April 19, 2024

గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీతలైన కవయిత్రులు

రచన: లక్ష్మీదేవి

వరుస సాంస్కృతిక దాడులు, అణచివేతల వల్ల  స్త్రీ రక్షణకు తన్మూలకంగా స్త్రీ జ్ఞానార్జనకు వచ్చిన పలు సామాజిక, ఆర్థిక పరిమితులవల్ల కుంటువడిన స్త్రీల విద్యాభివృద్ధులు, దేశ స్వాతంత్ర్యోపార్జన తర్వాత అంటే  అర్ధశతాబ్దం క్రిందట వికాసానికి నోచుకున్నాయి. ఆ కాలంలో ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా ఉన్నతికి మార్గాలను ఏర్పఱచుకుంటూ రచనా వ్యాసంగం ద్వారా అనేకులకు మార్గదర్శనమూ చేస్తున్న మహిళాలోకానికి ప్రోత్సాహకంగా  కె.యన్. కేసరి గారు 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర రంగాలలో విశిష్టసేవ చేసిన స్త్రీలను సత్కరించినారు. ఆధునిక యుగంలో స్త్రీలని క్రమపద్ధతిలో ఏటా సత్కరించడం ఈ స్వర్ణకంకణముతో మొదలయింది. ఇప్పుడు మనం ఆ విధంగా  స్వర్ణకంకణముతో సత్కారం పొందిన మహిళల గురించి, వారి ప్రతిభ గురించి ముచ్చటించుకుందాం.

ఈ కవయిత్రుల రచనలు ప్రబంధరీతులలో, లేఖారచనాపద్ధతులలో, శతకరీతిలో, ఖండకావ్యములుగా, సుభాషితములుగా ప్రాచీన కవులవలె పద్యగద్యములుగాను, ద్విపదకావ్యములుగాను, ఆధునిక కవిత్వపు శైలితోనూ వివిధరీతుల గలవు. ఈ కవయిత్రులందరి రచనలయందును దైవభక్తి, దేశభక్తి, మానవతావాదము, జాతీయాభిమానము, గృహిణీధర్మములు మున్నగు సౌశీల్యకరమైన సదుపదేశములు ఏకసూత్రముగా ఇమిడియున్నవని అభిప్రాయపడినారు.

ఈ కవయిత్రులు చాలామంది గృహములందే పెద్దల చెంత కావ్యనాటక అలంకార వ్యాకరణశాస్త్రముల నభ్యసించిరి. మరికొందరు డిగ్రీలను పొంది, హిందీపరీక్షలను వ్రాసి ఉద్యోగములు చేసియుండిరి.ఏదేమైనా అన్ని అవకాశములులేని ఆ రోజుల్లో ఈ కవయిత్రీమతల్లులందరూ కవితాసక్తి గలిగి స్త్రీలోకాన్ని జాగృతం చేసినారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

వీరిని ప్రోత్సహిస్తూ ప్రతిష్ఠాత్మక సత్కారములతో గౌరవించిన శ్రీ కేసరిగారు తాతతండ్రులు సంపాదించిన ఆస్తులు లేకపోయినా ఈ కార్యానికి పూనుకోవడంలో స్ఫూర్తినిచ్చిన అంశంకూడా ఆసక్తికరంగా ఉంటుంది.

కేసరిగారు గుంటూరు జిల్లాలోని వంగవోలు తాలూకాలో ఇనమన మెళ్ళూరు గ్రామంలో పేదవెలనాటి వైదిక బ్రాహ్మణునిగా 26-4-1875 లో జన్మించినారు. తండ్రి జంధ్యాలు వడికి సంపాదించినది తిండికి మాత్రమే సరిపోయెడిది కనుక కేసరికి తండ్రి ఆస్తి కొన్ని చిల్లర పైసలు మాత్రమే లభించినది. తల్లి కష్టాలు చూడలేక కేసరి గారు 12 ఏండ్ల వయసులో ఇల్లువదలి కాలినడకన మద్రాసు చేరినారు. ధర్మసత్రములలో ఉండేవాడు. పచ్చయప్ప కాలేజ్ ప్రక్కనే రామానుజాచారి ఇంటిలో పనులు చేసి వారియొద్ద రుక్మిణీకల్యాణము, గజేంద్రమోక్షము మొదలైనవి అర్థసహితముగా నేర్చుకొనిరి. పాఠశాలలో ఆంగ్లము బ్రతుకుతెరువుకై నేర్చిరి. పలు కష్టాలు పడి ఆయుర్వేద వైద్యశిక్షణ పొంది స్వంత ప్రాక్టీసుతో లక్షాధికారి అయినారు. తాను లక్షాధికారి అగుటకు లోధ్ర అను స్త్రీ ఆరోగ్యపరమైన ఔషధం వల్ల వచ్చిందని నమ్మి , తన ధనాన్ని స్త్రీ ధనంగా భావించి స్త్రీవిద్య కొరకు కన్యావిద్యాలయము స్థాపించిరి.

మందుల వ్యాపారములో మరింత ఆర్జన చేసి లోధ్ర ముద్రణాలయమును స్థాపించిరి. గాంధీ వలన ప్రభావితుడై కందుకూరి వారి మహిళా జనోద్ధరణ వలన ప్రేరితుడై స్త్రీవిద్యాభివృద్ధికై  1928 మార్చిలో గృహలక్ష్మి పత్రికను స్థాపించిరి. పత్రికవెల ఆరు అణాలు. నలుబది సంవత్సరాలు నడిపిరి.

1893లో మొదటిసారి తెలుగు వచన ప్రబంధములకు చింతామణి పత్రికద్వారా పురుషులకు బహుమతులిచ్చి ప్రోత్సహించిరి.

దేశహితమునకై స్త్రీ అభివృద్ధికి 1934లో గృహలక్ష్మి పత్రిక స్వర్ణకంకణ ప్రదానము ప్రారంభించినది.

“దేశహితమునకై గృహిణుల అభిమాన పాత్రమై పాటుపడు గృహలక్ష్మి నామమును, నూటపదార్లు విలువయు, ఈ సన్మానమున కర్హత గల గ్రంథము యొక్క ప్రకటనయు నీ బహుమానమున ఉండును. గృహలక్ష్మిలో వ్రాయుటకు, ఈ బహుమతికి ఎట్టి సంబంధములేదు”అని సభవార్కి నివేదించబడినది.

ప్రప్రథమముగా 11-3-34 (మొల్ల జయంతి నాడు నెల్లూరులో ఇవ్వబడినది) కనుపర్తి వరలక్ష్మమ్మగారికి బహూకరించినారు. 1928 నుంచీ వారు రచనా వ్యాసంగంలో ఉన్నారు. శారదలేఖలు, సత్యా,ద్రౌపదీసంవాదము, నవభారతేతిహాసము (ఓటు భారతము) వంటి సామాజిక రాజకీయ ప్రగతిశీల రచనలు పద్యగేయరూపములో చేసినారు. బాపట్లకు చెందినవారు. శారద లేఖల్లో కల్పలత అనే ఒక కాల్పనిక పాత్రకు వ్రాసినట్టుగా నాటి పరిస్థితులన్నీ చర్చించేవారు. ఆనాటి మొట్టమొదటి సభకు తెలికచెర్ల వసుంధరగారు అగ్రాసనం అధిష్టించినారు.

కనుపర్తి వరలక్ష్మమ్మ గారు 1931లో స్త్రీ హితైషిణి మండలి స్థాపించి గ్రంథాలయము, కుట్టు, సంగీతము, హిందీ క్లాసులు నడిపేవారు. ప్రతి శనివారము భజనలు చేయించెడివారు. హిందీ అనిన వీరికి అభిమానము. ముతక ఖద్దరు చీర మాత్రమే ధరించెడివారు. పుట్టిన ఊరు, మెట్టినూరు బాపట్లనే.

బహుముఖ ప్రతిభ కలిగిన వీరు పద్య, గద్య, గేయ రచనలు గావించినారు. ద్రౌపదీ వస్త్రసంరక్షణము, సత్యాద్రౌపదీసంవాదము అను రెండు చిన్న ద్విపదకావ్యములు, ఓటుపురాణము అను చిన్న పద్య గ్రంథము కలవు. అపరాధిని, వసుమతి, వరదరాజేశ్వరి అను నవలలు , కన్యాశ్రమము (కన్యాశ్రమము, ఒట్టు, ప్రణయలేఖలు,పెన్షను)అను కథలసంపుటి, మా చెట్టునీడ ముచ్చటలు అనే శీర్షిక క్రింద ’లీలాదేవి ’ అను కలము పేరుతో మహిళా ప్రబోధకరమైన వ్యాసములను మదరాసు, నెల్లూరు, కర్నూలు, విశాఖపట్టణము, గుంటూరు జిల్లాలవారగు అయిదుగురు  విజయవాడలో కాపురముండి ఆ యింటి ఆవరణలోని నారింజచెట్టు క్రింద కూర్చుని తమతమ ప్రాంతీయయాసతో వివిధ విషయాలను చర్చించినట్లు వ్రాసినారు. దేశస్వాతంత్ర్యము, తెలుగునాడు సమైక్యత గురించి ఆ ముచ్చట్లు ఉండేవి.

శారదాలేఖలు మొత్తం ముప్ఫయొక్కటి రెండు (ఇరువది, పదకొండు) సంపుటాలుగా వెలువడింది.. ఇంకా ద్విపద కావ్యాల గురించి వివరమైన వ్యాఖ్యానం సమీక్ష కూడా ఉన్నాయి.

రామభక్తురాలైన వీరు ఆగస్టు 13 1982లో తమ ఎనభై రెండవయేట బాపట్లలో స్వర్గస్తులైనారు.

 

గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీతలలో రెండవవారు 1935 లో చిల్కపాటి సీతాంబ గారు. వీరు సింహపురి(నెల్లూరు) వాసులచే కవిరాణి బిరుదు పొందియుండిరి. సీతాంబగారిది నెల్లూరు జిల్లా లోని కలికివాయి గ్రామము. శ్రీమాన్ రాఘవాచార్యులు, మంగమ్మగార్లకి  1900 అక్టోబరు 18 న జన్మించినారు. తండ్రివైపు వారంతా సంస్కృతాంధ్ర పండితులు. తండ్రిగారి వద్ద, బావగారు విద్యారణ్య పంచానన శ్రీమాన్ విక్రాల రామచంద్రాచార్యుల వద్ద సంస్కృత వ్యాకరణ పరిజ్ఞానమును, కావ్యనాటక పరిచయమును అభ్యసించినారు. భర్తయైన చిలకపాటి వేంకట నరసింహాచార్యులవారు మంచి పండితులు. ఈ కవయిత్రి సహజ ప్రతిభా విశేషములను ఇంకను ప్రకాశింపజేసినారు.

ఈమెకు మంచి సంస్కృత పాండిత్యమున్నను ఆంధ్రకవితాస్వాదనమందు ఆసక్తి మెండు.

వీరిరచనలు:- పద్మినీ పరిణయకావ్యము, సముద్రమధనము(విష్ణుమాయావిలాసము)నాటకము, దిలీప నాటకము, అరవింద నవల , శూర్పణఖ (ఏకాంకిక), కాదాచిత్క పద్యరత్నములు (శ్రీ తల్పగిరి రంగనాయక స్తుతి, కృతజ్ఞతా పంచరత్నములు, యశోద పుత్రవాత్సల్యము, రాధాకృష్ణ విలాసము, దసరా, కష్టజీవి మరికొన్ని కలిపిన సంకలనం), సీతారామాయణమను శతకము (అముద్రితము, అలభ్యము).

ఈమె ఆశుకవిత్వము చెప్పగలదు. ఒకనాడీమె భర్తయు మరియొక పండితుడు హనుమన్నాటకములోని ఒక శ్లోకము  గురించి ప్రస్తావించుకొనుచుండగా తలుపుచాటుననుండి విని దానికి తెలుగుపద్యమును వ్రాసి వారికి పంపినది.

శ్లో. కమఠపృష్ఠ కఠోరమిదం ధనుః

మధురమూర్తి రసౌ రఘునందనః

కధమధిజ్య, మనేక విధీయతాం

అహహ శాతఫణః ఖలు దారుణః

సీతాంబ గారి అనువాదము

తేటగీతి : కమఠపృష్ఠ కఠోరమీ కార్ముకంబు

సరస సుకుమారుడీ రామచంద్రమూర్తి

ఎటులనెక్కిడ నేర్చునో యేమి యౌనొ

కటకటా యేమి శపథంబు కన్నతండ్రి.

(ఈ ఉదంతమువలన ఏమి తెలుస్తుందంటే ఆకాలంలో స్త్రీల ఆచారవ్యవహారములపై ఎన్ని ఆంక్షలున్నా, వారి విద్యావికాసముపైన ఆంక్షలు లేవని. కదండీ) అప్పుడప్పుడు పత్రికలకు పంపిన పద్యరత్నములను కలిపి కాదాచిత్క పద్యరత్నములు అను పేరున ముద్రించబడినాయి.

కేసరిగారి స్వర్ణకంకణం పొంది దానికే అలంకారముగా శోభిల్లిన కవయిత్రి కాంచనవల్లి కనకాంబ గారి కవిత్వమంతయు ఆధ్యాత్మిక చింతనాతత్త్వమును బోధించును.

పల్నాడు సీమలో దుర్శియను గ్రామము ఈమె జన్మస్థలము. విజయ సంవత్సర శ్రావణశుద్ధ అష్టమి 3-9-1893 న ఆదివారం నాడు జన్మించినది. తల్లిదండ్రులు రంగారావుగారు, రంగమ్మగారు. కనకాంబ గారు బాలవితంతువు. తండ్రియును మరణించగా, తల్లితో కలసి బంధువుల ఇంట అనేక ఇడుముల పడిరి. ఈమె ప్రతిభను గాంచి ప్రేమతో ఈమె పెదనాయనగారగు మంగు రామానుజము పంతులుగారు విద్యాబుద్ధులను గరపిరి. పందిరి వేయగనే తీగ అల్లుకున్నట్లు విద్యావకాశము కలుగగానే స్వయముగా కృషి చేసి యెన్నో పరీక్షల యందు ఉత్తీర్ణురాలై పేరు గాంచినది.

పదునెనిమిదేండ్ల వయసులో విజ్ఞాన చంద్రికా పరిషత్తు వారు నిర్వహించిన పోటీ పరీక్షలలో గెలుపొంది ఘనసన్మానమును పొందినారు.

ఈ కవయిత్రి జీవయాత్ర పద్యకావ్యము, ఆనందసారము, అమృతానందబోధ సారము పద్యగ్రంథములు, తోమాలియ ప్రాస్తావిక పద్యసంపుటి, హంసవిజయము(ఆధ్యాత్మికము) , అభిజ్ఞానశాకుంతలమునకు అనువాదము, రామాయణ కథాసంగ్రహము (సంస్కృతగద్యము) మొదలైన గ్రంథములు వ్రాసినారు. క్వీన్ మేరీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకురాలిగా వన్నెకెక్కినారు. మద్రాసులోని మాక్మిలను కంపెనీవారికి ఆంధ్ర గ్రంథములను వ్రాసి ఇచ్చినారు. ఉద్యోగవిరమణ పిదప విజయవాడకు వచ్చి తన గురుదేవుల ఆదేశానుసారము త్రిలింగ విద్యామహాపీఠము నెలకొల్పినది. అచట తెలుగు కవి, పండితులకు నూటపదహార్లిచ్చి మన్నన సేయుచుండిరి. 27-3-1936 నాడు తిక్కన జయంతి సందర్భముగా తిక్కవరపు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఐదు నూటపదహార్లు బహూకరించి సన్మానించిరి.  సంస్కృతాంధ్ర ఆంగ్లభాషావిశారద మహాకవి అభిజ్ఞానశాకుంతలమును రమ్యముగా రచనాసౌకుమార్యము తో ప్రతి శ్లోకమును సంభాషణలను అనువదించినదీ కవయిత్రి. అమృతసారము అద్వైత బోధనామృతమందించు కావ్యము అమృతమనగా జరామరణరహితమైనది బ్రహ్మము దానిని ప్రతిపాదించు బోధనలను కూర్చుటచే ఈ కావ్యమునకు ఈ పేరు గలిగినది. ఇందు ఐదువందల పద్యములు గలవు. ఎక్కువ కందపద్యము, ఆటవెలదులచే సాగినది.

స్వర్ణకంకణం పొందిన కవి కలహంసి చేబ్రోలు సరస్వతీదేవి గారు నీలగిరి నివాసులు. సంగీతసాహిత్యములందు వన్నెగాంచిన రామచరితమును కృతులుగా రచించిన వారని తండ్రిని గూర్చి పేర్కొనిన ఈమె సుప్రసిద్ధ న్యాయవాదులగు రాజగోపాలము నాయుడు గారి పుత్రిక. ఈమె సంస్కృతాంధ్ర, ఆంగ్ల, హిందీ భాషలను అభ్యసించినది. సంస్కృతమున ధారాళమైన సాహిత్య జ్ఞానమును పొందినది. జ్యోతిషాన్నీ అభ్యసించినది. ఈ కవయిత్రి సాహిత్య గురువు కందాడై కృష్ణమాచార్యులు. పంచకావ్యములను, నాటకాలంకారములను జ్ఞాన సముపార్జనా దృష్టితో బోధించారు. ఈనాటి వారివలె ప్రచారము కొరకు కాదు. ఈమె గ్రంథములు– సరస్వతీ రామాయణము, సరస్వతీ శతకము, సత్యనారాయణ వ్రతకల్పము, ఆత్మోపదేశము, పతివ్రతాశతకము, జటప్రోలు సంస్థాన కవివరేణ్యుడగు శ్రీ వాజిపేయ యాజుల రామసుబ్బారాయశాస్త్రిగారి శిష్యురాలు అధ్యక్షులుగానున్న స్నేహలతా సంఘమునకు ఉపాధ్యక్షులుగా నుండిరి. గృహలక్ష్మికి ఉప సంపాదకురాలిగా కూడనుండిరి. స్వర్ణకంకణంతో పాటు కవికలహంసి అన్న బిరుదునిచ్చి సత్కరించిరి.

వీరి సరస్వతీ రామాయణమును ప్రశంసించినవారిలో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం గార్లవంటి ప్రముఖులెందరో గలరు. ఈ గ్రంథము మద్రాసు విశ్వవిద్యాలయమున ఇంటర్మీడియట్ క్లాసుకు పఠనీయ గ్రంథముగా  నిర్ణయింపబడినది. ఉత్తరకాండ ద్వితీయ ముద్రణకు దివాకర్ల వేంకటావధాని తొలిపలుకు వ్రాసినారు. ఆమె రచన ధారాళమై, భావనిర్భరమై, ఔచిత్యశోభితమై, నిర్దుష్టమై, అత్యంత హృద్యముగానున్నదని, మొల్ల, వెంగమాంబ కవితలతో సాటిగానున్నదని వ్రాసినారు.

1942 నుండి 47 వరకూ రెండవ ప్రపంచయుద్ధ సందర్భంగా పత్రిక , బహుమతి ప్రదానము ఆగిపోయినది. మరల కొనసాగినది. 1954లో కేసరి గారి మరణముతో ఆ సంవత్సరము ప్రదానము జరుగలేదు. తరువాత వారి చిహ్నముగా నేటివరకూ కొనసాగుచున్నది.

1950 లో స్వర్ణకంకణం పొందిన రచయిత్రి గంటి కృష్ణవేణమ్మ గారు 20-12-1910 న అనంతపురం జిల్లా తాడిమర్రి లో శ్రీ కర్రా రామశర్మ , శ్రీమతి  సుబ్బలక్ష్మమ్మగార్లకు జన్మించినారు. భాషాభిమాని. వీరి ఆదేశముతో ఈ కవయిత్రి భర్త ఉద్యోగరీత్యా పోయిన చోటెల్ల ఆయా భాషలను పండితుల వద్ద నేర్చిరి. తెలుగుతోపాటు మహారాష్ట్రము, హిందీ, కన్నడ నేర్చిరి.  ఈమె గ్రంథములు– గిరిజాకళ్యాణము(బాల్యములో), సైరంధ్రి నిర్వేదము, స్థైర్యము, తెలుగుతల్లి, పవన ద్యూతము, రాజరాజేశ్వరీ శతకము, జ్ఞానప్రసూనాంబికా శతకము , కౌలుట్లాధిప చెన్నకేశవ శతకము (భర్త గారు వ్రాయుచు విడిచినది పూర్తి చేసినారు)

1951 లో స్వర్ణకంకణం పొందిన గిడుగు లక్ష్మీకాంతమ్మ గారు ఒకవైపు పదిమంది సంతానమునకు తల్లిగా, గృహిణిగా బాధ్యతలు ఓర్పుతో నిర్వహించుచూ మరొకవైపు భాషామతల్లికి సేవలందించిన సతీవతంసము. రాజమహేంద్రవరమున 1903 ఫిబ్రవరి మూడవ తేదీన జన్మించినారు. మాతామహ వంశము వారు కవిత్వాభిమానులు కావడంతో సద్విద్య లభించినది. గిడుగు రామమూర్తి పంతులుగారి అన్న కుమారుడైన గిడుగు వేంకట రామమూర్తి పంతులుగారు ఈ కవయిత్రి భర్త. వారూ మంచికవి, పండితుడు. భార్యకు, చెల్లికి కవిత్వాభ్యాసము చేయించినారు. ఈ కవయిత్రి భర్త వద్ద సంస్కృతం అభ్యసించిరి. వీరి గ్రంథములన్నియు యెక్కువగా శారదాంబ పేరు కూడా కలిపి లక్ష్మీశారదా గీతములు , లక్ష్మీశారదా శతకములు, లక్ష్మీశారదా సుభాషితములు , లక్ష్మీశారదా కుమారీనీతి అని కలవు. లేఖదూత, తిరుపతి వేంకటేశ్వర శతకము, రామచంద్రశతకము ,కన్నీరు అనునవి అముద్రితములు. భర్త ఉద్యోగరీత్యా బదిలీ చేయబడినపుడు ఒకరినొకరు ఎడబాసి ఐదునెలలు వియోగావస్థలో గడపవలసి వచ్చినది. ఈ సమయమున భార్యాభర్తలిరువురు వ్రాసికొన్న లేఖలు పద్యరూపములో ఉన్నవి. ఇరువురూ రచనాకౌశలము గలిగియుండుటచే ప్రతిపదమూ పద్యమైనది.

ప్రేయసీప్రియులు వేరు ప్రదేశములనుండి వియోగము అనుభవించుట విప్రలంభశృంగారముగా పరిగణింపబడినది. పూర్వమున మేఘము, హంస వంటి దూతలతో విరహంలో ఒకరికొకరు సందేశాలంపుకొనుట కావ్యములుగా రచింపబడిన విషయము విదితమే. వీరి నడుమ నడచిన లేఖలలో పరస్పర అనురాగ ప్రకటన, సంతానము యొక్క క్షేమవార్తలు తప్ప శృంగార భావప్రకటన లేదు. వీటిలో కొన్ని పద్యములనేరి లేఖదూత అను పేరున ప్రకటించిరి. ఇందు రెండుభాగములు కలవు. మొదటిభాగమున భార్యాభర్తల లేఖలు, రెండవభాగమున వియ్యపురాలు, తోడికోడలు గార్లతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరములు పద్యరూపముననున్నవి. 1934 సెప్టెంబరు నుండి 1935 జనవరి వరకూ సాగినవీ లేఖలు. భర్త మరణించిన పిదప కన్నీరు వ్రాసిరి. అది అముద్రితము.

మధుర కవయిత్రి స్థానాపతి రుక్మిణమ్మ గారు నిడుదవోలులో శ్రీకాకుళపు పురుషోత్తము గారు, గరుడమ్మ గార్లకు 1915లో జన్మించినారు. విశాఖపురి కన్యకా పరమేశ్వరి పవిత్ర పూజా ప్రాంగణమున నివాసమొనరించినట్టి శ్రీ స్థానాపతి సత్యనారాయణ గారి ధర్మపత్ని. బాల్యమునుండియే ఏకసంథాగ్రాహి కావడంతో తనతో పాటు గొల్లకలాపము, భామాకలాపము, తోలుబొమ్మలాటలు ఆడెడు మేనత్త పాపమ్మగారు ఆధ్యాత్మ రామాయణములోని కీర్తనలను గుమ్మడి పాటలను, గరుడాచల యక్షగానము నేర్పినారు. ఐదవతరగతితో చదువు మానిపించడంతో ఇంటి వద్ద సంస్కృతము అభ్యసించినది. రఘువంశము, కుమార సంభవము కొన్ని సర్గలు, మేఘసందేశములను ఆంధ్రప్రబంధములను పఠించినది.

పన్నెండవఏట వివాహమైన పిదప భర్త ప్రోత్సాహముతో 1928నుండి సాహిత్యసేవ యొనరించినారు. ఖండకావ్యములు–కాదంబిని, పూలమాల , పూర్వగానము;  నాటకములు –వత్సరాజు, చారుదత్తము, దూతఘటోత్కచము (భాసకవి నాటకానికి అనువాదము); కథానికలు–ఊర్మిళ, ప్రతిజ్ఞ, దయ్యాలు, ప్రార్థన, నీలాటిరేవు, యుక్తిమాల;  వచనపురాణములు–దేవీభాగవతము, గోలోకము; అముద్రితములు–సప్తశతి(పద్యసంకలనము), ఛాయ (నవల), లీల (కావ్యము) వ్యాసరచిత దేవీభాగవతానికి స్వేచ్ఛానువాదము చేసినారు.

1953 మార్చిలో గృహలక్ష్మీస్వర్ణకంకణం పొందిన కళాప్రపూర్ణ డా.ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు 1917 పింగళనామ సం. డిసెంబరులో ఏలూరులో నాళం కృష్ణారావు, సుశీలమ్మగార్లకు జన్మించినారు. వీధిబడి యందు విద్య నేర్చి, యువతీ సంస్కృత కళాశాలలో సంస్కృతాంధ్రాలను అభ్యసించినారు. ఆంగ్లము, హిందీ, నాట్యము, సంగీతము, చిత్రకళలూ నేర్చినారు.

’కృష్ణకుమారి ’పేరుతో పత్రికలలో ఎన్నో రచనలు గావించినారు.1930 లో ఊటుకూరి హయగ్రీవ గుప్త గారితో పదమూడవ ఏటనే వివాహమైన తదుపరి వారి ప్రోత్సాహము సంపూర్ణముగా లభించినది. పద్యరచనలు–మనసాహితి-మధుభారతి, మహిళావిక్రమ సూక్తము, లజ్జాకిరీట ధారిణి, ఒక్క చిన్న దివ్వె, సదుక్తి మంజరి, జాతిపిత, నా తెలుగు మాంచాల,  గద్య రచనలు—ఆంధ్ర కవయిత్రులు, అఖిలభారత కవయిత్రులు, ఆంధ్రుల సంగీత వాఙ్మయసేవ, గేయకావ్యములు–కాంతిశిఖరాలు, కన్యకమ్మ నివాళి, సంస్కృతరచనలు–, శ్రీకన్యకాపరమేశ్వరీ సుప్రభాతము, దేవీస్తవ తారావళి.

పొందిన బిరుదులు–ఉభయభాషాప్రవీణ, తెలుగుమొలక, విద్వత్కవయిత్రి,బ్రాహ్మీ భూషణ, సాహితీరుద్రమ, ధర్మప్రచారభారతి, ఆంధ్రసరస్వతి. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు ’కళాప్రపూర్ణ’ బిరుదిచ్చినారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, బాలల అకాడమీ, తెలుగు భాషాసమితి , విశ్వహిందూ పరిషత్తు, గోరంట్ల వెంకన్న ట్రస్టు, రాజమండ్రి గౌతమీగ్రంథాలయం, వేటపాలెం సారస్వతనికేతనం, మొదలైన ఎన్నో సంస్థలకు అధ్యక్షురాలుగానో సభ్యురాలుగానో ఉన్నారు. కబీరు తులసీదాసు వంటి వారి హిందీ దోహాలను తెలుగులోకి అనువదించినారు.

పొణకా కనకమ్మగారు 1955 లో మరణానంతరం బహుమతి పొందినవారు. వీరి సారస్వత, రాజకీయ ప్రస్థానములో వీరికి సహకరించినవారు ద్రోణంరాజు లక్ష్మీ బాయమ్మ గారు. 1892 లో నెల్లూరు జిల్లాలో వీరు మరుపూరు కొండారెడ్డి, రామమ్మ గార్లకు పుట్టినారు. భర్త పొణకా సుబ్బరామిరెడ్డి గారు గొప్ప శ్రీమంతులు. జమీన్ రైతు అను పత్రికను నడిపిరి. సత్యాగ్రహంలో భాగంగా 1930 లో కారాగారానికి వెళ్ళినారు. రచనలు–జ్ఞాననేత్రము, ఆరాధన,  నైవేద్యము-గీత, రమణగీత, శ్రీరమణ గురుస్తవము, ఆంధ్రస్త్రీలు, వీటిలో కొన్ని అముద్రితములు అలభ్యములు. వీరి రచనలు పేర్లను బట్టి ఆధ్యాత్మిక రచనలు చేసినారని తెలుస్తుంది.

1958 జులైలో గృహలక్ష్మీస్వర్ణకంకణం పొందిన దేశిరాజు భారతీదేవి గారు గృహిణిగా తనవారి మెప్పును, కవయిత్రి గా విజ్ఞుల గౌరవమును పొందిన భారతీదేవి బాపట్లలో ప్రసిద్ధ న్యాయవాదులు చంద్రమౌళి చిదంబరరావు గారి మనుమరాలు. (కూతురి కూతురు) వీరి తల్లి అన్నపూర్ణమ్మ గారు ఉన్నవ లక్ష్మీబాయమ్మగారితో కలిసి దేశసేవలో కూడా పాల్గొనిరి.

భారతీదేవి గారు పాఠశాల పరీక్షలు వ్రాయడం కుదరలేదు. తండ్రి వద్దనే భారత, భాగవతాది గ్రంథమ్లు పఠించి, విజ్ఞానము సంపాదించిరి. చిన్నతనముననే వ్యాసరచన చేసి బహుమతులు పొందిరి. పద్య గద్య రచనల ప్రవీణులు. ఆకాశవాణిలో ప్రసంగములు కాళిదాసు శకుంతల, ఉత్తరకాండ సీత, సూరన ప్రణీతమైన కళాపూర్ణోదయములోని సుగాత్రి పాత్రలపై విమర్శనము చేసిరి. పోటీగ్రంథ రచనలో పాల్గొని కవిత్రయ కవితారీతులు-తరువాతి కవులపై వారి ప్రభావము రచించి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారి చేతులమీదుగా 1956లో బహుమతి నందిరి. స్త్రీలకు నీతిసౌశీల్యములే ప్రధానములు. అవిలేని విద్య విద్య కాదు. హిందూ సుందరులకీ భావములు తప్పక అనుసరణీయములు.’ అని తన అభిప్రాయము తెలిపిరి.రచనలు.. కాంతా శతకము (కందపద్యములతో), ముక్తాంబ, సత్యాప్రతిజ్ఞ అను ఏకాంకికలు, శ్రీకృష్ణమహిమార్ణవము అను వచన గ్రంథము, ముద్దుకృష్ణ అను గీతపద్య శతకము.

1959 ఏప్రిల్ 26 న కేసరి గారి జన్మదిన సందర్భమున గృహలక్ష్మీ స్వర్ణకంకణం పొందిన కవిసింహి గుడిపూడి ఇందుమతీదేవి గారు కవిపండిత వంశమగు మతుకుమల్లి వారింటి ఆడపడచు. వీరి తాతగారు నరసింహ శాస్త్రిగారు ప్రసిద్ధ కవి, పండితసింహుడు. పదవయేటనుండే చిన్న పద్యములు, గేయములు రచించినది. తాతగారు ఇందుమతీ పరిణయమను కావ్యము రచించి వీరికి ఇందుమతి అని పేరిడగా తాతగారి అడుగుజాడలలో నడువవలెనని లక్షణా పరిణయము అను కావ్యము రచించి తమ పుత్రికకు లక్షణ అను నామముంచినారు.

ఇందుమతీదేవి గారు 1889 ఏప్రిల్ లో పాత గుంటూరు నరహర్యాక్ష రాయడు, అనంతలక్ష్మమ్మ గార్లకు జన్మించినారు. తల్లిదండ్రులను వారి వంశమును ఎంతగానో కీర్తించినదీ కవయిత్రి. 1901లో రామారావు గారితో వివాహము జరిగినది మొదలు భర్త గారు వీరి సాహిత్యాభిమానమునకు ఎడతెగని ప్రోత్సాహమునందించిరి.

రచనలు—అంబరీష విజయము, లక్షణా పరిణయము, తరుణీ శతకము, రాజేశ్వరీ శతకము, నీతి తారావళి, నరసింహ శతకము, లోకావలోకనము, సోదరి, గోవిలాపము, ఆంజనేయ స్తుతి, జన్మభూమి, నర్మద(నాటకము), రామాయణ గానసుధ(రామాయణమంతయూ కీర్తనలుగా), రామకధా మంజరి(వచన రామాయణ గ్రంథము), గాంధీ కీర్తనలు, మందారమాల  అన్నియు ప్రసిద్ధమైనవే. బహుళ గ్రంథకర్త్రి, పాండితీగరిమ గలిగినవక్త యైన వీరికి త్రిలింగపీఠమువారు, విశిష్టాద్వైతమత ప్రచార సంఘమువారు, సాంగ వేదకళాశాలవారు మొదలగు ప్రముఖులెందరో బిరుదులొసంగినారు. బిరుదులు –కవయిత్రీమణి, ఉభయభాషాప్రవీణ, సతీమణి, కవిసింహి, మధురకవయిత్రి, విద్వత్కవి శిరోమణి కవితాశారద మున్నగు బిరుదములన్ని యు తన ఇష్టదైవమైన భద్రాద్రి రామునకే అంకితమొనర్చినది. వసుచరిత్రను చదివిన పిదప తనకీ కావ్యము వ్రాయవలెనని తోచెనని చెప్పిన ఈమె లక్షణా పరిణయము ఆ కావ్యమును పోలియుండును. అంతకుమునుపే తిరుపతి వేంకటకవులు లక్షణాపరిణయము అను మూడాశ్వాసముల కావ్యమును ఆశువుగా(తాటికొండ రామారెడ్డి గారి కోరికపై) చెప్పినారు. భాగవతమున లేని శుకదౌత్యమును చేర్చినారు. ఇందుమతీదేవి గారు కూడా వీరిననుసరించి శుకదౌత్యమును చేర్చినారు. జంటకవుల కావ్యముకన్న నెక్కువగా వర్ణనలు ఈ కవయిత్రి చేసిరి. అంతియే కాక మద్రేశుడు కూతురు లక్షణను అత్తవారింటికి పంపినపుడు చక్కని నీతిబోధ కావించినట్లు వ్రాసిరి. ఇది ఈ కావ్యము యొక్క ప్రత్యేకత. ఈమె మరణానంతరము ఈమె రచించిన ఇతర గేయములు,ఖండకావ్యములు, వ్యాసములు అన్నియు కలిపి మందారమాల అను పేరిట ప్రచురించిన గ్రంథమునకు పీఠిక విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసినారు.

1979 లో స్వర్ణకంకణం పొందిన డా.నాయని కృష్ణకుమారి తెలుగువారికి సుపరిచితులైన నాయని సుబ్బారావు గారి పుత్రిక . తల్లి హనుమాయమ్మ గారు. జన్మస్థలం గుంటూరు. 14-3-1930 న జన్మించి, ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలుగుశాఖలో ఆచార్య పదవిని అలంకరించిన వీరు గుంటూరు ఎసి కాలేజ్ లో పట్టభద్రురాలై ఆంధ్రవిశ్వకళా పరిషత్తులో ఎంఎ ఆనర్స్ చేసినారు. తెలుగు జానపద గేయగాథలు అను సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి ఉస్మానియాలో పిహెచ్ డి పొందినారు. 1952 నుంచీ విద్యార్థులను తీర్చిదిద్దుతూ, పలు సాహిత్య పత్రికలలో రచనలు చేస్తున్నారు. తెలుగుజానపద సరస్వతి అను జానపద సాంస్కృతిక సంస్థను నిర్వహించుచూ జానపద సాహిత్య పరిషత్తుకు అధ్యక్షురాలిగా నున్నారు.ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ గౌరవ సభ్యురాలిగా నున్నారు. రచనలు—అగ్నిపుత్రి(ఖండకావ్యము),  ఆంధ్రుల కథ, ఆయా థా, పరిశీలన, పరిశోధన, కాశ్మీర దీపకళిక, తెలుగు జానపద గేయగాథలు(సిద్ధాంత వ్యాసము), ఆధునిక కవిత్వ శ్రేణికి చెందినది వీరి రచన. నిఘంటువుల నాశ్రయించి అర్థంకాని పదాలను వెదకుట ఆమెకిష్టం కాని పని.

శ్రీమతి గూడా సుమిత్రాదేవి గారు  తన పరిశోధనా గ్రంథంగా వ్రాసిన “గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీతలైన కవయిత్రులు వారి కావ్యాలు” అనే ఈ గ్రంథంలో వీరి గురించి చక్కటి పరిచయం ఇచ్చిఉన్నారు.  ఆయా కవయిత్రులు  వివిధ రీతుల సాహిత్యసృజన గావించినవారైనప్పటికీ ఈమె వారి కావ్యరచనలను మాత్రమే సమగ్రమైన సమీక్ష చేసి యున్నారు.  1988 లో ప్రచురింపబడిన ఈ పరిశోధనా గ్రంథములో సుమిత్రాదేవి గారు 12 గురి కావ్యరచనలను మాత్రము పరిశీలించి పరిచయము వ్యాఖ్యానము వ్రాసినారు. 1986 వరకూ మొత్తం 37 గురికి ఈ బహుమతి లభించినది. తర్వాతి వివరములు తెలియవు.

12 గురు

కనుపర్తి వరలక్ష్మమ్మ

చిల్కపాటి సీతాంబ

కాంచనవల్లి కనకాంబ

చేబ్రోలు సరస్వతీదేవి

గంటి కృష్ణవేణమ్మ

గిడుగు లక్ష్మీకాంతమ్మ

స్థానాపతి రుక్మిణమ్మ

డా ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ

పొణకా కనకమ్మ

దేశిరాజు భారతీదేవి

గుడిపూడి ఇందుమతీదేవి

డా నాయని కృష్ణకుమారి

పులవర్తి కమలావతీదేవి -1937

బాలాంత్రపు శేషమ్మ, రత్నాల కమలాబాయి 1938

వి. రాధామణోరి -1939 (చేబ్రోలు సరస్వతీ దేవి్తో కలిపి)

బత్తుల కామాక్షము -1941

ఉన్నవ లక్ష్మీబాయమ్మ–1948

బెంగుళూరు నాగరత్నమ్మ-1949

కొమ్మూరి పద్మావతీదేవి-1956

కె. రామలక్ష్మి-1957

కె. చంద్రమతీదేవి-1960

ఎ. కనకదుర్గా రామచంద్రన్ 1961

62, 63 లో బహుమతులియ్యబడలేదు

ఇల్లిందల సరస్వతీదేవి-1964

డా. తెన్నేటి హేమలత-1965

ద్వివేదుల విశాలాక్షీదేవి-1966

కోడూరి కౌసల్యాదేవి-1967

ముప్పాళ రంగనాయకమ్మ-1968

యద్దనపూడి సులోచనారాణి-1969

ఐవిఎస్. అచ్యుతవల్లి -1970

డి.కామేశ్వరి-1971

డా.సి.ఆనందారామం-1972

1973 (పుస్తకంలో ఈ వివరం లేదు)

కోడూరి లీలావతీదేవి-1974

ద్వారక పార్థసారథి-1975

వాసిరెడ్డి సీతాదేవి-1976

గుళ్ళపల్లి సుందరమ్మ-1977

మాదిరెడ్డి సులోచన 1978

80,81 లో ఇయ్యబడలేదు

తురగా జానకీరాణి -1982

83లో ఇయ్యబడలేదు

అవసరాల (వింజమూరి) అనసూయాదేవి-1984

జె వరలక్ష్మి-1986

*     *     *    *   *   *   *   *    *

 

 

2 thoughts on “గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీతలైన కవయిత్రులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *