March 28, 2024

తానా వ్యాసరచన పోటీకి ఆహ్వానం.


TANA-Logo

డెట్రాయిట్ లో జరిగే 20 వ తానా సమావేశాల్లో (జూలై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగుసాహిత్యంలో  స్త్రీ పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనున్నది.

తెలుగులో పురాణాలనుండి ఇప్పటి ఆధునిక సాహిత్యం వరకూ ఎంతో వైవిధ్యమున్న స్త్రీ పాత్రల చిత్రణ జరిగింది. ఇందులో పురాణాలతో పాటు కావ్యాలు, నాటకాలు, కధలు, నవలలు, కవితలు మొదలైన ఎన్నో ప్రక్రియలు పాలు పంచుకున్నాయి. ఇంతటి సుధీర్ఘమైన చరిత్ర ఉన్న సాహిత్యంతో పాటు గత 80 ఏళ్ళుగా చలన చిత్ర రంగం కూడా స్త్రీ పాత్రల పరిణితిని ప్రదర్శించడంలో తన వంతు ప్రభావాన్ని చాలా చూపింది. రచయితల (దృశ్య ప్రక్రియలను నిర్దేశించే వారితో సహా) సృష్టిలో ఆ పాత్రలు, ఆయా స్థల, కాలాల, ఆచార వ్యవహారాలను బట్టి మారే అవకాశం వుంటుంది. ఈ ప్రయత్నంలో పాత్రలు సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించవచ్చు. భవిష్య దర్శనం చేయవచ్చు, లేదా గతస్మృతులను నెమరు వేసుకుంటూ వుండవచ్చు.

ఈ నేపధ్యంలో స్త్రీ పాత్రల స్వభావాల్లో వచ్చిన మార్పులు వివిధ తెలుగు సాహితీ ప్రక్రియల్లోనూ, దృశ్యమాధ్యమాల్లోనూ ఎలా ప్రకటితమయ్యాయి? ఎలాంటి పరిణామాలకు లోనయ్యాయి? ఈ మార్పులు సమకాలీన సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? అనే విషయాలను చర్చకు తీసుకురావడం, ఈ వేదిక నిర్వహణ ప్రధానోద్దేశ్యం. ఇలాంటి విస్తృత వస్తువును కేవలం ఒక రెండు గంటల చర్చా వేదికలో ఇమిడ్చడం అసాధ్యం. కానీ ఈ వస్తువుకు వీలైనంత విశాల వేదిక కల్పించడం, ఈ వ్యాసరచనా పోటీ ప్రధానోద్దేశ్యం.

పోటీలో పాల్గొనదల్చుకునేవారు తమకు నచ్చిన, అనువైన, అభినివేశం వున్న, స్పష్టత వున్న లేదా ప్రవేశంలో వున్న ఏ కోణంనుండైనా, ఏ పరిమితులలోనైనా ఈ వ్యాస రచన చేయవచ్చు. ఎన్నుకున్న పరిధిలో విషయాన్ని ఎంత కూలంకషంగా, ఎంత విసృతంగా పరిశీలించి, ఎంత సరళంగానూ, క్లుప్తంగానూ విశ్లేషించారన్న వాటిపైనే బహుమతి నిర్ణయం వుంటుంది కానీ, కేవలం వస్తువు పరిమాణ విస్తృతి ఒక్కటే బహుమతికి అర్హత కాజాలదు.

 

నిబంధనలు

1. వ్యాసాలు తెలుగులోనే వ్రాయాలి.

2. ఈ చర్చావేదిక నిర్వాహకులు, చర్చలో పాల్గొనడానికి రాబోయే ఆహ్వానితులు తప్ప, మిగిలిన వారందరూ ఈ వ్యాసరచన పోటీకి అర్హులే.

3. వ్యాసాలను చేతివ్రాతలో కాకుండా కంప్యూటర్ లో టైపు చేసి పిడియఫ్ ఫైల్ గా మార్చిపంపాలి. (కంప్యూటర్ లో టైపు చెయ్యడానికి వెసులుబాటు లేనివారు గడువు తేదీకి కనీసం 30రోజులు ముందుగా వ్యాస రచన పూర్తిచేసి మమ్మల్ని సంప్రదిస్తే వీలును బట్టి సహాయం చెయ్యడానికి ప్రయత్నిస్తాము)

4.మొదటిపేజీలో వ్యాసం పేరు, రచయిత పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్, వ్యాసం మొత్తం ఎన్ని పేజీలు వివరాలు మాత్రమే వుండాలి. తరువాతి పేజీల్లో వ్యాసం పేరు, వ్యాసం తప్ప వేరే వివరాలు వుండకూడదు. న్యాయనిర్ణేతలకు రచయిత వివరాలు తెలియరాదు కనుక వ్యాసరచయిత కు సంబంధించిన వివరాలేవీ వ్యాసంలో (అంటే రెండవ పేజీ మొదలుకుని) ఉండకూడదు.

5. వ్యాసం నిడివి 5 పేజీలు మించకూడదు. (పేజీ పరిమాణాలు: 7.5 x 9 అంగుళాలు లేదా 19 x 23 సెంటీమీటర్లు. వాడే లిపి పరిమాణం 12 పాయింట్లకు తక్కువ వుండకూడదు). తీసుకున్న వస్తువును విశదీకరించి, విశ్లేషించడానికి అవసరమైనంత మేరకే వ్యాసం వుండాలి గానీ, గరిష్ట నిడివి వరకూ వ్యాసాన్ని పొడిగించనవసరం లేదు.

6. వ్యాసాన్ని ఈమెయిల్ ద్వారా tanavyasamu@gmail.com కు పంపాలి. వ్యాసాన్ని పంపినవారి ఈ మెయిల్ తో వ్యాసరచయితను, వ్యాస కర్తృత్వాన్ని ఈ వ్యాస రచనాపోటీ నిబంధనలని చట్టరీత్యా ధృవీకరిస్తున్నట్టు, అంగీకరిస్తున్నట్టు, భావిస్తాము. వేరే ధృవీకరణల అవసరలేదు.

7. వ్యాసాలు మాకు చేరవలసిన తేదీ: ఏప్రిల్, 4 2015.

8. న్యాయ నిర్ణేతల దృష్టిలో ఉత్తమమైనవిగా ఎంపిక అయిన మొదటి మూడు వ్యాసాలకు బహుమతులు (రూ. 27,232; రూ. 17,314; రూ. 11,234; లేదా సమానమైన విలువలో రచయిత నివసించే దేశపు ద్రవ్యంలో) ఉంటాయి. బహుమతి పొందిన వ్యాసాలతో పాటు మిగిలిన వాటిలో ఎన్నదగిన వాటిని తానా 20 సమావేశాల సంధర్భంగా ప్రచురించే హక్కులు నిర్వాహక వర్గానివే.

9. న్యాయనిర్ణేతల అభిప్రాయంలో ఏ వ్యాసానికీ తగిన అర్హతలు లేవని తోస్తే బహుమతిని ఇవ్వడానికి, ప్రచురించడానికీ నిరాకరించే హక్కులు కూడా నిర్వాహక వర్గానివే. ఈ నిబంధన కేవలం ఆషామాషీ గా వ్యాసరచన పోటీలో పాల్గొని బహుమతులను ఆశించే వారిని నిరుత్సాహపరచడానికి; నిబద్దతో, క్రమ శిక్షణతో చేసిన రచనలకు తగిన విలువను ఆపాదించడానికి మాత్రమేనని మనవి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *