April 20, 2024

తెలుగులో ఇంగ్లీషు నుండి ఇంగ్లీషులో తెలుగు దాకా

రచన —– పొత్తూరి విజయలక్ష్మి

నా చిన్నతనంలో అంతా తెలుగే మాట్లాడేవాళ్ళు. చదువుకున్న వాళ్ళు కూడా తెలుగే మాట్లాడేవాళ్ళు .. అప్పట్లో ఇంగ్లీషు భాష అంటే అందరికీ చాలా భయం. బాబోయ్ ఇంగిళీశే అని దూరంగానే వుండేవాళ్ళు. ఇంగ్లీషు భాషంటేనే కాదు ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళన్నా బోలెడంత భయం, భక్తీ . అమ్మో వాడికి ఇంగిలీషు వచ్చు అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు .
మాటల్లో ఒకటి రెండు ఇంగ్లీషు పదాలు దొర్లేలా మాట్లాడటం ఓ ఫ్యాషను అప్పట్లో .
ఆ ఊళ్లో శుద్ధ సాల్ట్ వాటరు . పప్పు వుడకదు .
సూర్యనారాయణ పెళ్లికొద్దామనుకున్నాడు కానీ వాడికి టెంపరేచరు వచ్చింది .
భట్టిప్రోలువాళ్ళు పిల్లకి ఈ యేడు పెళ్లి చేద్దామనుకున్నారు . కానీ పంటలు పోయాయి. ఇంకేం చేస్తారు చేతులు ఎంప్టీ.
అట్లా మాట్లాడేవాళ్ళు . కొన్ని పదాలు రెండు భాషలూ కలిసి జంట స్వరాల్లా వుండేవి . ఉదాహరణకి కిరసనాయిలు నూనె , పేపరు కాయితం, గేటు వాకిలి, సైడు పక్కవంటివి..
అంతగా చదువుకొని వాళ్ళు, వయసు మీద పడిన బామ్మలూ, ఇంగ్లీషు పదాలు కలిపి మాట్లాడాలని తెగ సరదా పడిపోయినవాళ్ళు . మా అమ్మమ్మకీ వుండేది ఆ సరదా .. రావి చెట్టు పంతులుగారి కొడుకు కొరడా వెళ్ళాడుట అనేది . కెనడాకి వచ్చిన తిప్పలు అది . మన్నవ సీతారావుడి అల్లుడు రోకలి బండ ఆఫీసులో వుద్యోగం చేస్తున్నాడుట అనేది. అంటే లోకల్ ఫండ్ ఆఫీసు . మద్యాన్నం వెలకటరికలు వాల్లోచ్చారు అంటే ఎలక్ట్రికల్ వాళ్ళని అర్ధం . ఇంజనీరుని ఇంజరు అనేది . లౌడ్ స్పీకరుని రౌడీ స్పీకరు అనేది .
ఆవిడంటే చదువురాని మనిషి మహా మహా వాళ్ళే అవక తవక ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు .
వాడు చాలా ఒబీడిఎన్టెన్టెన్ట్టెంటు . మనకు ఇండిపెండెన్డెడెన్డేన్సు రావటం చాలా గొప్ప విషయం
అని మాట్లాడే వారు మా పెద్ద తాతయ్య గారు .
తరువాత కాలం మారిపోయింది ఇంగ్లీష్ భాష ఎడాపెడా విస్తరించింది . క్రమంగా చెరువునిండా పాకిపోయిన గుర్రపుడెక్క తీగలాగా పాకి తెలుగు భాషని మింగేసింది
ప్రస్తుతం తెలుగు మాట్లాడ్డం అంటే ఓ పెద్ద ప్రహసనం. స్వచ్చమైన తెలుగు మాట్లాడే వాళ్ళకోసం వెతికి వేసారి పొవలసిన స్థితి వచ్చింది . పట్టుమని పదిమాటలు తెలుగులో మాట్లాడేవాళ్ళు చాలా అరుదుగా వున్నారు. మామూలు వాళ్ళు మాట్లాడే మాటల్లో పదిశాతం కూడా తెలుగు భాష కనిపించదు. .
నేను సిటీ లోకి ఎంటర్ అవగానే నిన్ను కాల్చేస్తాను.
మేము నెక్స్ట్ వీక్ అవుట్ అఫ్ స్టేషన్ .
సండే మా ఇంటికి ఫ్రెండ్స్ లంచ్ కి వస్తున్నారు. మేము బిజీ .
నేను చాలా హ్యాపీ గా ఫీలవుతున్నాను.
ఇదీ నడుస్తున్న భాష
నమస్కారం , వెళ్ళొస్తాం అనే మాటలు పోయాయి. హాయ్ బాయ్ మిగిలాయి .
అమ్మ నాన్న బదులు మమ్మీ డాడి . బాబాయి, పెద్దనాన్న, మామయ్యా అన్ని వరసలూ పోయి అందరికీ కలిపి అంకుల్ అని ఒకటే పదం . అలాగే పిన్ని, అత్తయ్య, బావ, వదిన అని వరస పెట్టి పిలవటానికి వోపిక లేక ఆంటీ కజిన్ అనేస్తున్నారు.
పలకరింపులు పరామర్శలు అన్నీ ఇంగ్లీషులోనే.ఆనందానికీ , ఆవేదనకూ ఇంగ్లీషు భాషే ఆధారం.
విందు భోజనానికి వెళ్తే అక్కడ వైట్ రైస్, మాంగో దాల్ , దొండ ఫ్రై , కర్డ్ కనిపిస్తాయి .
బతుకు తెరువు కోసం , పరాయి నేర్చుకోవటం మాట్లాడటం తప్పో కాదు నేరమూ కాదు. కాకపొతే తినే అన్నాన్ని కూడా పరాయి భాషలో పలికే స్తితి కి దిగజారిపోయామే అని మనసు చివుక్కు మంటుంది
ఈ వలయం నుండి బయటపడి కమ్మగా తెలుగులో మాట్లాడుకుని ఆనందించే రోజులు మళ్ళీ వస్తే యెంత బాగుంటుంది.
భాష సంకరం అయిపోతోంది అనే ఆవేదన . భాషను కాపాడుకోవాలనే ఆరాటం అందరు తెలుగువారికీ వుంది అనే విషయం నిర్వివాదాంశం. కానీ ఏం చెయ్యాలో తెలియని అయోమయం .
మా అమ్మమ్మ ఒక సామెత చెప్పేది . వెనకటికి ఓ ఇల్లాలు మినపసున్ని చెయ్యడానికి మా ఇంట్లో మూడు వస్తువులు వున్నాయి, మూడు వస్తువులు లేవు అనేదిట అవి ఏమిటీ అంటే.. వున్నవి మంగలం , వేపుడు కట్టె, పొయ్యీ ! .లేనివి మినుములూ, బెల్లం , నెయ్యీ . అనేదిట.
అలాగే మనకూ వున్నవి ఆవేశం, ఆక్రోశం, ఆలోచనలు . లేనివి చిత్తశుద్ధి, క్రమశిక్షణ, ఆచరణ .
అందరం పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ వుండదు కదా..
ఆ దిశగా కృషి చేద్దాం . .
ఈ ఉగాది పండగకి పిండివంటలు వొండుకున్నాం . కొత్త బట్టలు కొనుక్కున్నాం మా ఇంటికి చుట్టాలు వచ్చారు . అందరం కలిసి ఆనందంగా పండగ చేసుకున్నాం అని మన భాషలో మాట్లాడుకుందాం

3 thoughts on “తెలుగులో ఇంగ్లీషు నుండి ఇంగ్లీషులో తెలుగు దాకా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *