాతోకన్నా సరయుతోనే క్లోజ్‌గా వుంటోంది. పడుకునేది కూడా సరయుతోనే. రాత్రయిందంటే చాలు ఇద్దరు ఓ చోట చేరి మాట్లాడుకుంటుంటారు. సరయు మ్యారీడ్‌. పైగా విడాకులు తీసుకుంది. అందుకే ఆరాధ్య బాధను అర్థం చేసుకొని దగ్గరగా మూవ్‌ అవుతుందేమో అనుకుంటున్నానాంటీ!” అంది వాత్సల్య.

అది విని ”వాత్సల్యా! నీతో ఇంకా కొంచెంసేపు మాట్లాడాలి. నువ్వెప్పుడు ఫ్రీగా వుంటావు?” అడిగింది శార్వాణి.

”ఇప్పుడు ఫ్రీనే ఆంటీ! కాఫీ ఏరియాకి వచ్చాను”

”సరయు ఎలాంటి అమ్మాయి?”

”చూడటానికి మాలాగే వుంటుందాంటీ! కానీ హజ్బండ్‌ విషయంలోనే రాంగ్‌ స్టెప్‌ వేసినట్లుంది. అదికూడా చెబితేనే తప్ప ఎవరికీ తెలియదు. తనలో పెళ్లయిన దాఖలాలు కూడా కన్పించవు. పెళ్లికాని అమ్మాయిలాగే వుంటోంది. ఆరాధ్యను కూడా అలాగే వుండమని చెప్పింది. ఎందుకంటే ‘సింగిల్‌గా ఎందుకుంటున్నావ్‌’ అని ఆఫీస్‌లో అందరు క్వొశ్చన్స్‌ వేస్తారట… అలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని తను బాగా ఫేస్‌ చేసిందట. ఆరాధ్యతో చెబుతుంటే విన్నాను. ఆరాధ్య కూడా సరయు ఎలా చెబితే అలా వింటుంది.”

”నీమాట వినదా?”

”వినదాంటీ! నేను హేమంత్‌కి సపోర్ట్‌ చేస్తానట. అందుకే మొదట్లో చెప్పేది కాని ఇప్పుడు హేమంత్‌ గురించి నాతో ఏమీ చెప్పదు”

”ఏం చెప్పేది హేమంత్‌ గురించి…?”

”హేమంత్‌ వాళ్ల ఇంట్లోవాళ్లను బాగా తిడుతున్నాడట… డబ్బులు తెమ్మంటున్నాడట. బంగారం కావాలంటున్నాడట. ప్లాట్‌ ఇస్తామన్నారు కదా అదెప్పుడిస్తారు? అని వూరికే విసిగిస్తున్నాడట. హేమంత్‌కి బొత్తిగా సేవింగ్స్‌ లేవట…. అత్యాశాపరుడట. ఇవన్నీనచ్చక ఎదిరిస్తే కొడతాడేమోనన్న భయంతో మా దగ్గర వుంటోందట… అయినా హేమంత్‌ పద్ధతి కూడా బాగా లేదాంటీ! ఒక ఆడపిల్లను ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇలాంటి టార్చర్‌ పెట్టటం అవసరమా? అదే నేను లేకుంటే ఆరాధ్య ఏమైపోయేది?”

”ఇంకో చోటుకి వెతుక్కుంటూ పోయేది. తను ఎవరి దగ్గరకి వెళ్లినా వాళ్ల ఖర్చుల్ని షేర్‌ చేసుకుంటుంది కాబట్టి వద్దనరు. బిజినెస్‌ డీల్‌ అలాగే వుంటుంది. కానీ ఇంత జరుగుతున్నా నువ్వు హేమంత్‌కి కాల్‌చేసి చెప్పకపోవటం న్యాయంగా లేదు”

”రోజూ వాళ్ల మమ్మీతో ఫోన్లో మాట్లాడుకుంటూ తనిప్పుడు హ్యాపీగా వుందాంటీ! అందుకే చెప్పలేదు. పైగా తనేం చెప్పొదంటోంది. చెప్పాల్సినంత ప్రాబ్లమ్స్‌ కూడా నాకేం కన్పించలేదు. ఏదైనా తన లైఫ్‌ తన ఇష్టం కదాంటీ! ఆ… ఆంటీ! నాకు టైమైంది. నేను లోపలకి వెళ్తున్నా కంపెనీ మీటింగ్‌కి అటెండు కావాలి” అంటూ కాల్‌ కట్‌ చేసింది.

హేమంత్‌కి మతిపోయింది. తను ప్రయాణం చెయ్యాల్సింది ‘అటు కాదు ఇటు’ అని అనుకుంటూ కిటికీలోంచి బయటికి చూశాడు. స్టేషన్‌ వస్తున్నట్లు గమనించి, ట్రైన్‌ ఆగగానే చురుగ్గా కదిలి జంప్‌ చేసినట్లే  ట్రైన్‌ దిగాడు.

తన కొడుకు జీవితం ఇలా ఎందుకయిందా అని ఆలోచిస్తున్న శార్వాణి ట్రైన్‌ ఆగడం కాని, కొడుకు ట్రైన్‌లోంచి దిగడం కాని గమనించుకోలేదు. కొడుకు తన పక్కన లేకపోవటం చూసి నిర్ఘాంతపోయింది. ఇంతవరకు జరిగింది కలలో జరిగినట్లు నిర్వీర్యమైపోయింది. ఇక లేడేమోననుకున్న కొడుకు కన్పించినట్లే కన్పించి మాయమయ్యాడని ఆమెలోని తల్లి మనసు ఉసూరుమంది. కనీసం వాడి ఫోన్‌ నెంబరయినా అడగకపోతిని కదా! నా నెంబరయినా వాడికి ఇవ్వకపోతినికదా! అని ఆవేదన చెందింది. ఇక తన కొడుకు తనకెలా కన్పిస్తాడు అని కన్నీళ్లు పెట్టుకుంది.

అప్పుడొచ్చాడు హేమంత్‌ ”అమ్మా! ఎందుకేడుస్తున్నావ్‌? కట్నం డబ్బులకోసం ఆరాధ్యను వేధించేంత దుర్మార్గుడినని ఏడుస్తున్నావా? అసలు నేను కట్నమే అడగలేదు. ‘మేము మా మర్యాదకోసం అంతిస్తాం! ఇంతిస్తాం’ అని అబద్దాలు చెప్పి, నేనే వాళ్లను అడుగుతున్నట్లు బ్లేమ్‌ చేస్తోంది. నా దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారు. కోపం రాదా?” అన్నాడు.

ఆమె మాట్లాడకుండా ఒక్క క్షణం మౌనంగా చూసి ”ముందు నీ మొబైల్‌ నెంబర్‌ ఇందులో ఫీడ్‌ చెయ్యి నాన్నా! నా నెంబర్‌ కూడా తీసుకో” అంది.

హేమంత్‌ నవ్వి ”నిన్ను విడిచిపెట్టి నేను ఎటూ పోనమ్మా! యాక్చువల్లీ నేను ఆరాధ్య కోసం రిటన్‌ వెళ్లిపోదామనే ట్రైన్‌ దిగాను. వెంటనే నువ్వు గుర్తొచ్చి వెనకబోగీలో ఎక్కి వచ్చాను” అన్నాడు.

తేలిగ్గా వూపిరి పీల్చుకుంది శార్వాణి.

”అమ్మా! నువ్విప్పుడు ఏ ఊరు వెళ్తున్నావ్‌?” అడిగాడు హేమంత్‌.

”అనంతపూర్‌ వెళ్తున్నాను హేమంత్‌! అక్కడ మీ నాన్న మీ అత్తయ్యలతో ఆస్తికోసం తగాదా పెట్టుకొని కోర్టులో కేసు వేశాడు. అప్పుడప్పుడు వెళ్తుంటాడు. ఉద్యోగం చేసేది మాత్రం హైదరాబాదులోనే! నాతో ఏదో మాట్లాడిపించాలని నన్ను రమ్మని ఫోన్‌ చేశారు. నిజానికి నాకు అక్కడికి వెళ్లటం ఇష్టం లేదు. మీ నాన్నగారి మాటలు నాకు నచ్చవు. నచ్చకపోయినా మనసు చంపుకొని ఆయన వైపున మాట్లాడవలసి వస్తోంది. ఏం చేయాలి. ఆయన భార్యగా నాకీ శిక్ష తప్పదు. కానీ ఇప్పుడు నేను వెళ్లను. ఫోన్‌ చేసి చెబుతాను ‘నేను రావటం లేదు. నాకు లీవ్‌ దొరకలేదు’ అని…”

”అంతేనా! ఇంకేం చెప్పవా అమ్మా! నాన్నతో…?” అడిగాడు హేమంత్‌.

”ఎందుకు చెప్పను నాన్నా! నువ్వు కన్పించావని చెబుతాను” అంది.

”వినగానే నాన్న చాలా సంతోషపడతాడు కదమ్మా! నన్ను చూస్తే ఇంకెంత సంబరపడిపోతాడో! ఇప్పుడే నన్ను తీసికెళ్లి నాన్నకు చూపించు. నాక్కూడా నాన్నను చూడాలని వుంది. ఇన్నిరోజులు నాకెవరూ లేరన్నట్లు ఒంటరిగా బ్రతికాను. ఇప్పుడు నాకు అందరూ వున్నారు. అమ్మానాన్న, అత్తయ్యలు, మామయ్యలు ఇంకా బోలెడుమంది బంధువులు…. నా పెళ్లిలో నాకంటూ ఫ్రెండ్స్‌ తప్ప వీళ్లెవరూ లేరు. అదే ఇప్పుడు చూడు ఎందరున్నారో? నాకు మన వాళ్లనందరిని వెంటనే చూడాలని వుందమ్మా!” అన్నాడు.

అనంతపూర్‌లో తన బంధువులు హేమంత్‌ను చూస్తే ఏమనుకుంటారో ఆమె వూహించగలదు. అది హేమంత్‌కి తెలిస్తే తండ్రిని క్షమించలేడు. పర్యవసానాలు కూడా వేరుగా వుంటాయి. అందుకే ”ఇప్పుడు వద్దు హేమంత్‌! మనిద్దరం నెక్ట్స్‌ స్టేషన్లో ట్రైన్‌ దిగి హైదరాబాద్‌ వెళ్దాం! నాన్న హైదరాబాదు వస్తాడు. ఇప్పుడు మనం ఆరాధ్యను నీ చేయి దాటిపోకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో ఫ్రెండ్స్‌ సర్కిల్‌ని నమ్మటానికి లేదు. ఎవరు ఎవరి జీవితంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారో తెలియదు. ఏం చెబుతారో తెలియదు. ఎలా మారుస్తారో తెలియదు. ఇన్నిరోజులు ఆరాధ్య వాళ్ల ఊరిలో వుందన్న నమ్మకంతో మెల్లగా వస్తుందిలే అనుకున్నావ్‌! ఇప్పుడామె హైదరాబాదులోనే వుందని తెలిసింది కాబట్టి ఇక ఆ దూరాన్ని పెంచొద్దు” అంది.

ఆమె అలా అంటుండగానే స్టేషన్‌ వచ్చింది.

ఇద్దరూ ట్రైన్‌ దిగి హైదరాబాదు వెళ్లే ట్రైనెక్కారు.

* * * * *

హైదరాబాదులో ట్రైన్‌ దిగగానే కాశిరెడ్డి వచ్చి రిసీవ్‌ చేసుకున్నాడు. అతనికి ట్రైన్లో వుండగానే హేమంత్‌ ఫోన్‌ చేసి తన తల్లి కన్పించిందన్న గుడ్‌న్యూస్‌ని చెప్పాడు… హేమంత్‌ని చూడగానే హగ్‌ చేసుకున్నాడు కాశిరెడ్డి. వెంటనే హేమంత్‌ని వదిలి శార్వాణి వైపు తిరిగి ‘నమస్తే అమ్మా!’ అంటూ ఆమె చేతిలో వున్న క్యారీబ్యాగ్‌ను అందుకున్నాడు.

”అమ్మా! వీడు నా బెస్ట్‌ ఫ్రెండ్‌!” అంటూ తల్లికి కాశిరెడ్డిని పరిచయం చేశాడు. శార్వాణి ఆత్మీయంగా చూసి ”అమ్మ బాగుందా బాబూ?” అంది. ఆమె అలా అడుగుతుంటే ఎంతో కాలంగా పరిచయం వున్న వ్యక్తిలా అన్పించింది. వాత్సల్య ద్వారా ఫోన్లో కళ్యాణమ్మ గురించి వినడం వల్లనే ఆమె అంత అభిమానంగా అడిగింది.

”బాగుందమ్మా! మీరు వస్తున్నట్లు ఇంతకుముందే మమ్మీకి కాల్‌ చేసి చెప్పాను” అన్నాడు.

ముగ్గురు కలిసి హేమంత్‌ ఇంటికి వెళ్లారు.

ప్రష్షప్పయి, రిలాక్సయ్యాక తల్లి చేత కళ్యాణమ్మతో ఫోన్లో మాట్లాడిపించాడు హేమంత్‌. కాశిరెడ్డి కొద్దిసేపు వాళ్లతో గడిపి రూంకెళ్లాడు.

కొడుకు వుంటున్న ఆ ఇంటిని కంటినిండుగా చూసుకొని ఆనందపడింది శార్వాణి. ఆరాధ్య లేకపోవటమే వెలితిగా వుంది.

…తల్లికి స్వయంగా వంట చేసి పెట్టాలని వంటగదిలోకి వెళ్లాడు హేమంత్‌. అది చూసి ”నువ్వుండరా! వంట నేను చేస్తాను…” అంటూ హేమంత్‌ని వేరే వర్క్‌ చేసుకోమని చెప్పింది. శార్వాణి రుచికరమైన భోజనం చేసి హేమంత్‌కి పెట్టింది. తల్లి చేతి వంట తిని తృప్తిగా ఫీలయ్యాడు హేమంత్‌.

ఆమె తన ఇంటికి వెళ్లకుండా హేమంత్‌ దగ్గరే వుంది. తల్లిని తన దగ్గరే వుంచుకోవాలని వుంది హేమంత్‌కి… శార్వాణికి కూడా కొడుకును వదిలి వెళ్లాలని లేదు.

అనంతపూర్‌లో ఉన్న ఉపేంద్ర ఇంకా హైదరాబాదుకు రాలేదు. ఆయనకు మళ్లీ కాల్‌ చేసింది శార్వాణి. ఉపేంద్ర శార్వాణి కాల్‌ని కోపంగా లిఫ్ట్‌ చేసి ”ఎన్నిసార్లు చెప్పి చస్తావే కొడుకు కన్పించాడని…? ఒక్కసారి చెబితే చెప్పినట్లు వుండదా? అసలే వాడు చిన్నప్పుడే చనిపోయాడని మా వాళ్లకి చెప్పుకున్నాం. ఇప్పుడు వాడు బ్రతికే వున్నాడని ఎలా చెబుదాం! చెప్పిందే చెప్పి ఎన్ని కాల్స్‌ వేస్ట్‌ చేస్తావ్‌? డబ్బులేమైనా ఎక్కువున్నాయా? ఈసారి చేశావంటే లిఫ్ట్‌ చెయ్యను” అన్నాడు.

”ఏం చేసుకుంటారండీ ఆ డబ్బు? చిన్నచిన్న ఆనందాలను కూడా షేర్‌ చేసుకోలేని ఆ డబ్బు ఎందుకు? సంపాయించి, సంపాయించి వదిలేసి పోవటానికేగా! చేప రాత్రింబవళ్లు నీటిలోనే వున్నా దాని వాసన పోనట్లు ఎన్ని ఏళ్లు గడిచినా మీకీ డబ్బు దాహం పోదా. తినేముందూ డబ్బే! నిద్రపోయే ముందూ డబ్బే! నిద్ర లేచేముందూ డబ్బే! ఈ డబ్బు ఆలోచనలోంచి మీరిక బయటికి రారా?”

”ఏంటే నోరు లేస్తోంది? ఇల్లూ వాకిలీ వదిలేసి ఇంకా ఎన్నిరోజులుంటావక్కడ? ఇవాళయినా ఇంటికెళ్తావా! లేదా?” అన్నాడు.

”వెళ్తాను లెండి! నా కొడుక్కి నాలుగురోజులు నాచేత్తో వండిపెట్టు కోవాలని వుంది”

”మరి నీ డ్యూటీ మాటేమిటి?”

”అదెక్కడికీ పోదు. లీవ్‌ పెట్టాను”

”ఎన్ని రోజులు?”

”పది రోజులు…”

”పది రోజులే!! జీతం కట్‌ కాదా?”

”కాదు. మా మేడమ్‌కి చెప్పాను. మేనేజ్‌ చేస్తానంది. అయినా ఇప్పుడు కూడా డ్యూటీ! జీతమేనా? కొడుకు గురించి అడగరా? వాడికి పెళ్లి కూడా అయింది తెలుసా? అప్పుడు మన ఇంట్లో పేయింగ్‌ గెస్ట్‌గా వున్నదే ఆరాధ్య. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసేది. ఆ అమ్మాయితోనే పెళ్లయింది. కానీ వాళ్లిద్దరు ఇప్పుడు కలిసి లేరు” అంది.

అవతల వైపు నుండి ఎలాంటి భావోద్వేగపు మాటలు లేవు.

”ఏంటండీ! మాట్లాడరు?”

”ఏముందక్కడ మాట్లాడటానికి?”

‘కొడుకు జీవితం ఇలా అయినందుకు బాధగా లేదా? బాధ్యతగా ఆలోచించాలని లేదా? వాళ్లిద్దర్ని కలపాలని లేదా?”

”నా ప్రాబ్లమ్స్‌ నాకున్నాయి. ఇలాంటి తలనొప్పులు నాకు పెట్టకు”

”ఇవి తలనొప్పులు కావు. బాధ్యతలు. వీటిని మనం మన అనుభవంతో మాట్లాడి చక్కదిద్దాలి. ఎప్పుడు చూసినా మీరు ‘నా ప్రాబ్లమ్స్‌ అంటారే కాని మన ప్రాబ్లమ్స్‌ అని అనరేం? ‘నా’ అనడం తప్ప ‘మన’ అనడం రాదా మీకు? అయినా ఏమున్నాయి మీకు ప్రాబ్లమ్స్‌? మీ జీతాన్ని మీరు దాచుకుంటున్నారు. నా జీతంతో నేను ఇంటిని నడుపుతున్నాను. మన ఇద్దరి ఖర్చుల్ని నెట్టుకొస్తున్నాను” అంది.

”ఏంటే గొంతు లేస్తోంది?” గట్టిగా అరిచాడు ఉపేంద్ర.

ఆ అరుపుకి ఆమె ఉలిక్కిపడలేదు. ఇన్నిరోజులు అతను భర్తన్న మాటేగాని అతనంటేనే భయం శార్వాణికి. ఎప్పుడు చూసినా వణకడం తప్ప మాట్లాడేది కాదు. ఇప్పుడు ఆ వణుకు కొంచెం తగ్గి ధైర్యాన్ని కూడదీసుకుంది. ”నాకు జాబ్‌ వచ్చేంత వరకు మీరు మాట్లాడిన మాటలు వేరు. ఆ తర్వాత మాట్లాడిన మాటలు వేరు. అయినా నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మాత్రం కూడా మాట్లాడొద్దా?”

”ఎందుకే మాట్లాడేది. నేను నీకేం తక్కువ చేశాను. గిన్నెలు తోముకుంటూ నేను తెచ్చింది వండిపెడుతూ కరివేపాకు, కొత్తిమీర గురించి మాత్రమే మాట్లాడగలిగే నీకు జీవితంలో కీలక పాత్ర పోషించే డబ్బు విలువ గురించి చెప్పాను. నీ అవసరాలకు నువ్వు కష్టపడి సంపాయించుకోమని స్వేచ్ఛనిచ్చాను. నీ బాగోగులు వేరెవరో కాకుండా నువ్వే చూసుకునేలా చేశాను. నువ్విలా మారటానికి నేనెంత చెయ్యాల్సి వచ్చిందో నాకు తెలుసు. దాన్ని నువ్వు టార్చర్‌ అంటావు… ఈరోజు ‘నాకంటూ ఓ వ్యక్తిత్వం వుంది. క్రమశిక్షణ వుంది’ అని నువ్వు మురిసిపోతున్న ఆ రెండు లక్షణాలు నేను పెట్టిన టార్చర్‌ వల్ల వచ్చినవే! కానీ నువ్వు దాన్ని ఒప్పుకోవు. ‘నన్నేడిపించి నాచేత ఉద్యోగాన్ని చేయించావు’ అనే అంటావు. అయినా ఇప్పుడు హాయిగా బ్రతుకుతున్నావు కదా! ఇప్పటికీ నీకు నేనేదో కీడు చేశాననే అంటావు”

”అంటాను. ముమ్మాటికి అంటాను. ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చేంత వరకు నాకు తిండి పెట్టకుండా చంపారు. కొట్టారు. తిట్టారు. ఇంట్లోంచి వెళ్లగొట్టారు. నేను బయటికెళ్లి ఏదో ఒక ప్రైవేటు జాబ్‌ చూసుకొని రాగానే ఇంట్లో వుండనిచ్చారు. జాబ్‌ వచ్చేంత వరకు నేను బయట ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసా? చెప్పినా విన్నారా? తిరిగి ఆ బాధలు పడలేకనే మీ దగ్గర వున్నాను… కొడుకు పుట్టాక ఏం చేశారు? ఇంట్లో వుండనిచ్చారా? నాలుగు నెలలు లీవ్‌ పెట్టగానే ఆ ఉద్యోగం పోయింది. చిన్న బిడ్డ వున్నాడని కూడా చూడకుండా మళ్లీ ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లోంచి పంపారు. నా బిడ్డతో నేను గడిపింది ఎప్పుడు?

పాలసీసాలు పక్కనపెట్టి నా బిడ్డను ఎదురింటి వరండాలో పడుకోబెట్టి నేను ఉద్యోగానికి వెళ్తుంటే మౌనంగా వున్నారేకాని కనీసం ఒక్క సంవత్సరమన్నా నా బిడ్డతో నన్ను వుండనిచ్చారా? తల్లితో బిడ్డకి అవసరం వుండదా? మీరసలు తండ్రేనా?”

”తండ్రిని కాబట్టే వాడి గురించి ఆలోచించాను. భార్యవని కూడా చూడకుండా నీచేత మళ్లీ ఉద్యోగం చేయించాను. ఎండనకా, వాననకా నువ్వు బయటకెళ్లి పని చేసి వస్తుంటే లోపల బాధగా వున్నా పైకి కనపడనీయలేదు. ఎందుకు? వాడిని ఖరీదైన కాన్వెంట్‌లో చదివించాలని… ఖరీదైన చదువులు చెప్పించాలని… ఇది నీకు అర్థం కాదు. ఇదే కాదులే నీకేదీ అర్థం కాదు. దండం పెట్టాల్సినవాళ్లను బండతో కొడతావు. బండతో కొట్టాల్సిన వాళ్లకి దండం పెడతావు. అందుకే నీ దృష్టిలో నేనెప్పటికీ చెడ్డవాడినే…!”

”చెడ్డ పనులు చేసేవాళ్లను చెడ్డవాళ్లనక మంచివాళ్లంటారా?” అంది ఏమాత్రం జంకకుండా.

”పొగరుగా మాట్లాడుతున్నావ్‌! కొడుకుని చూసుకొనా? ఏంటే నీ ధీమా?”

”అవును. కొడుకుని చూసుకొనే!”

”జాస్తి మాట్లాడావంటే చంపేస్తా!”

”ఎన్నిసార్లు చంపుతారు?” అంది శార్వాణి.

అవతల వైపు నుండి ఉపేంద్ర కాల్‌ కట్‌ చేసాడు.

అప్పుడే నిద్రలేచిన హేమంత్‌ నేరుగా తల్లి దగ్గరకి వచ్చి ”నాన్నతోనా అమ్మా! మాట్లాడుతున్నావ్‌! ఎప్పుడొస్తాడట?” అని అడిగాడు చాలా ఉత్సాహంగా.

”ఇప్పుడప్పుడే రావచ్చు, రాకపోవచ్చు హేమంత్‌! నువ్వు బ్రష్‌ చేసుకో! కాఫీ పెడతాను” అంది. ఆమె ముఖంలో ఎలాంటి భావాలు లేవు. అంతవరకు భర్తతో మాట్లాడిన మాటలన్నీ మరచిపోయినట్లు చాలా నార్మల్‌గా వుంది.

హేమంత్‌ ముఖం అప్పటికప్పుడే డల్‌ అయినట్లు కన్పించింది. అతనికి తండ్రి రాకపోవటం బాధగా వుంది. ముఖ్యంగా తన గురించి తల్లి చెప్పాక కూడా రాలేదంటే అక్కడ ఎంత అవసరమైన పని వుందో అని అనుకున్నా కనీసం ఫోన్లో అయినా మాట్లాడవచ్చు కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *